Tuesday, October 28, 2025

701 . సెలయేరు కన్నీరు

 

సెలయేరు  కన్నీరు



• జారే    నీరు    సెలయేరు

  మదిలో   పారే   నీరు    కన్నీరు .


• సెలయేటి    పరవళ్ళు

  చక్కంగా    నింపెను    ఆనందం .

• కన్నీటి       కడగండ్లు

  వెచ్చం గా    కడిగేను    విచారం .


• జారే    నీరు    సెలయేరు 

  మదిలో   పారే   నీరు   కన్నీరు .


• సెలయేటి     తుంపరలు

  సంబరాలకు     అంబరం  .

• తొణికిసల      పరవశం

  చిరునవ్వుల    కోలాటం .


• కన్నీటి      ఉద్వేగాలు

  అంతరాల   ఆవేదనలు .

• కరుగుతున్న    క్షణికం లో

  హృదయానికి    ఉప్పెనలు .


• జారే    నీరు     సెలయేరు

  మదిలో   పారే   నీరు  కన్నీరు .


• సెలయేటి      నీరు     జీవామృతం .

  మది మీటిన   నీరు     మధురామృతం .


• ప్రాణానికి       తెలుసు   నీటి  మహత్యం 

  హృదయానికి  తెలుసు  కన్నీటి   కావ్యం .


• ఈ    నీటి   రూపాలు

  మనిషి కి

  సుఖదుఃఖాల   ఆటలు .


• జారే    నీరు    సెలయేరు

  మదిలో   పారే   నీరు   కన్నీరు .


యడ్ల శ్రీనివాసరావు  28 Oct 2025 9:30 AM.


Friday, October 17, 2025

700. వ్యక్తుల నుండి భావోద్వేగ స్వతంత్ర్యత

 

వ్యక్తుల నుండి భావోద్వేగ  స్వతంత్ర్యత 





భావోద్వేగాలు 

సంతోషం, విచారం, కోపం, భయం, ప్రేమ, శత్రుత్వం.


• మనకున్న బంధాలలో, కొన్ని బంధాలపై మనం భావోద్వేగంగా ఆధారపడి ఉంటాం. మనం ఇతరుల అవసరాలు ,  అభిప్రాయాలు మరియు భావాల గురించి ఆలోచిస్తూ అసమంజసంగా  సమయాన్ని వెచ్చిస్తాము . మన సొంత అవసరాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి ఎందుకంటే మన భావాలు , నిర్ణయాల నియంత్రణను పూర్తిగా ఇతరులకు ఇచ్చేస్తాము . వారు మనల్ని  ప్రేమించాలని వారి నుండి ఆశిస్తూ వారిపై ఆధారపడి ఉంటాం, ఇది ఇరువురికీ మంచిది కాదు.


• మీ మనసు ఎవరితోనైనా భావోద్వేగంగా చిక్కుబడి  ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా?

• ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ మీ మనసులో ఉంటున్నారా ? అటువంటి వ్యక్తి ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చినా మీ మనసు పాడవుతుందా ?

• భావోద్వేగంగా ఇతరులపై ఆధారపడటం మనం అనుకున్న దానికన్నా  చాలా ప్రమాదకరమైనది.  ఇది గాఢమైన వ్యసనంలా  కూడా మారవచ్చు.  మన మనసు కొందరి ప్రవర్తనపై ఆధారపడి ఉన్నప్పుడు , వారు మనం కోరుకున్న విధంగా ఉండాలని ఆశిస్తాం. ఎప్పుడూ వారి నుండి  ప్రేమ , పలకరింపు ,  సాన్నిహిత్యం  ,  అభిప్రాయాలు  మరియు వారి  సమ్మతిని  కోరుకుంటాము . ఇందులో  ఏ   ఒక్కటి లభించకపోయినా  గానీ మనకు అభద్రతా భావన కలుగుతుంది . నిజానికి  మనకు భావోద్వేగంగా చాలా శక్తి ఉంది .  మనకు వారి నుండి ఏమీ అవసరం లేదు . వారు ఎలాంటి వారో అర్థం చేసుకుని వారితో అలాగే వ్యవహరిద్దాం , అంతేకానీ నాకు భావోద్వేగ హాయిని వారు అందించాలని  ఆశించ వద్దు . నిజమైన ప్రేమ అన్నింటి నుంచి శాశ్వతమైన విడుదలను  ఇస్తుంది . అలాకాకుండా ,  ఆధారపడి ఉంటే అది వారినీ , మనల్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

