Thursday, June 26, 2025

649 . చిన్నారుల సంబరాలు

 చిన్నారుల సంబరాలు 


• చిట్టి   పొట్టి  ఆటలు    

  చిన్నారి    సంబరాలు 

  చిన్నారి   సంబరాలు   . . .

నా   చిన్నారి   సంబరాలు

  చిటుకు   చిటుకు  మంటూ

  చెల రేగాయి   చెలిమి తో .


• కోతి  కొమ్మ  లాటలు   

  పొన్నారి  సోయగాలు

  పొన్నారి    సోయగాలు . . .

నా   పొన్నారి   సోయగాలు

  తళుకు   తళుకు మంటూ

  కలబోసాయి   కలిమి గా .


• చినుకుల   గెంతుల తో   

  చిలిపిగా   ఆడాము .

  పేపరు   పడవల తో   

  కేరింతలు   కొట్టాము .

• బురద లో   మాధుర్యం   

  చవి   చూసాము .

  వరద లా    ఆనందం    

  అనుభవించాము .


• చెప్పలేని   భావాలు    

  ఈ  చిత్రాలు  .

  చెప్పి  న ర్థం   చేసు కో   లేవు   

  ఎన్నో   బాల్యాలు .


• చిట్టి   పొట్టి   ఆటలు    

  చిన్నారి  సంబరాలు .

  కోతి   కొమ్మ  లాటాలు   

  పొన్నారి  సోయగాలు .


• తైతక్క  లాటడుతూ  

  కొంటె   చేష్టలు   చేసాము .

  ఎంగిలి   తాయిలాల ను

  పంచుకు  తిన్నాము .


• ఈడు లోని    తోడు లో 

  స్నేహం    చూసాము .

  అనుభూతులు   ఉద్వేగాలు 

  పంచుకున్నాము .


• చెప్పలేని    భావాలు    

  ఈ  చిత్రాలు .

  చెప్పి  న ర్థం   చేసుకో   లేవు 

  ఎన్నో   బాల్యాలు .


• చిట్టి  పొట్టి   ఆటలు 

  చిన్నారి   సంబరాలు .

  కోతి  కొమ్మ  లాటలు 

  పొన్నారి   సోయగాలు .


• బాల్యం లో   మేమంతా 

  ఎగిరే   తూనీగలం .

  అలుపెరుగని   ఆటలతో 

  ఆరితేరాము .

• కోరికలు   ఎరుగని 

  కడు   సామాన్యులం .

  చిరుతిళ్ళు    తోనే  

  సంతోష   పడ్డాము .


• సినిమాల    కెళితే    

  చిరంజీవి లం  .

  బడి లోన    మాత్రం  

  బిక్కు   బిక్కు    ఉడత లం .

• తరగని   ఆత్మీయత లే 

  మా  ఆస్తి .

  అందు కే       నేటి కీ 

  పొందలే దు   మేము  సుస్తీ .


• చిట్టి   పొట్టి  ఆటలు 

  చిన్నారి   సంబరాలు .

  కోతి  కొమ్మ  లాటలు 

  పొన్నారి   సోయగాలు

• చిన్నారి   సంబరాలు  . . .

  నా చిన్నారి   సంబరాలు

• పొన్నారి    సోయగాలు   . . .

  నా  పొన్నారి  సోయగాలు


పొన్నారి = మనోహర మైన

సోయగాలు =  అందాలు 


యడ్ల శ్రీనివాసరావు 26 June 2025 10:30 PM



Tuesday, June 24, 2025

648 . మెప్పు పొందుట - ఆశించుట


మెప్పు 

పొందుట - ఆశించుట


• మెప్పు అనగా ప్రశంస .   ఈ ప్రశంస అనేది స్వచ్చమైన  మనసు,  కల్లా కపటం లేని వాక్కు మరియు  శ్రేష్ట కర్మ ల  ద్వారా  సహజ సిద్ధంగా లభిస్తుంది .  కేవలం ఇతరుల తో  మెప్పు పొందాలనే తపనతో,  సంకుచితంగా  చేసే  కర్మ  స్వార్దం అవుతుంది.


• శ్రేష్ట  కర్మలు  ప్రతి ఒక్కరి  మెప్పు కు  పాత్ర మవుతాయి.  అందువలన మనం చేసే కర్మలు ఇతరులకు  మేలు చేస్తూ   ప్రశంసలు పొందేలా ఉండాలే  కానీ దుఃఖం, బాధ, సమస్యలు కలిగించే లా ఉండకూడదు.  అందుకోసం మనం ఎంత కష్టాన్నయినా   సహించ వలసి  వస్తే  సహించాలే కానీ ,  వెనుకంజ వేయకూడదు.  ఇతరులను నొప్పించక తాను  బాధపడక యుక్తి తో నడిచే వాడు ధన్యుడు.


• కంటిలో  నలక పడినా ,  కాలు లో  ముల్లు గుచ్చుకున్న , చెప్పులో రాయి చొరబడిన ,  చెవి లో జోరీగ  రొద పెడుతున్న ,  మానసిక సమస్యలు అల్లల్లాడిస్తున్నా , ఇంటిలోని  గొడవలు   బహిరంగంగా చెప్పుకో లేనటువంటి వి    ఎన్నెన్నో  మనిషి  సహనాన్ని పరీక్షిస్తాయి .  అలాగే  జీవితంలో  ఒక్కోసారి ఊహించని సమస్యల వలయంలో  చిక్కుకుపోతాము  . . .  అయినా  , నిరాశ చెందక ఎలాంటి  సమస్యలైనా  ధైర్యం గా  ఎదుర్కొని ఇతరుల  సమస్యలను   కూడా  పరిష్కరించడంలో సహయపడిననాడు  అందరి మెప్పు పొందగలుగుతారు.


• కొందరు  ఎల్లప్పుడూ  తమను  తాము  గొప్ప వారిగా  భావించుకొని  ఇతరులు  తమను పొగడాలని,  తమను అందరూ  స్తోత్రం  చేయాలని , తమ చుట్టూ  తిరుగుతూ  జపం  చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు .  తాము అందుకు తగిన వారమా  , కాదా  . . .  తమ గుణగణాలు అందుకు అర్హత   కలిగి ఉన్నాయా , లేదా  అని   కనీసం ఆలోచించరు .    

మనుషులు  తాము చేసే కర్మల అనుసార మే    ఇతరుల  మెప్పు పొందగలుగుతారు, అది దానంతట  అదే లభిస్తుంది  . అంతే కానీ,   ఒకరిని అడిగితే  లేదా  కోరుకుంటే   లభించేది  కాదు మెప్పు .


• మనసా  వాచా  కర్మణా  నిర్మల మనస్సుతో చేసే కర్మలు  అతి సహజంగా ప్రశంసా పాత్రం అవుతాయి.

మనకోసం కాక సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ భావన తో పని చేసిన నాడు ప్రశంసలు వాటంతట అవే లభిస్తాయి. 

