Monday, September 30, 2024

541. రంగవల్లి

 

రంగవల్లి 


• రంగు  రంగుల  కుసుమం

  రంగవల్లి   యై  వచ్చింది.

• గంధ    సుగంధాల తో

  పరిమళాలు    చిమ్మింది.


• ఈ కాలం

  మత్తు గ   ఉంది లే

  బహు   గమ్మత్తుగా  ఉంది  లే…


• రంగు  రంగుల  కుసుమం

‌  రంగవల్లి   యై  వచ్చింది.

• గంధ     సుగంధాల తో

  పరిమళాలు    చిమ్మింది.


• మగత   లోని     గతమంతా

  మల్లె  మాల తో     నిండింది.

• సొగసు    వీచిన    సమీరం తో

  మనసు   పులకించి   పోయింది.


• రంగు    రంగుల  కుసుమం

  రంగవల్లి   యై    వచ్చింది.

• గంధ     సుగంధాల తో

‌  పరిమళాలు    చిమ్మింది.


• ఈ కాలం

  మత్తు గ    ఉంది  లే

  బహు   గమ్మత్తుగా   ఉంది    లే…


విరిసిన     పూవు లో

  చెలి మోము    చిగురించే ను.

• ఊగిన    తొడిమ తో

  సఖి   నడక    తలపించే ను.


• పూరేఖ ల    హిమం 

  చెలి   కంఠ    స్వేదమై   సాగేను.

• సుమ కేసర     పుప్పొడి

  సఖి   నుదిటి   బింబమై    నిలిచేను.


• పూవు   అయినా  ...  ప్రేయ  సయినా 

  ప్రకృతి     ఒడిలో    పరవశం

  ప్రియుని   మదిలో   పారవశ్యం.


• రంగు    రంగుల    కుసుమం

  రంగవల్లి   యై      వచ్చింది.

• గంధ     సుగంధాల తో

  పరిమళాలు    చిమ్మింది.


• ఈ కాలం

  మత్తు గ   ఉంది లే

  బహు       గమ్మత్తుగా    ఉంది లే….



సుమ కేసరం = విరిసిన పువ్వు యొక్క కేంద్ర స్థానం.


యడ్ల శ్రీనివాసరావు  8 Sep 2024 , 11:00 pm.



Sunday, September 29, 2024

540. కలు ఊహలు

 

 కలు ఊహలు 


• ఊసు లేని   కలువ    ఊహ లెందుకు 

  ఊయల    ఆటతో    ఊగిస  లెందుకు.


• అందమైన  సరసు    నీ సరసన     ఉంటే

  హంసల   హరివిల్లు  నీ  సొంతమే   కదా.


• మీనాల   కేరింతలు   కనువిందు  చేస్తుంటే

  కొలను లోని   సందడి   నీకు  కవ్వింతే   కదా.


• ఎందుకు … మరెందుకు


• ఊసు లేని    కలువ    ఊహ లెందుకు

  ఊయల    ఆటతో    ఊగిస లెందుకు.


• నిశ్చల    నీ కొలను లో

  అలలు   ఎలా   విరియును.

• నీ    వర్ణాల    కలబోతలో

  వెన్నెల    ఎలా     కలియును.


• అర  విరిసిన     నీ రేఖలలో

  చినుకు     ఎలా    నిలుచును.

• తలమున   నీ    పరితపనలు

  ప్రకృతికి     ఎలా    తెలియును.


• ఊసు లేని    కలువ  ఊహ లెందుకు

  ఊయల    ఆటతో   ఊగిస లెందుకు.


• అందమైన  సరసు    నీ సరసన  ఉంటే

  హంసల హరివిల్లు    నీ  సొంతమే కదా.


• మీనాల   కేరింతలు     కనువిందు  చేస్తుంటే

  కొలను లోని   సందడి    నీకు కవ్వింతే కదా.