మిమ్మల్ని మీరు ప్రేమించు కోండి . మీ మనసుతో సమయాన్ని గడపండి. మనసుకు గుర్తుచేయండి – నా బంధాలు భావోద్వేగ స్వతంత్ర్యత మరియు ప్రేమ అను పునాదిపై నిల్చుని ఉన్నాయి.


• ప్రశాంతంగా కూర్చుని, వ్యక్తుల నుండి భావోద్వేగంగా  ఆశ్రితమై ఉండే స్వభావాన్ని ఎలా తొలగించుకోవాలి , తిరిగి స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాలి అని ఆలోచించండి . మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోండి , మీ అవసరాలను గుర్తించండి . మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది , మీ మమకారాలు, ఆశ్రిత తత్వం  తగ్గుతాయి . 

మీకు మీరు  ఇలా  గుర్తు చేసుకోండి  –  నేను  శక్తిశాలి స్వరూపాన్ని .  నేను భావోద్వేగపరంగా  స్వతంత్రంగా ఉన్నాను ,  నాకు ఎలా కావాలో , ఏమి కావాలో నాకు తెలుసు . నా ఆంతరిక ప్రపంచాన్ని ఎవ్వరూ  ప్రభావితం  చేయలేరు . ఇదే నా  జీవన మంత్రం అని మననం చెయ్యండి .

భావోద్వేగాలు  చూపడం ,  ఆశించడం  కన్నా  . . . . .  గౌరవించడం ,  గౌరవించ బడడం మిన్న .


ఆశ్రితము =   ఆశ్రయించడం, ఆధారపడడం


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 Oct 2025 9:00 PM.


Tuesday, October 14, 2025

699. మన నమ్మకాలు

 

మన నమ్మకాలు 


 మనం ఏది  విశ్వసిస్తామో  అదే సాధిస్తాం .

• జీవిత ప్రయాణంలోని నమ్మకాలన్నీ  ఎక్కడ నుండి వచ్చాయని మనం కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటాం ?  మనం సంతోషం, ప్రేమ, గౌరవం, కోపం లేదా ఒత్తిడి గురించి ఏది నమ్మినా అవి ఎక్కువగా మన సామాజిక స్థితి ఆధారంగా మనపై మనం తయారు చేసుకున్నవే .


• మనం ఎప్పుడైనా కాసేపు ఆగి, సరైనది అంగీకరించడానికి , సరికానిది వదిలేయడానికి  పరిశీలించామా ? 

ప్రతి పరిస్థితిని మన నమ్మకాలను బట్టి గ్రహిస్తుంటాము . మన ఆలోచనలు, భావాలు, వైఖరి, అలవాట్లు, వ్యక్తిత్వం మరియు  చివరకు మన భాగ్యం   మన  జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం, మన నమ్మకాల ఆధిపత్యం  ,  ప్రభావం మనం  ఇది వరకు తయారు చేసుకున్న ,  ప్రస్తుతం  చేసుకుంటున్న భాగ్యం పై  ఉంటుంది.

 మనం ఒక్క తప్పుడు నమ్మకాన్ని కూడా కలిగి ఉండకూడదు.

• సమాజం పరిమితం ( limited ) చేసే నమ్మకాలను వ్యాప్తి చేస్తుంది ఉదాహరణకు . . . కోపం అవసరం , విజయం సాధించడంలో ఆనందం ఉంది , ఒత్తిడి సహజం , వ్యక్తులు మరియు పరిస్థితులు నేను ఎలా భావించాలో  నిర్ణయిస్తాయి . . . మొదలైనవి.

