Wednesday, August 28, 2024

532. దేహము కాదిది … వేదన కాదిది

 

దేహము కాదిది … వేదన కాదిది 

• దేహము  కాదిది  ….  దేహము కాదిది

  దహనము తో     ఎగిసే    చితి   ఇది.

• వేదన   కాదిది    ....   వేదన కాదిది

  వేదము తో     నడిచే    గతి   ఇది.


చితి లోని     భస్మం    శుద్ధం ..

  అది  ఈశ్వరుని    చేరు   స్వరూపం.

గతి  లోని      మార్గం     జ్ఞానం ..

  అది   ఈశ్వరుడు    చూపే    గమ్యం.


• వ్యధ తో        సాగెను       మర్మము  నాడు.

  శివస్మృతి తో    కలిసెను   కర్మము   నేడు.


• దేహము  కాదిది   ….  దేహము  కాదిది

  దహనము తో    ఎగిసే    చితి   ఇది.

• వేదన    కాదిది    ….   వేదన   కాదిది

  వేదము తో     నడిచే     గతి    ఇది.


• దూర   తీర   మేగితే 

  మనసు    దారం    అవుతుంది.

• కడలి   నడుమ   చేరితే

  స్థితము    నిశ్చల   మవుతుంది.


• దిక్కు    తెలియని    బాటసారి  నాడు.

  దిశ        చూపే       పాత్ర ధారి    నేడు.


• దేహము   కాదిది  ….  దేహము  కాదిది

  దహనము తో    ఎగిసే    చితి   ఇది.

• వేదన      కాదిది   ….    వేదన   కాదిది

  వేదము తో     నడిచే    గతి    ఇది.


• వ్యర్దమున్న    చోట     సమర్థము   ఉండలేదు.

  సమర్థమున్న   చోట     సంప్రాప్తి      ఉండును .



యడ్ల శ్రీనివాసరావు 28 Aug 2024, 10:00 pm


Tuesday, August 27, 2024

531. రాధాకృష్ణుల రమణీయం

 

రాధాకృష్ణుల    రమణీయం


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల      రమణీయం.

• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల    రమణీయం.


• సిరులోలి కే    మీ   తన్మయం

  దేవతల  కు       తలమానికం.

• హవభావాల      మీ   అభినయం

  శివపార్వతుల     సంతుష్టం.


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల       రమణీయం.


• శ్రీమహలక్ష్మి       సిగ్గులు

  మహిమలు   నిండిన    కాంతులు.

  అవి రాధను   తాకిన    పసిడి  కుసుమాలు.


• శివ జ్యోతి       వేణువు

  రాగాలు    నిండిన    వేదాలు

  అవి   కృష్ణుడు    పలికిన    గీత పాఠాలు.


• జ్ఞాన   సాగరమున   వెలిసిన   లక్ష్మి జ్యోతులు

  ప్రేమ   సారమున      వెలిగిన    రాధా కృష్ణులు.

• ఈ …  రాధా కృష్ణుల   రూపాలే

  లక్ష్మి  నారాయణ    ప్రతిరూపాలు.


• బృందావనము న    సుందరం

  రాధాకృష్ణుల        రమణీయం.


• సిరులోలి కే        మీ  తన్మయం

  దేవతల కు        తలమానికం.

• హవభావాల    మీ   అభినయం

  శివపార్వతుల కు     సంతుష్టం.



యడ్ల శ్రీనివాసరావు 28 Aug 2024, 11:30 AM.


Friday, August 23, 2024

530. పిల్లలం – చిన్ని పిల్లలం

 

పిల్లలం – చిన్ని పిల్లలం


• పిల్లలం   ….   చిన్ని పిల్లలం

  పిల్లలం   ….   చిన్ని పిల్లలం.


• చెట్టపట్టాల తో     చెలరేగే

  చిచ్చుబుడ్డి     టపాసులం.

• చెక్కిళ్ల పై      చిరునవ్వు

  చెదరని       చిన్నారులం .


• పిల్లలం    ….   చిన్ని పిల్లలం

  పిల్లలం    ….    చిన్ని పిల్లలం.


• అభం శుభం   తెలియని   అమాయకులం.

  అందరిలో     ఆనందం   నింపే   కుసుమాలం.


• మనసు లోని    భయాలకు

  ఊపిరి  పోసే       అభాగ్యులం.

• నిదుర లో         బాధలను

  మరచిపోయే       భాగ్యులం.


• పిల్లలం   …  చిన్ని పిల్లలం

  పిల్లలం   …  చిన్ని పిల్లలం.


• అందరినీ   అలరించే    పసి పాపలం.

  కన్నోరికి     మాత్రం      కను పాపలం.

• ఆటలతో    పాటలతో    అలసి సొలసితాం 

  అమ్మ చేతి    ముద్దలకు   ఆరాట  పడతాం.


• పిల్లలం    ….  అల్లరి పిల్లలం

  పిల్లలం     ….  అల్లరి పిల్లలం


• కోప తాపాలు    లేని      కోమలురం

  చిలిపి చేష్టల    చేతలు   మా  నైజం.

• ఆశ  లెన్ని    ఉన్న     ఆశయాలు   విడువం.

