Thursday, April 22, 2021

48. ఓ బాబు... బుజ్జి బాబు


కౌమారం…. నుండి…యవ్వనం


• మారం…..కౌమారం….
• చూపుల్లో సుకుమారం…. మాటల్లో మమకారం…
• మారం…మారం…..మేం మారం.

• యవ్వన బాటలో ఉర్రూతలూగే  బాబు…ఓ చిట్టి బాబు.
• నీ లేత ముఖము చూసి అమాయకమే  సిగ్గు పడుతుందట……నీ నడత చూసి పచ్చని చెట్లే పేరంటమవుతాయట‌.
• నీ దర్పం చూసి రామచిలుకలే   నాట్య చేస్తున్నాయి……ఓ బాబు.. చిట్టి బాబు…. పదహారణాల బుజ్జి బాబు.

• చిర్రుబుర్రుల భావాలు, చెట్టాపట్టాల స్నేహాలు విందయ్యెను…కడుపునింపెను.
• ఊసులే మాటలయ్యెను….. మాటలే పలుకులయ్యెను…… పలుకులే ప్రాణమయ్యెను, నీ ప్రాయానికి….ఓ బాబు ..బుజ్జిబాబు…

• చెదరని క్రాపును చెక్కుతూ …. ముఖానికి చేతి రుమాల లో పౌడరు పూస్తూ…. ఓరకంట చూసే ఓ బాబు….ఎవరి కోసము……ఎందుకోసము….. బాబు.
• రంగుల ఎంపిక  కోసమా…..ఇంద్రధనుస్సు వర్ణాల కోసమా….గలగలలాడే కాలిమువ్వల సెలయేరుల సవ్వడి కోసమా…..
• కనిపించే రంగుల కన్నా, కనిపించని రంగుల కోసం …అర్రులు చాస్తావు ఎందుకు ఓ బాబు…చెప్పు బాబు…బుజ్జి బాబు….నా చిట్టి బాబు.

• నిలవని పాదం నీ నైజం, నింగికెగసే ‌మనసు నీ మనసు నీ సొంతం.
• శోధించే కన్నులు నీ వయనం, తడబడే పెదవులు నీ పరువం.
• నీ స్పర్శకు ఎన్నో గులాబీలు ఎదురు చూసెనే, ఆశ చెందెనే…… (వాటి) ముళ్లు కూడా  పానుపై పిలిచెనే  బాబు…. ఓ  బాబు…ఎందుకు బాబు….నూనూగు మీసాల ప్రవరుడా……ఓ భవిష్య వరుడా(పెళ్లి కొడుకా)!

YSR 20 Apr 21 11:00 pm












Saturday, April 17, 2021

47. చెలిమి చెంత చింత ఏల ఈశ్వరా!


            చెలిమి చెంత చింత 😢 ఏల ఈశ్వరా!

• అక్కడ ఇక్కడ ఎక్కడ   ఏలనే  ఈ చింత.

• చింతలే లేని ఈ చెలిమి

  ఏ చెలిమికి చేదయ్యెనో ?

  ఏ చెలిమికి చేటయ్యెనో ?

  ఏ చెలిమి చెంత చిగురించెనో

• ఓ ఈశ్వరా…. పరమేశ్వరా!


⭐⭐⭐

• చెలిమిల సమూహం సందడికి, సవ్వడికే కదా.

• వినోదం కోసమే ప్రయాస కాని, 

  వివాదాలు కోసం కాదు,   

 గుర్తింపు కోసం అంతకన్నా కాదు.

 ఏమిచ్చినా నీ భిక్షే

 ఏం తీసుకున్నా మా రక్షణకే కదా!  ఓ ముక్కంటి.


• చెలిమి కాని చెంత    చేరువగా నుండి 

  చేదునెంత కాలం      భరించవలే ఈశ్వరా!


• ఒక చేదు (తో) చెలిమి నాకైన సమ్మతమే  

  కానీ

 “చేటు”  నావారికైతే  రక్షణేది  ఈశ్వరా!


⭐⭐⭐

• ప్రక్షాళనే  పునరుత్తేజమంటావు

   నిను శిరసావహించడమే శరణ్యం.


• ఆడించెడి నీకు ఏ ఆట ఎందుకో

  తెలియదా?  ఓ మౌన ముని.


