సంసారం
• "సంసారం" ఈ పదం ఎప్పుడు ఎక్కడ విన్నా, ముఖ్యం గా నడి వయసు దాటిన వారిలో ఒక నిట్టూర్పు , ఒక నిస్పృహ , స్వయం పై ఉదాసీనత కనపడుతుంది.
• ఎందుకంటే జీవితం లో వివాహం అయిన కొన్ని సంవత్సరాల అనంతరం కొత్తగా తెలుసుకోవలసినవి , ఇంకా చూడాల్సినవి , ప్రత్యేకం గా అనుభవించి ఆస్వాదించ వలసినవి , ఏమీ లేవు అనే ఆలోచన మనిషి లో ఏదొక దశలో తప్పకుండా వస్తుంది. దీనికి కారణం దైనందిన జీవితం ప్రతి రోజూ ఒకే విధంగా ఉండడం.
• జీవితం లో కొన్ని సంసారిక అనుభవాలు తరువాత, జీవితం అంటే పెళ్లి, పిల్లలు, వారి చదువులు, అవసరాలు తీర్చడం కోసం డబ్బు సంపాదించడం ఇలాంటి బాధ్యతలతో చేసే మహ యజ్ఞమే సంసారం అని మనిషి భావిస్తాడు. డబ్బు ఉన్న వాడైనా, లేని వాడైనా సరే చివరికి సంసారం అంటే ఇంతే అని అనుకుంటాడు.
అంతేకాని సంసారం లో అసలు సారం, సారాంశం తెలుసుకో లేడు. ఈ జన్మలో పుట్టినందుకు గాను సంసారం లో తన పాత్ర ఏమిటో అంతరంగంలో గ్రహించలేడు.
• పెళ్లి కాకముందు ఆనందంగా జీవితం పట్ల ఆతృత తో అనుభవించ వలసిన ఆనందాలు, సుఖాలు ఎన్నో ఉన్నాయి అని మనిషి భావిస్తాడు. తీరా వివాహం అయిన కొద్ది సంవత్సరాల తరువాత ఏముంది లే ఇంతే కదా జీవితం అనిపిస్తుంది. అప్పటి వరకు లభించి, అనుభవించిన వన్ని కూడా చాలా నిస్సారంగా, నిస్తేజంగా అనిపిస్తాయి. ఎందుకంటే మనిషి మనసు నిరంతరం ఏదో కొత్త కోరుకుంటూనే ఉంటుంది. ఔనన్నా కాదన్నా ప్రతి మనిషి అంతరంగం లో , ఏదో సమయం లో అనిపించేది ఇదే. దీనికి కారణం ముఖ్యం గా మనసు యెక్క అచంచలమైన స్థితి.
• సంసారం లో … బాధ్యతలు కొందరికి భారం అనిపిస్తాయి, కోరికలు కొందరికి తీరనివి గా అనిపిస్తాయి. ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు కొందరికి సహకరించనివి అనిపిస్తాయి. కొందరికి అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంటుంది. ఇదంతా మనసుకు పెద్దలోటు గా, సమస్య గా తయారవుతుంది. మనిషి కి శారీరక సుఖం అనుభవం అయిన సుధీర్ఘ కాలం అనంతరం మానసిక సుఖం కోరుకుంటాడు. ఎందుకంటే , వయసు పెరిగే కొద్దీ మనిషి కి శరీరంలో శక్తి తగ్గి , మనసులో ఒంటరి తనం, కొంత అభద్రత సహజంగా మొదలవుతుంది. దీనినే శారీరక స్థితిని దాటడం అంటారు.
• మానసిక సుఖం అంటే మనసు కోరుకున్న మధురం , సహచర్యం , రక్షణ, సంతోషం, ప్రేమ , శాంతి ఇలా ఇందులో ఏదైనా కావచ్చు. అప్పటి వరకు సంసార జీవితం లో భాగస్వామి నుంచి ప్రేమ , సంతోషం , సహకారం వంటివి లభించినా , లభించకపోయినా వయసు ప్రభావం వలన , శరీర శక్తి తో జీవితం కొంత సజావుగానే సుఖ దుఃఖాలతో నడుస్తుంది.
