అసలు శివుడి తో నాకేం పని ?
• శివుడు అర్థనారీశ్వరుడు . శివుని లో స్త్రీ , పురుష శక్తి సమానం గా ఉంది అని అర్దం . అందుకే శివుడిని తల్లి మరియు తండ్రి గా భావిస్తాము .
ఈ అనంతమైన విశ్వ సృష్టి శివుని ద్వారా జరిగింది. నేటి మానవులందరూ శివుని సంతానం అనే విషయం జగమెరిగిన సత్యం .
• శివుడు విశ్వ కళ్యాణ కారి. ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు. దుఃఖ హర్త సుఖ కర్త , దుఃఖం హరించి సుఖాన్ని పంచేవాడు . నిరాడంబరుడు. వరములను దానం గా ఇచ్చే వరదాని . దివ్య గుణాలు, దివ్య శక్తులు ఇవన్నీయు శివుని యొక్క ఆస్తి , సంపదలు .
• ఈ భౌతిక ప్రపంచంలో ఏ తండ్రి అయినా తాను సంపాదించిన ఆస్తిని పిల్లల కి వారసత్వం గా పంచినట్లే , సృష్టి కర్త శివుడు కూడా తన అపారమైన వారసత్వ సంపదలను , ఆస్తిని తన సంతానం అయిన మనకు ఏనాడో పంచేశాడు .
అందుకు నిదర్శనం, నేటి మానవులు కొన్ని యుగాల క్రితం అనగా సత్య త్రేతా యుగాలలో శివుని వారసత్వ సంపదగా లభించిన దైవీ లక్షణాలు, గుణాలు కలిగి ఉండడం వలన దేవతలు గా ఉండే వారు .
అప్పుడు వారు ఆచరించిన ధర్మమే . . .
“ ఆది సనాతన దేవి దేవతా ధర్మం. ”
• మరి ఆ పరంపర లోని మనిషి , నేడు తన తండ్రి శివుని వలే , తనకు తాను శుభకరం గా ఉంటూ , తన కుటుంబానికి మరియు ఇతరులకు శుభం కలిగిస్తూ , అందరికీ సహాయకారిగా ఉంటూ జీవిస్తున్నాడా ?
• శివుని వలే అనంతమైన ప్రేమ ను మనసు యందు కలిగి , కుటుంబం లో , సమాజం లో ప్రతి ఒక్కరినీ సంబాళన చేయగలుగుతున్నాడా ?
• శివుని యొక్క విశిష్ట జ్ఞానం ఆచరిస్తూ , మాయ ద్వారా సృష్టించబడిన తన సమస్యలు తానే పరిష్కరించు కుంటూ నేడు ఆనందం గా జీవిస్తున్నాడా ?
• శివుని వలే . . . దుఃఖం లో ఉన్న సాటి వారిని అక్కున చేర్చుకుని మనసు తో , మాటతో దివ్య అనుభూతి నిచ్చి నీకు నేనున్నాను అనే మనోధైర్యాన్ని అభయహస్తాన్ని , వరదానం ఎవరికైనా ఇవ్వ గలుగుతున్నాడా ?
• శివుని వలే , నిరాడంబర జీవనం నేడు మానవులు సాగిస్తున్నారా ?
• శివుని వలే , దివ్య శక్తి గుణాల తో సుసంపన్నం గా ఉంటున్నారా ?
ఒకప్పుడు శివుని నుండి పొందిన , ఈ వారసత్వ సంపదలను ద్వాపర యుగం నుంచి క్రమేపీ కోల్పోయి , రావణుని తో సహవాసం చేస్తూ , వికారాలు కి బానిస అయి, దైవీ గుణాలు, శక్తులు పూర్తిగా కోల్పోయి కలియుగం లో దుఃఖం తో జీవిస్తూ ఉన్నారు నేడు మానవులు. అందుకే నేటి మానవుని జీవితం దుఃఖ సాగరం. ఏదైనా భౌతిక సుఖాలు పొందినా, అది అల్పకాలికం అని గ్రహించ లేక పోతున్నారు.
దీనంతటికీ కారణం , తండ్రి అయిన శివుని యొక్క యధార్థం మర్చిపోవడం. శివుని తో అనుబంధం లేక పోవడం.
• నేడు మనిషి అనుకుంటాడు శివుని ని నిత్యం పూజిస్తున్నాను అని .