  లోటు లెన్ని   ఉన్న     వదలం  మా  సంస్కారం.


• పిల్లలం   …  అల్లరి పిల్లలం

  పిల్లలం   …  చిన్నారి పిల్లలం.


యడ్ల శ్రీనివాసరావు 24 Aug 24 , 9:30 AM


Sunday, August 18, 2024

529. శివ పరమాత్మ - రక్ష బంధనం

 

శివ పరమాత్మ - రక్ష బంధనం


• ప్రతీ బంధానికి  మూలం  ఆత్మ బంధం.

  ఆత్మ బంధానికి   కారణం  బుణానుబంధం.

  *మూలం అంటే  ….  *నేను ఎవరు?.


• నేను ఎవరు   అనేది  తెలియాలంటే .....  ధ్యానం జ్ఞానం  యోగం  యొక్క  అభ్యాసం చేయడం  ద్వారా  మూలాధార చక్రం  జాగృతి అవుతుంది.    తద్వారా    "నేను"  అంటే  దేహం  కాదు,   ఒక ఆత్మ ను అనే సత్యం  తెలుస్తుంది.

• నేను ఒక ఆత్మ ను అనే సత్యమైన మూల స్థితి పొందిన వారికి ,  ఏ ఆత్మ తో  ( మన చుట్టూ భౌతికంగా  ఉన్న మనుషులు )  ఎటువంటి బంధమో స్పష్టం గా అనుభవం అవుతుంది …. ఏ బంధం తో ఎలాంటి బుణమో , స్పష్టం గా తెలుస్తుంది.

• మనో దృష్టితో చూస్తే …. ఆత్మలన్నీ , తండ్రి అయిన శివ పరమాత్మకు బుణం.  అదే విధంగా తండ్రి అయిన శివుడు కూడా, పిల్లలైన  ఆత్మల కు  బుణం. కర్మ సిద్ధాంతం  సృష్టించిన   శివుడు  కూడా   కర్మ సిద్ధాంతానికి   లోబడి   ఉంటాడు.  కర్మ సిద్ధాంతం అనుసరిస్తాడు,  ఆచరిస్తాడు.

• దేహ దృష్టి తో చూస్తే. ….. తల్లి తండ్రి, భార్య భర్త , అక్క చెల్లి, అన్న తమ్ముడు, ప్రియతములు, స్నేహితులు, శత్రువులు, బానిసలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలలో మనిషి నటిస్తూ చేసిన కర్మలే ఆత్మల మధ్య బుణాలు.

• బంధం అంటే ముడి. ఇదే బంధీ గా మారుస్తుంది. బంధీ అంటే చిక్కుకు పోవడం. దీనినే బంధనం అంటారు. ….

పరమాత్మ అయిన  శివుడు సంగమ యుగం లో అంటే కలియుగంలో ప్రస్తుత అంత్య కాలములో (ఈ సమయం ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ పూర్తిగా దుఃఖమయం)  ఈ దుఃఖ బంధనాల నుంచి విముక్తి కలిగించేందుకు రక్షణగా , “నేను మీతో ఉన్నాను” అని సమస్త మానవాళికి తెలియ చేస్తాడు. అదే రక్షాబంధనం.

• జంధ్యము అంటే దేహం చుట్టూ కట్టబడి ఉండే వలయం.  శ్రావణ పౌర్ణమి  రోజు శివుని యొక్క శక్తి చంద్రుని వెన్నెల ద్వారా లో విశ్వం లో  మానవాళి అంతటికీ వలయం వలే అందుతుంది. ఈ రోజు శివుని స్మృతి (మననం)  చేయాలి.  అందుకే ఈ రోజును జంధ్యాల పౌర్ణమి అంటారు.


• కాలక్రమేణా , ఇది  జంధ్యాలు మార్చుకునే పండుగ గా మారింది ,  మరియు సోదరుడు , సోదరికి    భౌతిక బంధనాల లో ఉండే దుఃఖం, సమస్యల నుండి రక్షణ కల్పించడానికి తోడుగా, నేనున్నాను అని చెప్పడానికి నిదర్శనం గా రాఖీ పండుగ జరుపుకుంటారు.

• శివ పరమాత్మ దృష్టిలో ప్రతీ ఒక్కరూ తన పిల్లలు. ఆత్మ దృష్టి తో చూస్తే అందరూ సోదర సోదరీమణులు. ఒకరికి మరొకరు రక్ష గా నిలబడితే, పరమాత్మ అందరికీ రక్ష గా ఉంటాడు. లేనిచో మాయ దుఃఖం లో బంధించి పతనం చేస్తుంది.

• రక్షా బంధనం కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే ఉద్దేశించిన పండుగ కాదు…. ఆత్మ బంధాలకు సంబంధించినది.


సత్యం   శివం   సుందరం

సత్యం      -    నిజం, నిజాయితీ.

శివం         -    కళ్యాణం, శుభకరం.

సుందరం  -    మనోహరం, సంతోషం.

సత్యం       ఆచరించిన వారు    శుభకరులై  ఎల్లవేళలా   మనోహరం గా     ఉంటారు.


• ఏ బంధమైనా  అర్థవంతంగా,   సగౌరవంగా ఉంటే ,  ఆ బంధంలో    విలువ  పరిమళాన్ని ఇస్తుంది.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 18 Aug 2024, 6:00 pm.