అంతే కానీ  ఇతరుల మెప్పు కోసం ,  గుర్తింపు కోసం చేసే సేవ ,  సేవ అనిపించుకోదు  సరికదా స్వార్దం మరియు  పబ్లిసిటీ  అనిపించుకుంటుంది.  కాలానుగుణంగా  ఇదే విషయం అందరూ  గ్రహిస్తారు . చేసిన సేవ బూడిద లో పోసిన పన్నీరు  అవుతుంది .


• పూర్వం  ప్రతీ రాజు గారి ఆస్థానం లో "భట్రాజులు" ఉండేవారు.  రాజుగారు సభకు విచ్చేసిన సమయం లో ఆయనను గౌరవ పూర్వకం గా  “రాజాధిరాజా రాజ మార్తాండ “  అంటూ పొగడ్తల తో ముంచే వారు. ఆ సమయంలో సభ లోని వారందరూ లేచి నిలబడి రాజు గారికి గౌరవ మర్యాదలు ఇచ్చేవారు . నాటి  ఈ ప్రశంసా  విధాన్ని  నేడు ఆశించడం , అవలంభించడం బలహీనుల లక్షణం .


• అలాగే  . . .  కొందరు  అమాయకులు  ఎలా ఉంటారంటే,  ఇతరులు పొగడ్త లతో ముంచెత్తినపుడు ఆ  పొగడ్తలకు  పొంగి పోయి,   ఎంతో ఆనందంతో వారు  ఏ పని చెప్పినా , ఎంత కష్టమైన దైనా  చేసి వారిని  సంతోష పెడతారు కానీ  తమ అవసరానికి వారు   తనను  ఉపయోగించుకుంటున్నారని , అవసరం  తీరాక  తన ముఖం కూడా చూడరని గ్రహించలేనంతటి అమాయకత్వం ఉంటుంది వారిలో. కానీ  అమాయకులను మభ్య పెట్టడం  వలన  తగిన గుణపాఠం చవి చూడవలసి వస్తుంది .


ఎవరో   తమను  మెచ్చుకోవాలని  పువ్వులు తమ  సహజ  సౌందర్యాన్ని, పరిమళాలను వెదజల్లవు .  అది వాటి సహజ లక్షణం. 

ఉద్యాన వనాల లోనే  కాకుండా అరణ్యాలలో, ఎడారులలో,  పర్వతాల పై,  నీటి పై  పలు ప్రదేశాలలో  పువ్వులు   వికసిస్తూ   ఉంటాయి.

అదే విధంగా గుణవంతులు  ఎచటకు  వెళ్లినా తమ గుణాలను , సౌరభాన్ని వెదజల్లుతూ నే ఉంటారు. ఎవరో ప్రశంసించాలని  ఆశించరు .


• నిందలు  మనసును కృంగదీసే ఆయుధాలు. నిందలు  నిరూపణ  కానంత వరకు నిజాలు కావు .  అవి  కేవలం అపనిందలు మాత్రమే . నిరూపణ చేయ లేకుండా నిందలు మోపడం అనేది, మనుషులలో  దాగి ఉన్న ఈర్ష్య ద్వేషం అసూయ లనే  బలమైన అసుర శక్తుల కు , రాక్షస గుణాలకు నిదర్శనాలు . ఇది  శ్రీకృష్ణుని  జన్మ  వృత్తాంతం ద్వారా  విదితమే .


• మన  మనసు పై  నిజాయితీ తో   సత్  విమర్శ చేసే వారు,  మన  లోపాలను  పారదర్శకం గా  మనతో మాత్రమే  చర్చించే  వారే  మనకు  నిజమైన స్నేహితులు , ఆప్తులు .  అటువంటి  వారి కి మనం కృతజ్ఞతలు చెప్పి , ప్రశంసించాలే  కానీ వారిపై శత్రుత్వం,   కోపం  ఉండరాదు.

   వారు ,  మనలో ఎక్కడో దాగి ఉన్న లోపాలను సరిదిద్ధుకొవడానికి  . . . ఇంకా , ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయి చేరుకోవడానికి అవకాశం కలిగించారు .  కాబట్టే వారు మనకు సహాయం చేసిన వారిగా అవుతారు.  వారే నిజమైన  మార్గదర్శకులు. అటువంటి వారి ని  మరువకూడదు . అదే నిజమైన మానవత్వం .


• మనుషుల  నుంచి లభించే  ప్రశంసలు, స్థిరమైనవి కావు . అవసరాలను బట్టి  ఇవి మారుతూ ఉంటాయి. ప్రశంసలు  చేసే వారి  లో  ఏదొక అంతరార్థం దాగి  ఉంటుంది .  ప్రశంసల ను  మనసు అంగీకరించడం ,  స్వీకరించడం  అంటే మాయను  ఆహ్వానించడమే .


• కళ్లకు   కనిపించని    పరమశక్తి  నుంచి మెప్పు పొందడం అనేది,  సామాన్య విషయం కాదు. దానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. మనిషి తనలో నిక్షిప్తమై  ఉన్న  ఆధ్యాత్మిక శక్తి ని , అంతరంగిక శక్తి ని గుర్తించినచో ,  ఎలాంటి అనితర సాధ్యమైన పనినైనా ఎంతో  సులభంగా చేయగలడు.  అలాంటి వారు ధృఢత  నిశ్చయం  ఉన్నప్పుడు ,  ఎన్ని విఘ్నాలు వచ్చినా ముందుకు నడుస్తారే  కానీ , వెనుతిరగరు .

ముఖ్యం గా   ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి ఎలాంటి   వ్యర్దమైన  ప్రశంసల , దుస్సాంగత్యాల  వలలో  చిక్కుకుని తమ మార్గాన్ని  కంటక  ప్రాయం గా  చేసుకో రాదు . సాధకుడు  సర్వదా  వీటన్నింటి కి  అతీతమై నిరాడంబర  నిర్మల జీవితం గడపాలి.    ప్రశంసల పాఠశాల కు  దూరంగా  ఉన్నప్పుడు  ఆత్మ ఉన్నతి సాధిస్తుంది.


🌹🌹🌹🌹🌹


• మిణుగురు  పురుగులు  చీకటి వేళ  వెలుగును విరజిమ్ముతూ  ప్రపంచానికి  తామే  వెలుగు నిస్తున్నామని  ప్రశంసించుకుంటాయి  . . .   కానీ నక్షత్రాలు  ఆకాశం లో  ప్రకాశించ  గానే మిణుగురుల  గర్వం  పటాపంచలు అవుతుంది  . . .  

మెరిసే నక్షత్రాలు   తామే వెలుగు  నింపుతున్నామని  ఎగసి ఎగసి పడతాయి   . . . కానీ చంద్రుడు ఉదయించినంతనే నక్షత్రాల  వెలుగు మందగిస్తుంది .

చంద్రుడు తన వల్లనే ఈ ప్రపంచం అంతా సంతోషంగా ఉందని , భూమి కి తానే  వెలుగు  నింపుతున్నానని  గర్విస్తాడు  . . .  కానీ సూర్యుని రాకతో చంద్రుడు ఉనికి తెలియకుండా పోతుంది.