కానీ , ఈ మానసిక సుఖం అనేది ఒక వ్యక్తికి తన యొక్క కుటుంబం లోని వారు గాని, రక్త సంబంధీకులు గాని ముమ్మాటికీ ఇవ్వగలిగేది కాదు. ఒకవేళ ఇచ్చినా అది తాత్కాలికం.
• ఎందుకంటే , మనిషి మనసుకి ఒక కొలత కొలమానం అంటూ ఏమీ ఉండదు. ఎవరి మనసు, ఎప్పుడు ఏం కోరుకుంటుందో తమకే అర్థం కాదు. ఒకవేళ తమ మనసు తాము ఏంటో తెలుసుకున్నా నడి వయసులో ఆలోచనలు, కోరికలు బయటకు ఎవరి వద్ధ వ్యక్త పరచలేరు. అటువంటప్పుడు ఒకరి మనసు కి కావలసినది మరొకరు అంటే సంసారం లో భాగస్వామి ఎలా తీర్చగలరు , ఇవ్వగలరు. ఆలుమగలు అంటే పాలు నీరు, తోడు నీడ లా ఉండాలి అంటారు కానీ మనసుల కలయిక తో జీవిత కాలం ఉండాలి అని ఎవరు అనలేరు.
తొంభై శాతం రెండు శరీరాల కలయిక తో జీవన బంధం నడుస్తుంది కాని రెండు మనసుల కలయిక తో జీవితం నడుస్తుందా లేదా అనేది అనుభవం అయిన వారికే తెలుస్తుంది.
అందుకే అంటారు, సంసారం ఒక సాగరం అని. సముద్రం నీటిని పూర్తిగా కొలవలేం , వడకట్టలేం, లోతుని తెలుసుకోలేం , శుద్ధి చేయలేం. అలాగే సంసారం యెక్క స్థితి గతి కూడా.
• నడి వయసు మనిషి పైకి ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శించినా , సంసారం అనే పదం పట్ల ఎప్పుడూ ఒక బలహీనమైన , నిస్సహాయ మైన స్థితి భావం కలిగి ఉంటాడు. నూతనంగా సంసార జీవితం ఆరంభించిన సమయం లో ఉన్న ఉత్సాహం, కాలక్రమేణా తగ్గి పోతుంది. దీనికి అనేక విధములైన సామాజిక, ఆర్థిక, శారీరక, ఆరోగ్య , జీవన అంశాలు ఒకవైపు అయితే, వైవాహిక జీవితంలో ఒకరి పట్ల మరొకరి విముఖత, అభిప్రాయ భేదాలు, భావ వ్యక్తీకరణ లో వ్యత్యాసాలు ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ బేలన్స్ చేసుకోగలగడం అంత సహజమైన , సాధారణ విషయం కాదు. ఎందుకంటే సంసారం లో , ఏ మనిషి కూడా స్త్రీ అయినా , పురుషుడు అయినా, పిల్లలు అయినా, ఏ ఇతర బంధం అయినా సరే తన కుటుంబీకులు రాజీ పడితే తప్పా, పూర్తిగా ఎవరిని ఎవరు సంతృప్తి పరచలేరు.
మనిషి తనలో ఉన్న శక్తి చాలనపుడు, సంసారం అంటే, అంతా కష్టాలు బాధ్యతలు, కన్నీళ్లు, గాడిద చాకిరి, అనుకుంటూ ఉంటాడు. ఇది కేవలం ఒక అవగాహన లోపం. పరిపక్వత లేకపోవడం.
• కొత్తగా ఒక డ్రెస్ కుట్టించి తొడుక్కున్నప్పుడు సంతోషంగా బాగుంటుంది. దానిపై మరకలు పడినప్పుడు లేదా చిరిగి పోయినప్పుడు ఇక దానిపైన ఇష్టం పోతుంది. ఎందుకంటే డ్రెస్ పైన మరకను తొలగించే మార్గం తెలియకపోవడం లేదా చినిగింది తిరిగి కుట్టించుకుంటే అసహ్యం గా కనిపిస్తుంది అని భావించడం. దీని అంతటికీ కారణం డ్రెస్ అనుకుంటాము, కానీ మనిషి తన ఆలోచన విధానం లో లోపం అని తెలుసుకోలేడు.