Tuesday, August 13, 2024

528. సాహితీ బంధం

 

సాహితీ  బంధం ✍️


• కల వో   … కళ వో …

  కనులలో   విరిసిన   కవిత వో ...

• శిల వో   …  శిల్పాని వో ...

  రాతలలో   చెదరని   సాహితి వో.


• మనస నే    రధము కు   రంజని వై

  లత లలే    అల్లుకున్న    పద కావ్యమా

  ఏ  జన్మ   బుణమో  …   ఈ రచనా   భాగ్యం.


• తలప నే    బావి లో    గంగ వై 

  అల లొలికే   పరవళ్ల    పద  కోశమా 

  ఏ నాటి   బంధం  ...   ఈ  అక్షర    సౌభాగ్యం.


• కల వో   … కళ వో …

  కనులలో   విరిసిన   కవిత వో ...

• శిల వో   …  శిల్పాని వో

  రాతలలో   కదిలిన    సాహితి వో.


• సరి కొత్త    సృష్టి కి    కల్పన వై

  పుష్పక     విమాన    విహంగ మైనావు

  ఏ   జన్మ  లిప్తం    …  ఈ   వ్యాసం.


• కానరాని   అందాలకు   దర్శిని వై

  మస్తక మణి   తేజో    కమనీయ మైనావు 

  ఏ నాటి  కృతం   …  ఈ  చరితం.


చిగురించే   పూవుల   జీవం      …  రచన

  ఆమని    రాగాల     హ్లదం        …  కవిత

  సాగర   కెరటాల   సంబరం        ...  సాహితి

  మంచు తెరల   లాలన  సమీరం … కావ్యం



మస్తక మణి = భృకుటి స్థానం లోని ఆత్మ

కృతం         = గతం లో చేసినది.

లిప్తం           = పూయబడినది, అంటించ బడినది       (plastered).


యడ్ల శ్రీనివాసరావు 13 Aug 2024 , 3:30 pm.

Monday, August 5, 2024

527. బాల్యం - నీడలు


బాల్యం - నీడలు


• నను   వీడని    బాల్యం    

  నీడ గా    వస్తుంది.

• నా    జీవిత    కావ్యాన్ని   

  తోడు గా   తెస్తుంది.


• మధురిమలు   లేవు     కానీ

  మనసున్న    గురువులు   ఎందరో ….

• ఆ రోజులు    రావు      కానీ

  ఆ గురుతులు    నేటి కీ    ఎందుకో….


• నను వీడని   బాల్యం    

  నీడ గా     వస్తుంది.

 • నా   జీవిత   కావ్యాన్ని   

  తోడు గా    తెస్తుంది.


• తల  దువ్వే   అమ్మ లో     ఏదో  ఆనందం.

  బహుశా  …  బహుశా

  అమ్మ లోని   " బాల్యం "  నేనే   అయి  ఉంటా…

• చేయి  వదలని    నాన్న లో     ఏదో   కలవరం.

  బహుశా   …  బహుశా

  నాన్న  లోని   " భయం "   నేనే    అను కుంటా ...


• సంబరాలు   తెలియని   ఆ ప్రాయం

  సంస్కారం    నేర్పింది.

• తెలివి     తెలియని    ఆ కాలం

  సంయమనం     నేర్పింది .


• నను  వీడని    బాల్యం    

  నీడ గా     వస్తుంది.

• నా    జీవిత    కావ్యాన్ని  

  తోడు గా   తెస్తుంది.


• నాటి    పాఠశాల    విలువలు

  నేటి     బ్రతుకు కి   పునాదులు.

• కల్మషం లేని    ఆనాటి   స్నేహాలు

  ఎదురు   చూపుల   ఉషోదయాలు.


• ఆవిరి   అయిన     ఆ గతం

  అంతరంగం   దాటి   పోలేదు   …  ఎందుకో.

• ఊపిరి  అయిన    మనో గతం 

  పసితనం     వీడి   పోలేదు    …  ఎందుకో.

• బహుశా  …  బహుశా

  బాల్యం    నా   ప్రాణం.

  బాల్యం    నా  మరణం.


• నను   వీడని   బాల్యం    

  నీడ గా     వస్తుంది.

• నా     జీవిత    కావ్యాన్ని  

  తోడు గా   తెస్తుంది.


యడ్ల శ్రీనివాసరావు 5 August 2024 .9:30 pm.


Saturday, August 3, 2024

526. స్నేహం … స్నేహితులు … అంటే ?

 

స్నేహం … స్నేహితులు … అంటే ?


స్నే "హితుల" దినోత్సవ సందర్భంగా 

2024

• హితం అంటే మంచి … హితవు అంటే మంచి పలకడం . హితుడు అంటే మంచి ఆచరించే వాడు. నిస్వార్థంగా ఇతరులకు మంచి చేసేవాడే వాడే స్నేహితుడు . స్నేహితుడు అనే పదానికి  అసలైన అర్థం మంచి చేసే వాడు  అని ఎందరికి తెలుసు ?.