• అదే విధంగా తమ గొప్పలు గురించి తామే పొగుడు కుంటూ  కోటీశ్వరులు , మిలియనీర్లు  వంటి వారు గొప్పతనం  అనే పంజరం లో  తమను తాము బంధించుకొని   సామాన్య  మానవులను హీనంగా చూస్తారు.  చివరికి  ఆ పంజరంలో ,  మనసుకి శ్వాస సరిగా  సలపక  దుర్భరం తో  వేదన  అనుభవిస్తూ ఉంటారు .


• బాహ్య  ఆడంబరాలు తో  కూడిన సంస్కారాలు చాలా భయంకరమైనవి .  అందరూ నన్ను చూసి, నా మేధస్సు  చూసి,  నా  పనితనాన్ని చూసి , నా ధనం  ఆస్తి   స్థాయి  చూసి మెచ్చుకొని  నాకు ప్రాముఖ్యత  ఇవ్వాలి ,  నా మాటలకు  విలువ ఇవ్వాలి  అనుకోవడం   సంపూర్ణ అజ్ఞానం .  మరియు  ఏదొక రోజు నా గొప్ప తనం అందరూ గ్రహిస్తారనే అహం పనికి రాదు. 

మనలోని విశేషతలను , గుణాలను  సందర్బం అనుసారం గా  శ్రేష్ట కర్మల ద్వారా వ్యక్త పరచాలి  కానీ , గొప్పలు  చెప్పుకొంటే  ప్రయోజనం ఉండదు . 

మెప్పు పొందడం కోసం వృధా చేసుకునే సమయాన్ని , శక్తి ని  లోక కళ్యాణానికై  సవ్య  దిశ లో   వెచ్చిస్తే ప్రశంసా  పాత్రులవుతారు . . . భగవంతుని ప్రశంసలు పొందాలన్న  కోరిక గలవారు,  విశాల హృదయం తో ఇతరుల లోని   మంచి గుణాలను , ప్రత్యేకతలను సహజంగా ,  నిస్వార్థం గా  ప్రశంసిస్తూ  ఆత్మ విశ్వాసం పెంచే   కర్మలు చేయాలే కానీ . . . . వారి బలహీనత లను ఎత్తి చూపరాదు . వీలైతే  వారి లోని బలహీనతలు  రూపుమాపేందుకు  ప్రయత్నం చేయాలి, సాధ్యం కాకపోతే   కర్మానుసారం  వారి  పాత్ర  అంతే అని వదిలేయాలి.

• కావున మెప్పు కోసం గొప్ప లకు పోక, భగవంతుని సంతానం అయిన మనం , ఇతరుల పై శుభదృష్టి శుభ కామన లతో  జీవించడం మేలు .


• మన అంతర్గత జీవిత ప్రయాణంలో మనం ఎంత పరిపక్వత సాధించాం,  అనేది నిత్య విశ్లేషణ ఉండాలి . తప్పొప్పులను  నిజాయితీగా  అంతరంగం లో అంగీకరించ గలగడం , ఆత్మ ఉన్నతి సాధించడానికి  అత్యంత అవసరం .  దీనికి సద్గురువు అవసరం.

మౌనం   శ్రేష్ట గుణం ,   వ్యర్ద  సాంగత్యాలను  వడకడుతుంది .  వ్యర్ద ఆలోచనలను శుద్ధి చేస్తుంది.


ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి 🙏


యడ్ల శ్రీనివాసరావు 24 June 2025 10:00 PM.


Monday, June 23, 2025

647.జగదాంబ - మమ్మా

 

జగదాంబ . . . మమ్మా





• జగదాంబ   శారద    వీణా పాణి

  శివ శక్తి      సాధన     ఆశా శ్రేణీ .

  తల్లి వి  నీవు   . . .   ప్రేమ వు  నీవు

  తండ్రికి    ఆజ్ఞా కారి  వి    నీవు.       (2)


• ధృడత ను      ఆయుధం తో

  శాంతి యజ్ఞ    సేవా శక్తి వి    నీవు

  సకలం నీవు    . . .    సహనం నీవు

  మానవ    జన్మ న     దేవత   నీవు .


• జగదాంబ    శారద     వీణా పాణి

  శివ శక్తి        సాధన     ఆశా శ్రేణీ .

  శ్రీ మత్  నియమం  . . .   పాలన   ధైర్యం

  దీక్ష కు రూపం  . . .  పరమాత్మ తో  స్నేహం

  వెరసి న     మమ్మా    మా   " మాతేశ్వరి " .


• నిరహంకారం     నీ   సంపన్నం

  నమ్రత తత్వం    నీ   నైవేద్యం .

  శివుని    హృదయం లో

  సింహాసన మే 

  నీ   సుస్థిర    స్థానం .


• జగదాంబ  శారద      వీణా పాణి

  శివ శక్తి      సాధన     ఆశా శ్రేణీ

  తల్లి వి నీవు    . . .   ప్రేమ వు నీవు

  తండ్రికి     ఆజ్ఞా కారి వి     నీవు .



ఆజ్ఞా కారి  = చెప్పిన ఆజ్ఞ ను తు.చ. ఆచరించే వారు.

శ్రీ మత్ =  పరమాత్ముని  శ్రేష్టమైన సలహాలు . 


యడ్ల శ్రీనివాసరావు 24 June 2025 10:00 AM  


Saturday, June 21, 2025

646. ఎన్ని . . . కలలో


ఎన్ని  . . .   కలలో


• ఎన్ని    కలలో     . . .   ఎన్నెన్ని    కధలో 

  ఎన్ని    చిత్రాలో   . . .   ఎన్నెన్ని   విచిత్రాలో 

  శివయ్య             . . .    నా తండ్రి  శివయ్య .


• నీ     యధార్థం

  నీవు   చెపితే   కానీ   తెలియదు .

  నీ     సత్యం

  మేము  కనుగొనుట  అసాధ్యం .


• కన్నీటి     చుక్కల లో 

  ముత్యాల   కాంతి   నింపావు .

  హృదయాని కి    వెన్నెల 

  వెన్న ను      పూసావు .

• ఊహ కు      అందని

‌  ఊయల లో    ఊపుతున్నావు . 

• ఈ  రాతల   రమ్యం 

   నీ   దే    కదా   

•  నా  జీవిత   గమ్యం

   నీ  వే    కదా  .

‌   శివయ్య    . . .   నా తండ్రి శివయ్య .


• ఎన్ని    కలలో        . . .  ఎన్నెన్ని    కధలో

‌  ఎన్ని     చిత్రాలో    . . .   ఎన్నెన్ని  విచిత్రాలో

  శివయ్య               . . .   నా తండ్రి శివయ్య .


• మట్టి లో    మాణిక్యాలు   ఏరుతావు

  మెరుగెట్టి    మెరుపులు    సృష్టిస్తావు  .

• అంధులకు    ఆసరా     అవుతావు

  మనో నేత్రమై   హరివిల్లు   చూపుతావు .


కలల      అనుభవాలు

  ఆధార   భరిత    కధలు .

• సంకల్ప దృశ్య      చిత్రాలు

  ప్రత్యక్ష   మైన       విచిత్రాలు .


• మహిమలు  లేవు 

  గారడీలు   లేవు .