• చింతకు మూలం 

  చెలిమి చెంత చిగురించే … నా ప్రేమా …

  నా రూపమా … నా  రాతలా … నా చేతలా…

  నా మాటలా … నాలో నాకు కానరాని

  అహంకారమా?


• ప్రక్షాళన ఆట ఆడేవారికా ?…లేక

  నీలో కలుపుకున్న నాకా ?

  ఈశ్వరా …. ఓ విభుథేశ్వరా!.


• కొందరి చెలిమి ల   నిందలకు 

  నను నెలవు చేసితివి

  నేనేమి టో  నీకెరుగదా ?

  నా ద్రుష్టి ఏమిటో  నీకు తెలియదా ?


  ఓ ధ్యాన మహర్షి 

  దుఃఖం తో  సంచిత కర్మలను  కరిగిస్తున్నాను

  అంటున్నావు.

  సహనం సన్నగిల్లుతుంది స్వామి

  ఈ  “కలి”  మాయా కల్లోలం లో  నేనుండలేను

  నీ ధూళిలో   నను రేణువు  గాంచు  భస్మేశ్వరా!


• నీ చెంత నా ఈ చింత …ఈశ్వరా… పరమేశ్వరా!    


⭐⭐⭐⭐

స్నేహమంటే కాల క్షేమమే కాని కాల క్షేపం కాదు.

⭐⭐⭐⭐

చింత = సమస్య.

చెంత = దగ్గర, వద్ద.

చెలిమి = స్నేహితులు, స్నేహం.

ప్రక్షాళన = సరిదిద్దు కోవడం.

సమూహం = స్నేహ బృదం.

సంచిత కర్మ =పూర్వజన్మ లోని పాపపుణ్యాలు 


యడ్ల శ్రీనివాసరావు. 16 APR 21 9:00 pm







46. లత లలిత లావణ్యం


                🌹 లత లలిత లావణ్యం 🥀

• ముత్యాల మురిపెంతో మురిపిస్తావు.

• రత్నాల వదనంతో మెరిపిస్తావు.

• అలుపెరుగిన మనిషికి

  అలుపెరుగని మనసుతో….

• లలితంగా లాలిస్తావు

   లతలతో ఆడిస్తావు…

• ఓ  కలువ కుసుమాంబరి.

⭐⭐⭐⭐

• నీ అరచేతి పిలుపే     సొగసైన వలపై

• నీ నిట్టూర్పు నీడలో   సేదతీరెనే

• ఓ పరిమళాల పారిజాతమా.


⭐⭐⭐⭐

• నీ చెక్కిలి చిన్న బోయినా

   చిబుకం బుంగ పోయినా

• కలవరపడినే తుమ్మెదలు

  కదమున పడెను కిన్నెరలు

• ఓ  వెన్నెల విహారి.


⭐⭐⭐⭐

• నీ మేని ఛాయ …. మనో వికాసం.

• వాలుజడ విన్యాసం …. నా హ్రుదయ తరంగం.

• ఓ  సప్త వర్ణాల స్పటికమా.


⭐⭐⭐⭐

• నీ ముంగురులు తాకిన గాలికి 

   సిగ్గాయెనే … నీ కేశములు కానందుకు

• అది చూసి  అసూయ చెందాను

   నేను గాలిని కానందుకు.

• ఓ  వారిజాక్షి.


YSR  13 Apr 21 9:00 pm


కదము = గుర్రము సహజ నడకకు విరుద్ధమైన, అపసవ్యమైన

కిన్నెర = వీణా వాద్యం



45. మనిషి అంతరంగం...ఒక సముద్రగర్భం

 

·         మనిషి అంతరంగం- ఒక సముద్రగర్భం

·        సముద్రంచాలా విశాలమైనది ,లోతైనది...అది ఎంత అంటే మనిషి మనసంత.

 

·        తీరంలోని సముద్రానికి లోతు తక్కువ, ఉరకలతో నిండిన అలలు తాకిడి ఎక్కువ. తీరం లో నీరు నిశ్చలంగా ఉండదు. తీరంలో ఉన్న తేలికైన నావ కూడా  స్థిరంగా ఉండదు. అదే  విధంగా మనిషి “యవ్వనం స్థితిలో(20-39) , మనసు లో కోరికలు, ఆలోచనలు,  బాధ్యతలు, వ్యక్తిత్వం చాలా వరకు అయోమయంగానే ఉంటాయి.

