Monday, January 2, 2023

290. ఒక మంచి మాట - జనన మరణం జీవనం

 

🌹ఓ మంచి మాట 💐 జనన మరణ జీవనం


• ఎవరైనా జన్మించడం అనేది ఒక కారణం తో కూడుకున్నది. ఆ కారణం ఏనాటికైనా (కనీసం ఈ జన్మలో నైనా) తెలుసుకో లేకపోతే జన్మ జన్మలు కాలక్షేపం తో వృధా అయినట్లే. ఎనాడై తే , శివుని అనుగ్రహం తో జన్మించడం లోని కారకత్వం తెలుసుకో గలమో …. అప్పుడు ఆత్మను గుర్తించ గలుగుతాము…. అప్పుడు మనిషి కి ఆత్మ వేరు, శరీరం వేరు అని, ఇంకా నేను ఒక ఆత్మను ఎన్నో జన్మల నుండి శరీరం మార్చుకుంటూ వస్తున్నాను అనే విషయం తెలుసుకో గలిగే అదృష్టం కలుగుతుంది.

• ఆ సమయం నుండి , అనాది గా పేరుకుపోయిన మనిషి యొక్క బుణాలు కర్మ చేత పరులకు, సాటి వారికి, ఇతర జీవులకు సేవ, సహాయం (పురుషార్థం) చేయడం ద్వారా కరగి బుణవిముక్తులవుతాము. ఒకసారి బుణం తీరిపోతే ఆ మనుషులు తిరిగి కలవరు, కలవలేరు. దీనికి ఎవరూ అతీతులు కాదు.

• ఒకసారి మనిషి యొక్క కర్మలు కరగడం ప్రారంభం అయితే కర్మరహిత ( అకర్మ) స్థితి వస్తుంది. ఇదే శూన్య స్థితి మరియు యదార్థం గా దేవుని సన్నిధికి చేరుకునే స్థితి. నిత్యానంద స్థితి అంటారు. దీని కోసం మనిషి సాధనతో తనలో జన్మ జన్మల గా పేరుకుపోయిన మనోవికారాలయిన ఈర్ష్య, ద్వేషం, కామం, మోహం, లోభం, అసూయ, అహంకారం అనే గుణాలను పూర్తిగా త్యాగం చేసినపుడే ఆ యోగం లభిస్తుంది. ఇది అంత సులభంగా సాధ్యం కాదు. అలాగని అసాధ్యము కాదు.


• ☘️🍀☘️🍀☘️🍀☘️🍀

• జన్మించడం, వివాహం, మరణం ఈ మూడు మనిషికి మంగళకరమైనవే, శుభప్రదమైనవే. మనిషి తన జీవితంలో రూపాంతరం (మార్పు transformation) చెందడం అనేది, ఈ మూడు దశలలో ఏదొక దశ లో జరుగుతుంది. జన్మ జన్మలు గా మనిషి లో అజ్ఞానం నిండి ఉండడం వలన జన్మించడం, వివాహం మాత్రమే శుభకరం, మరణం అనేది అశుభం అని ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు భావిస్తారు.

• కానీ పుట్టిన ప్రతీ ఒక్కరూ , పెళ్లి చేసుకున్న ప్రతీ ఒక్కరూ జీవితాంతం సంతోషంగా జీవిస్తూ ఉన్నారా…. అంటే, సమాధానం “లేదు” అనే వస్తుంది. మరి అటువంటప్పుడు అవి మాత్రమే శుభకరం అని ఎలా అనుకోగలం. మనిషి తనలోని జీవశక్తి ని పూర్తి గా కోల్పోయినప్పుడే మరణం సంభవిస్తుంది. మనిషి చేసిన పాప పుణ్య కర్మల ను బట్టి మరణం తిరిగి జననాన్ని ప్రసాదిస్తుంది. మరణం లయ కారకుడు అయిన శంకరుని కర్తవ్యం.

• అందువలన జనన మరణాలన్నింటి ని సమదృష్టి తో చూడగలిగితే, అర్దం లేని ఆందోళనలు దూరం అయి ఆరోగ్యం గా ఉండగలుగుతాం.

• నిన్న నీది కాదు, నేడు నీది కాదు, రేపు నీది కాదు…..ఈ క్షణం మాత్రమే నీది.

