Wednesday, August 13, 2025

678. స్వీయ ప్రేమ


స్వీయ ప్రేమ


• క్షణకాలం ఆగి,   మన వైఖరిని మనం గమనించుకుంటే, స్వయాన్ని  ప్రేమించడం కన్నా సులభంగా ఇతరులను ప్రేమిస్తామని తెలుస్తుంది. 

ఈ స్వీయ-ప్రేమ లేకపోవడం అనేక రూపాల్లో కనిపిస్తుంది, ఉదాహరణకు . . .  మన శరీరాన్ని, మనసును గౌరవించకపోవడము , తప్పులకు , వైఫల్యాలకు మనల్ని మనం నిందించుకుంటూ ఉండటము , మనలోని సామర్థ్యాలను మనం తక్కువ అంచనా వేస్తూ ఉండటము. 

స్వయాన్ని ఎంత ప్రేమిస్తున్నాము అన్నదాని బట్టే మనమెంత బాగా జీవిస్తున్నాము అనేది నిర్థారితమవుతుంది .


• మీకు లోటు కలిగినప్పుడు మిమ్మల్ని మీరు కఠినంగా జడ్జ్ చేసుకుంటున్నారా ?  మీరు మంచిగా ఏదైనా చేస్తున్నప్పుడు నిజంగా మీ మనసును, హృదయాన్ని  విశాలంగా తెరచి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా ? 

లేక  . . .

మీరు విలువ ఇచ్చేవారు మీకు ప్రేమను పంచాలి అని వేచి ఉన్నారా ?  స్వీయ ప్రేమ ఒక కళ, ఇందులో మనం ప్రావీణ్యం పొందాలి.


• మనమేమిటో , మన ఆంతరిక గుణము , మన వ్యక్తిత్వము మరియు మన స్వభావం ఏమిటో అర్థం చేసుకోవడమే ప్రేమ. ఇది ఒక శక్తి, దీనిని మనం సృష్టించి ఇతరులకు కూడా ఇవ్వవచ్చు .

కానీ మనలోని  కోపం, అపరాధ భావం, భయం, నొప్పి వంటి  అప్రియమైన  భావాలు తలెత్తినప్పుడు  మనలోని ప్రేమకు మనం అడ్డుకట్ట వేసుకుంటూ నిరోధించుకుంటున్నాము. మనం ఇతరుల నుండి ప్రేమను కోరుకుంటాం ,  కానీ మనల్ని మనం తప్ప అందరూ ప్రేమించినా, మనం ఆ ప్రేమను అనుభవించలేము .


• మనం ప్రేమమూర్తులం అని గుర్తుంచు కున్నప్పుడు  ఇతరులు మనకు ప్రేమను అందించాలన్న భావనపై  ఆధారపడము .

మనల్ని మనం అంగీకరించడం , ప్రశంసించడం , ప్రేరేపించడం , మనతో మనం బేషరతుగా సఖ్యతతో ఉండటం వంటి గుణాలతో స్వీయ ప్రేమను పెంచుకోవచ్చు . మనం స్వాభావికంగానే అందమైనవారిమి , స్వయం ఉన్నతి  కోసం ఇప్పటినుండి మరింత ధ్యాస పెడదాం .


• నాకు ప్రేమ కావాలి అని ఎప్పుడూ అనకండి . మీ మనసులో వచ్చే వ్యాకరణంలోనే  మార్పు తీసుకురండి ,  అప్పుడు స్వీయ ప్రేమ సహజంగా   ప్రవహించడాన్ని   మీరు గమనిస్తారు. 

గుర్తు చేసుకోండి . . .  ఎటువంటి షరతులు , హద్దులు లేకుండా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను .  నాతో నేను చెప్పుకునే ప్రతి పదము నాలో బలాన్ని నింపుతుంది .

ప్రేమ ను ఒకరి నుంచి ఆశించే బదులు , స్వయం లో ప్రేమను ఉత్పన్నం చేసుకోవడం ,  మీ ఆత్మ స్థైర్యం , ఆత్మ విశ్వాసం  పెంచుతుంది మరియు మీరు ఎవరు అనేది  మీకు  స్పష్టం గా  తెలియవస్తుంది .  


యడ్ల శ్రీనివాసరావు 13 August 2025, 10:00 am.


Tuesday, August 12, 2025

677 . జీవ యోగం

 

జీవ యోగం


యోగమిది    అమోఘమిది

  జీవన    సౌఖ్య   సారమిది .

• రాగమిది       సరాగమిది 

  ఆశల   పల్లకి     గానమిది .


• శివుని  ధారణం     శ్వాస  సంబరం

  సజీవనం    అయిన   ప్రాణమిది .

• జ్ఞాన  దప్పికం        జీవ    చేతనం

  ఆనందపు   హేలల     గోల ఇది .


• యోగమిది     అమోఘమిది

  జీవన     సౌఖ్య   సారమిది .

• రాగమిది        ‌సరాగమిది

  ఆశల     పల్లకి     గానమిది .


• దివ్య  పరిమళం         మంచు  మధువనం

  యోగుల హృదయం    ప్రేమ  ప్రాంగణం .

• పూల  సాగరం         భ్రమర  రాగము

  నిర్మల  మనసుల     వినుల  వీక్షణం .


• యోగమిది       అమోఘమిది

  జీవన     సౌఖ్య      సారమిది .

• రాగమిది         సరాగమిది

  ఆశల     పల్లకి     గానమిది .


• వెతల   వర్ణాలు       మతిన  మూలాలు 

  వసంతం   నింపిన    కాలమిది .

• కతల   కావ్యాలు     మనసు భాసలు 

  శిశిరం      చేసిన      సమయమిది .


• యోగమిది       అమోఘమిది

  జీవన     సౌఖ్య       సారమిది .

• రాగమిది        సరాగమిది

  ఆశల     పల్లకి     గానమిది .



దప్పికము = దాహం

భ్రమరము = తుమ్మెద

వెతల = దుఃఖాల

వర్ణాలు = రంగులు

మతి = బుద్ధి

మూలాలు = సూక్ష్మాలు

శిశిరం = పొగమంచు, చల్లదనం


యడ్ల శ్రీనివాసరావు 11 Aug 2025 , 3:00 pm.