• ఊహలెందుకు  … మరెందుకు

  ఊగిసలెందుకు … మరెందుకు.



యడ్ల శ్రీనివాసరావు 21 Sep 2024, 9:00 PM.


Saturday, September 28, 2024

539 కళ్యాణం


కళ్యాణం


ఈ   రేయి      పలికిన    రాగం     నిరీక్షణం.

  ఈ   వెన్నెల    వేసిన     తానం     సంగమం.

  ఈ   కాలం     రాసిన     పల్లవి     కళ్యాణం.


రాగం   తానం   పల్లవి

  మధురం   …  సుమధురం.

• ఈ  రేయి   వెన్నెల   కాలం 

  యోగం    …    సంయోగం.


• అలికిడి   లేని   అందెల లో

  సరిగమలు     సన్నగిల్లాయి.

• ఊగిసలు  లేని    జుంకాల లో

  పదనిసలు    బోసి  పోయాయి.


ఈ  రేయి    పలికిన    రాగం     నిరీక్షణం

  ఈ  వెన్నెల   వేసిన     తానం     సంగమం

  ఈ  కాలం    రాసిన     పల్లవి     కళ్యాణం.


నిరీక్షణ    సంగమ   కళ్యాణం

  రంజనం   …  రస  రంజనం.

రాసి   వేసిన    పలుకుల

  గారం    …   శృంగారం.


• అలజడి   లేని    ముక్కెర కి

  ఊపిరి   తాపం   కరువయ్యింది.

• జీవం     లేని    మోము కి

  నెలవంక     లోటయ్యింది.


ఈ    రేయి      పలికిన    రాగం    నిరీక్షణం

  ఈ    వెన్నెల    వేసిన     తానం    సంగమం

  ఈ    కాలం     రాసిన     పల్లవి    కళ్యాణం.


• ఈ  గళం     శుభ     మంగళం

  ఈ  భోగం   భూత   సంభోగం.



భూత =  గతం.

యడ్ల శ్రీనివాసరావు  10 Sep 2024 7:00 PM.


Friday, September 27, 2024

538. శివుడు మెచ్చని జన్మ

 

శివుడు మెచ్చని జన్మ


"శివుడు   మెచ్ఛని  జన్మ "  అంటూ ఏదైనా ఉంటుందా?  లేదు,  సాధ్యమే కాదు.  ఆయనకి నచ్చి మెచ్చినపుడే  కదా   నీ జీవం  ఉధ్బవించేది.

 మరి   అన్నివేళలా   అందరూ   అన్ని   క్రియలలో,  అంటే   నువ్వు  మంచి చేసినా  చెడు చేసినా  శివుడు  నిన్ను  పట్టుకొనే  ఉంటాడా!  అంటే ,  అవును ఉంటాడు.   ఆయన  పట్టుకోలేదో   పడిపోతావు  సరికదా ఈ జన్మకు  మరి  లేవనే  లేవు.  ఎందుకంటే శివుడు  నీ ఆత్మ  కోసం  ఇచ్చినదే కదా  నీ  శరీరం.


 నువ్వు  శివుని  మనసు  తెలుసుకుని   గెలువ లేవా?  శివుని మనసు లో చోటు సంపాదించ లేవా ? …... ప్రతి జీవుడు తాను కోరుకుంటున్నట్లు గా  సన్మార్గంలో నడచి  ఉత్తమ కర్మలను  ఆచరించి   నిజంగా   తన మెప్పు పొందాలని   శివుడు అన్నివేళలా  నిన్ను గమనిస్తూ   నీతోనే ఉంటాడు.  పంచభూతాలలో మిళితమై   నిన్ను  నన్ను  శక్తి స్వరూపేణా  చూస్తూనే ఉంటాడు.   కానీ ఈ విషయం నీకు నాకు అంత సులభంగా  అర్ధం కాదు.

