Saturday, June 15, 2024

513. Desire To Divine

 

Desire To Divine


 Desire (కోరిక, కామము, వాంఛ) నుంచి Divine (ఆధ్యాత్మికము, దైవం).


• మనిషి జన్మిస్తాడు మరణిస్తాడు, మరలా పుడతాడు చనిపోతాడు ఇది ఈ సృష్టిలో జనన మరణం చక్రం. ఇలా జన్మ జన్మలుగా అంటే 84 జన్మలు వరకు ఈ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఈ జన్మలు సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగం ఈ నాలుగు యుగాల పాటు కర్మల అనుసారం జనన మరణాలు ప్రతి మనిషి కి జరుగుతాయి.


• అయితే, ఒకసారి జన్మించినపుడు మనిషి యొక్క జీవితం మరియు జీవనం ధర్మ, అర్థ, కామ, మోక్షాల పరిధి కి లోబడి ఉంటుంది. అంటే మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ నాలుగు అంశాలు తప్పని సరిగా కర్మానుసారం ఆచరించవలసిందే. కానీ మనిషి కి ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏమిటో తన స్పృహ కి, బుద్ధి కి, జ్ఞానానికి అర్దం కావడానికి, 84 జన్మలలో అనేక జన్మలు గడిచి పోయాక, అనుభవ పూర్వకంగా కానీ అర్దం కాదు.


• మొదటి గా మనిషి ధర్మం ఆచరించాలి, తద్వారా అర్ద అంటే ధనం సంపాదించాలి, తదుపరి కోరికలలో పూర్తి పరిపూర్ణ మైన సంతృప్తి నొందాలి చివరిగా మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే సత్యం తెలుసుకోవడం. సత్యం అనుభవించడం. మోక్షం అంటే అన్నింటికీ అతీతమైన స్థితి పొందడం.


• ఈ నాలుగు అంశాలు, మానవ జన్మకు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.


• ఇక అసలు విషయానికొస్తే…. Desires కోరికలు, కామం, వాంఛ మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనవి, అంతు చిక్కనివి. ఎందుకంటే మనిషి వీటిని దాటడడం సామాన్య మైన విషయం కాదు.

• ఎందుకంటే కోరికలు, వాంఛలు, కామము అనే వాటికి, హద్ధు పరిమితి ఉండదు. ఇవి ఎప్పటికప్పుడు కొత్త గా పుడుతూనే ఉంటాయి. ఒకసారి అనుకున్న కోరికలు, వాంఛలు తీరినా సరే తద్వారా మనసు పొందిన సంతోషం, సంతృప్తి తాత్కాలికం. Desires లో కొత్తదనం అనేది రోజు రోజుకు పుడుతూనే ఉంటాయి. అది తినే ఆహారం పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, విలాసాల పట్ల కావచ్చు, సెక్స్ పట్ల కావచ్చు, బంధాల పట్ల కావచ్చు…. ఇలా ఏదైనా కావచ్చు. ఈ Desires కోరికలు అనేవి మనసు, శరీరానికి అనుసంధానం అయి ఉంటాయి. అందువలన మనిషి ఏ వయసు లో ఉన్న, ఏ స్థాయి, స్థితి లో ఉన్నా వీటిని పరిపూర్ణం చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు జీవితాంతం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనిషి తాను అనుకున్న కోరికలు తీరక మరణం చెందితే, తిరిగి మరో జన్మలో అవే fulfill చేసుకోవడానికి పుడతాడు.


• ఏనాడైతే మనిషి తన కోరికలను అనుభవించి, అనుభవించి విరక్తి చెందుతాడో ఆనాడు మోక్షం సిద్ధిస్తుంది. ఉదాహరణకు యోగి వేమన గురించి చెప్పుకోవచ్చు. వేమన పరమ శృంగార భోగి. నిత్యం శృంగార కోరికలు తీర్చుకోవడం కోసం వేశ్యల తో ఉండేవాడు. తన అన్న జమీందారు యొక్క ఆస్తి అంతా నాశనం చేసేవాడు. ఒకరోజు వేమన కు ధనం దొరకక పోయే సరికి, తన తల్లి సమానురాలైన వదిన యొక్క ముక్కు పుడకను ఒక వేశ్య కోసం అడుగుతాడు. వెంటనే ఆమె నగ్నంగా నిలబడి, వచ్చి ఈ ముక్కు పుడక తీసుకోమని చెపుతుంది. ఆ సంఘటన తో వేమన దిగ్బ్రాంతుడై, సిగ్గు పడి, జ్ఞానోదయం చెంది తాను కోరికల పట్ల విరక్తి నొంది యోగి గా మారుతాడు. ఆనాటి నుంచి వేమన తన అజ్ఞానానికి కారణం అయిన శరీరం పై విరక్తి చెంది  అందుకు  చిహ్నం గా , తన  శరీరం పై  కేవలం అంగ వస్తృం తో   దిగంబరుడై  సత్య మార్గం ఆచరించాడు.


