Thursday, June 6, 2024

508. జీవన ఆలంబన

 

జీవన ఆలంబన


ఈ కలి యుగం లో  మానవ జీవితం ఒక నాటకం. ఈ నాటకం లో మానవుడు నిరంతరం నటిస్తూ నటిస్తూ నటిస్తూనే ఉంటాడు. ఇలా నటించడం వలన జీవించడం పూర్తిగా మరచి పోతాడు. అందుకే ఈ కలియుగంలో సత్యానికి,   అసత్యానికి  తేడా తెలియక ,  అసత్యాలను  అవలీలగా మాట్లాడుతూ , అదే సత్యం   అనుకుని  భ్రమలో  మనిషి బుద్ధి పరిభ్రమిస్తూ ఉంటుంది.


అసలు జీవించడం అంటే అర్దం ఏమిటో తెలియకుండానే మానవుని జీవితం జన్మ జన్మలు గా గడిచిపోతుంది.  సాధారణంగా జీవించడం అంటే, తినడం, ఎదగడం, కోరికలు తీర్చుకోవడం, బ్రతకడం, వివాహం, సంసారం, సుఖాలు, విలాసాలు,  సంపాదన, అనుభవించడం, వృత్తి ఉద్యోగాలు, గుర్తింపు ,  ప్రాణాలతో ఉండడం , ఇలా రకరకాల ఆలోచనలతో నిండిన సమాధానాలు మనిషి కి కలుగుతూ ఉంటాయి. ఇదే కదా జీవితం, జీవించడం  ఇంతకు  మించి   ఏముంది?  అనుకుంటారు .


కానీ జీవితం వేరు , జీవించడం వేరు  అని ఎందరికి తెలుసు?.


జీవితం  అంటే  ఆమోదయోగ్యం గా  (అంగీకార ప్రదం గా) అవలభించవలసిన విధానం.

జీవించడం అంటే   ధర్మాన్ని  ఆచరించడం.

ధర్మం అంటే ఇతరులకు, ప్రకృతి కి మనసా వాచా కర్మణా ఏవిధమైన అపకారం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసాలు తీసుకోవడం.   

ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మాన్ని ఆచరించడమే జీవించడం అంటారు.               

ఆ విధానం అనుసరించడమే  జీవనం.  

ఇది సాక్షాత్తూ పరమాత్ముడైన శివుడు మానవుని మనుగడకు నిర్దేశించిన విధానం.  ఇదే సత్యమైన స్థితి కి సోపానం.


మరి  నేటి  కాలంలో  మానవుడు  బ్రతుకుతున్న పద్ధతి ని    జీవించడం అనొచ్ఛా?   మానవుడు ఆచరిస్తున్న  విధానం  జీవనం అనొచ్ఛా? … అంటే ముమ్మాటికీ అనలేం …. ఎందుకంటే ఇది పూర్తిగా కలుషితమైన మానవ ప్రపంచం.   ప్రతీ క్షణం చెడు లొనే ఉంటూ, చెడును ఆస్వాదిస్తూ ,  చెడు పై పోరాటం చేస్తూ బ్రతకాలి. 

చెడు పై పోరాటం చేయాలి అంటే, మరి మనిషి కి అంత శక్తి ఉందా? అంటే అది సాధనతో ముడి పడి ఉందని చెప్పాలి.  ఈ సాధన లేని నాడు , చెడుతో రాజీ పడి మనిషి ఉంటాడు.  కలియుగంలో ధర్మం కేవలం ఒక పాదం మీద  ఉంటుంది.


అందుకే మనిషి నేటి కాలం లో జీవించడు … జీవించలేడు,  కేవలం నటిస్తాడు.  నటించడమే జీవించడం అనే ఒక మాయ భ్రమ లో కాలం తో ప్రయాణం చేస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. దీనికి మూల కారణం చేసిన వికర్మలు, అంటే చెడు కర్మలు.


జీవించడం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. సత్యం అనుసరించడం, ఆచరించడం. మరి నేటి మానవుడికి సత్యం తెలుసా? … సత్యం ఆచరిస్తున్నాడా?...


మనిషి  జీవనం ఆమోదయోగ్యమైన  విధానం తో ఉంటే అసలు దుఃఖం అనేది ఉండదు. మరి నేటి కాలంలో దుఃఖం లేని మనిషి ఉన్నాడా? మరి అటువంటప్పుడు మనిషి అవలంభిస్తున్న జీవన విధానం ఎటువంటిది ?

సత్యాన్ని ఆచరించే వానికి అణువంత దుఃఖం కూడా ఉండదు.   ఎందుకంటే దుఃఖానికి కారణమైన సమాధానం  సత్యం లో  సహజంగా లభిస్తుంది.


