Sunday, July 13, 2025

657. నీ నిజాయితీ - నీ శత్రువు

 

నీ నిజాయితీ . . .  నీ శత్రువు


“ నీ నిజాయితీ నీ శత్రువు”.  ఇది   ప్రతి ఒక్కరం  ఆమోదించ  వలసిన  విషయం . నిజాయితీ గా ఉండడం వలన అనేక సమస్యలు , నిజాయితీ ని ఆచరించడం వలన   చుట్టూ ఉన్న వారితో పాటు ,  మనకు  మనమే శత్రువుగా  పరిగణించుకో వలసిన  స్థితి పొందుతాము .

ఎందుకంటే  నిజాయితీ అంటేనే  నిప్పు . ఆ నిప్పు  మన  చుట్టూ ఉన్న   అసత్యాన్ని , అధర్మాన్ని  తగలబెడుతుంది ‌, చివరికి  అవసరమైతే  మనల్ని  కూడా . ఇది మనందరి  స్పృహ కి తెలిసిన యదార్థం .

• అందుకే ఎందుకొచ్చిన  నిజాయితీ లే , అని మనం అనేక విషయాలలో  మన బంధువులు , మిత్ర సంబంధీకులు  తమ ప్రవర్తన తో  చేసింది తప్పు అని తెలిసిన సరే నోరు తెరిచి వారికి చెప్పం , వారిని ఖండించం,  వారిని సరిదిద్ధం .  సరికదా మనల్ని మనం సరిదిద్దు కొనే ప్రయత్నం చేయము .  

దురదృష్టవశాత్తు , ఇటువంటి పరిస్థితి  రేపు మన ఇంటి  పిల్లల  ప్రవర్తన లో  నిజాయితీ యొక్క లోపం  కనిపిస్తే ,  మనకేందుకు లే  అని వారిని  ఖండించ కుండా  ఉంటామేమో  కదా .  ఎందుకంటే  మనం నిజాయితీగా వారిని ఖండిస్తే సమస్యలు పెరుగుతాయి కదా .  మనకు సమాజం లోని  వారి పట్ల ఇదే అలవాటు ఉన్నప్పుడు, మన  ఇంటికి కూడా అదే వర్తిస్తుంది కదా .


• మనం సత్యం ఇతరులకు చెప్పడం వలన , లేదా సత్యం ఆచరించడం వలన ఇంటా బయటా మనకు అనేక సమస్యలే సమస్యలు. అందుకే కదా గుంపులో గోవిందా అనుకుంటూ, తందాన తాన అంటూ గుడ్డి  ఎద్దు లా   ఆనందం గా జీవిస్తూ  ఉంటాం.  చెప్పాలంటే  అలా జీవించడానికి   మనం   పూర్తిగా అలవాటు పడిపోయాం. దీనికి అతీతంగా నిజాయితీ తో ఉండడం లేదా మాట్లాడడం అంటే ముందుగా మనలో భయం అనే భూతం పుడుతుంది కదా .


• చిన్నతనం నుంచి బడి పుస్తకాల లో , ఉపాధ్యాయుల  దగ్గర  అమాయకంగా  నేర్చుకున్న , చదివిన , ఈ నీతి వాక్యాలు  , కధలు , విలువలు , ఆదర్శాలు , మనల్ని చాలా చాలా  మోసం చేశాయి  అని  నేడు మనకు  అనిపిస్తుంది  కదా . 

ఎందుకంటే గురువులు చెప్పిన  విలువలు , నీతి , న్యాయం  ప్రకారం నేడు మనుగడ సాగిస్తే , దొంగ లా అందరికీ భయపడుతూ ఉండవలసి వస్తుంది .   కానీ ,  దొర లాగ ధైర్యం గా బ్రతకాలి అంటే , మనసులో  నీతి నిజాయితీ లను తుంగ లో తొక్కితే ,  ప్రతీ క్షణం సంతొషం గా , నాటకీయంగా అద్బుతం గా  జీవించవచ్చు . ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఆనందం గా ఉండొచ్చు .  నేడు అవునన్నా కాదన్నా మనందరం ,  జీవితం లో ఎన్నో అనుభవాల ద్వారా తెలుసుకున్న ఏకైక సత్యం ఇదే ... కదా .


