భగవాన్
• భగవాన్ అనేది సంస్కృత పదం. అర్థం
భగవంతుడు.
• భ + అగ్ + వా + ఆ + న్
భూమి + అగ్ని + వాయువు + ఆకాశం + నీరు.
భగవంతుడు అంటే అద్వితీయమైన శక్తి ,
వికేంద్రీకరణ యై పంచ భూతాల లో ఇమిడి ఉంది.
• ఆధ్యాత్మికం
ఆద్ + ఆత్మ + కం
ఆది (తొలి ) + సూక్ష్మ చైతన్య శక్తి (ఆత్మ) + మస్తకం (నుదురు).
అనాదిగా సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య శక్తి (ఆత్మ) నుదిటి మధ్య ఉండే మస్తకం నందు ఉండును. దీని గురించి అనగా ఆత్మ గురించి సత్యం తెలుసు కొనుటయే ఆధ్యాత్మికం.
తదుపరి “ అసలు నేను ఎవరు “ అనే విషయం స్వయంగా అర్థం అవుతుంది.
అంతే కాని ఆధ్యాత్మికం అంటే పూజ, భక్తి, నోములు , వ్రతాలు , ఉపవాసాలు, దీక్షలు , భజనలు కానే కాదు.
• ఆత్మ గురించి ఎరుగని వానికి, పరమాత్మ గురించి అంటే భగవంతుడు గురించి అణువంత యధార్థం కూడా తెలియదు.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• భగవంతుడు ఎవరు ? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? రూపం ఏమిటి? భగవంతుని కి అసలు ఏది అవసరం అనే యధార్థాలు , స్వయం గా భగవంతుడే అర్దం చేయిస్తే నే గాని ఏ మానవునికి తెలియదు.
వింతగా … విచిత్రం గా అనిపిస్తుంది కదా. భగవంతుడు స్వయం గా ఎలా తన గురించి అర్దం చేయిస్తాడు ?. కానీ , ఇది పరమ సత్యం. మనిషి ఏ నాడైతే తాను ఒక ఆత్మ అనే స్థితి కి చేరుకోగలడో , సహజంగానే ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ శివుని తో సంబంధం పునరుద్ధరణ జరుగుతుంది. ఈ క్రమంలో శివుడు సద్గురువై సమస్త సృష్టి యొక్క ఆది మధ్య అంతము యెక్క యదార్ధ రహస్యాలు ఆధారాలతో అర్దం చేయిస్తాడు.
• ఆత్మ యొక్క జ్ఞానం , ధర్మం అనుభవం చేసుకున్నపుడు మాత్రమే పరమాత్మ అయిన శివుని గురించి తెలియును. ఈ విషయం తెలియాలంటే శివుని అనుగ్రహం, ఆశీస్సులు, కొంత జన్మాంతరాల పుణ్య ఫలం , కొన్ని పవిత్ర గుణాలు, శుద్ధమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• భగవంతుడు సర్వాంతర్యామి , సర్వం వ్యాపించి ఉన్నాడని , సర్వ జీవుల యందు నిండి ఉన్నాడని అంటారు . సర్వం వ్యాపించి ఉండడం అంటే, చెట్టు పుట్ట, నీలో నాలో, జంతువులలో, కణ కణం లో, అణువణువు లో ఉన్నాడని పండితులు , ప్రవచన కర్తలు పదే పదే చెపుతారు. ఇది నిజమేనా ? ఒకసారి ఆలోచించండి ….
భగవంతుడు ఉన్నది లోక కల్యాణం కోసం అని అందరికీ తెలుసు. సర్వాంతర్యామి అయితే, ఈ సృష్టిలో యుద్ధాలు, నేటి ప్రకృతి వైపరీత్యాలు , అనేక నాశనాలు ఎందుకు జరుగుతాయి?. భగవంతుడు ఉన్న ప్రతీ చోట శాంతి , సుఖం ఉండాలి కదా!.
• భగవంతుడు నీలో నాలో ఉంటే , వికారాలు, కామం, క్రోధం, లోభం , మోహం, స్వార్దం , ఈర్ష్య, ద్వేషం ఉంటాయా ?.
• భగవంతుడు నేడు మనతో మన మధ్య ఉంటే నేటి ఈ ప్రపంచంలో దుఃఖం అనే మాట ఏ మనిషి లోను ఉండకూడదు కదా!.
• భగవంతుడు సర్వం వ్యాపించి ఉంటే కాలాల లో వాతావరణం అంతా నిత్యం సమతుల్యత తో ఉండాలి కదా!
