Tuesday, July 7, 2020

15. వర్షమా.....ఓ వర్షమా

వర్షమా...... ఓ వర్షమా


వర్షమా!.... ఓ వర్షమా!.... నీ పలకరింపే మా మదిలో  హర్షమా.


వర్షమా!  కారు మబ్బుల కన్నీరు వై .... మా కన్నీరు  తుడుస్తావు.


అలసి  సొలసి  విసిగిన  భానుడి తాపానికి ....సేద తీరే  తల్లి ఒడి వలె  చల్లని  వెచ్చని కమ్మని  హృదయానందాన్నిస్తావు.


వర్షమా! నీ రాకతో పసిపిల్లల కేరింతలు  , కాగితం పడవలు,   గుంతలలో గెంతులు .....రమణీయం ...ఆహా! ఎంత ఆనంద స్మరణీయం.


మోడు వారిన చెట్లకు నీ స్పందనతో ....హరిత శృంగార సింగారమే.


బీడు వారిన పంటలకు నీ నవ్వుతో .....పంచామృతమే .


వర్షమా !  నీ రాకకై పుష్పాలు వేచి చూస్తాయి మధువు నివ్వడానికి ......తేనెటీగలు సిద్ధమవుతాయి మధువును గ్రోలడానికి.


నీ పలకరింపుతో తుమ్మెదలు పులకరించి ఇంద్రధనస్సులా  వర్ణాలు  మారుస్తాయి….   ఆనందం..... ఎంత నయనానందం. 


వర్షమా!  నిన్ను తాకిన  మట్టి  ముద్దై  ముద్దు అయి ..అంతవరకు కానరాని సువాసన వెదజల్లుతుంది…….ఆహా!   పువ్వులే కాదు మన్ను కూడా పారిజాతమే కదా!  ఏమి చిత్రం .....ఎంత విచిత్రం.


వర్షమా!  నీతో కలసి   మెలసి   తడిసి  అడుగేసిన మాకు ఎటుచూసినా చక్కిలిగిలి  సంతోషమే.


వర్షమా!  నీ రాకతో సమస్త ప్రాణికోటి చల్లబడినా....మా లోని ఉష్ణ స్పర్శని తెలియ చేస్తావు.  అద్భుతం  ఆహా! ఎంత అద్భుతం.


వర్షమా!  నీ తొలకరి జల్లు కి  ప్రకృతి నాట్యమాడుతుంది..... మయూరి నాట్యం చేస్తుంది.


వర్షమా!  నీవు ఆగ్రహిస్తే నీ కన్నీరు మున్నీరై,  ఏరులై వరదలైన   నిన్ను మేము శాంతింప గలమా!  ఆ శక్తి మాకు లేదు.


వర్షమా!  నీలారవిందమైన నీలి ఆకాశం లో .నీ..ఇంద్రధనస్సు ....మా లోని పులకరింతకు ....నిన్ను పలకరింతకు .....ప్రకృతి సాక్ష్యం .


వర్షమా ! మాయలో  పడి నీటి బిందువుగనే చూస్తున్నాం . కానీ మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తున్నావు.  అవును!  ఎంతైనా నువు ప్రకృతివి కదా.

 
యడ్ల శ్రీనివాసరావు.

No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...