• మనకు పరిచయం ఉన్న వారు, మనతో చదువుకున్న వారు, మన ఇంటి పక్కనే ఉన్న వారు, మనతో కలిసి ఉద్యోగం చేసేవారు అందరూ మనకు స్నేహితులేనా? …. మరి వీరందరూ   మన  స్నేహితులు   అయితే     వారు   మన  శ్రేయస్సు,  మంచి కోరుకుంటున్నారా? … లేదా వారందరిని స్నేహితులు  అని భావిస్తూ   భ్రమ లో   మనం  జీవిస్తూ ఉన్నామా?.

• స్నేహితులు  అంటే  మంచి కోరుకునే వారు మరియు మంచి చేసే వారు అని అర్దం. …. మరి పరిచయస్తులని ,  క్లాస్ మేట్స్ ని , కొలీగ్స్ ని ఇలా అందరినీ స్నేహితులు అనుకుంటే ,  అంత అమాయకం మరొకటి ఉండదు.   ఎందుకంటే    మన   దైనందిన జీవితంలో  వీరందరినీ   కూడా   స్నేహితులు అని యధాలాపంగా  తరచూ  సంభోధన చేస్తుంటాం. వీరి లో  కొందరు మంచి చేసే  మనస్కులు ఉండవచ్చు,  వారిని  మాత్రమే  స్నేహితులు గా భావించాలి.   కానీ అందరూ, స్నేహితులు గా కాలేరు.

• ఎందుకంటే …. మానవ జన్మ కు బుద్ధి ప్రధానం. “పుర్రె కో బుద్ధి” అంటారు, అంటే అందరి బుద్ధి ఒకేలా ఉండదు అని అర్థం.   అంటే,  అందరూ  తమ తోటి వారికి మంచి చేయాలని అనుకోరు. అటువంటప్పుడు మనతో  చదువుకున్న  వారందరినీ   లేదా  పైన ఉదహరించిన  అందరినీ   స్నేహితులు అని   మాట వరుసకు సంబోధించడం కూడా తప్పు , పొరపాటు. వీరిలో   మన మనసు   గ్రహించలేని    శత్రువులు కూడా  మనతోనే   కలిసి,   మన చుట్టూ అమాయకంగా నటించే ,  నమ్మక ద్రోహులు ఉంటారు.  అందుకే , అందరు క్లాస్ మేట్స్    లేదా    అందరు    పరిచయస్తులు  కూడా   స్నేహితులుగా కాలేరు … కాబోరు కూడా …. కాస్త నిశితంగా పరిశీలిస్తే , సూక్ష్మంగా  ఆలోచిస్తే  ఈ విషయంలో ఉన్న సత్యం అర్దం అవుతుంది.


• ఇంగ్లీష్ లో FRIEND అనే పదం ఉచ్ఛరించడం ద్వారా అది మంచా , చెడా అని  నిర్వచించ లేని స్థితి ఉంటుంది.  కానీ తెలుగు లో ,  స్నే”హితుడు” అని ఉచ్ఛరించడం లో నే   మధురత,  మంచి అనే సంకేతాలు  మనసు లో వెలువడుతాయి. అంటే స్నేహం,   స్నేహితుడు   అనే పదానికి భగవంతుడు ఎంత అర్దవంతమైన భాష్యం, భావం, పవిత్రత ఇచ్ఛాడో  తెలుస్తుంది. …. ఎప్పుడైనా మీలో మీరు అంతర్గతం గా గమనించి చూడండి,  నా స్నేహితుడు అని మీరు మనసు లో   ఎవరినైనా   స్మరించినా తెలియకుండా  వెంటనే  మీ పెదవుల పై   చిరునవ్వు వికసిస్తుంది.   అది సత్యమైన  స్నేహానికి  ఉన్న శక్తి.


• ఒకరిని మన స్నేహితుడు అని  అనుకోవాలన్నా లేదా  మనం ఒకరికి  స్నేహితుడు గా  ఉండాలన్నా ….

  మనసు తో   శుభ సంకల్పం,

  మాటతో   మధురత,

  కర్మతో    సహాయత …

  తప్పని సరిగా  ఈ మూడు చేయగలిగే  వారిగా   అయి ఉండాలి.


• స్నేహితుడు ఎల్లప్పుడూ మేలు కోరేవాడు  అయి ఉండాలి,  ఆ మేలు అనేది   అన్ని సమయాల్లో మధురత తో  నిండి  ఉండదు.   కొన్ని సందర్భాలలో కఠినత్వం  తో   కూడా  మేలు  ఉండవచ్చు.  ఎలా అంటే,  ఔషధం కొన్ని సార్లు  చేదు గా ఉంటుంది.  కానీ రోగం తగ్గి,  ఆరోగ్యం గా అయినప్పుడు  ఆ చేదు మందు బాగా మేలు చేసింది  అని  భావిస్తాం …. ఇకపోతే   స్నేహితుడు గా ఉంటూ ,  మేలు చేయకపోయినా ఫర్వాలేదు   కానీ    నమ్మక ద్రోహం,  వికారి తత్వాలు రుద్దడం , కీడు తలపెట్టడం,   అశుభ సంకల్పాలు కోరుకోవడం  వంటివి అసలు చేయకూడదు.