• ఉన్నది   అంతా   

  ఆత్మ  లోని   కర్మము . . . 

  పరమాత్మ  తోని   అను బంధము  .

  

• ఎన్ని   కలలో      . . .   ఎన్నెన్ని    కధలో

‌  ఎన్ని  చిత్రాలో    . . .   ఎన్నెన్ని   విచిత్రాలో

  శివయ్య            . . .   నా  తండ్రి  శివయ్య .


అంధులు = అజ్ఞానులు, అమాయకులు 


యడ్ల శ్రీనివాసరావు  21 June 2025 , 1:00 pm

Friday, June 20, 2025

645 . ఈషా రంగప్రవేశం


ఈషా  రంగ ప్రవేశం





• ఇదే    ఇదే     . . .  రంగ ప్రవేశం

  సృష్టి      స్థితి     లయ  రులకు 

  స్వాగతం       . . .    సుస్వాగతం .

• ఇదే     ఇదే    . . .  రంగ ప్రవేశం

‌  సృష్టి      స్థితి      లయ  రులకు

  స్వాగతం       . . .    సుస్వాగతం .


• నయ గ రాల    నయనం      

  ఈ  నృత్యం .

  సప్త మాతృకల   సదనం       

  ఈ  నాట్యం .


• కళా సాగరం   . . .  కూచిపూడి  నర్తనం

  అది   జన్మాంతరాల   భాగ్యం .

ఈశ్వరు ని    భంగిమ ల   జీవం

  ఈషా ని       అభిన య   రూపం .


• దేవతల      ఇష్టకామ్యం

  ఈ   కూచిపూడి    నాట్యం .

• దేవదేవుని    ఆశీర్వాదం

  ఈ నాటి       ఆరంగేట్రం .


• ఇదే   ఇదే    . . .    రంగ  ప్రవేశం

  సృష్టి    స్థితి     లయ  రులకు

  స్వాగతం      . . .     సుస్వాగతం .

• ఇదే ఇదే      . . .     రంగ ప్రవేశం

  సృష్టి     స్థితి     లయ  రులకు

  స్వాగతం      . . .     సుస్వాగతం .


• గురువిణి     తీర్చి న     ఈ శిల్పం

  లయ    భావాల      పారిజాతం .


• పాదాలు    చేసేను  . . . 

   పదనిసల     సమన్వయం .

• నేత్రాలు     ఆడేను

  సరిగమల    సావధానం .


• గమకాలు    ప్రాసలు . . .

  ఈ నాటి    అతిధులు .

• సంతోష      తాళాలు . . .

  ఈషా  కి      దీవెనలు .


• ఇదే   ఇదే     . . .   రంగ  ప్రవేశం

  సృష్టి    స్థితి    లయ   రులకు

  స్వాగతం      . . .     సుస్వాగతం .

• ఇదే ఇదే       . . .    రంగ  ప్రవేశం

  సృష్టి    స్థితి     లయ    రులకు

  స్వాగతం      . . .     సుస్వాగతం .


ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి 🙏


🌹 🌹 🌹 🌹 🌹 🌹


• చాలా కాలం తరువాత, ఈ రోజు మెసేజ్ వచ్చింది . . .

 నా చిన్ననాటి ఇంటర్మీడియట్ మిత్రుడు బొడ్డు శ్రీ హరి ,   స్నేహానికి   విలువలకు వ్యక్తిత్వానికి    ప్రతిరూపం , నాకు ఎన్నో విషయాల లో    ప్రేరణ , ఆదర్శం . తను 2000 సంవత్సరం లో అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. తన కుమార్తె చిరంజీవి “ Eesha ” అమెరికా లో పుట్టి, పెరిగింది.

 ఈషా అనగా సంస్కృత అర్దం ఈశ్వరుడు .

• తన ఫస్ట్ birthday India లో జరిగినపుడు మరియు ఒక పది సంవత్సరాల క్రితం ఇండియా వచ్చినప్పుడు మాత్రమే చూడడం జరిగింది. ఆమె బాల్యం నుంచి కూచిపూడి నాట్యం యజ్ఞం వలే నేర్చుకుంది. సాంస్కృతిక కళలను అభినయించడం పూర్వ జన్మల సుకృతం మరియు శివుని అనుగ్రహం. 

• కుమారి ఈషా కూచిపూడి నృత్య రంగ ప్రవేశం, 2025 ఆగష్టు 2వ తేదీ న అమెరికా న్యూజెర్సీలో జరుగుతున్న సందర్భంగా , నా మిత్రుడు బొడ్డు శ్రీహరి ఈ రోజు ఆహ్వానం తెలియ పరిచాడు . 

ఇది చాలా చాలా సంతోషం అనిపించింది .


భారతీయ సంస్కృతి, కళలను ప్రపంచానికి మరింత విస్తరింప చేసే శక్తి , కుమారి ఈషా ఆ శివుని ద్వారా పొందాలని , మంచి శాస్త్రీయ నృత్య కారిణి గా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందాలని . . . ఈశ్వరుని తో కలిసి యోగదానం చేయడమైనది .


• అమెరికాలో అందుబాటులో అవకాశం ఉన్న సాహితీ పాఠకులు మరియు కళాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై వీక్షించి, కుమారి ఈషా కి మీ శుభ దీవెనలు కోరుతూ 🙏 

మరియు . . .

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల లో నిరంతరం ఈ బ్లాగు ను వీక్షిస్తున్న తెలుగు సాహితీ అభిమానుల యొక్క మనో శుభాశీస్సులు కోరుతూ 🙏


 Please click the invitation link 👇

https://sites.google.com/view/eeshaboddurp/eesha-boddus-kuchipudi-rangapravesam?authuser=0


కళలను ప్రోత్సహించడం దివ్యత్వం.


For  Eshaa's  prior  video in my article  అర్థనారీశ్వరం  please  click here 👇 .

https://yedlathoughts.blogspot.com/2023/03/blog-post.html


యడ్ల శ్రీనివాసరావు 20 June 2025 1:30 AM.

🙏🙏🙏






Thursday, June 19, 2025

644. కెరటం - 2

 

కెరటం - 2

మనసు ఓ  కెరటం 


• పడిలేచే    కెరటమా

  పరుగెందుకు   . . .  అలుపెందుకు

  పయనం

  నీ గమ్యం కాదు . . .

  మార్గం    మాత్రమే .


• పడిలేచే    కెరటమా

  పరుగెందుకు  . . .  అలుపెందుకు .


• ఆటు  పోటు  లకు   అతీతం

  కాలేవు    ఎన్నడూ . . .

  ఆదమరచి    ఉన్నా కూడా 

  ఆగవు    

  అలజడులు  ఏ నాడు .


• అమావాస్య     రాగాలు

  ఘోషలు   నిండిన   ఉరకలు .

• పున్నమి     కాంతులు 

  మౌనం   నిండిన    నీడలు .


• పడిలేచే     కెరటమా

  పరుగెందుకు   . . .   అలుపెందుకు

  పయనం

  నీ గమ్యం కాదు . . .

  మార్గం   మాత్రమే .


• నీ అందాల    ఆలంబనం

  ఈ సృష్టి    రూప   కల్పనం .

