Monday, October 19, 2026

791. మోసం చేయని మనిషి

 

మోసం చేయని మనిషి


మోసం చేయని మనిషి ఉంటాడా ? 

మో‌సపోని మనిషి అంటూ ఉంటాడా? 

ఈ రెండింటి కి అతీతం గా  ఏ మనిషైనా  జీవించ గలడా ?


ప్రతి మనిషి ఏదొక సందర్భం లో తప్పని సరిగా మరో మనిషి ని  ఏదోక సమయంలో ఏదో విధంగా మోసం చేయక మానడు . ఇక్కడ మోసం చేయడం, మోసగింపబడడం రెండు జరుగుతూ నే ఉంటాయి . ఎందుకంటే ఇది కలికాలం అంటే మాయా కాలం, పాపాల కాలం .


ఈ మోసాలు అనేవి అతి సాధారణంగా మనుషుల మధ్య జరుగుతాయి. ఎందుకంటే మనిషి తో మరో మనిషి కి ఉన్న అవసరం అటువంటిది. ఈ అవసరాల పై ఆధారపడి బంధాలు , జీవనాలు కొనసాగుతున్నంత కాలం మోసం అనేది జరుగుతూనే ఉంటుంది . ఇందులోనే ద్రోహం అనేది ప్రధాన భూమిక .


మోసం అనేది  ధనం తో నో, వస్తు రూపం తోనో కర్మలతో మాత్రమే జరిగేది కాదు . మనసు తో మోసం , మాటలతో మోసం , ఆలోచనల తో మోసం . అసలు మోసం అనే ప్రక్రియ ఆరంభం అయ్యేది ఈ మూడింటి తోనే.


ఇవి ఇతరుల పట్ల అవలంబిస్తున్నప్పుడు ముందు గా జరిగేది మనిషి తనను తాను మోసం చేసుకోవడం. ఏ మనిషైతే తనను తాను బాగా మోసం చేసుకోగలగడం లో ఆరితేరి ఉంటాడో అప్పడే  ఇతరులను అవలీల గా మోసం చేయగలడు . 


చిత్రం ఏమిటంటే …. నేను చేస్తున్నది మోసం, తప్పు అనే విషయం బుద్ధి గ్రహించకుండా నే మోసం చేయడం కలియుగం లోని మనిషికి , సహజ లక్షణం గా ఉంటుంది . 

విచిత్రం ఏమిటంటే . . . ఇదే మనిషి ఎవరి నుంచైనా మోసపోయినపుడు మాత్రం సహించలేడు, ఆ మోసాన్ని తట్టుకోలేడు . తాను మోసపోయానని స్పష్టం గా గ్రహిస్తాడు .

ఇతరుల పట్ల తాను చేస్తున్నది ఏ మాత్రం తప్పు కాదు కానీ . . . అదే తన పట్ల జరిగితే చాలా అమానుషం అని మనిషి భంగపడతాడు.  మనిషి తన తలపై పాపభారం పెంచుకోవడానికి ఇది ఒక కనిపించని స్థితి . 

దీనినే మాయా ప్రభావం అంటారు. 


అసలు ఒక మనిషి కి తాను ఇతరుల పట్ల చేస్తున్నది మోసం అని స్వయం గా ఎప్పుడు తెలుసుకోగలడు ? 

మానవుడు మోసం చేయడం అనే అలవాటు నుంచి ఎప్పుడు అయితే విడుదల అవుతాడో , ధర్మ బద్ధం గా నడుచుకోవడం ఎప్పుడైతే ఆరంభిస్తాడో  అప్పుడే , అంతకాలం తాను ఎంతో మంది ని ఎన్నో విధాలుగా మోసం చేసానని తెలుసుకొని అంగీకరించడం మొదలు పెడతాడు . ఇక ఇతరులను ఏ విధంగా కూడా మోసం చేయకూడదు అని నిర్ణయించుకోగలడు . ఈ దశలో ఒకవేళ ఎవరైనా తనను మోసం చేస్తున్నారని లేదా మోసం చేసారని మనిషి కి తెలిసినా సరే తనకు బాధ, కోపం , దుఃఖం వంటివి కనీసం కలగవు . ఎందుకంటే గతంలో అవన్నీ తాను చేసాడు కాబట్టి, అవి తిరిగి తనకు బదులుగా వస్తున్నాయని తెలుసుకుంటాడు . 

ఏదొక దశలో ఇవన్నీ కూడా ఆగిపోతాయని ఆ మనిషి కి అర్ధం అవుతుంది. ఎందుకంటే తాను ప్రస్తుతం ఇతరుల ను మోసం చేయడం ఆపివేశాడు కాబట్టి. 


నేటి కాలంలో , మోసం అనేది బయట ఎక్కడో మార్కెట్లో , వ్యాపారాల్లో మాత్రమే జరగడం లేదు . అసలైన మోసం మనిషి తాను జీవిస్తున్న గృహం నుంచి మరియు తన మనసు నుంచే మొదలవుతుంది . 

ఒక కుటుంబం లో భార్య భర్త కూతురు కొడుకు తల్లి తండ్రి ఇలా అనేక మంది సభ్యులున్న , నేటి గృహస్థ వాతావరణం లో ఎవరి స్వేఛ్ఛ వారిది అనే విధంగా ప్రవర్తించడం ఎప్పుడైతే ఆరంభం అయిందో , అప్పటినుంచి ఎవరి ఇష్టా ఇష్టాలు వారివి, ఒకరితో మరొకరికి పొసగని ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనలు. ఇలాంటి వాతావరణంలో కలిసి ఒక కుటుంబం , మనుషుల జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో , బంధాలలో కొనసాగుతున్న వారంతా ఒకరు మరొకరి తో నిజాయితీగా కొంతమేరకు అయినా ఉండగలరా ? . . . ఉంటున్నారా? . అంటే సందేహమే.

