శివరాత్రి
• శివరాత్రి అంటే తెల్లవారుజామున లేచి నదీస్నానం చేసి, శివుని దర్శనం చేసుకొని, ఉపవాసం తో , ఆ రాత్రి జాగారం చేస్తుంటాం . రాత్రి సమయంలో శివపార్వతుల కళ్యాణం ఆలయాలలో నిర్వహించడం శివరాత్రి విశిష్టత. భక్తి శ్రద్ధలతో భజనలు, ప్రార్థనలతో శివమయం అవుతుంది. శివుడు ఈ సృష్టికి మూలం . ఆది దేవుడు .
సృష్టి రహస్యం, స్థితి చేతన , లయ కారం వంటి శివుని జ్ఞాన యుక్తమైన విషయాలను నేటి మానవులు యధార్థ రీతిలో తెలుసుకో లేక పోతున్నారు. ఎందుకంటే నేటి మానవుని బుద్ధి ని వ్యర్ద ఆలోచనలు అల్లకల్లోలం చేస్తున్నాయి . ఏది సత్యం ఏది అసత్యం, ఏది అవసరం ఏది అనవసరం , అనే స్పృహ లేని నిర్ణయాలతో , అలజడులతో అనుదినం గడుస్తుంది.
ఉపవాసం : ఒకసారి ఆలోచించండి?
• ఉపవాసం అంటే ఖాళీ కడుపు తో ఉండడమా ?.. అలా చేస్తే పుణ్యం వస్తుందా? ఆకలితో ఉంటూ భగవంతుని ప్రార్ధిస్తే మనసు భగవంతుని పై లగ్నం అవుతుంది అనేది వాస్తవమా ? ఆలోచించండి.
• శివరాత్రి కి ఉపవాసం ఉండాలి అంటారు. నిజమే , కానీ ఉపయోగం, అర్థం ఏమిటో ఎవరూ చెప్పరు.
ఉప అనగా సమీపం, దగ్గరగా.
వాసం అనగా ఉండడం, నివసించడం.
ఉపవాసం అంటే, అన్య చింతన మాని , బుద్ది లోని మలినమైన ఆలోచనలను పూర్తిగా ఎండగట్టి , శివుని పై మనసు లగ్నం చేస్తూ, నేను శివునికి సమీపం గా ఉన్నాను లేదా శివునితో కలిసి నివసిస్తున్నాను అనే భావన అనుక్షణం కలిగి ఉండడం ఉపవాసం. దీనినే శివ స్మృతి మరియు ఉపవాసం అంటారు.
సాధారణంగా శివ స్మరణ నోటితో బిగ్గరగా చేయడం వలన కొంత సమయానికి అలసి పోవడం జరుగుతుంది. కానీ మనసు తో మౌనం గా శివ ధ్యాన స్మృతి చేస్తూ ఉంటే శక్తి మరింత పెరుగుతుంది.
ఇదే శివుని కి ఉప వాసి గా అయ్యే విధానం.
అంతే కాని, ఉపవాసం అంటే అన్న పానీయాలు మాని పండ్లు పాలు తీసుకో మని కాదు.
సాధారణంగా వారం లో ఒక పూట పూర్తిగా అన్నపానీయాలు మాని ఉపవాసం ఉండడం అనేది జీర్ణాశయానికి విశ్రాంతి కలిగి, శరీరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అని అర్థం.
అంతే కాని ఈ ఆహర ఉపవాసానికి, శివుని కి ఏ విధమైన సంబంధం ఉండదు. ఆహారం మాని నంత మాత్రాన శివుని కి చేరువ కాలేరు.
జాగరణం (జాగారం)
• శివరాత్రి జాగారం అంటే నిద్రపోకుండా మేల్కొని ఉంటూ, శివనామ స్మరణ చేయడం అంటారు.
ఒకసారి ఆలోచించండి, పూర్తిగా రాత్రి అంతా మెలుకువ గా ఉండడం మనిషి కి సాధ్యమా ? ఈ జాగరణం యొక్క మూలార్దం ఎవరు చెపుతారు ?
శివరాత్రి రోజున జాగారం అంటే, మనిషి లో ఉన్న ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, కామం, క్రోధం, అహం అనే పలు వికారాల, అజ్ఞానం అనే చీకటి నిద్రావస్థ నుంచి మస్తిష్కం , బుద్ధి లో స్పృహ ను మేల్కొలపడం . ఆది సనాతన దేవి దేవత ధర్మం లో భాగమైన, శివ ధ్యానం , శివ జ్ఞానం తో యోగ (అనుసంధానం) యుక్తం కాబడడమే జాగరణం. జాగరణం అంటే జాగృతం.
కేవలం నిద్ర మాని నంంతలో శివుని కి చేరువ కాలేరు.
శివరాత్రి
• వాస్తవానికి శివరాత్రి అనగా శివ జయంతి. జయంతి అంటే జన్మించడం. విచిత్రం గా ఉంది కదా…. శివుడు జన్మించడం ఏమిటి? అని.
అవును , సత్య త్రేతాయుగాలలో అందరూ దేవతా గుణాల తో ఉండడం వలన వారికి భగవంతుని అవసరం ఉండేది కాదు.