  స్వచ్ఛతకు  కొలమానం  ఉందా?  అంటే,   అది కొలిచే  పరికరాన్ని  బట్టే కదా తెలిసేది.   నువ్వు నీ చుట్టూ  ఉన్నవారికంటే  ఎంత స్వచ్ఛమైన  మనసుతో ఉంటావో అదే  నీకు  కొలమానం.  ఇక్కడ పోల్చుకోవడం  అన్నది  ముఖ్యం ,  సుస్పష్టం, అవసరం.   ఎందుకంటే  పోలిక  ద్వారానే   కదా  పోటీతత్వం  పెరుగుతుంది.  అది సరైన, ఆరోగ్యకరమైన  రీతిలో పయనిస్తే  నువ్వు  ,  నీ చుట్టూ  ఉన్న  సమాజం  కూడా   శివ తత్వంలో  ఇమిడిపోతారు.


 శివుడు  అంటే సత్యం,  శుభం,  ఆనందం. నువ్వు  శివుని కి  మనసు అర్పించి  అడుగులు వేస్తున్నావు   అంటే   అందుకు ప్రతి గా   ఎన్నో ,  ప్రతిఘటనలు,   వ్యతిరేక  పరిస్థితులతో కూడిన తుఫానులు , అలజడులు ,  ఆకర్షణలు   ఏదొక రూపం లో   నిన్ను  చుట్టు ముడతాయి,   ఒకోసారి దాడి చేస్తాయి.  దీనినే  మాయా ప్రభావం అంటారు. నువ్వు   ఈ మాయా లోకం లో   జన్మ తీసుకొని జీవించడానికి   వచ్చి ,   మాయను విడిచి సత్యమైన శివుని వైపు నడుస్తాను అంటే,  మాయ నిన్ను  తేలికగా  విడిచి పెట్టదు. దాని ప్రభావం తీవ్రంగా నే చూపిస్తుంది. ఒకానొక దశలో నీ చుట్టూ ఉన్న సమస్త వాయుమండలం నీకు వ్యతిరేకంగా  తయారవుతుంది.  కానీ  ఇదంతా  తాత్కాలికం.

 ఎందుకంటే  మాయకు  బాగా తెలుసు,  శివుని  శక్తి ఎటువంటిదో.   నీ యెక్క  స్థిత ప్రజ్ఞతను  మాయ పూర్తిగా గ్రహించిన  పిదప   అది బలహీనపడి   నిన్ను వదిలేస్తుంది. ఎందుకంటే శివుని కి బాగా ఇష్టమైన ధృడతా శక్తి (ధైర్యం), సహన శక్తి (ఓర్పు), నిశ్చయ శక్తి (మంచి బుద్ధి) నీలో పుష్కలంగా ఉన్నప్పుడు మాయ నీ ముందు తలదించుతుంది.

 ఇక్కడ మాయ అంటే  కామం , క్రోధం , లోభం , మోహం , అహం , ఈర్ష్య , ద్వేషం, అసూయ అనే వికారాలు.  ఇవి   స్వయంగా  నీ లోను   ఉండవచ్చు. లేదా  నీతో ఉన్నవారు  ఈ గుణాలను  అస్త్రశస్త్రాలుగా నీ  మీద  ప్రయోగించవచ్ఛు.

 శివుడు  ఏనాడూ  నిన్ను కోరికలను,  బంధాలను త్యజించమని కోరడు.  కానీ,  కోరికలను అధిగమించ మంటాడు.  బంధాలలో ఉంటూ బంధీ గా  కావద్దు, కర్మ బుణాలను  తీర్చుకోమంటాడు. 

 శివునికి  కావాల్సింది  కేవలం  నీ లోని,  నా లోని మాయతో  నిండిన  అవగుణాలు.

శివుడు ఆశించేది ఒక్కటే ... నీ , నా  సపరివర్తన. 