• ఈ జీవన ప్రయాణంలో మనిషి తాను ఎక్కడ ఆగి ఉన్నాడో తెలుసుకుంటే నే గమ్యం స్పష్టం అవుతుంది.


• 🍀☘️🍀☘️🍀☘️🍀☘️

• మన చుట్టూ నిత్యం ప్రకృతిలో ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి అంటే, మనకు ఏ సంబంధం లేనట్లు వీక్షించడం కాదు , ఎంతో కొంత మంచి నిత్యం నేర్చుకొని, ఆచరించాలి అని అర్దం. ప్రకృతి లో వీచే గాలి తారతమ్యం లేకుండా అందరినీ తాకుతుంది. అలాగే కష్టాలు, సుఖాలు అందరినీ తాకుతునే ఉంటాయి. ఒకరు కష్టం లో ఉన్నప్పుడు ‌సహయం చేసే అదృష్టం లభించక పోయినా నష్టం లేదు, కానీ మనకు సహాయం చేసిన వారికి చేటు చెయ్యడం మంచిది కాదు. అలాగే సహాయం చేసిన వారికి దాసోహం అవనసరం లేదు. కానీ నిజాయితీ తో కూడిన కృతజ్ఞత భావం కలిగి ఉండడం మానవ ధర్మం. ఈ కృతజ్ఞత భావం (Thankful ness) లేకపోతే ఆ మనిషి జీవించి ఉన్నా, లో లోపల శాశ్వతం గా జీవం లేనట్లే అయిపోతుంది. అవసరానికి కుటిల ఏడుపులు, అవసరం తీరాక కుటిల యత్నాలు చేస్తే పంచభూతాలు కూడా క్షమించవు. అలాగే ఒకరు సహాయం ఒకచేత్తో చేస్తే , రెండవ చేతికి తెలియకూడదు.

• జీవితం అంటే ఎవరికీ వ్యాపారం కాదు, మనుషుల తో లెక్కలు బేరీజు వేసుకోవడానికి. ఎవరికైనా ఏదైనా అపకారం తలపెడితే జన్మ జన్మలు తారు మారు అయిపోతాయి. దేవుడు వేసే లెక్కలు తెలుసుకోవడానికి మనిషి కి జన్మ జన్మలు సరిపోవు. మనిషి లో కొంత నిజాయితీ ఉంటేనే స్థితిగతులను ఎదుర్కొనే శక్తి ప్రకృతి ఇస్తుంది…. మనిషి కి నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడడం … ఏది పడితే అది తినడం … అలాగే మెదడు ఉంది కదా అని ఎలా పడితే ఆలోచించడం చేస్తే, శరీరం, మెదడు రెండు కూడా వీధిలోని చెత్త కుండీలా అయిపోయి, శారీరక మానసిక రోగులు గా అయ్యే ప్రమాదం ఉంటుంది. మాయకు వశమై , మనో కామ వికారాలు తో కొట్టుమిట్టాడే వారు అప్పుడప్పుడూ తారస పడతారు. ఇలాంటి వారికి చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ వారిలాగే అనిపిస్తారు . అటువంటి వారి దీనమైన మానసిక స్థితి పై ఆత్మీక శుభ దృష్టి చూపి, శివశక్తి ద్వారా మాయ, వికారాలు తొలగాలని ప్రార్థించాలి…. ఒకరు, నేను సంతోషంగా లేను అని ఏడుస్తూ, బాధపడే బదులు, అదే సంతోషం తమ తోటి వారి లో ఉన్నపుడు , దానిని చూసి ఆస్వాదించి ఆనందించ గలిగితే, కనీసం అంతరంగం లో పేరుకుపోయిన మలినాలు, బాధలు కొన్ని తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది.

• ఈ సృష్టిలో తప్పులు, పాపాలు, హింస చేయని మనిషి ఉండడు. కానీ వాటి నుండి ఎప్పటికప్పుడు పరివర్తన అయి మంచి ఆలోచనలతో సత్యమైన జీవన మార్గాన్ని ఎంచుకోవడమే మనిషి జన్మకు మోక్షం. అదే దైవ మార్గం.

