Saturday, April 4, 2026

735 .మూసిన కనులు మసకబారవు

 

మూసిన కనులు మసకబారవు



• కనులు మూయడం అంటే ఒకటి నిద్ర పోవడం, రెండవది మరణించడం . ఈ రెండింటిలో జరిగే సూక్ష్మం ఒక్కటే . నిద్ర పోయినప్పుడు , మన స్పృహ నుంచి శరీరం విడుదల అయి భారం తెలియకుండా తేలికగా అవుతుంది . తిరిగి నిద్ర లేచేటప్పుటికి కొత్త శక్తి నిండుకొని శరీరం భారవంతంగా ఉంటుంది.

మరణించినపుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది . ఆత్మ శరీరం నుంచి విడుదల అయి తేలికగా అవడం జరుగుతుంది . మరణం తర్వాత సరికొత్త రూపం తో దేహం లభించి జన్మించడం జరుగుతుంది.

 ఈ రెండూ కూడా కనులు మూసికొని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కనులు మూస్తే మసకబారి చీకటి ఆవహిస్తుంది అనుకుంటాం . కానీ శక్తి పునరుత్తేజం పొందేది కనులు మూసి ఉన్నప్పుడే.

మూసిన కనులు ఎన్నడూ మసకబారవు , అంధత్వం తో ఉండవు .


• కనులు తెరిచి ఉన్నప్పుడు జరుగుతున్నది అంతా కూడా అలసట, ప్రయాస , అలజడి , అల్ప కాలిక మైన కృత్రిమ సంతోషం మరియు సుఖం. అందుకే చివరికి మనం అలసి పోతాం , ఇందులో మనం పొందే శక్తి ఏమీ లేదు.

 కనులు మూసినపుడు లభించేది ఈ భౌతిక మాయా ప్రపంచం నుండి విశ్రాంతి, విముక్తి , భార రహిత స్థితి .


• అతి ఆలోచనలు , ఆందోళనలు కలిగి ఉన్నవారు కనులు మూసినంత మాత్రన విశ్రాంతి  , నూతన శక్తి లభించదు . అది నిద్ర లేదా మరణం కావచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలు శరీరానికి అతీతంగా బుద్ధి లో, ఆత్మ లో నిరంతరం అతిగా పని చేస్తూ ఉంటాయి . అవి శరీరానికి నిరంతరం శ్రమ, ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి . అటువంటి స్థితిలో వారు పునరుత్తేజం , నూతన శక్తి ఎన్నటికీ పొందలేరు. అది నిద్ర నుండి  మేల్కొవడం  కావచ్చు లేదా మరణం పొంది తిరిగి జన్మించడం కావచ్చు .

 దీనిని జయించాలంటే ఒకటే పరిష్కారం. ధ్యానం. మనం శివుని పై మనసు లగ్నం చేసి నిత్యం ఒక నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం వలన వ్యర్ధ ఆలోచనల, అలజడులు, ఆందోళనలు క్రమేపీ తగ్గి మనసు పై నియంత్రణ కలిగి విశ్వం లో శక్తి ని (cosmic energy) తీసుకుని మన వెన్నుముక లో పొందుపరచు కోవచ్చు. మనకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు, అది కేవలం ఒక శివుని పై మాత్రమే ఎందుకు మనసు లగ్నం చేయాలి అని. అవును శివుడు మాత్రమే మానవుని కి ధ్యాన యోగం ద్వారా శక్తి ఎలా పొందవచ్చో తెలియచేశాడు. అందుకు ప్రతీకగా శంకరుడు ని ఫోటో లలో ధ్యాన స్థితిని చూపించడం జరిగింది. శివుడు ఈ విశ్వానికి జ్ఞాన ధ్యాన యోగ గురువు.


• మనం ఆహారం తీసుకోవడం ద్వారా పొందే శక్తికి పూర్తి భిన్నంగా ఈ శక్తి ఉంటుంది. దీనిని యోగశక్తి అంటారు. రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకపోయినా సరే యోగశక్తి వెన్ను లో నిల్వ ఉండడం వలన మానసికంగా శారీరకంగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎన్నో అనారోగ్యాలను , వాటికి గల కారణాలను జయించవచ్చు. నిత్యం నూతనోత్సాహం తో ఉండవచ్చు.

 అందుకే , మూసిన కనులు మసకబారవు . ఆలోచన నీ శక్తి అయినపుడు కనులు తెరిచి ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , కనులు మూసి మనో నేత్రం తో ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , సఫలత పొందే విషయం లో చాలా వ్యత్యాసం ఉంటుంది.


• ఈ భౌతిక మాయా ప్రపంచం లో నీ రెండు కళ్ళు నిన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాయి . అందుకే ఏం చేసినా, ఏం పొందినా చివరికి అశాంతి దుఃఖం వెంటాడుతూ ఉంటాయి. కలియుగంలో జన్మించిన ఏ మనిషి అతీతం ఇందుకు కాదు.

 కనులు మూసినపుడు మాత్రమే , ఏకాంత స్థితిలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి సరిచేసుకొనే అదృష్టం లభిస్తుంది.


• మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వలన రెండు రకాల ఫలితాలు ఎదురుకావచ్చు. ఒకటి మనకు జీవితాంతం తోడుండే  ఓ మిత్రుడు దొరకచ్చు . ఇంకోటి జీవితాంతం గుర్తుంచుకోదగిన  గుణపాఠం నేర్పేవాళ్ళు  దొరకవచ్చు . 

 ఈ రెండింటి కి అతీతంగా కావాలంటే మన లో ఉన్న ఆత్మను గుర్తించి , ఆత్మను గమనించినపుడు , ఆత్మ పై నమ్మకం (విశ్వాసం) ఉంచి  ఉన్నతి చేసుకున్నపుడు  . . . ఆత్మ , పరమాత్మ అయిన శివుని తో శాశ్వతంగా అనుభవ పూర్వకంగా అనుసంధానం అవుతుంది . అపుడు మన జీవితం మనకు స్పష్టం గా కనిపించడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మార్గదర్శకం అవుతుంది.

మనల్ని మనము (మనసు ను) పట్టుకోవడంలో కలిగేది అమితమైన ఆనందం , అదే ఇతరులను (మనసులను ) పట్టుకోవడం లో మిగిలేది భరించలేని నొప్పి, దుఃఖం .


• నీ లోని నీ ఆత్మ మరియు నీ పై లోకంలోని శివ పరమాత్మ , కేవలం మూసిన కనులకు మాత్రమే చైతన్య శక్తి స్వరూపం లో కనిపిస్తారు. అందుకే అన్నాను , మూసిన కనులు మసకబారవు .


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏

 యడ్ల శ్రీనివాసరావు 4 APR 2026 , 10:30 PM.


Tuesday, March 24, 2026

734. మలుపుల జీవితం

 


మలుపుల  జీవితం



• మలుపుల   జీవితం     మకరందం

  నా మలుపుల   జీవితం   మకరందం.

తలపు లన్ని     తరిగి   తరిగి

  శివుని    వలపుకి    చేరాయి .

• తపన లన్ని      తిరిగి   తిరిగి

  శివుని   కలిమి కి  చేరాయి.

  

• మలుపుల   జీవితం      మకరందం

  నా  

  మలుపుల   జీవితం   మకరందం .


• ప్రతి  మలుపు లోని    చీకటి

  ఓ  కొత్త   వెలుగు  నిచ్చింది  .

• ప్రతి  తలపు లోని     తరంగం 

  సరికొత్త    తీరం   చేరుస్తున్నాయి .


• ఆశించిన   ఆశల   కంటే

  ఆశించని    "అందల మై"

  సొంతమయ్యాడు    శివుడు .

• ఊహించిన   దారుల   కంటే

  ఊహించని    ఉన్నతులెన్నో 

  ధారణ   చేస్తున్నాడు   శివుడు .


• మలుపుల   జీవితం     మకరందం

  నా  

  మలుపుల  జీవితం    మకరందం.


• ఆట  తెలియని    

  ఈ  మనసు

  ఆడి ఆడి   అలిసింది .

• ఆడేందుకు   కాదు   

  నీ   మనసు

  అని

  ఆట కు  నిర్ణేతగా  చేశాడు  శివుడు .


• కోరుకున్న   వాటి   కంటే

  కొండంత   ఇస్తున్నాడు   శివుడు .

• ఈ ఆనందం    కొలవడానికి

  ఎన్ని   కాలాలు   పయనించాలో . 


• మలుపుల   జీవితం    మకరందం

  నా 

  మలుపుల   జీవితం   మకరందం.

• తలపు లన్ని    తరిగి తరిగి

  శివుని    వలపుకి   చేరాయి .

• తపన లన్ని    తిరిగి   తిరిగి

  శివుని    కలిమి కి   చేరాయి .


• మలుపుల    జీవితం   మకరందం

  నా 

  మలుపుల  జీవితం    మకరందం.



తలపు = ఆలోచన

తరిగి‌ = తగ్గి , కరిగి.

వలపు = అభిలాష , ప్రేమ 

తపన = ఆసక్తి ,  కోరిక , ఉత్కంఠ.

కలిమి = స్నేహం 



యడ్ల శ్రీనివాసరావు 24 March 2026 9:00 PM .


Monday, March 23, 2026

733 . నవ వసంతం

 

 నవ వసంతం 


• ఏ  సంతమిది     ఏ  వసంతమిది .

  సమిధలు    విరిసే    కాలమిది

  సమయం   చిగురించే   రాత ఇది .


• ఎగిరే   తూనిగ లు    పైరు  గాలిని

  పలకరించి   పోతున్నాయి .

• కలిగే    భావన లు     చిరు గాలి లో 

  చిలకరించి    వెళుతున్నాయి . . .

  నా పై   . . . 

  చిలకరించి     వెళుతున్నాయి.


• భావన లో       ఏముందంటే

  ఉరుము    లాంటి    సంతోషం .

• చిరుగాలి లో     ఏముందంటే

  చెప్పలేని      సంబరం .


• ఏ  సంతమిది      ఏ  వసంతమిది

  సమిధలు    విరిసే    కాలమిది

  సమయం   చిగురించే   రాత ఇది .


• పూత   పూసిన    మామిడి

  పిందె   అయిన   తరుణమిది.

• కూత    కూసిన   కోయిల

  అందె    వేసిన   సమయమిది .