Wednesday, August 6, 2025

676. రక్త సంబంధం


రక్త సంబంధం


• మంచి సాంప్రదాయ విలువలతో  పెరిగిన రాజేష్  ఊరు విజయవాడ. తల్లి తండ్రుల తో పాటు రాజేష్ కి ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయి జీవితం లో బాగా స్థిరపడ్డారు . రాజేష్ తండ్రి , రక్త సంబంధం యెక్క విలువలు , కష్టసుఖాలు ,  ప్రాముఖ్యతను ముగ్గురు పిల్లలకు బాగా  తెలిసేలా పెంచాడు. అందువలన  అందరికీ  పెళ్లిళ్లు అయినా సరే ఆప్యాయత అనురాగాల తో ఉండేవారు . కుటుంబం అంటే ఇలా ఉండాలి, రక్త సంబంధాలు అంటే ఇలా ఉండాలి అని చూసే వారందరికీ అనిపించేది.

• రాజేష్ కి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం, మంచి సంపాదన తో పాటు అందమైన గుణవతి గల భార్య సుమతీ, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారిద్దరూ  డిగ్రీ లు చదువుతున్నారు.

  రాజేష్ ఎప్పుడూ కూడా తన ఇద్దరి పిల్లలకు  తన అన్న , చెల్లెలు తో  తాను ఎంత ఆనందంగా గొప్ప గా  పెరిగాడో వివరిస్తూ , ఒక కుటుంబం అంటే అందరిదీ ఒకే రక్తం కాబట్టి, అది మరచి పోకూడదని …. అదే విధంగా, మీరు కలిసి జీవిత కాలం ఉండాలని తన  పిల్లలు ఇద్ధరికి సందర్భానుసారంగా చెపుతూ ఉండేవాడు.

🌹🌹🌹🌹

• ఒక రోజు రాజేష్ ఆఫీస్ కి కారులో వెళుతుండగా , ఏక్సిడెంట్ అయి పెద్ద ప్రమాదం జరిగింది.  రాజేష్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అప్పటికే కోమా లోకి వెళ్లి పోయాడు. గాయాలు అయి రక్తస్రావం అయి చాలా రక్తం పోతుంది .

వెంటనే విషయం తెలుసుకున్న భార్య సుమతీ, కొడుకు, కూతురు హడావిడిగా హాస్పిటల్ కి వచ్చారు.

  డాక్టర్లు , రాజేష్ కోమా పరిస్థితి వివరించి, వెంటనే రక్తం 6 బాటిల్స్ వరకూ ఎక్కించాలని  చెప్పారు. రాజేష్ ది blood group పేరు , Bombay Blood Group ( hh ) అని చెప్పారు .

  వెంటనే  సుమతీ , కొడుకు కూతురు తాము అంతా ఒకే కుటుంబం అని మా రక్తం ఎక్కించండి అని డాక్టర్ తో చెప్పారు. వారి ముగ్గురి  రక్తం పరీక్ష  చేయించగా …

‌  భార్య సుమతి ది     A Negative

  కొడుకు ది        Ab Negative

  కూతురు ది       B Positive 

అని రిపోర్ట్స్ లో రావడం చూసి , రాజేష్ రక్తం తో తమ రక్తం తో సరిపోక దిగులు తో ఏం చేయాలో తోచక ఏడవడం మొదలు పెట్టారు.


• వెంటనే సుమతి రాజేష్ తల్లి తండ్రుల కు,  రాజేష్  అన్న , చెల్లెలు కు విషయం పూర్తిగా తెలియచేసింది. 

సుమతి మనసు లో  అనుకుంటుంది వారంతా రాజేష్ రక్త సంబంధీకులు కావున వారిలో రాజేష్ కి కావలసిన బ్లడ్ గ్రూప్ తప్పకుండా లభిస్తుందని గ్రహించింది.    వారంతా  విజయవాడ , గుంటూరు, ఏలూరు లో  నివాసం ఉండడం వలన   ఒక గంట సమయంలో నే  అందరూ ఆసుపత్రి కి  చేరుకున్నారు.

 ఆలస్యం చెయ్యకుండా రాజేష్ తల్లి , తండ్రి , అన్న , చెల్లి కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధం అయి , శాంపిల్స్  పరీక్షకి  పంపించారు.

• ఈ లోపు సుమతి అందరి దేవుళ్లకు మొక్కుతుంది . 

తన కొడుకు కూతురు రక్తం , రాజేష్ రక్తం తో మేచ్ కాకపోవడం జీర్ణించుకోలేక పోతుంది. ఎందుకంటే  తాను  బయటి కుటుంబం నుంచి వచ్చినా సరే ,  పిల్లలు రాజేష్  రక్తం పంచుకుని పుట్టిన వారే కదా అని అనుకుంటుంది.


• ఒక అరగంట  తర్వాత బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చాయి . సుమతి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది . ఆ రిపోర్ట్ లో

  రాజేష్ తల్లి ది      B Negative

  తండ్రి ది             O Positive

  అన్నయ ది        AB Type 

  చెల్లెలు ది.         A Positive

అని  ఉండే సరికి , రక్త సంబంధీకుల ఎవరి రక్తం కూడా రాజేష్ కి మేచ్ కాకపోవడం తో సుమతి ఆశలు నీరు కారాయి.


• సుమతి కంగారుగా డాక్టర్ వద్దకు వెళ్ళి విషయం చెప్పగా , డాక్టర్  ఈవిధంగా  చెపుతున్నాడు . 

రాజేష్ ది చాలా Rare Blood Group అని, ఒక లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుందని,   దాని పేరు  Bombay Blood Group hh అని ,  ఆ బ్లడ్  బయట బ్లడ్ బ్యాంకు లో  కూడా దొరకదని చెప్పాడు. 

