Sunday, June 30, 2024

139. కళాశాల 1980 ఎపిసోడ్ -17

 

కళాశాల 1980

ఎపిసోడ్ -17



ఆ రోజు విమల తన పిల్లలు తో రాము ఇంటి నుంచి సంతోషంగా వెళ్లింది.   రాము శైలజ ఇద్దరూ కలిసి విమల ని, పిల్లల  ని   కారు ఎక్కించి వీడ్కోలు చెప్పారు.


సీన్  - 61


ఆ రోజు రాత్రి   పడుకునే   సమయంలో   రాము,        శైలజ తో  మరొకసారి  అంటున్నాడు.

రాము :   శైలు …. విమల ను ఆదుకునే విషయం లో నీకు ఏ అభ్యంతరం లేదు కదా…

శైలజ :    ఎందుకు మరలా ఇలా అడుగుతున్నారు.  నేను ఇదివరకు చెప్పాను కదా .  అయినా తనకు మనం కాక ఇంకెవరు ఉన్నారు చెప్పండి. 

మనం అంటే మీరు ఈ రోజు, ఈ స్థితిలో ఇలా ఉండడానికి కారణం కూడా విమలే కదా. మన పిల్లలు ఇద్దరు ఎలాగూ అమెరికా లో నే   స్థిర పడతారు. మనకు ఉన్న దానిలో కొంత ఇవ్వడం లో తప్పేముంది….. అయినా మీరు ఇలా అడుగుతున్నారు అంటే, నేను ఏమైనా సందేహాం తో ఉన్నానని అనుకుంటున్నారా?….

రాము :   లేదు..లేదు.. శైలు .. ఇది చిన్న విషయం కాదు. నీ సపోర్ట్ , అనుమతి లేకుండా నేను నిర్ణయం తీసుకోలేను.

శైలజ :   చూడు రాము … మనకు పెళ్లి అయి పదిహేను సంవత్సరాలు దాటింది. నా రాము గురించి నాకు బాగా తెలుసు.   నా రాము … ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా,  ఆ పరిస్థితికి   కరెక్ట్ గా నే  ఉంటుంది.

రాము :   మనసు లో ధాంక్స్ అనుకుని పడుకున్నాడు.


రెండు రోజుల తరువాత,   ఆఫీసులో  రాము  తన మేనేజర్ ని   పిలిచి విమల మరియు విమల పిల్లలు ఇద్ధరి పేర్లు మీద  బాంక్ అకౌంట్  ఓపెన్ చేసి  ఐదు కోట్ల రూపాయల  వరకు ఫిక్స్ డ్ డిపాజిట్లు వేయించే ఏర్పాటు చేశాడు.

ఒక నెలలో విమల కోసం  ఒక అపార్ట్మెంట్ కొని,  అన్ని సదుపాయాలు సమకూర్చి అందులో కి  విమలను షిఫ్ట్ చేశాడు.

విమల  ఇద్దరు పిల్లలకి.   రాము చేస్తున్న  సహాయానికి చాలా ఆశ్చర్యం గా ఉంది.  తాము పుట్టిన పెరిగిన  ఇన్నాళ్లు లో లేని  కొత్త జీవితం చూస్తున్నారు.

విమల పిల్లలు ఇద్ధరి కి కంప్యూటర్ కోర్సులు.  ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ చేయించాడు.


ఒకరోజు విమలతో తన పిల్లలు

అమ్మా … మనకు దగ్గర బంధువులు కూడా  కనీసం సాయం చెయ్యలేదు.  రాము అంకుల్ ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారు. ఇవన్నీ మనం తిరిగి ఇచ్ఛెయ్యాలా.

విమల కి   ఏం   సమాధానం   చెప్పాలో,    ఎలా చెప్పాలో అర్థం కాలేదు .

విమల :  లేదు … ఇవి మనం తిరిగి ఇవ్వనవసరం లేదు. రాము  అంకుల్  చిన్న తనం లో  చదువుకి , మీ తాతయ్య చాలా సహాయం చేశారు,  అందుకు కృతజ్ఞతగా  ఇవన్నీ  ఇస్తున్నారు.  ఇక మీదట ఇటువంటి ప్రశ్నలు అడగకండి. … అని కంగారుగా చెప్పింది.

మన కష్టాలు తీరి,   మంచి రోజులు వచ్చాయి   అని చెప్పింది.



సీన్ -  62


ఒక వారం తరువాత విమల ఇంటికి ,   రాము వచ్చాడు.  రాముని చూసి 

విమల :  ఆశ్చర్యం గా ... ఏంటి ఇంత సడెన్ గా ... 

రాము :   ఊరికే విమలా .... చూడాలనిపించి.  ఎలా ఉంది  ఇక్కడ , సదుపాయాలు  బాగున్నాయా?

విమల :   హ … రాము, చాలా బాగున్నాయి. అంది నవ్వుతూ ….

రాము :   విమల ...  ఏదైనా వ్యాపారం చెయ్యగలవా ? … ఆలోచన ఉందా ?

విమల :   లేదు రాము … వ్యాపారం కంటే కూడా , ఏదైనా సేవాకార్యక్రమాలు చేయాలని ఉంది. కానీ అది, ఎలాగో తెలియదు. 

అంటూ ….

రాము,   అడగకుండానే  అన్ని సదుపాయాలు సమకూర్చావు .    పిల్లలను  ప్రయోజకులు గా చేస్తున్నావు  అని కొంత భావోద్వేగం గా   అంది.

రాము :   అది నా కనీస బాధ్యత.

విమల :  కొంత ధైర్యం తెచ్చుకుని …. ఇలా అంటున్నానని , ఏమీ అనుకోవద్దు ….   నా వలన నీకు ఏ విధంగా ఇబ్బందీ  లేదు  కదా రాము.

(విమల అలా అనడం లో అంతరార్ధం రాము అర్దం చేసుకున్నాడు.)


రాము : చూడు విమలా … నువ్వు ఏం ఉద్దేశంతో అడుగుతున్నావో నేను అర్థం చేసుకో గలను. నీ ఆలోచన అంతా, శైలజ ఏమైనా అనుకుంటుందేమో అనే కదా … శైలజ కు అన్ని విషయాలు వివరంగా తెలుసు. తన సహకారం లేకపోతే బహుశా, నేను ఇంత సహజంగా నీతో ఉండలేను. అలా అని తనతో ఏదీ దాయలేదు. తను నన్ను అన్ని విధాలా మొదటి నుంచి బాగా అర్థం చేసుకుంటుంది. … నేను తనతో బయటకు వ్యక్తపరచని , నా మనసు లోని విషయాలను కూడా అర్దం చేసుకొని సహకరిస్తుంది. బహుశా అందువలనే నా సంసారిక జీవితం చాలా సాఫీ గా నడుస్తుందేమో అనిపిస్తుంది.


విమల : రాము మాటలు మౌనం గా విన్నది…. అవును నిన్ను అర్దం చేసుకున్న వాళ్లు ఎవరైనా సరే, నీకు బానిసలు గా మారిపోతారు. అంతే తప్ప, నిన్ను విడిచి ఉండలేరు. అని మనసు లో అనుకుంటూ మౌనం గా ఆలోచిస్తుంది.