మాయ, మనిషి ని  భ్రమలో  ముంచుతుంది. నిజం కాని వాటిని నిజం అనే విధంగా తలపింప చేసి, అసలు సత్యం తెలియకుండా చేస్తుంది. అంతెందుకు, ఒక సినిమా ఉంటుంది, అది నిజం కాదు అని తెలిసినా అందులో మమేకమై, ఆ పాత్రలో లీనమై ఏడుస్తాం, బాధపడతాం, నవ్వుతాం , అనేక విధాల భావోద్వేగాలకు లోనవుతాం. ఇదే మాయ, భ్రమ. సినిమా ఒక నటన అని తెలిసినా సరే లీనమైపోతాం.

అదే విధంగా పుట్టిన ప్రతి మనిషి చనిపోతారనే సత్యం తెలిసినా , చావును అంగీకరించలేం ,  చావు అంటే భయపడతాం, ఇది కూడా ఒక మాయ భ్రమే.


మానవుని లో   ఆశ, మోహం, మమకారం, అపేక్ష, స్వార్థం, ఈర్ష్య,  అసూయ, ద్వేషం,  అహం వంటివి పెరిగిపోవడం వలన నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం మనిషి మనసు గ్రహించలేక నటించడానినే జీవితం గా మార్చుకొని అసలు సంతోషం ఏదో తెలుసుకో లేక, దుఃఖ పాత్రుడు గా మారాడు నేటి మానవుడు.


దీని అంతటికీ మూలం ఒకటే…. మనిషి తనను తాను ప్రశ్నించుకోక పోవడం…. నేను ఎవరు? …. అసలు నేను ఎవరు? … నేను ఏమిటి? … నేను పుట్టక ముందు ఎక్కడినుంచి వచ్చాను? … నేను చనిపోయాక ఎక్కడికి వెళతాను?  ఈ ప్రశ్నను ప్రతీ రోజూ వేసుకుంటే,   ఆ “నేను ఎవరు “ అనే దానికి ఏదొక రోజు, ఏదొక సమయం లో , ఎవరో ఒక సద్గురువు ద్వారా సమాధానం లభిస్తుంది… లభించడం కాదు, అనుభవం అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే అనుభవం అయితే నే మనిషికి  తనపై తనకు  నమ్మకం కలుగుతుంది.


• అంతవరకు కూడా  నేను కి ఒక పేరు , అహం తగిలించి బడి ఉంటుంది.  ఏదో ఒక రోజు చనిపోయాక , శరీరం దహనం చేసేటప్పుడు నేను కి   పేరు ఉండదు సరికదా,   పేరు తీసేసి   శవం గా పిలువబడుతుంది.    అప్పుడు అహం అనేది  అణువంత కూడా  కనిపించదు.  ….. కానీ ఆ సమయంలో, ఆ నిమిషం లో, ఆ క్షణంలో కూడా  “నేను”  బ్రతికే ఉంటాడు. ఎందుకంటే “నేను” అనేది ఈ సృష్టిలో నాశనం లేనిది మరియు శాశ్వతమైనది.  ఇంతకీ ఆ “నేను” ఎవరో తెలుసా… "ఆత్మ".

అవును  ...   నేనొక ఆత్మను.    ఆత్మ అంటే చైతన్యవంతమైన   వెలుగు తో   కూడిన శక్తి. 


ఆత్మ నైన  “నేను”  శరీరం అనే వస్త్రం ధరించి కర్మలు చేయడానికి జన్మించాను.  ఈ శరీరం అనే  వస్త్రాన్ని బాల్యం,   యవ్వనం,  వృద్ధాప్యం అంటూ ,  సంవత్సరాల తరబడి   కర్మలు చేస్తూ  ఉపయోగించడం  వలన పాతబడి,  అరిగిపోయి చిరిగిపోయింది.  అందుకే శరీరం దహనం గావింపబడుతుంది.  దీనినే చనిపోవడం అంటారు. 

చావు  శరీరానికే  గాని   ఆత్మ కు  కాదు. 

ఆత్మ నైన  “నేను”  చేసిన కర్మల ఫలితం ఆధారంగా తిరిగి   మరలా  కొత్త శరీరం  అనే వస్త్రం  ధరిస్తాను. …… ఇదే సత్యం.


మానవ జన్మ ఎత్తి …. మనుషులు గా ఉన్న మనలో ఎందరికి ఈ సత్యం తెలుసు? … కాని ఇదే సత్యం.

ఈ సత్యం అనుభవ పూర్వకంగా తెలియకుండా ఉన్నంతకాలం ....  జీవితం  ఒక  నాటకం దానికి జీవనం ఒక ఆలంబనం. 


ఆలంబనం = ఊత, Support.


యడ్ల శ్రీనివాసరావు 

5 June 2024 , 11:00 PM.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...