• స్నేహితుడి లో   సేవా తత్వం ఉండాలి    కానీ వ్యాపారి తత్వం  ఉండకూడదు.    వ్యాపారం లో  వేసే  లాభ నస్టాలతో   స్నేహాన్ని చూస్తే   స్నేహం పూర్తిగా  భ్రష్టు  పడుతుంది.


• మరి నేటి  జీవన కాలం లో   మనం సంతోషంగా చెప్పుకోవడానికి  మనకంటూ  అర్దవంతమైన(మంచి ) స్నేహితులు ఎందరు ఉన్నారు? …   అలాగే  మనం,  మన స్నేహితులు  అని చెప్పుకునే   వారిలో వ్యర్దవంతమైన  (ఏ ప్రయోజనం లేని)   వారు ఎందరున్నారు? ….  అదే విధంగా  మనం కూడా , ఎంతమంది కి  అర్థవంతంగా లేదా  వ్యర్ద వంతమైన స్నేహితులు గా   మిగిలి ఉన్నాం.….  ఇది  బాగా మనసు తో,  మనమే ఆలోచించు కోవలసిన విషయం.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


• మైక్ దొరికిన  సందర్భాల్లో   ఊకదంపుడు ఉపన్యాసాలు,  నీతులు,  మెట్ట వేదాంతాలు  ఎన్నో ఎన్నెన్నో చాలా  చెపుతాం.   అదే విధంగా    నిత్యం వాట్సాప్  గ్రూపుల్లో   నీతులకు  సంబంధించిన    ఫార్వర్డ్ మెసేజ్ లు,  వీడియోలు పెడుతూ  గుర్తింపు కోసం  మన ప్రతిభను  చాటుకుంటాం.  కానీ  వాటిని మనం ఎంతవరకూ స్వయం ఆచరిస్తాం  అనేది మనస్సాక్షి కే   బాగా తెలుస్తుంది.    ఎందుకంటే , నిజాయితీ తో    నీతిని ఆచరించాలి   అంటే,  చాలా చాలా మానసిక ధైర్యం,  సహనం కావాలి.  ఎవరైనా  ఈ నీతిని  ఆచరించే  సమయంలో  ప్రపంచం   అంతా ఒకవైపు గా ఉంటుంది ,   నీతి ఆచరించే వాడు మాత్రం  ఒంటరిగా  ఒక వైపు  ఉండవలసి  వస్తుంది.  కానీ  ఆ ఒంటరి వాడికే  భగవంతుడు   సత్య  స్వరూపం లో  తోడవుతాడు.   ఇది నిరూపించబడిన శాస్త్ర లిఖితం.   

దీనికి మంచి ఉదాహరణ  ....👇

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జనసేన  అధినేత  పవన్ కళ్యాణ్ విజయం.   స్వయానా తన అన్న  స్థాపించిన ప్రజారాజ్యం  పార్టీ తో పొసగక,   ఒంటరి వాడుగా దాదాపు 14 సంవత్సరాలు  నమ్మిన సిద్ధాంతం కోసం నీతి నిజాయితీ లతో  నిలబడి  నేడు డిప్యూటీ సీఎం అయ్యాడు.  గతం లో ఓడిపోయినా  ఏనాడు అధైర్య పడలేదు.  నేడు ఇతని సైద్ధాంతిక పోరాట పటిమను భారతదేశంలో  ఎన్నో యూనివర్శిటీ లలో  పొలిటికల్ కేస్ స్టడీ చేస్తున్నారు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


• నేటి కాలం మనిషి   అనేక విధములైన  అవసరాల కోసం మాత్రమే జీవిస్తున్నాడు  అనడం లో   ఏ సందేహం లేదు.   ఈ అవసరాలు  తీర్చుకోవడం  కోసం మాయ చేయడం ,   స్వార్థం,  హింస,  ఈర్ష్య, ద్వేషం,  కపట తత్వం,  అతి తెలివి వంటి వాటికి లోనై మనిషి లోని   సహజమైన  గుణాలను  కోల్పోతూ , దిగజారి పోతున్నాడా?   లేక ….

మనిషి తన  అవసరాలు  తీర్చుకునేందుకు   శ్రేష్టమైన, ఉన్నతమైన కర్మలు చేస్తూ,  శుభ చింతన తో  కూడిన కళ్యాణకరమైన  మార్గాలను  ఎంచుకొని,    సహాయకారి విధాలను ,   ధర్మాన్ని   ఆచరిస్తున్నాడా ?

 

ఇదంతా ఎందుకంటే….


• స్నేహం  అంటే  కేవలం  కాలక్షేపం కోసం అని,  శారీరక , మానసిక,   సామాజిక అవసరాలు  తీర్చుకునేందుకు మాత్రమే  అనే  ఆలోచన స్థితి కి   నేడు మనిషి   దిగజారి పోతున్నాడు .….  బదులుగా,  నేను  పేరు ఆశించకుండా  ఒకరికి   మేలు చేస్తాను,  ఒకరికి  నిస్వార్థంగా సహాయం చేస్తాను,  ఒకరి యొక్క మంచి లో   నేను భాగస్వామ్యం  అవుతాను  అని గుండెల మీద చేయి వేసుకొని  ధైర్యం గా  మనసు లో  అనుభూతి పొందే స్థితి లో నేడు ఎందరు ఉంటున్నారు ….