• కోపం అవసరమని నమ్మి, కోపాన్ని పదే పదే ఉపయోగిస్తున్నాం . కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలనుకున్నా  అది తాత్కాలికం అవుతుంది .

కొత్త నమ్మకంతో ప్రయోగాలు చేయండి: కోపం హానికరం, ఏదైనా పనిని పూర్తి చేయించడానికి మార్గం ప్రేమయే . ఈ నమ్మకం ప్రేమ మరియు ఆనందాన్ని సహజం చేస్తుంది . తప్పుడు నమ్మకాల పొరలను సాధికారతతో  భర్తీ చేద్దాం.

మనకు మనం గుర్తు చేసుకుందాం : నేను ప్రతి నమ్మకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ప్రయోజనకరమైన వాటిని స్వీకరిస్తాను. నా నమ్మకాలన్నీ నన్ను సంతోషంగా, ఆరోగ్యంగా మరియు నా ప్రపంచంతో సామరస్యంగా ఉంచుతాయి.

• మనం చిన్నతనం నుండి ఎన్ని నమ్మకాలను స్వీకరిస్తూ జీవించామో  ఏనాడైనా కాస్త ఆగి పరిశీలించుకున్నామా ?

• మనం మన గురించి, ఇతరుల గురించి లేదా ప్రపంచం గురించిన నమ్మకాలను, వాటిని సొంతం చేసుకునే ముందు వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నామా ?

లేదా

• మనం మన కుటుంబం , విద్య , సమాజం లేదా మన గత అనుభవాల ద్వారా మన మనస్సులో నింపిన నమ్మకాలను అంగీకరిస్తున్నామా ?

 మన నమ్మకాలే  మనకు పరమ సత్యాలు. నమ్మకాలను కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పోల్చవచ్చు. అవి మన జీవితాన్ని నడిపిస్తున్నాయి . మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన లో , ఒక్క తప్పుడు నమ్మకం ఉన్నా అది చాలా హాని చేయగలదు. అందమైన జీవితాన్ని గడపకుండా మనల్ని అడ్డుకునే పరిమిత , తప్పుడు నమ్మకాలను మనం మనసులో పరిశీలించుకుని మార్చుకుందాం. కాసేపు కూర్చుని, మన స్వంత ఎదుగుదల, శ్రేయస్సు మరియు విజయానికి అడ్డంకులుగా ఉన్న నమ్మకాలను పరిశీలించుకుని తొలగించుకోవడానికి మన మనస్సును సిద్ధం చేసుకుందాం .

మనం ఒక నమ్మకం  పై దృష్టి   సారించినపుడు ఏ విధమైన. అలజడులు భయం లేని  విశ్వసనీయత సంతోషం మనసు లో  కలగాలి . 

మన జీవితాన్ని ఒక పరిశోధనాలయం (Reasearch Lab) గా  చూడగలిగినప్పడు , జీవితం లో  జరుగుతున్న  ప్రతి అంశం  ఒక  ప్రయోగం  గా  భావిస్తే  , లభించే ఫలితం ఒకొక్క కొత్తదనాన్ని  ఆవిష్కరిస్తుంది .



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 13  Oct 2025  5:00 PM 


Friday, October 10, 2025

698. సత్సంబంధాలు _ నెగెటివ్ శక్తులు


సత్సంబంధాలు 


• సత్సంబంధాలు అంటే ఎప్పుడూ ఒకరితో ఒకరు కోపం, కలతలు చెందకుండా లేదా చిరాకు పడకుండా ఉండటం  కానే కాదు .

  సత్సంబంధం  అంటే కలత చెందిన దానిని మీరు త్వరగా  పరిష్కరించుకొని  తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం.


• ఒకరితో  వాదన , నమ్మక ద్రోహం  ,  ప్రవర్తన లో లోపం ,  సహించలేని మోసం జరిగిన తరువాత  మనం బాధపడి  నిరాశకు గురవుతాము .  ఎంతో  సమయం కోపం లేదా బాధతో ఉండటాన్ని మనం ఎంచుకుంటాము . మన బాధను  సమర్ధించుకొని , అది ఇతరులు చేసిన పొరపాటుగా భావించి వారు సరిదిద్దుకోవాలని ఆశిస్తాము .   కొన్నిసార్లు , వారితో ఇక  గతంలో వలే  ఉండలేమని కూడా భావిస్తాము. జరిగిన సంఘటన తో సంబంధం లేకుండా సాధారణ స్థితికి రావడానికి కేవలం 1 ఆలోచన మాత్రమే కావాలి .


