Wednesday, December 24, 2025

712 . ఏది ధర్మం ?

 

 ఏది ధర్మం ?


• ధర్మం అనే మాట ఈ ప్రపంచంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది . అసలు ధర్మం అంటే మనిషి తన సహేతుకత తో ఆచరించవలసిన విధానం అని అర్థం . ఈ ధర్మం అనేది వృత్తి ప్రవృత్తి ని బట్టి మారుతూ ఉంటుంది .

• పరమాత్ముడు చెప్పిన ధర్మం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చక్కగా వివరించాడు . మరియు ఈ భూమి పై “ధర్మ గ్లాని” జరిగినపుడు అంటే భూమి పై ధర్మం పూర్తిగా నశించినపుడు , అనగా మనిషి తాను ఆచరించివలసిన  విధానం తప్పినపుడు , అధర్మం విచ్చలవిడిగా పెచ్చురిల్లినపుడు  తాను తప్పకుండా ఈ భూమి పై ధర్మ స్థాపన కి అవతరిస్తానని  భగవంతుడు చెప్పాడు.


• ధర్మం గురించి కురుక్షేత్ర సంగ్రామం లో ఒక అద్భుతమైన సంఘటన కర్ణుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగింది. కురుక్షేత్ర యుద్ధం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో, కర్ణుడి రధ చక్రం ఊడి పక్కకు ఒరగగా అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు.

  “హే కృష్ణా! …. నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు అర్జునుడిని విల్లు సంధించడం ఆపమని చెప్పు “ అంటాడు.

  అది వినిన శ్రీకృష్ణుడు , తాను భగవంతుని ధర్మ ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా , అది విని మౌనం గా ఉంటాడు .

  ఇంతలో అర్జునుడు వైపు నుంచి బాణాలు మరింత వేగంగా కర్ణుడి మీద కు వస్తూ ఉంటాయి.

• మరలా రెండవ సారి కర్ణుడు శ్రీకృష్ణుడితో … హే కృష్ణా! ఇది నీకు ధర్మమా …. ఇది యుద్ధనీతి కాదు . దయచేసి అర్జునుడి తో చెప్పు, నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు యుద్ధం ఆపమని. అని తీవ్ర స్వరం తో వేడు కుంటాడు.

  అయినప్పటికీ శ్రీకృష్ణుడు కర్ణుడిని చూస్తూ చిరునవ్వు తో మౌనం గా ఉంటాడు.

  అప్పుడు కర్ణుడు . . . శ్రీకృష్ణుడిని ఉద్ధేశించి ఉద్వేగం తో ఇలా అంటాడు. నువ్వు ధర్మాత్ముడి వేనా, పాండవుల పక్షపాతి . . . యుద్ధ ధర్మం ఆచరించమని చెప్పవలసిన నువ్వు మౌనం గా ఉండడం నీకు సబబు కాదు అని అంటాడు.

‌  అప్పుడు శ్రీకృష్ణుడు …. తన నోరు విప్పి కర్ణుడి తో ఇలా అంటాడు.

• అహో! కర్ణా … బాగుంది, చాలా బాగుంది . నేడు నీవు ఆపద లో ఉన్నావు  కాబట్టి , నీ వరకూ వచ్చే సరికి ధర్మం, నీతి, న్యాయం గురించి మాట్లాడుతున్నావు.

• నాడు నిండు కౌరవ సభలో , ధుర్యోధనుడు ద్రౌపదిని వివస్త్ర చేసినప్పుడు , ద్రౌపది రక్షించండి . . . రక్షించండి . . . అని నిండు సభ లోని వారిని వేసుకున్నప్పుడు , నీ ధర్మం ఏమైంది. ఆనాడు సభలో జరుగుతున్నది అధర్మం అని తెలిసినా కూడా యోధుడి వైన నీవు మౌనం గా ఉన్నావు. కనీసం ధుర్యోధనుడిని  ఆపే కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు. అధర్మం నీ ఎదురుగా జరుగుతున్నపుడు , నాడు నీవు చేయనిది, నేడు నీవు నన్ను ధర్మం గురించి ప్రశ్నించుచున్నావు. ఇది నీకు ధర్మమే నా అని తిరిగి శ్రీకృష్ణుడు అంటాడు.

• కర్మ ఫలం అనుభవించు . . . నీవు ఏది చేశావో అదే నీకు నేడు తిరిగి వస్తుంది. నేను ధర్మ మార్గం చూపగలను , చెప్పగలను అంతవరకే  నా విధి . బుద్ధి వివేకం తో ధర్మాన్ని ఆచరించవలసింది నీవు అంటాడు .

  ధర్మో రక్షతి రక్షితః . . . ధర్మాన్ని ఆచరించడమే కాదు, రక్షించిన నాడు అది తిరిగి కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు కర్ణుడి తో చెపుతాడు.

• అది వినిన కర్ణుడు పశ్చాత్తాపం చెందుతాడు.


  🌹🌹🌹🌹🌹🌹



• ఇకపోతే …. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అని కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయాలలో ముఖ్యం గా తిరుమలలో మనం చూస్తాం, చదువుతాం. కానీ ఈ ధర్మం అనే విషయం గురించి ఎంత వరకు మనసు లో చింతన చేస్తాం ?, ధర్మాన్ని మనం ఎంత వరకు ఎలా ఆచరిస్తూ ఉంటాం  ?  అనేది మనమే సద్విమర్శ చేసుకోగలగాలి . ఎదుటి వారు ఆచరించ వలసిన ధర్మాలు చక్కగా చెపుతాం. కానీ మనం ఆచరించ వలసిన ధర్మం వరకు వచ్చేసరికి  అహం లో మునిగి ఉంటాం . ఇది నేటి మానవ నైజం .

