Friday, July 10, 2020

16. మా బడి....అది మా బడి

మా బడి…అది మా బడి  
(సెయింట్  థెరిస్సా ఆర్.సి.యం.హైస్కూల్, పెద బొడ్డేపల్లి, నర్సీపట్నం,  విశాఖ జిల్లా)
మా బడి నినాదం  : 
DUTY  &  DISCIPLINE.
ENTER TO LEARN …LEARN TO SERVE.


మా బడి చిహ్నం(సుమారు గా ఇలా నే ఉండేది)

మా బడి.. అది మా బడి... బడిలో అడుగెడుతునే ఆవిరయ్యే మా  మదిలో  అలజడి.

ఊయల ఊగే యూకలిప్టస్ చెట్లు ...అందలమెక్కిన అశోక చెట్ల తో స్వాగతం..సుస్వాగతం.


రాచమార్గాన ఎర్రమన్ను రహదారి ... దారికి అటుఇటు తెల్లని గోడి ఇటుకలతో  గమకము(వరుస) విందము …. ముఖారవిందము.

ఆవరణలో   పచ్చగడ్డిలో ఏపుగా దాగిన పల్లేరు కాయలు ...లేత పాదాలకు నొప్పులు...తీయని మెత్తని నొప్పులు.


వైపుల్యమైన(ఘనమైన) వేదికకు(స్టేజ్) తోరణముల వలే అటుఇటు దేవదూతల అంజలిలు...నమఃస్సుమాంజలిలు.

మా బడి… అది మా బడి…మా జీవన నాడికి నడక నేర్పి నా బడి.


తెల్ల చొక్కాలు, ఖాకీ నిక్కర్లు... తెల్ల జాకెట్లు, నీలం లంగాలే  మా భరణాలు ..... ఆభరణాలు.


తలకి తైలం, ముఖానికి పౌడరు, చేతిలో సంచి, కాలికి రబ్బరు చెప్పులే మా బింబాలు...... నిలువెత్తు ప్రతిబింబాలు.


లేవు లేవు మాకు చేతి రుమాళ్లు..‌‌.. చెమట ను చెరిపే చేతులే మాకు ఆయుధాలు.   జీవులం .....చిరు శ్రమ జీవులం.


చిన్న విరామం లో చిరుతిళ్ళు ఆరాటం...గేటు బయట  ఈగల్లా , ఐస్ సాంబను చుట్టూ చేరి... తెల్లని చల్లని కమ్మని కొబ్బరి సేమియా పాల ఐస్  లోట్టలతో చీకుతుంటే ,  కనురెప్పలు భారంగా మూసుకుంటే ఆహ మథురం..... ఎంత మధురం.


అప్పుడప్పుడు మా బడి  సందర్శనకు విచ్చేసిన విదేశీయులను( church visiting foreigners) వింతగా చూసి ముసిముసి నవ్వులతో, గుసగుసలతో ఆశ్చర్యాలు... సంభ్రమాశ్చర్యాలు.

మధ్యాహ్న విరామం లో పాండవుల మెట్ట పై జారుడు ఆటలు,  ఎండవేడికి సుర్రుసుర్రులు.   రిక్షాలు రాకపోతే చెరువు గట్టు పై అడ్డదారిలో, పిచ్చిమొక్కల నడుమ ఒకరి వెనుక ఒకరి పిచ్చాపాటీ తో పయనం.  ఆనందం.. మాకు మహదానందం .

కార్యాలయం( ఆఫీస్) ముందు అందమైన నందనాన(ఉద్యానవనం) చిరుమందహసంతో మూర్తీభవించిన ప్రేమమూర్తి మేరిమాతకు వందనాలు...మా పాదాభివందనాలు.

తనదైన విగ్రహంతో రక్షకుడిగా..... నిగ్రహంతో పరిరక్షకుడిగా.... అనుగ్రహంతో సంరక్షకుడివై…….మా అందరి అయ్య వయ్యావు  దైవస్వరూప శ్రీ ఇన్నయ్య ..మా అయ్యా(తండ్రి)....వందనాలు….. మా శిరశాభివందనాలు.


భయమో,  భక్తో,   ప్రేమో ఎన్నో  పసి మనసులు చేతులెత్తి మ్రొక్కిన నీవు,...... మా బడికి,  మాకు మథ్య  పరమాత్మ ప్రతినిధివి కాక ......ఇంకేమీ అనగలం  తండ్రి మా తండ్రి శ్రీ ఇన్నయ్య తండ్రి... వందనాలు.... మీకు ప్రేమాభివందనాలు.

మా బడి రాజరిక భవనాలే  మా బలమైన బంధాలు....నేడు మా బడి కి వృద్ధాప్యం  రావచ్చు.... నాడు యవ్వనంలో  మా బడికి సాటి  ఏది…….సరిసాటి  ఏది?..... గర్వం.... ఇది మా ఆనంద గర్వం.


వీరోచితమైన జ్ఞాన గురువులే మాబడి సామ్రాజ్యానికి దశా దిశా నిర్దేశించిన యోధులు…..…మా గురువులు నిరంతర జ్ఞాన శ్రామికులు….. మా జీవిత గమనానికి మార్గదర్శకులు... వారికి వందనాలు....మా ఆత్మాభివందనాలు.


