Saturday, August 3, 2024

526. స్నేహం … స్నేహితులు … అంటే ?

 

స్నేహం … స్నేహితులు … అంటే ?


స్నే "హితుల" దినోత్సవ సందర్భంగా 

2024

• హితం అంటే మంచి … హితవు అంటే మంచి పలకడం . హితుడు అంటే మంచి ఆచరించే వాడు. నిస్వార్థంగా ఇతరులకు మంచి చేసేవాడే వాడే స్నేహితుడు . స్నేహితుడు అనే పదానికి  అసలైన అర్థం మంచి చేసే వాడు  అని ఎందరికి తెలుసు ?.

• మనకు పరిచయం ఉన్న వారు, మనతో చదువుకున్న వారు, మన ఇంటి పక్కనే ఉన్న వారు, మనతో కలిసి ఉద్యోగం చేసేవారు అందరూ మనకు స్నేహితులేనా? …. మరి వీరందరూ   మన  స్నేహితులు   అయితే     వారు   మన  శ్రేయస్సు,  మంచి కోరుకుంటున్నారా? … లేదా వారందరిని స్నేహితులు  అని భావిస్తూ   భ్రమ లో   మనం  జీవిస్తూ ఉన్నామా?.

• స్నేహితులు  అంటే  మంచి కోరుకునే వారు మరియు మంచి చేసే వారు అని అర్దం. …. మరి పరిచయస్తులని ,  క్లాస్ మేట్స్ ని , కొలీగ్స్ ని ఇలా అందరినీ స్నేహితులు అనుకుంటే ,  అంత అమాయకం మరొకటి ఉండదు.   ఎందుకంటే    మన   దైనందిన జీవితంలో  వీరందరినీ   కూడా   స్నేహితులు అని యధాలాపంగా  తరచూ  సంభోధన చేస్తుంటాం. వీరి లో  కొందరు మంచి చేసే  మనస్కులు ఉండవచ్చు,  వారిని  మాత్రమే  స్నేహితులు గా భావించాలి.   కానీ అందరూ, స్నేహితులు గా కాలేరు.

• ఎందుకంటే …. మానవ జన్మ కు బుద్ధి ప్రధానం. “పుర్రె కో బుద్ధి” అంటారు, అంటే అందరి బుద్ధి ఒకేలా ఉండదు అని అర్థం.   అంటే,  అందరూ  తమ తోటి వారికి మంచి చేయాలని అనుకోరు. అటువంటప్పుడు మనతో  చదువుకున్న  వారందరినీ   లేదా  పైన ఉదహరించిన  అందరినీ   స్నేహితులు అని   మాట వరుసకు సంబోధించడం కూడా తప్పు , పొరపాటు. వీరిలో   మన మనసు   గ్రహించలేని    శత్రువులు కూడా  మనతోనే   కలిసి,   మన చుట్టూ అమాయకంగా నటించే ,  నమ్మక ద్రోహులు ఉంటారు.  అందుకే , అందరు క్లాస్ మేట్స్    లేదా    అందరు    పరిచయస్తులు  కూడా   స్నేహితులుగా కాలేరు … కాబోరు కూడా …. కాస్త నిశితంగా పరిశీలిస్తే , సూక్ష్మంగా  ఆలోచిస్తే  ఈ విషయంలో ఉన్న సత్యం అర్దం అవుతుంది.


• ఇంగ్లీష్ లో FRIEND అనే పదం ఉచ్ఛరించడం ద్వారా అది మంచా , చెడా అని  నిర్వచించ లేని స్థితి ఉంటుంది.  కానీ తెలుగు లో ,  స్నే”హితుడు” అని ఉచ్ఛరించడం లో నే   మధురత,  మంచి అనే సంకేతాలు  మనసు లో వెలువడుతాయి. అంటే స్నేహం,   స్నేహితుడు   అనే పదానికి భగవంతుడు ఎంత అర్దవంతమైన భాష్యం, భావం, పవిత్రత ఇచ్ఛాడో  తెలుస్తుంది. …. ఎప్పుడైనా మీలో మీరు అంతర్గతం గా గమనించి చూడండి,  నా స్నేహితుడు అని మీరు మనసు లో   ఎవరినైనా   స్మరించినా తెలియకుండా  వెంటనే  మీ పెదవుల పై   చిరునవ్వు వికసిస్తుంది.   అది సత్యమైన  స్నేహానికి  ఉన్న శక్తి.


• ఒకరిని మన స్నేహితుడు అని  అనుకోవాలన్నా లేదా  మనం ఒకరికి  స్నేహితుడు గా  ఉండాలన్నా ….