అందుకే  నా భావన లో శివుడు మెచ్చని జన్మ లేనే లేదు.  ‘ఇదే శివ తత్వము  ఇదే  శివాత్మకమ్’.


🙏ఓం నమః శివాయ

యడ్ల శ్రీనివాసరావు 27 Sep 2024  11:00 pm.


Thursday, September 26, 2024

537 వరమా … కలవరమా

 

వరమా … కలవరమా


• ఇది వరమా    …   కలవరమా

‌ నాలో    రేగిన    మధనమా.


• పగలే      వెన్నెల గా

  రేయే       మురిపెం గా

  సాగుతోంది    సమయం.

• అలలే      పానుపు గా

  మదిలో        తేలిక గా

  ఊగుతుంది    తనువు.


• ఇది వరమా   …   కలవరమా

  నాలో    రేగిన    మధనమా.


• ఈ   వింత   కాలం

  ఎటో  ఎటో      తీసుకు   పోతోంది.

• ఏదో   తెలియని    లోకంలో

  స్మృతులను    చూపిస్తుంది.


• ఊహ   అనుకుందామంటే 

  నను   ఊపి ఊపి   చూపిస్తుంది   కాలం.

• గతం     అనుకుందామంటే

  ఆనవాల    జాడ లేదు    ఈ   జన్మ లో.


• ఇది వరమా   …   కలవరమా

  నాలో    రేగిన    మధనమా.


• ఈ   తిరోగమన     కాలం

  మూలాలను     స్పృశిస్తోంది.

• ఈ    సమయం     చేరని

  శిఖరాలను    చేరుస్తుంది.


• ఇది   వరమా   …   కలవరమా

  నాలో    రేగిన    మధనమా.


మధనము =  గత  అంతర  అనుభవ  పరిశీలన.



యడ్ల శ్రీనివాసరావు 10 Sep 2024   8:00 PM.


Wednesday, September 25, 2024

536. ఎందుకీ జన్మ

 

ఎందుకీ  జన్మ


• ఎందుకిచ్చావు   శివా

  నాకు   ఈ జన్మ

• ఏమి మెచ్చావు  శివా

  నా   పూర్వ  కర్మ.


• త్రికాలమున    సంధ్యనొనర్చ  లేదు .

  త్రిదళ పత్ర     పూజ   జేయలేదు .

  

• తల్లితండ్రుల    గొప్ప   నెరుగ లేదు.

  గురువుల     సేవ   జేయలేదు.

  

• దాన  ధర్మములు    జేయలేదు.

  జనులకు   మేలు   నొసగ  లేదు.


• ఎందుకు  మరెందుకు.

  ఎందుకు   మరెందుకు.


• ఎందుకిచ్చావు    శివా

  నాకు   ఈ   జన్మ.

• ఏమి మెచ్చావు   శివా

  నా పూర్వ కర్మ.


• సత్యము   నంటి     ఉంటి నా  ...

  లేక 

  ధర్మము  నే   విడువ  కుంటి నా.

• వేద   వాదములు     నేర్చితి నా ...

   లేక 

   పురమున   కీర్తి    గడించితి నా.


• ఎందుకు   మరెందుకు

  ఎందుకు   మరెందుకు.


• ఎందుకిచ్చావు    శివా

  నాకు  ఈ   జన్మ

• ఏమి  మెచ్చావు   శివా

  నా పూర్వ కర్మ.


• సంసారము న    సైనికుడై     నందు కా ...

  లేక

  జీతభత్యం  లేని   సేవకుడినై   నందు కా.

  

• బంధుమిత్రుల  వంచన సహియించి  నందు కా ...

  లేక

  నిందలు   దండలు గా   ధరించి  నందు కా.


• ఎందుకు మరెందుకు

  ఎందుకు  మరెందుకు.


• ఎందుకిచ్చావు   శివా

  నాకు   ఈ జన్మ

• ఏమి మెచ్చావు  శివా

  నా  పూర్వ  కర్మ.