కానీ మనస్సు ఇలా  ప్రశ్నించడం  మొదలు పెడుతుంది , దానికి సమాధానాలు ఇలా ఇవ్వండి.

1. అది వారి తప్పు అయినపుడు , నేను దీన్ని ఇప్పుడు  ఇలా ఎందుకు  పునరుద్ధరించు కోవాలి? 

ఎందుకంటే నా అహం కంటే నా సంబంధం ముఖ్యం కనుక . 

2.  ఇంత త్వరగా సమాధాన పరచడం ఎందుకు, కనీసం వారిని తమ తప్పును గ్రహించనివ్వాలి  కదా ? 

ఎందుకంటే గడిచిన ప్రతి క్షణం ఇరువురికి బాధను కలిగించి  మా సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

3. నేను ముందు అడుగు వేస్తే ,  నేను బలహీనంగా  పరిగణించ బడతానేమో ?

క్షమించడం, మరచిపోవడం మరియు ముందుకు సాగడం అనేది  శక్తి , కనుక ఇరువురికీ నేను ఆ శక్తిని ఇస్తాను.

4. నేను తిరిగి సాధారణ స్థితికి వస్తే , వాళ్ళు కూడా అలాగే  తిరిగి  మారుతారా ?

వారు మారడానికి సమయాన్ని తీసుకోవచ్చు, కానీ నేను సాధారణ   స్థితికి వస్తే ,  మారే ప్రక్రియ ప్రారంభమైంది కనుక అతి త్వరలో వారు సాధారణ స్థితికి వస్తారు .

5.  నేను ఉపేక్షించబడతానా ? 

నేను చూపించే ప్రేమను, శ్రద్ధను ఇతరులు తక్కువ చేసి చూస్తే , అది నా అదృష్టం.  నేను వారిని ఎప్పుడూ ప్రేమిస్తున్నానని వారు నమ్మడానికి నేను వారికి ఒక కారణం ఇచ్చాను .

ఈ విధంగా  చాలా ప్రశ్నలు ఉండవచ్చు .

కానీ మన సంబంధమే మన ప్రాధాన్యత అని, తప్పొప్పులు కన్నా అందరి సంతోషం మనకు ముఖ్యం అని నిర్ణయించుకుంటే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంటుంది.

సత్సంబంధం  = సత్  +  సంబంధం 

సత్యం తో  నిజాయితీ ని  నింపుకొనే సంబంధం సత్సంబంధం 

అసత్యాలు ,  అప నమ్మకాలు ,  పొరపాట్లు    జరిగిన  విషయాలను  వాస్తవ స్థితి తో  అర్దం  చేసుకుంటూ  , సరిదిద్ది కుంటూ  అంగీకరించడం  జరుగుతూ ఉన్నప్పుడు  సత్సంబంధాలు సురక్షితంగా ఉంటాయి .

స్వయం యొక్క  అవసరాలు కంటే ,  ఇతరుల అవసరాలను  యధార్థ రీతిలో  గుర్తించి  కొనసాగించే  బంధం సత్సంబంధం.


Re - Lation . 

Re   = Again ,  Back  (తిరిగి , మరలా)

Lation  = The act of  bearing  ( భరించేది , మోయ గలిగేది ).

తిరిగి భరించేది మరలా మోయ గలిగేది

Re - lation  .


💐  💐  💐  💐  💐  💐  💐  💐  💐


నెగెటివ్ శక్తులు


నెగెటివ్ శక్తులు  గ్రహించకండి  :  

ఇతరుల  నెగిటివ్ శక్తిని   మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు దానిని గ్రహించడం మరియు తిరిగి సృష్టించడం చాలా సులభం. 