ఆ బ్లడ్ గ్రూప్ కలిగిన మనిషి ని వెతకడం తప్పా మరో అవకాశం లేదని, సమయం కూడా చాలా తక్కువ గా ఉందని చెప్పి , చివరగా ఒక మాట డాక్టర్ చెప్పాడు . తనకు ఉన్న నెట్వర్క్ మార్గాల ద్వారా , బ్లడ్ గ్రూప్ మేచ్ అయిన వారిని వెతుకుతాను, కానీ ఖర్చు బాగా అవుతుంది. దొరికితే అదృష్టం అన్నాడు.

• సుమతి, రాజేష్ తల్లి తండ్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసేది ఏమీ లేక హాస్పిటల్ రిసెప్షన్ లో కూర్చుని ఏడుస్తున్నారు. మనసు లో భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్నారు .


🌹🌹🌹🌹

• సుమతి మాత్రం వీరందరికీ దూరంగా , హాస్పిటల్ రిసెప్షన్ హల్ లో  ఒక మూల కూర్చుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. రాజేష్ అంటే ఆమెకు ప్రాణం. రాజేష్ లేని జీవితం తాను ఊహించుకో  లేక పోతుంది.

 ఆ సమయంలో , కాస్త దూరంగా అక్కడే కూర్చుని ఉన్న ఒక 45 సంవత్సరాల స్త్రీ ,  సుమతి వైపు  చాలా సేపు నుంచి చూస్తూ గమనిస్తూ ఉంది .   

చివరికి , ఆ స్త్రీ ఉండ లేక ,  సుమతి దగ్గరకు వచ్చి  హిందీ లో ,  ఏమైంది ? ఎందుకు  ఏడుస్తున్నారు ?  అని అడిగింది. 

సుమతి ఆ కంగారు లో తనకు వచ్చీ రాని హిందీ లో జరిగిన విషయం ఆ స్త్రీ కి చెప్పింది.  వెంటనే ఆ స్త్రీ తాను రాజేష్ ను చూస్తానని అడుగగా ,  సుమతి  ICU లో ఉన్న రాజేష్ ను ఆమె కి చూపించింది . 

ఆ స్త్రీ కి, రాజేష్ ను చూడగానే ,  అకస్మాత్తుగా మనసు లో ఏదో తెలియని వైబ్రేషన్ తో కూడిన ఉద్వేగం అనిపించింది . ఆమె  రాజేష్ ను చూసి కంట్రోల్ చేసుకోలేక పోతుంది . ఆమె కి రాజేష్ తో ,  ఏ బంధుత్వం లేదు. వెంటనే ఆమె  , సుమతి తో హిందీలో నేను రక్తం ఇస్తాను,  పరీక్ష చేయించమని కోరింది.

• నర్సు ఆ ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ కి తీసుకు వెళ్లింది. 


సుమతి  అప్పుడు అడిగింది  ఆమెను, మీరు ఎవరు అని. 

ఆమె ,  రాజేష్  కుటుంబ సభ్యులు  అందరి తోను  ఇలా చెపుతుంది.

• నా పేరు ఊర్మిళ . మాది కోల్కతా. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. నాకు 20 సంవత్సరాల వయసు లో  పెళ్లి అయింది. నా పెళ్లి అయ్యే నాటికే   మా మామగారు విజయవాడ లో  బిజినెస్ చేస్తూ , ఇక్కడే సెటిల్ అయ్యారు.  కానీ నా భర్త  కోల్కతా లో బట్టల వ్యాపారం చేసేవారు. షాపు ఉంది. 

మా  పెళ్లి అయిన సంవత్సరం లోపునే , నా భర్త ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. నాకు పిల్లలు లేరు. నా భర్త చనిపోయిన నాటి నుండి, నా అత్తమామల సహకారం తో కోల్కత్తా లోని షాపు చూసుకుంటున్నాను.

 నేడు మా మామగారికి అనారోగ్యం వలన  ఈ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ఆయనను చూసేందుకు, ఇప్పుడు విజయవాడ వచ్చాను అని వివరంగా చెప్పింది.

🌹🌹🌹🌹


• ఇంతలో నర్స్  పరిగెత్తుకుంటూ వచ్చి,  ఊర్మిళ బ్లడ్ గ్రూప్ మేచ్ అయిందని, వెంటనే రక్తం తీసి  రాజేష్ కి  ఎక్కించాలని చెప్పింది . అది విన్న సుమతి కి, రాజేష్ తల్లి తండ్రులు కుటుంబ సభ్యులు అందరికీ ప్రాణం వచ్చినట్లు అయింది. వెంటనే ఊర్మిళ కి చేతులెత్తి నమస్కరించారు.

  కొంత సమయం తరువాత, ఊర్మిళ రాజేష్ కి రక్తదానం చేసి వచ్చింది. . . . అదే రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతూ, ఊర్మిళ తన కళ్లలో నీరు తుడుచుకుంటుంది . ఎందుకంటే తన భర్తకు సరిగా రాజేష్ వయసు ఉంటుంది. బ్రతికి ఉండి ఉంటే, రాజేష్ లాగే ఉండేవాడు. అని గుర్తు చేసుకుంది.

• అదే రోజు రాత్రి హాస్పిటల్ లో  సుమతి కళ్లు తుడుచుకుంటూ భగవంతుడు కి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటుంది. ఎందుకంటే ఊర్మిళ నిజం గానే  దేవత అని, తమ కోసం భగవంతుడు పంపించాడు అని .

• అదే  రోజు రాత్రి, రాజేష్ తండ్రి అంతు చిక్కని సందేహం తో సతమతం అవుతున్నాడు. రాజేష్ కి చుట్టూ ఇంత మంది రక్త సంబంధీకులు ఉన్నా సరే , ఎవరి రక్తం ఉపయోగపడలేదు , ప్రాణానికి సహయ పడలేదు . ఇక రక్త సంబంధం అనే మాట ఒక బూటకం, నాటకం . ఎవరో కనీసం తమ కుటుంబానికి   ఏ సంబంధం లేని, తమ ఊరు , కులం, గోత్రం, భాష కానీ స్త్రీ యొక్క రక్తం సరిపోవడం ఏంటి అని అర్థం కాకుండా ఒక విధమైన అర్దం కాని బాధతో నలిగి పోతున్నాడు 


🌹🌹🌹🌹🌹


• రక్త సంబంధాన్ని మించిన గొప్ప బంధం ఆత్మ బంధం అనేది  ఒకటి ఉంటుందని  ఎవరు ఎలా గ్రహించ గలరు . 

