ఒక ప్రయాణం (A Journey)
1
• భారతదేశానికి తూర్పు కనుమలలో ఉన్న నేపాల్. చుట్టూ పర్వతాలు, లోయలు , దూరంగా హిమాలయపర్వతాలు. ప్రకృతి అంతా ఇక్కడే పుట్టిందా, అన్నట్లు ఒక వైపు మంచు తో కూడిన చల్లదనం మరోవైపు సూర్యుని నుని వెచ్చని సూర్యోదయం తో , పక్షుల అరుపులు. పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి జీవించే మనుషుల తో, అది నేపాల్ సమీపం లో ఒక చిన్న గ్రామం.
• అది ఏ కాలమో తెలియడం లేదు, కానీ చాలా ప్రాచీన కాలం. అది రాజుల కాలమో లేక అంతకు ముందు కాలమో సరిగా తెలియడం లేదు. కానీ అప్పటి కే బుద్దుడు ఆ ప్రాంతంలో సంచరించాడు. బౌద్ధ మతం ఆచరణలో ఉంది.
• ఆ గ్రామానికి కాస్త దూరంలో , అటవీ ప్రాంతం ఉంది. అక్కడ ఒక అతి ప్రాచీన పురాతన శివాలయం ఉంది. ఆ శివాలయం లో సుమారు 45 సంవత్సరాల వ్యక్తి, చూడడానికి ముఖం కవళికలు పూర్తిగా నేపాలి లా ఉన్నాడు, కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను తడిగుడ్డతో శివాలయం గర్భ గుడి, బయట మెట్లు, మరియు దేవాలయ స్థంభాలు తుడుస్తున్నాడు. విచారంగా ఏదో ఆలోచిస్తూ, మదనపడుతూ ఆ పని చేస్తున్నాడు.
• కొంత సమయం తరువాత, ఆ వ్యక్తి గర్భ గుడి గుమ్మం బయట మెట్ల మీద కూర్చుని శివలింగం వైపు దీనంగా చూస్తూ బాధపడుతున్నాడు. ఆసమయంలో, ఆ ప్రాంతంలో ఆ ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ లేరు. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఆ వ్యక్తి మనసు లో , తనలో తానే బాధపడుతూ శివుని చూస్తూ, శివుని తో మాట్లాడుతున్నాడు. చూడు నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు. ఒక్కరూ కూడా నిన్ను చూడడానికి రావడం లేదు. అదేదో మతం అంటా( బహూశా బౌద్ధ మతం అయి ఉంటుంది) , అది వచ్చాక నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. చూడు ఇదంతా ఎలా పాడు పడిపోయి ఉందో , అని శివుని తో అంటూ వెక్కి వెక్కి విపరీతంగా ఏడుస్తున్నాడు.
• అప్పుడు సమయం తెల్లవారుజామున 3:00 గంటలు…. అప్పటికే ఏడ్చి ఏడ్చి ముఖం, చెంపలు అంతా కన్నీళ్ళు తో తడిచి పోయి ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, బరువు గా ఉంది. శరీరం అచేతనంగా ఉండి, కొంత సమయానికి మాములు గా అయింది.
• కానీ ఆ ప్రదేశం, కళ్ల ముందు ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ శివాలయం కూడా నేటికీ నేపాల్ లో ఉంది.
2018 లో అనుభవం.
🙏🙏🙏
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
2
• అర్దరాత్రి సమయం, సముద్ర తీరం, చందమామ వెన్నెల్లో సముద్రపు అలలు తెల్లగా మెరుస్తూ ఉరకలతో , హోరున శబ్దం చేస్తున్నాయి. ఆ సముద్ర తీరం లో ఇసుకలో ఒక వ్యక్తి, వ్యక్తి తో పాటు ఒక స్త్రీ జతగా నడుచు కుంటూ వెళ్తున్నారు . చంద్రుని వెన్నెల నీడ వారికి స్పష్టం గా కనిపిస్తూ , దారి చూపిస్తుంది. అలల హోరు, చల్లని గాలి , వెన్నెల, ఇసుక తిన్నెలు అంతా చాలా అద్భుతమైన ప్రకృతి తో ఉంది ఆ సమయం. అక్కడ వారు ఇద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు.