ఇందుకు చక్కని ఉదాహరణ – టి.వి చూడటం , సినిమా లకు  ప్రభావితం అవ్వడం. వీటిలో ప్రదర్శించే   నటుల   నాటకీయ  ( డ్రామా )  జీవితాలలో ఇరుక్కుపోయి నటన లోని  భావోద్వేగ  స్థితులను చూస్తూ ఉన్నవారు  అవి నెమ్మదిగా  తమలోనికి   గ్రహిస్తుంటారు .  

ఆ తరువాత , వారు తమ దైనందిన  నిజ జీవితంలో అడుగు పెట్టినప్పుడు ,  నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతరులను చూసే దృష్టి  కోణంలో  మునుపటి టి.వి ,  సినిమా  డ్రామా ల  ద్వారా చూసి  స్వీకరించిన  నెగిటివ్ శక్తి    పని చేయడం ఆరంభం అవుతుంది . 

ఇలా కేవలం సినిమా, టి.వి నాటకాల లోని ప్రభావం మాత్రమే కాకుండా ,  నిజ జీవితంలో  సహచరుల  సాన్నిహిత్యం లో  మెలిగే సమయం లో ఒకరి యొక్క నెగెటివ్ శక్తి తెలియకుండా నే గ్రహించడం కూడా అనేక సార్లు జరుగుతుంది.  


నెగెటివ్ శక్తులు  చూపించకండి  : 

మనం  ఒకరి నుంచి స్వీకరించిన నెగెటివ్ శక్తి ని  తిరిగి వారికి  పంపితే ఏమవుతుంది ? 

వారు తిరిగి మనకు పంపుతారు  . 

అప్పుడు మనమేం చేస్తాము ? 

మళ్ళీ తిరిగి వారికి మనం పంపుతాము . 

ఇలా జరుగుతూనే ఉంటుంది . దీనినే సంబంధాల గడియారపు లోలకం ,  డింగ్ డాంగ్ అంటారు. 

ఇలా ఎంత కాలం జరుగుతుంది ? 

కుటుంబాలలో  జీవితాంతం కొనసాగుతుంది .  కార్పొరేట్ ఆఫీసు లలో  అయితే  కొన్ని సంవత్సరాలు జరుగుతుంది .  


నెగెటివ్ శక్తులు  మార్చండి  : 

మనందరికీ శక్తిని  మార్చగల  సత్తా ఉంది. 

పిల్లవాడు తన కోపాన్ని తల్లిపై చూపిస్తే తల్లి తిరిగి కొడుకుపై కోపాన్ని చూపిస్తుందా ? 

లేదు, పిల్లవాడి అప్పటి మూడ్‌ను అర్థం చేసుకుని, ఆ నెగిటివ్ శక్తిని స్వీకరిస్తుంది , దానిని మారుస్తుంది, తిరిగి  సానుభూతి ,  ప్రేమ , ఆధారము వంటి సుగుణాలతో  అతనికి  ఇస్తుంది. 

ఇలా మనం  మన  పిల్లలతో   చేయగలిగినప్పుడు  ఇతరులతో ఎందుకు చేయలేము ? 

ఈ నెగిటివ్ చక్రాన్ని ఎవరో ఒకరు ఆపాలి కదా. లేకపోతే ఈ నెగిటివ్ శక్తి అలవాటుగా మారి దానినే ఇస్తూ ఉంటాము. 

బంధాలు ఏవైనాకానీ  , మనం ముందుగా మారి , ఇతరులకు పాజిటివ్ శక్తిని పంపుదాము .   అప్పటికి ఇతరులలో  నెగెటివ్ శక్తి అలానే ఉండి , ఆ శక్తి  వలన  కలుషిత  స్థితి  అధికం  అవుతున్న వేళ  ,  సంతోషంగా శాశ్వతం గా  వారికి బిందువు (పుల్ స్టాప్) పెడదాం .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు  10 Oct 2025 , 3:00 PM 




Tuesday, October 7, 2025

697 . Life is not a Failure

 

Life is not a Failure 



• Life is not a failure to anyone. Life is a Lesson to everyone.