రాము :   విమలా… విమలా…. ఏంటి ఆలోచిస్తున్నావు.

విమల ఉలిక్కిపడి …. రాము పిలిచిన ఆ పిలుపుతో , ఒక్కసారిగా గతంలో చింత చెట్టు కింద రాము గుర్తుకు వచ్చి , అలజడి కి గురైంది. తడబడింది.


కొంత సమయం తరువాత రాము తెచ్చిన స్వీట్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. కానీ విమలకి గతం అంతా కళ్ల ముందు తిరుగుతూ.,.. కంటిలో నుంచి నీరు కారుతుంది.


ఆ రోజు … సాయంత్రం విమల పిల్లలు ఇంటికి వచ్చారు. రాము తెచ్చిన స్వీట్స్ తింటూ …. అంకుల్, ఏమన్నారమ్మా అని విమలతో అంటుంటే …. విమల కి ఇది వరకు అనిపించని రాము అంకుల్ అనే పిలుపు కి, ఎందుకో అసహనం తో నిండిన భావోద్వేగానికి గురి అయింది.


ఆ రోజు రాత్రి…. విమల కి నిద్ర పట్టలేదు…. చిన్న తనం నుంచి రాము తో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి, జీవితం అంటే ఇంతేనా ఆశ… నిరాశ ల ఊగిసలాట అనుకుంది. భర్త చనిపోయినా సరే ఏనాడూ ఒంటరితనం గా ఫీల్ అవలేదు …. ఇప్పుడు తనకు ఒంటరితనం అనిపిస్తుంది.


 సీన్ - 63


రాము ఆ రోజు ఇంటికి వచ్చాక …  విమల ను  కలిసిన  విషయం , శైలజ తో చెప్పాడు.

శైలజ :   ముందు గా చెపితే,   నేను వచ్చేదాన్ని కదా రాము.

రాము :  లేదు … శైలు … నేను అనుకోకుండా వెళ్లాను …. అని విమలకి వ్యాపారం గురించి అడిగిన విషయం చెప్పాడు… తిరిగి విమల, అభిప్రాయం కూడా శైలజ తో చెప్పాడు.

శైలజ :  పోనీలెండి …. విమల ఇష్టమైన సేవాకార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహం ఇద్దాం. నెమ్మదిగా తనకే అలవాటు అవుతుంది.


కొంత సమయం తర్వాత…. పడుకోవడానికి సిద్ధం అవుతూ

రాము :   శైలు …. ఒక సారి ఊరిలోని ప్రిన్సిపాల్ గారిని కలిసి వద్ధామా …. చాలా రోజుల అయింది చూసి.

శైలజ :   హ … అవునండీ … చాలా రోజులైంది. మా నాన్న కాలం చేసిన తరువాత,  మనం  ఆయనను ఫోన్ లోనే గాని   కలిసింది లేదు. ….  తప్పకుండా ఈ ఆదివారం వెళ్దాం.…  కాసేపు ఆగి …  వెళ్లేటప్పుడు విమల, పిల్లల ను  కూడా తీసుకు వెళ్దాము అంది.

రాము :   సరే … నేను విమలకి చెపుతాను.

శైలజ :   ప్రిన్సిపాల్ గారికి కూడా , ఫోన్ చేసి చెప్పండి …. మనం వస్తున్నట్లు.

రాము :   సరే.

ఆ మరుసటి రోజు రాము, విమల కి కాల్ చేసి విషయం చెప్పాడు. మొదట విమల అంగీకరించలేదు. రాము శైలజ లను వెళ్లి రమ్మంది. కానీ, రాము నచ్ఛ చెప్పడం తో అంగీకరించింది.


ఆ ఆదివారం …. రాము, శైలజ, విమల పిల్లలు అందరూ కలిసి కారులో జగిత్యాల బయలు దేరారు, ప్రిన్సిపాల్ గారిని కలవడానికి.

జగిత్యాల చేరుకున్నాక …. ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళ గానే … అప్పటి వరకు ఎదురు చూస్తున్న ఆయన బయటకు వచ్చారు.   కారు లో నుండి బయటకు దిగుతున్న రాము శైలజ లను చూసి చిరునవ్వు తో పలకరించారు. ….  అంతలోనే నెమ్మదిగా కారు దిగిన విమల మరియు పిల్లలను చూసి ఒక్కసారిగా తడబడ్డారు.

వెంటనే విమల ప్రిన్సిపాల్ గారికి నమస్కరించింది. అందరూ కలిసి లోపలికి వెళ్ళి , యోగ క్షేమాలు మాట్లాడుకుంటున్నారు.

ప్రిన్సిపాల్ గారికి మాత్రం , విమల ఎలా కలిసింది అనే విషయం అర్దం కాలేదు. అందరూ కలిసి ఉండడం లో అంతరార్ధం ఏమిటో తెలియక , లోపల మధనపడుతున్నారు.

కొంచెం సమయం తర్వాత,  రాము ప్రిన్సిపాల్ గారిని ఏకాంతం గా  పక్కకు  తీసుకు వెళ్లి , విమలను ఎలా కలిసింది…. జరిగిన విషయం అంతా వివరం గా చెప్పాడు. విమల కోసం తను, శైలజ చేసిన ఏర్పాట్లు చెప్పాడు.

వెంటనే....

ప్రిన్సిపాల్ గారు :   రాము…. … నాకు అంతా అర్దం అయింది. దీని వలన శైలజ కు, పిల్లలకు నీకు ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఆలోచించావా? …

రాము :   లేదు ప్రిన్సిపాల్ గారు…. సార్ …. నేనయితే ఏమీ ఆలోచించలేదు. కానీ,  నాకంటే శైలజా నే ఎక్కువ గా ఆలోచించింది. తన ప్రోత్సాహం తోనే అడుగు వేశాను. అయినా తప్పేముంది సార్.

ప్రిన్సిపాల్ గారు :   బాగుంది… అంతా విచిత్రం గా ఉంది.   సరే మీ ఇష్టం…. ఆ సమయంలో తన స్నేహితుడు రాజారాం గుర్తు కి వచ్చాడు.


ఆ రోజు  మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత …

ప్రిన్సిపాల్ గారు,   మొదట శైలజ తో ఒంటరి గా మాట్లాడారు.


ప్రిన్సిపాల్ గారు :  అమ్మా  శైలజ…. రాము నాకు విమల విషయం చెప్పాడు. నాకు చాలా విచిత్రం గా, ఆశ్చర్యం గా అనిపిస్తుంది.

శైలజ :   అవునండీ, రాము విమల విషయం నాకు పూర్తిగా తెలుసు. మా పెళ్లి ముందే రాము అంతా చెప్పాడు. రాము మనసు తెలిసాకే , నేను రాముని ప్రేమించాను …. ఇప్పుడు  విమల పరిస్థితి బట్టి,  రాము, నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా బాధ్యత అనుకుంటున్నాం.


