Tuesday, August 29, 2023

392. రక్షా బంధన్ విశిష్టత

 

రక్షా బంధన్ విశిష్టత 

రాఖీ పౌర్ణమి 




రక్షా బంధనం రాఖీ పౌర్ణమి.   రక్షా అంటే రక్షణ, protection.   ప్రతీ బంధం లో రక్షణ కలిగి ఉండాలి అనే శుభ సంకల్పం ఈ పండుగ రహస్యం.

ఈ పండుగ యొక్క సూక్ష్మ అర్దం చాలా మంది కి తెలియక ఇది పూర్తిగా  బాహ్య ప్రపంచ దృష్ట్యా కేవలం సోదర సోదరీమణుల కు సంబంధించిన పండుగ అని అనుకుంటారు.


అసలు సోదర సోదరీమణులు అంటే ఎవరు ?... ఏనాడైనా దీని అంతరార్థం తెలుసుకున్నామా ?


 బాల్యం లో పాఠశాల లో ప్రతి రోజూ ఉదయం ప్రతిజ్ఞ (pledge) చేసే సమయంలో   “ భారతీయులు అందరూ నా సోదర సోదరీమణులు”  అని అంటారు.  అదే విధంగా ప్రతీ పాఠ్య పుస్తకం లో ఈ ప్రతిజ్ఞ (pledge) ముద్రించి ఉంటుంది. దీని  అంతరార్థం ఎవరికీ అర్థం కాక, నవ్వుకుంటారు. ఎందుకంటే  అందరూ సోదర సోదరీమణులు అయితే అసలు వివాహం ఎలా చేసుకో గలుగుతారు , అనే ఆలోచన తలెత్తుతుంది. దీనికి సమాధానం కూడా ఎక్కడా దొరకదు. బహుశా ఎవరో కాని వివరించి చెప్పలేరు కూడా.


ఈ సృష్టికి  భగవంతుడైన  పరమాత్ముడు  తండ్రి. ఆత్మలైన  మానవులు అందరూ  ఆయన పిల్లలు అనేది   సృష్టి  సత్యం.   ఆత్మ పరమాత్మ అనే వాస్తవ దృష్టి నుంచి చూస్తే ,  భగవంతునికి   మానవులకు మధ్య ఉన్న సంబంధం  తండ్రి పిల్లల బంధం.  

తండ్రి ఒక్కడే ,  ఆయన సంతానం అయిన పిల్లలు మాత్రం అనేకం.  ఈ విధంగా  పిల్లలైన  ఆత్మలు అందరూ  సోదర సోదరీమణులు.  ఇది  ఆత్మ దృష్టి కి చెందిన పరమ సత్యం. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలో,   విశ్వ శాంతి కోసం  పాఠ్య పుస్తకాల  ప్రతిజ్ఞ లో  పొందు పరిచారు.


సాధారణంగా మనిషి  ఈ  లోకంలో,   తాను ఒక శరీరం అని అనుకుంటాడే,  కాని అంతకు మించి తనను తాను  ఆత్మ  అనే  నిజం,  మాయ ప్రభావం వలన తెలుసుకో లేడు.

మనిషి ఈ  బాహ్య ప్రపంచంలో జీవించడం కోసం,  తన శరీర ధర్మం మరియు  అవసరాల  కోసం,  కొన్ని బంధాలు, అలవాట్లు, కట్టుబాట్లు ఏర్పరచుకున్నాడు.  ఇందులో భాగంగా  రక్త సంబంధం ఉన్న వారు మాత్రమే  సోదర సోదరీమణులు  అని  నిశ్చయం చేయబడింది  .


మనిషి శరీరంలో  ఉన్న  అనంతమైన  చైతన్య  శక్తి  ఆత్మ.  ఇది అతి  సూక్ష్మాతి సూక్ష్మమైన   బిందు రూపం లో ఉంటుంది.  ఆత్మ  అవినాశి .  అంటే  నాశనం లేనిది,  కానిది. 

This is nothing but Every human being is an amount of  ENERGY.   

ఈ శక్తి అందరిలో ఒకేలా ఉండదు. ఒకరిలో ఎక్కువ, మరొకరి లో తక్కువ గా  ఉంటుంది.  దీనిని బట్టే కొందరు ధైర్యంగా, సంతోషంగా, చిరునవ్వు తో,  పాజిటివ్ గా ఉంటారు. మరికొందరు అధైర్యం గా, దుఃఖం తో,  ఆత్మ విశ్వాసం కోల్పోయి నెగెటివ్ గా ఉంటారు. ప్రతి ఒక్కరిలో  ఈ శక్తి  సమతూకం గా  ఉండదు.


అసలు రక్షాబంధనం పండుగ మూల అర్దం ఏమంటే …. మానవ శరీరం తో ఉన్న   ప్రతీ ఆత్మ  తన తోటి ఆత్మ కు రక్షణ ఇవ్వాలి.  అవసరమైనపుడు సహాయం చేయాలి.  నీకు నేను తోడు ఉన్నాను అనే ధైర్యం కలిగించాలి.  ఒక శక్తివంతమైన ఆత్మ  మరో బలహీనమైన ఆత్మ కు శక్తిని  ధారణ చేయాలి.

