“మాయ”
• కంటికి “మాయ” కనిపిస్తుంది. కానీ ఊహ కి అందదు. కనిపించేది “మాయ” అని ఇంద్రియాలు గ్రహించలేవు ….. అనగా వాస్తవమైనది ఏదో తప్పుగా భావించడం జరుగుతుంది.
ఉదాహరణకు ఎడారిలో నీరు ఉండదు , ఒయాసిస్ కనిపిస్తుంది. ఇక్కడ నీరు కనిపిస్తుంది. కానీ నీరు ఉండదు. ఇది ఊహకు అందదు.
దీనినే “భ్రమ” అంటారు. ఇది మాయా లక్షణం.
• కంటికి “మాయ” కనపడదు. కానీ ఊహకు అందుతుంది …. ఊహలోని నమ్మకం వాస్తవం లో కనిపించదు. అనగా వాస్తవం పై తప్పుడు నమ్మకం కలిగి ఉండడం.
ఉదాహరణకు , ఏ విలక్షణం లేని మనిషి తానొక అత్యంత గొప్ప వాడిగా భావించడం . వాస్తవానికి తనలో ఏమీ లేకున్నా తానొక ప్రత్యేకం అనుకుంటాడు.
దీనినే “భ్రాంతి” అంటారు. ఇది మాయా లక్షణం.
• “మాయ” ప్రతి మనిషి లోను ఉంటుంది.
• మనిషి లోని బలహీనతే “మాయ”.
మాయ ను ధూమం (పొగ) అని అంటారు. మనిషి బుద్ధి లో పొగ వలే ఆవరించిన మాయకు సత్యం, నిజం, వాస్తవం అంత సులభంగా గ్రహించ లేదు.
☘️ ☘️ ☘️ ☘️ ☘️
• అసలు ఈ మాయ కి మూల కారణం? …
పరమాత్మ సన్నిధి నుంచి పరమ పవిత్రంగా దివ్య శక్తులు, గుణాలతో భూమి పై కి వచ్చిన ఆత్మ (మనిషి) అనేక జన్మలు గా, యుగాలుగా శరీరం ధరిస్తూ, మరణిస్తూ ఉండడం వలన, క్రమేపీ ధర్మాన్ని నిర్వర్తించక అనేక వికర్మలు చేస్తూ ఉండడం వలన కలియుగం వచ్చే సరికి ఆత్మ పూర్తిగా తన దివ్య శక్తులు, దివ్య గుణాలు కోల్పోయి , నిస్సారంగా తయారై బలహీనం అయిపోతుంది.
ఈ బలహీనతల తోనే కలికాలం లో పూర్తిగా మనుషుల జన్మలు నడుస్తాయి. ఏది పాపమో, ఏది పుణ్యమో అని కనీసం గ్రహించే విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోయి జీవిస్తాడు. పుణ్యం అని చేసిన కర్మ , పాపం గా మారవచ్చు. ఉదాహరణకు పుణ్యం అనుకొని ఒక యాచకుడి పై జాలి పడి ధనం దానం చేస్తే, యాచకుడు ఆ ధనాన్ని అసాంఘిక కలాపాలకు వినియోగిస్తే అతడు చేసిన చెడు కర్మలో దాత కూడా భాగస్వామ్యం పొందుతాడు. ఇది పుణ్యమా?....
దానం చేసిన మనిషి అనుకుంటాడు, నేను దానం చేసాను అంతవరకే నాది అని. కానీ వాస్తవానికి కర్మ సిద్ధాంతం అలా ఉండదు.
• మనిషి చేసే అనేక పనుల్లో అజ్ఞానంతో కూడిన బలహీనత ఉంటుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది మనిషి యొక్క ఇంద్రియాలు గ్రహించలేక పోవడం దీనికి కారణం. దీనినే “మాయ” అంటారు. ఈ “మాయ” ప్రతి మనిషి బుద్ధి లో ఉంటుంది.
• మనిషి తనలోని బలహీనతలను అధిగమిస్తే “మాయ”ని జయించినట్లే, కానీ ఇది అంత సామాన్యమైన విషయం కాదు.