ప్రిన్సిపాల్ గారు :   భవిష్యత్తులో పరిస్థితులు మారచ్ఛేమో కదా …. లేని పోని సమస్యలకు అవకాశం ఇవ్వడం   ఎందుకమ్మా  శైలజా….

శైలజ :   విమల కూడా చాలా సంవత్సరాల క్రితం ఇలా స్వార్థం గా ఆలోచించి ఉంటే, రాము ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడు కాదు కాదండి. ఈ విషయం నాకంటే, మీకే ఎక్కువ తెలుసు. ….

నాకు రాము గురించి పూర్తిగా తెలుసండి.   తను తనకంటే,   తన చుట్టూ ఉన్న వారి కోసం ఏదైనా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తనకు తన జీవితంలో పొంద వలసిన సమయం లో  ఏదీ పొంద లేదు. కానీ అందరినీ సంతోష పెడుతూనే ఉన్నాడు.

ప్రిన్సిపాల్ గారు :   శైలజ మాటలు విని ఆగలేక … ఏంటమ్మా, అంటే రాము ని  విమలతో కలిసి ఉండడానికి  నువ్వు  అంగీకరిస్తున్నావా ….

శైలజ :   నెమ్మదిగా ప్రిన్సిపాల్ గారిని చూస్తూ నవ్వింది.  కలిసి ఉండడం అంటే సహకరించు కోవడం ప్రిన్సిపాల్ గారు.  అది అవసరం, సందర్భం, పరిస్థితి ని బట్టి ఏ విధంగా నైనా ఉంటుందండి.  జీవితం అన్నది ఒకటే … ప్రేమకు ఎల్లలు ఉండవు.


ప్రిన్సిపాల్ గారికి …. శైలజ విశాల దృక్పథం అర్దం అయింది కానీ, వాస్తవం లోకం తీరు ఎలా ఉంటుందో అని మనసు లో అనుకున్నాడు.


మరి కొంత సమయం తర్వాత...

ప్రిన్సిపాల్ గారు విమలతో ఏకాంతం గా మాట్లాడారు.

ప్రిన్సిపాల్ గారు :  విమలా … నీకు, నీ జీవితం లో జరిగిన అన్యాయం, ప్రతీ విషయం నాకు రాము చెప్పాడు …. నాకు నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంది. ఒకప్పుడు నువ్వు రాము విషయం లో ,  కన్న కలలు అన్నీ నిజం అయ్యాయి. కానీ నీ పరిస్థితి నాకు బాధాకరం గా ఉందమ్మా….

విమల :   పర్వాలేదు ప్రిన్సిపాల్ గారు …. జీవితం అన్నీ నేర్పించింది.  నేను రాము కి ఎప్పుడూ సమస్య కాబోను . ఎందుకో తెలియదు,  తండ్రి లాంటి వారు మీకు చెప్పాలనిపించింది….

ప్రిన్సిపాల్ గారు :  సరే విమల .... అన్నారు,  నిట్టూర్పు తో.


ఆ రోజు సాయంత్రం అందరూ  జగిత్యాల నుంచి హైదరాబాద్  తిరిగి బయలు దేరారు.

ఆ రాత్రి …. ప్రిన్సిపాల్ గారు రాము ... శైలజ … విమల  ముగ్గురు గురించి ఆలోచిస్తూ …. కధల్లో నే కాదు,   నిజ జీవితాలు కూడా  ఇలా కూడా ఉంటాయా? ….  ప్రేమ అనే బంధం లో  ఇంత శక్తి ఉంటుందా ? …. భార్య , భర్త, ప్రియురాలు అంతా ఒకరినొకరు  బహిర్గతం గా  ప్రేమను  అర్దం చేసుకుంటున్నారు. అంటే స్వార్థం ఉండదా? … ఇది ఎలా సాధ్యం? … మానసికంగా నైనా , శారీరకంగా నైనా , ఒక భార్య తన భర్త తనకే సొంతం, అనుకునే కాలం లో … ఇలా కూడా ఉండడం సాధ్యమేనా? అని అనుకున్నాడు.


మరలా ప్రిన్సిపాల్ గారు కాసేపటికి  తేరుకొని…. అవును తప్పేముంది …. ఇదంతా ఒకరికొకరికి తెలియకుండా రహస్యం గా ఉంటే సమస్య గాని, అంతా తెలిసినప్పుడు సమస్య ఏముంది అనుకుంటూ నిద్ర పోయారు …. ప్రిన్సిపాల్ గారు.


మిగిలినది

ఎపిసోడ్ - 18 లో.

యడ్ల శ్రీనివాసరావు.

28 June 2024. 2:00 PM.


Wednesday, June 26, 2024

515. జీవిత పరదా

 

జీవిత పరదా



• ప్రతి క్షణం    ఓ పోరాటం

  క్షణ క్షణం     ఓ ఆరాటం.


• జన మెరిగిన      జగము లో

  మతి మునిగిన    మాయతో

  ప్రతి క్షణం      ఓ పోరాటం

  క్షణ క్షణం       ఓ ఆరాటం.


• పాదాలకు   నడక    తెలిసినా

  దేహానికి      పడక     తెలిసినా

• బుద్ధి కి      సత్యం    తెలియడం  లేదు

  మనసు కి   గమ్యం   తెలియడం  లేదు.


• ప్రతి క్షణం      ఓ పోరాటం

  క్షణ క్షణం      ఓ  ఆరాటం.


• జన  మెరిగిన      జగము లో

  మతి మునిగిన   మాయతో

  జీవితం     ఓ సోపానం

  జీవనం      ఓ విగతం.


• పరదాల లో   పాచికలు   దాగునా 

  నటుల తో       నాటకం     ఆగునా

• మనిషి కి   ధర్మం     తెలియడం లేదు.

  జన్మ కు     కారకం    తెలియడం లేదు.


• ప్రతి క్షణం      ఓ పోరాటం

  క్షణ క్షణం       ఓ ఆరాటం.

 

• భారం    మోసేవాడి పై నే   

  ఆశీనుడు  రా ...  ఆ  శివుడు.

  కాపు     కాసేవాడి కి       

  కనుపాప   రా ...   ఆ  విభుడు.

• భారం    మోసేవాడి  పై   నే   

  ఆశీనుడు    రా  ... ఆ  శివుడు

  కాపు    కాసేవాడి  కి       

  కనుపాప    రా  ... ఆ  విభుడు.


యడ్ల శ్రీనివాసరావు 

26  June   2024   3:00 PM.




Friday, June 21, 2024

514. వృషభం

 

వృషభం



• వృషభం అనగా ఎద్దు. ఎద్దు గురించి తెలియని మనిషి అంటూ ఉండడు. చూడడానికి గంభీరంగా, కొమ్ములు కలిగి, పెద్ద శరీరం తో , నెమ్మదిగా నడుస్తుంది. వృషభాన్ని చూస్తే చిన్న పిల్లలకు, స్త్రీలకు, కొందరు మనుషుల కు భయం వేస్తుంది. ఎందుకంటే పొడుస్తుంది అనే భయం. ఎద్దు మూగ జీవి.


• మనిషి కి నాగరికత అలవాటు అయిన కాలం నుంచి, ఎద్దు తో మనిషి కి విడదీయలేని సంబంధం ఉంది.