• భగవంతుడు జంతువులలో, సమస్త జీవరాశి యందు ఉంటే, భగవంతుని పూజిస్తూ కూడా కొందరు జంతువులను, ఆవు , మేక, కోడి వంటి వాటిని ఆహారం గా ఎలా భుజిస్తున్నారు ?
• భగవంతుడు అన్ని జీవుల యందు ఉంటే పంది, కుక్క, కోతి, పాము, చేప వంటి అనేక జీవులు నిత్యం ఏం భుజిస్తుంటాయి ? ఈ రకమైన జీవుల రూపం తో భగవంతుని చూపిస్తూ పూజించడం జ్ఞానము అంటారా?
• భగవంతుని గురించి తోచిన విధంగా, తోచిన రీతిలో ఏది పడితే అది చెపుతూ, భగవంతుడిని నిందించడం ద్వాపర , కలియుగాల నుంచి జరుగుతూ నే ఉంది.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• వీధి కుక్కలు కరుస్తాయని రాళ్లతో కొడతారు. కాశీ వెళ్ళి వచ్చి, అదే వీధి కుక్కల మెడలో గారెల దండ వేసి కాలభైరవుడు అని పూజిస్తారు.
• పాము కనపడితే కొట్టి చంపుతారు. అదే పాముకి నాగుల చవితి నాడు ఎంతో దూరం వెళ్ళి పుట్టలో పాలు, గుడ్డు వేసి దైవం గా పూజిస్తూ ఉంటారు.
• కోతులు చేతి లో ఉన్న కొబ్బరి, అరటిపండ్లు, ఆహారం లాక్కుపోతాయని దాచుకుంటూ తీసుకు వెళతారు. అదే రూపాన్ని దైవం గా కొలుస్తారు.
• భగవంతుడుని మత్స్యావతారం అని చేప రూపం లో చూపిస్తారు. మరలా ఆ చేపలను ఇష్టం గా భుజిస్తారు. మరియు వ్యాపార వనరు గా చూస్తారు.
• గోశాల లో ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవం గా పూజిస్తారు. అదే ఆవు నడి వీధి లో పెంట కుప్ప మీద వ్యర్థాలు తింటుంటే అసహ్యం గా చూస్తారు లేదా ముఖం తిప్పుకుంటారు. ఆ పరిస్థితిలో ఉన్న ఆవు కోసం ఏమీ చేయలేక పోయినప్పటికి కనీసం, మనసు లో చింతన కూడా మనిషి చేయడు.
మనిషి లో అజ్ఞానం తో కూడిన అద్భుతమైన మాయా నటన నర నరాలలో ఉంటుంది అనడానికి ఇవి నిదర్శనాలు.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• ఆవు పాలు శ్రేష్టం. ఆవు పేడ మూత్రం ఔషధ తత్వాన్ని కలిగి మానవ కళ్యాణానికి ఉపయోగం అవుతాయి. ఆవు పట్ల కృతజ్ఞత ఉండాలి, వాటిని సంరక్షించు కోవాలి. అందుకే ఆవుకి దైవత్వం ఆపాదించారు. కానీ ఆవు భగవంతుడు కాదు.
• కుక్కలు విశ్వాసం చూపిస్తాయి. వీధుల్లో రాత్రి సమయాల్లో రక్షణ గా కాపలా ఉంటాయి. వాటి పట్ల కృతజ్ఞత ఉండాలి, సంరక్షించు కోవాలి. అంతే కాని అవి భగవంతుడు కాదు.
• పాములు కంటికి కనపడని భూమిలో విషపూరితమైన క్రిమి కీటకాలను తిని నాశనం చేసి, మానవాళికి సహాయం చేస్తాయి వాటిని సంరక్షించు కోవాలి. కృతజ్ఞత ఉండాలి.
• కోతులకు ఉన్న శక్తి అసామాన్యం. అవి ఎంతో చిన్నగా ఉన్నా అమిత మైన శక్తి కలిగి ఉంటాయి. మనిషి రూపాంతరం చెందింది కూడా కోతి నుండి. వాటి పట్ల కృతజ్ఞత ఉండాలి.
• చేపలు నదీ జలాలో ఉండే నాచు, సూక్ష్మ జీవులు , మానవుడు కలిపిన చెత్త మరియు విసర్జించిన వ్యర్థాల ద్వారా కలుషితం అయిన నీటిని శుద్ధి చేస్తాయి. చేపలను మనిషి సమూలంగా భుజించి, నాశనం చేస్తాడని తెలిసి భగవంతుని అవతారం గా శాస్త్రాలలో వర్ణించారు. వాటి పట్ల కృతజ్ఞత ఉండాలి, సంరక్షించాలి.
