Tuesday, October 27, 2026

794. సృష్టి రచన - జీవిత నాటకం


సృష్టి రచన - జీవిత నాటకం



నాటకం అనేది రసవత్తరమైనది . ఎందుకంటే నాటకంలో నవరసాల పాత్రలు , పాత్రధారులు (నటులు) ఉంటారు. నాటకాన్ని రచించిన సూత్రధారి (దర్శకుడు)  తెరవెనుక ఉండి అంతా నడిపిస్తాడు . 

ఒక నాటకం ప్రారంభం అయ్యే ముందు, అందులో ఉన్న అనేక మంది నటీనటులు తమ తమ సొంత ఇంటి నుంచి వచ్చి మేకప్ ధరించి తమ పాత్రల అనుసారం గా  , సందర్భాన్ని బట్టి  వేదిక మీద కి వస్తుంటారు, వెళుతుంటారు . 

ఇందులో హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్, ఇలా ఎంతో మంది ఎన్నో రకాల పాత్రలు పోషిస్తారు . నాటకం ప్రదర్శించేటప్పుడు , అప్పటికే దర్శకుడు ఇచ్చిన సూచనల విధంగా పాత్రలు నడుచుకుంటే ఆ నాటకం రక్తి కడుతుంది. అలా కాకుండా నటించే సమయంలో, నటులు తమ లోని  స్వభావ సంస్కారాలను భాషలను లను కలిపి  తమకు నచ్చిన విధంగా ఆ యా పాత్రలకు ఆపాదించి నటిస్తే , ఆ నాటకం బెడిసి కొడుతుంది. ఒక్కసారి ఒక నాటకం , ప్రదర్శన పూర్తి అయితే అందులోని నటనను తిరిగి సరిదిద్దుకునే అవకాశం ఉండదు. 


మనిషి జీవితం కూడా అంతే . . . 


సృష్టి అంతా జగన్నాటకం. మనిషి జీవితం ఒక నాటకంలోని పాత్ర . ఈ నాటకానికి రచన దర్శకత్వం శివుడు. 


పరలోకంలో ఉన్న ఆత్మలు భూమి పై కి వచ్చి, గర్భం లో  ప్రవేశించి , పిదప  శరీరం ధరించి మనిషి వలే జన్మించి  భూమి అనే  వేదిక పై నాటకం ఆడడం ప్రారంభిస్తాయి. 


అందులో పాత్రలే  ఇల్లు , రక్తసంబంధాలు తల్లి తండ్రి , కొడుకు కూతురు , తాత మనవడు , భార్య భర్త , కుటుంబం , ప్రేయసి ప్రియుడు ప్రేమలు , శత్రువులు మిత్రులు ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాలైన పాత్రలు . మనిషి తను జీవించి ఉన్నంత కాలం  పోషించేది ఈ పాత్రల నే . ప్రతి ఒక్కరిదీ ఒక విభిన్నమైన పాత్ర.  చేసిన కర్మల అనుసారం ఒక జన్మలో ఒక పాత్ర , మరో జన్మలో  మరో పాత్ర లభిస్తుంది.  

నాటకం లో స్టేజి (భూమి పై) మీద పాత్ర ఉన్నంత వరకు నటులు నటిస్తారు. పాత్ర అయిపోయిన (చనిపోయాక) తరువాత వేదిక దిగి (భూమిని వదిలి) మేకప్ తీసేసి (శరీరం వదిలి) ఎలా వచ్చామో అలా తమ అసలు సొంత రూపం తో ( సూక్ష్మ మైన ఆత్మ రూపంలో) తో సొంత ఇంటికి ( పై లోకానికి ) వెళ్లిపోతారు. 

ఇదే మానవ జీవిత  సృష్టి  నాటక రహస్యం.  

ఆత్మ పై నుంచి కిందకి వచ్చేటప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో, అలాగే  పైకి వెళుతుంది . భూమి పై భౌతికంగా కూడగట్టినవి ఏమీ కూడా తీసుకెళ్ళదు. ఒక్క పాపం పుణ్యం మాత్రమే సంస్కారాలు గా తీసుకు వెళుతుంది . ( తిరిగి వీటి ఆధారంగా నే మరుసటి జన్మలో  కర్మల  పాత్ర నిర్ణయించబడుతుంది. )


నాటకం లోని  Performance ఆధారం గా (చేసిన కర్మలను బట్టి) మరలా ఇంకో నాటకం లో పాత్ర వేయవలసి వచ్చినపుడు , కొత్త జన్మ , కొత్త శరీరం తో  , కొత్త పాత్ర అభినయం చేయడం కోసం మరలా భూమి పై కి రావడం జరుగుతుంది . 


ఈ నాటకం లో ఎవరికి ఎవరు  శాశ్వతం కారు , కాలేరు .  ఎవరి పాత్ర వారిదే . అందరూ పాత్ర ధారులే. ఎవరి పాత్ర వారు పోషిస్తారు. తమ పాత్రను పోషించవలసిన సమయం వచ్చి నప్పుడు మాత్రమే వారు మరొకరితో బుణాను బంధ రూపం లో స్టేజి మీద (భూమి పై) కలుసు కుంటారు, జత పడతారు. అలాగే (బుణం తీరిపోయాక)  పాత్ర పూర్తి అయిపోతే  ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు (స్టేజి మీద నాటకం వలే).  