• అలా వారు చాలా దూరం ఇసుక లో నడిచి వెళ్లిన తరువాత సముద్ర తీరం లోనే, ఇసుక తిన్నెలు లో దూరం గా , ఒక అతి పెద్ద విశాలమైన, పురాతనమైన రాజు కోట చుట్టూ చాలా ఎత్తైన బురుజు, సగం శిధిలమై మిగిలినది శిధిలావస్థలో ఉంది. ఆ బురుజు లోపలి కి నడుస్తుంటే కాలి కింద ఇసుక, కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తరువాత , ఒక పాడుబడిన దేవాలయం, పైకప్పు (స్లాబ్) పూర్తిగా లేదు. చుట్టూ ఉన్న గోడలు శిధిలావస్థలో ఉన్నాయి. చంద్రుని వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఉంది. ఆ నాలుగు గోడల మధ్య విష్ణు మూర్తి విగ్రహం , ఆ విగ్రహం ముందు అటు ఇటు రెండు అఖండ దీప జ్యోతులు , విపరీతమైన వెలుగు తో వెలుగుతున్నాయి. ఆ వ్యక్తి , అతనితో ఉన్న స్త్రీ విష్ణు మూర్తి విగ్రహం ఎదురుగా గుమ్మం మెట్లు ముందు అటు ఇటు కూర్చుని , పరవశంతో రెండు చేతులు జోడించి ఆనందం తో ఇద్దరూ ఏడుస్తున్నారు. ఒకవైపు వెన్నెల, మరోవైపు దీప జ్యోతులు తో ఆ ప్రదేశం తెల్లగా, ఎర్రగా అద్భుతంగా ఉంది.
• గుటక దిగడం లేదు. కళ్లు తెరిచి చూస్తే అర్దరాత్రి 3 గంటల సమయం. అసలు ఏంటి ఇది కలా అనుకొని పడుకొని, మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత , మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ తెరిచి చూస్తే, ఆశ్చర్యంగా exact గా అదే దేవాలయం వీడియో లో కనిపించింది. అది ప్రపంచంలో నే మొట్టమొదటి అతి పెద్ద పురాతనమైన విష్ణు దేవాలయం కాంబోడియా లో శిధిలావస్థలో ఉందని, అది సముద్ర తీరానికి దగ్గరగా ఉందని, అది ఈ యుగం నాటి దేవాలయం కాదని, పూర్వం కాంబోడియా భారతదేశంలో అంతర్భాగంగా ఉండేదని, కాలక్రమేణా భూభాగం చీలి పోయి ఆప్రాంతం నేడు కాంబోడియా దేశమని అందులో ఉంది.
• సరిగ్గా అదే రోజు సాయంత్రం, చాలా రోజుల నుంచి అసలు కమ్యూనికేషన్ లేని ఒక మిత్రుడు , ఆ దేవాలయపు ఫోటోలు దాదాపు ఒక పది నాకు వాట్సాప్ లో షేర్ చేసాడు.
2019 లో అనుభవం.
🙏🙏🙏
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
3
• అది ఇద్దరు భార్యాభర్తలు ఉన్న చిన్న కుటుంబం,. భర్త ఆ ఊరి జైలు లో జైలర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య అంటే పంచ ప్రాణాలు. ఉద్యోగం చేసే సమయంలో కూడా ఇంటి దగ్గర ఉన్న భార్య గురించి ఆలోచించిస్తూ, డ్యూటీ ఎంత త్వరగా అయిపోతుందా…ఇంటికి వెళ్ళి భార్యను చూడొచ్చు అనుకునే వాడు. పెళ్లి అయి పది సంవత్సరాలు అయినా అతనికి తన భార్య పై ప్రేమ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే తన భార్య కి కూడా అతనంటే అంత ఇష్టం.