• కారణం  ...  ఏదైనా   కానీ 

  ఇచ్చిన     ఈ  జన్మా న

  నా  చేయి   పట్టావు … 

  అది    చాలు   శివ.


• ఊపిరి   విడిచిన   గాని

  నీ తోడు  మాత్రం  విడవను   శివ.


యడ్ల శ్రీనివాసరావు 18 Sept 2024 10:00 PM


Tuesday, September 24, 2024

535. ఆటలాడకండి మనుషులతో

 

 ఆటలాడకండి మనుషుల తో


• ఆడకండి    ఆడకండి

  మనుషుల తో    ఆడకండి.

• ఆడకండి     ఆడకండి

  మనసుల తో    ఆడకండి.

• భావోద్వేగాల తో     ఆటలు

  అస లే     ఆడకండి.


• దేహని కి     గాయమైతే

  కాలం తో        సమసితుంది.

• హృదయానికి   గాయమైతే

  కాలం లో   ...  కాలం లో 

  పయనిస్తూ నే    ఉంటుంది.


• కర్మ     ఎంతో      గొప్పది

  ఫలితాలను    వడ్డీతో     ఇస్తుంది.

• అది   తారతమ్యం   ఎరుగక

  అందరినీ    ఒకేలా    చూస్తుంది.


• ఆడకండి     ఆడకండి

  మనుషుల తో     ఆడకండి.

• ఆడకండి      ఆడకండి

  మనసుల తో      ఆడకండి.

• భావోద్వేగాల తో    ఆటలు

  అస లే      ఆడకండి.


• అవసరాలు    కోసం

  నమ్మక   ద్రోహులు గా    మారకండి.

• తేనె  పూసిన    కత్తి లా

  మాయ మాటలతో     కవ్వించకండి.


• ముందు  వెనక    మాటలు  మారుస్తూ

  తుచ్ఛులు  గా    కాకండి.

• బ్రతుకు   బాటలో    దొరికిందే

  సంతోషమని      భావించండి.


• భావోద్వేగాలనేవి    బలహీనతలు   కావు.

  పొంది పొందని    అనుభవాలకు ...

  పొంది పొందని    అనుభవాలకు 

  అవి      ప్రతిరూపాలు.


• ఆడకండి     ఆడకండి

  మనుషుల తో    ఆడకండి

• ఆడకండి      ఆడకండి

  మనసుల తో      ఆడకండి

• భావోద్వేగాల తో     ఆటలు

  అస లే      ఆడకండి.


యడ్ల శ్రీనివాసరావు  5 Sep 2024 9:00 PM


534. ఆత్మీయ మాటలు

 

ఆత్మీయ  మాటలు


• ఆత్మీయ   మాటలు    అమృతం

  అవి     అందరికీ      ఎంతో    శ్రేష్టం.

• అవి          వినుటకు  

  చేయాలి    సత్సాంగత్యం .


• మనసు కి     ఔషధం

  మంచి       వాక్కులు.

• అవి      వెలువడాలంటే 

  చేయాలి    శివ   స్మరణం.


• మంచి    మాట   లోని    శక్తి

  ఆయువు     నిస్తుంది.

• సత్య  వాక్కు    లోని   శబ్దం

  దైవ మై     నిలుస్తుంది.


• ఆత్మీయ    మాటలు    అమృతం

  అవి   అందరికీ    ఎంతో     శ్రేష్టం.

• అవి      వినుటకు  

  చేయాలి     సత్సాంగత్యం .


• మధురమైన    మాటను

  తాకలేవు      అలజడులు.

• మితమైన      పలుకుల లో

  యుక్తి     దాగి   ఉంటుంది.


• స్వరం   తోని     వైద్యం

  భగవంతుని    స్వస్థ్యము.

• శుద్ధ  ఆత్మ   లోని     మౌనం 

  మాట యై   చేరుతుంది  గమ్యం.