భగవంతుడు తాను ఎంత శక్తి వంతుడో , “మాయ” కూడా అంతే శక్తి వంతమైనది అంటాడు.
• మనిషి తనలోని శక్తి ని , బలాన్ని దైవం గా భావిస్తే, అదే మనిషి లోని బలహీనతే “మాయ”. “మాయ”కు ఉన్న అత్యంత గొప్ప గుణం ఆకర్షణ.
“మాయ” నిరంతరం మనిషిలో దాగి ఉన్న బలం పై , సత్యం పై ఎన్నో విధాలుగా యుద్ధం చేస్తుంది. బలవంతుడైన మనిషి ని నిర్వీర్యం చేయడానికి, బలహీనుడు గా మార్చడానికి “మాయ” అనుక్షణం కృషి చేస్తూనే ఉంటుంది.
మనిషి రహస్యం గా తాను చేసే చీకటి కర్మలు ఎవరూ చూడడం లేదని , మనసు లో ఆలోచించే ఆలోచనలు ఎవరికీ “తెలియదు” అని అనుకుంటాడు. ఇదే “మాయ”, మాయా ప్రభావం. ఎందుకంటే , మనిషి చేసే ప్రతి కర్మ, ఆలోచనలతో సైతం రికార్డ్ అవ్వ వలసిన చోట అవుతూనే ఉంటుంది. అదే తిరిగి ఫలితం గా వస్తుంది.
• “మాయ” గురించి మరో అడుగు ముందుకు వేస్తే…
జగమే “మాయ”. ఈ సృష్టి అంతా “మాయ”. కంటికి కనిపించేది అంతా నిజం, శాశ్వతం అనిపిస్తుంది, కానీ ఏదీ నిజం కాదు , అంతా అశాశ్వతం అనే విషయం ఆఖరి … ఆఖరి శ్వాస లోనే తెలుసుకుంటాడు.
• మనిషి తన తల్లి తండ్రులు, కుటుంబీకులు, ఇలా అనేకులతో ఏదో ఒక బంధం కలిగి ఉంటాడు. తాను జీవించి ఉన్నంత కాలం వారు తన సొంతం, శాశ్వతం అనుకుంటాడు. వారిపై మమకారం, ప్రేమ పెంచుకొని దేహభిమానం తో జీవిస్తాడు. నేను లేకపోతే నా వారందరూ, ఏమైపోతారో అని తల్లడిల్లి పోతాడు. కానీ ఆ మనిషి మరణించిన తరువాత కొద్ది రోజులకే , ఆ వ్యక్తి ని అందరూ మరచిపోతారు.
మనిషి తాను శాశ్వతం కాదు అనే విషయం ఎరిగినా కూడా , అది స్పృహ లో ఉంచుకొని విశాల హృదయం తో బ్రతకడు, బ్రతకలేడు. నా… నా… అంటూనే ఉంటాడు. ఇదే “మాయ” ప్రభావం.
ప్రతి మనిషికి మరణం అంటే ఏమిటో తెలుసు. నిత్యం ఇరుగు పొరుగున ఎన్నో మరణాలు చూస్తాడు. కానీ మరణం అంటే భయం. మరణం సహజం అని తన విషయంలో అంగీకరించ లేడు. ఇదే “మాయ”.
• ప్రతి మనిషి లో ఉండే “మాయ” నిత్యం ఏదో విధంగా స్వయం పై లేదా ఇతరులపై దాడి చేస్తూనే ఉంటుంది. ఆకర్షణ, వ్యామోహం, కోరికలు, కామం, స్వార్థం, ఈర్ష్య, అసూయ, కోపం, మోసం , అబద్ధాలు , లోభం, నటించడం, అతిగా తినడం, ఏడవడం, బ్రతిమాలడం, అత్యాశ, దురాశ, అహంకారం, అవసరాలకు తగ్గట్టుగా వ్యక్తిత్వం మారుస్తూ ఉండడం, పొగడ్తలు, రంగు రంగుల ప్రపంచంలో కలలు , ఇలాంటివన్నీ మాయా గుణాలు, మాయా లక్షణాలు. ఇవి మనిషి మనసు లో అంతర్భాగం అయి ఉండడం వలన వీటి కోసం పరితపిస్తూ, బలహీనుడు గా జీవిస్తూ చివరికి రోదిస్తూ ఉంటాడు. మనిషి తనలో ఉన్న ఈ గుణాలను మాయ అని తెలుసుకోలేడు, ఒకవేళ తెలుసుకున్నా అంగీకరించడు. ఎందుకంటే మాయ ఇచ్ఛే మగతతో కూడిన సంతోషానికి జన్మాంతరాలుగా మనిషి అలవాటు పడి ఉండడం వలన అదే కోరుకుంటాడు.