• జీవితం ఎప్పుడు ఎవరికీ కూడా అపజయం ఇవ్వదు. జీవితం అందరికీ పాఠాలు నేర్పిస్తుంది . అపజయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. అనుకున్నది జరగలేదని, సాధించలేదని ఆలోచనలతో ప్రేరేపితమైన ఒక మానసిక భావన అపజయం. ఇది కేవలం అంతర్గత దృక్పథం. ఈ భావన లోనుంచి బయటకు వచ్చి చూసినపుడు ఎంతో విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది.

• జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు, అపజయాన్ని కలిగించదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు అర్దం చేసుకోవడం లో అనుభవం కొరవడి విఫలం కావచ్చు, అంత మాత్రాన జీవితం లో ఓడిపోయాం అని అనుకోవడం, అవివేకం తో కూడిన అమాయకత్వం.

• జీవితం నేర్పే పాఠాలు నేర్చుకోవడానికి సహనం ఓర్పు అవసరం . ఈ ఓర్పు సహనం అలవడినపుడు అసలు అపజయం అనే పదానికి అర్థం ఉండదు. సరికదా ప్రతి అంశం పైన అర్దం చేసుకునే దృష్టి, అవగాహన పెంచుకునే ఏకాగ్రత పెరుగుతుంది. ఇది చివరకు నీ అంతర్గత స్వభావం అనే డిక్షనరీ లో అపజయం అనే పదాన్ని పూర్తిగా తుడిచి వేస్తుంది . అనగా ఆ పదం యొక్క అర్దం స్పృహ లో లేకుండా చేస్తుంది .


• బాహ్య ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వ్యవహారాలు, ధోరణుల లో కొన్ని సార్లు అనుకున్న ది సాధించలేక పోవడం వలన అపజయం పొందినట్లు భావిస్తాం . ఇది ఒకరి మానసిక పరిస్థితి ని బట్టి వారిపై ప్రభావం చూపించడం జరుగుతుంది. దీనికి అపజయం అనే పదం అలంకరించే బదులు , ఈ సంఘటన నాకు ఏదో తెలియని విషయం తెలియచేస్తుంది అని పరిశీలిస్తే అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవచ్చు . దీనినే కొందరు మహారధులు అంటుంటారు , జీవితం నిరంతరం పాఠం అని. తద్వారా కలిగేది అపారమైన అనుభవం .

• ఉదాహరణకు ఒక ఆటలో తర్ఫీదు పొందిన రెండు జట్లు A, B ఆటగాళ్ళు ఉంటారు. A జట్టు విజయం సాధించింది అని అంటారు. అలా అని B జుట్టు విఫలం అయింది అని కాదు . B జట్టు ఇంకా ఏదో నేర్చుకో వలసినది ఉంది అని అర్దం.

• ఇదే AB జట్లు మరో రోజు ఆడితే B జుట్టు గెలిచిందని అంటారు. అంటే A జుట్టు విఫలం అయింది అని కాదు.  ఇక్కడ గమనించవలసినది కాలం అనే ప్రయాణం లో కొన్ని సార్లు అనుకున్నది సాధించాం అదే విజయం అనుకుంటాం. కానీ కాలం అనుకూలించక సాధించలేకపోతే అదే అపజయం గా భావిస్తాం. జయపాజయాలు సహజం. ఈ రెండింటి మధ్య ఉత్పన్నమయ్యే భావోద్వేగాన్ని స్థిరీకరించడం , జీవితం నేర్పించే అతి పెద్ద పాఠం .


• జీవితం చాలా విలువైనది . అందులో విఫలం సఫలం , దుఃఖం సంతోషం, మంచి చెడు , పాపం పుణ్యం ఇలా ప్రతీ అంశం తో జరిగే కర్మల అనుభవాలు నిరంతరం నేర్చుకోవడానికి మనం పుట్టాం . ఇది జన్మ జన్మలు చేస్తూ ఉండవలసిన నిరంతర చర్య.


జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు అపజయాన్ని కలిగించదు.  జీవితాన్ని అనుభవిస్తున్న మనమే మన ఆలోచనల లోని  సమర్థత శక్తివంతం గా లేకపోవడం  మరియు  విధి విధాన లోపం  వలన అపజయం పొందినట్లు  భావిస్తాం .  మనం నేర్చుకోవడానికే  ఇక్కడ  ఉన్నాం,  అంతే కానీ  కుంగుబాటు (Depression) కి గురి అవడానికి గాని,  ఇతరులపై  అభియోగాలు మోపడానికి గాని , వ్యవస్థలను  వేలెత్తి చూపడానికి గాని లేము .  జీవితం ఒక ఆట. ఆటలో అన్నీ ఉంటాయి .  అవి సహజమైనవి గా  భావించి సానుకూల దృక్పథంతో ఉండాలి .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 7 Oct 2025 , 11:00 PM.


Saturday, October 4, 2025

696. శివ శాంతి

 

శివ  శాంతి 


• శాంతి   స్వరూప    శశి వదన

  శాంతి    స్వరూప   శశి వదన .

• మా దేహం    నీ స్మృతి   సదనం

  మా ప్రాణం    శాంతి    కాముకం .


• నీ వాసం    పరంధామం .

  సూర్యచంద్రులు   చేరని   తేజోమయం .

• నీ స్థానం    నిర్వాణ ధామం .

  పవనగీతికలు   లేని   మౌన   సాగరం .


• క్షణము లో    చేరే     యోగము తో

  నీ   సన్నిధానం .

• తక్షణము   పొందే   ధ్యానము లో

  నీ   శక్తి  ధారణం  .


• శాంతి   స్వరూప     శశి వదన

  శాంతి   స్వరూప     శశి వదన

• మా దేహం    నీ స్మృతి  సదనం

  మా ప్రాణం     శాంతి   కాముకం .


• శివమను     స్వరం

  మన   బంధానికి   పాశం .

• తెలియక    ఈ  సత్యం

  ఎన్నో   భవబంధాలకు   వశం .


• నీ   మౌనం   మనోహరం

  అదే   మేలుకొలుపు   దివ్యాస్త్రం .

• నీ      జ్ఞానం    మనోవికాసం

  అదే   జీవనయానపు   రాజరికం .


• నీ  సహవాసం   దివ్యానుభూతం.

  అది  జన్మ  జన్మల    పుణ్యఫలం .

• నీ   స్నేహం       మధురానుభూతం 

  అది  వర్ణ కు రాని   అతీంద్రియ సుఖం .

  

• శాంతి    స్వరూప     శశి వదన

  శాంతి    స్వరూప     శశి వదన

• మా  దేహం    నీ స్మృతి    సదనం

  మా  ప్రాణం     శాంతి     కాముకం .


ధన్యవాదములు శివ బాబా. 🙏

మీ  కోసం రాయాలి  అని  మనసు  తపన పడుతున్న ఈ సమయంలో ,  ఏమి రాయాలో  తెలియక  ఆలోచనల శూన్యం తో  ,  చేతులు కదలడం లేదు . కానీ , నా  మనసు  ఈ క్షణం  రాయాలి అని ఒత్తిడి చేస్తుంది . కానీ రాసే శక్తి లేదు .

ప్రేమ తో  నోరు తెరిచి  మిమ్మల్ని అడిగిన ,  కొద్ది క్షణాలలో నే   మీరు ఈ  ఆలోచనలను  ధారణ చేశారు , ఇలా రాయించారు.  నా ఆర్తి ని  తీర్చారు .  ఇది మీ  శక్తి కి  , మన బంధానికి  నిదర్శనం అనడానికి , ఇంతకు మించి ఈ నిమిత్తమాత్రునికి  ఏం కావాలి   శివ బాబా. 

ధన్యవాదములు శివ బాబా. 🙏


కాముకం = కోరుకోవటం 

పరంధామం =  ఇహ లోకం కానిది . పర లోకము.

నిర్వాణధామం = వాణి లేని లోకం. నిశ్శబ్ద లోకం

పవనగీతికలు  = గాలుల అలలు

వర్ణ =  వర్ణించు , వివరించు 


యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2025 9:30 AM.