  ఎగసి   పడుతు   ఉంటుంటే

  అదే   నీకు    భారం .


• నిశ్చలంగా   లేని      నీ చలనం

  దిశ   లేని    గమనం .

  గమ్యం  తెలియని   నీ  కాలం 

  నిశి   లోని   అయోమయం .


• పడిలేచే   కెరటమా

  పరుగెందుకు   . . .   అలుపెందుకు

  పరుగెందుకు   . . .   అలుపెందుకు .


కెరటం  అనగా  మనసు


యడ్ల శ్రీనివాసరావు 16 June 2025 8:00 PM .



Wednesday, June 18, 2025

643. జీవుని గుణాలు

 

జీవుని గుణాలు 


  జీవుడు = ఆత్మ + శరీరం .

ప్రాణం తో ఉన్న మనిషి జీవుడు . జీవుడి లో ఆత్మ మరియు శరీరం కలిసి ఉంటాయి. 

  శరీరం నాశనం అవుతుంది.  ఆత్మ నాశనం లేనిది.  శరీరం విడిచిన (మరణించిన) తరువాత ఆత్మ మరోక శరీరం ధరిస్తుంది. అదే జన్మించడం, మరో జన్మ తిరిగి ఎత్తడం.

  ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకో వలసినది  జీవుని లో గుణాలు . . .  అవి 

1. ఆత్మ గుణాలు  

2. శరీర గుణాలు.

 ఈ గుణాల ద్వారా నే జీవుడు జన్మ జన్మల జీవన యానం  చేస్తుంటాడు. 


 ఆత్మ గుణాలు

  జ్ఞానం , పవిత్రత , శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి

  జ్ఞానం : ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు బుద్ధి లో కలిగి ఉండి, సర్వకాల సర్వావస్థల యందు వాడి పోని పుష్పం వలే బుద్ధి వికసించడం , నిర్ణయాలు తీసుకోవడం.

  పవిత్రత : పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా . . . ధర్మం , సత్యత , నిజాయితీ ని ఆచరించడం .

  శాంతి :  మనసు , అలజడుల ప్రకంపనలకు అతీతమై , నిశ్చలత కలిగిన అతీంద్రియ శూన్య స్థితి  శాంతి .

  సుఖం :  సదా హర్షితం తో మనసు పొందే అనుభూతి.

  ప్రేమ : త్యాగనిరతి తో మనసు చేసే లాలన , పాలన .

  ఆనందం : ప్రకృతి మరియు వాయు మండలం ద్వారా మనసు  తేలికగా అయి నిత్యం ఎగురుతూ ఉన్నట్లు  పొందే అనుభవం.

  శక్తి :  అనంతమైన చైతన్యం .


  ఒక  జీవుడి లోని  ఆత్మ  సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు , పవిత్రతను ఆచరిస్తుంది . పిదప ఆత్మకు శాంతి  అనుభవం అవుతుంది . ఆ క్షణం నుండి   పరమాత్మ   ద్వారా  ఆత్మ కు   సుఖం చేకూరుతుంది .

  ఆత్మ తన సుఖం తో  ప్రేమ ను పంచుతుంది. ఇదే అన్ని వేళలా ఆత్మ ఆనందం కలిగి ఉండే స్థితి . ఈ గుణాలు అన్నీ కలిసి చైతన్యవంతం తో ఉండడమే  శక్తి . ఇదే ఆత్మ  స్వరూపం .

  నేను ఒక ఆత్మ అనే భావన స్థితి మనసు లో పూర్తిగా స్థితం అయినపుడు, ఆత్మ తన గుణాలన్నింటిని సహజంగా పొందుతుంది . ఇది సుఖానికి కారణం మరియు ఇదే స్వర్గం.

  ఈ ఆత్మీక స్థితి అనేది జ్ఞాన ధ్యాన యోగ సాధన తో  సాధ్యం .


( మనిషి  చనిపోయిన తరువాత ఆత్మ కి శాంతి చేకూరాలని ఇతరులు ప్రార్థిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం . వారికి మౌనం పాటీస్తూ ఉంటాం.  ఇది  అకాలమరణం మరియు  ఆకస్మిక మరణం  పొందిన వారి ఆత్మ లకు  సహయోగం  చేయడం  అంటారు.

అలాకాకుండా . . . 

 ఆత్మ , శరీరం ధరించి ఉన్నప్పుడే , అంటే మనిషి జీవించి ఉన్నప్పుడే శాంతి ని అనుభవం చేసుకునే సాధన ధ్యాన యోగం తో  స్వయం గా  చేయడం వలన ఆత్మ ఉన్నతి చెంది , సహజంగానే జీవుడికి  జీవించి ఉండగా నే  శాంతి అనుభవం అవుతుంది .

చనిపోయిన తరువాత ఆత్మ  , శాంతి ని అనుభవం చేసుకోవడం అనే ప్రక్రియ ఏమీ ఉండదు.  ఎందుకంటే ఆత్మ కి శరీరం ఉంటేనే ఏదైనా అనుభవం పొందగలదు.

అనగా  శాంతి ని అనుభవం చేసుకోవాలి అంటే  ఆత్మ  తప్పని సరిగా శరీరం ధరించి ఉండాలి, అనగా జీవించి ఉన్నప్పుడే అది సాధ్యం . ) 


  శరీర గుణాలు

  అహంకారం :  నేను అనే విపరీత దేహభిమాన భావం. ఇది శరీరంలోని ఇంద్రియ దృష్టి తో ఆరంభం అవుతుంది .

  కామం : ‌ శరీరం లోని ఉష్ణం , సమతుల్యత కోల్పోవడం వలన , ముఖ్యం గా  ఇంద్రియాలు శీతల స్థితి లో ఉండలేక ‌ పోవుట వలన కామం  ఉత్పన్నమవుతుంది .

  క్రోధం : ఆలోచనలు అదుపు కోల్పోయినప్పుడు శరీరం సృష్టించే అలజడి. దీనిని కోపం అని కూడా అంటారు.

  మోహం : ఈ సృష్టిలో ఏదీ తనకు శాశ్వతం కాదని తెలిసినా , శరీరం అమితంగా కలిగి ఉండే గుణాలైన   ఇష్టం , అపేక్ష , మమకారం , అభిమానాన్ని మోహం అంటారు .

  లోభం : శరీర పోషణకు అవసరమైన ఆహారం, ధనం సమృద్ధిగా ఉన్నప్పటికీ, లేమి తనం తో దీనత్వాన్ని అనుభవించే నికృష్ట స్థితి . దీనినే పిసినారితనం అంటారు.

  ఈర్ష్య : తమకు లేనిది ఇతరులు కలిగి ఉండడం వలన కలిగే అసంతృప్తి భావన .

  ద్వేషం : ఈర్ష్య మితిమీరినపుడు, మాటల తో , చేతలతో ప్రదర్శించే స్వభావం .

  స్వార్థం : నాది మాత్రమే అనే  విపరీత ఆలోచన ధోరణి .