  మనసు తో   శుభ సంకల్పం,

  మాటతో   మధురత,

  కర్మతో    సహాయత …

  తప్పని సరిగా  ఈ మూడు చేయగలిగే  వారిగా   అయి ఉండాలి.


• స్నేహితుడు ఎల్లప్పుడూ మేలు కోరేవాడు  అయి ఉండాలి,  ఆ మేలు అనేది   అన్ని సమయాల్లో మధురత తో  నిండి  ఉండదు.   కొన్ని సందర్భాలలో కఠినత్వం  తో   కూడా  మేలు  ఉండవచ్చు.  ఎలా అంటే,  ఔషధం కొన్ని సార్లు  చేదు గా ఉంటుంది.  కానీ రోగం తగ్గి,  ఆరోగ్యం గా అయినప్పుడు  ఆ చేదు మందు బాగా మేలు చేసింది  అని  భావిస్తాం …. ఇకపోతే   స్నేహితుడు గా ఉంటూ ,  మేలు చేయకపోయినా ఫర్వాలేదు   కానీ    నమ్మక ద్రోహం,  వికారి తత్వాలు రుద్దడం , కీడు తలపెట్టడం,   అశుభ సంకల్పాలు కోరుకోవడం  వంటివి అసలు చేయకూడదు.


• స్నేహితుడి లో   సేవా తత్వం ఉండాలి    కానీ వ్యాపారి తత్వం  ఉండకూడదు.    వ్యాపారం లో  వేసే  లాభ నస్టాలతో   స్నేహాన్ని చూస్తే   స్నేహం పూర్తిగా  భ్రష్టు  పడుతుంది.


• మరి నేటి  జీవన కాలం లో   మనం సంతోషంగా చెప్పుకోవడానికి  మనకంటూ  అర్దవంతమైన(మంచి ) స్నేహితులు ఎందరు ఉన్నారు? …   అలాగే  మనం,  మన స్నేహితులు  అని చెప్పుకునే   వారిలో వ్యర్దవంతమైన  (ఏ ప్రయోజనం లేని)   వారు ఎందరున్నారు? ….  అదే విధంగా  మనం కూడా , ఎంతమంది కి  అర్థవంతంగా లేదా  వ్యర్ద వంతమైన స్నేహితులు గా   మిగిలి ఉన్నాం.….  ఇది  బాగా మనసు తో,  మనమే ఆలోచించు కోవలసిన విషయం.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


• మైక్ దొరికిన  సందర్భాల్లో   ఊకదంపుడు ఉపన్యాసాలు,  నీతులు,  మెట్ట వేదాంతాలు  ఎన్నో ఎన్నెన్నో చాలా  చెపుతాం.   అదే విధంగా    నిత్యం వాట్సాప్  గ్రూపుల్లో   నీతులకు  సంబంధించిన    ఫార్వర్డ్ మెసేజ్ లు,  వీడియోలు పెడుతూ  గుర్తింపు కోసం  మన ప్రతిభను  చాటుకుంటాం.  కానీ  వాటిని మనం ఎంతవరకూ స్వయం ఆచరిస్తాం  అనేది మనస్సాక్షి కే   బాగా తెలుస్తుంది.    ఎందుకంటే , నిజాయితీ తో    నీతిని ఆచరించాలి   అంటే,  చాలా చాలా మానసిక ధైర్యం,  సహనం కావాలి.  ఎవరైనా  ఈ నీతిని  ఆచరించే  సమయంలో  ప్రపంచం   అంతా ఒకవైపు గా ఉంటుంది ,   నీతి ఆచరించే వాడు మాత్రం  ఒంటరిగా  ఒక వైపు  ఉండవలసి  వస్తుంది.  కానీ  ఆ ఒంటరి వాడికే  భగవంతుడు   సత్య  స్వరూపం లో  తోడవుతాడు.   ఇది నిరూపించబడిన శాస్త్ర లిఖితం.   

