Tuesday, March 17, 2026

730. యజ్ఞం దాహం

 

యజ్ఞం  దాహం 



ఒక ఊరిలో యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు .

అప్పుడు భార్య ఇలా చెప్పింది.

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను . అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”

ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు .

మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు . బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.


“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే  బద్దలైనా  నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.


 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు . ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు.

“మనమూ ఉమ్మేద్దాం . బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది .

అర్కసోమయాజి  ససేమిరా అన్నాడు.

చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది .

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో  లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి . మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.


అప్పుడే *కలిపురుషుడు* వారికి ఎదురు వచ్చాడు.

ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది.

అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసం చేశాను. అన్నాడు కలిపురుషుడు.

...*ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*...

ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు ...

కానీ చివరకు  *ధర్మమే గెలుస్తుంది* ...

II ధర్మో రక్షతి రక్షితః II.

పై కధ  రాసిన  రచయిత కి  మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .🙏


ప్రతి  మనిషి  ఆలోచనల తోనే  కర్మలు చేయడం ఆరంభిస్తాడు  .  ఆ ఆలోచనలే  ఒక శక్తి  అయి  తన చుట్టూ ఒక (ఆరా) వలయం వలే ఏర్పడుతుంది.   ఈ ఆలోచనలు మంచివి లేదా చెడువి  ఏవైనా అయి ఉండవచ్చు. 

ఉదాహరణకు  పాజిటివ్ ఆలొచనలు కలిగి ఉండి , ధర్మ యుక్తం గా మనిషి  కర్మలు ఆచరిస్తున్నపుడు   తనలోని ఆరా తనకు మరియు  తన చుట్టూ ఉన్న కుటుంబీకులకు , సమాజం లోని అందరికీ ఒక రక్షణ కవచం వలే ఏర్పడి , నీడ వలే ఉంటుంది . ఇక్కడ  అర్దం చేసుకో వలసిన విషయం , మంచి  అనేది   చెడు ను కూడా సంరక్షిస్తుంది.  

ఏనాడైతే మంచి అనేది  దూరం అవుతుందో , అప్పుడు చెడు స్వైరవిహారం  చేస్తుంది , పిదప చెడు తనను తానే  శిక్షించుకొని  చివరికి  భక్షించు కుంటుంది .  అదే  కలిపురుషుడు  లీల .

మంచి  అనేది  చెడుని ఆకళింపు చేసుకుని ఉండగలదు. మంచి లో ఉండేది  భగవంతుని శక్తి .  అందుకే భగవంతుడు అయిన శివుడు తారతమ్యం ఎరుగక  అందరినీ ఆదరిస్తాడు .  అందరినీ మంచి గా మార్చడానికి కావలసిన శక్తిని ధారణ చేస్తాడు .

చెడు మాత్రం  మంచి తో   కలిసి  సుధీర్ఘంగా ఉండలేదు. చెడు లో  ఉండేది అసుర శక్తి . అందుకే అసురుడు అయిన రావణుడు ,   శివుని  చెంత  చేరినప్పటికిని  బుద్ధి హీనుడై  , కామాంధుడై   చివరికి శివుని  విడిచి  పోతాడు .

మంచి కి   ,  చెడు కు   ఉన్న   భేదం  ఇదే .

మంచి చెడు అనేవి మనుషుల లో ఉండే గుణాలు , లక్షణాలు . మనుషులు ఎంచుకున్న  స్నేహాలు , సాంగత్యాల లో  కూడా ఇవి ప్రస్ఫుటంగా  కనిపిస్తాయి .  అందుకే అనుభవజ్ఞులైన పెద్దవారు  అంటారు ,  నీవు ఎలాంటి వాడివి  అనేది , నీ  స్నేహితులను , నీ సాంగత్యాలను  చూసి  చెప్పవచ్చు  అని . . . 


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 March 2026 , 8:00 PM.


No comments:

Post a Comment

730. యజ్ఞం దాహం

  యజ్ఞం  దాహం  ఒక ఊరిలో యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య ఇలా చెప్పింది. “ని...