·        తీరం లోని సముద్రం లోతు కంటికి పారదర్శకంగా కనిపించినట్లే , యవ్వనంలో మనసు లో ఆలోచనలు, చేసే కర్మలు (పనులు) కూడా చూసే వారికి సునాయాసంగా అర్థమవుతాయి.

 

·        నడి సముద్రానికి (సముద్రం మధ్యలో) మాత్రం లోతు చాలా ఎక్కువ , అలలు ఉండవు . నీరు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది . ఎంతో బరువైన ఓడ కూడా నడి సముద్రంలో స్థిరంగా ఉంటుంది. ఒక విధంగా ఇది మనిషి  “మధ్య యవ్వన స్థితి లో” (40-59), మనసు అంతరంగం లాంటిది, అంతరంగం  లోని ఆలోచనలు, బాధ్యతలు, కోరికలు, వ్యక్తిత్వం కూడా ఇలాగే ఉంటాయి.

·        కానీ నడిసముద్రం యొక్క లోతు , మధ్య యవ్వనంలో మనసు అంతరంగం తెలుసుకోవడం చాలా కష్టం. ఇది అంత సామాన్యమైన విషయం కాదు . కానీ సృష్టి చాలా విచిత్రమైనది. కాలగమనంలో చంద్రుడు ఒక నిర్దిష్టమైన కక్ష్యలో  ( particular stationary orbit) భూమికి ,  సముద్రానికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు మాత్రమే ,  చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వెన్నెల సముద్రం పై పడినపుడు ,  నడి సముద్ర గర్భంలోని విపరీతమైన లోతు, ప్రమాదకరమైన పర్వతాలు , సముద్ర గర్భంలోని వింతలు , చంద్రునికి కనిపిస్తాయి.........అదేవిధంగా చంద్రుని వంటి ప్రకాశవంతమైన వ్యక్తులు ఒక నిర్దిష్టమైన ఆలోచనా సరళితో మధ్య యవ్వనంలోని మనిషికి దగ్గర అయినప్పుడే మనసు యొక్క అంతరంగం , దానిలోని కష్టాలు  , సుఖాలు , బాధలు, ప్రేమలు  , కన్నీళ్లు, జ్ఞాపకాలు  పంచుకోగలరు. చంద్రుడి వంటి ప్రకాశవంతమైన  వ్యక్తులు మరొకరికి చేరువ అయ్యే వరకు, ఇవన్నీ మనిషి అంతరంగం లో  దాచుకుంటూ ఉంటాడు , నడి సముద్రం వలే.   నిర్మలమైన నడి సముద్రం బరువైన ఓడను మోసినట్లే , బాధ్యతలను మోస్తాడు.   నడి సముద్రగర్భంలో ఎన్ని తుఫానులు వచ్చినా, పైకి నీరు నిశ్చలం గానే ఉన్నట్లే, మనసులో ఎన్ని సమస్యలు ఉన్నా, తన వారిపట్ల, కుటుంబ భాద్యతల పట్ల, ఓర్పు తో సంతోషంగానే ఉంటాడు.

 

·        ఏదిఏమైనా మనిషి అంతరంగం, సముద్రం గర్భం లోతు పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలంటే ఒక భగవంతుని కే సాధ్యం. ఎందుకంటే జ్ఞానమున్న ప్రతి మనిషి కూడా కొన్ని సందర్భాల్లో  తన మనసు, అంతరంగం పట్ల అవగాహన ఉండదు, అందుకే ప్రతి మనిషి  నమ్మకం కలిగిన ఉన్న సాటి మనిషి సహాయం కోసం  (అహంకారం రీత్యా వ్యక్తపరచకపోయినా) జీవిత కాలంలో, ఏదోక సమయంలో, ఎదురు చూస్తూనే ఉంటాడు.