  ఇక్కడ గమనించ వలసిన అంశం

• వేం = పాపాలు

• కట = హరించే

• ఈశ్వరుడు = శివుడు , పరమాత్ముడు.

• వేంకటేశ్వరుడు అనగా కలియుగం లో పాపాలను హరించే శివుడు అని అర్థం.


• భగవంతుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన మనకు భగవంతుడే చెపుతున్నాడు , నీ ధర్మం ఏమిటో తెలుసుకొని ఆచరించమని .

• ధర్మాన్ని ఆచరించడం అనేది దైవ దర్శనం కంటే మహోన్నతమైనది . దైవ దర్శనం వలన పొందేది అల్ప కాలిక సంతోషం. భగవంతుడు ని ఆనందం గా భక్తి పారవశ్యంతో  దర్శిస్తాం , కానీ భగవంతుడు చెప్పిన విధానాలను మన లోని  మాయా బలహీనతల వలన ఆచరించ లేక పోతూ ఉంటాం.

• స్వయం భగవంతుడు చెప్పిన విధంగా ధర్మం ఆచరించరించ  గలిగిన నాడు , అది భగవంతుడి జత తో కలిసి అడుగులు వేస్తున్న ప్రయాణం గా మన జీవితం అవుతుంది .

• నేటి మనిషి జీవనం లో పాటించ వలసిన ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మం, గృహస్థ ధర్మం వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వృత్తి ధర్మాన్ని నిజాయితీ తో ఆచరించగలడం అనేది మనిషి జీవన పురోగతి కి అత్యంత అవసరం. నేటి కలుషిత ప్రపంచంలో కార్యాలయాలలో అవినీతి, లంచగొండితనం, వ్యాపారాలలో మోసం చేయడం అతి సహజం , సర్వ సాధారణం . దీనిని అరికట్టడం స్వయం పరివర్తన తో నే మనిషి కి సాధ్యం.

• రెండవది గృహస్త ధర్మం  . నేటి కలియుగంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మనిషి యొక్క కర్మలు, బుణానుబంధాలు అధిక శాతం ముడిపడి ఉన్నది గృహస్థం ధర్మం లోనే .  ధర్మం తెలుసుకొని ఇవి ఆచరించిన నాడు మానవ జన్మ కు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది. నేటి కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లి తండ్రులు ఒకరి పట్ల మరొకరు వ్యవహారించ వలసిన విధానం, . . .  కుటుంబ స్థితి గతులు  మనుషుల మానసిక  పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్య భర్తలు ఒకరి పట్ల మరొకరు అనుసరించ వలసిన విధానం ,  ధర్మ యుక్తం గా బాధ్యత నెరిగి  ఆచరించ వలసిన అవసరం నేటి కాలంలో ఎంతైనా ఉంది.

• ఎందుకంటే …. నేటి కలికాలం పూర్తి మాయా ప్రపంచం. మనిషి కి ఏది మంచో ఏది చెడో కూడా సూక్ష్మంగా తెలుసుకో  లేని స్థితిలో మాయ కమ్మేసి జీవనం సాగిస్తున్నాడు మనిషి . అందుకు నిదర్శనం ….. ఈర్ష్య ద్వేషాలు , పగ ప్రతీకారాలు , కామ క్రోధాలు , అహంకారం,  స్వార్దం ,  నాకే సర్వస్వం తెలుసు - నేను నాది  అనే మాయ ,  ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియని మానవ సంబంధాలు (లివింగ్ రిలేషన్ షిప్స్) ,  అవసరాలకు మించిన ధనం కోసం  దుర అలవాట్ల కు బానిస కావడం. 

ఇలాంటివన్నీ    కలిసి మనిషి జీవన విధానాన్ని అంధకారంలోకి తోసి , విచ్చలవిడి తనం , స్వేచ్ఛ అనే పేరుతో మానవ జన్మ పూర్తిగా వినాశనానం వైపు  అడుగులు వేస్తోంది. 

వీటన్నిటికి అతీతంగా కావాలంటే  , ఆది సనాతన దేవి దేవతా ధర్మం గురించి  బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సెంటర్స్ లో ఉచితం గా  నేర్పించే  సహజ రాజయోగ శిక్షణ ద్వారా తెలుసుకొని , మలచుకొని, పరిశీలించి పరివర్తన చేసుకోవడం ద్వారా  ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది. 


మన మూలాల లోనే మన రహస్యాలు స్పష్టం గా పొందు పరిచబడి ఉన్నాయి.  అవి తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడమే మన అజ్ఞానానికి దుఃఖానికి కారణం.


  ధర్మో రక్షతి రక్షితః



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2025 10:00 PM.


No comments:

Post a Comment

712 . ఏది ధర్మం ?

   ఏది ధర్మం ? • ధర్మం అనే మాట ఈ ప్రపంచంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది . అసలు ధర్మం అంటే మనిషి తన సహేతుకత తో ఆచరించవలసిన విధానం అని అర్థ...