• తన భార్య కి కధలు, కవితలు, పాటలు అంటే చాలా పిచ్చి ప్రేమ. భర్త ఇంటికి రాగానే, ఆమె నవ్వారు పట్టి మంచం పైన కూర్చుని, పక్కనే తన భర్త ని కూర్చుమని , మాగజైన్ పుస్తకాల్లో కధలు, కవితలు భర్త చేత చదివి వినిపించుకుంటూ అతని ఒళ్లో పడుకుని నిద్ర పోయేది. ఒకోసారి ఆమె పాటలు పాడి భర్తకు వినిపించి సంతోష పడేది. అప్పుడప్పుడు మాగజైన్ పుస్తకాల్లో కధలు కాకుండా, తన భర్త ని సొంతం గా కధలు చెప్పమని, ఏమైనా ప్రేమ కవితలు చెప్పమని అడిగేది. రోజు చదివి వినిపించే అనుభవం వలన, అతను ఏదో తనకు తోచినవి ప్రేమ గా చెపుతూ ఉండేవాడు.
• భర్త జైలు లో డ్యూటీ కి వెళ్లినా, రాను రాను ఆలోచిస్తూ భార్య కోసం కధలు , కవితలు ఖాళీ సమయంలో రాసి పెట్టుకుని, ఇంటికి వెళ్ళిన తరువాత భార్యకు వినిపిస్తూ, సాహితీ ప్రియుడు గా మారిపోయాడు. అతనికి తన భార్య మీద ఉన్న అమితమైన ప్రేమ వలన , కధలు కవితలు సొంతం గా రాయడం సాధ్యం అవుతున్నాయని తెలుసుకొని చాలా సంతోషించే వాడు. ఆ భార్యాభర్తల జీవితం పూర్తిగా ప్రేమ మయం గా ఉండేది.
• ఒకరోజు భర్త ఇంటికి వెళుతుండగా రోడ్ యాక్సిడెంట్లో ఆకస్మికంగా మరణించాడు. మరణిస్తున్న సమయం లో కూడా కాళ్లు చేతులు కొట్టుకుంటూ, “ నా భార్య … నా భార్య “ అంటూ తన భార్య గురించి ఆలోచిస్తూ, తన ప్రాణం విడిచిపెట్టాడు.
• ఒళ్లంతా చెమటలు, చేతులు, కాళ్లు కదపలేకుండా ఉన్నాయి. కాస్త పెనుగులాట జరిగిన తరువాత నెమ్మది గా కళ్లు తెరిచి చూస్తే, అర్దరాత్రి 2 గంటల సమయం అయింది. మంచం పై పడుకొని ఉన్నాను.
2021 లో అనుభవం.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
4
• అది ఒక ఊరికి దూరంగా ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీ. ఆ కాలేజీ లో వాసు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. లెక్చరర్ గా పిల్లలకు పాఠాలు బాగా చెపుతాడని ఆ కాలేజీలో వాసుకి మంచి పేరు , గౌరవం ఉన్నాయి. వాసు కి 28 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా పెళ్లి కాలేదు. విద్యార్థులు, తోటి లెక్చరర్స్ కూడా వాసు యెక్క ఆకారం, అందం, ఎత్తు, ప్రవర్తన విధానం చూసి చాలా అభిమానించే వారు.
• వాసు రోజు మధ్యాహ్నం స్టాఫ్ రూం లో మిగిలిన లెక్చరర్స్ తో కూర్చుని, సరదాగా మాట్లాడుతూ లంచ్ చేసేవాడు. వాసు లో ఆదర్శ భావాలు కొంచెం ఎక్కువ గా నే ఉండేవి.
• ఒకరోజు అదే కాలేజీలో కమల అనే యువతి లెక్చరర్ గా జాయిన్ అయ్యింది. వాసు, కమల రోజు లంచ్ సమయంలో స్టాఫ్ రూం లో అందరితో పాటు కూర్చుని లంచ్ చేసేవారు. కానీ ఏ రోజు మాట్లాడు కునే వారు కాదు. ఎవరి పని వారిది అనేటట్లు ఉండేవారు. కానీ కమలకి వాసు ని చూసిన వెంటనే, ఏదో ఎన్నాళ్ళు నుంచో పరిచయం ఉన్న వ్యక్తి లా అనిపించేది. కమలకి ఈ స్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. కానీ కారణం తెలిసేది కాదు. వాసు మాత్రం మాములు గా నే ఉంటూ తన పని తాను చూసుకునే వాడు.