• ఎద్దు ను ముఖ్యం గా వ్యవసాయం లో నేలను దున్నడం కోసం ఉపయోగించే వారు. తదుపరి, రవాణా వ్యవస్థ లేని పూర్వ కాలం లో ఎద్ధుల బండి (Bullock Cart) కోసం ఎడ్లను ఉపయోగించి వారు. ఎద్దుల కి  ఉన్న  విశేషత ఏమంటే,  ఎన్ని వందల కేజీ ల ధాన్యం బస్తాల నైనా,  లేదా  ఎంత మంది ఎద్ధుల బండి మీద కూర్చుని ప్రయాణం చేసినా అవి తొణకవు, బెదరవు.  సరికదా , మనిషి చెప్పిన విధంగా వింటూ,  చాలా సార్లు రివట దెబ్బలు తింటూ,  మౌనం గా ఉంటూ,  కంట నీరు కారుస్తూ,  ఎంత బరువైనా సునాయాసంగా మోస్తాయి. ఎవరు ఏం చెప్పినా, తల దించుకుని చేయడం మాత్రమే ఎద్దు యొక్క విధి.


• కానీ ఎద్దు బరువు మోసేటపుడు ఎంత భాద అనుభవిస్తుంది, బరువు మోయడం వలన మెడ పైన గాయాలు, పుండ్లు పడినపుడు ఈగలు వాలితే ఎంత నరకం అనుభవిస్తుంది , తోకతో ఈగలు కొట్టుకుంటూ అపరిశుభ్రమైన గొడ్ల చావిడి లో మల మూత్రాల మధ్య లో పడుకొని ఉంటుంది. మనిషి వలే ఎద్ధుకు మనసు ఉండదా? …. మనిషి శారీరక ధర్మం తో చేసే ప్రతి చర్యను ఎద్దు కూడా చేస్తుంది కదా. ఈ విషయాలను కనీసం ఎవరూ ఆలోచించరు.


• కానీ, కొందరు ఎద్దు ను తమ జీవన అవసరాలకు సేవ చేస్తుంది, అని ప్రేమిస్తూ తమ కుటుంబం లో భాగం గా భావిస్తారు. కానీ మరి కొందరు ఎద్దును ఒక పశువుగా భావించి అవసరాలు తీర్చే జీవిగా చూస్తారు. మనిషి చనిపోతే చర్మం దహనం చేయడానికి మినహా దేనికి ఉపయోగపడదు. కానీ ఒక ఎద్దు చనిపోతే , చర్మం తో ఎన్నో విలువైన తోలు వస్తువులు చేస్తారు.


• ఎద్దు తినేది కేవలం గడ్డి మాత్రమే. కానీ మనుషులకు చేసే సేవ అపారం. నేటి కాలంలో పంట పొలాలు దుక్కడానికి ట్రాక్టర్లు వచ్చాయి, కానీ పూర్వం ఎద్దులకు నాగలి కట్టి దుక్కి దున్నేవారు. అందుకే, ఎద్దులను దైవం గా భావించి, పూర్వ కాలం నుంచి సంక్రాంతి పండుగ రోజు రైతులు ఎడ్లకు పూజ చేసేవారు. నేడు ఈ సంస్కృతి కనుమరుగు అయిపోయింది. మనుషుల కు నేడు, ఎద్దుల పట్ల కృతజ్ఞత భావం ఎందుకు లేదో, భగవంతుడి కే తెలియాలి.


ఇక అసలు విషయానికి వస్తే ….


• ఈ విశ్వ సృష్టి కి కర్త శివుడు.  శివుని ప్రమధ గణాలలో వృషభం (ఎద్దు) ఒకటి . శివుడు తనను మోయ గల శక్తి గుణాలను ఒక్క వృషభానికి మాత్రమే ఇచ్చాడు. అందుకే అది శివుని కి వాహనంగా అయింది. అందుకే ప్రతి శివాలయం లో వృషభ అవతారమైన  నంది,   శివుని కి ఎదురుగా కూర్చుని ఉండడం చూపిస్తారు.   వాస్తవానికి ఇక్కడ అర్దం చేసుకోవలసింది మరొకటి ఉంది. శివుని లో ఉన్న సహనం, ఓర్పు, సేవ, అమాయకత్వం, గంభీరం, ఎద్ధులో సంస్కారాలు గా ఉంటాయి. అదే విధంగా శంకరుని లో ఉన్న రౌద్రం, లయం కూడా ఎద్దు కలిగి ఉంటుంది.


• వృషభం దేవతల కంటే మహిమాన్వితమైనది. సాక్షాత్తు పరమశివుని శక్తి నిండి ఉంటుంది. ఇదే ఎద్దు యొక్క జన్మ రహస్యం.

• అందుకే ఎద్దు ఎన్ని దెబ్బలు, గాయాలు, అవమానాలు తగిలినా , భరిస్తూ ఓర్పుతో ఉంటూ శివ శక్తి కలిగి ఉండి, సర్వం సమస్తం తనకు అర్దమవుతున్నా సరే , మౌనం గా ఉంటుంది . కానీ ఏనాడైనా కేవలం భరించలేని స్థితిలో మాత్రమే, ఎద్దు తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ సమయంలో దానిని ఆపడం ఎవరి తరం కాదు, శంకరుడు లయం చేసేటప్పుడు చేసే భీభత్సం లా ఉంటుంది.

• అంటే ఎద్దు యొక్క సహజమైన స్వభావం ఓర్పు, సహనం. ఇవి శివుని యొక్క గుణాలు.  అంతేగానీ    అల్పుడైన మనిషి శక్తి కి లొంగి , భయపడి ఎద్దు జీవించదు. ఇది గమనించాలి.

• పరమాత్మ అయిన శివుడు కూడా మనిషి కి ఒకటే చెపుతాడు, ఎద్దు వంటి స్వభావ సంస్కారాలను కలిగిఉన్న మానవుల పై తాను ఆశీనుడై ఉంటాను అని.


• జ్యోతిష్యశాస్త్రం లో వృషభం అనే రాశి ఉంటుంది. ఈ రాశి లో జన్మించిన మనుషుల జీవనం, స్వభావం కూడా ఎద్దు వలే ఉంటుంది. వారు జీవించి ఉన్నంత కాలం ఎద్దు వలే అందరికీ సేవలు చేస్తారు, తన మన పర అనే భేదం లేకుండా అందరినీ తన కుటుంబం వలే ప్రేమిస్తారు, ఇతరుల సంతోషం కోరుకుంటారు, సహయ గుణం కలిగి ఉంటారు. గుర్తింపు ఆశించరు. ఎవరు ఎన్ని హేళనులు చేసినా, వ్యంగ్యాస్త్రాలు సాధించినా ఏమీ తెలియనట్లు మౌనం గా భరిస్తారు. చేయని తప్పులకు అవమానాలు, నిందలు శాంతంగా భరిస్తారు ….. కానీ ఒక్కసారి ఓపిక, ఓర్పు సహనం నశిస్తే  శత్రువుల పై  ఎటువంటి సంహరానికైనా ఒడిగడతారు. వీరికి  క్షమా గుణం ఉండదు 

• సత్య యుగపు రాజకుమారుడైన శ్రీకృష్ణుడు కూడా  వృషభరాశి ,  రోహిణి నక్షత్రం లో జన్మించాడు. ఎన్నో నిందలు, అవమానాలు పడ్డాడు. చివరికి యుక్తి తో కురుక్షేత్రం గావించాడు. శివ పరమాత్మ యొక్క సందేశాన్ని భగవానువాచ అంటూ భగవద్గీత ద్వారా చెప్పాడు.


