అంతరంగం - పరివర్తన
(Contiousness - Transformation)
• నా వయసు 50 సంవత్సరాలు. ఒక రోజు ఇంటిలో ఎవరూ లేరు. ఉదయం నుంచి ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో ఏకాంతంగా ఉన్న ఆ సమయంలో నన్ను నేను చూసుకోవాలి అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలు అయింది. ఎలాగూ ఎవరూ లేరు కదా అని, చల్లనీళ్ల తో ముఖం శుభ్రంగా కడుక్కుని నిలువుటద్దం ముందు కూర్చున్నాను . గది నిండా లైటు వెలుగు చాలా కాంతి వంతంగా ఉంది.
• నేను అద్దం ముందు కూర్చుని, ఒక పది నిమిషాలు కళ్లు మూసుకుని, నెమ్మదిగా కళ్లు తెరిచి చూస్తున్నాను.….. ఎందుకో గది నిండా కాంతి ఉన్నా, అద్దం లో మాత్రం కాంతి కొంచెం తక్కువగా అనిపిస్తుంది .….. అయినా నా ముఖాన్ని అద్దంలో ఏకాగ్రత గా చూస్తూ ఉన్నాను , నా ముఖం చాలా అందంగా కనపడుతుంది. అలాగే రెప్ప వేయకుండా చూస్తున్నాను.
• ఇంకొంచెం సేపు సూక్ష్మం గా , తీక్షణంగా నా ముఖం పై ఉన్న చర్మాన్ని చూస్తుంటే అక్కడక్కడ కొంచెం తెల్లగా, కొంచెం నల్లగా, చర్మం పై మచ్చలు , సవ్యత లేని ముక్కు, పెదవులు, రోమాలు, చిన్న రంధ్రాలు, ఎత్తు పల్లాల నుదురు, కనుబొమ్మలు, తలపై నెరిసిన, ఊడిన వెంట్రుకలు, నా కళ్లకు ఇదివరకు లేనంత స్పష్టం గా సూక్ష్మం గా అన్నీ కనిపిస్తున్నాయి.
• అలా పదినిమిషాలు గమనించిన తరువాత నాలో చిన్న ఆందోళన మొదలైంది. కాసేపు మరలా కళ్లు మూసుకుని నెమ్మదిగా తెరిచి , అద్దం లో ఉన్న నన్ను నేను చూసుకున్నాను.
• అలా చూస్తూ ఉండగా నే , నా మనసు నాతో ఏదో చెపుతోంది….. నువ్వు అందం, అందం అని ఆశపడే ఆనందం, ఎటువంటిదో తెలుస్తుందా. నీ అందం నీకు నిజం గా ఆనందం ఇస్తుందా … లేక నిన్ను ఆనందం లో ఇన్నాళ్లు భ్రమించేలా చేసిందా . నీ ఈ అందం చిన్న వయసు లో ఒకలా, యవ్వనంలో మరోలా, యుక్త వయసు లో ఇంకోలా, రకరకాలుగా మారుతూ, నిన్నే మాయ చేసి మోసం చేస్తుందేమో ఒకసారి ఆలోచించు …. ఎందుకంటే ఈ అందాన్ని చూసుకుని, ఆనందం తో, గర్వం తో , నువ్వు రంగుల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. పగలనక, రేయనక ఎంతో ధనం వెచ్చించి ఎన్నో ఆలోచనలతో అందాన్ని రక్షించుకున్నావు. మరి ఎందుకు నేడు నీ అందాన్ని సూక్ష్మం గా, నిశితంగా అద్దం ముందు చూస్తుంటే, నీ అందం వెలితిగా నిన్ను వెక్కిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా నిన్ను మోసం చేసినట్లు గా అనిపిస్తుంది. ఆలోచించి చూడు సమాధానం దొరుకుతుందేమో…. ఒక్కసారి గా ఉలిక్కిపడి నా మనసు లో నుండి నేను బయటకు వచ్చి, అద్దం ముందు కూర్చుని ఉన్న నన్ను నేను తేరిపార చూసుకున్నాను.
• ఆ నిశ్శబ్ద మైన రాత్రి సమయంలో, ఇంకో పదినిమిషాలు అలా అద్దం ముందు కూర్చుని నన్ను నేను ఇంకా సూక్ష్మం గా చూసుకుంటూ, నా మనసు నాతో మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాను … కొన్ని క్షణాలకి అద్దం నవ్వుతూ నా ఆలోచనలకు, మనసు లోని ప్రశ్నలకు, సమాధానం ఇవ్వడం ప్రారంభించింది…
• అద్దం ముందు కూర్చుని ఉన్న ఓ జీవి …. పైకి కనిపించే నువ్వు ఒక అబద్దం. పైకి కనపడకుండా లోపల దాగి ఉన్న మరొక నువ్వు నిజం …. నిజం ఎప్పటికీ నిజమే. నిజాన్ని దాయలేము, ఆపలేము. కాని నువ్వు ఒక నిజం అని పూర్తిగా మరచి పోయి, పైకి కనిపించే అబద్ధం తో కలిసి పుట్టినప్పటి నుండి జీవించడం మొదలు పెట్టావు. నీ లోని ఈ అబద్ధానికి నిలకడ లేదు. వయసు, పరిస్థితులు, అవసరాలు బట్టి ఎన్ని వేషాలు అయినా వేస్తుంటావు. అదే పైకి కనిపించే నువ్వు, నీ మాయ, నీ అందం, నీ శరీరం.