• కొందరు మనుషులకు తోటి వారిని సొంత వారిగా అభిమానించడం, ప్రేమించడం, గౌరవించడం, కష్టసుఖాలు పంచుకోవడం, తోచినంత లో మాట సహాయం చేయడం అనేవి జన్మతః వచ్చే ఆత్మ సంస్కారాలు, దైవానుగ్రహం. అది అర్దం కాని వారు , వాటిని బలహీనతలు గా, ఏ పని లేక కాలక్షేపం కోసం చేసే పనులు గా భావిస్తే అది వారి ‌సంస్కారం. శివుడు ఏ బాధ్యతలు ఎవరికి ఎందుకు అప్పగిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ అవి తీర్చుకోగలగడం, ద్వారా పొందే ఫలం తియ్యగా ఉంటుంది.


• ☘️🍀☘️🍀☘️🍀🍀☘️

• మనిషి కి ఎప్పుడు ఏ అవసరం, ఎందుకు, ఎలా వస్తుందో తెలియదు. కానీ ఆ స్థితి లో మనిషి ఒంటరి గా ఉన్నా సరే మనసు మాత్రం, నేను ఒంటరి ని అనే భావన కలగకుండా ఉంటే అంత కంటే అదృష్టం ఉండదు. ఎందుకంటే చాలా మంది ఆత్మహత్య లకు  ఈ మానసిక ఒంటరి తనమే కారణం అవుతుంది. మనసు ధైర్యం గా ఉంటేనే మనిషి బలం గా ఉండగలడు.

• ఈ వాక్యాలు సహజంగా కొందరి మానసిక పరిణితి కి నేడు అర్దం కాకపోవచ్చు, లేదా ప్రస్తుతం అంత అవసరం లేదనిపించవచ్ఛు. కానీ ఏదో ఒక రోజు ప్రతీ మనిషి తప్పని సరిగా అర్దం చేసుకోవలసిన సమయం, జ్ఞాన సముపార్జన చేయవలసిన సందర్భం వస్తుంది…కాకపోతే అది కొందరికి ముందు, మరికొందరి వెనుక. ఎందుకంటే భౌతిక విలాసాలు ఏ మనిషి కి శాంతి ని ప్రసాదించలేవు. అశాంతి తో ఆత్మకు మోక్షం కలగదు.

• ఒకరు మనకు అర్దం కాకున్నా, లేదా  మనల్ని ఒకరు అర్థం చేసుకోలేకున్నా  ఇరువురి ఆలోచనల స్థాయిలో చాలా వ్యత్యాసం ఉంది అని అర్దం.  ఆ ఆలోచనలు ఉన్నతమైనవా,  అల్పమైనవా  అనేది వారికే ఎరుక.

• ఏ మనిషైనా సంతోషంగా నలుగురి తో,  నలుగురి లో జీవించే స్థితి పొందడం భగవంతుడు కల్పించిన అదృష్టం.  దానిని సజావుగా నిలుపుకోవడం మనిషి కర్తవ్యం.  అందుకు కావలసింది కాస్త నిజాయితీ, స్వచ్ఛత.  కలిసి ఉండడం అంటే కలతలు, కల్మషాలు, వ్యంగ్యము లేకుండా ఉండడం.

• ఇవి అన్ని యు , ప్రతీ మనిషి పాజిటివ్ గా శక్తి వంతం గా  నిలబడడానికి  కావలసిన చిన్న చిన్న విషయాలు మాత్రమే , అలా అని ఎవరికి తెలియనివి కావు.  శివుడు అప్పగించిన పనిలో భాగం …. ఈ రచన

• శివుడు పరమాత్ముడు, మరియు విశ్వ కల్యాణకారి, శుభకరుడు. శివుని ఆధీనంలో ఉండే దేవమూర్తులు ఈ త్రిమూర్తులు, బ్రహ్మ ద్వారా సృష్టి (ఉద్భవించడం) … విష్ణువు ద్వారా స్థితి (పాలన) … శంకరుని ద్వారా లయం  (వినాశనం  అవసరమైనపుడు ) అవుతుంది.

• ఓం నమఃశివాయ🙏 … శంభో శంకర 🙏


యడ్ల శ్రీనివాసరావు 31 Dec 2022 1:00 pm.






No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...