• కోడి అమృత వేళ బ్రహ్మ ముహూర్తం లో తెల్లవారుజామున 3:00 గంటలకు మనిషి ని నిదుర లేపి , ఆ సమయంలో శివుని యొక్క విశ్వ శక్తి కి (cosmic power ) మనిషి ని అనుసంధానం చేస్తాయి. వాటి పట్ల కృతజ్ఞత ఉండాలి, సంరక్షణ చేయాలి.
మూగ జీవులను అసలు దేవతలకు ఎందుకు బలి ఇస్తారు. దేవత రక్తం తాగుతాను అని అడుగుతుందా? ఒకవేళ అలా అడిగితే దేవత ఎలా అవుతుంది. ఒకవేళ నిజంగానే దేవత కి రక్తం కావాలి అంటే స్యయం గా మనిషే తన శరీరం లో రక్తం ఇవ్వొచ్చు కదా.
• వరాహం (పంది) విసర్జన వ్యర్థాలను స్వీకరించి ప్రకృతిని పరిసరాలను శుభ్రం చేస్తుంది. ఇది చాలా చాలా అసాధారణ కార్యం. పూర్వ కాలంలో వీటి వలనే జనావాస పరిసరాలు శుభ్రత తో, ఆనారోగ్యం ప్రబలకుండా ఉండగలిగేవి . వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వాటిని సంరక్షించాలి.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• మానవుడు రాబోయే యుగాలలో, భవిష్యత్తులో రాక్షస గుణాలు , ఉన్మాదం కలిగి, హింస తో జీవులను చంపుతాడు అనే విషయం ముందే దివ్య దృష్టి తో గ్రహించి మునులు, యోగులు, జ్ఞానులు ఈ లోక కల్యాణం చేసే జీవులను రక్షించుకునేందుకు, వాటి రూపాలకి దైవత్వాన్ని ఆపాదించి , చూపించి శాస్త్రాలలో రాశారు. ఇలా చేస్తే మనిషి దైవానికి భయపడి వాటిని భక్షించడు అనే సదుద్దేశం. అంత మాత్రాన ఆ జీవులన్నీ భగవత్ స్వరూపాలు గా భావించడం తగదు. ఎందుకంటే వాటి జీవ ధర్మం అవి పాటిస్తున్నాయి
• దేవతల పేరు చెప్పి జంతు బలులు ఇవ్వడం, కాలభైరవుడు కి మధ్యం నైవేద్యం పెట్టి మనిషి ఆనందంగా స్వీకరించడం. ఇవన్నీ మనిషి తన బలహీనతలకు అధికారత కల్పించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మనిషి తన మూర్ఖత్వం తో, భగవంతుడిని అనేక రకాలుగా నిందించడం నేటికీ జరుగుతూనే ఉంది …. మరలా విచిత్రం గా అదే భగవంతుని పూజిస్తున్నాను అంటాడు మనిషి. దీనినే మాయ అని కూడా అంటారు.
ఇలాంటి ఆలోచనలతో, అర్దం లేని నమ్మకాలతో , పద్ధతుల తోనే మనిషి జీవితం వ్యర్థం గా, అజ్ఞానంతో పూర్తిగా జన్మ జన్మలు వృధా గా గడిచిపోతున్నాయి. దీనికి కారణం మనిషి తనను తాను తెలుసుకో లేక పోవడం.
ఇవన్నీ సూక్ష్మంగా మనన చింతన చేయదగిన నగ్న సత్యాలు.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• అయితే ... అసలు భగవంతుడు లేదా పరమాత్మ ఎవరు?
• పరమాత్మ ఒక్కడే. ఆయన నామం శివుడు. ఆయన రూపం సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతి బిందు స్వరూపం. ఆయన అనంతమైన శక్తి కలవాడు. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు. ఆయన ఉండేది పరంధామం ( పరలోకం ). పరంధామం నుంచి ఆయన యొక్క దివ్యమైన శక్తి ఈ విశ్వానికి ప్రసరిస్తూ ఉంటుంది.
• ఈ శక్తి తో తయారు అయినవే ప్రకృతి పంచ భూతాలు (భూమి , నీరు, వాయువు, అగ్ని, ఆకాశం). ఇవి పరమ పవిత్రమైనవి. ఇవే ఈ సృష్టి లో జీవానికి మూల ధాతువులు.