• కొన్నాళ్ళు తరువాత , కమలకి వేరే కాలేజీలో వసతి సదుపాయం, ఎక్కువ జీతం తో ఉద్యోగం దొరికింది. ఆ కొత్త కాలేజీ కూడా ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీ కి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రోజు కమల తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి , ఎందుకో వాసు తో చెప్పి వెళ్ళాలని అనుకొని స్టాఫ్ రూం లో కి వచ్చింది. వాసు స్టాఫ్ రూం లో కూర్చుని తల దించుకుని పరిక్ష పేపర్లు కరెక్షన్ చేస్తున్నాడు.
• కమల వాసు దగ్గరకు వచ్చి, సర్ వాసు గారు….సర్ వాసు సర్ అని రెండు సార్లు కొంచెం తడబడుతూ పిలిచింది. వాసు నెమ్మదిగా తల ఎత్తి చూసి,. ఆ ఆ చెప్పండి కమల మేడం అన్నాడు. కమల సర్ మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి, కొంచెం కారిడార్ లోకి వస్తారా అంది. తప్పకుండా, పదండి అన్నాడు వాసు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు సమయం. ఆకాశం మేఘావృతమై , చల్లని గాలులు తో వర్షం కురవడానికి సిద్దం అవుతుంది. వాసు కమల ఇద్దరూ కారిడార్ లోకి వచ్చి నిలబడ్డారు.
• కమల వాసు తో అంటుంది. సర్.. నాకు ఇక్కడే దగ్గర లో ఉన్న మరో కాలేజీ లో ఉద్యోగం దొరికింది. అకామిడేషన్ కూడా కాలేజీ హాస్టల్ లో నే. నాకు ఎందుకో తెలియదు మీతో చెప్పి వెళ్ళాలని అనిపించింది. మీతో నేను ఏ రోజు మాట్లాడక పోయినా, మీరు బాగా తెలిసి నట్లు అనిపిస్తుంది. కారణం తెలియదు. ఉంటానండి వాసు సర్ ….. అని చెప్పి వెళ్ళిపోతూ, కాస్త దూరం వెళ్ళాక వెను తిరిగి చూసింది. వాసు అలా నిలబడి కమల ను చూస్తున్నాడు.
• ఆ తరువాత నుంచి వాసు కి, కమల అస్తమాను గుర్తు వచ్చేది. వాసు మనసు లో అనుకునే వాడు, అసలు తానెందుకు కమల గురించి ఆలోచిస్తున్నాడు అని. సమాధానం దొరికేది కాదు. పోనీ కమల ను నేనేమైనా ప్రేమిస్తున్నానా అని అనుకునే వాడు. మరలా అటువంటిది ఏమీలేదు అని సరిపెట్టుకునే వాడు. కానీ వాసు కి కమల పై రోజు రోజుకు ఆలోచనలు పెరిగిపోతున్నాయి.
• ఇక లాభం లేదు అనుకొని, ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు తను స్టాఫ్ రూం లో ఉండగా, కమలను చూడాలని అనిపించి, అకస్మాత్తుగా కూర్చున్న వాడల్లా, లేచి కమల ను కలవాలని కమల పనిచేస్తున్న కాలేజీ కి బయలుదేరాడు. వాసు చాలా దూరం వెళ్ళాక చీకటి పడిపోయింది. సమయం సాయంత్రం 6 దాటింది…. వాసు ఒక్క సారిగా నిశ్చేష్టుడయ్యాడు, తాను కమల కోసం అంత దూరం నడిచి వెళ్తున్నాడు, పైగా తన ఒంటి మీద ఫేంట్ మాత్రమే ఉంది, షర్ట్ లేదు అని గ్రహించి…. కమలని రేపు కలవచ్ఛని వెను తిరిగాడు. వాసు వెను తిరిగి వస్తుంటే బాగా చీకటి పడింది, రోడ్ నిర్మానుష్యంగా ఉంది. రోడ్ పక్కన ఒక పాత పెద్ద పాడుపడిన భవనం లోకి వాసు వెళుతున్నాడు. అక్కడ చాలా మంది తల విరబూసుకొని , నేల మీద పడుకొని ఉన్నారు. వాసు వారిని దాటుకుని నడుస్తూ నడుస్తూ ముందుకు వచ్చాక, తన కాళ్లకు ఒక 13 సంవత్సరాల అమ్మాయి కాళ్లు తగిలాయి. ఆ అమ్మాయి పక్కనే తన తల్లి జుట్టు విరపూసుకొని నేల మీద పడుకొని ఉంది. వాసు కాళ్లు