ఎలా అంటే, ఒకటి ఆ డ్రెస్ ను జాగ్రత్తగా చూసుకో లేకపోవడం. రెండవది డ్రెస్ పై మరక పడినపుడు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించ లేకపోవడం. మూడవది డ్రెస్ చిరుగు కుట్టించుకున్న చోటు చూసి ఇతరులు హేళన చేస్తారు అనే భావన కలిగి ఉండడం. ఇదే మనిషి ఆలోచనా లోపం.
పోని ఇక్కడ, చిరిగిన డ్రెస్ పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటే ధనం వృధా ఖర్చు, పైగా అది కూడా చిరగదు అని చెప్పలేం. … ఈ డ్రెస్ అనే అంశం సూక్ష్మంగా పరిశీలిస్తే మనిషి సంసారం లో ఎదుర్కొనే ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి.
• మనిషి తన సంసారం లో సానుకూలత లేక పోవడానికి కారణం తన జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో ఇతరులు అనుకుంటాడు గాని తానే అసలు కారణం అని అంగీకరించ లేడు. కొన్ని సార్లు మనిషి తాను పొరపాటు చేయక పోయినా, కుటుంబంలో ఇతరుల వలన సమస్య తలెత్తినా , నిందలు పడవలసి వచ్చినప్పుడు తన గత జన్మలలో చేసిన పాప కర్మలు నశిస్తున్నాయి అనే సత్యం గ్రహించలేడు.
• అసలు సంసారం అంటే అర్దం ఏమిటి? .
“ సం “ అంటే శుభకరం, శుభప్రదం, మిక్కిలి, అనంతం అని అర్థం.
“ సారం ” అంటే శ్రేష్ఠం , బలమైన శక్తి అని అర్థం.
“సంసారం” అంటే అనంతమైన శక్తి కలది లేదా మిక్కిలి శ్రేష్టత కలిగించునది అని అర్థం.
• అసలు విషయానికి వస్తే ….
రామాయణం, భారతం లోని కధలు, పాత్రలు అన్నీ నేటి జీవన సంసారం లోనివే . దేవి దేవతా ధర్మం లో కూడా సంసార ప్రస్తావన ఉంటుంది. లక్ష్మి నారాయణులు సంసార సాగరం లో ఉండే భార్య భర్తలకు ప్రతి రూపం అని అంటారు. పుట్టిన ప్రతి మనిషి సంసారం లో కష్టాలు, సుఖాలు, కోరికలు, దుఃఖం, బాధ్యతలు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఇది కేవలం ఒక్క జన్మ కాలంతో పూర్తి అయ్యేది కాదు. ఎందుకంటే మనిషి యొక్క మనసు ను , స్థితిని పరిపూర్ణమైన స్థాయికి తీసుకు వెళ్లేది సంసారం లోని ఒడిదుడుకులు, దుఃఖం, యాతనలు మాత్రమే. సంసారం అనేది మనిషిని శిల నుంచి శిల్పం గా , రాయి నుంచి రత్నం గా మారుస్తుంది. ఇది సత్యం. ఇదే "సం సారం".
• సముద్రంలో పడిపోయిన వాడు ఈదగలిగితేనే ప్రాణం తో జీవిస్తాడు. అదే విధంగా జన్మ తీసుకున్న ప్రతీ ఒక్కరూ సంసారం లో ఈది ఈది , తుదకు సత్యం గ్రహించిన నాడే జగన్నాటక రహస్యం తెలుసు కుంటాడు. జీవితం ఒక డ్రామా అనే విషయం అర్థం అవుతుంది. సహజమైన వైరాగ్యం సిద్ధిస్తుంది. నేను ఎవరు అనే విషయం తెలుసుకుంటాడు. ఆత్మకు మోక్షం కలుగుతుంది. ఈ మోక్షం కలిగిన నాడు అసలు భగవంతుడు ఎవరు అనే విషయం అర్దం అవుతుంది . చివరికి నేను చాలా అదృష్టవంతుడిని అనుకుంటాడు మానవుడు. ఇది అనేక జన్మాంతర అనుభవాల అనంతరం మనిషి కి తన చివరి జన్మ లలో జరిగే అంశం ఇది.