రాజేష్ తల్లి తండ్రుల కి తెలుసా ? 

రాజేష్ భార్య  సుమతి కి తెలుసా ?  

రాజేష్ అన్నాచెల్లెలు కి తెలుసా ? 

రాజేష్ పిల్లలకు తెలుసా  ? 

ఏ సంబంధం లేని  ఊర్మిళ కి తెలుసా  ?

అవును , ఊర్మిళ కి తెలుసు. అచేతనంగా ఉన్న రాజేష్ ను చూడగానే ఊర్మిళ కి మనసు లోతుల్లో నుంచి  వైబ్రేషన్  వచ్చింది . అందుకే  తాను వెంటనే ఆలోచించకుండా రక్తం ఇస్తాను అంది . 

రాజేష్, ఊర్మిళ గత జన్మల  నాడు ఉన్న ఏదో అనుబంధం  బుణం గా ఉండి పోవడం వలన,  నేడు తిరిగి ఈ బుణానుబంధ కర్మ జరిగింది . ఇదే కర్మల రహస్యం.


• ఒకే కుటుంబం లో ఒకే రక్తం పంచుకుని పుట్టిన వారు, ఒకే రక్తం యొక్క గ్రూపు ఎందుకు కలిగి ఉండడం లేదు ? మరి అటువంటప్పుడు రక్తం తో కూడిన సంబంధం , రక్త సంబంధం అనే మాట కి అసలు అర్దం ఏమిటి ?  

• ఒకే కుటుంబం లోని వారే ఒకరికి ఒకరు పరమ శత్రువులు వలే ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారు ? తల్లి తండ్రీ ,కొడుకు కూతురు, అన్నా చెల్లి , భార్య భర్త ఈ సంబంధాల మూలం, అర్దం ఏమిటి ?

• ఒకోసారి మనకు ముక్కు మొఖం తెలియని అపరిచితులు  , లేదా  కుటుంబ సభ్యులు కాని వారు , ఏ రక్త సంబంధం లేని వారు . . .  బాగా ప్రేమను చూపిస్తూ వారి స్థాయిని  మరిచి  , స్థితి కి  మించిన సహాయాలు చేసి , ఏమీ ఆశించకుండా  వారి దారిన వారు మౌనం గా  ఎందుకు  వెళ్లి పోతారు ?  ఇలా ఎందుకు జరుగుతుంది ?

ఇలాంటి వి  మన జీవితంలో  ఎప్పుడైనా జరిగాయా ?


•  ఏ బంధం  విశేషత  ఎటువంటిదో   ఆలోచించండి  . . . మేల్కొనండి .

ఏ అనుబంధం ఎవరిని ఎలా తీరం దాటిస్తుందో  ? 

• కర్మల గతి గుహ్యం  (రహస్యం) .

  అది శివుని  జ్ఞానం లో  సూక్ష్మం .


పాఠకులకు మనవి . ఈ రచన ఒక అవగాహన కోసం మాత్రమే కానీ . . .  ఎవరి బంధాలను . . . ఏ బంధాన్ని  జడ్జి చేయమని చెప్పడానికి కాదు. ఎందుకంటే,  ఏదైనా సరే స్వయం గా అనుభవం, అనుభూతి పొందినప్పుడు మాత్రమే సూక్ష్మాలు అర్దం అవుతాయి.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏 .


యడ్ల శ్రీనివాసరావు, 6 AUG 2025 2:00 pm .


Tuesday, August 5, 2025

675. దేహం - ఆత్మ


దేహం – ఆత్మ


• మనిషి మరణించిన వెంటనే , ఆత్మ శరీరం వదిలి శరీరం చుట్టూ భ్రాంతి , మోహం తో తిరుగుతూ ఉంటుంది.  దేహానికి అంత్య క్రియలు చేసిన తరువాత కూడా తాను నివసించిన ప్రాంతం , పరిసారాలను వదలలేక చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. 

13 రోజుల దిన  కర్మ కాండ క్రియలు పూర్తి అయిన తరువాత ఆత్మ  మరో  గర్భంలో లోనికి ప్రవేశించి శరీరం తీసుకోవడం జరుగుతుంది. 

ఆత్మ , తల్లి గర్భం లో ఉన్నప్పుడు  గత జన్మల స్మృతులు ,  గత జన్మలలో మిగిలి పోయిన పెండింగ్ కర్మలు ఈ జన్మలో పూర్తి చేయవలసినవి ,  అదే విధంగా గత జన్మల లో చేసిన  వికర్మలు స్పష్టం గా గుర్తు ఉంటాయి.

ఎందుకంటే మనిషి చనిపోయిన తరువాత, తన అసలు స్వరూపం తాను ఒక ఆత్మ అనే సత్యం  గ్రహిస్తాడు.

ఆత్మ కి పాపపుణ్యాలు స్పష్టం గా తెలుస్తాయి.

మరలా ఆత్మ తల్లి గర్భంలో  చేరి నూతన శరీరం లోనికి ప్రవేశించే ముందు , పరమాత్మ అయిన శివుని ని వేడుకుంటుంది, ఈ పెండింగ్ కర్మలు బుణాలు తీర్చుకునేందుకు శరీరం కావాలని ప్రాధేయపడుతుంది .  . . . తద్వారా , ఆత్మే  తన శరీరాన్ని  గత కర్మల అనుసారం స్వయం గా ఎక్కడ , ఏ గర్భం లో జన్మ తీసుకోవాలో  ఇష్టపూర్వకంగా ఎంచుకుంటుంది .

9 నెలలు తరువాత  గర్భం లోనుంచి బయటకు, ఈ మాయా లోకం లోనికి వచ్చాక సమస్తం ఆత్మ మరచి పోతుంది . తాను ఒక దేహం , మనిషి ని అనే స్పృహ తో జీవించడం ఆరంభిస్తుంది. 