• వృషభరాశి వారిది అదృష్టమైన జన్మ. వీరు ఎన్నో జన్మ జన్మలు గా చేసిన పాప కర్మల భారమంతా, ఈ జన్మలో చేయని తప్పులకు అవమానాల నిందల దుఃఖ రూపం లో తొలగి పోతుంది. ఈ రాశి వారు ఏనాడైతే తమ మనసు, బుద్ధి, జ్ఞానం తో శివుని పూజించి, శివుని తో పూర్తిగా అనుసంధానం అవుతారో, ఆనాటి నుంచి వారి కి శివశక్తి తరంగాలు నిరంతరం లభిస్తాయి. ఇది వృషభ రాశిలో జన్మించిన అందరికీ కాదు,   కేవలం ధర్మం ఆచరించ గలిగిన వృషభ రాశి వారికి మాత్రమే సాధ్యం అవుతుంది.


• ఎద్దు ఎంతటి బరువైనా మోస్తూ సహాయం చేస్తుంది , కానీ యజమాని నుంచి కాస్తంత ఉదాసీనత మాత్రమే కోరుకుంటుంది. శివుడు కూడా సర్వులకు సేవ, లోక కళ్యాణం చేస్తాడు కానీ, మానవుల నుంచి కాస్తంత స్వచ్ఛమైన ప్రేమతో నిండిన స్మృతి (ఓం నమఃశివాయ 🙏) మాత్రమే కోరుకుంటాడు. అంతేగానీ పూజలు,  నోములు,  వ్రతాలు, అభిషేకాలు ఉపవాసాలు కాదు.


• ఎద్దు జీవించడానికి కావలసింది కాస్తంత దాణా మాత్రమే.

• ఇదే వృషభం – ఎద్దు యొక్క విశిష్టత.

• ఈశ్వరుని సృష్టిలో ప్రతీ జీవికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది.


ప్రేరణ :   ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఎద్దు గడ్డి మేస్తూ ఉన్న సమయంలో , తదేకంగా గమనించినప్పుడు  దృష్టి లో కలిగిన అనుభవం.  


 ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 

 22 June 2024 , 11:00 am


Saturday, June 15, 2024

513. Desire To Divine

 

Desire To Divine


 Desire (కోరిక, కామము, వాంఛ) నుంచి Divine (ఆధ్యాత్మికము, దైవం).


• మనిషి జన్మిస్తాడు మరణిస్తాడు, మరలా పుడతాడు చనిపోతాడు ఇది ఈ సృష్టిలో జనన మరణం చక్రం. ఇలా జన్మ జన్మలుగా అంటే 84 జన్మలు వరకు ఈ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఈ జన్మలు సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగం ఈ నాలుగు యుగాల పాటు కర్మల అనుసారం జనన మరణాలు ప్రతి మనిషి కి జరుగుతాయి.


• అయితే, ఒకసారి జన్మించినపుడు మనిషి యొక్క జీవితం మరియు జీవనం ధర్మ, అర్థ, కామ, మోక్షాల పరిధి కి లోబడి ఉంటుంది. అంటే మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ నాలుగు అంశాలు తప్పని సరిగా కర్మానుసారం ఆచరించవలసిందే. కానీ మనిషి కి ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏమిటో తన స్పృహ కి, బుద్ధి కి, జ్ఞానానికి అర్దం కావడానికి, 84 జన్మలలో అనేక జన్మలు గడిచి పోయాక, అనుభవ పూర్వకంగా కానీ అర్దం కాదు.


• మొదటి గా మనిషి ధర్మం ఆచరించాలి, తద్వారా అర్ద అంటే ధనం సంపాదించాలి, తదుపరి కోరికలలో పూర్తి పరిపూర్ణ మైన సంతృప్తి నొందాలి చివరిగా మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే సత్యం తెలుసుకోవడం. సత్యం అనుభవించడం. మోక్షం అంటే అన్నింటికీ అతీతమైన స్థితి పొందడం.


• ఈ నాలుగు అంశాలు, మానవ జన్మకు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.


• ఇక అసలు విషయానికొస్తే…. Desires కోరికలు, కామం, వాంఛ మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనవి, అంతు చిక్కనివి. ఎందుకంటే మనిషి వీటిని దాటడడం సామాన్య మైన విషయం కాదు.

• ఎందుకంటే కోరికలు, వాంఛలు, కామము అనే వాటికి, హద్ధు పరిమితి ఉండదు. ఇవి ఎప్పటికప్పుడు కొత్త గా పుడుతూనే ఉంటాయి. ఒకసారి అనుకున్న కోరికలు, వాంఛలు తీరినా సరే తద్వారా మనసు పొందిన సంతోషం, సంతృప్తి తాత్కాలికం. Desires లో కొత్తదనం అనేది రోజు రోజుకు పుడుతూనే ఉంటాయి. అది తినే ఆహారం పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, విలాసాల పట్ల కావచ్చు, సెక్స్ పట్ల కావచ్చు, బంధాల పట్ల కావచ్చు…. ఇలా ఏదైనా కావచ్చు. ఈ Desires కోరికలు అనేవి మనసు, శరీరానికి అనుసంధానం అయి ఉంటాయి. అందువలన మనిషి ఏ వయసు లో ఉన్న, ఏ స్థాయి, స్థితి లో ఉన్నా వీటిని పరిపూర్ణం చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు జీవితాంతం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనిషి తాను అనుకున్న కోరికలు తీరక మరణం చెందితే, తిరిగి మరో జన్మలో అవే fulfill చేసుకోవడానికి పుడతాడు.


• ఏనాడైతే మనిషి తన కోరికలను అనుభవించి, అనుభవించి విరక్తి చెందుతాడో ఆనాడు మోక్షం సిద్ధిస్తుంది. ఉదాహరణకు యోగి వేమన గురించి చెప్పుకోవచ్చు. వేమన పరమ శృంగార భోగి. నిత్యం శృంగార కోరికలు తీర్చుకోవడం కోసం వేశ్యల తో ఉండేవాడు. తన అన్న జమీందారు యొక్క ఆస్తి అంతా నాశనం చేసేవాడు. ఒకరోజు వేమన కు ధనం దొరకక పోయే సరికి, తన తల్లి సమానురాలైన వదిన యొక్క ముక్కు పుడకను ఒక వేశ్య కోసం అడుగుతాడు. వెంటనే ఆమె నగ్నంగా నిలబడి, వచ్చి ఈ ముక్కు పుడక తీసుకోమని చెపుతుంది. ఆ సంఘటన తో వేమన దిగ్బ్రాంతుడై, సిగ్గు పడి, జ్ఞానోదయం చెంది తాను కోరికల పట్ల విరక్తి నొంది యోగి గా మారుతాడు. ఆనాటి నుంచి వేమన తన అజ్ఞానానికి కారణం అయిన శరీరం పై విరక్తి చెంది  అందుకు  చిహ్నం గా , తన  శరీరం పై  కేవలం అంగ వస్తృం తో   దిగంబరుడై  సత్య మార్గం ఆచరించాడు.


