Wednesday, July 9, 2025

654. గురు(వు) పౌర్ణమి


గురు(వు) పౌర్ణమి


• మనిషి ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు ఏదోక అంశం లోనో, విషయం పైనో ఆలోచిస్తూ నే ఉంటాడు. అసలు ఈ ఆలోచనలు ఎందుకు అంటే కర్మలు (పనులు) చేయడానికి.

మరి ఈ కర్మలు సరిగా ఉంటున్నాయా ? అని ప్రశ్నిస్తే , వాటికి కారణభూతమైన, ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా సరైనవే నా ? కాదా ? అనే నిర్ణయ శక్తి కూడా బుద్ధి కి  ఉండాలి …. ఇదంతా స్వయం గా  మనకు మనం  ఎలా తెలుసు కో గలం ?

ఎందుకంటే మనిషి తనకు తోచిన ఆలోచన తో కర్మ చేస్తే , దాని ఫలితం సంతోషమా? దుఃఖమా? ఏది లభిస్తుంది…. పాపమా? పుణ్యమా? ఏది లభిస్తుంది  ,  అనేదానికి సమాధానం , కర్మ చేసేముందు తెలియాలి. అంటే మనం ఆలోచించే ఆలోచన సరైనదా కాదా అని మనకే ముందు గా తెలియాలి. ఇది తెలియాలి అంటే మనకు జ్ఞానం అవసరం.


• ఈ జ్ఞానం ఇచ్చేది , చెప్పేది కేవలం సద్గురువు మాత్రమే. సద్గురువు మనిషి లోని అజ్ఞానం అనే చీకటి పారద్రోలి ,   పౌర్ణమి వెన్నెల వంటి చంద్ర ప్రకాశాన్ని  జ్ఞానం తో నింపుతాడు. అదే గురుపౌర్ణమి విశిష్ఠత .  అందుకే  శివుని సిగ పై చంద్రుడు ని  చూపిస్తారు .


ఈ కలియుగంలో, మనిషి ఎంత ధనం కీర్తి హోదా సంపాదించినా సరే జ్ఞానానికి నోచుకో లేక దుఃఖం తో విలవిలలాడుతూ  ఉంటాడు .  ఈ దుఃఖం శారీరకంగా  నైనా లేదా  మానసికంగా నైనా ఉంటుంది . ఇది అంగీకరించ వలసిన పరమ సత్యం . 


• అసలు జ్ఞానం అంటే ఏమిటి ?

జ్ఞానం అంటే  మనిషి బుద్ధి కి వెలుగు , వికాసం .  జ్ఞానం సముద్రం వలే అనంతమైనది .  జ్ఞానాన్ని  కొలవడం అసాధ్యం .  జ్ఞానం శివుని యొక్క సంపద . అందుకే శివుడిని  సద్గురువు మరియు జ్ఞాన సాగరుడు అని అంటారు.

సృష్టి కర్త అయిన పరమాత్మ శివుడు తన జ్ఞానాన్ని  బ్రహ్మ కి ఇస్తాడు . బ్రహ్మ ఆ జ్ఞానాన్ని తన రచన ద్వారా  లోకానికి అందిస్తాడు. యుగాల అనుసారం అది  సద్గురువు ల చే అది మానవులకు చేరుతుంది. 

సత్య యుగం, త్రేతాయుగాలలో  ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఆచరించడం వలన , సహజంగా దేవతలందరూ  జ్ఞాన వంతులై ఉంటారు . దీనినే బ్రహ్మ పగలు అంటారు. 

ద్వాపర, కలియుగాలు పూర్తిగా అజ్ఞానం నిండి ఉండడం వలన  బ్రహ్మ రాత్రి అంటారు .  ఈ యుగాలలో  భగవంతుని కోసం భక్తి చేస్తూ ఉంటారు కానీ , జ్ఞానం లభించని కారణంగా భగవంతుని యధార్థం తెలుసుకోలేరు. 


