మనసా ఓ మనసా
• మదిలోని మనసుకు ఎన్ని పలకరింత లో,
ఎన్ని పులకరింత లో, ఎన్ని కలవరింత లో.
• మనస్సు పిచ్చిది ...
బాధలో ఏకాంతం తో స్నేహం చేస్తుంది
సంతోషంలో సమూహంతో సందడి చేస్తుంది.
• మనసు ఒంటరిది ...
ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా
తనలాంటి మనసు కోసం నిరంతరం
ఆరాట పడుతుంది.
(అడిగి చూడు నీ మనసుని నిజమో కాదో).
• మనసు అల్పమైనది ...
చిన్న చిన్న సంతోషాలు
పెద్ద పెద్దగా పంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
• మనసు విశేషమైనది ...
కోరికలతో సతమతమవుతూ
నిర్ణయాలు తీసుకోలేక
డోలాయమానంలో ఊగిసలాడుతుంది.
• మనసు దృఢమైనది ...
తన శక్తిని గుర్తిస్తే మరొక అద్భుతమైన
ప్రపంచాన్ని సృష్టిస్తుంది.
• మనసు న్యాయవాది ...
సమస్యలను సృష్టించగలదు
సమస్యలను తీర్చగలదు.
• మనసు ఆశావాది ...
కోరుకున్నది పొందేవరకు
పరితపిస్తూ నే ఉంటుంది.
• మనసు తేలికైనది ...
ఏ అండ లేకుండా
ఈ విశ్వమంతా విహరించగలదు.
• మనసు భారమైనది ...
నిర్లిప్తతతో ఎన్నాళ్లైనా
కదలలేక ఉండిపోతుంది.
• మనస్సు చంచలమైనది ...
సర్వం తెలుసని విర్రవీగుతుంది.
అంతలోనే నాకేం ఎరుకని మౌనంగా ఉంటుంది.
• శరీరానికి అవయవాలున్నాయి,
అవి పరిమితం ...
మనసుకు అసంఖ్యాకమైన ఎన్నో
గుణగణాలున్నాయి, అవి అపరిమితం.
• మనసుకు వయసు లేదు
శరీరానికి మాత్రమే వయసు
అందుకే బాల్యం , కౌమారం,
యవ్వనం, వృద్ధాప్యం
ఏ దశలలో కి మనసు వెళ్ళినా దానికి
తృప్తినిచ్చే దశలో తిష్ఠ వేసుకుపోగలదు.
ఆనంద చక్రం తిప్పగలదు.
• ఈ రోజుకి ఈ సృష్టిలో మనిషికి
అర్థం కానిది ఏదైనా ఉంది అంటే
అది ఒక్క మనసే....
ఎందుకంటే దానికి భౌతిక రూపం లేదు....
కాబట్టి ఎలాగైనా మారుతుంది....
అదియే దైవం కావచ్చు లేదా దెయ్యం కావొచ్చు.
• ప్రపంచానికి కనపడే మనిషికి
కనపడని మనసుతో నిరంతరం ఆరాటంతో
కూడిన పోరాటం ... ఏమిటో ఈ చిత్రం ... విచిత్రం.
యడ్ల శ్రీనివాసరావు.
No comments:
Post a Comment