Friday, September 27, 2024

538. శివుడు మెచ్చని జన్మ

 

శివుడు మెచ్చని జన్మ


"శివుడు   మెచ్ఛని  జన్మ "  అంటూ ఏదైనా ఉంటుందా?  లేదు,  సాధ్యమే కాదు.  ఆయనకి నచ్చి మెచ్చినపుడే  కదా   నీ జీవం  ఉధ్బవించేది.

 మరి   అన్నివేళలా   అందరూ   అన్ని   క్రియలలో,  అంటే   నువ్వు  మంచి చేసినా  చెడు చేసినా  శివుడు  నిన్ను  పట్టుకొనే  ఉంటాడా!  అంటే ,  అవును ఉంటాడు.   ఆయన  పట్టుకోలేదో   పడిపోతావు  సరికదా ఈ జన్మకు  మరి  లేవనే  లేవు.  ఎందుకంటే శివుడు  నీ ఆత్మ  కోసం  ఇచ్చినదే కదా  నీ  శరీరం.


 నువ్వు  శివుని  మనసు  తెలుసుకుని   గెలువ లేవా?  శివుని మనసు లో చోటు సంపాదించ లేవా ? …... ప్రతి జీవుడు తాను కోరుకుంటున్నట్లు గా  సన్మార్గంలో నడచి  ఉత్తమ కర్మలను  ఆచరించి   నిజంగా   తన మెప్పు పొందాలని   శివుడు అన్నివేళలా  నిన్ను గమనిస్తూ   నీతోనే ఉంటాడు.  పంచభూతాలలో మిళితమై   నిన్ను  నన్ను  శక్తి స్వరూపేణా  చూస్తూనే ఉంటాడు.   కానీ ఈ విషయం నీకు నాకు అంత సులభంగా  అర్ధం కాదు.

  స్వచ్ఛతకు  కొలమానం  ఉందా?  అంటే,   అది కొలిచే  పరికరాన్ని  బట్టే కదా తెలిసేది.   నువ్వు నీ చుట్టూ  ఉన్నవారికంటే  ఎంత స్వచ్ఛమైన  మనసుతో ఉంటావో అదే  నీకు  కొలమానం.  ఇక్కడ పోల్చుకోవడం  అన్నది  ముఖ్యం ,  సుస్పష్టం, అవసరం.   ఎందుకంటే  పోలిక  ద్వారానే   కదా  పోటీతత్వం  పెరుగుతుంది.  అది సరైన, ఆరోగ్యకరమైన  రీతిలో పయనిస్తే  నువ్వు  ,  నీ చుట్టూ  ఉన్న  సమాజం  కూడా   శివ తత్వంలో  ఇమిడిపోతారు.


 శివుడు  అంటే సత్యం,  శుభం,  ఆనందం. నువ్వు  శివుని కి  మనసు అర్పించి  అడుగులు వేస్తున్నావు   అంటే   అందుకు ప్రతి గా   ఎన్నో ,  ప్రతిఘటనలు,   వ్యతిరేక  పరిస్థితులతో కూడిన తుఫానులు , అలజడులు ,  ఆకర్షణలు   ఏదొక రూపం లో   నిన్ను  చుట్టు ముడతాయి,   ఒకోసారి దాడి చేస్తాయి.  దీనినే  మాయా ప్రభావం అంటారు. నువ్వు   ఈ మాయా లోకం లో   జన్మ తీసుకొని జీవించడానికి   వచ్చి ,   మాయను విడిచి సత్యమైన శివుని వైపు నడుస్తాను అంటే,  మాయ నిన్ను  తేలికగా  విడిచి పెట్టదు. దాని ప్రభావం తీవ్రంగా నే చూపిస్తుంది. ఒకానొక దశలో నీ చుట్టూ ఉన్న సమస్త వాయుమండలం నీకు వ్యతిరేకంగా  తయారవుతుంది.  కానీ  ఇదంతా  తాత్కాలికం.

 ఎందుకంటే  మాయకు  బాగా తెలుసు,  శివుని  శక్తి ఎటువంటిదో.   నీ యెక్క  స్థిత ప్రజ్ఞతను  మాయ పూర్తిగా గ్రహించిన  పిదప   అది బలహీనపడి   నిన్ను వదిలేస్తుంది. ఎందుకంటే శివుని కి బాగా ఇష్టమైన ధృడతా శక్తి (ధైర్యం), సహన శక్తి (ఓర్పు), నిశ్చయ శక్తి (మంచి బుద్ధి) నీలో పుష్కలంగా ఉన్నప్పుడు మాయ నీ ముందు తలదించుతుంది.

 ఇక్కడ మాయ అంటే  కామం , క్రోధం , లోభం , మోహం , అహం , ఈర్ష్య , ద్వేషం, అసూయ అనే వికారాలు.  ఇవి   స్వయంగా  నీ లోను   ఉండవచ్చు. లేదా  నీతో ఉన్నవారు  ఈ గుణాలను  అస్త్రశస్త్రాలుగా నీ  మీద  ప్రయోగించవచ్ఛు.

 శివుడు  ఏనాడూ  నిన్ను కోరికలను,  బంధాలను త్యజించమని కోరడు.  కానీ,  కోరికలను అధిగమించ మంటాడు.  బంధాలలో ఉంటూ బంధీ గా  కావద్దు, కర్మ బుణాలను  తీర్చుకోమంటాడు. 

 శివునికి  కావాల్సింది  కేవలం  నీ లోని,  నా లోని మాయతో  నిండిన  అవగుణాలు.

శివుడు ఆశించేది ఒక్కటే ... నీ , నా  సపరివర్తన. 

అందుకే  నా భావన లో శివుడు మెచ్చని జన్మ లేనే లేదు.  ‘ఇదే శివ తత్వము  ఇదే  శివాత్మకమ్’.


🙏ఓం నమః శివాయ

యడ్ల శ్రీనివాసరావు 27 Sep 2024  11:00 pm.


No comments:

Post a Comment

549. ఏక బిల్వం శివార్పణం

  ఏక బిల్వం  శివార్పణం • ఏమి  నీ"దయ" శివా ! … ఏమి  నీ"దయ"   ఏది   నాదయా  హరా! … ఏది    నాదయా • మారేడు దళ మంటి   నా ...