కానీ,  ఆ యా పాత్రధారులు తో (బంధాలలో) మన పాత్ర ఉన్నంత సేపు మనం మన  పాత్ర అనుసారంగా  దర్శకుడు శివుడు చెప్పిన విధంగా నటించామా  లేదా అనేదే ముఖ్యం. 

ఏ ఇతరులతో (పాత్రధారులు తో) మనకు శాశ్వతమైన సంబంధం ఉండదు . కానీ ఒకే స్టేజి మీద (ఇల్లు, సమాజం)  ఉంటాం కాబట్టి , ఉన్నంత వరకు సహచరులు గా  ఉంటూ  అందరి పట్ల బాధ్యత  నిర్వర్తిస్తూ  , ప్రేమ తో వ్యవహరించి వలసి  ఉంటుంది.  ప్రేమను పంచాలి కానీ ఆశించకూడదు. ఆశిస్తే మోహం కలిగి దుఃఖానికి దారి తీస్తుంది.

ఎవరి కర్మ ల అనుసారం వారు పాత్రలు పోషించడానికి ఈ నాటకం ఏర్పడి , ఒకే వేదిక పైకి వస్తారు. నాటకం పూర్తి అయిన తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు . ఇందులో పాత్రధారులు తమ మధ్య మాయ మోహం  వ్యామోహం ,  మమకారాలను చొప్పిస్తే నాటకం సుఖానికి బదులు దుఃఖం తో ముగుస్తుంది . 


ఈ జీవిత నాటక రచన ధర్మ అర్థ కామ మోక్షాలతో పాత్రలను సహెతుకమైన నియమ నిబంధనల తో రచించాడు శివుడు. వాటిని అనుసరిస్తూ, మనిషి తన జీవిత నాటకాన్ని , పాత్రను అర్దం చేసుకుంటూ, , తన చుట్టూ ఉన్న తోటి పాత్రధారుల తో ధర్మం అనుసారం గా  రక్తి కట్టించాలి.  


కానీ, మానవుడు భూమి పై కి వచ్చాక దర్శకుడైన శివుడిని , శివుడు చెప్పిన సూచనలను మరచి , తన నాటకం లోని పాత్రకు తానే దర్శకుడు గా భావించి  అహంకారం తో  తనకు ఇష్టం వచ్చినట్లు, తోచిన విధంగా నటిస్తూ ధర్మాన్ని ఉపేక్షించడం వలన చివరికి తన పాత్ర రక్తి కట్టక , విఫలమై దుఃఖం , చెడు కర్మ ను  మూట కట్టుకుంటున్నాడు . ఇదే  ఆత్మ కు శిక్ష యై  ఈ జన్మలో కానీ, లేదా మరో జన్మలో అయినా సరే దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. 

రచయిత దర్శకుడు అయిన శివుడు చెప్పిన విధంగా బుద్ధి ని తిరిగి మరల్చు కోనంత వరకు , ఈ కర్మలను  శుద్ది చేసుకోనంత వరకు  ,  దుఃఖం ఏదో రూపంలో అనుభవిస్తూ నే ఉంటాడు . 


ఈ జగమే ఒక నాటకం . మనిషికి మాయ పూర్తిగా కమ్మేసి ఉండడం వలన  తన గురించి తనకు సత్యం ఎరుగక  , ధర్మం ఆచరించక  ఈ కలియుగంలో ఎన్నో మిడిసి పాట్లు పడుతూ ,   కామ క్రోధ వికారాలతో  అసుర లక్షణాలతో  జీవిస్తూ  రజో తమో గుణాలతో దేవతలను భక్తి  చేస్తూ దుఃఖం తో ఉంటాడు . 

కానీ సతో గుణం తో   శివుడు పరమాత్ముడని ఆయన యొక్క సత్యతను తెలుసుకొనక  , శివుడు రచించిన భగవద్గీత జ్ఞానాన్ని  గ్రహించలేక , ఆయన  దర్శకత్వాన్ని ఆచరించక తనకు  తోచిన విధంగా మానవుడు నటిస్తాడు.  తాను ఒక ఆత్మ ను అని మరచి దేహం గా  భావించి , అజ్ఞానం తో కులాలు మతాలు వికారాల  రొచ్చు లో  సృష్టి నియమాలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవిస్తాడు.  చివరిలో భరించలేని  శిక్షలు కూడా భూమి పైనే  అనుభవించి వెళతాడు . కాల జ్ఞానం ప్రకారం ఆ సమయం కూడా ఇప్పుడు ఆసన్నం అయింది. 

ధర్మం  పూర్తిగా నశించిన సమయం ఇది . . . అందుకే ప్రకృతి , పంచ భూతాలు కూడా కూడా మనిషి పై దాడి చేయడం ఆరంభిస్తాయి. ఎందుకంటే మనిషి యొక్క వికృత చేష్టలు నేడు సృష్టి ఉనికి ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అది ప్రత్యక్షం గా నేడు ఆందరం చూస్తూనే ఉన్నాం.


స్వ పరివర్తనే  విశ్వ పరివర్తన 

ధర్మో రక్షతి రక్షితః 

🙏



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు  27 Oct 2026 , 8:30 PM.






No comments:

Post a Comment

795. నమ్మకాలకు ఆధారం

  నమ్మకాలకు  ఆధారం మన కళ్ళే మనల్ని అనేక సార్లు మోసం చేస్తాయి  . . . ఎడారిలో ఒయాసిస్ ల వలే. మనం నమ్మే  నమ్మకాల కు ఆధారం ఏముంటుంది ? మనం భౌత...