స్నేహం... ప్రేమ
· స్నేహం, ప్రేమ ఈ రెండూ కవలల్ల చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి మానవ సంబంధాల్లో అత్యంత ప్రాముఖ్యత గల అంశాలు . వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎప్పుడూ సందేహంగాను, అగమ్యగోచరం గానే ఉంటుంది.
· స్నేహం స్వజాతి జీవుల మధ్య చిగురించే అంశం.అది పూర్తిగా భౌతికమైనది. ఒక మనిషి , మనిషి తో తప్ప వేరే జీవితో స్నేహం చెయ్యలేడు. ఉదాహరణకు మనిషి పశుపక్ష్యాదులతో స్నేహం చేయలేడు. ఎందుకంటే స్నేహం లో ఇవ్వడమే కాదు ఏదో ఒకటి తీసుకోవడం, అనేది కూడా ఒక అంశంగా ఉంటుంది.
· ప్రేమ స్వజాతి తోపాటు, విభిన్న జాతుల మధ్య చిగురించే, అనిర్వచనీయమైన అంశం. ఒక మనిషి వృక్షాలను, ప్రకృతిని, శిలలను , అర్థం కాని జీవులను, పశుపక్ష్యాదులను ప్రేమించగలడు. ప్రేమ అనేది ఈ విశ్వంలో విశ్వసనీయమైన అనుభూతి మరియు పూర్తిగా మానసికమైనది . ప్రేమ మనసుకు సంబంధించినది. ఒక మనిషి శునకానికి సపర్యలు చేసి ప్రేమించగలడు. తిరిగి భౌతికంగా పొందేది ఏమీ ఉండదు ఒక అనుభూతి తప్ప.
· ప్రేమ అంటే ఆశించకుండా ఇవ్వగలిగేది మాత్రమే. అది ఒక మానసిక అంశమే గాని శారీరక , భౌతిక అంశం ఎన్నటికీ కాదు.
· స్నేహం ఒకరికి సంతోషం ఇవ్వగలదు....కానీ ప్రేమ చైతన్యవంతం చేయగలదు. చైతన్యం ఎన్నో సమస్యలను పరిష్కరించగలదు .
· స్నేహానికి పరాకాష్ట (మితిమీరితే) స్వార్థం ....ప్రేమకు పరాకాష్ట త్యాగం . స్నేహాన్ని, ప్రేమని లింగభేదం తో ముడి పెట్టలేము.
· స్నేహం రెండువైపులా చిగురిస్తేనే నిలబడుతుంది , ఎందుకంటే అది భౌతికం. కానీ ప్రేమ రెండు వైపులా అన్నివేళలా చిగురించదు. ఎందుకంటే అది అనుభూతి కాబట్టి . ఉదాహరణకు తల్లి బిడ్డ ని ప్రేమిస్తుంది, కానీ బిడ్డ అన్ని సందర్భాల్లో తిరిగి ఆ ప్రేమను తల్లికి పంచ లేదు, ఇలా చాలా అంశాల్లో ఉంటుంది .
· ఏ మానవ బంధాలైనా, సంబంధాలైనా పవిత్రమైనవి . వాటిని గుర్తించి ఉన్నతంగా కాపాడుకోవాలి గానీ , తుచ్ఛమైన అవసరాలకు వినియోగించుకో కూడదు.
· సృష్టి ధర్మాన్ని బట్టి శరీరానికి భౌతిక అవసరాలు ఉంటాయి . కానీ మనసుకు అనుభూతులు మాత్రమే ఉంటాయి. మనసంటే ఆలోచన, ఆత్మ. ఆత్మ రూపం లేనిది.
· నేటి సమాజంలో ప్రేమను వక్రీకరించి ఒక అవసరంగాను లేక కోరికగాను చిత్రీకరిస్తూ, ప్రచార మాధ్యమాలు దౌర్భాగ్యం తో దాని అర్థం మారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రేమ , స్నేహం అనేవి చాలా బలహీనమైన అంశాలుగా చూపబడుతున్నాయి.
· చివరిగా....... భగవంతుడు భక్తునితో ఎన్నడూ స్నేహం చేయడు. ఒకవేళ భక్తుడు భగవంతుని తో స్నేహం చేసి నంత మాత్రాన కరుణించడు. ఎప్పుడైతే భక్తుడు తన ప్రేమతో, మోహాలను వదులుకొని, త్యాగాలకు సిద్ధం అవుతాడో, అప్పుడే భగవంతుని ప్రేమ, అనుగ్రహం దొరుకుతుంది . ఇది ప్రేమకు భగవంతుడు ఇచ్చిన శక్తి .
· నిస్వార్థంగా ఆలోచన చేస్తే, ఈ భగవత్ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతం.... మహా అద్భుతం .
· ఓం శ్రీ గురుభ్యోనమః
·
యడ్ల శ్రీనివాసరావు
No comments:
Post a Comment