• పంచభూతాల     సోయగాలు

  ప్రకృతి కి     పాదరవిందం .

• విను  వీధిన      వైభోగాలు

  ధరణి కి     దివ్యానందం .


• ఉత్సవాలు      ఉత్సాహలు

  మేళతాళాల     మేళవింపులు .

• పసిడి  పచ్చని     అందాలు

  పల్లవింపుల    పులకరింపులు . . . .

  నా    మది కే   పులకరింపులు .


• ఏ   సంతమిది     ఏ  వసంతమిది

  సమిధలు   విరిసే    కాలమిది

  సమయం   చిగురించే    రాత ఇది .


యడ్ల శ్రీనివాసరావు 23 March 2026 10:00 PM.


Sunday, March 22, 2026

732. ఋణానుబంధ రూపేణ

 

ఋణానుబంధ రూపేణ



• "మేము బాగా ఆధ్యాత్మిక సాధన, పూజలు , పుణ్యాలు చేస్తాము మాకు ఎందుకు కష్టం వచ్చింది , అనారోగ్యం వచ్చింది " అని అడుగుతారు , కానీ సూక్ష్మంగా చేసే పొరపాట్లు మరియు అనారోగ్యం తెచ్చుకోవడానికి కారణమైన ఆహారపు అలవాట్లు బుద్ధి లో స్థిరం గా  గుర్తు ఉండవు . అందుకే ఆ కర్మలను భరించడానికి కావలసిన శక్తిని భగవంతుని నుంచి కోరుకోవాలి . ఆ కర్మలను వదిలించుకోవడానికే మనం పుట్టాము  అని గుర్తు ఉంచు కోవాలి .

• మన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మన పిల్లలు , కుటుంబ పరిసరాలు , స్నేహితులు బంధువులు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము అనే విషయం ఎవరూ చెప్పకుండానే అర్థం అయిపోతుంది.

  ఎంత కష్టంలో ఉన్నా కూడా మళ్లీ తప్పులు చేయకుండా ఉంచమని భగవంతుని కోరాలి, మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడుకి  కృతజ్ఞతతో  ధన్యవాదములు తెలియచేయాలి,

• కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుని  తోడు మనం కోరాలి మరియు అలాంటి జీవితాన్ని మనం తయారుచేసుకోవాలి . అంతే కానీ , కష్టమే రాకూడదు అని అంటే , నువ్వు అంత పుణ్యం చేసి ఉండి ఉంటే నీకు ఈ కలియుగములో కష్టమైన జన్మ అనేది ఉండదు కదా...

• భూమి పైన పుట్టావు అంటే , అది కేవలం నీ ఋణం తీర్చుకోవడానికి మాత్రమే . ఎంతటి మహా యోగులైనా , మహా చక్రవర్తులైనా కర్మ భూమిలో పుట్టిన తర్వాత కష్టాలు తప్పించుకోలేరు .. అదే విధంగా దాటలేని కష్టం అంటూ ఏది లేదు. మనము ఎక్కువగా పట్టించుకుంటేనే  కష్టం , దానిగురించి ఆలోచించడం మానేసి , నేను చేయ వలసినది ఈశ్వర కర్తవ్యం అనుకొని , చేసుకుంటూ పోవాలి , అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి .

• మనలో అందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు   . . . 

గయ్యాళి భార్య నువ్వు చేసుకున్న కర్మ , 

బాధ్యత కలిగిన భర్త నువ్వు చేసిన పూజ ఫలితం ,

బిడ్డలు మీరు చేసిన ఋణాల ఫలితం , 

స్నేహితులు బంధువులు చేసిన దానాలకు ఫలితం ,

తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం , 

వృత్తి వ్యాపారం  సృష్టి లోని సర్వ ప్రాణుల పట్ల ఉండే నీవు చూపిన భూత దయకు ఫలితం .

అందుకే ఋణానుబంధ  రూపేణా కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు . ఎందుకంటే    కోపం లో   ఒక మాట అయితే తరచూ   అంటుంటాము , “నా కర్మ కొద్దీ దొరికావు” అని . అది నిజం , మనకు ఈ జన్మలో దొరికిన వారు  అన్నీ  కూడా చేసిన కర్మల అనుసారమే . చేసిన పాప కర్మలు బాధించి , పుణ్య కర్మలు రక్షించి మనకు విముక్తి కలిగిస్తాయి .

మనం గత జన్మల లో చేసిన పాపాల రూపం వీళ్ళందరి  రూపంలోనే , అలాగే చేసిన పుణ్యాల రూపం కూడా వీరి రూపంలోనే  ఉంది , అనే విషయం గ్రహించి వాళ్ళను భరించే శక్తిని భగవంతుడుని కొరుకుని  , వారిని మీ ఆధ్యాత్మిక సేవ ద్వారా, యోగ సాధన ద్వారా మళ్ళీ ఆ బంధాలను గొప్పగా మార్చుకునే రాతను అవకాశం భగవంతుడు నీకు ఎప్పుడో ఇచ్చాడు . అదే నిత్యం శివ స్మృతి తో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి .. చేతనైన సహాయం చేద్దాము ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా  చెడు ప్రచారం చేయకూడదు.. అసూయ, అహంకారం , ఈర్ష్య , కామం , క్రోధం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేద్దాము . 


 శ్లోకం !!

• ఋణానుబంధ రూపేణ ! 

  పశు పత్ని సుతాలయాః !

  ఋణక్షయే క్షయం యాంతి! 

  కా తత్ర  పరిదేవనా !! హితోపదేశం .

  పశువులు , భార్యాపుత్రాదులు  , ఇళ్లు వాకిళ్లు బంధువులు స్నేహితులు - ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి , ఋణము తీరగనే  మళ్ళీ మనుష్యుని వదలి పోతున్నాయి. అట్టి వానిని గూర్చి తెలివైన జ్ఞానులు  అర్ద సహితం గా వేల సంవత్సరాల క్రితం  విచారించారు . 

మనిషి మహాజ్ఞాని . . . అని ఉద్దేశిస్తూ చేసిన ఉపదేశం ఇది .

 పశువులు , భార్యా భర్త పుత్రులు , ఇళ్ళు వాకిళ్ళు , ధనం , బంధువులు స్నేహితులు, ఏవి పోయినా దుఃఖించటం  తగదు . జ్ఞాని అయిన మానవుడు ఎన్నడూ వీటి నుంచి దుఃఖం పొందడు - అని గీత లో చెప్పబడింది.

• ఆధ్యాత్మికత మరియు శివుని జ్ఞానం ద్వారా మానవుని యొక్క సమస్త ప్రశ్నలకు, సమస్యలకు , వికారాలకు , వివాదాలకు , అన్నిటికి చక్కటి పరిష్కారాలు శివుని రాజయోగ  విద్య ద్వారా లభించును .

• సహనం తో  సేవ , ప్రేమతో సాధన చేయడం ఆరంభిస్తే జీవితంలో సుఖ, శాంతులను పొందగలం. సుఖం శాంతి అనేవి మనిషి మరణం పొందిన తరువాత ఆత్మ  పొందవలసినవి  కానే కావు , దేహం తో మనం జీవించి ఉన్నప్పుడే మన ఆత్మ అవి పొందాలి , అనుభవించాలి , అప్పుడే ముక్తి జీవన్ముక్తి.

• శివుని కి చేరువయ్యే సమయంలో ప్రతీ సూక్ష్మం స్పష్టం . అర్దం చేయించేది శివుడు, చేసుకో వలసినది మన బుద్ధి.

చేసిన బుణం  తప్పని సరిగా  తీర్చ వలసిందే . ఆ బుణం  తిరిగి చెల్లించలేని  దుస్థితి లో  ఉన్నప్పుడు  శివ స్మృతి ఉండాలి . ఎందుకంటే బుణాలను కరిగించే వాడు శివుడు .  కరిగించే వాడే కానీ , తొలగించే వాడు కాదు . 

అంతే గానీ బుణాలను తప్పించుకొని తిరగడం అసంభవం. ఎన్ని జన్మలెత్తినా బుణాల నీడలు  జాడలు  నిన్ను అల్లుకొని , నీ చుట్టూ నే తిరుగుతూ ఉంటాయి . ఇదే జీవన సత్యం.

మనకు ఉన్న బాధ్యత యే  బుణం .

సర్వం  శివ మయం


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 . 10:30 PM.



Wednesday, March 18, 2026

731. యుగాది

 

యుగాది



• ఉగాది   ఉగాది

  యుగముకి   జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు   మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• ఈ  కాలం  లోని    సౌందర్యం

  మనసు   కోరుకునే    ఔషధం .

• ఈ  సమయం  లోని   సంతోషం

  మనిషి    అనుభవించే   ఇంధనం .


• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .

• మామిడి    చిగుళ్ళు

  మది   పచ్చదనానికి   తోరణాలు  .

• కోయిల     సవ్వళ్లు

  శ్రవణ    సొంపుల    తరంగాలు .


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే  ఆది .

• యుగములు     నాలుగైనా

  ఉగాదులు   మాత్రం    ఎన్నో . . . ఎన్నెన్నో…


• భావోద్వేగాల    సంబరం 

  షడ్రుచుల        మేళనం .

• కొత్త  ఆశల      అంబరం 

   రాశిఫలాల      రాజసం .


• పంచాంగ    శ్రవణం 

  పంచభూతాల    ఆశీర్వాదం .

• ఈ ఆచారాల    సాంప్రదాయం

  తెలుగు  సంస్కృతి     ఉల్లాసం.


• ఉగాది      ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు  మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• బుతువుల    బుణానుబంధం

  ఈ వసంతాల    వైభోగం .

• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .



ప్రపంచ వ్యాప్తంగా 

" గోదావరి గలగలలు "  బ్లాగు ను 

ఆదరిస్తున్న తెలుగు వారందరికి 

నా హృదయ పూర్వక 

కృతజ్ఞతలు 🙏

  ఉగాది శుభాకాంక్షలు 💐 .


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 , 9:00 PM.



Tuesday, March 17, 2026

730. యజ్ఞం దాహం

 

యజ్ఞం  దాహం 



ఒక ఊరిలో యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు .

అప్పుడు భార్య ఇలా చెప్పింది.

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను . అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”

ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు .

మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు . బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.


“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే  బద్దలైనా  నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.


 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు . ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు.

“మనమూ ఉమ్మేద్దాం . బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది .

అర్కసోమయాజి  ససేమిరా అన్నాడు.

చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది .

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో  లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి . మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.


అప్పుడే *కలిపురుషుడు* వారికి ఎదురు వచ్చాడు.

ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది.

అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసం చేశాను. అన్నాడు కలిపురుషుడు.

...*ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*...

ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు ...

కానీ చివరకు  *ధర్మమే గెలుస్తుంది* ...

II ధర్మో రక్షతి రక్షితః II.

పై కధ  రాసిన  రచయిత కి  మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .🙏


ప్రతి  మనిషి  ఆలోచనల తోనే  కర్మలు చేయడం ఆరంభిస్తాడు  .  ఆ ఆలోచనలే  ఒక శక్తి  అయి  తన చుట్టూ ఒక (ఆరా) వలయం వలే ఏర్పడుతుంది.   ఈ ఆలోచనలు మంచివి లేదా చెడువి  ఏవైనా అయి ఉండవచ్చు. 

ఉదాహరణకు  పాజిటివ్ ఆలొచనలు కలిగి ఉండి , ధర్మ యుక్తం గా మనిషి  కర్మలు ఆచరిస్తున్నపుడు   తనలోని ఆరా తనకు మరియు  తన చుట్టూ ఉన్న కుటుంబీకులకు , సమాజం లోని అందరికీ ఒక రక్షణ కవచం వలే ఏర్పడి , నీడ వలే ఉంటుంది . ఇక్కడ  అర్దం చేసుకో వలసిన విషయం , మంచి  అనేది   చెడు ను కూడా సంరక్షిస్తుంది.  

ఏనాడైతే మంచి అనేది  దూరం అవుతుందో , అప్పుడు చెడు స్వైరవిహారం  చేస్తుంది , పిదప చెడు తనను తానే  శిక్షించుకొని  చివరికి  భక్షించు కుంటుంది .  అదే  కలిపురుషుడు  లీల .

మంచి  అనేది  చెడుని ఆకళింపు చేసుకుని ఉండగలదు. మంచి లో ఉండేది  భగవంతుని శక్తి .  అందుకే భగవంతుడు అయిన శివుడు తారతమ్యం ఎరుగక  అందరినీ ఆదరిస్తాడు .  అందరినీ మంచి గా మార్చడానికి కావలసిన శక్తిని ధారణ చేస్తాడు .

చెడు మాత్రం  మంచి తో   కలిసి  సుధీర్ఘంగా ఉండలేదు. చెడు లో  ఉండేది అసుర శక్తి . అందుకే అసురుడు అయిన రావణుడు ,   శివుని (మంచి) చెంత  చేరినప్పటికిని  తన బుద్ధి హీనత వలన  కామాంధుడై  చివరికి శివుని (మంచి) విడిచి  పోతాడు .

మంచి కి   ,  చెడు కు   ఉన్న   భేదం  ఇదే .

మంచి చెడు అనేవి మనుషుల లో ఉండే గుణాలు మరియు  లక్షణాలు . మనుషులు ఎంచుకున్న  స్నేహాలు , సాంగత్యాల లో  కూడా ఇవి ప్రస్ఫుటంగా  కనిపిస్తాయి .  అందుకే అనుభవజ్ఞులైన పెద్దవారు  అంటారు ,  నీవు ఎలాంటి వాడివి  అనేది , నీ  స్నేహితులను , నీ సాంగత్యాలను  చూసి  చెప్పవచ్చు  అని . . . 


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 March 2026 , 8:00 PM.


Sunday, March 15, 2026

729. శకునాలు - మూఢనమ్మకాలు

 


శకునాలు - మూఢనమ్మకాలు


చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి.

కొన్ని గ్రహాలు,  ప్రదేశాలు,  సంఖ్యలు, రంగులు, వస్తువులు,  వ్యక్తులు , జీవాలు  మరియు భౌతిక శరీరాల వెలుపల ,  సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల శక్తి మరియు ప్రకంపనలు (vibrations) – దురదృష్టాన్ని  తెస్తాయని  మనం నమ్మకం కలిగి ఉండడం తో, ఆ భయం వలన బాధితులులా జీవిస్తాము .   కాబట్టి , మనం వాటి నెగెటివ్ ప్రభావానికి లోనయ్యి  మన జీవితంలో నెగెటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాము . 

చెడు శకునాలను మరియు మూఢనమ్మకాలపై నమ్మకం మన మనస్సులలో అనాది నుంచి చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి . అదే మన బలహీనత అని గ్రహించలేని స్థితి తో  నేడు  జీవిస్తున్నాము .  కొన్ని వస్తువులను లేదా సంఘటనలను అదృష్టం లేదా దురదృష్టంతో కనెక్ట్ చేయడం వల్ల మనకు సహజంగా  ఉన్న  స్థితి , పరిస్థితుల కంటే కూడా అది మనల్ని బలహీనంగా తయారు చేస్తుంది. ఇది సత్యం.


1. మీ మూఢనమ్మకాలను  సవాలు చేస్తే అవి మీ మనస్సులో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. గ్రహల కదలికలు,  వస్తువులు,  పరిస్థితులు, తమ శక్తిని ప్రసరింపజేస్తాయి . అదే విధంగా మనుషులు కూడా తమ ఆలోచనల ద్వారా శక్తి ని ప్రకంపనల (vibrations) రూపేణా విడుదల చేస్తారు , ఇది వాస్తవం.  

కానీ , ఇతర బాహ్య ప్రభావం నుంచి రిలీజ్ అయ్యే శక్తుల కంటే   , మీ  జీవితంపై మీ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన మనస్సును  దృఢం గా ఉంచుకునే అభ్యాసం చేయాలి.


2. మీ ఆలోచనలు మీ భావాలుగా మారుతాయి. మీ భావాలు  మీ వైఖరిని ఏర్పరుస్తాయి . మీ వైఖరి కార్యరూపం దాల్చుతుంది. పదే పదే చేసే కర్మలు అలవాటుగా మారతాయి. మీ అలవాట్లన్నీ  కలిసి, మీ వ్యక్తిత్వం గా  తయారు అవుతుంది . మీ వ్యక్తిత్వం మీ అదృష్టాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, మీ ఆలోచనలు మీ అదృష్టాన్ని సృష్టిస్తాయి.


3. మీ ఆలోచనలు నెగెటివ్ గా, బలహీనంగా ఉంటే, బాహ్య శక్తులు మీ ఆలోచనలను మరియు ఫలితంగా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. 

మీ ఆలోచనలు స్వచ్ఛంగా, పాజిటివ్ గా , శక్తిశాలి వైబ్రేషన్స్ కలిగి ఉంటే, బాహ్య అంశాలు మీ అదృష్టం పై ప్రభావం చూపవు. మీ లో ఉన్న నెగెటివ్ భావాలు (మైనస్ “-“) ఆలోచనలను మొదట మీ  మనసు అంగీకరించ గలిగాలి. అంగీకరించినపుడు మనసు మొదట నిర్లిప్తత  శూన్యం (జీరో  “0” ) దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తుంది . శూన్యం నుంచి పాజిటివ్ భావాలు ( ప్లస్   “ + ” ) , ఆలోచనలతో ఎదుగుదల జరుగుతుంది  మరియు అదృష్టం తయారవుతుంది .

4. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు భాషా పదాలతో మీరు చేసే పనులను ఆశీర్వదించండి. మీ స్వంత భావోద్వేగ  ఫిట్ నెస్ , సంకల్పం, క్రమశిక్షణ మరియు పాజిటివ్ ఆధ్యాత్మిక ప్రయత్నాలు కావలసిన అదృష్టాన్ని మీ కోసం సృష్టిస్తాయి.

5. మెడిటేషన్ ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వండి మరియు మీ మైండ్ వైబ్రేషనల్  ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. శక్తిశాలి వైబ్రేషన్స్ తో , మీరు మీ మనస్సుకు యజమానిగా, మీ జీవితం మరియు పరిస్థితులపై మాస్టర్ అవుతారు. చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల భయాన్ని అధిగమిస్తారు . ఆనందం గా జీవిస్తారు. అందరికీ ఆనందం పంచుతారు .


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 15 March 2026 , 9:30 PM.


Saturday, March 14, 2026

728. అభిప్రాయాలు - ఇసుక రాతలు

 

అభిప్రాయాలు - ఇసుక రాతలు



• సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని రాశాడు.

• కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం గొప్ప దాత అని రాశాడు.

• ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి అని రాసింది.

• ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను అని రాశాడు.

• అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు... ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వీలయితే వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.

• ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని కొంత మేరకు మాత్రమే ఆలోచించండి. అందులో కొన్ని సార్లు మన పొరపాట్లు ఉండవచ్చు. పొరపాట్లు ఉంటే సరిచేసుకోవడం , లేకపోతే కర్మ బుణం (Karmic debt) తీరిపోయింది అని భావించి ముందుకు అడుగు వేయండి.

• నిజాయితీగా , అంతరాత్మతో ఈశ్వరుణ్ణి తోడుగా చేసుకోండి . వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 14 March 2026 , 8:00 PM.


Tuesday, March 3, 2026

727. होली

 

  होली



• హోలీ అంటే హిందీలో జరిగిందేదో జరిగింది అని అర్దం. హోలీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో ఒక విశిష్టత కలిగిన పండుగ. మనుష్యులు అందరూ రంగులు పూసుకుని ఆనందడోలికల్లో తేలియాడడం ప్రధానం గా అందరం బయటకు చూస్తుంటాం.

• కానీ ఈ పండుగ మూల సారాంశం లో నేటి మనిషి యొక్క సామాజిక జీవనంలో శ్రేయస్సు కోసం , మానసిక ఆనందం, పరిపక్వత తో కూడిన రహస్యం ఇమిడి ఉంది.

• మనిషి పుట్టుక నుంచి మరణం వరకు బంధాలు అనుబంధాలు బంధుత్వాల తో జరిగే ప్రయాణం లో తోటి వ్యక్తుల తో  కొన్ని సార్లు సానుకూలంగా, కొన్ని సార్లు సమస్యాత్మకంగా ,  కొన్ని సార్లు ఆనందం భరితంగా ఉంటుంది.