తగిలిన ఆ అమ్మాయి లేచి, వాసు వాసు అని అరుస్తుంది. వాసు కి ఒక్కసారి ఒళ్లు జలదరించింది. అసలు తాను ఏంటి, వీళ్లందరూ ఎవరు , ఆ అమ్మాయి కి తన పేరు ఎలా తెలుసు అని కంగారు పడుతూ… ఆ అమ్మాయి తో ఎవరు మీరు, నా పేరు నీకెలా తెలుసు.. చెప్పు, దయచేసి చెప్పు అని గట్టిగా ఏడుస్తున్నాడు. వెంటనే ఆ అమ్మాయి , మా అమ్మ కి అంతా తెలుసు, నీ గురించి చెపుతుంది అని .. అమ్మా అమ్మా వాసు వచ్చాడు…లే …అని తల్లి ని లేపింది.
• వెంటనే వాసు ఆ తల్లితో నేనెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నాను అని కంగారుగా అరుస్తున్నాడు. వెంటనే ఆ తల్లి, చూడు వాసు నువ్వు ఇంతకు ముందు జన్మలో జైలర్ వి. నీ భార్య ని చాలా ప్రేమించే వాడివి. నీ భార్య కోసం కధలు రాసేవాడిని. అకస్మాత్తుగా చనిపోయావు. గత జన్మలో నీ భార్య ఎవరో కాదు, ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చిన కమల . ఇందాక కొద్ది గంటల క్రితం కమల కోసం వెళుతుండగా , రోడ్ యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావు. అని చెప్పింది.
• ఒంటిమీద వందల కేజీల బరువు ఉన్నట్లు ఉంది. గొంతు పూర్తిగా తడి ఆరిపోయింది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎవరో తట్టి తట్టి లేపారు. సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.
2021 లో అనుభవం.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
5
• అది ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆ కుటుంబం లో శాస్త్రి గారి దంపతులకి ఆరుగురు సంతానం, అందులో అయిదుగురు కుమార్తె లు, ఆఖరున కుమారుడు.
శాస్త్రిగారు పెద్ద పండితుడు కాకపోయినా తెలిసి తెలియని పాండిత్యం తో, మంచి తనం తో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం చేస్తూ , కుటుంబాన్ని కాస్త పేదరికం తో , భారం గా పోషించే వాడు. తనకు పూర్తిగా వేద శాస్త్రములు అంతగా తెలియక పోయినా, తన ఆఖరి కుమారుడు రాము కి , అన్నీ వేదాలు, మంత్రాలు, పౌరోహిత్యం నేర్పించాడు. రాము స్వతహాగా తెలివి తేటలు ఉండడం వలన తన గురువుల నుంచి సులభంగా జ్ఞానం, శాస్త్రం నేర్చుకున్నాడు.
• రాము కి చిన్న వయసు లోనే జ్యోతిష శాస్త్రం , గుప్త శాస్త్రాలు, పౌరోహిత్యం అవపోసన పట్టడం వలన అహంకారం తో తండ్రి ని అక్కాచెల్లెళ్ళు ను చిన్న చూపు చూసేవాడు. పైగా తండ్రి చెప్పిన మాట వినకపోగా తండ్రి ని ఒక బలహీనుడి గా చూసేవాడు. రాము కి జ్యోతిష్య శాస్త్రం లో అపారమైన జ్ఞానం, మేధస్సు ఉండేవి. ఎవరికైనా జాతకం చెపితే అక్షరాల అలాగే జరిగేది. అందువలన రాము కోసం చాలామంది వచ్చేవారు. రాము కి వేద మంత్ర శాస్త్రాలు లో తిరుగు లేకుండా ఉండేది. పాండిత్యం ద్వారా రాము అహం తో ఉండడం వలన తండ్రి కి మనశ్శాంతి కరువై , మనోవేదన తో మరణించాడు. రాము తన కుటుంబం లో మిగిలిన అక్కలను బాధ్యతా రహితంగా వదిలేసి, ఒంటరిగా అదే ఊరిలో, మరో చోట నివాసం ఉండేవాడు. రాము , అక్కలు పేదరికం అనుభవిస్తూ చినిగిన వస్తాలు ధరించి ఉన్నా కనీసం తన వద్ద ఉన్న ధనం సహాయం చేసే వాడు కాదు.