జాతి కుల మత స్థాయి వర్గ వర్ణాలు కానరాని  హరివిల్లే మా బడి.



తరగతి గదిలోని గుంజీలు , గోడ కుర్చీలు,  మోకాళ్లు,  చింతరివ్వ ముద్దులు  మా వ్యక్తిత్వాన్ని , సమస్యకు ఎదురీదే తత్వాన్ని ,  ఆత్మస్థైర్యాన్ని బలపరిచాయే గాని ......బలహీన పరచలేదు నేటితరం బడి లాగా ...అది మా బడి గొప్పతనం.



మేడ  మీద చివరి గదిలో సైన్స్ ప్రయోగశాలలో........ కిటికీ నుండి భయంభయంగా నక్కినక్కి వీక్షించే , వ్రేలాడే తెల్లని అస్తిపంజరం .....వింతవింత గాజు సీసాలు,  రంగురంగుల రసాయనాలు......ఆ చిన్న వయసులో మా లోని  కొత్త వింత అనుభూతుల్ని , అనుభవాలని పరిచయం చేసి చర్చించుకునే లా చేసింది బడి.... మా బడి. 


శిక్షణ   క్రమశిక్షణ,  రక్షణ   పరిరక్షణ,  వర్తన   పరివర్తన,   వర్తమాన  ప్రవర్తనకు దర్శనం.... నిదర్శనం… మా బడి.


లేడి పిల్లలు, జింక పిల్లలు, సీమ పందులు, గిన్నె కోళ్ళు, కొండ ఉడుతలు, తెల్లని నల్లని పావురాలు, పచ్చని చెట్లు, కోయిల కిలకిలలు,  వడ్రంగి పిట్ట అరుపులు , థాన్యాగారం, వానకు తడిసిన మట్టి వాసన , గడ్డి పైన మంచు , చల్లగా వీచే గాలి,  నల్లటి మబ్బులు , తరగతి గదిలో అరుపులు మా బడి జ్ఞాపకాలు….మా శక్తికి దోహదాలు.


బడి లోని కరుణామయుడు అక్కున చేర్చుకుని జ్ఞానదాతై వందల వేల మందికి వెలుగునిచ్చాడు. ఏది మరువగలం.... ఎలా మరువగలం…. ఎందుకు మరువగలం .....మాబడి తో పాటు  మా శరీరం ఇంకా ఉంది కదా.



పరిపక్వత లేని, తేటతెల్లని,  మరక లేని మనసులతో నాటి బాల్యమెంత స్వచ్ఛత .... అందుకేనేమో ఈ ఆనందం ..... పరిపూర్ణానందం.

గురువే దైవం..... గురువే జ్ఞానం.....గురువే మార్గం.....అన్న మాబడి గురువు లే  మాకు నాటికి నేటికి ఎప్పటికీ ఆదర్శం.


ప్రధానోపాధ్యాయులు : గౌ.శ్రీ.ఇన్నయ్య ఫాదర్ గారు, గౌ.శ్రీ.జోజిబాబు ఫాదర్ గారు.

కీ.శే. గౌ. శ్రీ బుచ్చి మాస్టారు , (ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ) మరియు గౌ. శ్రీ గాబ్రియల్ మాస్టారు( ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు)


ఉపాధ్యాయులు:  కీ.శే. శ్రీ రమణ మూర్తి గారు,    కీ.శే.శ్రీ జోజి బాబు గారు,   కీ.శే. శ్రీ గురునాథం గారు,   కీ.శే.శ్రీ రాజారావు గారు ,   కీ.శే.శ్రీమతి గౌరి దేవి గారు, కీ.శే.శ్రీమతి అనురాధ గారు,   కీ.శే.శ్రీ అంతోని గారు ( క్రాఫ్ట్ మాష్టారు),  కీ.శే.శ్రీ పెద్ద తెలుగు మాస్టారు ,  కీ.శే.శ్రీ పెద్ద ఫ్రాన్సిస్ మాస్టారు ,   మరియు   గౌరవనీయులైన శ్రీ అప్పారావు గారు, శ్రీ పాపారావు గారు, శ్రీ శంకర రావు గారు , శ్రీ నూకరాజు గారు , శ్రీ ప్రభాకర్ రావు గారు , శ్రీ సుందర్ రెడ్డి గారు,  శ్రీ చిన్న ఫ్రాన్సిస్  మాష్టారు, శ్రీ ఆనందరావు మాస్టారు గారు.

చిరస్మరణీయులైన మన గురువులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ......



యడ్ల శ్రీనివాసరావు
ఎస్.ఎస్.సి. 1988,   రోల్.నెం.92,  బి.
(సెయింట్ థెరిస్సా రోమన్ కేథలిక్ మిషినరి హై స్కూల్,   పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం, విశాఖ జిల్లా)

No comments:

Post a Comment

నా శివుడు - రామకృష్ణ తులసి.

నా శివుడు By రామకృష్ణ తులసి. • శివుడెన్నడు     నాలోనే    ఉన్నాడు.   శివుడెప్పుడు    నాతోనే    ఉన్నాడు. • శివుడు   లేని    నేను    లేను.   శ...