మనిషి ఒకవైపు భక్తి తో భగవంతుని ప్రార్ధిస్తాడు . అయినా సరే “మాయ” నుంచి విముక్తి అంత సులభంగా పొందలేడు. ఎందుకంటే భక్తి తో దుఃఖ విముక్తి లభించదు. ఒకవేళ విముక్తి లభించినట్లు అనిపించినా తాత్కాలికం.
☘️ ☘️ ☘️ ☘️ ☘️
• ఈ ఘటనలన్నింటికి కారణం మనిషి , తన మనసు ని తాను జయించలేక పోవడం. మనిషి తన మనసును జయించగలిగిన నాడు, స్వయం గా పరమాత్ముడు, సద్గురువు రూపం లో మనిషిని చేయి పట్టుకొని నడిపిస్తాడు. అప్పుడు స్వయం గా పరమాత్ముడే తోడు అయి సహకారం ఇస్తూ ఉంటాడు.
• ఈ క్రమంలోనే ….
ఆత్మ పరమాత్మ తో అనుసంధానం అవుతుంది.
Soul is Connected to Supreme Soul S H I V A.
ఇది జ్ఞాన ధ్యాన యోగాలతో సాధ్యం అవుతుంది.
• శివుడు కూడా చెప్పేది ఒక్కటే … “మాయ” చాలా చాలా శక్తి వంతమైనది. ఎన్నో జన్మ జన్మలు గా “మాయ”తో కలిసి , సహ జీవనం చేసిన మనిషి(ఆత్మ) ఒక్కసారిగా “మాయ”ను వదిలేసి పరమాత్మ వైపు పయనం చేస్తుంటే, “మాయ” అంత తేలికగా విడిచి పెట్టదు. ఎన్నో తుఫానులు సృష్టిస్తుంది.
• ఈ భూమి పై జన్మించి నందుకు. ప్రతి మనిషి తప్పని సరిగా “మాయ”లోనే బ్రతకాలి , కానీ “మాయ”తో కలిసి కాదు. ఎందుకంటే ఇది మాయ ఆధీనంలో ఉండే లోకం. అందుకే శివపరమాత్మ బురదలో ఉండే కమలం లా మనిషి ని జీవించమని చెపుతాడు.
మనసును ప్రతీ క్షణం శివ పరమాత్మ తో అనుసంధానం చేసి శివుని స్మృతి చేస్తూ, ఈ “మాయ” లోకం లో జీవించడం వలన మనిషి నిత్యం అసలైన సంతోషంగా ఉంటూ, ఆత్మానందం తో మంచి కర్మలు ఆచరించగలడు. లేకపోతే “మాయ”కు వశం అయి , పాపం పుణ్యం తేడా తెలియక అజ్ఞానం తో వికర్మలు చేస్తూ, దుఃఖం అనుభవించ వలసి వస్తుంది.
“మాయ” అంటే మనిషి మనసు లోని బలహీనత.
• జ్యోతిష్య శాస్త్రం లో “మాయ” ను రాహు గ్రహం (ఛాయ గ్రహం) గా చెప్పబడింది. ఈ రాహు మాయా ప్రభావం అనేది ప్రతి మనిషి లో ఒకేలా ఉండదు. జన్మ కుండలి బట్టి, గత జన్మల కర్మలు బట్టి ఎక్కువ, తక్కువ గా ఉండొచ్చు.
ఓం నమఃశివాయ 🔱 🙏
యడ్ల శ్రీనివాసరావు 6 Dec 2024. 6:00 PM.
No comments:
Post a Comment