• కనులు తెరిచి చూస్తే ఉదయం 6 గంటలు అయింది. ఎందుకో తెలియదు , అసలు ఏంటి ఇది ఎందుకు ఇలా అని ఆలోచిస్తూ నే ఉన్నాను.
2022 లో అనుభవం.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
6
• రాజేష్ చిన్నప్పటి నుంచి చదువు లో బాగా తెలివైన వాడు. అన్నింటి లోను ఉత్తమ మైన గుర్తింపు పొందేవాడు. బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. రాజేష్ ఐఐటీ లో ఇంజనీరింగ్ చదివాడు. రాజేష్ కు ఏది అనుకుంటే అది సాధించడం అలవాటు గా మారింది. జీవితం లో ఎక్కడా వెనుక అడుగు వేసేవాడు కాదు. విజయం తనకు ఒక వ్యసనంగా మారింది. కాలేజీ లో రాజేష్ మాటలకు , తనను చాలా మంది ఇష్టపడే వారు. స్నేహితులు ఎక్కువ గా ఉండేవారు. కొంత మంది స్నేహితులు రాజేష్ నుంచి ఎక్కువగా సాన్నిహిత్యం, సరదాలు ఆశిస్తూ ఉండేవారు. కొందరు రాజేష్ తమకు మాత్రమే సొంతం అనుకుని భంగ పడే వారు. కానీ రాజేష్ అందరితో కలిసి ఉన్నా ఎవరికీ చెందని వాడు గా ఉండేవాడు.
• ఇంజనీరింగ్ పూర్తి చేసి న తరువాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక అందమైన అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు. కంపెనీ లో అందరినీ ఆకర్షించి , తక్కువ సమయంలో వందలమంది ఉద్యోగులు ఉన్న అందరికీ నాయకుడు గా ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చెప్పేవాడు. రాజేష్ కి ఎక్కువ సమయం ఆఫీస్ పనుల మీద దృష్టి పెట్టేవాడు. అదే తనకు ముఖ్యం అనుకొని పని మీదే ధ్యాస ఉంచే వాడు. అందులో లభించే గుర్తింపు తో ఏదో సాధించిన సంతోషం మనసు లో ఉండేది
• రాజేష్ కి అప్పటికే ఒక పాప, బాబు పుట్టారు. పిల్లలు చిన్న వాళ్లు గా ఉన్న సమయంలోనే , రాజేష్ నైపుణ్యం గుర్తించిన కంపెనీ యాజమాన్యం, రాజేష్ కి అర్హత ఉందని ఉద్యోగి భాధ్యతలనుంచి ఉన్నతంగా , ఆ కంపెనీ కి ఎం.డీ గా చేశారు.
• కంపెనీ ని గొప్ప స్థానం లో నిలబెట్టాలని , తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ , రోజుకు 18 గంటలు కంపెనీ కోసం పనిచేసేవాడు. మానసికంగా తనకు ఒక కుటుంబం ఉంది అనే విషయం పూర్తిగా మరచి పోయి కంపెనీ పని భాధ్యత లలో మునిగి పోయే వాడు. డబ్బు తరతరాలకు సరిపడా గా సంపాదించే వాడు. పైగా ఇదంతా తన కుటుంబం కోసమే కదా అనుకునే వాడు. తనకు బాగా అలసట అనిపించినపుడు అప్పుడప్పుడు సిగిరెట్ కాలుస్తూ, విస్కీ తాగుతూ ఒంటరిగా రిలాక్స్ అయ్యేవాడు.