  నేను ఒక శరీరం , దేహం అనే భావన స్థితి మనసు లో ఉన్నప్పుడు ఈ గుణాలు అన్నీ కూడా శరీరం అటుఇటుగా తప్పకుండా అనుభవిస్తుంది. అదే మనిషి దుఃఖానికి కారణం . ఇదే నరకం.

మనిషి జన్మాంతరాలుగా  తానొక ఆత్మ  అనే సత్యం  పూర్తిగా మర్చిపోయి , కేవలం దేహ భావ స్థితి తో మాత్రమే జీవిస్తున్నాడు. దీనికి కారణం మాయ . . . 

చనిపోయిన వారు మాత్రమే  ఆత్మలు గా  , అవుతారు  అని కొందరు  ,   ఆత్మ అంటే  దెయ్యం అని మరికొందరు  అనుకుంటారు.  ఇవి అపోహలు.  మనిషి జీవం తో ఉండగా నే మనిషి లో ఆత్మ ఉంటుంది, కానీ  మాయ వలన మనిషి  స్పృహ ఈ విషయం గ్రహించ లేదు.  


యడ్ల శ్రీనివాసరావు 14 June 2025 , 1:00 pm 


642. అవశేష కర్మ

 

అవశేష కర్మ




• అది 1980 ల కాలం. ఒక చిన్న పట్టణం. ఆ ఊరిలో వీధులు అన్నీ కూడా మట్టి వీధులు . సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. చిన్న బల్బు కాంతితో వీధి దీపాలు వెలుగుతూ , ఆ వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. కొందరు ఇళ్ళలో నిద్ర పోతూ ఉన్నారు. మరి కొందరు మాత్రం తలుపులు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు . వీధి కుక్కలు అక్కడక్కడా పడుకొని ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది.

• కానీ దూరంగా ఒక ఇంటి లో రేడియో నుంచి “ఇది మల్లెల వేళ యని”  అనే పాట వినిపిస్తుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వీధిలో ఒంటరిగా నడుస్తూ వస్తున్నాను. చల్లని గాలి తో , ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 

కానీ మనసు మాత్రం చాలా చాలా భారం గా అనిపిస్తుంది. అది ఎంత భారం అంటే , అది నాకు అర్ధం కావడం లేదు, నా కళ్లు చాలా ఆత్రుతగా దేని కోసమో వెతుకుతున్నాయి. ఒక వైపు మనసు లో ఏదో దిగులు బలం గా ఉంది.


• అలా ఆ వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, ఒక పాత డాబా ఇల్లు వద్ధ ఆగాను. ఆ ఇంటి చుట్టూ తక్కువ ఎత్తులో ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ లోపల చుట్టూ చాలా ఖాళీ స్థలం ,  విశాలమైన అరుగు ను ఆనుకొని సింహ ద్వార గుమ్మం  మరియు  ఒక గది ఉన్నాయి.   అక్కడ నుంచి ఎదురుగా వీధిలోకి చిన్న ఇనుప గేటు ప్రహరీ గోడ తో కలిపి ఉంది.



• ఒక నిమిషం అక్కడ ఆగి, ఇంటి వైపు తదేకంగా చూశాను.

• ఇంటి ప్రహరీ లోపల అరుగు మీద బల్బు వెలుగుతుంది. అరుగు ని ఆనుకొని పక్కనే ఉన్న గది లో నుంచి ట్యూబ్ లైట్ వెలుగుతూ , కిటికీ వెంటి లేటర్ లో నుంచి బయటకు కాంతి వస్తుంది .

• ఆగలేక . . . . నెమ్మదిగా శబ్దం రాకుండా చిన్న ఇనుప గేటు తీసి లోపలికి అడుగు వేశాను . రేడియో లో దూరం నుంచి ఆ పాట ఇంకా వినిపిస్తూ నే ఉంది.

• ప్రహరీ  గేటు  నుంచి  అరుగు కి  మధ్య ఉన్న ఖాళీ స్థలంలో , ఇంటి చుట్టూ రక రకాల పూల మొక్కలు ఉన్నాయి.  ఆ పూల మొక్కల మధ్య న  సన్నగా సిమెంట్ బాట వేసి ఉంది . పూల మొక్కల పరిమళం తగలగానే , నా గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

• అది నా ఇల్లు కాదు. ఎవరి ఇల్లో కూడా తెలియదు,  అర్దం కావడం లేదు.  సమయం రాత్రి పది గంటలు దాటింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అలా నిలబడి ఉన్నందుకు ఒకవైపు భయం,  మరోవైపు తెలియని బాధ విపరీతంగా లోపల నుంచి వస్తుంది . కానీ అక్కడ నుంచి కదలలేక నిలబడి పోయాను .


• ఒక నిమిషం తరువాత చూస్తే , అరుగు ని ఆనుకొని ట్యూబ్ లైట్ వెలుగుతున్న గది కి , పాత కాలం నాటి అలికిన (dazzle ) గాజు కిటికీ అద్దం నుంచి ఒక స్త్రీ , పురుషుడు కనిపించారు. కిటికీ వేసి ఉండడం వలన వారు స్పష్టంగా కనపడ లేదు . ఆ గది లో నుంచి వారి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ గదిలో ఉన్న స్త్రీ చేతి గాజుల శబ్దం, కాలి పట్టీల శబ్దం బయటకు వినిపిస్తోంది.

• కిటికీ బయట, పూల మొక్కల మధ్య లో నిలబడి ఉన్న నాలో దుఃఖం అమాంతంగా పెరిగింది . కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. శరీరం మనసు చాలా భారం గా అయిపోయాయి . ఆ స్థితి భరించ లేకుండా ఉంది.


• ఒక రెండు నిమిషాలు తరువాత, గది లో ట్యూబ్ లైట్ ఆఫ్ అయిపోయింది. అరుగు మీద  బల్బు లైట్ మాత్రం వెలుగుతోంది. బయట చంద్రుని వెన్నెల నిండుగా ఉంది. 

ఒక అర నిమిషం తరువాత, వీధి గుమ్మం తలుపులు తెరుస్తున్న శబ్దంతో పాటు, అంతకు ముందు విన్న గాజులు, పట్టీల శబ్దం వినిపించింది . . . లోపల ఉన్న , ఆ  స్త్రీ అరుగు మీద కి వచ్చారని  గమనించి నేను ఒక్కసారి గా  కంగారుగా, ఎవరైనా నన్ను చూస్తారని పూల మొక్కల మధ్య ఉన్న సిమెంట్ బాట లో నడుచుకుంటూ ఇంటి ప్రహరీ లోపలనే మరోదిశ   వైపు కి వేగం గా కదిలాను .


• వెనుక నుంచి, నా భుజం పై ‌ చిన్నగా గాజుల శబ్దం తో ఒక చేయి పడింది. తిరిగి చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. తేజస్సు తో ఉంది. ఆమె నాకు బాగా తెలిసిన మనిషి లా అనిపిస్తుంది , కానీ  పేరు గుర్తుకు రావడం లేదు . ఆమె ఎవరో అర్దం కావడం లేదు.

 
  నేను కంగారు పడడం చూసి, నా చెయ్యి పట్టుకుంది . . . ఆమె ముందు గా మాట్లాడింది.