• ఏ మనిషి అయినా తోటి వ్యక్తుల తో ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలని ఆశిస్తాడు. స్వభావ సంస్కారాలు , పరిస్ధితుల రీత్యా కొన్ని సార్లు కొంత కాలం  మరియు కొన్ని సార్లు   పూర్తి జీవితకాలం వ్యక్తుల  మధ్య సమస్యలు ,  వైరాలు సృష్టించబడతాయి. వీటికి కారణం కూడా మనుషులే . దీని వలన ఒక మనిషి లో లేదా మనుషుల మధ్య అశాంతి  నెలకొని మానవ సంబంధాలు పూర్తిగా దుర్భరంగా తయారవుతాయి . కాలక్రమేణా ఇది హింసకు  లేదా మానసిక రుగ్మతలకు ప్రేరణ అవుతుంది.

 నేడు సమాజంలో పూర్తిగా వంద శాతం జరుగుతున్నది ఇదే .

• అయితే , నేటి పరిస్థితులు ఎలా ఉన్నా నాటి పరిస్థితుల వలన జరిగిందేదో జరిగింది అని , మనిషి అన్నీ విడిచి పెట్టి  మరచి పోయి  జీవితానికి ఆనందం , శాంతి, సుఖం, ప్రేమ, సత్యత, సఖ్యత , శక్తి అనే గుణాలను కొత్త రంగులు  పూసుకుని , అవి ఇతరుల పై జల్లుతూ సంతోషం అనే మిఠాయి తింటూ తినిపించుకుంటూ  పంచు కోవడమే హోలీ పండుగ సూక్ష్మ రహస్యం  .

• ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించడం లో అర్దం , సమస్యలకు కారణం అయిన నా పాత ఆలోచనలను విడిచి పెట్టాను . నేడు నా మనసు తెల్లగా స్వచ్చం గా ఉంది అని అర్దం. ఒకవేళ ఇంకా ఏమైనా మనసు లో చిన్న చిన్న లోపాలు , మరకలు వలే నాలో ఉన్నా సరే , వాటి పై నేడు పూస్తున్న రంగులతో ఆవి కనుమరుగయి …. నేను సంతోషం అనే మిఠాయి తింటూ , అందరికీ సంతోషం అనే  మిఠాయి పంచుతూ ఉంటాను  అనే సంకేతం ఇమిడి  ఉంది.

• ఇదే మనం హోలీ పండుగ మనకు తెలియ చేసే ముఖ్యమైన సందేశం .

• ఇంగ్లీష్ లో Holy అంటే పవిత్రం. మన మనసు ను పవిత్రం గా తయారు చేసుకుంటూ , అందరి మనసులను పవిత్రంగా తయారు చేయడమే హోలీ.

• హోలీ పండుగ పౌర్ణమి రోజున వస్తుంది. చంద్రుడు యొక్క విశ్వ శక్తి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనసు , మెదడు ఆలోచనలపై పూర్తి ప్రభావం చూపుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడి నిండు వెలుగు వలే , మన మనసు నిత్యం వెలుగుతూ ఉండాలి అని  శుభ సూచకంగా హోలీ ని  ఆ రోజు జరుపుకుంటారు.

• నా భారత దేశం చాలా గొప్పది. అడుగడుగునా మనిషి ఎలా బ్రతకాలో సంస్కృతి లో పండుగలు సాంప్రదాయాల రూపం లో మనందరికీ నేర్పుతూ నే ఉంది. కానీ దరిద్రం, దురదృష్టకరం ఏంటంటే మాయా బలహీనతలకు వశం అయి , వీటి సూక్ష్మం గ్రహించలేక పాశ్చాత్య పోకడలకు దాసోహం అవుతూ మనకు మనమే స్వయంగా ఊబిలో కూరుకుపోతూ  బలిహరం అవుతున్నాం.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 4 March 2026 . 7:00 AM.


Saturday, February 28, 2026

726 . సత్యం

 

సత్యం



• భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా  కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎందుకంటే భగవంతుడు అంటే నే సత్యం కాబట్టి.

  అదే  “సత్యం శివం సుందరం”.

  ఈ సత్యం తెలుస్తూ , అనుభవం అవుతూ , ఆచరిస్తూ ఉన్నప్పుడు , తొలి దశలో మన లో లోపల అనాది గా   దాగి  ఉన్న అసత్యాలు మనకు తెలియడం ప్రారంభం అవుతుంది , ఆ తరువాత వాటిని  నిర్మూలించడం ఆరంభిస్తుంది . దీనినే పరివర్తన దశ అంటారు. అనగా మనలో మార్పు సంభవించే  కాలం అని అర్థం. ఈ సమయంలో మన మనసు ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ , ఇటు అంతరంగం లోను అటు బాహ్య ప్రపంచంతోను ఘర్షణ పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది.

• ఎందుకంటే ఎన్నో జన్మలు గా మన బుద్ధి అనేక అసత్యాలు కు  నెలవు గా  అయిపోయింది . మన ఆత్మ లో  పేరుకు పోయి ఉన్న అసత్యాలు , వాటితో కూడిన నమ్మకాలు మార్పు చెందుతూ ఉన్న దశలో మనసు లో అంతర్గతం గా  ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఈ దశలో  అంతర్గతంగా నే కాకుండా బాహ్య ప్రపంచం లో ముడిపడి ఉన్న వారితో కూడా తప్పని సరిగా అలజడులు తో కూడిన ఒక యుద్దం మనసు చేస్తుంది . ఎందుకంటే , బుద్ధి లో అలవాటు అయిపోయి ఉన్న అసత్యం బయటకు వెళ్లి , అందులో సత్యం ఆచరణ కోసం నిండాలి అంటే పోరాటం, ఘర్షణ అనేది మనసు కి సహజంగా ఎదుర్కొంటుంది .

• మనం  ఎప్పుడైతే   సత్యం తో  మెలగడం ఆరంభిస్తామో  , అప్పటి వరకూ  మనతో కలిసి మెలిసి ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంటా బయటా మనల్ని ఒక శత్రువు గా భావించడం మొదలు పెడతారు . చెప్పాలంటే ఇది వారి యొక్క తప్పు కూడా కాదు. వారికి లేని అవగాహన, అతీతమైన మార్పు నీ లో సంభవిస్తుంది అంటే అది చూసిన వారు మొదట నిన్ను  అర్దం చేసుకోలేరు , గ్రహించ లేరు . అలా అని వారి వలే ప్రవర్తించడం నీకు  సాధ్యం కాదు .

• దీనికి కారణం, ఏనాడైతే నీవు భగవంతుడి ధ్యాస లో ఉంటూ సత్యం మాట్లాడుతూ ఉంటావో , అది నీ చుట్టూ దగ్గర గా  ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో తమను కించ పరస్తున్నట్లు  భావిస్తారు. దానికి కారణం  వారిలో  కొలువై ఉన్న  అసత్యం . 

కానీ కాలక్రమేణా , నీ లోని సత్యతను ,   సత్యం యొక్క శక్తిని అందరికీ  అర్దం అవుతుంది . ఎందుకంటే సత్యం ఒక నిప్పు , నీ లో మలిన గుణాలను దహిస్తూ భగవంతుని వైపు తీసుకెళ్తూనే, ఆ నిప్పు జ్యోతి వలే ప్రకాశిస్తూ నీ చుట్టూ ఉన్న అందరికీ  వెలుగు అవుతుంది .

 సత్యాన్ని చెప్పడం , రాయడం కంటే, ఆచరించడం లోనే అద్భుతమైన అనుభవం జరుగుతుంది .

అదే  " సత్యమేవ జయతే "  .


• వాస్తవానికి సత్యం , సత్యమైన విషయాలు , నిజాలు అనేవి ప్రతి మనిషి కి తెలిసినవే . బాల్యం లో పాఠశాల  విద్యాభ్యాసం లో  ఎన్నో సత్య వాక్యాలు   కాపీ రైటింగ్ పుస్తకాల లో  నిత్యం పలుమార్లు  రాయడం ,  చదవడం జరిగేది . ఉదాహరణకు . . . తల్లి తండ్రులను ప్రేమించవలెను , గురువులను గౌరవించవలెను, ఈర్ష్య ద్వేషాలు ఉండరాదు , కామ క్రోధాలు మహా శత్రువులు , అబద్ధం మాట్లాడ రాదు , ఐకమత్యమే మహా బలం , అందరితో సఖ్యతగా ఉండుము , కలిసి ఉంటే కలదు సుఖం , భగవంతుని యందు భక్తి కలిగి ఉండుము , శత్రువులను ప్రేమించుము , సొంత లాభం కొంత మానుకో , ఆరోగ్యమే మహా భాగ్యం , పొరుగు వారికి సహాయం చేయుము , మంచి అలవాట్లు పాటించుము ….. ఇలా ఎన్నో, ఎన్నెన్నో లెక్కలేనన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ , నేడు అవి గుర్తు ఉన్నాయా ? అంటే అవును గుర్తు ఉన్నాయి .  కానీ , వాటిని ఆచరిస్తున్నామా ? అనేది  ఒక ప్రశ్నార్ధకం .

 ఎందుకంటే నేడు మనం బాల్యం లో లేము కదా అనేది సమాధానం కావచ్చు . లేదా ఇవి వ్రాయడానికి చదవడానికి మాత్రమే బాగుంటాయి కాని జీవితం లో  ఆచరించడం కష్టం అనిపించవచ్చు .

కానీ , ఆనాటి  బాల్యం లో నేర్చుకున్న పాఠాలు మనసు లో  దృఢం గా  ఉంటేనే , వాటిని సజావుగా అంగీకరిస్తూ ఆచరిస్తే నే  కౌమారం , యవనం  , వృద్ధాప్యం  ఉన్నతంగా ఆనందం గా , ఏ  సమస్యలు  కొని  తెచ్చు కోకుండా   నడుస్తాయి  అనే విషయం బహుశా మన బుద్ధి ఏనాడో మరచి పోయింది .

• ఎందుకంటే నేటి మాయా ప్రపంచం లో మనం చాలా బిజీ . . .  గజిబిజి . మనకు మనం మన ఆధీనంలోనే (కంట్రోల్) లేని విచిత్రమైన స్థితులతో జీవితం జీవనం సాగిస్తున్నాము . భౌతిక పరిస్థితులు మనపైనే ఆధిపత్యం (డామినేట్) చేస్తున్నాయి . అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా  , తెలియని ఆందోళనలతో , సమస్యలను నెమరు వేసుకుంటూ జీవించ వలసి  వస్తుంది.