 

 యడ్ల శ్రీనివాసరావు   2021

Tuesday, April 13, 2021

44. స్వేచ్ఛ.....బంధం


స్వేచ్ఛ బంధం

• మనిషి కి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చాలా రకాల బంధాలతో జీవన ప్రయాణం సాగుతూ ఉంటుంది . మనిషి స్వేచ్ఛా జీవి , ఇలా అనుకోవడం వరకు బాగానే అనిపిస్తుంది కానీ నిజమైన స్వేచ్ఛ మనిషికి  ఉందా, ప్రతి మనిషి స్వేచ్ఛను అనుభవిస్తున్నాడా?....అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ...అసలు స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఏమిటి , కొంతమంది అంటారు స్వేచ్ఛ అంటే తనకు నచ్చినట్టు బ్రతకడం అని . ఇది కొంతవరకు నిజమే అని అనిపించినా , ఇలా ఉండడం సాధ్యమా అని అనిపిస్తుంది . ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి చివరి వరకు తనకున్న ప్రతిబంధం లోను లెక్కలు వేసుకొవడం తోను,  బాధ్యతలతో , త్యాగాలతో సతమతమవుతూ, తనను తానే మరచిపోయి పూర్తిగా ఒక  యాంత్రికమైన జీవితానికి బానిస అయి కాలగమనంలో  కనుమరుగు అయిపోతున్నాడు. . ఈరోజు ఏ స్థాయిలో ఉన్న మనిషి కైనా చిన్న, పెద్ద, ఆడ, మగ , పేద, థనిక అనే తేడా లేకుండా మానసిక ఒత్తిడి తో జీవించడం సర్వ సాధారణం అయిపోయింది .

• మనిషి జీవన ప్రయాణంలో విద్య , ఉద్యోగ, వ్యాపార, కుటుంబరీత్య  ఉన్న మానసిక ఒత్తిడులతో అంతర్గత ప్రయాణం చేస్తూ ,  చివరికి తన ఉనికిని తానే కోల్పోతూ “ పుట్టాము కాబట్టి ఏదో బ్రతకాలి “ అనే నిరాశ, నిస్పృహలతో తరచూ దుఃఖిస్తూ ఉంటాడు. కొంతమంది ఇటువంటి ఒత్తిడులను ఎదుర్కోవడానికి  లేదా ఒత్తిడి లను ఎదుర్కోలేక ఏదో ఒక వ్యసనాలకు మరింత బానిసలై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తుంటారు .
ఈ ఆధునిక కాలంలో సామాన్యుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకూ ఎవరు ఈ పరిస్థితికి వ్యతిరేకం కాదు .

• ఇక అసలు విషయానికి వద్దాం ... మరి మనిషికి స్వేచ్చ ఏది ? స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది ? స్వేచ్ఛగా బ్రతకడం ఎలా ? అసలు స్వేచ్ఛ వలన పొందే ప్రయోజనం ఏంటి ?

• స్వేచ్ఛ అంటే మనసుకి నచ్చిన ఆనందం , సంతోషం , కోరికలను సఫలీకృతం చేసుకోవడం వలన పొందిన మానసిక అనుభూతి , మరొక జీవికీ హాని చేయకుండా సంతోషంగా ఉండటం ,  ఒక విధంగా చెప్పాలంటే మనిషికి తన శారీరక మానసిక సమస్యల నుండి ఉపసమనం పొందడం. సహేతుకమైన స్వేచ్ఛ మనిషికి ఒక వరం ,  స్వేచ్ఛ ద్వారా మనిషికి  మనసులో సంతోషం రెట్టింపవుతుంది , తద్వారా శరీరంలో జీవనక్రియలు సక్రమంగా జరుగుతాయి , దుఃఖం దరిచేరదు . ఎంత పని చేసిన అలసట ఉండదు . కానీ ఈ స్వేచ్ఛ ఏనాడు దుర్వినియోగం కాకుడదు.

• స్వేచ్ఛ కోరుకునే మనిషి ,  తన ఆలోచనలను అర్థం చేసుకునే మనుషులతో పంచుకొని తన జీవిత కలలను నిజం చేసుకోవాలనుకుంటాడు . కానీ సమస్య అంతా ఇక్కడే ఉంది  "అర్థం చేసుకునే మనిషి" అంటే ఎవరు? ...ప్రతి మనిషి నిజాయితీగా ఆలోచిస్తే , ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనుషులు నేటి బంధాలలో ఉన్నారా?  అంటే,  ఆ సమాధానం ఎవరి అంతరాత్మ వారికే తెలుస్తుంది . కానీ ఒక్క బంధం లో మాత్రం స్వేచ్ఛ అనేది సంకోచం లేకుండా  మనిషికి దొరుకుతుంది ....అది  నిజాయితీ కలిగిన “ స్నేహబంధం “ మాత్రమే. ఎందుకంటే ఈ స్నేహబంధం లో నచ్చిన స్నేహితులను  ఎంచుకొని, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే స్వతంత్రం మనిషి కలిగి ఉంటాడు . ఎందుకంటే ఇక్కడ  మిగతా బంధాలలో ఉండే వ్యక్తుల మధ్య ఉండే లెక్కలు, పంపకాలు ఏమీ ఉండవు . 