మాటలలో చేతలలో ఆలోచన లలో ఒకరి పట్ల మరొకరు మోసం చేసుకోకుండా జీవించగలుగుతున్నారా ? సాధ్యం అవుతుందా ? . . . ఆలోచించండి.  

మనుషులు తమ శరీరం , మనసు రెండింటి పై నియంత్రణ కోల్పోయి జీవిస్తున్న రోజులు ఇవి . ఇందుకు ప్రధాన కారణం , ఇంటర్నెట్ , సెల్ ఫోన్, టి.వి , వాటిలో విచ్చలవిడిగా ఉండే ఆకర్షణల ప్రభావం .  మనిషి లో ఉండే తమో, రజో గుణాలు వీటికి ప్రధాన కారణం.

 గమనిస్తే నేడు టి.వి సీరియల్స్ ద్వారా చూపిస్తున్న కధలలో  మనుషుల తత్వాలను  బహిరంగ వ్యభిచారం  కుటుంబ  మోసాలను చేయడం వంటివి ఎలా slow poison వలే inject చేస్తారో , చెడు ను మంచిగా చూపిస్తూ ఎంత నైపుణ్యంతో చిత్రీకరణ చేస్తారో , వాటి పట్ల ఎంతమంది ఆకర్షితులై చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా చూస్తున్న మనిషి లోనే వీటి ప్రభావం నిల్వ అవుతుంది. పిదప ఆయా కుటుంబాల నుంచే ఆచరణ మొదలవుతుంది. 

దీనంతటని ఆపడం నేడు ఎవరి తరం కాదు. ఎందుకంటే సృష్టి వినాశనం, మానవ వినాశనం జరగవలసింది ఈ మాయాజాలం , ఇంటర్నెట్, వీడియో కమ్యూనికేషన్ ఈ రంగాల నుంచే కాబట్టి.

ఇది ఇప్పటి కే దాదాపు 35 సంవత్సరాల క్రితం నుంచి సమాజం లో , ప్రతి మనిషి లో విస్తృతంగా పెనవేసుకుంది . 


ఇవన్నీ లేని రోజుల్లో మనుషులు ఎంతో ఆనందం గా కుటుంబంతోను , విలువలతోను , సమాజం లో ఒకరి పట్ల మరొకరు సహయ సహకారాలతో ను , ప్రేమతోను జీవించే వారు . ఈ విషయం నిజమో కాదో ఒకసారి మన పెద్దవారిని అడిగితే తెలుస్తుంది. నేడు 40-50 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ, తమ బాల్యం లో ఎంతో ఆనందమైన కుటుంబ జీవితం గడిపేవారు. ఆస్తిపాస్తులు లేక పోయినా , పెద్ద పెద్ద కుటుంబాలు కలిగి ఉన్నా సరే విలువలు, తోటి మానవులందరి పట్ల సుహృద్భావంతో  జీవించే వారు. మోసాలు , వంచన చేయడం అంటే మహా పాపం అని చిన్న వయసు నుంచే, కుటుంబ వాతావరణం నుంచే ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకునే వారు. 

కానీ నేటి కాలంలో ఆ మహా పాపం సర్వ సాధారణం అనుకునే స్థితి కి ప్రతి మనిషి ఆలోచన దిగజారి పోవడం విచారకరం.


నేటి కాలంలో , మానవుని అంతరంగం లో విస్తృతంగా పాతుకు పోతున్న విషపు సంస్కారాలు , సమాజం కుటుంబ విలువలు , వ్యవస్థలు రోజు రోజుకు పతనం అవుతున్న తీరు , పెద్దవారు మరియు తల్లి తండ్రుల పట్ల గౌరవ మర్యాదలు లేని పిల్లలు ప్రవర్తన వంటివి చూస్తున్నప్పుడు ఆవేదన కొద్దీ రాసిన రచన. అంతకు మించి మనుషుల వ్యక్తిత్వాలను వేలెత్తి చూపేందుకు కాదు 🙏. 


మార్పు రావాలి అంటే అది మనిషి లోనే రావాలి కానీ సమాజం లో కాదు . బలహీనతలను జయించి మానసిక దృఢత్వం కలిగిన నాడే మనిషి లో మార్పు సాధ్యం.

బహుశా మానవ జాతి మరలా మరో యుగం లోనే ఇదంతా చవి చుడగలదేమో. 

ప్రతి మనిషి భగవంతుని అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ, ఎన్నో మార్గాల ద్వారా వెతుకుతూ ఉంటాడు . కానీ తన (ఆత్మ)  లోని చెడు గుణాలు అనే మలినాలను క్రమేపీ తొలగించు కున్న  నాడే  ఆ ఫలితం సిద్ధిస్తుంది .   


దసరా " దస్ హర" . పది రాక్షస గుణాలైన  కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యము ఈర్ష్య ద్వేషం అసూయ మోసం వంటి  రావణాసుర గుణాలను మనిషి హరింప చేసుకొని సంతోషంగా శాంతి గా సుఖం గా జీవించడమే దసరా . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 19 Oct 2026 6:00 PM.

No comments:

Post a Comment

791. మోసం చేయని మనిషి

  మోసం చేయని మనిషి మోసం చేయని మనిషి ఉంటాడా ?  మో‌సపోని మనిషి అంటూ ఉంటాడా?  ఈ రెండింటి కి అతీతం గా  ఏ మనిషైనా  జీవించ గలడా ? ప్రతి మనిషి ఏదొ...