Friday, August 2, 2024

525. ఏక్ + అంతం = ఏకాంతం

 

ఏక్ + అంతం =  ఏకాంతం



• ఏకాంతం … అంటే ఏక్ + అంతం.  ఒకటి  సమస్తం అంతం చెయ్య గలదు అని భావం.

• ఆ  ఒకటి  అంటే మనసు.  మనసు ఏకత్వం తో ఉన్నప్పుడు, అంటే దేనికి అనుసంధానం (ఎటాచ్) కాకుండా  ఉన్నప్పుడు  దేనినైనా  అంతం  చేసి విజయం  సాధించగలదు.


• మనసు ఒక కోతి.   స్థిరత్వం ఉండదు.  ఏ సమయంలో  ఏది కోరుకుంటుందో  దానికే తెలియదు. అప్పుడే ఏడుస్తుంది,  వెంటనే నవ్వుతుంది.  రకరకాల విన్యాసాలు  చేసే మనసు   ఎన్నో రకాల యాతనలు, దుఃఖాలు తెచ్చి పెట్టుకుంటుంది.  అలాగే  తాత్కాలిక సంతోషాలు, సుఖాలు కూడా తెచ్చి పెట్టుకుంటుంది.

• ఇలా మనసు పరివిధాలుగా ప్రవర్తించి … ప్రవర్తించి ఒక విధమైన డోలాయాన స్థితి కి (oscillative confusion state) చేరుకుని , నిర్ణయ శక్తి , నిశ్చయ శక్తి, కోల్పోయి దిక్కులు చూస్తుంది.


• అందువలనే  మనిషి ప్రవర్తన  ఎన్నడూ ఒకేలా స్థిరంగా ఉండదు,   క్షణ క్షణం మారిపోతుంది. మనిషి ఎన్నో జన్మ జన్మల అనుభవాలు,  అనుభూతులు అనుభవించిన  తరువాతే ,  తనకంటూ ఒక మనసు ఉంది అనే విషయం స్పష్టంగా ,  సూక్ష్మంగా గుర్తించ గలడు. … విచిత్రం ఏమిటంటే  అసలు  మనసు అంటే ఏమిటో, అవగాహన లేకుండా నే ,  తరచూ చాలా మంది మనుషులు, దుఃఖం లో ఉన్నప్పుడు  నా మనసు బాధపడింది అని అనడం వింటుంటాం.   అది దుఃఖం యొక్క ప్రభావం. … కానీ , అదే మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం  నా మనసు చాలా సంతోషంగా ఉంది  అని ఎవరూ గుర్తించ అనరు. దీనిని బట్టి తెలుసు కోవచ్చు మనిషికి అసలు మనసు పై అవగాహన ఉందా?  లేదా?  అని.


• మనిషి భూమి మీద పుట్టగానే ,  రెండు కళ్లు తో చూస్తూ,  ఈ బాహ్య ప్రపంచం లో  కనిపించే  ప్రతీదీ నిజం అనుకుంటాడు.  అందులో  భాగంగా నే ,  తాను ఒక దేహం అని నిశ్చయించుకుంటాడు .  ఎందుకంటే పైకి కనిపించేవి ఇవే కాబట్టి.   కానీ  ఆ దేహం లో భృకుటి స్థానం లో  ఆత్మ ఉంటుంది అని,  ఆ ఆత్మ లో మనసు, బుద్ధి, సంస్కారం దాగి ఉంటాయి అనే విషయం తెలుసుకోలేడు.

• మనసు  ఆలోచిస్తుంది,    బుద్ది  నిర్ణయం తీసుకుంటుంది,   సంస్కారం  కర్మ ను  ఆచరిస్తుంది. ఇవేవీ తెలియని  మనిషి ప్రాపంచిక  విషయాల లో లీనమై   జీవిస్తూ ఉంటాడు.   ఈ జీవించడం లోనే ఎన్నో భావోద్వేగాల   ఆలోచనలకు  మనసు  గురి అవుతుంది.  అందులో   ప్రముఖమైనవి  కోరికలు.