• నేటి , మానవుని బంధాలు అన్నీ పూర్తి గా గత జన్మల బుణాలు . శివుని తో  అనుసంధానం అయి జ్ఞానయోగాలను  అవలంభించి , ఆచరించినపుడు ,  ప్రతీ సూక్ష్మ విషయం స్పష్టం మనో నేత్రం ద్వారా అర్దం అవుతుంది . ఇదే అంతర్ముఖ  జీవన ప్రయాణం.


• కర్మ బంధాలు బుణాల ఆటల లోనే  జీవితం అనే డ్రామా ప్రతి మనిషి కి  నడుస్తుంది . బుద్ధి శుద్ధి చేసుకోగలిగితే , ఐహిక వికారాలు వదిలి వేయడం ద్వారా ఆలోచనలలో పవిత్రత చేకూరుతుంది. అప్పుడు మాత్రమే శివుని ఆశీర్వాదం తో అంతర్దృష్టి (మనో నేత్రం , Intuition power) తెరుచుకొని, సద్గురువు యొక్క జ్ఞానం లభించి, త్రికాల సందర్శనం జరుగుతుంది.

• కానీ ఇదంతా అంత సాదా సీదాగా జరిగే విషయం కాదు. అలా అని అసాధ్యం కాదు. ఎందుకంటే ఏనాడైతే పరమాత్ము ని గురించి యదార్థం, సత్యం తెలుసుకోవడం జరుగుతుందో అప్పుడే  ఇవన్నీ సహజ సాధ్యం అవుతాయి.


• కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే , పరమాత్మ వైపు దృష్టి సారించే సమయం నుంచే మాయ ఏదొక రూపం లో ఇబ్బంది , సమస్యలను సృష్టిస్తుంది . ఎందుకంటే మనిషి నేడు జీవించేది మాయా పరిపాలన చేసే లోకం లో . మాయను విడిచి దైవం వైపు  సత్యతతో  వెళతానంటే  మాయ అంత సులభంగా అంగీకరించదు . ఎందుకంటే అనేక జన్మలు నుంచి మనిషి , మాయ తో కలిసి జీవిస్తూ ఉండడం వలన . . . కానీ మాయ ను జయించే విధానం ఎప్పటికప్పుడు స్వయం గా శివుడే , జ్ఞాన ధ్యాన యోగ సాధన ల ద్వారా తెలియచేస్తూ ఉంటాడు

ఇక్కడ గమనించవలసిన విషయం, భక్తి మార్గం లో ఉన్న వారికి  ,మాయ వలన  ఏ ఇబ్బందీ కలుగదు. ఎందుకంటే మాయ కి తెలుసు , భక్తి ద్వారా ఎవరికీ భగవత్ ముక్తి లభించదు అని .  


• ఇంతకీ మాయ ఎక్కడో ఉండదు. మనిషి బుద్ధి లో  ఆలోచనలు, బలహీనతలు రూపం లో , బుద్ధి లో ఏదొక మారుమూల నక్కి నక్కి దొంగ వలే ఉంటుంది . 

అదే విధంగా కుటుంబం, సమాజం , బంధాలు , సాంగత్యాలలో , మిత్రులు  ఇలా  ప్రతి వ్యక్తి లో ఉన్న  మాయ  ,  ఏదొక రూపం లో   దైవానికి  దగ్గర అయ్యే వారి పై  మాటలతో , చేతులతో , వికారాల తో దాడి చేస్తుంది . 

బ్రహ్మ కుమారీస్  ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం మౌంట్ అబూ, ద్వారా రాజయోగం శిక్షణ తో  జ్ఞాన యోగాలు అభ్యాసం చేస్తే ఇదంతా  తెలుస్తుంది. వారి శిక్షణా కేంద్రాలు ప్రతీ ఊరిలో ఉన్నాయి. ప్రపంచంలో 137 దేశాలలో  వేల కొలది శిక్షణా కేంద్రాలు , ప్రతీ భాష లోని వారికి అందుబాటులో ఉన్నాయి.  శివుడు విశ్వ సృష్టి కర్త.  ఈ రాజయోగ శిక్షణ ద్వారా శివుని యధార్థం , ఆత్మ పరమాత్మ జ్ఞానము , మనిషి సూక్ష్మ రహస్యాలు తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. 


• ఈ సూక్ష్మమైన విషయాలు భక్తి మార్గం లో తెలిసే అవకాశం అణువంత కూడా లేదు . ఎందుకంటే భక్తి కోరికలతో ముడి పడి ఉంటుంది. సత్యమైన జ్ఞాన మార్గం మాత్రమే ఈ సూక్ష్మం తెలియపరుస్తుంది ‌. జ్ఞానం ధ్యానం, యోగం ద్వారా కోరికలను సహజసిద్ధంగా విడిచి పెట్టడం తో (ముక్తి, జీవన్ముక్తి ) లభిస్తుంది .

• మనిషి తన జీవిత కాలం లో ముందుకు పయనిస్తూ అన్ని విధాలా ఎంతో ఎదుగుతున్నాను అని సంబరపడతాడు. ఇలా అనుకునే . . .  నేడు సమస్త మానవాళి  అన్నీ ఉన్నా సరే  అనేక సమస్యల తో దుఃఖ సాగరంలో మునిగి ఉంది . 

కాలం లో వెనక్కి పయనించి నపుడు మాత్రమే మనిషి కి తన మూలాలు తెలుస్తాయి , తద్వారా భవిష్యత్తును శ్రేష్ట కర్మల తో ఎలా ముందుకు తీసుకు వెళ్లి శుభకరం చేసుకోవచ్చో స్పష్టంగా తెలుసుకోగలడు .

• నేడు మన  సంబంధం , సంపర్కం , సాంగత్యం లోకి వచ్చిన ప్రతి మనిషికి   ప్రతి మనిషి తో ఒక బలమైన కారణం (purpose) , లెక్కాచారం (Karma Calculation and Settlement) ఉంటుంది. 