త్రేతాయుగం చివరి సమయం వచ్చేసరికి  ఆత్మ లలో ని  శక్తి  తగ్గి ,  వికారాలు ఆరంభం అవుతాయి . ఇదే  రావణాసురుని ఆగమనం. ఈ సమయం నుంచి  అజ్ఞానం మొదలై  వికారీ కర్మలు చేయడం ద్వారా దుఃఖం ఆరంభమవుతుంది.  అప్పుడు  జ్ఞానం కొంత అవసరం కలుగుతుంది.  

తదుపరి ద్వాపర యుగంలో దుఃఖం మరింతగా పెరుగుతుంది.  కలహాలు యుద్ధాలు మొదలై జ్ఞానం ఆవశ్యకత మరింత పెరుగుతుంది. 

ఇక కలికాలం వచ్చేసరికి  అజ్ఞానం పూర్తిగా రాజ్యమేలుతుంది. మానవుడు దుఃఖ సాగరంలో  మునిగి పోయి ఉంటాడు. మంచి చెడు లు, పాప పుణ్యాల   వ్యత్యాసం  పూర్తిగా మరచి  అయోమయం గా  జీవించడం మొదలెడతాడు .

ఈ కలియుగ అంత్య  సమయంలో  స్వయం గా శివుడే  శక్తి స్వరూపమై , సద్గురువు అయి  ఒక వృద్ధ తనువు లో ప్రవేశించి , సృష్టి ఆది మధ్య రహస్యాలు , ఆత్మ పరమాత్మ  యొక్క జ్ఞానం తెలియజేస్తాడు .  

 

ఈ బ్రహ్మ జ్ఞానం  ఎవరైతే తెలుసు కొని పూర్తిగా  ఆచరిస్తారో వారు మాత్రమే బ్రాహ్మణులు గా  పిలువ బడడానికి అర్హత కలిగి ఉంటారు  .


• బ్రహ్మ జ్ఞానం లో అనేక గుప్త విషయాలు , కర్మల రహస్యాలు వాటి గతి ఉంటాయి. సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలు స్పష్టం గా ఉంటాయి. త్రికాల  పయనం , జన్మల రహస్యం తెలుస్తాయి. ధర్మం  విధి విధానం ఆచరణ స్పష్టం గా తెలుస్తుంది .

 సమస్య అనేది ఉండడం నిజం అయితే దానికి పరిష్కారం కూడా ఉంటుంది అనేది నిజం . ఈ పరిష్కారం జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. 

గీతా సారం పరమ జ్ఞానం . 

రెండవది . . .   వేదాలు పురాణాలు ఉపనిషత్తులు శాస్త్రాలు , అర్దం కాని శ్లోకాలతో  ఢాంభికం  ప్రదర్శించే  ప్రతీ ఒక్కరూ కూడా జ్ఞానులు అనేది కేవలం అపోహ మాత్రమే .  జ్ఞానం తెలిసిన వాడు ఎన్నడూ తన జ్ఞానాన్ని ఢాంభికం గా  ప్రదర్శన  చేయడు.  పదిమందికి  నిస్వార్థం గా  ఏదో రూపంలో  పంచుతాడు .  జ్ఞాని  నిరాడంబరుడు .


•  ఎంతో  తపన  సాధన తో  భగవత్ ధ్యాన సాధన  చేసిన మానవ రూపంలో ఉన్న కొందరు గురువు లకు , కొంత వరకు మాత్రమే  జ్ఞానం  లభించింది .  ఒకానొక కాలాలలో  సత్యమైన గురువులు అనేకులు ఉండేవారు.  


మరి ఇటువంటి సత్యమైన గురువులు 

నేటి మాయా లోకం లో , కలియుగం లో  ఉన్నారా  ?  

ఉంటే  . . .  

నిస్వార్థం గా  మనకు లభిస్తారా ?  

అంటే . . . కొంత సందేహమే ?   