• ఆత్మీయ     మాటలు    అమృతం

  అవి      అందరికీ   ఎంతో     శ్రేష్టం.

• అవి        వినుటకు  

  చేయాలి    సత్సాంగత్యం.



స్వస్థ్యము = Healing.


యడ్ల శ్రీనివాసరావు  3 Sep 2024, 11:30 AM


Monday, September 23, 2024

533. శివుడు సాక్షి

 

శివుడు  సాక్షి 



• సాక్షి   వై  నావు   శివ

  సాక్షి   వై  నావు.

• మా లోని  మంచికి   ….  మా  లోని  చెడు కి.

• సాక్షి వై  నావు   శివ

  సాక్షి వై  నావు.


• మాయలు   చేస్తాం

  తెలివి తో    మభ్య   పెడతాం.

• మోసం     చేస్తాం

  అతి   తెలివి తో   వ్యవ "హారిస్తాం".

• మమ్ము    గమనించేది

  మమ్ము    గమనించేది …  

  ఎవరనుకుంటాం.


• సాక్షి వై నావు శివ

  సాక్షి వై నావు.

• మా లోని మంచికి …. మా లోని చెడు కి.

• సాక్షి వై నావు శివ

  సాక్షి వై నావు.


•  పాపాలు   చేసెస్తూ 

   నీకు    వాటాలు   ఇస్తాం.

•  పూజలు      చేసెస్తూ 

   భక్తి  తో     పాపాఘ్నం   అంటాం.

•  మమ్ము     గమనించేది

   మమ్ము     గమనించేది …  

   ఎవరంటూ 

   శివోహం  ...  శివోహం   అంటుంటాం.

  

• సాక్షి  వై  నావు   శివ

  సాక్షి  వై  నావు.

• మా లోని  మంచికి   ….  మా లోని  చెడు కి.

• సాక్షి  వై  నావు    శివ

  సాక్షి   వై నావు.


• అకృత్యాలు   చేస్తాం.

  జీవన శైలిలో   సహజం  అంటాం.

• వికారాల లో    విహరిస్తాం.

  సుఖ సంతోషాలు గా   భావిస్తాం.


•  జన్మాంతరాలు    గా   

   ఈ  సంస్కారాల   తోనే 

   ఆరి   తేరి   'పోతున్నాం'.

 • మార ని     బుద్ధి తో

   మరలా    ఇలాగే   ...  ఇలాగే  

   జన్మిస్తూ   ఉంటాం.


• సాక్షి  వై  నావు   శివ

  సాక్షి  వై  నావు.

• మా లోని  మంచికి  ….  మా లోని  చెడు కి.

• సాక్షి   వై  నావు శివ

  సాక్షి    వై  నావు.


• పాపాల   ఫలితం     దుఃఖ మని ...

  పుణ్యాల  ఫలం       సుఖశాంతి   అని …

  చేసే    ప్రతి  కర్మకి    శివుడే    సాక్ష్యమని ...

  ఎవరికి  తెలుసు   …   ఎందరికి  తెలుసు.


• సాక్షి  వై   నావు   శివ

  సాక్షి  వై  నావు.

• మా లోని  మంచికి  ….  మా లోని  చెడు కి.



శివోహం    =    నేనే  శివుడిని .

మానవుడు  ఏనాడూ శివుడు  కాలేడు... కాడు. 

కానీ శివుని  యొక్క  శక్తి  మాత్రమే  స్వీకరించ గలడు.

పాపాఘ్నం  =   పాపం నశించింది.


యడ్ల శ్రీనివాసరావు  1 Sep 2024   10:00 AM.


549. ఏక బిల్వం శివార్పణం

  ఏక బిల్వం  శివార్పణం • ఏమి  నీ"దయ" శివా ! … ఏమి  నీ"దయ"   ఏది   నాదయా  హరా! … ఏది    నాదయా • మారేడు దళ మంటి   నా ...