• ఒకటి మాత్రం నిజం స్నేహం లో నమ్మకం నిజాయితీ ఉన్నంతవరకే ఈ స్వేచ్ఛ అనేది ఎవరికైనా దొరుకుతుంది.

• బాల్యం లోనే, ప్రతి మనిషికి పరిమితులు లేని  స్వేచ్ఛ లభిస్తుందేమో అనిపిస్తుంది. అందుకే నేమో పేరు గాంచిన మహానుభావులు కూడా తరచుగా తమ బాల్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు.

యడ్ల శ్రీనివాసరావు 
12 Mar 21, 8:00 pm









43. మహిళ దినోత్సవం 2021

మహిళ దినోత్సవం సందర్భంగా ....


మగాడి జీవితంలో తల్లిగా , సోదరిగా ,భార్యగా ,ఆత్మ బంధువు గా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్త్రీ ని, సూర్యుడు , చంద్రుడు ,పంచభూతాలైన భూమి, నీరు , వాయువు, అగ్ని  ,ఆకాశం మరియు ప్రకృతి తో కలిపి మేళవించి.....చిన్నపాటి ఆలోచనతో మహిళా దినోత్సవ సందర్భమును అనుసరించి రాసిన ఈ చిన్న కవితా రచన,  ప్రతి మహిళకు అంకితం .


• మగువా ఓ మగువా... మనసును కరిగించి, మనిషిని మురిపించి, మగడిని గెలిపించే  తెగువ గల సుందరివి...
• పచ్చా పచ్చని చేలు పరవశించెనే, పలకరించెనే  నిను చూసి...
• ఎర్రా ఎర్రని సూర్యుడు మసకబారినే,  మూలకేగేనే నిను చూసి...
• తెల్లా తెల్లని చంద్రుడు చెంతచేరెనే, సేదతీరేనే నిను చూసి...
• ఓ వదనా... చంద్రవదనా...
• కళకళలాడే కలువవా.....కనకాంబరాల కోమలివా..
• భువిలో వెలసిన భువనసుందరివి  "జానకివి".
• జలమున జగముకు  జననివి   "గంగవి".
• ఉచ్చ్వాస  నిచ్చ్వాస లను శాసించే వాయువుకి "అంజనివి".
• జీవన గతి కి  పురోగతియైన అగ్నికి  "స్వాహాదేవివి".
• అనంతమైన ఆకాశంలో తారల తళుకుల  "తరుణివి"..

మీ బాల్య మిత్రుడు @ YSR, 8 Mar 21, 5:00 am

42. శ్రీ రమణమహర్షి జయంతి

ఓం శ్రీ గురుభ్యోనమః



పూజ్యనీయులు, ఆత్మస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ రమణమహర్షి ల వారి జయంతి సందర్భంగా వారి దివ్య చరణారవింద పాదపద్మములకు నమస్కరిస్తూ...

ధర్మం ఒక పాదము మీద నడిచే కలియుగంలో 90 శాతం మానవ జీవితం  అరిషడ్వర్గాల తో , దుర్భరం తో, తిరోగమనం తో, అంధకారంలో బ్రతుకుతున్న మానవుని పై జాలి, ప్రేమతో భగవంతుడు శ్రీ రమణులు వంటి మహనీయుల రూపం లో మానవ శరీరం ధరించి , సమస్త మానవాళికి, జగత్తు కు వెలుతురు చూపించే జ్ఞాన జ్యోతి గా అవతరించారు.
 “యోగం” అంటే రాజరికం, భోగం, విలాసం అనే ఆలోచన తో ఉన్న మానవునికి  “యోగం” అంటే “అంతరంగం లో ఉన్న  ఆత్మను గ్రహించి, ఆత్మానందం కలిగివుండటం” అని తెలియచేసిన మహా యోగీశ్వరులు రమణమహర్షుల వారు.