 ఇది మన అభివృద్ధా ? లేక పతనమా ? అని ఆత్మ విమర్శ చేసుకునే సమయం కూడా నేడు లేదు .

• మనం పుట్టినప్పుడు భగవంతుని తోడు తో నే పుట్టాం , అందుకే పసి వయసులో నిద్రలో నవ్వుతూ ఆయనతో ఆడుకుంటూ ఉంటాం . ఊహా వస్తూ ఎదుగుతూ , మనలో మాయ ప్రవేశిస్తూ ఉండడం తోనే ఆయన్ను ఒక రాతి విగ్రహం గానే చూడడం ఆరంభించాం . మన మనసు లో నుంచి ఆయన్ను బయటకు పంపించి, మాయకు పెద్ద సింహాసనం వేశాం . అందుకే , మన లో లో ఉండవలసిన భగవంతుడు నేడు ఎక్కడో కొండలపైన ఉన్నాడు . అదే విధంగా మన, లో లో ఉండవలసిన సత్యం మనల్ని విడిచి ఎక్కడికో పోయింది .


నిజానంద స్వరూపం శివోహం శివోహం 


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 28 Feb 2026 , 11:00 PM .


Thursday, February 26, 2026

725 . మనశ్శుద్ధి – మనశ్శాంతి

 

మనశ్శుద్ధి – మనశ్శాంతి



• మనసు శుద్ధి గా ఉన్నప్పుడు మనస్సాక్షి అనేది జాగృతం (activate) అయి నిరంతరం మన ఆలోచనలను చర్యలను సరియైన దిశగా విశ్లేషణ చేస్తుంది . ముఖ్యంగా మానవ సంబంధాలలో , బంధుత్వాల లో , ప్రేమికులలో , ఒకరికి ఒకరు సత్సంబంధం కొనసాగాలి అంటే మనశ్శుద్ధి ప్రధానం . అప్పుడే మన మనసు సాక్షి భూతమై జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని యధాతథంగా రికార్డ్ చేసి పొందుపరచి , అవసరమైన సమయంలో మన మనసు కి గా సాక్ష్యం గా చూపిస్తుంది. దీని వలన మన బుద్ధి ద్వారా చేసి మరచి పోయిన పొరపాట్లు గాని , సంఘటనలను కానీ తిరిగి సరి చేసుకునేందుకు దోహదం అవుతుంది.

• మనసు లో శుద్ది లేనిదే , శుద్ధి జరగనిదే ఒక మనసు మరొక మనసు తో కలవదు  కలవలేదు . ఒకవేళ కలిసినట్లు పైకి అనిపించినా , అది కేవలం మాటల వరకు లేదా శరీరం వరకు లేదా అవసరాల వరకు పరిమితం అవుతుంది . మానసిక మైత్రి అనేది ఇరువైపులా ఉండక పోవడం వలన ఎన్నో మానవ బంధాలకు పునాది వంటి ప్రేమ కేవలం మాటలకు , ఆకర్షణలకు పరిమితం అయి సుధీర్ఘంగా ఉండలేక , తక్కువ కాలంలోనే ఆ బంధం సమసిపోతుంది .

• ఈ ప్రపంచంలో అనేకులు మాటలతో ఉంటారు , మాటలకు పరిమితం అవుతారు అంతకు మించిన సహయ సహకారాలు ఇతరుల అవసరార్థం పంచవలసి నపుడు మాత్రం చేయలేరు . ఎందుకంటే తమ ఆలోచన లలో స్వార్దం, భయం, అంతర్గత గుణాలకు సంబంధించిన సమస్యల వలన మనసు సహకరించక కేవలం పై పై మాటల వరకే పరిమితం అవుతారు , కానీ చేతల వరకు చేయలేరు . కనీసం మానసిక  ప్రేమ ను  కూడా ఇతరులకు పంచలేరు సరికదా తిరిగి తమకు కావాలని ఆశిస్తారు . శుద్ధి గా మనసు ఉంటే ప్రేమను ఎన్ని మనసుల కైనా పంచవచ్చు .(ప్రేమ అంటే  కామం శృంగారం కాదు.) ప్రేమ అంటే  సంతోషం , స్వచ్చత , త్యాగం .


• మనసు ఎటువంటి అలజడులు లేకుండా శాంతిని పొందాలంటే ఏకాంతం లో  ఒంటరిగా  ఉన్నంతలో సాధ్యం కాదు. ఉన్న సంభంద బాంధవ్యాల పట్ల మన బాధ్యత ను నిర్వర్తిస్తూ , ఆ సమయంలో చేసే కర్మల పట్ల  యోగి గా  ఉండాలి . అంటే నేను నా ధర్మం  నిర్వర్తించాను అనే  భావన, స్పృహ ఉండాలి తప్ప, మన  మనసు ను ఆ బాధ్యతలతో కూడిన కర్మలతో పాటు విలీనం కానివ్వు కూడదు. ఇది మన ఆలోచనలను అలజడులకు గురి చేస్తుంది. అలజడుల తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు క్రమబద్దీకరణ చేసుకోవాలి .


• మనసు కి శాంతి లభించాలంటే కర్మయోగ స్థితి అభ్యాసం ముఖ్యం. అన్ని కర్మలు చేస్తూ మనసు ను దేనికి వశం కానివ్వకుండా, అతీతంగా ఉంచుకోవడం. ఇదే మనసు శుద్ధి కి , శాంతి కి తారక మంత్రం.

• మనసు శుద్ధి ఉంటే , చేసిన చేస్తున్న, చేయబోతున్న ప్రతీ కర్మ సత్కర్మ అవుతుంది. తద్వారా కాలం ఎటువంటి విఘ్నాలను మనకు కలుగ చేయదు. దీని వలన నిత్యం మనసు కి శాంతి లభిస్తుంది.

• మనశ్శుద్ధి లేనిదే మనశ్శాంతి లభించదు. శుద్ధి లోనే శాంతి ఉంటుంది.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2026 10:00 PM.


Sunday, February 22, 2026

724. వృషభం - శివం

 

వృషభం - శివం



• శివుని ధ్యానించడం లో అత్యంత ప్రీతికరమైన విషయం ఏమిటంటే   ప్రకృతి మరియు పశు పక్షాదుల సమజీవన సమతుల్యత నిండి ఉండటం. మనం శివుని గురించి తెలుసుకోగలిగితే  ఆయన ప్రకృతిలో ప్రతి జీవితో  తన అనుబంధం ఎంతగా ముడిపడి ఉంటుందో  అర్థం అవుతుంది .

• శివ గణములలో  ప్రప్రథమైనది  ప్రమథ గణము అయినటువంటిది  "నంది". నంది అంటే వృషభం . వృషభం అంటే ఎద్దు .  ఎద్దు పరమశివుడి వాహనంగా  అభివర్ణిస్తాం . 

ఒక్క సారి ఊహించుకోండి ఒంగోలు జాతి ఎద్దులను, పెద్ద పెద్ద శరీరాలతో పొడువాటి కొమ్ములతో బలమైన కాళ్ళతో నిండుగా ఉండే మోపురాలతో నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆ గిట్టలు  నుండి వచ్చే లయబద్దమైన శబ్దాలు , ప్రశాంతమైన చూపు ఇవన్నీ కలబోసి ఒక చిన్నపాటి కొండ కదులుతున్నట్టుగా  అనిపిస్తుంది కదూ ! . ఎంతో శక్తి ఉన్నప్పటికీ  ఓర్పు నేర్పు  సహనం   మౌనం లో   ధృడ శాలి  వృషభం .

 మహా దేవుడుకి  రక్షణ వలయం లాగ నందులు చుట్టూ కాపలాకాస్తూ  ఆయనకు వాహనమై  శివుని సేవలో తరించిపోతూ  ఉంటాయి.

  శివాలయములో  లింగ దర్శనానంతరం  నందిని ముట్టనిదే  మనసుకు ఆనందం ఎక్కడిది. చూసారో లేదో ఆయన శివుడి ముందే కూర్చొని నిత్యం శివుని చూస్తూ కాపలా కాస్తూ ఉంటాడు.


• ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే నంది శివుని చూడటం కాదు , శివుడే నందిని చూస్తూ తనను నమ్మిన  అమాయకమైన  ప్రాణిని  చూస్తూ పరవశించిపోతుంటాడు .

• నంది శివుని వాహనం అయితే , నంది మరియు శివుడు మనవైపు చూస్తున్నట్లుగా ఉండాలి కదా ! . మిగతా అందరు దేవుళ్ళకు అందరూ తాము ఆసీనలైన వాహకాల తో  మనల్ని చూస్తున్నట్లు దర్శనం ఇస్తుంటాయి .  కానీ నంది విషయంలో శివుడు , నంది పరస్పరం  ఎదురెదురు ముఖాముఖిగా  ఉండడం లోని ప్రత్యేకత ఏమిటి ? అని మనం ఏ రోజైనా ఆలోచించామా ?

ఒక గొప్ప భక్తుడు తాను పూజించే దైవానికి అనునిత్యం  కాపలాగా  ఉంటూ  కన్ను రెప్ప ఆర్పకుండా కాపాడుకుంటూ ఉండే సంకేతమే దీనికి అర్థం .

ఇక్కడ అర్థమయ్యే విషయం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధం  ఈ చూపుల కలియక . 

భక్తులు తమ కోరికలను నంది చెవులో చెబితే ఆయన శివునికి చేరవేస్తాడు  అనేది నానుడి. ఒకరకంగా చెప్పాలంటే నంది తన భక్తితో శివునిలో సగమైపోయాడా  అనిపిస్తుంది . ఆయనకు అంతటి విలువనిచ్చాడు  శివుడు .

వాస్తవానికి  ఇందులో  జ్ఞాన యుక్తు  సూక్ష్మం గ్రహిస్తే , శివుని ని పారవశ్యంతో  పూజించే  ప్రతి భక్తుడు  ఒక  నంది . ఇదే సత్యం. 

  

• ఇదంతా రాయించేది శివుడు అయినప్పటికీ రాస్తున్నది వృషభరాశి లోని చంద్ర కాంత రోహిణి లో జన్మించిన ఒక వృషభం.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 9:00 PM.


Saturday, February 21, 2026

723. శివుని పై సందేహమా ?

 

శివుని పై సందేహమా ?