• పరమాత్మ నుంచి వెలువడిన సూక్ష్మ చైతన్య శక్తి ఆత్మ . ఈ ఆత్మ పరంధామం నుంచి దివ్యత్వం తో వచ్చి ఇహ లోకంలో పంచభూతాల ద్వారా నిర్మితమైన శరీరం లో ప్రవేశించి , గర్భం ద్వారా జన్మ తీసుకుంటుంది. పిదప కర్మలు ఆచరిస్తుంది. ఇదే మానవ జన్మ రహస్యం. ఆత్మ నాశనం లేనిది. శరీరం నాశనం అయ్యేది. అనేక జన్మలు గా ఆత్మ కర్మలు చేస్తూ శరీరాలు మారుస్తూనే ఉంటుంది.
• పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, ఇహ లోకంలో జన్మ జన్మలు గా. అనేక కర్మలు చేస్తూ, తన దివ్య గుణాలు, దివ్య శక్తులను క్రమేపీ కోల్పోయి, మాయ వలన తన తండ్రి అయిన పరమాత్మను కూడా మరిచి పోయి దుఃఖం తో జీవిస్తూ, అనేక రకాలైన భక్తి, పూజ, వ్రతం, ఉపవాసాలతో అసలు సిసలైన భగవంతుడు ఎవరో కూడా తెలియకుండానే ఎంతో మంది దేవతలను ప్రార్థిస్తుంది.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
• మనుషులలో ఎవరైనా ఎనిమిది భుజాలతో జన్మిస్తే, లేదా రెండు తలలు తో జన్మిస్తే వారిని చూసి ఏ జన్మలో ఏ పాపం చేశారో, ఇలా పుట్టారు అని జాలి చూపిస్తారు. డాక్టర్లు జన్యు లోపం వలన అలా పుట్టారు అంటారు. అటువంటి వారిని కన్న కుటుంబీకులు నిత్యం వారిని చూసి ఏడుస్తారు.
• కానీ ఎనిమిది భుజాలతో ఉన్న అమ్మవారి ని పూజించినపుడు, అదే దృష్టి తో ఈ విధంగా పుట్టిన వారిని ఎందుకు చూడరు?
• మూడు తలలతో ఉన్న బ్రహ్మ విష్ణు శంకరులను చూసిన దృష్టితో , రెండు లేదా మూడు తలల తో పుట్టిన వారిని ఎందుకు చూడరు?
ఎందుకు అంటే, ఇక్కడ మనుషుల అంగవైకల్యం అనే వాస్తవం ప్రత్యక్షం గా కనపడుతుంది కాబట్టి.
• అమ్మవారి ఎనిమిది చేతులు అంటే అష్ట శక్తులు, అష్ట సిద్ధులకు నిదర్శనం.
పులి మీద అమ్మవారి స్వారీ అంటే , పులి అనేది కలికాలం లోని మాయ అని అర్దం. అష్ట శక్తులు కలిగి ఉంటే, మాయ పై స్వారీ చేసి విజయం సాధించవచ్ఛు అని అలా రూపొందించారు. అమ్మవారి చేతిలో త్రిశూలం మనిషి లో ఉండే సతో, తమో, రజో గుణాలకు ప్రతీక. అమ్మవారి కిరీటం అంటే దివ్య గుణాల పవిత్రతకు ప్రతీక. అమ్మవారి కాలికింద రాక్షసుడు అంటే మనిషి లోని అజ్ఞానం.…..
అమ్మ ఒక శక్తి స్వరూపం. మనిషి అమ్మ సాధన తో, అష్ట శక్తులు పొంది తద్వారా కలికాలం లో స్వైరవిహారం చేసే మాయా పులి పై విజయం సాధించి, సతో తమో రజో గుణాలను ఆధీనంలో ఉంచుకోవటం వలన పవిత్రమై , కిరీటం అనే దివ్యత్వం కలిగి , రాక్షసత్వం అనే అజ్ఞానం నశిస్తుంది. ఇదే అమ్మవారి విగ్రహ స్వరూప అర్దం.
• పరమాత్మ అయిన శివుడు … బ్రహ్మ (సృష్టి) విష్ణు (పాలన) శంకరుని గా (వినాశనం మంచి కోసం) కర్తవ్యం చేస్తాడని, ఒకే శరీరం తో మూడు తలలు త్రిమూర్తి గా చూపించారు.
• శివుడు ఒక్కడే భగవంతుడు, పరమాత్ముడు.
• ఈ సృష్టిలో అనేక రహస్యాలు, అర్దాల తో ఆధారాలతో ఉన్నాయి …. తెలుసుకో గలిగితే.
శివుని పూజించడం కంటే
ప్రేమించడం మంచిది.
🕉️
పూజించడం వలన మధ్యలో
కొలవ లేనంత దూరం ఉంటుంది.
ప్రేమించడం వలన ఆ దూరం ఉండదు.
ఓం శాంతి ☮️
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు, 22 Dec 2024, 2:30 PM.