దీనికి మంచి ఉదాహరణ  ....👇

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జనసేన  అధినేత  పవన్ కళ్యాణ్ విజయం.   స్వయానా తన అన్న  స్థాపించిన ప్రజారాజ్యం  పార్టీ తో పొసగక,   ఒంటరి వాడుగా దాదాపు 14 సంవత్సరాలు  నమ్మిన సిద్ధాంతం కోసం నీతి నిజాయితీ లతో  నిలబడి  నేడు డిప్యూటీ సీఎం అయ్యాడు.  గతం లో ఓడిపోయినా  ఏనాడు అధైర్య పడలేదు.  నేడు ఇతని సైద్ధాంతిక పోరాట పటిమను భారతదేశంలో  ఎన్నో యూనివర్శిటీ లలో  పొలిటికల్ కేస్ స్టడీ చేస్తున్నారు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


• నేటి కాలం మనిషి   అనేక విధములైన  అవసరాల కోసం మాత్రమే జీవిస్తున్నాడు  అనడం లో   ఏ సందేహం లేదు.   ఈ అవసరాలు  తీర్చుకోవడం  కోసం మాయ చేయడం ,   స్వార్థం,  హింస,  ఈర్ష్య, ద్వేషం,  కపట తత్వం,  అతి తెలివి వంటి వాటికి లోనై మనిషి లోని   సహజమైన  గుణాలను  కోల్పోతూ , దిగజారి పోతున్నాడా?   లేక ….

మనిషి తన  అవసరాలు  తీర్చుకునేందుకు   శ్రేష్టమైన, ఉన్నతమైన కర్మలు చేస్తూ,  శుభ చింతన తో  కూడిన కళ్యాణకరమైన  మార్గాలను  ఎంచుకొని,    సహాయకారి విధాలను ,   ధర్మాన్ని   ఆచరిస్తున్నాడా ?

 

ఇదంతా ఎందుకంటే….


• స్నేహం  అంటే  కేవలం  కాలక్షేపం కోసం అని,  శారీరక , మానసిక,   సామాజిక అవసరాలు  తీర్చుకునేందుకు మాత్రమే  అనే  ఆలోచన స్థితి కి   నేడు మనిషి   దిగజారి పోతున్నాడు .….  బదులుగా,  నేను  పేరు ఆశించకుండా  ఒకరికి   మేలు చేస్తాను,  ఒకరికి  నిస్వార్థంగా సహాయం చేస్తాను,  ఒకరి యొక్క మంచి లో   నేను భాగస్వామ్యం  అవుతాను  అని గుండెల మీద చేయి వేసుకొని  ధైర్యం గా  మనసు లో  అనుభూతి పొందే స్థితి లో నేడు ఎందరు ఉంటున్నారు ….


• అయినా …. ఈ రోజుల్లో ఇలా చాదస్తం గా ఎవరుంటారు , ఏ పని, పాటు లేని వారే ఈ విధంగా ఆలోచిస్తారు. రాయడానికి , నీతి కబుర్లు చెప్పడానికి ఈ హిత బోధలు బాగుంటాయి. అని అనుకునే మనుషులే ఎక్కువ ఉంటారు. … ఎందుకంటే సాధారణంగా బుద్ధి లో  మంచి కంటే చెడుని త్వరగా ఇముడ్చుకునే  శక్తి వేగంగా  ఎక్కువగా   మనుషుల కు ఉంటుంది.


• స్నేహితుల దినోత్సవం అంటే …. ఫ్యాషన్ కోసం, పిచ్చి,  వెర్రి చేష్టలతో  పార్టీలు చేసుకోవడం, అతిగా తినడం,  మద్యం సేవించడం,  వికృతమైన వికారి సంబంధాల కోసం వెంపర్లాడటం, స్నేహం అనే ముసుగు లో కొత్త పరిచయాలు కలుపు కోవడం కోసం ...  కాదు.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️


• కనీసం, స్నేహితుల దినోత్సవం నాడైనా , ఈ క్రింది విధంగా, ప్రతి మనిషి ఆత్మ విమర్శ చేసుకుంటూ , చెక్ చేసుకుంటే….  మనిషి లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది .

👇👇👇

1.  నా స్నేహం ద్వారా ఎవరికైనా సహాయం చేసానా ?  … చేస్తున్నానా ?

2.  నా స్నేహం ద్వారా ఎవరికైనా సంతోషం ఇచ్ఛానా? … ఇస్తున్నానా ?

3.  నా స్నేహం ద్వారా ఎవరినైనా  ఈర్ష్య, అసూయతో  బాధ  పెట్టానా …. పెడుతూ ఉన్నానా ?

4.  స్నేహం ద్వారా,  నేను సంతోషం గా  ఉన్నానా?    నా  జీవితం లో  కోల్పోయిన ఆనందాలు  దొరుకుతున్నాయా ?

5.  నేను, స్నేహాన్ని  నా స్వార్థ ప్రయోజనాల కోసం , అవసరాల కోసం  వాడుకొంటున్నానా ?

6.  నా కాలక్షేపం కోసం   ఇతరులతో   స్నేహం  చేస్తున్నానా?

7.  నా స్నేహం తో  ఎవరినైనా మోసం చేసానా ?