• ఈశ్వరుడు ఉన్నది నిజం , అది కూడా తన పిల్లల (భక్తుల) కోసం నిత్యం పరితపిస్తూ ఉంటాడు అన్నది మరింత నిజం . 

ఈ సృష్టి లో మానవ నైజాలు మూడు రకాలు. ఒకడు భగవంతుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మేవాడు. ఇంకొకడు అసలు భగవంతుడు అన్నవాడు లేడు అనేవాడు. మూడవవాడు భగవంతుడు ఉన్నాడా లేదా అని మిధ్య లో కొట్టుకునేవాడు . చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురినీ సృష్టించినవాడు  భగవంతుడే . కానీ వారి వారి కర్మానుసారం  వారి పోకడలు ఉంటాయి. అలాగని వారిని ఎవ్వరినీ వదిలిపెట్టి ఉండడు విశ్వమూర్తి .

 నీకు కనిపించినా కనిపించక పోయినా నీ చుట్టూ ప్రాణవాయువు నిన్ను ఎలాగ బ్రతికిస్తుందో  అలాగే అమరేశ్వరుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు.

• భగవంతుడు లేడు అనే వాడికి శివుడు తెలియదు అన్నది నిజం కానే కాదు. కానీ, వాడు మాయ లో మునిగి ఉండడం వలన తానే అంతా అనే అహం లో ఉంటూ ,  తన మనసుని చంపుకొని పైకి బింకంగా దేవుడు లేడు లేడు అని చెబుతూనే మనసులో ఏదో తెలియని సందిగ్ధంలో  మదనం తో ఉంటాడు. ఇది సత్యం.

• ఇక మధ్యస్తంగా ఉండి దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే , మరి ఎందుకు కనబడడు ? అసలు సత్యం (దేవుడు) అనేది నిజమా కాదా? అనే మీమాంస లో ఉంటూనే , కష్టం వస్తే మాత్రం కనపడని దేవుడు కి మొక్కుకోవడం , ఇతరత్రా సమయాలలో సందేహపడడం ఇవన్నీ ఈ కోవకు చెందిన మనుషులవి .

• నీ సమస్త సందేహాలకు నీకుగా  సమాధానం దొరికేలా చేసేవాడే మేధో దక్షిణామూర్తి. నీకు ఆలోచన ఇచ్చి నీ మనసును సన్మార్గంలో ప్రేరేపించి నడవడిక నేర్పు మహా జ్ఞాన రూపం దక్షిణామూర్తి గా కనబడే ఈశ్వరుడి రూపం. ఈ రూపంలో శివుడు సద్గురువు .

• ఉన్నాడు అన్నవాడికి  ఉండి మోక్ష మార్గాన్ని చూపడం , లేడు అన్న వాడికి లేనట్లు గా ఉండి నిరూపణ చేయడం , మధ్యస్తంగా ఉన్నవాడికి సందేహ నివృత్తి చేయడం ఇవన్నీ భగవంతునికి అవసరమా ? అంటే , ముమ్మాటికీ అవసరమే ఎందుకంటే తాను సృష్టించిన తన బిడ్డలే కదా ! వీరందరూ.  ఆయనకు ఓర్పు నేర్పు కూర్పు అన్నీ సహజసిద్ధం . అవి శక్తి స్వరూపం లో పుష్కలంగా ఆయనలో పొంచి ఉన్నాయి.

• ఏనాడైతే , ఓ సద్గురువారం (గురువారం) రోజు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం , చిత్ర రూపంతో నీ ఇంట ఆరాధన అన్నది మొదలు పెడతావో , ఆనాటి నుండి నీ బుద్ధి లోని అజ్ఞానం అనే చీకటి గది తలుపులు తెరవబడి క్రమేపీ ధ్యాన యోగాల దిశగా అడుగులు పడి ప్రకాశవంతమైన జ్ఞాన వెలుగు నీలో నిండుతుంది. నీ గత జన్మల నుంచి పెండింగ్ గా మిగిలి పోయి ఉన్న అవశేష కర్మలు ఆధార భరితంగా పూర్తి అవుతాయి. అదే నిన్ను ముక్తి జీవన్ముక్తి దిశగా తీసుకువెళుతుంది .


• ఇంతకంటే నీ ఈ జన్మకు ఏం కావాలి .  తాపత్రయం గా సంపాదించిన స్థూలధనం , ఆస్తి సదుపాయాలు సౌకర్యాలు అనుభవించు, కానీ అవి నీతో పాటు పైసా కూడ మరుసటి జన్మ వరకు రావని  తెలుసుకో . నీతో పాటు శాశ్వతంగా వచ్చేవి సుక్ష్మ సంపాదన అయిన జ్ఞానం ,  జీవిత పాఠాల ద్వారా రూపు దిద్దుకున్న నీ స్వభావం, అనుభవాల ద్వారా మార్పు చేసుకున్న నీ సంస్కారం , మనసు లో నింపుకున్న ప్రేమ , తెలుసుకొని  ఆచరించే జ్ఞానం పవిత్రత ,  అనుభవం పొందుతున్న  శాంతి ,  సుఖం , ఆనందం , శక్తి  ఇవి మాత్రమే నీతో మరుసటి జన్మ కు వస్తాయని తెలుసుకో . 

మంచి తనం , మంచి మార్గం అనేవి ఎవరికోసమో కాదు నీ కోసం , నీ ఉన్నతి కోసం మాత్రమే .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 . 4:00 AM.


Friday, February 20, 2026

722. మన ప్రభావం ఇతరుల పై ఎలా ఉంది?

 

  మన ప్రభావం ఇతరుల పై ఎలా ఉంది?


• మన జీవిత ప్రయాణంలో నిత్యం ఎంతో మంది తో సహగమనం చేస్తూ ఉంటాం. ఇందులో కుటుంబీకులు, రక్త సంబంధీకులు, మిత్రులు, వృత్తి లో సహచరులు, సమాజం లో అపరిచుతులు ఇలా అనేకుల తో మన కర్మ (పని) ఏదో రూపంలో ముడిపడి ఉంటుంది. దీని వలన నిత్యం మన యొక్క ఆలోచన , మాట , ప్రవర్తన తీరుల తో వారితో నడుస్తూ ఉంటాం . ఇటువంటి సమయంలో తప్పకుండా ఇతరుల ప్రభావం మనపై , మన ప్రభావం ఇతరుల పై తప్పకుండా ఎంతో కొంత ఉంటుంది అనేది వాస్తవం .

• ఇతరుల తీరును మనం చక్కగా గమనిస్తూ ఉంటాం , తెలియకుండానే గ్రహిస్తూ ఉంటాం. దీనినే ప్రభావం అంటారు. ఇదే చర్య మన నుంచి కూడా జరుగుతుంది. అంటే మన ప్రభావం కూడా ఇతరుల పడుతుంది . ఈ ప్రభావం లో మంచి చెడు ఏదైనా ఉండొచ్చు , అది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.

• అయితే మన ప్రభావం ఇతరుల పై ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఏ నాడైనా స్వయం పరిశీలించు కుంటున్నామా ? అందులో భాగంగా మనం ఇతరులకు ఇచ్చేది సంతోషమా ? దుఃఖమా ? రంజనమా ? . . . లేక , నా ధోరణి నాదే అన్నట్లు ఉంటున్నామా ? ఎందుకంటే మానవ సంబంధాలలో నిత్యం మనల్ని మనం పరిశీలించుకోవడం సవ్యమైన తీరును అవలంభించడం అనేది చాలా ముఖ్యమైన అంశం.

• ఇతరుల తో మన ప్రవర్తన ఆకర్షణ లతో నిండి ఉంటే , ఆ బంధం లో సఖ్యత అనేది కేవలం తాత్కాలికం మాత్రమే . మన  ప్రవర్తన   తీరు తెన్నులలో   కల్మషం లేని నాడే  సహజసిద్ధంగా సఖ్యత  దృఢం అవుతుంది. ప్రవర్తన లో సహజ సిద్ధమైన అమాయకత్వం , తెలియని తనం అనేవి సఖ్యత కు ఆధారంగా ఉంటాయి .

• మనకు ఉన్న అన్ని రకాల బంధాలలోని వ్యక్తుల వలన మన బుద్ధి కి నిత్యం ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఇందులో మనకు ఆశలు , నిరాశలు , మభ్య పడడం , నిందలు , పొగడ్తలు , వ్యంగ్యాస్త్రాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి . ఈ పరిక్షలలో ఉత్తీర్ణత సాధించాలి అంటే బుద్ధి కి సూక్ష్మమైన పరిశీలన కావాలి . బుద్ధి బలోపేతం కావాలంటే అవగాహన తో కూడిన జ్ఞాన విషయాలు బుద్ధి లో నిరంతరం ధారణ జరగాలి. లేదంటే మన బుద్ధి విఫలమై , విషయ వికారాల ప్రభావాలకు లోనై మనసు అతలాకుతలమై చివరికి నైతికంగా పతనం ఆరంభం అవుతుంది .

• అందుకే మన ప్రవర్తన ను తప్పనిసరిగా నిరంతరం పరిశీలిన (check) చేసుకుంటూ ఉండాలి .

• మనం చేసే కర్మల గతి (direction) చాలా సూక్ష్మం మరియు అతి రహస్యం (hidden). కొన్ని సార్లు కర్మలు చేసేటప్పుడు ఆనందం గా చేస్తుంటాం . కానీ అనతి  కాలంలోనే   శిక్షలు అనుభవించే సమయంలో కూడా మనం చేసిన పాప కర్మలు మనకు గుర్తుకు రావు . దీనికి కారణం మన బుద్ధి , సూక్ష్మం ఎరుగక పోవడం .

 అందుకనే మన ఆలోచనలకు పదును పెడదాం , సూక్ష్మతను బుద్ధి కి అలవాటు చేద్దాం.

• మనం జన్మతః ఉన్నతులం కాదు. కానీ జీవిస్తూ ఎదుగుతూ ఉన్నతి సాధించడం కోసం జన్మ తీసుకున్నాం . ఈ విషయాన్నే మన పుట్టడం కంటే ముందు ఆత్మ  రూపులు మైన  మనం  పరమాత్మ కి వాగ్దానం చేసి ఆ తరువాతే జన్మ తీసుకున్నాం. కానీ జన్మించిన అనంతరం మాయా ప్రభావం వలన ఈ విషయం పూర్తిగా మరచి పోయాం. ఇదే సత్యం. అందుకు నిదర్శనం , నేడు ఇదంతా చదివి అర్దం చేసుకోవడం .