• మనిషి తన జీవనం లో   ఆలోచిస్తూ   ఆలోచిస్తూ  ఉండడం  వలన  మనసు కి  విశ్రాంతి  అనేది దొరకదు. నిద్ర పోయే  సమయం లో   దేహానికి  విశ్రాంతి దొరుకుతుంది.   కానీ  లోపల  మనసు  మాత్రం నిరంతరం   ఏదొక  ఆలోచన  చేస్తూనే ఉంటుంది.  అవి కలలు కావచ్చు,  దైనందిన  జీవితంలో ప్రభావం చూపే అంశాలు కావచ్చు.

• మరి మనసు కి కూడా విశ్రాంతి కావాలి … ఎలా? విశ్రాంతి పొందితేనే మరింత శక్తి పొందుతుంది. మనసు ని  విశ్రాంతి స్థితిలో  ఉంచగలిగేది    ధ్యాన యోగం  మాత్రమే.

• ధ్యాన యోగ  సాధన ద్వారా  మనసుకి     ఏకాంత స్థితి   ప్రాప్తిస్తుంది.  అంటే  మనసు దేని పట్ల   ఆకర్షణ, వికర్షణ  కలగకుండా  నిశ్చలమైన స్థితి  పొందుతుంది. ఈ ఏకాంతం,  ఏక్ అంతం అనేది  ఎన్నో, ఎన్నో సమస్యల్ని, అవ గుణాలను  అంతం చేస్తుంది …. అంతే కాకుండా  నిర్ణయ శక్తి,  సహన శక్తి,  ఎదుర్కొనే శక్తి,  పరిశీలన శక్తి,  సహకార శక్తి,  ఇముడ్చుకునే శక్తి, సమీకరణ శక్తి,  సంకీర్ణ శక్తి   వంటి  ఎనిమిది శక్తులను పొందుతుంది.  వీటినే అష్ట సిద్ధులు అంటారు. ఇదంతా మనసు ను  ఏకాంతంగా  చేయడం  వలన లభించే ఫలం. ….

• ఇక్కడ గమనించాల్సిన విషయం,   ఏకాంతం అంటే మనిషి ఒంటరిగా గది లో   ఉండడం ,  అరణ్యం లో కూర్చోవడం   కాదు.   ప్రాపంచిక  వ్యవహారాల లో తిరుగుతూనే ,   మనసుకు  ఏదీ   ఆకర్షితం కానివ్వకుండా ఉంచాలి.    ఏకాంతం అనే పదం పూర్తిగా మనసు సంబంధించినది.  

మనసు ఒక్కటిగా ఒక్కటే అయినప్పుడు   అన్నీ హరించ గలదు  అని అర్దం.   దీని వలన ఉపయోగం  ఏమిటి అంటే ఆత్మానందం,  విశ్వ శక్తి,  సంకల్ప బలం.


• మనిషి తన మనసును అంతర్ముఖ ప్రయాణం తోనే చదవగలడు, తెలుసుకో గలడు. దీనికి నిజాయితీ అవసరం.  ఎందుకంటే  ఒకసారి తన మనసు ను చదవడం మొదలు పెడితే ,  తనలో  ఉన్న చెడు గుణాలు,  లోపాలు స్పష్టంగా     స్పృహ కి (consciousness) కనిపిస్తాయి.  అప్పుడు వాటిని accept చేయాలి.    బయట ప్రపంచంలో  మన చెడు గుణాలు గాని, లోపాలు గాని,   ఎవరైనా గుర్తించి చెపితే వారితో వాదిస్తాం ,   అంగీకరించం.    కానీ అంతర్ముఖత లో  ఎవరితోనూ  వాదించలేం. అంగీకరించడం  అనే ప్రక్రియ  ద్వారా   మంచి మార్పు సాధ్యం అవుతుంది.

• ఒకసారి మనిషి   తన మనసు ను   అంగీకరిస్తూ చదవడం  అనే సాధన   మొదలు పెడితే  అద్బుతాలు చూడవచ్చు .… ఆఖరి కి  ఆ మనసు  ఎవరిదైనా సరే.

• ఏకాంతం అంటే   సర్వస్వం   కోల్పోవడం కాదు …. పేరుకుపోయిన  వ్యర్థాలను  త్యజించడం.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు.  2 August 2024 10:00 pm .



No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...