• అయినా …. ఈ రోజుల్లో ఇలా చాదస్తం గా ఎవరుంటారు , ఏ పని, పాటు లేని వారే ఈ విధంగా ఆలోచిస్తారు. రాయడానికి , నీతి కబుర్లు చెప్పడానికి ఈ హిత బోధలు బాగుంటాయి. అని అనుకునే మనుషులే ఎక్కువ ఉంటారు. … ఎందుకంటే సాధారణంగా బుద్ధి లో  మంచి కంటే చెడుని త్వరగా ఇముడ్చుకునే  శక్తి వేగంగా  ఎక్కువగా   మనుషుల కు ఉంటుంది.


• స్నేహితుల దినోత్సవం అంటే …. ఫ్యాషన్ కోసం, పిచ్చి,  వెర్రి చేష్టలతో  పార్టీలు చేసుకోవడం, అతిగా తినడం,  మద్యం సేవించడం,  వికృతమైన వికారి సంబంధాల కోసం వెంపర్లాడటం, స్నేహం అనే ముసుగు లో కొత్త పరిచయాలు కలుపు కోవడం కోసం ...  కాదు.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️


• కనీసం, స్నేహితుల దినోత్సవం నాడైనా , ఈ క్రింది విధంగా, ప్రతి మనిషి ఆత్మ విమర్శ చేసుకుంటూ , చెక్ చేసుకుంటే….  మనిషి లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది .

👇👇👇

1.  నా స్నేహం ద్వారా ఎవరికైనా సహాయం చేసానా ?  … చేస్తున్నానా ?

2.  నా స్నేహం ద్వారా ఎవరికైనా సంతోషం ఇచ్ఛానా? … ఇస్తున్నానా ?

3.  నా స్నేహం ద్వారా ఎవరినైనా  ఈర్ష్య, అసూయతో  బాధ  పెట్టానా …. పెడుతూ ఉన్నానా ?

4.  స్నేహం ద్వారా,  నేను సంతోషం గా  ఉన్నానా?    నా  జీవితం లో  కోల్పోయిన ఆనందాలు  దొరుకుతున్నాయా ?

5.  నేను, స్నేహాన్ని  నా స్వార్థ ప్రయోజనాల కోసం , అవసరాల కోసం  వాడుకొంటున్నానా ?

6.  నా కాలక్షేపం కోసం   ఇతరులతో   స్నేహం  చేస్తున్నానా?

7.  నా స్నేహం తో  ఎవరినైనా మోసం చేసానా ?

8.  నా స్టేటస్   గుర్తింపు కోసం  ఇతరులతో   స్నేహాన్ని కోరుకుంటున్నానా ?

9.  నా స్నేహితుల లో   ఎవరు ఎలా  ఉంటే   ఏంటి?   ఎవరు ఎలా  పోతే  ఏంటి ? …. నేను క్షేమం గా,  సంతోషంగా ఉన్నాను … అది చాలు నాకు … అనే దృక్పథం  నాలో  బలంగా  ఉందా?

10.  స్నేహం  ద్వారా  నన్ను   అందరూ  గొప్పగా కీర్తించాలి   అని తపన  పడుతున్నానా?

11.   స్నేహం అనే ముసుగు లో,  నాలో  అంతర్లీనంగా   దాగి  ఉన్న   వికారి చేష్టలు ,  తత్వాన్ని   ప్రదర్శిస్తున్నానా ?   తద్వారా  నేను  మానసిక   ఆనందం  పొందుతున్నానా ?

11.  నా స్నేహం ద్వారా  సంతోషం,  లబ్ది పొందిన వారు,  తిరిగి నాకు ఏమిస్తున్నారు ?  సంతోషమా … దుఃఖమా… వికారాలా … లేక ఏమీ ఇవ్వడం లేదా ?

12.  నేను స్నేహితుల  పట్ల  చేసిన  తప్పు కి   క్షమాపణ మనస్ఫూర్తిగా  చెపుతున్నానా  లేక   ఏదో చెప్పాలి కాబట్టి  నా అహం  దాచి   క్షమాపణలు  చెపుతున్నానా?

13.  స్నేహితుల పట్ల    నా మాట నిజాయితీ గా,   చిత్త శుద్ధి తో ఉంటుందా?  లేక  అవలీలగా   అసత్యాల తో   మాటలు మారుస్తూ   ఉంటున్నానా?

14.  వ్యతిరేక  లింగ  స్నేహితుల పట్ల,   నా మనసు లో  భావన   పవిత్రం గా,   గౌరవప్రదంగా, హుందాగా   ఉంటుందా ?


ఇవన్నీ  ప్రతీ మనిషి యొక్క స్నేహనికి  మరియు  మనస్సాక్షి  సంబంధించిన ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు.  ఇవి  కేవలం  నిజాయితీ  కలిగిన మనసు కి  తెలుస్తాయి.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️


• స్నేహం అంటే  “మంచి” … అది అన్ని మానవ సంబంధాలలో ఉంటే,  ప్రత్యేకం గా  ఇలా స్నేహితుల దినోత్సవం  అని గుర్తించు కోవలసిన స్థితి    ఏ మనిషి కి రాదు.