ఇక్కడ శరీరం అనే  మాట,  ఆలోచన కి  తావు లేదు.  బంధాలకు  తావులేదు.   ఇదే రక్షా బంధనం లో ఉన్న సూక్ష్మ అర్దం.


ఒకసారి ఇది ఆలోచించి చూడండి. కేవలం అన్నా చెల్లెళ్ళ కేనా రక్షణ… తల్లి తండ్రులు కి, బంధువులకు, స్నేహితులకు, భార్యకు, భర్తకు , పిల్లలకు , సమస్త మానవాళికి, ప్రకృతి కి   రక్షణ కల్పించుకోవలసిన అవసరం లేదా ….  కేవలం రక్త సంబంధానికి మాత్రమే రక్షణ పరిమితమై ఉంటుందా, ఆలోచించండి. 

ఈ రక్షణ అనేది ఒకరికి మరొకరు ఇచ్చుకోవాలి, అనే అద్భుతమైన  సదుద్దేశం ఈ రాఖీ పండుగ లో దాగి ఉంది.


శ్రావణ అంటే   “ ప్రత్యక్షముగా “ అని అర్దం 

శ్రవణం అంటే   “ వినిపించుట “  అని అర్దం.


శ్రావణ మాసం లో వచ్చే  స్నేహితుల దినోత్సవం రోజున కట్టే   friendship band  అయినా ... రాఖీ పండుగ  రోజున  కట్టే రాఖీ అయినా ... వరలక్ష్మి వ్రతం  రోజున  భార్య చేతికిి   భర్త కట్టే తోరం అయినా …  “ ఒకరికి ఒకరు రక్షణ గా ఉన్నాము “  అని ప్రత్యక్షంగా వినిపించడానికి  శుభకరమైన  గుర్తు .  

ఇవి అన్ని  మానవ కళ్యాణం కోసం జ్ఞానులు ఏర్పాటు చేసిన విశిష్టమైన పండుగలు. అంతేకాని ఆడంబరాలు, వృధా ఖర్చుల కోసం కాదు.

రాఖీ కట్టడం అంటే అర్దం ఒకరు మరొకరు  రక్షణ గా జీవితంలో అవసరమైనపుడు అండగా ఉండాలి అని అర్దం. …. ఇది ఒక మానసిక ఆత్మ బంధం… స్త్రీ, పురుష లింగ భేదాలకు,   రక్త సంబంధానికి,  దేహ సంబంధానికి ఇది అతీతం.

కాకపోతే అనాది గా ఒక ఒరవడి కి అలవాటు పడి పోయిన మానవ సమాజం కేవలం  దేహ దృష్టి తో ఈ పండుగ జరుపుకుంటారు.

ఇక్కడ ప్రస్తావించిన ఈ విషయం అంతా నిజమే ,    అని  మనసు కి  అనిపించినా , ఎవరూ ఆచరించ లేక పోవచ్చు.    ఎందుకంటే భయం,  ఎవరు ఏం అనుకుంటారో అని. ఈ భయమే అజ్ఞానానికి పునాది.

భార్య భర్తలకు వివాహ సమయంలో అగ్ని సాక్షిగా ఒకరికొకరు రక్షణగా ఉండాలని ప్రమాణం చేయిస్తారు. కాని నేడు సమాజం లో   చాలా  మందికి  ఈ రక్షణ కొరవడుతోంది అనేది వాస్తవం …. అదే విధంగా రక్త సంబంధం లో ఉన్న అన్నా చెల్లెళ్ళ లో, తమ వివాహాలు అయిన తరువాత, ఈ రక్షణ కేవలం రాఖీ పండుగ కే పరిమితం అవుతుందా లేక  వారి జీవితం చివరి వరకు ఉంటుందా, ఆలోచించండి … అదే విధంగా స్నేహితుల మధ్య రక్షణ ఉంటుందా లేక భక్షణ ఉంటుందా.

మనిషి స్వభావం లో  నిజాయితీ  నిండిన   ప్రేమ  ఉంటేనే రాఖీ పండుగ తో పాటు, ఏ పండుగ కైనా ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే ఈ పండుగలు వృధా ఖర్చులతో చేసుకునే అలంకారాలు గా మిగులుతాయి. తిరిగి నిరంతరం మనల్ని వెక్కిరిస్తూ నే ఉంటాయి. 


నేటి కాలం బంధాలలో మనుషులందరూ ఎంతో దగ్గరగా, భౌతికంగా (Physical), నిత్యం చూస్తూ (Visual) కలిసి ఉంటున్నారు , ఇది సంతోషమే  ….. కానీ మనసు తో, మానసిక అనుభూతి తో ఎందరు కలిసి ఉంటున్నారు ?  

ఈ మానసిక అనుభూతి ఉంటేనే కదా మరొకరి మనసుకు, శరీరానికి, ఆత్మ కు రక్షణ కలిపించ గలరు…. ఎవరు ఎవరికైనా.

పండుగలు మనుషులను, బంధాలను  మానసికంగా  దగ్గర చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది.

ఈ రచన కేవలం , ఒక మంచి ఆలోచన ఉద్భవించాలనే సంకల్పం కోసం. అంతేకాని ఏదీ వ్యతిరేకించాలని కాదు.

రక్షా బంధనం , రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 29 August 2023, 6:00 PM .


No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...