• మీ నిరాడంబరత మానవుని బ్రతుకు బాట కు రాజమార్గం.
• మీ ప్రేమ తత్వం  సమస్త జీవుల బాంధవ్యాలకు జ్యోతి స్వరూపం.
• మీ మౌనం భూమండలం లోని మానవాళి సమస్యలకు పరిష్కారం.
• మీ వంటి మహర్షులు నేడు భౌతికంగా కనిపించకపోయినా ఈ పంచభూతాలలో అణువణువై మా శరీరం, ఆత్మలను స్పృశిస్తూ, మిము తలచిన వారి చెంత నిరంతరం వెన్నంటి నడిపిస్తారు...అని సంతోషంగా చెప్పుకో గల అద్రుష్టవంతుడిని నేను... ఎందుకంటే ఏ ఆలోచన, అక్షరము, ఆధ్యాత్మిక పరిజ్ఞానము లేని నాకు మీ వంటి మహర్షులను స్తుతించే జ్ఞానము…..  మీ ఆత్మ భిక్ష కాక , నేనేమి ఊహించుకోగలను…. ...ఓ మహాత్మా...ఓ గురు మహర్షి. 

భారతభూమి కర్మభూమి, వేదభూమి , పుణ్యభూమి అని చరిత్ర కొనియాడుతుంది. అందువలనేమో మానవరూపంలో ఏ భూభాగం లోలేని మహనీయులు, మహాత్ములు, యోగులు, తల్లి స్వరూపులు(మదర్ థెరిస్సా)  వంటివారు ఎందరో ఇక్కడ జీవించి, గురుతత్వం తో మరెందరికో మార్గదర్శకులవుతూ ఉంటారు.

శాంతి, ప్రేమ ఉచ్వాస, నిచ్చ్వాసాలు గా, మీ ఆత్మస్పర్శ అందరికీ ముక్తి దాయకం కావాలని కోరుకుంటూ..

** On One fine Day, Before Leaving ..… A question arises within you….” WHO AM I “…. If you are wise be search  the answer  from “ RIGHT NOW “.
ఓం నమఃశివాయ

యడ్ల శ్రీనివాసరావు
27 -03-21, శనివారం, 8:00  am.

41. Tom and Jerry


• Tom cat 🐱…Jerry mouse 🐀


• Love you Tommy…Love you Tommy …Love you
• Love you Jerry…Love you Jerry…Love you…
• You are my sweet…You are my hot…You are my sour…You are my salt.
• Tommy my pain is your fun….My tears are your laugh…O Tommy…My Tommy
• I never…ever imagine …. Without you…My Tommy …Love you Tommy...
• Jerry …my Darling….we never been two…we ever been green….
• When you pinch my tail…I get angry….I feel enemity…
• Tommy O mTommy...When you are hitting….makes me pleasant….makes me sweet
• Love you…Love you Jerry…Love you …Love you Tommy.
• Always Search my eyes …search my thoughts…more and more when you’re silent and when you’re not with me…
• We are different…But we are One…Because of Love…Love…Love.

YSR …08 Apr 21, 11:00 pm


• టామీ  cat …. జెర్రీ mouse
• గడసరి టామీ….సొగసరి జెర్రీ
• నువ్వే నా స్నేహం…నువ్వే నా వైరం
• టామీ….ఓ టామీ ‌‌నీ మూతి మీసమంత లేదే నా తోక
• కానీ నా తోకకి నువ్వే తోడు నీడ…టామీ…ఓ టామీ.
• చిలిపి చెలిమే…వలపు కలిమై  ఎదురుచూసెనే జెర్రీ…ఓ జెర్రీ.
• దాగుడుమూతల దొంగాట ల్లో...దగ్గరయ్యేనే మన బంధం
• చిందర వందర గందరగోళం తో…. ముసి ముసి నవ్వులు నవ్వించెనే మన కలయిక.
• బుడి బుడి అడుగులు…వడి వడి నడకలే మన వయ్యారం.
• ఇద్ధరం కాని ఒకరం ….. శత్రువులైన మిత్రులం.
• జెర్రీ…ఓ జెర్రీ ఎదురు చూసెనే , గిర గిర తిరిగే ఈ గోళీ కన్నులు…..నీకోసం
• మన జాతులు వేరైనా…జాతి రత్నాలమే….ఈ మానవ జాతికి.

YSR.. Thu 8 Apr 21..8:30 pm.











