జాలి దయ కరుణ
• జాలి దయ అనేవి దైవీ గుణాలు . జాలి దయ లేని మనిషి ని కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . మానవుని ఆత్మ ఉన్నతి చెందడానికి జాలి దయ అనే గుణాలు మార్గదర్శకాలు .
జాలి అంటే ఒకరి పరిస్థితి ని చూసి బాధపడడం , ఉదాసీనత చూపించడం కానే కాదు . మన మనసు యొక్క భావోద్వేగాన్ని , సంకల్ప స్థితి తో ఎదుటి వారి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపయోగపడే శక్తి శాలి దైవ గుణం జాలి .
దయ అంటే అంటే , మనిషి లోని హింసను ప్రేరేపించే కోపం, అహం వంటి లక్షణాలను రూపుమాపేందుకు ఉపయోగపడే శక్తి శాలి దైవ గుణం .
• నవరసాలలో ఒకటైన కరుణ రసం యొక్క ప్రతి రూపాలు జాలి దయ . ఈ సృష్టిలో ఒక మనిషి తో పాటుగా తోటి జీవులు మరెన్నో ఎన్నో ప్రాణులు , జీవించాలంటే జాలి దయ కరుణ అనేవి అవసరం. లేదంటే హింస రాజ్యం ఏలుతుంది . నేటి కలి రావణాసురుని కాలం లో ఈ హింస ఎంత గా ఉందో నిత్యం ప్రత్యక్షం గా చూస్తునే ఉన్నాం.
నారాయణుడే నరుడు . . . . నరుడే నారాయణుడు అని నానుడి ఉంది . కరుణ అనే గుణం దేవతల నుంచి మనిషి కి వారసత్వ పరంపరగా ఆపాదన కావించబడినది .
• ఈ గుణాలు సత్యమైన ప్రేమ చిగురించడానికి ఆధారం అవుతాయి . కరుణ జాలి దయ ఉన్న మనిషి సహజంగా ఇతరుల యొక్క కష్టాలు , ఆపదలు, సమస్యలు, వైకల్యాలు , వైఫల్యాలు , బలహీన జీవన స్థితి గతులను చూసిన వెంటనే ప్రభావితం అవుతాడు . భావోద్వేగంతో సహాయం చేస్తాడు . ఎటువంటి పరిస్థితుల్లోనూ హింసను ప్రేరేపించడు .
• ఒక మనిషి కి ఇతరులు నోరు తెరిచి సహాయం ఆర్జించక పోయినా , మనసు లో జాలి అనే భావన కలగడం నిజంగా చాలా గొప్ప స్వభావం . . .
కానీ ఈ గొప్ప లక్షణాలు అయిన జాలి దయ . . .
నేటి కాలంలో మనిషి కి బలమా ? లేక బలహీనతా ?
లేక ఈ బలమే బలహీనత అవుతుందా ?
లేక ఈ బలహీనత లోనే బలం దాగి ఉందా ?
• జాలి అనే భావన వలన ఇతరుల యొక్క సమస్యల పట్ల స్పందించడం, సహయ సహకారాలు అందజేయడం తద్వారా ఆత్మ సంతృప్తి పొందడం జరుగుతుంది.
• ఈ స్థితి ని సమర్ధవంతంగా ఆచరించాలి అంటే, మొదట స్వయం పై జాలి చూపించు కోవాలి . అంటే మనిషి తనపై తాను జాలి చూపించు కోగలగాలి. దీనిని స్వీయ కరుణ అంటారు.
మనిషి కి తనపై తనకు జాలి కలిగిన నాడు తన యధార్థ స్థితిని తెలుసు కొని , ముందుగా తనకు తాను సహాయం చేసుకోవడం తో ఉన్నతి చెంది బలోపేతం కావడం లో సఫలత సాధిస్తాడు .
ఈ విధానం లో జాలి , దయ అనేవి మనిషి కి మానసిక బలం అయి , ఆత్మ బలం పెరుగుతుంది.
• అలా కాకుండా . . . . స్వయం పై (తనపై తాను) జాలి చూపించుకోకుండా , ఇతరుల పై జాలి చూపించడం వలన , ఒక ఉదాసీనత ఆవహించి , బలహీనత నొంది slow poison అయి , చివరికి మనిషి తనను తాను కోల్పోవడం అవుతుంది . ఇది మంచికి పోతే చెడు అయింది అనే నానుడి వంటిది.
ఈ విధం లో తాను ఇతరుల పై చూపిన జాలి ని , తిరిగి తానే ఏదో నాడు పొందవలసిన స్థితి వస్తుంది.
• ఈ విధానం లో జాలి, దయ అనేవి బలం నుంచి బలహీనత గా మారి , ఆత్మ బలహీనత అవుతుంది .
• కొందరు, తమను ఇతరులు సహాయం అడగకపోయినా సరే పదే పదే జాలి చూపిస్తూ , సహాయం చేస్తారు. పైకి చూడడానికి ఇది మంచి తనం లా అనిపిస్తుంది , కానీ ఇది వారి బలహీనత అని గమనించలేరు . వీరు , ప్రతీ విషయానికీ అతిగా జాలి చూపించడం అనేది బలహీనతగా అనుకోకుండా , అదే తమ బలంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు. అంతకు మించి వీరి స్పృహ కి ఏమీ తెలియదు . . . పైగా ఇటువంటి వారిని చూసిన వారంతా కూడా పాపం జాలి గుండె కలవారు అని జాలి చూపిస్తారు. ఇది అత్యంత విచారకరం.
ఈ విధానం లో అతి జాలి దయ అనేవి బలహీనతగా మారి అదే బలంగా గా వారు భావించడం జరుగుతుంది.
జాలి ని తమపై తాము చూపడం ఆత్మ బలం .
జాలి ని ఇతరుల పై చూపడం ఆత్మ విశ్వాసం.
జాలిని అతిగా చూపడం ఆత్మ బలహీనత .
జాలి ని ఆశించడం ఆత్మ విశ్వాస లోపం .
• తనను మాలిన ధర్మం ఎప్పుడూ చెడుతుంది . జాలి దయ గుణాలు ఉండాలి. కానీ ,ఒకరు నోరు తెరిచి అడగని నాడు జాలి చూపిస్తూ సహాయం చేయడం అనేది నేటి కాలంలో ముమ్మాటికీ చేటు.
• తనపై తాను జాలి చూపించు కో లేక ఇతరులపై చూపించిన వాడు బలహీనుడు. ఎందుకంటే తనపై తాను చూపించుకునే జాలి , తన లోని వాస్తవ స్థితి ని తనకు చూపిస్తుంది.
• తనను తాను ప్రేమించుకో లేని వాడు ఇతరులకు ప్రేమ ఎలా ప్రేమించగలడు . అదే విధంగా ఇతరుల నుంచి ప్రేమ ను ఆశించి ఏం చేయగలడు .
• ఏ మనిషి కైనా తన లోని మంచి గుణాలు , తనకు ఒక ఆస్తిగా , దైర్యం లా అనిపించాలి . అంతే కానీ అవి ప్రతిబంధకాలు గా, బలహీనతలు గా , లేని పోని సమస్యలు తెచ్చి పెట్టుకునేవిగా కాకూడదు . . . ఆ మంచి గుణాలను మనలో స్థిరీకరించడం రక్షణ అవుతుంది. ఆ తరువాత ఇతరులకు ధారణ చేయడం ద్వారా లోక కల్యాణం జరుగుతుంది.
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
యడ్ల శ్రీనివాసరావు 1 July 2025 10:00 PM .
No comments:
Post a Comment