కానీ , ద్వాపర , కలియుగాలలో అందరూ మాయా వికారాలకు వశం అయి పూర్తిగా దుఃఖితులు గా అయి, భగవంతుని కోసం ప్రార్థిస్తూ, ముక్తి కోసం ఆర్తనాదాలు చేస్తారు. పరలోకంలో ఉన్న పరమాత్ముడైన శివుడు, తన సంతానం అయిన మానవ ఆత్మల కోసం భూమి పై అవతరించిన రోజు జ్ఞాపకార్థం గా ప్రతి సంవత్సరం శివరాత్రి జరుపుకుంటారు. అదే శివ జయంతి, శివరాత్రి.
రాత్రి అనగా చీకటి, అజ్ఞానం అని అర్థం. ఈ ప్రపంచంలో మానవులు ఏ నాడైతే అజ్ఞానం అనే చీకటి అంధకారంలో ఉంటారో , అప్పుడు శివుడు అవతరించి జ్ఞానం అనే వెలుగు తో దుఃఖ విముక్తి చేస్తాడు. ఇది యే శివరాత్రి రహస్యం.
శివరాత్రి కళ్యాణం
• పరమాత్మ శివుడు సద్గురువు, తండ్రి, టీచరు, ప్రియుడు. ఆ పరమాత్మ ను ఆకళింపు చేసుకున్న ఆత్మలు అనగా మానవులందరూ శిష్యులుగా, పిల్లలుగా, ప్రేయసి లు గా పిలవబడతారు.
• శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. శివుడు అనగా సృష్టి కర్త. పార్వతి అనగా శివుని లోనుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం తో ప్రాణం పోసుకొని జీవిస్తూ ఉన్నది జీవులైన మానవులు. అనగా శివుడు ప్రియుడు అయితే, మానవులు ప్రేయసిలు అవుతారు. వీరి కళ్యాణమే శివరాత్రి రోజున జరిగే కళ్యాణం. ఇది లోక కళ్యాణమే కానీ శివుని స్వకళ్యాణము కాదు.
ఈ కళ్యాణం యొక్క అర్దం, శివుని తో కలిసిన మానవుల యొక్క క్షేమం, సుఖం, శాంతి కోసం జరిగే లోక కళ్యాణం. అంతే కాని ఇది ఒక వివాహ కళ్యాణం వలే చూడరాదు.
శివ అంటే శుభం
• శివుడు జ్ఞానసాగరుడు . శాంతి కాముకుడు. మానవుడు భగవంతుని కోసం భక్తి చేస్తాడు. ఎంతో వ్యయ ప్రయాసలతో పూజలు, అభిషేకాలు చేస్తాడు.
• శివుని కి దోసెడు నీళ్లు పోస్తే సంతోష పడతాడు అంటారు. అదే విధంగా, శివుని కి జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం అంటారు. ఇటువంటి వి ఎన్నో చెపుతారు. కానీ వీటి సూక్ష్మ అర్దం ఎవరూ చెప్పరు.
నీరు సహజంగా లభిస్తుంది. ఏ ధనం వెచ్చించ లేని పేదవాడు కూడా శివ స్మరణ చేసినా శివుడు అభయం పొందుతాడు.
• అదే విధంగా, దేనికి ఉపయోగ పడని జిల్లేడు పువ్వులు మాదిరి ఎన్నో పాపాలు చేసిన , ఎందుకూ ఉపయోగ పడని నిర్భాగ్యుడు కూడా శివ స్మరణ చేస్తే పాపాలు తొలగుతాయి. ఎందుకంటే శివుడు శుభకరుడు . ఆయనకు మంచి చేయడం మాత్రమే తెలుసు. శివుడు ఎప్పుడూ ఎవరిని శిక్షించడు . ఎందుకంటే తండ్రి కి తన పిల్లల పై ప్రేమ మాత్రమే ఉంటుంది. దుఃఖం మరియు శిక్షలు అనేవి మానవులు తాము జన్మాంతరాలుగా చేసిన కర్మల ఫలితాలు. వాటికి శివుడు తన ఎప్పుడూ బాధ్యత వహించడు .
శివుని భక్తి శ్రద్ధలతో పూజించండి. భక్తి ద్వారా ఏది ఎందుకు చేస్తున్నామో అర్ద సహితంగా తెలుసుకో గలగాలి. శివ తత్వం అంటే ఏమిటో తెలుసుకొని ఆచరించడం మనిషి కి మోక్షం.
శివ ధ్యానం చాలా శ్రేష్టం. శివుని ద్వారా త్రిమూర్తి సృష్టిలో భాగమైన, శంకరుడు నిత్యం ధ్యాన ముద్రలో నే ఉంటాడు. దీని అర్థం జ్ఞాన ధ్యాన యోగం ద్వారా శివ సాధన సిద్ధిస్తుందని అర్దం.
శరీరం అశాశ్వతం. నదీ స్నానం చేయటం వలన శరీరం శుద్ది అవుతుంది.
ఆత్మ శాశ్వతం. శరీరం లోపల ఉండే ఆత్మ, మనసు, బుద్ధి , సంస్కారం శుద్ధి కావాలంటే శివుని జ్ఞాన సాగరం లో స్నానం చేయాలి.
✍️ On the way to Mount Abu . . .
మహా దేవుని శివరాత్రి శుభాకాంక్షలు
ఓం నమఃశివాయ 🙏.
ఓం శాంతి.
యడ్ల శ్రీనివాసరావు 20 Feb 2025, 7:00 AM.
+91 9293926810.
No comments:
Post a Comment