• ప్రతి మనిషికి కోరికలు, వాంఛలు అనేవి ఎన్నో విధాలుగా ఉంటాయి. అవి కేవలం మనసు కి మాత్రమే తెలుస్తాయి. వాటిని జయించడం, అధిగమించే మార్గం ఎలాగో తెలుసుకోవాలి. ఇది అంత కష్టతరం ఏమీ కాదు. కానీ కొందరు అంటారు, మనిషి జన్మ అనేది అన్నీ అనుభవించడానికే కదా ….. అవును అనుభవించడానికే, కానీ కోరికలలో కొట్టు మిట్టాడడానికి కాదు, తద్వారా దుఃఖం జమ చేసుకోవడానికి అస్సలు కాదు... అసలు కోరికలు తీర్చుకోవడం అనేది సంతోషం, సుఖం కోసం అని అంటాడు మనిషి. కానీ అసలైన సుఖం, సంతోషం కోరికల వలన లభిస్తున్నాయా అంటే , లేదు అని చెప్పాలి. ఎందుకంటే అసలైన సుఖం సంతోషం కోరికలు తీరడం వలన లభిస్తే, ఈ నాటికీ ఎంతోమంది కోరికలు తీరిన వారు ఆనందంగా ఉండాలి. కానీ నేడు విశ్వం లో కోరికలు తీరిన మనిషికి కూడా సుఖం సంతోషం అనేవి మానసిక స్థితి లో లేవు.


• సుఖం, శాంతి, నిత్యానందం అనేవి మోక్ష స్థితి లో నే లభిస్తాయి. కోరికలు లేని స్థితిని, వైరాగ్యం, మోక్షం అంటారు. దైవం గురించి తెలుసు కొని, సాధన చేసేటప్పుడు మొదట మనిషి కి తాను ఎవరు అనే సత్యం తెలుస్తుంది. మనిషి తనలోని తీరని కోరికలు, వాంఛలు, కామము దైవం ఎదుట మనసు తో నిస్సిగ్గుగా సమర్పించినపుడు భగవంతుడు వాటిని విడిచి పెట్టే మార్గం మరియు అతీంద్రియ శక్తిని ధారణ చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు మానవుడి నుంచి పంచభక్ష్య పరమాన్నం, నైవేద్యం గా ఆశించడు.  భగవంతుడు ఆశించేది కోరికలకు కారణమైన మనిషి మనసు లో దాగున్న పంచ కామవికారాలు.   ఏనాడైతే మనిషి ఈ వికారాలను భగవంతునికి అర్పితం   చేస్తాడో  అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే కోరికలు  దాటినపుడే  దైవం యొక్క మూల స్వరూపం తెలుస్తుంది.  అదే విధంగా ఒకసారి భగవంతునికి  ఏదైనా అర్పితం  చేస్తే తిరిగి తీసుకోకూడదు.


• Desires నుంచి Divinity కి transform అవ్వాలంటే ప్రతి రోజూ కొంత సమయం నిజాయితీగా , చిత్తశుద్ధితో పరమాత్మ అయిన శివుని తో ఏకాంతంగా  గడపాలి, మాట్లాడాలి. అప్పుడు దొరికే సంతోషం అనంతం. ఈ దశలో తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు. అనుభవాలతో, అనుభూతులతో , ఏ భౌతిక కర్మ తో కూడిన చర్యలు జరగకుండా అన్ని సహజంగా తీరిపోతాయి. ఎందుకంటే నిజానికి ఈ కోరికలు అనేవి ఆత్మలో జన్మాంతరాలుగా నిక్షిప్తం అయి ఉంటాయి. అవి  మనిషిని నిరంతరం అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి.  కేవలం  శివ స్మరణ తో అవి ఆత్మ నుంచి శాశ్వతంగా తొలగించబడతాయి. అదే ఆత్మకు సుఖం శాంతి మోక్షం, మనిషి కి ఆనందం.


• Desire  is   something  Asking.

• Divine  is   giving   Everything.


యడ్ల శ్రీనివాసరావు 

15 June 2024 , 3:00 PM.




Friday, June 14, 2024

512. మేఘజీవన

 

మేఘజీవన



• నడిచే   వెన్నెల   నీవైతే

  కురిసే   మంచును  నేనవుతా.

• మెరిసే   తారవు   నీవైతే

  కదిలే    మేఘం   నేనవుతా.


• సాగే   ఈ పయనం   ఆఖరి  మజిలీ

  తీరే    ఈ శయనం    అమర లోగిలి.


• నడిచే    వెన్నెల      నీవైతే

  కురిసే    మంచును  నేనవుతా.

• మెరిసే    తారవు    నీవైతే

  కదిలే     మేఘం    నేనవుతా.


• గాలి   లోని   నేను

  నీ  శ్వాస లో   నిలిచాను.

• తాళ   లేక    నేను

  నీ  మది లో   మాటేసాను.


• స్వేధ   మైన  నేను

  నీ   మేని లో    కలిసాను.

• వీడ   లేని   నేను

  నీ   నుదిటి  నంటి  ఉన్నాను.


• పాడే  ఈ రాగం    ప్రేమ కు   అజరామరం

  వేగే    ఈ బంధం   విశ్వం లో    సవికాశం.


• నడిచే   వెన్నెల   నీవైతే

  కురిసే   మంచును  నేనవుతా.

• మెరిసే   తారవు   నీవైతే

  కదిలే    మేఘం   నేనవుతా.



అమర = దేవత, మరణం లేని.

అజరామరం = స్థిరమైనది.

వేగే = తపించే

సవికాశం = ప్రకాశించునది.


యడ్ల శ్రీనివాసరావు 

14 June 2024 8:30 PM.





Thursday, June 13, 2024

511. అందరూ మంచి వారు

 

అందరూ  మంచి వారు


• అందరూ   మంచి వారు

  మనుషులందరూ   మంచి వారు.

• మమతలతో    మధురిమలు

  పంచుకుంటు   ఉంటారు.

• మాయ ను    తెలియక

  మైమరచి     ఉంటారు.


• అందరూ     మంచి వారు

  మనుషులందరూ   మంచి వారు.


• కొందరి     మాటలు   మకరందాలు.

  జీవానికి   ప్రాణం   పోస్తారు.

• మరికొందరి  మాటలు   మలినాలు.

  జీవాన్ని    నిర్జీవం   చేస్తారు.

• ఇంకొందరి   మాటలు   మంచు కత్తులు.

  నమ్మించి   నడుము లో  పొడుస్తారు.


• అందరూ     మంచి వారు

  మనుషులందరూ   మంచి వారు.