 ఆమె :  ఏ , నా కోసం వచ్చి ... ఎందుకు అంత కంగారుగా వెళ్లి పోతున్నావు.

  నేను : తల దించుకుని ముభావంగా ... ఏం లేదు . . . ఈ దారి వెంట వెళుతూ , పొరపాటు న ఇలా వచ్చేశాను ... నీళ్లు నములు తున్నాను.

  (నాకు ఆమె బాగా తెలుసు , కానీ పేరు గుర్తుకు రావడం లేదు. కానీ ఆమె ఎవరో తెలియడం లేదు. గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం లోపల విపరీతంగా చేస్తున్నాను)

  ఆమె :  పర్వాలేదు . . . కంగారు పడకు, ఆయన నిద్ర పోతున్నారు.

  నేను :  లేదు . . . నేను వెళ్లి పోవాలి. ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు.  

  (అంత చల్లదనం లో కూడా నా ఒళ్లంతా చెమటలు పట్టేసాయి).

  ఆమె : మరి , ఎందుకు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు. నాకు పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు . . .  నువ్వు నాతో చెప్పకపోతే  నాకు ఏమీ  తెలియదు అనుకుంటున్నావా,  నువ్వు నన్ను ఎంత ప్రేమించావు ,  ఎంత ఇష్టపడ్డావు . . .  కానీ నన్ను ఇలా ఎందుకు వదిలేశావు . . . చెప్పు .
కొంత సేపటి క్రితం, నుంచి నాకు కావలసినది ఏదో బయట ఉండి పోయింది అని పదే పదే మనసు లో అనిపిస్తూ ఉంటే, చూద్దామని తలుపులు తెరిచి బయటికి వచ్చాను. లేకపోతే అసలు ఈ సమయంలో ఇలా బయటికి రాను . . . 



ఆమె నా చెయ్యి పట్టుకొని, పక్కనే ఉన్న గడ్డి లో కూర్చోపెట్టి, తన చీర కొంగు తో నా నుదిటి పైన చెమటను తుడుస్తూ ఉంది. మరో చెయ్యి , నా భుజం మీద ఉంచి మాట్లాడుతూ ఉంది.

 (అదంతా నాకు కావలసినది, దక్కాల్సిన ప్రేమ అని నాకు  లో  లోపల అనిపిస్తుంది.)

• అవును . . . ఆమె గుర్తు చేస్తూ చెపుతుంటే , అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, నేను ఆమెను చాలా ఇష్ట పడ్డాను, ప్రేమించాను, కానీ ఎప్పుడూ చెప్పలేదు . . .  ఆమె నాకు బాగా తెలుసు, కానీ ఆమె పేరు గుర్తుకు రావడం లేదు.  ఆమె ఎవరో అర్దం కావడం లేదు.

ఆమె తన నుదుటి ని,  నా నుదిటి పై ఆన్చి,   “నా పెళ్లి అయిన తరువాత నేను ఎలా ఉన్నానో అని,  నా మీద ఉన్న  ప్రేమను చంపుకో లేక నన్ను చూడాలని వచ్చావా “ అని గట్టిగా ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు, నా ముఖం పై నుంచి  నెమ్మదిగా జారుతున్నాయి.


• నా ఒళ్లంతా చెమటలు, శరీరం చాలా భారం గా ఉంది.  నేను విపరీతమైన దుఃఖం తో  బయటకు ఏడుస్తున్నాను. ముఖం , మెడ అంతా తడిసిపోయింది. నన్ను ఇంటిలో వాళ్ళు తట్టి తట్టి లేపారు . శరీరం ఆధీనంలో కి రావడానికి రెండు మూడు నిముషాలు పట్టింది. 

అప్పుడు  సమయం  తెల్లవారుజామున సుమారు 2 గంటలు ,  5 జూన్ 2025.
 
నేను ఎవరు ? ఇక్కడ ఎందుకు ఉన్నాను, అని వారితో అంటున్నాను. నా చుట్టూ ఉన్న ఇంటిలో వారిని గుర్తు పట్టడానికి రెండు నిమిషాలు వరకు సమయం పట్టింది. 

ఆ తర్వాత ఏదో కల వచ్చింది అని వారితో చెప్పాను.

• కానీ, అది నాకు కలలా కనీసం అనిపించడం లేదు, ఎందుకంటే అదంతా నేను పూర్తిగా ఆ సమయంలో అనుభవించాను.

అనుభవం అనేది , సంతోషం అయినా లేక దుఃఖం అయినా  సరే  ఒక భావోద్వేగం గా  ,  శరీరం తద్వారా మనసు ని  ప్రభావితం చేస్తుంది . 

ఇది ప్రస్తుత కాలం , స్థితి కి  సంబంధించినది కాక పోయినా సరే , స్వయానా  నాకు ఏదో కాలం లో సంబందించినది  అని  అనిపించింది . 

సహజం గా  కల అయితే   కొన్ని నిమిషాల తరువాత  పూర్తిగా చెదిరిపోతుంది . అస్పష్టం అయిపోతుంది.  కానీ, ఇది అలా అనిపించ లేదు.


* * * * * * 

• అసలు ఏంటి ఇదంతా,  దైవ చింతన లో ఉన్న సమయంలో,    అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి  అనుభవం కలలో  ఎదురైంది అని మదన  పడుతున్న సమయంలో,   సాయంత్రం ధ్యానం లో వచ్చిన సమాధానం ఏమంటే . . . 


మొదటిది  . . . 
మాయ.  ఆధ్యాత్మిక చింతనలో ,  పరమాత్మ  వైపు ప్రయాణం  చేస్తున్న వారికి , మాయ చాలా బలం గా  ఊహించని విధంగా స్వప్నం లో గాని ,  డైరెక్ట్ గా కానీ  దైవ చింతన న నుంచి  మరల్చడానికి   ఏదొక రూపం లో దాడి  చేస్తుంది .  దీనికి ఆధారం మరుసటి రోజు  భగవంతుని వాక్యంలో లభించింది 



రెండవది  . . .  
జన్మ  అంతరాలలో ఎప్పడో ఎక్కడో  మిగిలి పోయి ఉన్న  పెండింగ్ కర్మ .
పరమాత్మ వైపు పయనం చేస్తున్న మార్గం లో  తప్పని సరిగా  జన్మాంతరాలుగా  మనిషి ఆత్మ  లో   అవశేషాలు గా  అనగా  పూర్తి  కాకుండా  మిగిలి ఉన్న  కోరికలు,  వికర్మలు (పాప కర్మలు) , బంధాల బుణాలు  తప్పని సరిగా తొలగి పోవాలి  లేదా తీరి పోవాలి  లేదా కరిగి పోవాలి.  
అప్పుడు మాత్రమే  ఆత్మ లో శుద్ధి జరిగి   ఏ కోరిక, ఏ వికర్మ  , ఏ  బుణానుబంధం  బుద్ధి లో   లేకుండా పరమాత్మ వైపు పయనం సుగమం అవుతుంది .  ఇది  యోగ శక్తి తో సాధ్యం  అవుతుంది . 