• సూక్ష్మంగా, క్షుణ్ణంగా ఆలోచించ గలిగితే ప్రతి మనిషి ని సంసారం చాలా సారవంతంగా తీర్చిదిద్దుతుంది. ఇందుకు సమగ్రంగా ఆలోచించే విధానం తెలియాలి . అదే విధంగా సంసారం లో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోగలగాలి. సంసారం అంటే సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే “ ఓ మనిషి ఏది ఎలా ఉన్నా , ఎవరు ఎలా ఉన్నా , ఏది ఎలా జరిగినా నిన్ను నువ్వు అంగీకరించడం నేర్చుకో “. అంగీకరించడం తెలియనంత కాలం నీకు నువ్వే ఒక పెద్ద సమస్య. ఎన్ని జన్మలు ఎత్తినా నీకు , నీ మనసు కి ప్రతిఘటన తప్పదు. సారవంతంగా కూడా కాలేవు. సారవంతంగా అవడం అంటే , కోరికలకు అతీతంగా అవడం. అప్పుడే మోక్షం లభిస్తుంది.
• సముద్రం ఈదాలి అంటే శరీరంలో మూడు వంతుల భాగం అంతా నీటి ఉపరితలం పైన ఉంచుతూ, కేవలం కొంత దేహ భాగం నీటి క్రింద ఉంచాలి. ఇది ఈత కొట్టే విధానం. ఒకవేళ ఇలా చేయకుంటే ఈత చేతకాక సముద్రంలో మునిగి చనిపోతాం. అదే విధంగా సంసారం అనే సాగరం దాటాలి అంటే బంధాలలో ఉండాలి, శ్రేష్టమైన కర్మలు చేస్తూ బాధ్యతలు నిర్వర్తించాలి కాని కోరికలు , వ్యామోహం, కామం, వికారం, మమకారాలలో మునిగి పోయి బంధీ గా కాకూడదు.
• సంసార సాగరం సజావుగా దాటడానికి దృఢత్వం తో కూడిన ఆధ్యాత్మిక జ్ఞాన చింతన అవసరం.
• భగవంతుడు ఎన్నడూ సంసారిని తన సంసారం, భాధ్యతలు, చేయవలసిన కర్మ, బంధాలను వదిలి , ఇల్లు వాకిలి విడిచి అడవులకు, ఆశ్రమాలకు వెళ్లి తపస్సు చేయమని చెప్పడు. దీనినే బాధ్యత రాహిత్యం, escapism అంటారు. శరీరం ద్వారా అన్ని కర్మలు ఆచరిస్తూ , మనసు ను దేనికి వశం కానివ్వకుండా , బురద లో కలువలా, తామరాకు పై నీటి బిందువు లా జీవించమని చెపుతాడు.
అభ్యాసం, సాధన చేయగలిగితే , శివ పరమాత్ముని జ్ఞానం అభ్యాసం, సాధన చేయగలిగితే , శివ పరమాత్ముడు జ్ఞాన ధ్యాన యోగం ద్వారా సంసార సాగరం ఎలా దాటాలో తెలియ చేస్తాడు. దీనినే సహజ రాజయోగం అంటారు.
• స్వయాన్ని ప్రేమిస్తే అనగా మనిషి తనను తాను ప్రేమించుకో గలిగితే , ఈశ్వరుడు మనిషి ని ప్రేమిస్తాడు. తద్వారా మనిషి ఎన్నడూ ఎవరి ప్రేమ ఆశించకుండా , తన లోని ప్రేమను ఇతరులకు పంచుతూ సేవ కూడా చేయగలడు. నిజమైన ప్రేమ యొక్క గుణం పంచడమే కానీ ఆశించడం కానే కాదు.
• ఈ సహజ రాజయోగం , ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, మౌంట్ అబూ, రాజస్థాన్ (Brahma Kumaris Spiritual Educational University) ద్వారా ప్రతీ ఊరిలో ఉన్న ఓం శాంతి ఆశ్రమం నందు ఉచితం గా ఎవరైనా అభ్యసించవచ్ఛు.
యడ్ల శ్రీనివాసరావు 28 Nov 2024 , 11:00 pm
No comments:
Post a Comment