ఆలోచించి చూడు …. శివుని ని ఒక లింగ విగ్రహం గా పూజిస్తున్నావా ? లేక నీ తండ్రి గా భావిస్తూ పూజిస్తున్నావా ?.
• ఒకవేళ నీవు లింగ విగ్రహం గా భావిస్తూ పూజిస్తే , నీ మనసు కి, శివుని కి మధ్య అనంతమైన దూరం ఉన్నట్లే . ఏ విధమైన బంధం లేనట్లే . నీ కోరికలు, దుఃఖం అవసరాలు తీరడం కోసం స్వార్దం తో నీవు శివుని ని దీనత్వం తో వేడుకుంటున్నట్లే .
• ఒకవేళ నీవు శివుని ని తండ్రి గా భావిస్తే … ఏ తండ్రి కూడా తనను పూజించిమని అడగడు . తండ్రి పిల్లల నుండి గౌరవం ఆశిస్తాడు , మరియు తాను నేర్పించిన విధంగా ధర్మ యుక్తం గా నడచుకోమని ఆదేశిస్తాడు , తన కంటే గొప్ప వారిగా కీర్తించ బడాలని కోరుకుంటాడు . . . అదే విధంగా తండ్రి కి పిల్లల కు ఉన్న అనుబంధం చిర స్థాయి గా ఉండాలని, ఏనాడూ పిల్లలు అది మరచి పోకూడదని అనుకుంటాడు. తండ్రి తాను ప్రేమను పంచుతూ ఆశిస్తూ , తన సంపదలను పిల్లల హక్కు గా అనుభవించాలని , తన వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు .
• మరి నేడు మానవుడు తన మనసు యందు శివుని పట్ల తండ్రి అనే భావన బంధం తో ఉంటున్నాడా ? ఆలోచించండి.
• నేడు మనిషి తలపై అనేక జన్మలు గా చేసిన పాప భారం ఉంది. అందు వలన శివుడు తండ్రి అనే వాస్తవికత , శివుని తత్వం , శివుని జ్ఞానం మనిషి తెలుసు కో లేక , తోచిన విధంగా అజ్ఞాన అంధత్వం తో పూజలు చేస్తున్నాడు . ఈ పూజలు వలన ధనం ఖర్చు చేస్తూ , సుఖం శాంతి లభించక , దుఃఖం తీరక ఎదురు చూపులు చూస్తూ జన్మ జన్మలు గా ఎదురు చూస్తున్నాడు .
భక్తిలో చేసే ఆడంబర పూజ విధానం వలన లభించిన ఫలితం సంతోషం కేవలం బాహ్యం మరియు అల్పకాలికం అని గ్రహించ లేక పోతున్నాడు నేటి మనిషి . అందుకే ఎన్ని పూజలు చేసినా మనిషి కి అంతరంగం లో అలజడులు పోవడం లేదు.
దీనికి పరిష్కారం శివ ధ్యానం, శివ జ్ఞానం, శివ యోగం.
ధ్యానం ద్వారా మనసు నిశ్చలం నిర్మలం అవుతుంది.
జ్ఞానం ద్వారా బుద్ధి మనో నేత్రం వికసిస్తుంది.
యోగం ద్వారా శివుని తో అనుసంధానం ఏర్పడుతుంది.
దీనినే రాజయోగం ... రాజయోగ అభ్యాసం అంటారు.
• శివుని కి కావాల్సింది నీ మనసు. అది నిజాయితీతో ,పవిత్రత తో అర్పించిన నాడు , నీ పయనం శివుని జతలో ఉంటుంది . అదే నీ నా గమ్యం.
• శివుని కి భక్తి పూజలో సమర్పించేది . . . పుష్పం , పత్రం , ఫలం. దాని అర్దం.
పుష్పం అంటే నీ మనసు.
పత్రం అంటే నీ దేహం
ఫలం అంటే నీ ఆత్మ
• ఇదంతా మనసు తో జరగాల్సిన శుద్ధమైన పూజా ప్రక్రియ .
చేయవలసిన అన్ని కర్మలు చేస్తూ, నిత్యం మనసు లో శివ స్మృతి ఉండడమే అసలైన పూజ .
ఉదాహరణకు ఎవరినైనా ప్రేమిస్తే మనం ఏ పని చేస్తున్నా దృష్టి ప్రేమించిన వారి పై ఉంటుంది కదా ! అలా . . . .
ఇదే నాకు శివుని తో ఉన్న పని.
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
యడ్ల శ్రీనివాసరావు 24 July 2025 10:00 pm.

No comments:
Post a Comment