40. ఆసలు భాసలు

ఆసలు భాసలు



• ఏమిటీ ఆశలు....ఎందుకీ భాసలు
• ఆశలే ఆర్తియై.....భావమే భాషయై

• మరుగున ఉన్న మనిషికి....
• తారల తళుకుల తేజంతో.
• జీవము లేని మనసుకు….
• వెన్నెల వెలుగుల వదనంతో.

• ఎందుకీ ఆశలు.....ఏమిటీ భాసలు
• ఆశలే ఆర్తియై….భావమే భాషయై

• గమనమే గరళమై.....మాటలే మౌనమై
• కన్నీరు కాంతిలో.....మసకబారిన మధురం తో

• జీవితమే దహనమై….చేతలే మైనమై
• పన్నీరు గంధంలో…. సువాసనలేని పరిమళం తో

• జతకాని నేను.....జంటగా నిను చూస్తే
• చారడంత కళ్లు...... బారడంత బరువై

• ఎందుకీ బాధలు.....ఏమీ టీ ఆశలు
• ఆశలే ఆర్తియై…..భావమే భాషయై

• గతించిన గతానికి.....గంతలు లేకుంటే
• జనించిన స్నేహనికి..…చింతలు రాకుంటే

• ఘల్లు ఘల్లు మనె గజ్జెయై...
• భరణమై ఆభరణమై…
• కిరీటం లో కిరణమై...
• నా రాజ్యానికే రారాణివై.
• మతి వై నా నా మదికి
• "శ్రీ" మతి వై నా నా శిరసు శిఖరానికి.....

• వేదనే వర్ణమై…..ఆవేదనే ఆకాశమై
• రోదనే కర్ణమై….నిరోధనే నిశీధియై
• రచనలే రత్నాలు గా….పదములే పరమాన్నం గా
• వచనలే ముత్యాలు గా….కవితలే కమనీయంగా
• కాలమే కడలి కలముయై అలలా కదలాడుతుంది.


యడ్ల శ్రీనివాసరావు  Feb 2 2021 7:00 am

ఆర్తి =మనోవ్యధ
గమనం = ప్రయాణం, దారి
గంతలు = కళ్లు మూసివేయు
మతి = ఆలోచన
కర్ణం = శబ్ధం





39. బాల్యమా....భవ బంధమా


బాల్యమా…. భవబంధమా


· మధురం మధురం నా బాల్యం ...‌..ఎంతో మధురం నా బాల్యం.

·  ఉరుకుల పరుగుల తరుణంలో వదనంలోమదనంతో  ఊరేగెనా…..

·  బాల్యమా.... భవ బంధమా

·  బడి బ్రతుకే బంగారం....సింగారం.....జీవనగారం..

·   బాల్య మా.....భవ బంధమా

·   తొలకరి చినుకుల జల్లుల్లో,  గుంపులు గుంపులుగా, జంటలు  జంటలుగా , బడి మైదానంలో , తడిచిన బట్టలతో....ఉప్పొంగెనే,  ఊరేగనే,  ఉరకలేసెనే....నా బాల్యం...

·  మధురం మధురం నా బాల్యం ఎంతో మధురం నా బాల్యం

·  వేసవి వేడితో వీధుల్లో ....చింత చెట్ల నీడల్లో, పొలము గట్ల బోదెల్లో ...ఆడిన ఆటల  మధురంతో వికసించెనే , విహరించెనే ...నా బాల్యం.

·   బాల్యమా.... భవబంధమా

·   చిరుగు జేబుల నిక్కర్లో   ,. ఇంకు మరకల చొక్కాల్లో ,   రింగు రింగుల కేశాల్లో  దాగి ఉన్నదే నా అందం ....దాగి ఉన్నదే నా చందం..

·   బాల్యమా….భవ బంధమా

·   అమ్మానాన్నల చేతుల్లో, చేతులు వేసాం,  జోరు గా హుషారుగా   అడుగుల్లో అడుగులు వేసాం, .....

·   మధురం మధురం నా బాల్యం ...ఎంతో మధురం నా బాల్యం

 

యడ్ల శ్రీనివాసరావు

13 Mar 21, 8:00 am

 

588. కలియుగ కురుక్షేత్రం

  కలియుగ  కురుక్షేత్రం • కురుక్షేత్రం  ఎక్కడ జరిగింది  అంటే,  వెంటనే మనం అనుకునేది   మహాభారతం లో  అని.  ఇంకా  అది పాండవులకు,  కౌరవులకు  జరిగ...