• అందుకే కాబోలు,  మహానుభావులు అంటుంటారు , నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేవి  చెప్పడానికే  కానీ ఆచరించడానికి కాదు అని .


• నేటి కాలంలో మనిషి లో అసలు సిసలైన ధైర్యం చచ్చిపోయింది. ప్రస్తుతం మనిషి కి ఉన్న ధైర్యం , తన పిరికితనానికి కొనసాగింపు . ఈ విషయం గ్రహించలేక  దురదృష్టం కొద్దీ , ఆ పిరికితనమే  అసలైన ధైర్యం అనుకుంటూ మాయా మత్తు లో హాయిగా బ్రతికెస్తూ ఉన్నాం . ఎందుకంటే మన పొట్ట చల్లగా ఉంది అది చాలు కదా మనకి .


• అందరిలాగే  నేను,  నా  జీవిత అనుభవాల ద్వారా , తెలుసుకున్న పాఠం ఏమిటంటే . . .

  " నీ  నిజాయితీ  నీ శత్రువు  . .  . 

    నీ శత్రువే , నీ అసలైన మిత్రుడు " .


• నువ్వు ఎప్పుడైతే నిజాయితీ తో, నీతి తో, ధర్మం తో ఉంటావో తప్పని సరిగా సమాజం లోని వ్యక్తులు ,  మిత్రులు  , కుటుంబ సంబంధీకు ల తో  తప్పకుండా  మొదట్లో  వ్యతిరేకత వస్తుంది.  ఎందుకంటే నువ్వు ముమ్మాటికీ  వారిలా, లేవు మరియు వారిలా ఉండడం లేదు కాబట్టి .  ఇక వారిలో లో నిజాయితీ లేదు కాబట్టి , నీ నిజాయితీ ని   వారు  అంగీకరించరు .


• ఈ సమయంలో  నువ్వు  ముక్కు సూటిగా నిజాయితీగా  వ్యవహరిస్తే ,  వారు నిన్ను తప్పకుండా  నిందిస్తారు, అవమానాలకు గురి చేస్తారు, మోసం చేస్తారు , తడిగుడ్డతో గొంతు కోస్తారు,  ఎంతకైనా తెగిస్తారు  ఇలా నీ జీవితంలో  నువ్వు  ఎన్నడూ   చూడని ఊహించని  వ్యతిరేకతలను నీ పై చూపిస్తారు .

ఈ దశ లో   అప్పటి  వరకూ నీ లో  ఉన్న , నీ నిజాయితీ  నీకు పూర్తిగా శత్రువు అవుతుంది . ఇదంతా  నీకు మరియు బాహ్య  ప్రపంచ సంబంధీకుల మధ్య  జరిగే వ్యవహారం .


• సరిగా ఇలాంటి వ్యతిరేకమైన సందర్బం సమయంలో  . . .   అంతర్గతంగా   నీ లో మరుగున పడి   ఉన్న   కొన్ని   లక్షణాలు అయిన  కోపం , అసహనం , నిస్సహాయత , అహంకారం  వంటి గుణాలు కూడా   నీ లో లో  ప్రేరేపితం అవుతూ,  నీ లోని నీతి  నిజాయితీ లను   నీకు   శత్రువు గా చూపిస్తాయి అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

ఈ  సమయంలో  నీ  బుద్ధి   చిత్త శుద్ధి తో సమర్దవంతంగా పనిచేస్తే , నీ లోని నీతి నిజాయితీ తో పాటు   వివేకం , ఓర్పు , సహనం , సమయస్ఫూర్తి ,  ధైర్యం  వంటి వి  ప్రస్ఫుటంగా ఉంటే , మొదట నీ లోపల ఉన్న అవగుణాల పై పోరాటం  జరిగి ,  నీ పై నువ్వు విజయం సాధించగలవు . ఈ దశలో  నువ్వు ఒంటరి గానే ఉంటావు . చెప్పాలంటే , ఇది నిన్ను . . . ఉన్న స్థితి నుంచి  ఉన్నత స్థితికి  చేర్చే  బృహత్తరమైన అంతర్యుద్ధం .