• కాలక్షేపం  కోసం ఎవరూ ఎవరితోనూ   స్నేహం చేయకండి,   అది ఎన్నటికీ స్నేహం కాబోదు. … కాలక్షేపం లో ముఖ్యం గా , ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తి గురించి చర్చించు కోవడం పదే పదే జరుగుతుంది . దీనిని వ్యర్దం అంటారు.   ఇది ఈ కలికాలంలో తరచూ అందరూ చేసే అతి సులభమైన , నీచమైన పాపం.   ఈ కర్మ కి  ప్రాయశ్చిత్తం కూడా ఉండదు.  ఇలా చేయడం వలన జన్మాంతరాలలో  వ్యర్థమైన  మనుషులు గా  అంటే  దేనికి పనికిరాని  వారు గా  మిగిలిపోతారు  అని శాస్త్రాల్లో  చెప్పబడింది.


• ఈ రచన మార్పు కోసం కాదు … కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే ఎవరు ఎవరిని మార్చలేరు. ఎవరికీ వారే మారాలి.

ఓం నమఃశివాయ 🙏.


ధన్యవాదములు 🙏

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఈ blog ని ఆదరిస్తున్న  తెలుగు వారందరికీ కృతజ్ఞతలు.

ఈ  blog views 44,000  ఇటీవల cross అయిన సంధర్బంగా   ప్రపంచం  నలుమూలల నుంచి  ఈ blog చదువుతున్న తెలుగు వారు ,  ఎవరో , ఏమిటో  నాకు తెలియక పోయినప్పటికీ  .... ప్రతీ ఒక్కరికీ , పేరు పేరునా  నా కృతజ్ఞతలు. 🙏 . 


                   జూలై    views 👇.


 All Time  Views 👇



యడ్ల శ్రీనివాసరావు, 3 August 2024, 10:00 pm.


 

Friday, August 2, 2024

525. ఏక్ + అంతం = ఏకాంతం

 

ఏక్ + అంతం =  ఏకాంతం



• ఏకాంతం … అంటే ఏక్ + అంతం.  ఒకటి  సమస్తం అంతం చెయ్య గలదు అని భావం.

• ఆ  ఒకటి  అంటే మనసు.  మనసు ఏకత్వం తో ఉన్నప్పుడు, అంటే దేనికి అనుసంధానం (ఎటాచ్) కాకుండా  ఉన్నప్పుడు  దేనినైనా  అంతం  చేసి విజయం  సాధించగలదు.


• మనసు ఒక కోతి.   స్థిరత్వం ఉండదు.  ఏ సమయంలో  ఏది కోరుకుంటుందో  దానికే తెలియదు. అప్పుడే ఏడుస్తుంది,  వెంటనే నవ్వుతుంది.  రకరకాల విన్యాసాలు  చేసే మనసు   ఎన్నో రకాల యాతనలు, దుఃఖాలు తెచ్చి పెట్టుకుంటుంది.  అలాగే  తాత్కాలిక సంతోషాలు, సుఖాలు కూడా తెచ్చి పెట్టుకుంటుంది.

• ఇలా మనసు పరివిధాలుగా ప్రవర్తించి … ప్రవర్తించి ఒక విధమైన డోలాయాన స్థితి కి (oscillative confusion state) చేరుకుని , నిర్ణయ శక్తి , నిశ్చయ శక్తి, కోల్పోయి దిక్కులు చూస్తుంది.


• అందువలనే  మనిషి ప్రవర్తన  ఎన్నడూ ఒకేలా స్థిరంగా ఉండదు,   క్షణ క్షణం మారిపోతుంది. మనిషి ఎన్నో జన్మ జన్మల అనుభవాలు,  అనుభూతులు అనుభవించిన  తరువాతే ,  తనకంటూ ఒక మనసు ఉంది అనే విషయం స్పష్టంగా ,  సూక్ష్మంగా గుర్తించ గలడు. … విచిత్రం ఏమిటంటే  అసలు  మనసు అంటే ఏమిటో, అవగాహన లేకుండా నే ,  తరచూ చాలా మంది మనుషులు, దుఃఖం లో ఉన్నప్పుడు  నా మనసు బాధపడింది అని అనడం వింటుంటాం.   అది దుఃఖం యొక్క ప్రభావం. … కానీ , అదే మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం  నా మనసు చాలా సంతోషంగా ఉంది  అని ఎవరూ గుర్తించ అనరు. దీనిని బట్టి తెలుసు కోవచ్చు మనిషికి అసలు మనసు పై అవగాహన ఉందా?  లేదా?  అని.


• మనిషి భూమి మీద పుట్టగానే ,  రెండు కళ్లు తో చూస్తూ,  ఈ బాహ్య ప్రపంచం లో  కనిపించే  ప్రతీదీ నిజం అనుకుంటాడు.  అందులో  భాగంగా నే ,  తాను ఒక దేహం అని నిశ్చయించుకుంటాడు .  ఎందుకంటే పైకి కనిపించేవి ఇవే కాబట్టి.   కానీ  ఆ దేహం లో భృకుటి స్థానం లో  ఆత్మ ఉంటుంది అని,  ఆ ఆత్మ లో మనసు, బుద్ధి, సంస్కారం దాగి ఉంటాయి అనే విషయం తెలుసుకోలేడు.