ఇది స్వయం గా తెలియచేసేది ఈశ్వరుడు , తనతో ప్రయాణం చేసి నపుడు మాత్రమే సాధ్యం అవుతుంది . ఇది శరీరానికి అతీతమైనది. ఆత్మ కు సంబంధించినది .

• శారీరక స్పృహ తో జీవించే వారికి ఇదంతా పూర్తి అస్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారికి భౌతికంగా ఉండే రెండు కనుల తో మాత్రమే బుద్ధి పని చేస్తుంది. వారి మనో నేత్రం గాఢ నిద్ర లో  అనేక జన్మలు గా మూసుకు పోయి  ఉంటుంది.


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 1 AUG 2025  10:00pm

Monday, August 4, 2025

674. వ్యర్దం లో సూక్ష్మం


వ్యర్థం లో సూక్ష్మం


• మాది హైదరాబాద్ కి 50 కి.మీ దూరం లో ఉన్న భువనగిరి. నాకు 55 సంవత్సరాలు , చిన్న కిరాణా వ్యాపారం నా జీవన ఆధారం . నాకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక, కుటుంబ సమస్యల వలన శారీరకంగా పైకి బాగానే కనిపించినా , మనసు లో మాత్రం నిరుత్సాహం గానే ఉంటున్నాను .


 నా మిత్రుడు అయిన రవీంద్ర మా ఇంటి కి కొంచెం దూరంలో ఉంటాడు. అతడు మాత్రం ఎప్పుడూ చాలా చురుకుగా , ఉత్సాహంగా ఉంటాడు. అందరినీ నవ్విస్తాడు . నాకు దిగులు గా అనిపిస్తే , రవీంద్ర తో మాట్లాడి ఆ క్షణానికి ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాను.


• ఈ మధ్య కాలంలో రోజులు గడిచే కొద్దీ నాలో, ఏదో తెలియని మానసిక బాధ ఎక్కువ అయ్యింది . నిద్ర కూడా సరిగా పట్టడం లేదు.


• ఒక రోజు ఉదయం నేను, రవీంద్ర కలిసి మా ఇద్దరికీ రావలసిన పాలసీ డబ్బులు కోసం హైదరాబాద్ లో ఉన్న LIC ఆఫీస్ కి బస్సు లో వెళ్లాం . బస్సు లో వెళ్తున్నాను కానీ , నాలో ఏదో నిరాశ , నా సమస్యలు తీరేది ఎలా అని. నా మిత్రుడు రవీంద్ర మాత్రం, బస్ లో నుంచి బయటకు చూస్తూ, నాతో కబుర్లు, చెపుతూ తాను చాలా ఉత్సాహం గా ఉన్నాడు .

 హైదరాబాద్ లో, LIC ఆఫీసు కి వెళ్ళి న తరువాత, మా పని పూర్తి అవడానికి, సుమారు నాలుగైదు గంటలు సమయం పడుతుందని , ఏదైనా పని ఉంటే చూసుకొని రమ్మని అక్కడ ఆఫీసు లో ఉద్యోగి చెప్పాడు .

 చేసేది ఏమీ లేక, ఇద్ధరం బయటకు వచ్చాం.  ఆ మహానగరం లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాం . ఇంతలో ఆఫీసు ఎదురుగా పెద్ద పార్క్ కనిపించింది. సరే, మాకు మిగిలి ఉన్న సమయం అక్కడ కాలక్షేపం చేద్దామని ఇద్దరం కలిసి ఆ పార్కు లోకి వెళ్ళాం .


 ఆ పార్క్ చాలా పెద్దది. లోపలికి వెళ్ళడానికి టికెట్ పది రూపాయలు తీసుకున్నారు. అక్కడ బాగా గుబురుగా పెరిగిన మర్రి, రావి చెట్లు , ఇంకా రక రకాల రంగులతో పూల మొక్కలు, పిల్లలు ఆడుకునే రంగుల రాట్నం, ఇంకా ఎన్నో బొమ్మలు , అడుగడుగునా చెట్లు ఉన్నాయి. నడుస్తుంటే కాలి కింద గుబురుగా పెరిగిన మెత్తటి గడ్డి ఉంది …. అదంతా చూస్తుంటే చాలా అందంగా , ఆ వాతావరణం మనసు కి ఆహ్లాదకరంగా ఉంది .

 నేను, రవీంద్ర కలిసి Lawn లో , ఒక చెట్టు కింద కూర్చున్నాం . అంత అందమైన ప్రదేశం నేను ఎప్పుడూ చూడలేదు. నేను చెప్పులు విప్పి గడ్డి లో నడిచాను , నా పాదాలకు సున్నితం గా మెత్తగా తాకుతున్న గడ్డి వలన నాలో నేను , చిన్నపిల్లాడి లా నవ్వు కుంటున్నాను. ఆగలేక , కాస్త వంగి ఆ గడ్డి ని చేతితో కాసేపు నిమిరాను. అలా ఒక గంట పోయిన తరువాత, ఆ ప్రకృతి ని ఆనందిస్తూ, ఆ చెట్టు కింద గడ్డి లో నిద్ర పోయాను .

• సుమారు రెండు గంటల తరువాత, తెలివి వచ్చింది. లేచే టప్పటికి, కొన్ని సెకన్లు పాటు నేను ఎక్కడ ఉన్నానో తెలియ లేదు. కానీ మనసు లో ఏదో నూతన ఉత్సాహం, అది నా జీవితంలో ఏనాడూ ఎరుగని ఉత్తేజంగా నాలో అనిపించింది.

 నా మిత్రుడు రవీంద్ర ఎక్కడా … అని, ఒకసారి తల తిప్పి చూస్తే …. వాడు Lawn లో నడుస్తూ చిన్న పిల్లలు తిని పడేసిన రంగు రంగుల చాక్లెట్ కాగితాలు, మెరుస్తూ ఉన్న బిస్కెట్ రేపర్ కాగితాలు ఏరుతూ , వాటిని తదేకంగా చూస్తూ తన భుజాన ఉన్న సంచిలో ఆనందం గా వేస్తున్నాడు.

• ఆహ . . . నా మిత్రుడు, ఎంత గొప్ప వాడు, Lawn లో పిల్లలు పడేసిన చెత్తను ఏరి , సంచిలో వేసుకుని శుభ్రం చేస్తున్నాడు అనుకున్నాను .

• ఇంతలో మేము LIC ఆఫీస్ కి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది . నా మిత్రుడు రవీంద్ర ఏరిన చెత్త ను , పార్క్ లో ఉన్న చెత్త డబ్బాలో వేయకుండా తనతో ఉన్న సంచిలో కూడా తీసుకురావడం గమనించి, అడిగాను. అందుకు రవీంద్ర చెప్పిన సమాధానం ఏమిటంటే . . . ఆ కాగితాలు చూస్తుంటే తనకు చాలా ఆనందంగా ఉందని, వాటిని దాచుకుంటాను అని చెప్పడం, నాకు ఆశ్చర్యం కలిగించింది.

 ఆ రోజు LIC ఆఫీస్ లో పని చూసుకుని ఇద్ధరం బస్ ఎక్కి మా ఊరు వెళ్లి పోయాం.

 అదే రోజు రాత్రి , నిద్రపోయే ముందు నాకు పార్క్ లో ప్రకృతి , నా కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆ రోజే మనస్ఫూర్తిగా హాయిగా నిద్ర పోయాను.


• నాలో ఆ రోజు నుంచి తెలియని మానసిక ఉత్సాహం మొదలైంది. నాకు ఉన్న సమస్యలు అలాగే ఉన్నా సరే, నేను ధైర్యంగా ఉండడం అలవాటైంది . నాకు ఖాళీ దొరికిన ‌సమయం లో , మా ఊరి ప్రకృతి ని చూడడం, పంట పొలాలలో తిరగడం , చెరువు గట్టు మీద మర్రి చెట్టు దగ్గర కూర్చోవడం, చెరువు లో గేదెలు ఈదుతుంటే సంతోషం పొందడం , మేకల గుంపులో వాటి అరుపులు , ఉదయాన్నే కోకిల రాగం వినడం వంటివి ఆస్వాదించడం మొదలు పెట్టాను . నేను ఇలా ఉండడం వలన , నా లోని మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గి , నా సమస్యలను క్రమేపీ మరిచిపోయి చాలా సంతోషంగా ఉంటున్నాను . మనసు లో అలజడులు అన్నీ దూరం అయిపోయాయి . ఏదో తెలియని ధైర్యం వచ్చింది.


• కొన్ని రోజుల తరువాత, నా మిత్రుడు రవీంద్ర ఇంటికి వెళ్లాను. తన గదిలోకి వెళ్ళగానే ఆశ్చర్య పోయాను. గోడల నిండా బిస్కెట్, చాక్లెట్ రేపర్స్ రకరకాల రంగుల‌ కాగితాలు అంటించి ఉన్నాయి. రవీంద్ర మంచం మీద పడుకుని వాటిని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నాడు. నన్ను చూసిన వెంటనే , గోడకు అంటించిన చెత్త కాగితాల గురించి వర్ణించడం మొదలు పెట్టాడు. నాకు నెమ్మదిగా అర్దం అయింది, తన మానసిక స్థితి దిగజారింది అని. వెంటనే, ప్రక్కకు వెళ్లి రవీంద్ర భార్య ను విషయం అడిగితే . . . ఆమె చెప్పిన సమాధానం విని నాకు చాలా సేపు ఏమీ అర్దం కాలేదు.

• రవీంద్ర గత కొన్ని రోజులుగా ఖాళీ గా ఉన్న సమయంలో రోడ్డు మీద కి వెళ్లి , ఈ వ్యర్థమైన చెత్త కాగితాలు ఏరుకొని , వాటిని శుభ్రం చేసి ఇలా గోడలకు అంటించి తరచూ తనలో తాను నవ్వు కుంటూ , మాట్లాడుకుంటున్నాడని చెప్పింది.


☘️☘️☘️☘️☘️☘️


• నాకు ఆ రోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటే సూక్ష్మంగా ఒక విషయం అర్థం అయింది. ఖాళీ గా ఉన్న సమయంలో ప్రకృతి , పచ్చదనం లో గడిపితే ఆనందం, ఆరోగ్యం లభిస్తుందని , మనకు ఉన్న మానసిక సమస్యలు సమసి పోతాయని తెలిసింది.

 అదే విధంగా మనకున్న ఖాళీ సమయం లో వ్యర్దం పట్ల ఆకర్షితమై , ఊసుపోక కాలక్షేపం కోసం వ్యర్దాన్ని ఏరుకొని పోగు చేసు కుంటే చివరికి పరిస్థితి రవీంద్ర లా దిగజారుతుందని తెలిసింది .


ఈ రచనకు మూలం 

నేటి కాలపు , జీవనం లో మనుషులు అనేకులు , ముఖ్యం గా మిత్రులం , బంధువులం , శ్రేయోభిలాషులం , ఆత్మీయులం అని పైకి అనుకుంటున్న వారు , తమ ఖాళీ సమయాలలో రవీంద్ర వలే వ్యర్దాన్ని ఏరుకొని తమ మైండ్ లో , మనసు లో సింహాసనం వేసి కూర్చోపెడుతున్నారు . ఇది ఎంత నష్టం కలిగిస్తుంది అనేది వారికి తెలియడం లేదు. జన్మ జన్మలు కూడా ఇది ఒక కుసంస్కారం అయిపోయి దుఃఖం వెంటాడుతుంది అనే విషయం గ్రహించలేకుండా ఉన్నారు .


• ఇంతకీ అసలు ఈ వ్యర్దం ( చెత్త ) యొక్క యదార్థం ఏమిటంటే . . . ఇద్దరు కలిసి పరస్పరం ఫోన్ లలో కలిసి మూడవ వ్యక్తి గురించి , గంటల తరబడి  అతడు/ఆమె  వ్యక్తిగత విషయాలు , కుటుంబ విషయాలు , ఇంకా ఉన్నవి లేనివి , తమ ఊహకు అందినవి , కొన్ని సార్లు కొందరు తమకు  ఉన్న వికారీ గుణాలు కూడా మూడవ వ్యక్తి కి ఆపాదన చేసి మాట్లాడుతూ మానసిక ఆనందం పొందుతూ , తిరిగి పది మంది కి ఆ విషయాలు ఉన్నవి లేనివి కల్పించి చెపుతూ ఉండడం నేటి సమాజంలో చాలా సహజమైన బలహీనత గా  మనుషులకు అయిపోయింది ‌.

 చివరికి ఇదొక వ్యసనం గా తయారై , కబుర్లు కి బానిసలు గా తయారై , ప్రతీ రోజు ఈ వ్యర్ద కబుర్లు మాట్లాడటం వినడం ద్వారా పాప కర్మ ను పోగు చేసుకుంటూ మానసిక రోగులు వలే అయిపోతున్నారు . చివరికి ఒక దశలో రవీంద్ర లాగే మానసికంగా అనారోగ్యం చెందుతున్నారు . ఇటువంటి వారిని మన సమీప  సాంగత్యాలలో చూసినప్పుడు జాలి కలుగుతుంది. ఎందుకంటే మన కంటి ముందు మనకు తెలిసిన వారు, తమ మానసిక స్థితి దిగజారి జీవిస్తూ ఉంటే, తరువాత కాలంలో వారు అనుభవించాల్సిన శిక్షల సూక్ష్మం , కర్మల ఫలితం అర్దం అవుతుంటే నిస్సహాయంగా , అచేతనంగా అనిపిస్తుంది.

  ఒకరికి సంబంధించిన విషయాలు మరొకరు చర్చించుకోవడం అంటే తమ మాటల ద్వారా ఇతరుల వికర్మలను  , పాపాలను తమ నెత్తిన  తలనూనె వలే  ఆనందంగా రాసుకుంటున్నారని  అర్దం . కలియుగం లో ఇది ప్రాయశ్చిత్తం లేని అతి పెద్ద పాపం అని శివుని జ్ఞానం లో ఉన్న ఈ విషయాన్ని గరుడ పురాణం లో మరియు లలితా సహస్రనామం లో కూడా స్పష్టం గా కూడా రాశారు .

  మనం ఎవరితోనైనా ఏదైనా విషయం మాట్లాడే ముందు మనం మాటను తప్పుకుండా చెక్ చేసుకోవాలి. లేదంటే మాటల ద్వారా వ్యర్దం దొర్లి పాప కర్మ కు కారణం మనమే అవుతాం.


• మాట్లాడుకునే విషయాలలో ఇతరులకు సంబంధించిన వ్యర్దం , చెడు , చెత్త కనుక ఉంటే కాల గమనంలో తమకు తామే శిక్షలు వేసుకొని అనుభవించక తప్పదు . ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.


ఒక  యధార్థ మైన మంచి ని , నలుగురి కి ఉపయోగం అవుతుంది అనిపించినపుడు తెలియ చేయడం వలన భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయి . 

ఒక  చెడు ను  చర్చించుకోవడం వలన  ఆ చెడు ను అందరూ సమానంగా  స్వీకరించి పంచుకుంటున్నారు అని అర్థం.  

ఇదే వ్యర్దం లో సూక్ష్మం.


 Draksharamam ✍️

యడ్ల శ్రీనివాసరావు 3 AUG 2025 , 3:00 PM.



Saturday, August 2, 2025

673. సౌజన్యం

 

సౌజన్యం


Image Courtesy from 

సౌజన్య (USA) 


• నా పయనం   

 సాగే   సాగరం లో  .

  నా   గమ్యం    

 చూపే   అలలు   ఆట తో .

• ఇది    ఏకాంతం   కాదు

  ఇది  ఒంటరి తనం   అసలే  కాదు .


• చూడు   చూడు . . .

  నా   నావ లోని   తెరచాప

  పిల్ల గాలి తో    పలకరిస్తుంది .

• చూడు    చూడు . . .

  ఈ   నీటి లోని   మీనాలు

  ప్రేమ తో   మీటి   పోతున్నాయి .


• నా పయనం   

  సాగే   సాగరం లో  .

  నా   గమ్యం 

  చూపే   అలలు  ఆట తో .

• ఇది   ఏకాంతం   కాదు

  ఇది  ఒంటరి తనం   అసలే   కాదు .


• రవి   తేజం     నింపెను

  నా    జీవన   భాగ్యం  లో .

  ఆ కిరణాలే   

  నా  మార్గ దర్శకం.

• దూరపు   కనుమలు   తెలిపెను

  నా   జీవన    సౌజన్యం   .

  ఆ తీరాలే   

  నా  ఆశల   హరివిల్లు .


• ఈ  ప్రకృతి   ఆలంబనం

  నా మనసు కి    స్వావలంబనం .


• నా పయనం   

  సాగే   సాగరం లో  .

  నా గమ్యం 

 చూపే   అలలు   ఆట తో .

• ఇది    ఏకాంతం   కాదు

  ఇది   ఒంటరి తనం  అసలే కాదు .


• చూడు      చూడు . . .

  నా  నావ   లోని   తెరచాప

  పిల్ల గాలి  తో    పలకరిస్తుంది .

• చూడు     చూడు . . .

  ఈ   నీటి లోని   మీనాలు

  ప్రేమ తో   మీటి   పోతున్నాయి .



మీనాల = చేపలు

కనుమలు = ఎత్తు పల్లాల కొండలు

సౌజన్యం = మంచితనం, సజ్ఞనత

ఆలంబనం = ప్రేరణ

స్వాలంబనం  = స్వయం సమృద్ధి , వ్యక్తి గత ఎదుగు దల .


యడ్ల శ్రీనివాసరావు 2 Aug 2025 , 6:00 PM.



678. స్వీయ ప్రేమ

స్వీయ ప్రేమ • క్షణకాలం ఆగి,   మన వైఖరిని మనం గమనించుకుంటే, స్వయాన్ని  ప్రేమించడం కన్నా సులభంగా ఇతరులను ప్రేమిస్తామని తెలుస్తుంది.  ఈ స్వీయ-ప...