ఎందుకంటే నేడు గురువులు అని చెప్పుకునే వారి అనేకుల  తీరు . . . " పైసా  మే పరమాత్మ హై ‌"  అనే స్థితిలో ఉన్నారు .  ఎందుకంటే ఇది పూర్తిగా  కలి మాయా ప్రభావంతో  నడిచే కాలం. 

• అందుకు ప్రత్యామ్నాయంగా చేయవలసినది ఏమంటే  . . .

 పరమాత్మ , జ్ఞాన సాగరుడు అయిన శివుని తో అనుసంధానం అయి ప్రతి రోజూ కొంత సమయం తెల్లవారుజామున   శివ స్మృతి మరియు స్మరణ చేస్తూ ఉంటే , సాక్షాత్తు శివుడే తప్పకుండా మానవ రూపంలో ఉన్న సద్గురువు చెంతకు, ఏదొక విధంగా చేరుస్తాడు . ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇదంతా రాస్తున్న వాడు.

• సద్గురువు చెప్పిన జ్ఞానం  విని ఆచరించడం వలన  దుఃఖం , జన్మాంతరాల  పాప కర్మల భారం తొలగుతుంది .  ఆలోచనల లో పవిత్రత , పరిపక్వత వస్తుంది.  తద్వారా శ్రేష్ట కర్మలు చేయడం సాధ్యం అవుతుంది, పిదప అనంతమైన సంతోషం లభిస్తుంది.

• మానవ శరీర పోషణ కోసం ఆహారం ఎంత అవసరమో, అదే విధంగా మానవుని లో ఉన్న ఆత్మ  ఉన్నతి సాధించడం కోసం ,  ముక్తి కోసం జ్ఞానం అంతే అవసరం . ఎందుకంటే ఒకసారి ఆత్మ లో సత్య  జ్ఞానం నిక్షిప్తమై ఉంది అంటే , శరీరం వదిలేసి (చనిపోయాక) మరో జన్మ లో శరీరం తీసుకున్న (పుట్టిన) తరువాత కూడా జ్ఞానం  బుద్ధి లో  , తరువాతి  21 జన్మల‌ వరకు ఒక సంస్కారం గా  కొనసాగుతూనే ఉంటుంది  .


• గురుపౌర్ణమి విశిష్టత తెలుసుకుని, శివుడిని నిత్యం ఒక గంట ఉదయం కానీ, సాయంత్రం కానీ  ఏకాంతం గా  45 రోజులు  మనసు తో స్మరిస్తే  సద్గురువు తప్పకుండా లభిస్తాడు . మంచి మార్గం చూపిస్తాడు.

• ఆడంబరంగా చేసే పూజ కంటే . . . . మౌనం తో మనసు లో  చేసే శివ స్మరణ వంద రెట్లు ఉన్నతి నిస్తుంది .


భగవంతుని పై భక్తి ఉండడం అవసరం. కానీ ఈ భక్తి చేసే విధి విధానాలలో మూలం , సూక్ష్మం అర్దం , తెలుసు కోవడం చాలా అవసరం .  

  ఎవరు మంచి చెప్పినా ముందు వినడం అలవాటు చేసుకోవడం  ఉత్తముని  లక్షణం. వింటూ ఉంటే , ఏదో నాడు మంచిని అర్దం చేసుకోవడం , మంచిని మాట్లాడడం, మంచి మార్గం లో పయనించడం సహజంగా అలవాటు అవుతుంది . మంచి వలన కలిగేది మిగిలేది ఆనందం .


ఈశ్వరుని ఆదేశానుసారం . . .


  అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏

  ఓం నమఃశివాయ 🙏

  ఓం శాంతి 🙏 .

 సర్వేజనా సుఖినోభవంతు 


 యడ్ల శ్రీనివాసరావు 9 July 2025 11:00 PM .


No comments:

Post a Comment

683. అందరిలో అందరూ కొందరు.

  అందరిలో అందరూ కొందరు • అందరికీ   ఉంటారు      ఎందరో    కొందరు .   ఆ   కొందరి లో   ఎందరో    కొందరే    ఆప్తులు . • కొందరికే   ఉంటారు       కో...