• మనసు  ఆలోచిస్తుంది,    బుద్ది  నిర్ణయం తీసుకుంటుంది,   సంస్కారం  కర్మ ను  ఆచరిస్తుంది. ఇవేవీ తెలియని  మనిషి ప్రాపంచిక  విషయాల లో లీనమై   జీవిస్తూ ఉంటాడు.   ఈ జీవించడం లోనే ఎన్నో భావోద్వేగాల   ఆలోచనలకు  మనసు  గురి అవుతుంది.  అందులో   ప్రముఖమైనవి  కోరికలు.

• మనిషి తన జీవనం లో   ఆలోచిస్తూ   ఆలోచిస్తూ  ఉండడం  వలన  మనసు కి  విశ్రాంతి  అనేది దొరకదు. నిద్ర పోయే  సమయం లో   దేహానికి  విశ్రాంతి దొరుకుతుంది.   కానీ  లోపల  మనసు  మాత్రం నిరంతరం   ఏదొక  ఆలోచన  చేస్తూనే ఉంటుంది.  అవి కలలు కావచ్చు,  దైనందిన  జీవితంలో ప్రభావం చూపే అంశాలు కావచ్చు.

• మరి మనసు కి కూడా విశ్రాంతి కావాలి … ఎలా? విశ్రాంతి పొందితేనే మరింత శక్తి పొందుతుంది. మనసు ని  విశ్రాంతి స్థితిలో  ఉంచగలిగేది    ధ్యాన యోగం  మాత్రమే.

• ధ్యాన యోగ  సాధన ద్వారా  మనసుకి     ఏకాంత స్థితి   ప్రాప్తిస్తుంది.  అంటే  మనసు దేని పట్ల   ఆకర్షణ, వికర్షణ  కలగకుండా  నిశ్చలమైన స్థితి  పొందుతుంది. ఈ ఏకాంతం,  ఏక్ అంతం అనేది  ఎన్నో, ఎన్నో సమస్యల్ని, అవ గుణాలను  అంతం చేస్తుంది …. అంతే కాకుండా  నిర్ణయ శక్తి,  సహన శక్తి,  ఎదుర్కొనే శక్తి,  పరిశీలన శక్తి,  సహకార శక్తి,  ఇముడ్చుకునే శక్తి, సమీకరణ శక్తి,  సంకీర్ణ శక్తి   వంటి  ఎనిమిది శక్తులను పొందుతుంది.  వీటినే అష్ట సిద్ధులు అంటారు. ఇదంతా మనసు ను  ఏకాంతంగా  చేయడం  వలన లభించే ఫలం. ….

• ఇక్కడ గమనించాల్సిన విషయం,   ఏకాంతం అంటే మనిషి ఒంటరిగా గది లో   ఉండడం ,  అరణ్యం లో కూర్చోవడం   కాదు.   ప్రాపంచిక  వ్యవహారాల లో తిరుగుతూనే ,   మనసుకు  ఏదీ   ఆకర్షితం కానివ్వకుండా ఉంచాలి.    ఏకాంతం అనే పదం పూర్తిగా మనసు సంబంధించినది.  

మనసు ఒక్కటిగా ఒక్కటే అయినప్పుడు   అన్నీ హరించ గలదు  అని అర్దం.   దీని వలన ఉపయోగం  ఏమిటి అంటే ఆత్మానందం,  విశ్వ శక్తి,  సంకల్ప బలం.


• మనిషి తన మనసును అంతర్ముఖ ప్రయాణం తోనే చదవగలడు, తెలుసుకో గలడు. దీనికి నిజాయితీ అవసరం.  ఎందుకంటే  ఒకసారి తన మనసు ను చదవడం మొదలు పెడితే ,  తనలో  ఉన్న చెడు గుణాలు,  లోపాలు స్పష్టంగా     స్పృహ కి (consciousness) కనిపిస్తాయి.  అప్పుడు వాటిని accept చేయాలి.    బయట ప్రపంచంలో  మన చెడు గుణాలు గాని, లోపాలు గాని,   ఎవరైనా గుర్తించి చెపితే వారితో వాదిస్తాం ,   అంగీకరించం.    కానీ అంతర్ముఖత లో  ఎవరితోనూ  వాదించలేం. అంగీకరించడం  అనే ప్రక్రియ  ద్వారా   మంచి మార్పు సాధ్యం అవుతుంది.

• ఒకసారి మనిషి   తన మనసు ను   అంగీకరిస్తూ చదవడం  అనే సాధన   మొదలు పెడితే  అద్బుతాలు చూడవచ్చు .… ఆఖరి కి  ఆ మనసు  ఎవరిదైనా సరే.

• ఏకాంతం అంటే   సర్వస్వం   కోల్పోవడం కాదు …. పేరుకుపోయిన  వ్యర్థాలను  త్యజించడం.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు.  2 August 2024 10:00 pm .



532. దేహము కాదిది … వేదన కాదిది

  దేహము కాదిది … వేదన కాదిది  • దేహము  కాదిది  ….  దేహము కాదిది   దహనము తో     ఎగిసే    చితి    ఇది. • వేదన   కాదిది    ....   వేదన కాదిది...