• రాజేష్ పిల్లలు, భార్య మానసికంగా ఒంటరి వారై ఉండే వారు. అమితంగా ఇష్టపడే భార్యకు రాజేష్ తీరు అర్దం అయ్యేది కాదు. చాలా వేదనతో బాధపడుతూ ఉండేది. ఇంటి నిండా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నా భర్త ప్రేమ వెలితి కి, చాలా భాధ పడేది. ఇక పిల్లలు పరిస్థితి మరీ దారుణం. రాజేష్ కొడుకు అయితే తన తండ్రిని ఒక అవసరాలు తీర్చే వస్తువు గా చూసేవాడు. ఎందుకంటే తన స్కూల్ ఫంక్షన్స్ కు తండ్రి ఏ రోజు రాలేదు సరికదా తనతో సమయం కూడా గడిపే వాడు కాదని ఉక్రోషం ఉండేది పైగా, ఏ నాడు ప్రేమ గా తండ్రి ఏ రోజు మాట్లాడే వాడు కాడు.
• రాజేష్ కంపెనీ ఇండియా లో మంచి స్థాయి లో ఉంది. రాజేష్ ఫోటో బిజినెస్ మాగజైన్స్ లో సక్సెస్ఫుల్ మేన్ గా ఆర్టికల్స్ వచ్చేవి. రాజేష్ తన కంపెనీ యాజమాన్యం తో మాట్లాడి విదేశాలలో కంపెనీ విస్తరించాడు. ఇదంతా రాజేష్ కి ఆనందం అనిపించేది.
• పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు రాజేష్ కూతురు కి పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ ముహూర్తం నిర్ణయించారు. ఇదంతా రాజేష్ కు ఉన్న స్టేటస్ డబ్బు తో, యాంత్రికంగా జరిగిపోతున్నాయి. ఎంగేజ్మెంట్ కి రెండు రోజుల ముందు తన కూతురు, భార్య ని పిలిచి విదేశంలో ఉన్న తన కంపెనీ లో సమస్య ఉంది, నేను రేపు అర్జెంట్ గా వెళ్లాలి, కార్యక్రమం మీరే జరిపించండి, అని చాలా సాధారణంగా చెప్పి వెళ్ళిపోయాడు.
• రాజేష్ మంచి వాడా, చెడ్డవాడా, అసలు ఏమనుకోవాలో కూడా భార్యకు తెలియక ఏడ్చింది. కూతురు కి తండ్రి మీద అప్పటి వరకు ఉన్న కొంచెం జాలి, సానుభూతి కూడా పోయాయి.
రాజేష్ విదేశీ ప్రయాణం లో విమాన ప్రమాదానికి గురై మరణించాడు.
రాజేష్ తన వృత్తిని మాత్రమే ప్రేమించాడు, కానీ తన కుటుంబం లో మనుషుల కి ప్రాముఖ్యత ఇవ్వకుండా సాధారణంగా చూసేవాడు . ఎందుకంటే రాజేష్ కి మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ తెలియవు.
• లేచి చూస్తే అప్పుడు సమయం అర్దరాత్రి 1:30 అయింది.
2022 లో అనుభవం
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
• నేపాల్ శివాలయం లో నేపాలి సన్యాసి.
• కాంబోడియా విష్ణు ఆలయం లో ఉన్న భార్యభర్తల లో భర్త.
• అన్యోన్య దాంపత్య ప్రేమికుల లో సాహిత్యం తో భార్యను అలరించిన జైలర్ భర్త.
• తనకు తెలియకుండానే ప్రేమ లో పడిన కాలేజీ లెక్చరర్ వాసు.
• బ్రాహ్మణ కుటుంబంలో తండ్రి నిందిస్తూ, అక్కలను విస్మరించి, అహం నిండిన అపార పండితుడు రాము .
• తరతరాలకు సరిపడా ధనం సంపాదించి, వృత్తి ని ప్రేమించి, భార్య పిల్లల ప్రేమ విస్మరించి , సంతోషం మైన కుటుంబ జీవనం నోచుకోని రాజేష్.
• ………………………..???????
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా ....
యడ్ల శ్రీనివాసరావు 14 Jan 2023, 12:35 AM.
No comments:
Post a Comment