8.  నా స్టేటస్   గుర్తింపు కోసం  ఇతరులతో   స్నేహాన్ని కోరుకుంటున్నానా ?

9.  నా స్నేహితుల లో   ఎవరు ఎలా  ఉంటే   ఏంటి?   ఎవరు ఎలా  పోతే  ఏంటి ? …. నేను క్షేమం గా,  సంతోషంగా ఉన్నాను … అది చాలు నాకు … అనే దృక్పథం  నాలో  బలంగా  ఉందా?

10.  స్నేహం  ద్వారా  నన్ను   అందరూ  గొప్పగా కీర్తించాలి   అని తపన  పడుతున్నానా?

11.   స్నేహం అనే ముసుగు లో,  నాలో  అంతర్లీనంగా   దాగి  ఉన్న   వికారి చేష్టలు ,  తత్వాన్ని   ప్రదర్శిస్తున్నానా ?   తద్వారా  నేను  మానసిక   ఆనందం  పొందుతున్నానా ?

11.  నా స్నేహం ద్వారా  సంతోషం,  లబ్ది పొందిన వారు,  తిరిగి నాకు ఏమిస్తున్నారు ?  సంతోషమా … దుఃఖమా… వికారాలా … లేక ఏమీ ఇవ్వడం లేదా ?

12.  నేను స్నేహితుల  పట్ల  చేసిన  తప్పు కి   క్షమాపణ మనస్ఫూర్తిగా  చెపుతున్నానా  లేక   ఏదో చెప్పాలి కాబట్టి  నా అహం  దాచి   క్షమాపణలు  చెపుతున్నానా?

13.  స్నేహితుల పట్ల    నా మాట నిజాయితీ గా,   చిత్త శుద్ధి తో ఉంటుందా?  లేక  అవలీలగా   అసత్యాల తో   మాటలు మారుస్తూ   ఉంటున్నానా?

14.  వ్యతిరేక  లింగ  స్నేహితుల పట్ల,   నా మనసు లో  భావన   పవిత్రం గా,   గౌరవప్రదంగా, హుందాగా   ఉంటుందా ?


ఇవన్నీ  ప్రతీ మనిషి యొక్క స్నేహనికి  మరియు  మనస్సాక్షి  సంబంధించిన ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు.  ఇవి  కేవలం  నిజాయితీ  కలిగిన మనసు కి  తెలుస్తాయి.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️


• స్నేహం అంటే  “మంచి” … అది అన్ని మానవ సంబంధాలలో ఉంటే,  ప్రత్యేకం గా  ఇలా స్నేహితుల దినోత్సవం  అని గుర్తించు కోవలసిన స్థితి    ఏ మనిషి కి రాదు.

• కాలక్షేపం  కోసం ఎవరూ ఎవరితోనూ   స్నేహం చేయకండి,   అది ఎన్నటికీ స్నేహం కాబోదు. … కాలక్షేపం లో ముఖ్యం గా , ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తి గురించి చర్చించు కోవడం పదే పదే జరుగుతుంది . దీనిని వ్యర్దం అంటారు.   ఇది ఈ కలికాలంలో తరచూ అందరూ చేసే అతి సులభమైన , నీచమైన పాపం.   ఈ కర్మ కి  ప్రాయశ్చిత్తం కూడా ఉండదు.  ఇలా చేయడం వలన జన్మాంతరాలలో  వ్యర్థమైన  మనుషులు గా  అంటే  దేనికి పనికిరాని  వారు గా  మిగిలిపోతారు  అని శాస్త్రాల్లో  చెప్పబడింది.


• ఈ రచన మార్పు కోసం కాదు … కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే ఎవరు ఎవరిని మార్చలేరు. ఎవరికీ వారే మారాలి.

ఓం నమఃశివాయ 🙏.


ధన్యవాదములు 🙏

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఈ blog ని ఆదరిస్తున్న  తెలుగు వారందరికీ కృతజ్ఞతలు.

ఈ  blog views 44,000  ఇటీవల cross అయిన సంధర్బంగా   ప్రపంచం  నలుమూలల నుంచి  ఈ blog చదువుతున్న తెలుగు వారు ,  ఎవరో , ఏమిటో  నాకు తెలియక పోయినప్పటికీ  .... ప్రతీ ఒక్కరికీ , పేరు పేరునా  నా కృతజ్ఞతలు. 🙏 . 


                   జూలై    views 👇.


 All Time  Views 👇



యడ్ల శ్రీనివాసరావు, 3 August 2024, 10:00 pm.


 

No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...