• మమతలతో    మధురిమలు

  పంచుకుంటు    ఉంటారు.

• మాయ ను     తెలియక

  మైమరచి       ఉంటారు.


• తెలివైన  వారు    చతురత  చూపిస్తారు.

  ఏ ఎండకు   ఆ గొడుగు లో   ఉంటారు.

• తెలివిలేని  వారు   చతికిల   బడతారు.

  మీన మేషాల   దిక్కులు  చూస్తారు.


• మనసు ను   

  నమ్ముకున్న    వారు   కొందరు.

• మనసు ను 

  అమ్ముకునే  వారు   మరి కొందరు.

• మనసు ను 

  ఎరుగని   వారు   ఇంకెందరో …


• అందరూ    మంచి వారు

  మనుషులందరూ   మంచి వారు.

• మమతలతో   మధురిమలు

  పంచుకుంటు   ఉంటారు.

• మాయ ను   తెలియక

  మైమరచి    ఉంటారు.


యడ్ల శ్రీనివాసరావు 

13 June 2024 7:00 PM.




Wednesday, June 12, 2024

510. చినుకు జారింది

 

చినుకు జారింది


చినుకు    జారింది

  చలికి      వణికింది.

• విరజాజి   విచ్చింది

  మనసేమో  అదిరింది.

 

• జల్లుల     సవ్వడి లో

  ఓ కోక      ఆడింది.

• గాలుల    ఒరవడి లో

  ఆ రైక    తడిచింది.


• అలజడుల   పరువం లో …

  అధరం …

  సుమధురమై    తాకింది.

 

• ఇది   ఉరుముల    మెరుపుల   కళ్యాణం.

  ప్రకృతి    పురుషుల    వసంతం.


• చినుకు    జారింది

  చలికి     వణికింది.

• జాజి    విచ్చింది

  మనసు   అదిరింది.


• చూపుల     సంగమం లో

  తడబడిన       చినుకులు

  మునిపంటి పై   నిలిచాయి.

• విడిచిన     శ్వాస లో

  వెల్లువైన      వెచ్చదనం

  చుబుకం  పై  చేరింది.


• పరవశాల     పల్లవింపు లో ...

  ఆరాధన .‌‌..

  ఆస్వాద నై       సాగింది.


• ఇది  ఉరుముల   మెరుపుల  కళ్యాణం.

  ప్రకృతి    పురుషుల    వసంతం.


• చినుకు     జారింది

  చలికి      వణికింది.

• జాజి    విచ్చింది

  మనసు   అదిరింది.


యడ్ల శ్రీనివాసరావు 

12 June 2024, 8:00 PM .





Friday, June 7, 2024

509. మనో విధి


మనో విధి


• అడగగనే        వడివడిగ

  దడివచ్చిన    కాట్రేడువే …

• కుడిఎడమల    ఎడవిడిచి

  సరిపడగ      వరములీడ.


• తడబడినా   భ్రమపడినా   

  దరి వీడకు     వేడికంటి …

• ఎండనీడల   యడబాయగ

  కొడగట్టిన     కడబ్రతుకులు .


• కడివెడు    నీ కృప   తోడుగ

  దివి చేరు     కాయంబిక …

• దడబిడల    సడి   జేరదు

  శాశ్వతముగ  నీ  ఒడిని  జేర …


• వశపడినా     వెంటపడినా

  శివుని   వీడ    నే నేలపడినా.


🙏ఓం నమః శివాయః.


• అడగిన   తక్షణమే    కాలం తో   రక్షణగా   వచ్ఛిన   స్మశానాధిపతి.

  కుడి  ఎడమ లను   తోసిపుచ్చి   కావలసిన   వరములిచ్ఛావు.


• తెలియక  తప్పు చేసినా,   మాయలో  పడినా          నా సమీపం   విడువకు   ఓ  ఉగ్రాక్షుడా .

  ఎండ నీడలు  దూరం గా   పెట్టిన ,    స్పర్శ లేని     అంటు  జీవితాలు.


• గుప్పెడంత   నీ దయ   తోడుంటే    పరలోకం       చేరును  ఇక   ఈ   జీవం.

 శాశ్వతం గా    నీ ఒడి లో   చేరితే,    ఏ అలజడుల   శబ్దం   మనసు కి   చేరదు.


• దేనికైనా    స్వాధీనమై నా,    ఆశించి నా,   తుదకు   కింద పడి   పతనమై   పోయినా   నేను   శివుని   వీడను.


🙏ఓం నమః శివాయః.


యడ్ల శ్రీనివాసరావు 

7 June 2024 7:00 PM





Thursday, June 6, 2024

508. జీవన ఆలంబన

 

జీవన ఆలంబన


ఈ కలి యుగం లో  మానవ జీవితం ఒక నాటకం. ఈ నాటకం లో మానవుడు నిరంతరం నటిస్తూ నటిస్తూ నటిస్తూనే ఉంటాడు. ఇలా నటించడం వలన జీవించడం పూర్తిగా మరచి పోతాడు. అందుకే ఈ కలియుగంలో సత్యానికి,   అసత్యానికి  తేడా తెలియక ,  అసత్యాలను  అవలీలగా మాట్లాడుతూ , అదే సత్యం   అనుకుని  భ్రమలో  మనిషి బుద్ధి పరిభ్రమిస్తూ ఉంటుంది.


అసలు జీవించడం అంటే అర్దం ఏమిటో తెలియకుండానే మానవుని జీవితం జన్మ జన్మలు గా గడిచిపోతుంది.  సాధారణంగా జీవించడం అంటే, తినడం, ఎదగడం, కోరికలు తీర్చుకోవడం, బ్రతకడం, వివాహం, సంసారం, సుఖాలు, విలాసాలు,  సంపాదన, అనుభవించడం, వృత్తి ఉద్యోగాలు, గుర్తింపు ,  ప్రాణాలతో ఉండడం , ఇలా రకరకాల ఆలోచనలతో నిండిన సమాధానాలు మనిషి కి కలుగుతూ ఉంటాయి. ఇదే కదా జీవితం, జీవించడం  ఇంతకు  మించి   ఏముంది?  అనుకుంటారు .


కానీ జీవితం వేరు , జీవించడం వేరు  అని ఎందరికి తెలుసు?.


జీవితం  అంటే  ఆమోదయోగ్యం గా  (అంగీకార ప్రదం గా) అవలభించవలసిన విధానం.

జీవించడం అంటే   ధర్మాన్ని  ఆచరించడం.

ధర్మం అంటే ఇతరులకు, ప్రకృతి కి మనసా వాచా కర్మణా ఏవిధమైన అపకారం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసాలు తీసుకోవడం.   

ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మాన్ని ఆచరించడమే జీవించడం అంటారు.               

ఆ విధానం అనుసరించడమే  జీవనం.  

ఇది సాక్షాత్తూ పరమాత్ముడైన శివుడు మానవుని మనుగడకు నిర్దేశించిన విధానం.  ఇదే సత్యమైన స్థితి కి సోపానం.


