Thursday, October 28, 2021

95. మా బడి సజీవం

 మా బడి సజీవం




ఒకప్పుడు ఆ దారి లో వస్తూ, పోతూ ఉంటే తెలియని సంతోషం, ధైర్యం ఉండేవి , ఎందుకంటే ఆ దారి లోని మా బడి ఎన్నో బాల్య జ్ఞాపకాలను ఇస్తూ ఉండేది. కాని నేడు…. మా బడి ఇక కనిపించదు అంటుంటే….

• లేదు లేదు ఇకలేదు ….మా జీవన జాగృతి కి చిహ్నమైన …మా బడి ఇక లేదు.

• లేదు లేదు ఇకలేదు….మా జన్మ జ్ఞాన జీవనానికి మూలాధారమైన….. మా బడి ఇక లేదు.

• లేదు లేదు మా జీవనధార కి రహదారైన ఆనవాలు…..మా బడి ఇక లేదు.

• లేకపోతే నేమి…..లేకపోతే ఏమి….

• బడి…ఓ బడి…నీ స్థానం ప్రస్థానం….నీ చరితం సుచరితం….నీ నామం దేదీప్యమానం……నీ వైభోగం వైకుంఠం…..నీ కథ కైలాసం….

• నీ ఒడి లో పెరిగిన మాకు…..నీ దడి లో నడిచిన మాకు….. నీ వడి తో నడవడి నేర్పిన మాకు …. జడి లేని, తడి లేని జీవన నాడి వైన….. మా బడి నీకు ప్రణామం.

• బడి , ఓ బడి….ఏమని చెప్పాలి…ఏమని అనాలి…నీ రూపం నిర్మలం, నీ మనసు మందిరం, నీ శిక్షణ సుందరం, నీ ప్రేమం పరమం, నీ దీవెన దివ్యం…

• విలువల వలువలతో బహుముఖ ప్రజ్ఞాశాలురైన గురు వైడుర్యాల నిధి మా బడి.

• బడి…ఓ బడి….నీ ఆదర్శాలు ఆచరించిన ఎందరికో ఆలంబనవై, ఎందరో ఆకారాలకు సాకారమై, అందరి వికారాలను రూపుమాపి , ఆకృతి నిచ్చిన స్వర్గధామ మైన నీకు పాదాభివందనం.

• సంతోషానికి సన్నిధివి…. జ్ఞానానికి పెన్నిధివి….స్నేహలకు స్వర్ణ దుందుభివి.

• బడి…ఓ బడి…..నీ చెంత చేరిన ఎన్నో, గడ్డిపరకలకు గలగలలు నేర్పి……. ఎన్నో రాళ్లను రమణీయం చేసి….. మరెన్నో కందిరీగలను సీతాకోకచిలుక లుగా చేసి……ఎన్నో కంచు పాత్రలను కనకముగా మార్చి……తల్లడిల్లే తల్లి వయ్యావు. నీ అక్కున చేరిన మేము ధన్యజీవులం.

• బడి…ఓ బడి….తల్లి తండ్రుల తో సరాసరి మా బాధ్యత మోసిన బంగారానివి…….తల్లి తండ్రులను మరచిన వారి జన్మ నికృష్టం…..నిన్ను మరచిన వారి జీవనం అస్పష్టం.

• బడి…ఓ బడి….. మనిషి కి మనిషి కి మధ్యలోని తెర అహంకారమైతే……. మనసు కి మనిషి కి మధ్యలోని తెర ఆత్మయే కదా…..ఇది నీవు చెప్పిన మాట యే కాదా…...నేటి రోజున నీ నుండి వచ్చిన మా ప్రతి ఒక్కరి అంతరాత్మలకు తెలుసు, ప్రస్తుత మా నడవడిక, మా మానసిక స్థితి సుగమనమా , అథోఃగమనమా లేక తిరోగమనమా…...అదియే ప్రస్తుత మా జీవన శైలి.

యడ్ల శ్రీనివాసరావు 27 Oct 10:00 pm 8985786810

జాగృతి = మెలకువ

దడి = చుట్టూ రక్షణగా అల్లుకున్నది

వడి = కాలంతో

జడి = దుఃఖం

తడి = చెమ్మ

ప్రస్థానం = విజయానికి మూలమైన ప్రదేశం, యాత్ర

ఆలంబన= పట్టుగొమ్మ

స్వర్ణ దుందుభి = విశేషమైన బంగారు వాయిద్యం


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...