Tuesday, April 13, 2021

44. స్వేచ్ఛ.....బంధం


స్వేచ్ఛ బంధం

• మనిషి కి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చాలా రకాల బంధాలతో జీవన ప్రయాణం సాగుతూ ఉంటుంది . మనిషి స్వేచ్ఛా జీవి , ఇలా అనుకోవడం వరకు బాగానే అనిపిస్తుంది కానీ నిజమైన స్వేచ్ఛ మనిషికి  ఉందా, ప్రతి మనిషి స్వేచ్ఛను అనుభవిస్తున్నాడా?....అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ...అసలు స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఏమిటి , కొంతమంది అంటారు స్వేచ్ఛ అంటే తనకు నచ్చినట్టు బ్రతకడం అని . ఇది కొంతవరకు నిజమే అని అనిపించినా , ఇలా ఉండడం సాధ్యమా అని అనిపిస్తుంది . ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి చివరి వరకు తనకున్న ప్రతిబంధం లోను లెక్కలు వేసుకొవడం తోను,  బాధ్యతలతో , త్యాగాలతో సతమతమవుతూ, తనను తానే మరచిపోయి పూర్తిగా ఒక  యాంత్రికమైన జీవితానికి బానిస అయి కాలగమనంలో  కనుమరుగు అయిపోతున్నాడు. . ఈరోజు ఏ స్థాయిలో ఉన్న మనిషి కైనా చిన్న, పెద్ద, ఆడ, మగ , పేద, థనిక అనే తేడా లేకుండా మానసిక ఒత్తిడి తో జీవించడం సర్వ సాధారణం అయిపోయింది .

• మనిషి జీవన ప్రయాణంలో విద్య , ఉద్యోగ, వ్యాపార, కుటుంబరీత్య  ఉన్న మానసిక ఒత్తిడులతో అంతర్గత ప్రయాణం చేస్తూ ,  చివరికి తన ఉనికిని తానే కోల్పోతూ “ పుట్టాము కాబట్టి ఏదో బ్రతకాలి “ అనే నిరాశ, నిస్పృహలతో తరచూ దుఃఖిస్తూ ఉంటాడు. కొంతమంది ఇటువంటి ఒత్తిడులను ఎదుర్కోవడానికి  లేదా ఒత్తిడి లను ఎదుర్కోలేక ఏదో ఒక వ్యసనాలకు మరింత బానిసలై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తుంటారు .
ఈ ఆధునిక కాలంలో సామాన్యుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకూ ఎవరు ఈ పరిస్థితికి వ్యతిరేకం కాదు .

• ఇక అసలు విషయానికి వద్దాం ... మరి మనిషికి స్వేచ్చ ఏది ? స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది ? స్వేచ్ఛగా బ్రతకడం ఎలా ? అసలు స్వేచ్ఛ వలన పొందే ప్రయోజనం ఏంటి ?

• స్వేచ్ఛ అంటే మనసుకి నచ్చిన ఆనందం , సంతోషం , కోరికలను సఫలీకృతం చేసుకోవడం వలన పొందిన మానసిక అనుభూతి , మరొక జీవికీ హాని చేయకుండా సంతోషంగా ఉండటం ,  ఒక విధంగా చెప్పాలంటే మనిషికి తన శారీరక మానసిక సమస్యల నుండి ఉపసమనం పొందడం. సహేతుకమైన స్వేచ్ఛ మనిషికి ఒక వరం ,  స్వేచ్ఛ ద్వారా మనిషికి  మనసులో సంతోషం రెట్టింపవుతుంది , తద్వారా శరీరంలో జీవనక్రియలు సక్రమంగా జరుగుతాయి , దుఃఖం దరిచేరదు . ఎంత పని చేసిన అలసట ఉండదు . కానీ ఈ స్వేచ్ఛ ఏనాడు దుర్వినియోగం కాకుడదు.

• స్వేచ్ఛ కోరుకునే మనిషి ,  తన ఆలోచనలను అర్థం చేసుకునే మనుషులతో పంచుకొని తన జీవిత కలలను నిజం చేసుకోవాలనుకుంటాడు . కానీ సమస్య అంతా ఇక్కడే ఉంది  "అర్థం చేసుకునే మనిషి" అంటే ఎవరు? ...ప్రతి మనిషి నిజాయితీగా ఆలోచిస్తే , ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనుషులు నేటి బంధాలలో ఉన్నారా?  అంటే,  ఆ సమాధానం ఎవరి అంతరాత్మ వారికే తెలుస్తుంది . కానీ ఒక్క బంధం లో మాత్రం స్వేచ్ఛ అనేది సంకోచం లేకుండా  మనిషికి దొరుకుతుంది ....అది  నిజాయితీ కలిగిన “ స్నేహబంధం “ మాత్రమే. ఎందుకంటే ఈ స్నేహబంధం లో నచ్చిన స్నేహితులను  ఎంచుకొని, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే స్వతంత్రం మనిషి కలిగి ఉంటాడు . ఎందుకంటే ఇక్కడ  మిగతా బంధాలలో ఉండే వ్యక్తుల మధ్య ఉండే లెక్కలు, పంపకాలు ఏమీ ఉండవు . 

• ఒకటి మాత్రం నిజం స్నేహం లో నమ్మకం నిజాయితీ ఉన్నంతవరకే ఈ స్వేచ్ఛ అనేది ఎవరికైనా దొరుకుతుంది.

• బాల్యం లోనే, ప్రతి మనిషికి పరిమితులు లేని  స్వేచ్ఛ లభిస్తుందేమో అనిపిస్తుంది. అందుకే నేమో పేరు గాంచిన మహానుభావులు కూడా తరచుగా తమ బాల్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు.

యడ్ల శ్రీనివాసరావు 
12 Mar 21, 8:00 pm









No comments:

Post a Comment

492. ప్రణయ గీతం

  ప్రణయ గీతం  * Male * Female   • ఏదో   ఏదో    ఉన్నది   అది  నాలో  నీలో  ఉన్నది. • అది   ఏమిటో   నాకు  తెలియకున్నది    మరి   నీ కైనా   తె...