ఇక్కడ  యోగ శక్తి  యెక్క మహ విశేషం ఏమిటంటే,  ఏ కర్మ  భౌతికంగా జరగకుండా  తీరిపోవడం , తొలగి పోవడం. 

 దీనిని  పెండింగ్  కర్మల ఖాతా సమాప్తం జరగడం అంటారు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  . . . 


• ఇది   (Saturn)  శని,  (Ketu) శ్రీ కేతువు ల  విశిష్టత తో కూడిన  కలయిక (conjunction scenario) .  


శని అనగా  చేసిన , చేస్తున్న  కర్మల అనుసారం గా  ఫలితం ఇస్తాడు . 

శ్రీ కేతువు   ఆధ్యాత్మికత  జ్ఞానం , భగవంతుని యొక్క వాస్తవ రూపం ప్రత్యక్షం  చేయిస్తాడు .  అప్పటి వరకు  ఉన్న స్థితి నుంచి మోక్షం అనగా విముక్తి ఇస్తాడు. ఇంకా . . . 

శ్రీ కేతువు  గత జన్మల లో  బాగా అనుభవం పొందిన  టాలెంట్స్  (Mastery  Talents )  యొక్క శక్తి  అతి సహజంగా ఇస్తాడు.  మరియు   అనేక జన్మల లో   మిగిలి ఉన్న  పెండింగ్ కర్మల ఖాతా ను    తెలియచేస్తూ తొలగిస్తాడు .  

శని  భౌతికం.  శ్రీ కేతువు  ఆధ్యాత్మికం . వీటి కలయిక  జన్మ జాతక కుండలి లో  ఆశీర్వాద స్థానం లో  ఉన్నప్పుడు మాత్రమే . . .  జీవుని ప్రయాణం భౌతికం లోకం నుంచి  ఆధ్యాత్మిక లోకం వైపు  క్రమేపీ  పూర్తిగా మారుతుంది.  

ఇది ఒక  మార్పు  Transformation ను సూచిస్తుంది  .  ఇది  కర్మ  యోగి  స్థితి  .  అనగా  కర్మ ల పట్ల  యోగి వలే  ఉండడం .  అనగా  ప్రతి కర్మ ఆచరిస్తూనే , వాటితో  మనసు  అనుసంధానం అవకుండా  నిశ్చలంగా  అవడం . 


 ఒక ఆత్మ పరమాత్మ వైపు పయనం అవుతున్న సందర్భంలో Saturn Ketu యొక్క విధి నిర్వహణ అద్బుతం, అత్యద్భుతం. ఇది విశ్వం లోని గుప్త శాస్త్రాలలో రాసి ఉన్న రహస్యం, అదే నేడు ఆధార భూతం.


యడ్ల శ్రీనివాసరావు 6  June 2025, 11:00 PM .


🌹🌹🌹🌹🌹


ఈ అనుభవం రాయడం జరిగింది.  జ్యోతిష శాస్త్రం లో  ఆధారం లభించింది.  కానీ  శివుని  నుంచి ఇంకా  ఏదో  ఆధారం , సమాధానం  అనుభవ పూర్వకం కావాలి అని నా మనసు చాలా  బలం గా కోరుకుంటుంది .

 ఒక  నాలుగు రోజులు తర్వాత,  ఒక తెలిసిన పెద్దాయన (70 సం )  ఫోన్ చేసి,  ద్రాక్షారామంలో   ఆధ్యాత్మిక జ్ఞాన కార్యక్రమం ఉన్నది , వెళ్లాలి అన్నారు .  ఆయనకు  కాలు  ఆపరేషన్ జరిగి ఉండడం చేత  ఆయన కారు  నడపలేక , నా సహాయం కోరారు .  సరే అని జూన్ 9 న వెళ్లాము. 

ఆరోజు  జ్ఞాన కార్యక్రమం లో , అక్కడ  ఒక గురువు గారు వినిపిస్తున్న అంశం తాలుకా  పేరు  ఏంటంటే 

 " పాత కర్మల ఖాతా సమాప్తికి గుర్తు "



 (తరువాత ఆ గురువు గారిని అడిగి పొందిన సారాంశం )


శివ స్మృతి  వలన ఆత్మ లో  వికర్మల ఖాతా తొలగుతుంది .  ఇందుకు మనిషి యొక్క బుద్ధి సహాయకారి గా ,  శివుని తో అనుసంధానించ బడాలి.  

శివుని  స్మృతి  చేస్తూ  విశ్వ మూలాల లోకి వెళితే ప్రతీది చాలా స్పష్టం . . . సుస్పష్టం.  దీనికి ఎవరూ అతీతం కాదు. ఇది చదివే వారితో సహా. 

ఇది అర్దం అయితే  యధార్థం . . . కాకపోతే  కధ.

ప్రేమ  యొక్క లక్షణం త్యాగం .  కానీ  మానవ ప్రేమ లో  ఒక్క తల్లి ప్రేమ మినహా , మిగిలిన అన్ని ప్రేమలలో  ఏదొక  స్వార్దం , వాంఛ , అవసరం  ఉంటుంది.  అందుకే ఆ ప్రేమ ల వలన చివరికి దుఃఖం మిగులుతుంది.  .  . 
(సత్యం , యధార్థం తెలియజేయడానికి మాత్రమే ఈ మాట)

కానీ  శివుని ప్రేమ అద్బుతం,  శివుని ప్రేమ త్యాగం, నిస్వార్థం.  శివుడు కనపడడు  కానీ  ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రేమ ను  మనిషి అందుకోవాలి అంటే శివుని యొక్క యధార్థాన్ని   గుర్తించాలి . అందుకు తప్పని సరిగా మనసును పవిత్రంగా చేసుకోవాలి . 

శివుడి ని   మనం చూసినప్పుడు కంటే , శివుడు  మనల్ని  చూస్తున్నప్పుడు  మనం పొందే అనుభూతి, అనుభవం  అనేది  జన్మ జన్మల అదృష్టం , భాగ్యం ఎందుకంటే  శివుడే  మనకు  తల్లి మరియు తండ్రి . . . ఇదే ముక్తి.


మనిషి  జీవితం నమ్మకంతో నడుస్తుంది. ప్రేమ పొందాలి అన్నా , ప్రేమ ఇవ్వాలి అన్నా  సరే నమ్మకం కలిగి ఉండాలి అప్పుడు  త్యాగ  సఫలత సిద్ధిస్తుంది . మనుషుల కు తమ పై తమ కే నమ్మకం కోల్పోతున్న రోజులు ఇవి. ఇక తోటి వారి కి , సాటి వారికి ప్రేమను ఎలా పంచగలరు, ఎలా తిరిగి పొందగలరు. 
కానీ . . . శివుని పై నమ్మకం ఉంచినా, ఉంచక పోయినా ప్రతీ ఒక్కరినీ ప్రేమిస్తూనే ఉంటాడు .  ఎందుకంటే శివుడు అమాయకుడు, అందుకే భోళానాధుడు అంటారు . 


ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 11 June 2025 10:00 pm. . . 



650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?

జాలి  దయ  కరుణ  • జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . ...