Monday, August 4, 2025

674. వ్యర్దం లో సూక్ష్మం


వ్యర్థం లో సూక్ష్మం


• మాది హైదరాబాద్ కి 50 కి.మీ దూరం లో ఉన్న భువనగిరి. నాకు 55 సంవత్సరాలు , చిన్న కిరాణా వ్యాపారం నా జీవన ఆధారం . నాకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక, కుటుంబ సమస్యల వలన శారీరకంగా పైకి బాగానే కనిపించినా , మనసు లో మాత్రం నిరుత్సాహం గానే ఉంటున్నాను .


 నా మిత్రుడు అయిన రవీంద్ర మా ఇంటి కి కొంచెం దూరంలో ఉంటాడు. అతడు మాత్రం ఎప్పుడూ చాలా చురుకుగా , ఉత్సాహంగా ఉంటాడు. అందరినీ నవ్విస్తాడు . నాకు దిగులు గా అనిపిస్తే , రవీంద్ర తో మాట్లాడి ఆ క్షణానికి ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాను.


• ఈ మధ్య కాలంలో రోజులు గడిచే కొద్దీ నాలో, ఏదో తెలియని మానసిక బాధ ఎక్కువ అయ్యింది . నిద్ర కూడా సరిగా పట్టడం లేదు.


• ఒక రోజు ఉదయం నేను, రవీంద్ర కలిసి మా ఇద్దరికీ రావలసిన పాలసీ డబ్బులు కోసం హైదరాబాద్ లో ఉన్న LIC ఆఫీస్ కి బస్సు లో వెళ్లాం . బస్సు లో వెళ్తున్నాను కానీ , నాలో ఏదో నిరాశ , నా సమస్యలు తీరేది ఎలా అని. నా మిత్రుడు రవీంద్ర మాత్రం, బస్ లో నుంచి బయటకు చూస్తూ, నాతో కబుర్లు, చెపుతూ తాను చాలా ఉత్సాహం గా ఉన్నాడు .

 హైదరాబాద్ లో, LIC ఆఫీసు కి వెళ్ళి న తరువాత, మా పని పూర్తి అవడానికి, సుమారు నాలుగైదు గంటలు సమయం పడుతుందని , ఏదైనా పని ఉంటే చూసుకొని రమ్మని అక్కడ ఆఫీసు లో ఉద్యోగి చెప్పాడు .

 చేసేది ఏమీ లేక, ఇద్ధరం బయటకు వచ్చాం.  ఆ మహానగరం లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాం . ఇంతలో ఆఫీసు ఎదురుగా పెద్ద పార్క్ కనిపించింది. సరే, మాకు మిగిలి ఉన్న సమయం అక్కడ కాలక్షేపం చేద్దామని ఇద్దరం కలిసి ఆ పార్కు లోకి వెళ్ళాం .


 ఆ పార్క్ చాలా పెద్దది. లోపలికి వెళ్ళడానికి టికెట్ పది రూపాయలు తీసుకున్నారు. అక్కడ బాగా గుబురుగా పెరిగిన మర్రి, రావి చెట్లు , ఇంకా రక రకాల రంగులతో పూల మొక్కలు, పిల్లలు ఆడుకునే రంగుల రాట్నం, ఇంకా ఎన్నో బొమ్మలు , అడుగడుగునా చెట్లు ఉన్నాయి. నడుస్తుంటే కాలి కింద గుబురుగా పెరిగిన మెత్తటి గడ్డి ఉంది …. అదంతా చూస్తుంటే చాలా అందంగా , ఆ వాతావరణం మనసు కి ఆహ్లాదకరంగా ఉంది .

 నేను, రవీంద్ర కలిసి Lawn లో , ఒక చెట్టు కింద కూర్చున్నాం . అంత అందమైన ప్రదేశం నేను ఎప్పుడూ చూడలేదు. నేను చెప్పులు విప్పి గడ్డి లో నడిచాను , నా పాదాలకు సున్నితం గా మెత్తగా తాకుతున్న గడ్డి వలన నాలో నేను , చిన్నపిల్లాడి లా నవ్వు కుంటున్నాను. ఆగలేక , కాస్త వంగి ఆ గడ్డి ని చేతితో కాసేపు నిమిరాను. అలా ఒక గంట పోయిన తరువాత, ఆ ప్రకృతి ని ఆనందిస్తూ, ఆ చెట్టు కింద గడ్డి లో నిద్ర పోయాను .

• సుమారు రెండు గంటల తరువాత, తెలివి వచ్చింది. లేచే టప్పటికి, కొన్ని సెకన్లు పాటు నేను ఎక్కడ ఉన్నానో తెలియ లేదు. కానీ మనసు లో ఏదో నూతన ఉత్సాహం, అది నా జీవితంలో ఏనాడూ ఎరుగని ఉత్తేజంగా నాలో అనిపించింది.

 నా మిత్రుడు రవీంద్ర ఎక్కడా … అని, ఒకసారి తల తిప్పి చూస్తే …. వాడు Lawn లో నడుస్తూ చిన్న పిల్లలు తిని పడేసిన రంగు రంగుల చాక్లెట్ కాగితాలు, మెరుస్తూ ఉన్న బిస్కెట్ రేపర్ కాగితాలు ఏరుతూ , వాటిని తదేకంగా చూస్తూ తన భుజాన ఉన్న సంచిలో ఆనందం గా వేస్తున్నాడు.

• ఆహ . . . నా మిత్రుడు, ఎంత గొప్ప వాడు, Lawn లో పిల్లలు పడేసిన చెత్తను ఏరి , సంచిలో వేసుకుని శుభ్రం చేస్తున్నాడు అనుకున్నాను .

• ఇంతలో మేము LIC ఆఫీస్ కి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది . నా మిత్రుడు రవీంద్ర ఏరిన చెత్త ను , పార్క్ లో ఉన్న చెత్త డబ్బాలో వేయకుండా తనతో ఉన్న సంచిలో కూడా తీసుకురావడం గమనించి, అడిగాను. అందుకు రవీంద్ర చెప్పిన సమాధానం ఏమిటంటే . . . ఆ కాగితాలు చూస్తుంటే తనకు చాలా ఆనందంగా ఉందని, వాటిని దాచుకుంటాను అని చెప్పడం, నాకు ఆశ్చర్యం కలిగించింది.

 ఆ రోజు LIC ఆఫీస్ లో పని చూసుకుని ఇద్ధరం బస్ ఎక్కి మా ఊరు వెళ్లి పోయాం.

 అదే రోజు రాత్రి , నిద్రపోయే ముందు నాకు పార్క్ లో ప్రకృతి , నా కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆ రోజే మనస్ఫూర్తిగా హాయిగా నిద్ర పోయాను.


• నాలో ఆ రోజు నుంచి తెలియని మానసిక ఉత్సాహం మొదలైంది. నాకు ఉన్న సమస్యలు అలాగే ఉన్నా సరే, నేను ధైర్యంగా ఉండడం అలవాటైంది . నాకు ఖాళీ దొరికిన ‌సమయం లో , మా ఊరి ప్రకృతి ని చూడడం, పంట పొలాలలో తిరగడం , చెరువు గట్టు మీద మర్రి చెట్టు దగ్గర కూర్చోవడం, చెరువు లో గేదెలు ఈదుతుంటే సంతోషం పొందడం , మేకల గుంపులో వాటి అరుపులు , ఉదయాన్నే కోకిల రాగం వినడం వంటివి ఆస్వాదించడం మొదలు పెట్టాను . నేను ఇలా ఉండడం వలన , నా లోని మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గి , నా సమస్యలను క్రమేపీ మరిచిపోయి చాలా సంతోషంగా ఉంటున్నాను . మనసు లో అలజడులు అన్నీ దూరం అయిపోయాయి . ఏదో తెలియని ధైర్యం వచ్చింది.


• కొన్ని రోజుల తరువాత, నా మిత్రుడు రవీంద్ర ఇంటికి వెళ్లాను. తన గదిలోకి వెళ్ళగానే ఆశ్చర్య పోయాను. గోడల నిండా బిస్కెట్, చాక్లెట్ రేపర్స్ రకరకాల రంగుల‌ కాగితాలు అంటించి ఉన్నాయి. రవీంద్ర మంచం మీద పడుకుని వాటిని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నాడు. నన్ను చూసిన వెంటనే , గోడకు అంటించిన చెత్త కాగితాల గురించి వర్ణించడం మొదలు పెట్టాడు. నాకు నెమ్మదిగా అర్దం అయింది, తన మానసిక స్థితి దిగజారింది అని. వెంటనే, ప్రక్కకు వెళ్లి రవీంద్ర భార్య ను విషయం అడిగితే . . . ఆమె చెప్పిన సమాధానం విని నాకు చాలా సేపు ఏమీ అర్దం కాలేదు.

• రవీంద్ర గత కొన్ని రోజులుగా ఖాళీ గా ఉన్న సమయంలో రోడ్డు మీద కి వెళ్లి , ఈ వ్యర్థమైన చెత్త కాగితాలు ఏరుకొని , వాటిని శుభ్రం చేసి ఇలా గోడలకు అంటించి తరచూ తనలో తాను నవ్వు కుంటూ , మాట్లాడుకుంటున్నాడని చెప్పింది.


☘️☘️☘️☘️☘️☘️


• నాకు ఆ రోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటే సూక్ష్మంగా ఒక విషయం అర్థం అయింది. ఖాళీ గా ఉన్న సమయంలో ప్రకృతి , పచ్చదనం లో గడిపితే ఆనందం, ఆరోగ్యం లభిస్తుందని , మనకు ఉన్న మానసిక సమస్యలు సమసి పోతాయని తెలిసింది.

 అదే విధంగా మనకున్న ఖాళీ సమయం లో వ్యర్దం పట్ల ఆకర్షితమై , ఊసుపోక కాలక్షేపం కోసం వ్యర్దాన్ని ఏరుకొని పోగు చేసు కుంటే చివరికి పరిస్థితి రవీంద్ర లా దిగజారుతుందని తెలిసింది .


ఈ రచనకు మూలం 

నేటి కాలపు , జీవనం లో మనుషులు అనేకులు , ముఖ్యం గా మిత్రులం , బంధువులం , శ్రేయోభిలాషులం , ఆత్మీయులం అని పైకి అనుకుంటున్న వారు , తమ ఖాళీ సమయాలలో రవీంద్ర వలే వ్యర్దాన్ని ఏరుకొని తమ మైండ్ లో , మనసు లో సింహాసనం వేసి కూర్చోపెడుతున్నారు . ఇది ఎంత నష్టం కలిగిస్తుంది అనేది వారికి తెలియడం లేదు. జన్మ జన్మలు కూడా ఇది ఒక కుసంస్కారం అయిపోయి దుఃఖం వెంటాడుతుంది అనే విషయం గ్రహించలేకుండా ఉన్నారు .


• ఇంతకీ అసలు ఈ వ్యర్దం ( చెత్త ) యొక్క యదార్థం ఏమిటంటే . . . ఇద్దరు కలిసి పరస్పరం ఫోన్ లలో కలిసి మూడవ వ్యక్తి గురించి , గంటల తరబడి  అతడు/ఆమె  వ్యక్తిగత విషయాలు , కుటుంబ విషయాలు , ఇంకా ఉన్నవి లేనివి , తమ ఊహకు అందినవి , కొన్ని సార్లు కొందరు తమకు  ఉన్న వికారీ గుణాలు కూడా మూడవ వ్యక్తి కి ఆపాదన చేసి మాట్లాడుతూ మానసిక ఆనందం పొందుతూ , తిరిగి పది మంది కి ఆ విషయాలు ఉన్నవి లేనివి కల్పించి చెపుతూ ఉండడం నేటి సమాజంలో చాలా సహజమైన బలహీనత గా  మనుషులకు అయిపోయింది ‌.

 చివరికి ఇదొక వ్యసనం గా తయారై , కబుర్లు కి బానిసలు గా తయారై , ప్రతీ రోజు ఈ వ్యర్ద కబుర్లు మాట్లాడటం వినడం ద్వారా పాప కర్మ ను పోగు చేసుకుంటూ మానసిక రోగులు వలే అయిపోతున్నారు . చివరికి ఒక దశలో రవీంద్ర లాగే మానసికంగా అనారోగ్యం చెందుతున్నారు . ఇటువంటి వారిని మన సమీప  సాంగత్యాలలో చూసినప్పుడు జాలి కలుగుతుంది. ఎందుకంటే మన కంటి ముందు మనకు తెలిసిన వారు, తమ మానసిక స్థితి దిగజారి జీవిస్తూ ఉంటే, తరువాత కాలంలో వారు అనుభవించాల్సిన శిక్షల సూక్ష్మం , కర్మల ఫలితం అర్దం అవుతుంటే నిస్సహాయంగా , అచేతనంగా అనిపిస్తుంది.

  ఒకరికి సంబంధించిన విషయాలు మరొకరు చర్చించుకోవడం అంటే తమ మాటల ద్వారా ఇతరుల వికర్మలను  , పాపాలను తమ నెత్తిన  తలనూనె వలే  ఆనందంగా రాసుకుంటున్నారని  అర్దం . కలియుగం లో ఇది ప్రాయశ్చిత్తం లేని అతి పెద్ద పాపం అని శివుని జ్ఞానం లో ఉన్న ఈ విషయాన్ని గరుడ పురాణం లో మరియు లలితా సహస్రనామం లో కూడా స్పష్టం గా కూడా రాశారు .

  మనం ఎవరితోనైనా ఏదైనా విషయం మాట్లాడే ముందు మనం మాటను తప్పుకుండా చెక్ చేసుకోవాలి. లేదంటే మాటల ద్వారా వ్యర్దం దొర్లి పాప కర్మ కు కారణం మనమే అవుతాం.


• మాట్లాడుకునే విషయాలలో ఇతరులకు సంబంధించిన వ్యర్దం , చెడు , చెత్త కనుక ఉంటే కాల గమనంలో తమకు తామే శిక్షలు వేసుకొని అనుభవించక తప్పదు . ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.


ఒక  యధార్థ మైన మంచి ని , నలుగురి కి ఉపయోగం అవుతుంది అనిపించినపుడు తెలియ చేయడం వలన భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయి . 

ఒక  చెడు ను  చర్చించుకోవడం వలన  ఆ చెడు ను అందరూ సమానంగా  స్వీకరించి పంచుకుంటున్నారు అని అర్థం.  

ఇదే వ్యర్దం లో సూక్ష్మం.


 Draksharamam ✍️

యడ్ల శ్రీనివాసరావు 3 AUG 2025 , 3:00 PM.



No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...