• ఏనాడైతే  నీ లోని  శత్రు గుణాలకు నీవు లొంగకుండా ఉంటే , నీ పై  నీ  విజయం తథ్యం. ఒకసారి విజయం సాధించిన తరువాత , ఆ శత్రు గుణాలు పూర్తిగా నశించి , అవే నీ లోని నీతి నిజాయితీ లకు దాసోహం అవుతాయి, ఇదే నీ లోన ఉన్న శత్రువులు మిత్రులుగా మారడం అనవచ్చు .


• అదే విధంగా బాహ్య ప్రపంచ సంబంధాలు అన్నింటిలో   ఎవరైతే  నీ నిజాయితీ ని వ్యతిరేకిస్తూ వస్తారో . . . కొంత కాలం , సమయం తరువాత వారి దగ్గర లేనిది, నీ దగ్గర ఏముందో తప్పక తెలుసుకుంటారు, వారు తమ జీవిత కాలం ద్వారా పొందలేనిది నువ్వు ఏం పోందావో తెలుసు కుంటారు . . . చివరికి తమలో తాము, తమ అజ్ఞానానికి చింతిస్తారు . 

• నీ నిజాయితీ నీ శత్రువు అయింది  కదా అనుకొని అక్కడే ఆగిపోతే  నీవు ఒక ఫెయిల్యూర్ . అలాకాకుండా శత్రువే  నీ మిత్రుడు అని ముందుకు సాగిపోతే   అదే నీ సక్సెస్ .


• మనిషి కి ప్రాణం అంటే తీపి. ప్రాణం అంటే భయం. ప్రాణాన్ని కాపాడుకోసమే మనం జన్మ ఎత్తి నట్లు భావిస్తూ ఉంటాం . మరి ఎందుకని ప్రాణాన్ని శాశ్వతం గా, అమరం గా ఉంచుకోలేక పోతున్నాం . … సరే ప్రాణం ఏదో రోజు పోతుందని తెలిసి నా కూడా , నీతి నిజాయితీ లను ఎందుకని ధైర్యం గా ఆచరించ లేకపోతున్నాం ‌ . ఆచరించే లేకపోయినా గాని ఇతరులు ఆచరించినపుడు  ఎందుకని అంగీకరించ లేకపోతున్నాం .  ప్రాణం పోయినా సరే , నీ  నీతి నిజాయితీ  మార్గ దర్శకం తో కొందరికైనా  ప్రేరణ అయి , ఈ భూమి మీద అమరం గా ఉంటాయి . 

దీనిని బట్టి మనమే  ఆలోచించు కోవాలి మనిషి గా పుట్టినందులకు మన కోసం మనం ఏ విధమైన   సంపాదన  వృద్ధి  చేసుకుంటూ  కాలం లో  నిరంతరం  పయనిస్తూ  ఉన్నాం.


గమనిక : ఈ రచన లో    నీ , మనం అనే పదాలు పాఠకులకు అర్దం అయ్యే విధంగా సహజత్వం కోసం రాయడం జరిగింది . అంతేకానీ   నీ ,  మన అనే పదాలు ఎవరినీ ఉద్దేశించి కాదు . ఎందుకంటే ఇది రాసిన వాడు కూడా  అంత ఉత్తముడు, ఉన్నతుడు, యోగ్యుడు  కానే  కాదు .


ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 13 July 2025 11:00 am.

No comments:

Post a Comment

657. నీ నిజాయితీ - నీ శత్రువు

  నీ నిజాయితీ . . .  నీ శత్రువు • “ నీ నిజాయితీ నీ శత్రువు”.   ఇది   ప్రతి ఒక్కరం  ఆమోదించ  వలసిన  విషయం . నిజాయితీ గా ఉండడం వలన అనేక సమస...