Wednesday, October 1, 2025

695 . కొడుకా ఓ కొడుకా !

 

కొడుకా    ఓ     కొడుకా !



• కొడుకా  ఓ  కొడుకా  !

  కొడుకా  ఓ  కొడుకా  !


• అమ్మవారి   కంటే    ముందు

  నీ   అమ్మను   కొలువ  రా  . . . 

• పండుగలు     పబ్బాలు

  ఇంటి  అమ్మతోనే    కద  రా . . . 


• ఆ    అమ్మవారి    రూపమే

  నీ    అమ్మ   అని   తెలుసుకో  . . . 

• ముసలిదైన   గాని   ముగ్గురమ్మల

  మూలపుటమ్మగా   కొలచుకో  రా   . . . 

  కొడుకా  ఓ   కొడుకా  !


• పిండి పెట్టి  ఒళ్ళు నలచి   

  వండి  పెట్టి   వడ్డిస్తే  . . . 

• ఇంటివాడి   వైతివి   

  ఓ జంట  తోడు  వైతివి  రా .

• ఆలి    నీ   అంతరమై నా   కానీ 

  అమ్మ  నీ   ఆరాధన రా  .

• గర్భం లో    పంచింది   అమ్మ  ఊపిరి 

  దర్పం తో    దీనం గా   చూడకు రా .


• నీ కంటిలోన   నీరు   

  తుడిచేది   అమ్మ రా  . . . 

• నీ   వొంటిలోన   సత్తువను  

  సేర్చేది    నీ   అమ్మే రా .

  కొడుకా   ఓ   కొడుకా  !


• నీ గుండెలో   లేని   అమ్మ

  గుడి లోన   ఉండదు రా . . .

• గుడి లోన   అమ్మ కూడా

  ఒక   అమ్మకు   బిడ్డే  రా .


• ఇంటిలోన   అమ్మను   బొమ్మగా చూస్తావు

  గుడిలోన   బొమ్మను   అమ్మగా  కొలుస్తావు . 

• ఆకలేసిన   అమ్మకు   పస్తులు   వడ్డిస్తావు  

  గుడిలోన   బొమ్మకు  నైవేద్యాలు నివేదిస్తావు .


• వెతికితే    నీకు   వెయ్యి   దేవుళ్ళు . .

  ఆ . . . 

  వెతికితే    నీకు    వెయ్యి   దేవుళ్ళు . .

  దొరుకుతారు   గానీ

• నీ   కన్నతల్లి    సాటిరాదు   

  వేరెవరూ   ఈ    లోకములో . . . 


• తెలుసు   కో   రా   కొడుకా . . . 

  తెలుసు   కో 

  లేకపోతే . . .

  అమ్మ  పాణం  వదిలాక   . . 

  ఆ . . . 

  అమ్మ   పాణం   వదిలాక . . 

  నువు   పెట్టే    పిండా  కూడు 

  కాకులు   కూడా   

  ముట్టవు రా  . . .  ముట్టవు రా .

  

• తెలుసు కో  రా   కొడుకా . . . 

  తెలుసు కో 

  ఇప్పుడు   కాకపోతే   ఇంకెప్పుడు  రా . . .

  కొడుకా   ఓ   కొడుకా   !

  కొడుకా   ఓ    కొడుకా !


ఓం శాంతి . . . ఓం నమఃశివాయ 🙏 


🌹 🌹 🌹

అమ్మలకు . . . 

అమ్మలను  కన్న   పెద్దమ్మ కు  

వందనములు  🙏

అందరికీ  విజయదశమి శుభాకాంక్షలు 🙏.

💐 💐 💐


తులసి రామకృష్ణ  , యడ్ల శ్రీనివాసరావు .

1 Oct  2025 .   10:00 PM 




701 . సెలయేరు కన్నీరు

  సెలయేరు  కన్నీరు • జారే    నీరు    సెలయేరు   మదిలో   పారే   నీరు    కన్నీరు . • సెలయేటి    పరవళ్ళు   చక్కంగా    నింపెను    ఆనందం . • కన...