మరి  నేటి  కాలంలో  మానవుడు  బ్రతుకుతున్న పద్ధతి ని    జీవించడం అనొచ్ఛా?   మానవుడు ఆచరిస్తున్న  విధానం  జీవనం అనొచ్ఛా? … అంటే ముమ్మాటికీ అనలేం …. ఎందుకంటే ఇది పూర్తిగా కలుషితమైన మానవ ప్రపంచం.   ప్రతీ క్షణం చెడు లొనే ఉంటూ, చెడును ఆస్వాదిస్తూ ,  చెడు పై పోరాటం చేస్తూ బ్రతకాలి. 

చెడు పై పోరాటం చేయాలి అంటే, మరి మనిషి కి అంత శక్తి ఉందా? అంటే అది సాధనతో ముడి పడి ఉందని చెప్పాలి.  ఈ సాధన లేని నాడు , చెడుతో రాజీ పడి మనిషి ఉంటాడు.  కలియుగంలో ధర్మం కేవలం ఒక పాదం మీద  ఉంటుంది.


అందుకే మనిషి నేటి కాలం లో జీవించడు … జీవించలేడు,  కేవలం నటిస్తాడు.  నటించడమే జీవించడం అనే ఒక మాయ భ్రమ లో కాలం తో ప్రయాణం చేస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. దీనికి మూల కారణం చేసిన వికర్మలు, అంటే చెడు కర్మలు.


జీవించడం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. సత్యం అనుసరించడం, ఆచరించడం. మరి నేటి మానవుడికి సత్యం తెలుసా? … సత్యం ఆచరిస్తున్నాడా?...


మనిషి  జీవనం ఆమోదయోగ్యమైన  విధానం తో ఉంటే అసలు దుఃఖం అనేది ఉండదు. మరి నేటి కాలంలో దుఃఖం లేని మనిషి ఉన్నాడా? మరి అటువంటప్పుడు మనిషి అవలంభిస్తున్న జీవన విధానం ఎటువంటిది ?

సత్యాన్ని ఆచరించే వానికి అణువంత దుఃఖం కూడా ఉండదు.   ఎందుకంటే దుఃఖానికి కారణమైన సమాధానం  సత్యం లో  సహజంగా లభిస్తుంది.


మాయ, మనిషి ని  భ్రమలో  ముంచుతుంది. నిజం కాని వాటిని నిజం అనే విధంగా తలపింప చేసి, అసలు సత్యం తెలియకుండా చేస్తుంది. అంతెందుకు, ఒక సినిమా ఉంటుంది, అది నిజం కాదు అని తెలిసినా అందులో మమేకమై, ఆ పాత్రలో లీనమై ఏడుస్తాం, బాధపడతాం, నవ్వుతాం , అనేక విధాల భావోద్వేగాలకు లోనవుతాం. ఇదే మాయ, భ్రమ. సినిమా ఒక నటన అని తెలిసినా సరే లీనమైపోతాం.

అదే విధంగా పుట్టిన ప్రతి మనిషి చనిపోతారనే సత్యం తెలిసినా , చావును అంగీకరించలేం ,  చావు అంటే భయపడతాం, ఇది కూడా ఒక మాయ భ్రమే.


మానవుని లో   ఆశ, మోహం, మమకారం, అపేక్ష, స్వార్థం, ఈర్ష్య,  అసూయ, ద్వేషం,  అహం వంటివి పెరిగిపోవడం వలన నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం మనిషి మనసు గ్రహించలేక నటించడానినే జీవితం గా మార్చుకొని అసలు సంతోషం ఏదో తెలుసుకో లేక, దుఃఖ పాత్రుడు గా మారాడు నేటి మానవుడు.


దీని అంతటికీ మూలం ఒకటే…. మనిషి తనను తాను ప్రశ్నించుకోక పోవడం…. నేను ఎవరు? …. అసలు నేను ఎవరు? … నేను ఏమిటి? … నేను పుట్టక ముందు ఎక్కడినుంచి వచ్చాను? … నేను చనిపోయాక ఎక్కడికి వెళతాను?  ఈ ప్రశ్నను ప్రతీ రోజూ వేసుకుంటే,   ఆ “నేను ఎవరు “ అనే దానికి ఏదొక రోజు, ఏదొక సమయం లో , ఎవరో ఒక సద్గురువు ద్వారా సమాధానం లభిస్తుంది… లభించడం కాదు, అనుభవం అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే అనుభవం అయితే నే మనిషికి  తనపై తనకు  నమ్మకం కలుగుతుంది.


• అంతవరకు కూడా  నేను కి ఒక పేరు , అహం తగిలించి బడి ఉంటుంది.  ఏదో ఒక రోజు చనిపోయాక , శరీరం దహనం చేసేటప్పుడు నేను కి   పేరు ఉండదు సరికదా,   పేరు తీసేసి   శవం గా పిలువబడుతుంది.    అప్పుడు అహం అనేది  అణువంత కూడా  కనిపించదు.  ….. కానీ ఆ సమయంలో, ఆ నిమిషం లో, ఆ క్షణంలో కూడా  “నేను”  బ్రతికే ఉంటాడు. ఎందుకంటే “నేను” అనేది ఈ సృష్టిలో నాశనం లేనిది మరియు శాశ్వతమైనది.  ఇంతకీ ఆ “నేను” ఎవరో తెలుసా… "ఆత్మ".

అవును  ...   నేనొక ఆత్మను.    ఆత్మ అంటే చైతన్యవంతమైన   వెలుగు తో   కూడిన శక్తి. 


ఆత్మ నైన  “నేను”  శరీరం అనే వస్త్రం ధరించి కర్మలు చేయడానికి జన్మించాను.  ఈ శరీరం అనే  వస్త్రాన్ని బాల్యం,   యవ్వనం,  వృద్ధాప్యం అంటూ ,  సంవత్సరాల తరబడి   కర్మలు చేస్తూ  ఉపయోగించడం  వలన పాతబడి,  అరిగిపోయి చిరిగిపోయింది.  అందుకే శరీరం దహనం గావింపబడుతుంది.  దీనినే చనిపోవడం అంటారు. 

చావు  శరీరానికే  గాని   ఆత్మ కు  కాదు. 

ఆత్మ నైన  “నేను”  చేసిన కర్మల ఫలితం ఆధారంగా తిరిగి   మరలా  కొత్త శరీరం  అనే వస్త్రం  ధరిస్తాను. …… ఇదే సత్యం.


మానవ జన్మ ఎత్తి …. మనుషులు గా ఉన్న మనలో ఎందరికి ఈ సత్యం తెలుసు? … కాని ఇదే సత్యం.

ఈ సత్యం అనుభవ పూర్వకంగా తెలియకుండా ఉన్నంతకాలం ....  జీవితం  ఒక  నాటకం దానికి జీవనం ఒక ఆలంబనం. 


ఆలంబనం = ఊత, Support.


యడ్ల శ్రీనివాసరావు 

5 June 2024 , 11:00 PM.


532. దేహము కాదిది … వేదన కాదిది

  దేహము కాదిది … వేదన కాదిది  • దేహము  కాదిది  ….  దేహము కాదిది   దహనము తో     ఎగిసే    చితి    ఇది. • వేదన   కాదిది    ....   వేదన కాదిది...