• ప్రతి మనిషికి కోరికలు, వాంఛలు అనేవి ఎన్నో విధాలుగా ఉంటాయి. అవి కేవలం మనసు కి మాత్రమే తెలుస్తాయి. వాటిని జయించడం, అధిగమించే మార్గం ఎలాగో తెలుసుకోవాలి. ఇది అంత కష్టతరం ఏమీ కాదు. కానీ కొందరు అంటారు, మనిషి జన్మ అనేది అన్నీ అనుభవించడానికే కదా ….. అవును అనుభవించడానికే, కానీ కోరికలలో కొట్టు మిట్టాడడానికి కాదు, తద్వారా దుఃఖం జమ చేసుకోవడానికి అస్సలు కాదు... అసలు కోరికలు తీర్చుకోవడం అనేది సంతోషం, సుఖం కోసం అని అంటాడు మనిషి. కానీ అసలైన సుఖం, సంతోషం కోరికల వలన లభిస్తున్నాయా అంటే , లేదు అని చెప్పాలి. ఎందుకంటే అసలైన సుఖం సంతోషం కోరికలు తీరడం వలన లభిస్తే, ఈ నాటికీ ఎంతోమంది కోరికలు తీరిన వారు ఆనందంగా ఉండాలి. కానీ నేడు విశ్వం లో కోరికలు తీరిన మనిషికి కూడా సుఖం సంతోషం అనేవి మానసిక స్థితి లో లేవు.


• సుఖం, శాంతి, నిత్యానందం అనేవి మోక్ష స్థితి లో నే లభిస్తాయి. కోరికలు లేని స్థితిని, వైరాగ్యం, మోక్షం అంటారు. దైవం గురించి తెలుసు కొని, సాధన చేసేటప్పుడు మొదట మనిషి కి తాను ఎవరు అనే సత్యం తెలుస్తుంది. మనిషి తనలోని తీరని కోరికలు, వాంఛలు, కామము దైవం ఎదుట మనసు తో నిస్సిగ్గుగా సమర్పించినపుడు భగవంతుడు వాటిని విడిచి పెట్టే మార్గం మరియు అతీంద్రియ శక్తిని ధారణ చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు మానవుడి నుంచి పంచభక్ష్య పరమాన్నం, నైవేద్యం గా ఆశించడు.  భగవంతుడు ఆశించేది కోరికలకు కారణమైన మనిషి మనసు లో దాగున్న పంచ కామవికారాలు.   ఏనాడైతే మనిషి ఈ వికారాలను భగవంతునికి అర్పితం   చేస్తాడో  అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే కోరికలు  దాటినపుడే  దైవం యొక్క మూల స్వరూపం తెలుస్తుంది.  అదే విధంగా ఒకసారి భగవంతునికి  ఏదైనా అర్పితం  చేస్తే తిరిగి తీసుకోకూడదు.


• Desires నుంచి Divinity కి transform అవ్వాలంటే ప్రతి రోజూ కొంత సమయం నిజాయితీగా , చిత్తశుద్ధితో పరమాత్మ అయిన శివుని తో ఏకాంతంగా  గడపాలి, మాట్లాడాలి. అప్పుడు దొరికే సంతోషం అనంతం. ఈ దశలో తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు. అనుభవాలతో, అనుభూతులతో , ఏ భౌతిక కర్మ తో కూడిన చర్యలు జరగకుండా అన్ని సహజంగా తీరిపోతాయి. ఎందుకంటే నిజానికి ఈ కోరికలు అనేవి ఆత్మలో జన్మాంతరాలుగా నిక్షిప్తం అయి ఉంటాయి. అవి  మనిషిని నిరంతరం అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి.  కేవలం  శివ స్మరణ తో అవి ఆత్మ నుంచి శాశ్వతంగా తొలగించబడతాయి. అదే ఆత్మకు సుఖం శాంతి మోక్షం, మనిషి కి ఆనందం.


• Desire  is   something  Asking.

• Divine  is   giving   Everything.


యడ్ల శ్రీనివాసరావు 

15 June 2024 , 3:00 PM.




No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...