• మరి నీలో కనపడకుండా దాగి ఉన్న మరో అసలైన నువ్వు ఒక నిజం. ఆ నిజం పేరే ఆత్మ, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న వెలుగు నిండిన జ్యోతి బిందు రూపం. ఒక్కసారి నీలోని నిజాన్ని నువ్వు కళ్లు మూసుకుని స్పష్టం గా చూడు, ఇన్నాళ్లు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, నీ పరిసరాలను కలుషితం చేసుకుంటూ జన్మ జన్మలు గా నువ్వు ఎవరో ... ఏంటో ... తెలియక ఎలా జీవిస్తూ వచ్ఛావో తెలుసుకుంటే, నీ మీద నీకే జాలి, సిగ్గు వేస్తుంది.
• ఓ మనిషి … నీ లో ని నిజం అనే ఆత్మ ను దాచో లేక తెలియకో నీవు జీవిస్తూ వచ్చావు. అయినా సరే, అప్పుడప్పుడు కొన్ని సమయాలలో నీ ఆత్మ అనే నిజం నిన్ను హెచ్చరిస్తూనే ఉంది. అయినా అది నువ్వు గ్రహించలేక అబద్ధం అనే మాయకు అలవాటు పడిపోయి , దానితో కలిసి అదే హాయి అనుకొని జీవిస్తున్నావు. అన్ని జీవాల వలే నీవు కూడా రక్త మాంసాలు , ఎముకల తో తయారయిన జీవివి. కాకపోతే నీవు పైకి అబద్ధం లో (మాయ) చిక్కుకొని, మరుగు పడిపోయిన నిజం(ఆత్మ) తో ఉన్నావు.
• నీవు భుజించే మాంసాహారం యొక్క జీవి గురించి ఒకసారి ఆలోచించు, వండేటపుడు చర్మం, మాంసం, రక్తం, ఎముకలు, గుండె, కాలేయం, ప్రేగులు అన్నీ కనిపిస్తుంటే శుభ్రం చేసి కాల్చి ఆనందంగా తింటావు. మరి అలాంటి అవయవాలు శరీర భాగాలు నీలో, లో లో అదే పనితీరు తో ఉన్నాయని ఎప్పుడైనా గమనించావా. ఇదంతా నిజమే అని నీలో నిజానికి తెలిసినా , నువ్వు ఇంకా అబద్ధం తోనే కలిసి తింటూ బ్రతుకుతున్నావు.
నీ చుట్టూ ప్రకృతిలో ఉన్న నిజాన్ని కూడా, నీ లోని మాయతో ముసుగు వేసి జీవిస్తున్నావు. అదే విధంగా నువ్వు ప్రేమను పెంచుకున్న శాశ్వతం కాని నీ అందం, నీ శరీరం కూడా నేడు ముడతలతో, మచ్చలతో కళ కోల్పోతున్నా , నీ మమకారం, వదులుకో లేక బాధ పడుతున్నావు. నీలో నీకు కనపడుతున్న దానిలో ఏది నీకు శాశ్వతం?
• పైకి కనిపించే నువ్వు ఒక అబద్ధం. ఇకనైనా ఈ అబద్ధాన్ని విడిచి పెట్టి. నీ లోపల ఉన్న నిజం తో కలిసి జీవించడం మొదలు పెట్టు … అదే నీ అసలు సిసలైన అందం … అదే ఆత్మ సౌందర్యం ... జన్మ జన్మల కి తరగని సహజసిద్ధమైన తేజోవంతమైన అందం. ఈ అందం లో పూర్తి గా నిండి ఉన్నది అనంతమైన వెలుగు ... నీలో ని వెలుగు చీకటిని, ఇంకా చీకటి లో ఉన్న వారందరికీ దారి చూపిస్తూ వెలుగు నింపుతుంది.
ఓ మనిషి ఇదే నీ అందం … నీ నిజం …. నీ ఆత్మ.
• అద్దం ఇదంతా నాతో చెప్పి , మౌనంగా ఉంది. ఆ సమయంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. నా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసాలు నాకు నెమ్మదిగా వినిపిస్తున్నాయి.
• అద్దం లో కనపడుతున్న నా ముఖం లోని కంటి నుంచి నీరు సన్నగా కారుతూ చెక్కిళ్ల ను తాకుతుంది.
• కానీ, అద్దం ముందు కూర్చుని ఉన్న నా కళ్లు పొడిగా నే ఉన్నాయి …. ఆగలేక చేతితో అద్దం లో కనిపిస్తున్న నా నిజ రూపం యొక్క కళ్లను తుడవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను పైకి కనిపించే అబద్ధం (మాయ) కాదు.
యడ్ల శ్రీనివాసరావు 5 Jan 2023 , 2:00 PM.
No comments:
Post a Comment