ఆత్మాభిమానం - అహంకారం
• మానవుని కి , సహచరులతో గాని మరెవరి తో నైనా వాగ్వివాదం సంభవించినపుడు మనసు లోపలి నుంచి తెర మీద కి వచ్చే అంశం , ఒకటి ఆత్మాభిమానం . రెండవది అహంకారం .
కానీ ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం నేటి మానవుడు గ్రహించలేని అంధకారంలో మనో స్థితి ఉండడం వలన మరియు , ఆత్మాభిమానం అనే పదాన్ని సమాజం లో తరచూ వింటూ ఉండడం వలన , ఆ పదాన్ని మనసు కి అన్వయం చేసుకొని తాను వివాదానికి గురైనప్పుడు నా ఆత్మాభిమానం దెబ్బ తింది అనే మాట ను వ్యక్తపరచడం చాలా మంది వ్యక్తుల తరచూ వినడం చూడడం జరుగుతుంది .
• ఎందుకంటే సాధారణంగా మనిషి కి ఇతరుల తో వివాదం సంభవించినపుడు తాను పూర్తిగా తన శరీరాన్ని అభిమానించే స్థితి లో ఉంటాడు . . . ఈ దేహభిమాన స్థితి , ఎదుటి వ్యక్తి పై కోపం పెంచుతుంది , లేదా తాను పొందిన అవమానాన్ని సహించుకోలేక దుఃఖం, అసహనాన్ని బయటకు వ్యక్తం చేసేలా చేస్తుంది .
• ఎవరైనా నిందించినపుడు అవమాన భారంతో ఉద్వేగం పొంది , “నేను” అనే శరీర భావన , ఆలోచన ఉండడం వలన , తానొక ఆత్మ అనే స్పృహ కనీసం ఆ మనిషి కి స్పురణలో కి రాదు .
మరి అటువంటప్పుడు నా ఆత్మాభిమానం దెబ్బ తింది అని ఇతరులతో చెప్పడం ఎంత వరకు సమంజసం ? వాస్తవానికి ఇది ఒక అవగాహన లోపం. ఎందుకంటే ఆ మనిషి కి ఆత్మ అంటే ఏమిటో తెలియదు కాబట్టి. “ నేను “ అనబడే తన శరీరాన్నే పొరపాటున ఆత్మ గా భావించడం జరుగుతుంది.
• వాస్తవానికి మనిషికి ఆ దశలో వచ్చేది కోపం మరియు అహంకారం. అహంకారం వచ్చినప్పుడు తన అంతర్గత స్థితి , నన్ను నిందిస్తారా . . . నన్ను అవమాన పరుస్తారా . . . నన్ను మోసం చేస్తారా అనే ఉద్రేక భరితమైన ఉద్వేగాలు బయటకు వస్తాయి. దురదృష్టం ఏమిటంటే ఇదే ఆత్మాభిమానం అని అనుకుంటాడు ఆ మనిషి .
• నాకు ఆత్మాభిమానం ఎక్కువ, నేను ఎవరిని మాట అనను, నన్ను మాట అంటే పడను అని కొందరు అంటారు . ఇది పొరపాటు , ఆత్మాభిమాని ఎవరినీ ఒక మాట అనడు . . . తనను ఎవరైనా ఒక మాట అనినా పట్టించుకోడు .
అసలు ఆత్మాభిమానానికి అర్దం తెలియక పోవడానికి కారణం , అహంకారం .
• ఆత్మ యొక్క స్వధర్మం శాంతి . అంటే ఆత్మ ఎప్పుడూ కూడా , ఏం జరిగినా సరే శాంతి గా ఉంటుంది, శాంతి నే కోరుకుంటుంది. శాంతి అనేది ఆత్మ ఆచరించ వలసిన ధర్మం .
• మరి మనిషి తనకు ఆత్మాభిమానం ఎక్కువ, అన్నప్పుడు తనకు ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా చిరునవ్వుతో, శాంతి గా నే ఉండాలి, ఉంటాడు . మౌనం తో ఆ శాంతి ని అనుభవం చేసుకొని , ఆత్మ అభిమాని గా అవుతాడు. ఆత్మాభిమానం ఉన్న వారు దేనికి వెంటనే స్పందించరు , React అవ్వరు. ఎప్పుడూ proactive గానే ఉంటారు.
ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరితోనైనా ఏదైనా సమస్య గాని, వివాదం గాని , పరిస్థితులు చేతులు దాటి మితిమీరుతున్నప్పుడు వారికి దూరంగా మౌనం గా ఉంటారు. అంతే కానీ తమలో తాము ఏ విధమైన ఉద్రేకాన్ని పొందరు . పైగా ఎదుటి వారి మానసిక దీనావస్థ , స్థితి పట్ల జాలి కలిగి ఉంటారు . ఎదుటి వారు మరిన్ని పొరపాట్లు , చెడు కర్మలు చేయకుండా ఉండేందుకు , నిమిత్తమై వారికి దూరంగా ఉంటారు.
• మనిషి లో అహంకారం ఒక స్థాయి ని మించి ఉన్నప్పుడు, అనేక రకాల భాష పదజాలంతో , మాటలతో , చేతలతో , సభ్య సమాజం హర్షించని సంస్కారాల తో ప్రతిస్పందిస్తారు , React అవుతారు.
• మనిషి యొక్క స్పృహ ఆత్మాభిమానానికి , అహంకారానికి మధ్య ఉన్న వ్యత్యాసం యధార్థం గా గమనించుకో గలిగే స్థితి పొంది ఉంటే , జరిగిన జరుగుతున్న జరగబోయే ఎటువంటి విషయాల పట్ల నైనా క్షోభ , ఆందోళన , ఉత్సుకత, ఉత్సాహం వంటి ఏ విధమైన భావోద్వేగాలకు గురి కాకుండా సాక్షి భూతమై నిమిత్తమాత్రమై ఆనందంగా తన పని తాను చేసుకుంటూ జీవిస్తాడు .
యడ్ల శ్రీనివాసరావు 27 July 2025 , 9:30 AM.
No comments:
Post a Comment