ఓం శాంతి .

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2026 , 10:00 AM.


Friday, February 13, 2026

721. దేవుడిని ఎందుకు నమ్మాలి ?

 

దేవుడిని ఎందుకు నమ్మాలి ?



• నేను దేవుడిని నమ్ముతాను . అవును దేవుడిని మాత్రమే నమ్ముతాను . నా దేవుడు నా కంటికి కనపడడు అయినా నేను నమ్ముతాను. నాకు నమ్మికయే  ప్రధానం.  నా శివుడు ఉన్నాడు నన్ను వింటున్నాడు , నాతో నే నడుస్తున్నాడు అనేది నా నమ్మకం . ఇది నాకే కాదు నాలాగ ఈ విశ్వం లో  కోటాను కోట్లమంది వారి మనసులలో ఇష్టపడి స్మరించే  దైవం అంటూ ఒకటుంది . అది ఎప్పుడూ తమను రక్షిస్తూ  ఉంటుంది  అనే  నమ్మకం  వారిని నడిపిస్తుంది .

• ఈ కలియుగంలో   దేవుడిని  కాకుండా  మానవమాత్రులను   గుడ్డిగా విపరీతంగా  ఆధారపడి  నమ్మినా చివరికి క్షోభే మిగులుతుంది.  ఇది సత్యం .  ఎందుకంటే మనం నమ్మిన ప్రతి ఒక్కరూ తిరిగి మనల్ని అదే విధంగా ముమ్మాటికీ  నమ్మరు . . . . ఎందుకంటే , ఒకరి  పట్ల   నమ్మకం  ఉంచుకోవడం, పెంచుకోవడం  అనేది  నీకు స్వభావ రీత్యా ఒక  అవసరం  అయితే  . . . .  వారికి మాత్రం  నీ పట్ల నమ్మకం  అనేది    లేకుండా  వేరే అవసరాలతో  నీతో ఉండొచ్చు .  కానీ భగవంతుడు అలా ఉండడు . నువ్వు ఎలా నమ్ముతావో , భగవంతుడు కూడా నిన్ను అలాగే  , లేదా అంతకు మించిన శ్రేయస్సు తో  నమ్ముతాడు . కారణం , మనుషుల మాదిరిగా భగవంతుని కి  స్వార్థపూరిత అవసరాలు ఉండవు . 

ఈ విషయాలను స్వయం గా నీకు దేవుడు మాత్రమే అర్దం చేయిస్తాడు , ఎందుకంటే నీవు ఎందరి పైనో   ఎన్నో విధాలుగా  నమ్మకం ఉంచుకొని మోసపోయావు కాబట్టి. 

నువ్వు భగవంతుడిని   ఏ నాడైతే   సత్యత తో  విశ్వసిస్తూ  నమ్ముతావో , అప్పుడు  మాత్రమే ,  ఇతరులకు  నీ పట్ల అంతులేని నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో భగవంతుడే నమ్మకం అనే పాత్రలో  ఇమిడి  ఉంటాడు  కాబట్టి .


• ఒక్క మాట చెప్పండి మనలోని రక్తం పైనుండి కిందకి లేదా కింద నుండి పైకి మన శరీరం లో ప్రవహిస్తుందా  లేదా?

• మన గుండె తనంతట తానుగా ఊపిరి లేదా ప్రాణవాయువు అందుతున్నంత  వరకు కొట్టు కుంటూ  ఉందా లేదా?

 ఇవన్నీ నీకు నాకు సహజ లక్షణాలు అయితే మన జననం మరణం మన చేతులలో ఎందుకని  లేదు ఇప్పటి కీ  ?

• నీ ఆకారం , నీ  పొడుగు , నీ పొట్టి  , నీ రూపం నీ చేతులలో ఎందుకు లేదు ?

• నీ  ఆస్తి ,  నీ డబ్బు ,  నీ కుటుంబం ఎందుకు నిత్య సుఖసంతోషాలు  నీకు ఇవ్వట్లేదు ? 

• ఆరు బయట  అరుగుపై  పడుకున్న వాడు ఆనందహేళి  లో   ఎందుకు  ఉంటున్నాడు ?

• అంతెందుకు ఈ రోజు నువ్వు నేను ఇక్కడ , రేపు ఎక్కడో   ఏమిటో  మనకు  తెలుసా  ?


• దైవం మానవ కల్పితం అనుకుంటే ఆ ఆలోచన ఒక కల్పన మాత్రమే. ఈ సృష్టిని నడిపించే ఒక అతీంద్రియ శక్తి పరమాత్మ  . ఇది యదార్ధం , ఇదే సత్యం. సత్యాన్ని ఒప్పుకోవటం అంటే భగవంతుని అంగీకరించడమే , అదే శివం అదే సుందరం. నువ్వు సత్యాన్ని అంగీకరించిన నాడు  ఆ పరమేశ్వరుడు నిత్యమై నీకు నాకు సుందరమైన జీవితాన్ని జీవనాన్ని కలుగచేస్తాడు . భగవంతుడు నీ తో ఉన్నాడు అనడానికి నిదర్శనం,  మునుపెన్నడూ నీ లోని కానరాని  అద్వితీయ, అతీంద్రియ శక్తిని నీ లో నువ్వు  అనుభవించడం .

• నీ  నోటి వెంట సత్యం పలకని నాడు , శివుడు నీ వెంట ఉండడు. మాయ మాత్రమే నీకు తోడు నీడ గా ఉంటుంది. అది నిన్ను అందలం ఎక్కించినట్లు ఎక్కించి  అమాంతం గా  కింద పడేస్తుంది. ఇదే నీకు కోలుకోలేని దుఃఖం . మాయ అంటే నీ లోని అసత్యం  మరియు బలహీనత . 

అందుకే అంటాను . . . నువ్వు నేను అందరూ శివపరమాత్ముని  నమ్మాలి .  భగవంతుడిని సత్యతో   నమ్మిన నాడు , నువ్వు  ప్రతీ వ్యక్తి పై చూపించే నమ్మకం లో  నీకు భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు .  జరిగిన , జరుగుతున్న సంఘటనలు ద్వారా  నీకు  మంచి చెడులు  అర్దం చేయిస్తూ ఉంటాడు .  ఎందుకంటే భగవంతుడు నిన్ను శుద్ధి  గా , ముక్తుడు గా  చేసేందుకే ఉన్నాడు , నీకు సంబంధించిన అన్ని బంధనాలలో  అనేక  స్వభావ సంస్కారాలు కలిగిన  వ్యక్తులు నీ  చుట్టూ ఉంచాడు . స్వీయ పరివర్తన చెందడం , చెందక పోవడం అనేది  నీ బుద్ధి కి సంబంధించిన అంశం .


శివరాత్రి శుభాకాంక్షల తో 💐 . . .

ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

Daimond Hall , Mount Abu ✍️ 

యడ్ల శ్రీనివాసరావు 13 Feb 2026 , 7:30 PM.


Wednesday, February 11, 2026

720 . చిత్రగుప్తుడు ఎవరు?

 

చిత్రగుప్తుడు ఎవరు ?




• మనం కొన్ని విషయాలు, కధలు గా వినినప్పుడు, చిత్రాల ద్వారా చూసినప్పుడు , సినిమాల లో సన్నివేశాలు గా  చూసినప్పుడు మనలో ఎంతగా ముద్రించబడతాయి  అంటే, వాటి ప్రభావం మనలో చాలా  బలంగా కనిపిస్తుంది . అందులో భయమో లేక ఇష్టమో ఏదైనా కావచ్చు . కారణం కనిపించక పోయినా మనం వాటిని దృఢం గా  నమ్ముతాం , ఆ నమ్మకం లోనే జీవిస్తూ ఉంటాం. ఈ నమ్మకం లో ముమ్మాటికీ కొన్ని సార్లు మంచి దాగి ఉండవచ్చు. కానీ అది సత్యమా, అసత్యమా  అని కూడా ఆలోచించే జ్ఞానం మన స్పృహ ఈనాడు  కోల్పోయింది . ఎందుకంటే ఎన్నో జన్మలు గా నమ్మకాల పైనే ఆధారపడి మన జీవితం గడుస్తుంది. ఈ నమ్మకాలను ఏనాడూ తర్కించి , అందులో వాస్తవాన్ని , మూలాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేకపోవడం  వలన వాటిని గుడ్డిగా నమ్ముతాం, ఆచరిస్తూ ఉంటాం .


• మనం ఈ రచన లో చిత్రగుప్తుడు ఎవరు అనే విషయం గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

• మనిషి చేసే పాపపుణ్యాలు , కర్మలు అన్నీ యమధర్మరాజు వద్ద ఉండే చిత్రగుప్తుడు ప్రతి క్షణం భవిష్యవాణి అనే పుస్తకం లో రాస్తూనే ఉంటాడని మనుషులు నమ్ముతూ ఉంటారు . ఈ విషయం శాస్త్రాల కధలలో , సినిమాలలో , చిత్రాల ద్వారా చూపిస్తారు.

  అసలు ఇది వాస్తవమేనా ? ఈ చిత్రగుప్తుడు ఏ లోకం లో నివసిస్తాడు ? ప్రతీ సెకను , ప్రతీ నిమిషం ఈ విశ్వం లోని అందరి పాపపుణ్యాల ను చిత్ర గుప్తుడు ఎలా రాస్తుంటాడు ? ఇది ఎలా సాధ్యం ? ఈ చిత్రగుప్తుడు మానవ రూపంలో నే ఉంటాడా ? యమధర్మరాజు ఎవరు ? అని ఆలోచిస్తే , సందేహాలు ఎన్నో? . . . వెంటాడుతుంటాయి ,

  కానీ వీటికి ఆధార భరితమైన అనుభవం తో కూడిన వాస్తవిక నిదర్శనాలు ఎక్కడ లభిస్తాయి ?

చిత్ర అనగా సంస్కృతం లో నక్షత్రము , ప్రకాశం , ఆత్మ  అని  అర్దం. ఆత్మ  ఒక  నక్షత్ర ప్రకాశం.   

గుప్త అంటే కంటికి కనిపించనిది , రహస్యమైనది , దాగి ఉన్నది అని అర్థం .


• మనిషి శరీరంలో , ఆత్మ యొక్క స్థానం మన భృకుటి (బొట్టు పెట్టుకునే ప్రదేశం) . అనగా ఆత్మ మన రెండు కను బొమ్మల మధ్య ఉన్న Pineal gland  నుంచి మెదడు కి అనుసంధానం అయి (Attach) అయి సూక్ష్మంగా నక్షత్రం వలే గుప్తంగా ఉంటుంది. ప్రకాశవంతమైన ఈ ఆత్మే మన శక్తి కి ఆధారం . ఈ శక్తి తో మనం చేసే ప్రతి పని (కర్మ), మరియు ఆలోచనలు మెదడు ద్వారా నిరంతరం ఆత్మ లో శాశ్వతంగా  రికార్డు అవుతూనే ఉంటాయి. ఆత్మ నాశనం లేనిది. శరీరం నాశనం అవుతుంది.

• ఇది గమనిస్తే , మనము శరీరం తో చేసే ప్రతీ చర్య  మనకు మనమే మన ఆత్మ లో రికార్డ్ చేసుకుంటాం (రాసుకుంటాం) . మనకు మనమే చిత్రగుప్తులం. ప్రత్యేకించి చిత్రగుప్తుడు అంటూ  ఎవరూ లేరు .

• మనల్ని  సృష్టించిన  సృష్టికర్త ,  విశ్వ శక్తి అయినటువంటి భగవంతుడే ఈ విధి విధానాన్ని రూప కల్పన  చేసింది .

ఇక్కడ ఒక సందేహం రావచ్చు . . . అసలు భగవంతుడు కనిపించకుండా, ఇదంతా ఎలా చేస్తాడు , అని.   అందుకు మంచి ఉదాహరణ, ఒక సెల్ ఫోన్ ను  ఎవరో ఒక  మనిషి ద్వారా  ఎక్కడో ఒక దేశం లో  తయారై  ఆ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవుతుంది.  అది మాట్లాడానికి , వినడానికి , వినోదానికి , ఫోటోలు తీయడానికి,  మెమోరీ లో రికార్డు చేయడానికి  ఉపయోగపడుతుంది .  అదే విధంగా   పరమాత్మ,  ఆత్మ ను   ఎన్నో విశేషాలతో సృష్టించాడు. అవే నేడు మన ఆత్మ చేస్తుంది.


• మన శక్తి తో చేసిన కర్మలను బట్టి ఫలితాలను , కాలగమనంలో కాస్త ముందు వెనుకగా విశ్వశక్తి మనకు తిరిగి ఫలం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సార్లు జన్మల అనంతరం కూడా తిరిగి కర్మ ఫలితాలు పొందుతాం. అవి పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం .

• ఈ విషయాన్ని  గమనిస్తే మనం శరీరం తో చేసే ప్రతీ పని, మనసుతో చేసే ప్రతి సూక్ష్మమైన ఆలోచన ,  ఆత్మ లో రికార్డు అవుతాయి. మన తలరాతను మనమే రాసుకుంటున్నాం . మనకు మనమే చిత్రగుప్తులం . . . చిత్ర విచిత్ర గుప్తులం .

  “చిత్రగుప్తుడు” అనే పదంలో ఇమిడి ఉన్న అర్దం ఆత్మ గుప్తం . ఇదే సత్యమైన చిత్రమైన చిత్రగుప్తుని జ్ఞాన యుక్త రహస్యం.

• ఎవరూ మనల్ని చూడడం లేదు కదా అని ధర్మ విరుద్ధమైన కర్మలు చేయడం, అసత్యాలు అలవోకగా ఆడడం, ఇతరుల గురించి వ్యర్థ విషయాలు చర్చించడం, రహస్యం గా కామవికారాలతో చెలరేగి పోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే , ప్రతి ఫలంగా శిక్షలు మనకు మనమే వేసుకుంటాం. ఎందుకంటే త్రి నేత్రం అనే నిఘా కెమెరా లో మనం ఊపిరి తీసుకున్నప్పటి   నుంచి ఉన్నాం .

 

ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏

 Mount Abu ✍️

 యడ్ల శ్రీనివాసరావు 11 Feb 2026 , 9:00 PM.


Saturday, February 7, 2026

719. మానవుడు వ్యక్తి కాదు శక్తి

 

  మానవుడు  వ్యక్తి  కాదు  శక్తి


• మనం, మనకు సంబంధించిన ఎన్నో శ్రేష్టమైన విశిష్టతలను కలిగి ఉన్నాం . కానీ దురదృష్టవశాత్తు వాటిని మరిచిపోయి మాయ మైకం (ధూమం) లో పడి సత్యం ఏదో అసత్యం ఏదో తెలియని స్థితిలో  జీవించడానికి   అనేక జన్మలు గా  అలవాటు చేసుకున్నాం.

• మనం మరచిపోయిన వాటిలో అత్యంత ముఖ్యమైన విషయం , మనం కేవలం శరీరం తో ఉన్న మనుషులం మాత్రమే కాదు , అద్వితీయమైన శక్తులం . మనిషి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి . కానీ మన స్పృహలో ఈ విషయం పూర్తిగా నేడు విస్మరించాం, అందుకే ఏదైనా సమస్యను ఎదుర్కొవాలంటే నిస్సారం అవుతాం , మనసు లో అలజడి తో భయపడతాం.

• మనిషి వ్యక్తి కాదు శక్తి అనే విషయం ఆది మానవుడు నుంచి, మన పూర్వీకులు మునులు బుషులు అనేక విధాలుగా నిరూపణ చేశారు . కానీ నేటి కలియుగంలో మాయ ఆవహించిన మనిషి ప్రశ్నిస్తాడు , దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమిటి? అని.

 అందుకోసమే నేమో , ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కలియుగం లో జన్మించారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం

 E= MC^2

  Energy = Mass * Velocity (square).

  శక్తి = ద్రవ్యరాశి * కాంతి వేగం (రెండు రెట్లు)

  ఇది భౌతిక శాస్త్ర ప్రకారం సృష్టి లోని ప్రతి జీవికి, నిర్జీవికి  (వస్తువు కి) వర్తిస్తుంది అని ఐన్స్టీన్ నిరూపించాడు .

  ఇదే సూత్రం మనిషి కి ఆపాదిస్తే  . . .

  మనిషి శక్తి = భౌతిక శరీరం (Mass) * మనసు చైతన్యం (Velocity) రెండు రెట్లు.

మన శరీరం మరియు మన మనసు లో ఆలోచనల చైతన్యం (ఆత్మ) రెండు రెట్లు కలిపితే అదే మన యొక్క మొత్తం శక్తి .

• మనుష్యులు అందరూ ఒకే విధమైన శరీర అవయవ నిర్మాణం తో ఉన్నా , ఒక్కొక్కరికి ఎనర్జీ లెవెల్స్ ఒకొక్క స్థాయిలో ఉండడం మనం గమనిస్తాం . దీనికి కారణం మనసు యొక్క చైతన్యం వేగం .

 ప్రతి మనిషి యొక్క శక్తి స్థాయి ని నిర్ణయించేది ప్రధానం గా మనసు యొక్క ఆలోచన సరళి తో కూడిన చైతన్యం.

☘️☘️☘️☘️☘️☘️

• మానవ శక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, రెండు నెగెటివ్.

  ఏదైనా విషయాన్ని . . . అతిగా, వ్యర్థం గా , అలజడి గా , అసత్యం తో ఆలోచించే వారికి నెగెటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది.

  శాంతి గా, మౌనం తో , సూక్ష్మంగా, నిజాయితీ తో  అవసరం మేరకు ఆలోచించే వారు పాజిటివ్ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు.

  ఈ రెండు శక్తుల లో ఒకటి ఆరోగ్యాన్ని , ఆహ్లాదాన్ని, తెలివితేటలు, ఆత్మానందాన్ని కలిగిస్తే మరొకటి దుర్భరత ను , నిర్లిప్తత ను , దుఃఖం కలిగిస్తుంది. ఈ శక్తులే ఎన్నో అంశాలను నిర్ణయించి , మనిషి కి ఆపాదన గా అవుతాయి  .

• కొందరు ఎంత కష్టతరమైన పనులనైనా సునాయాసంగా చేయడానికి కారణం తమ బలమైన ఆత్మ శక్తి . ఆత్మ శక్తి బలహీనంగా ఉన్న వారికి తాము చేసే పనులలో ఆటంకాలు , నిరాశ తరచూ కలుగుతుంటాయి .

🌹🌹🌹🌹🌹🌹

• మనం శక్తిని పెంచుకోవాలంటే నిరంతర సాధన అవసరం. శారీరక శక్తి కోసం సమతుల్యమైన పౌష్టికాహారం ఎంత ముఖ్యమో , మానసిక శక్తి కోసం రోజూ కొంత సమయం నిత్యం ధ్యానం, యోగం , భగవత్ స్మృతి అంత కంటే ఎక్కువ అవసరం . మనసు శక్తి శాలి గా తయారయితేనే మన  శరీరం  శక్తిని యిముడ్చుకుంటుంది .


• ప్రతీ రోజు తెల్లవారుజామున శివుని ధ్యానం చేయడం వలన అష్ట శక్తులు సిద్ధిస్తాయి. ఇవి సహన శక్తి , సర్దుబాటు శక్తి , ఎదుర్కొనే శక్తి, పరిశీలనా శక్తి, సంకీర్ణ శక్తి , సహయోగ శక్తి , నిర్ణయ శక్తి , యిముడ్చుకునే  శక్తి . వీటినే రాజయోగ శక్తులు అంటారు.


  1. సంకీర్ణశక్తి (Power to Withdraw) : 


ఇది  చాలా కీలకమైన మొదటి శక్తి . తాబేలు పరిస్థితులు సందర్భానుసారం తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటూ జీవనం సాగిస్తుందో , అదే విధంగా మన ఇంద్రియాలను, మనస్సును బయట ప్రపంచంలో ఎదురైన  దుర్భరమైన  వ్యక్తులు  వారి ద్వారా తలెత్తే పరిస్థితుల నుండి మనల్ని మనం  ఉపసంహరించుకుని , అంతర్ముఖం కావడమే సంకీర్ణశక్తి .

 ప్రాముఖ్యత: ఇది మన మనస్సును అలజడుల నుండి రక్షించి, ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది


  2. సహన శక్తి (Tolerance Power) : 


ఇది మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచే నిశ్శబ్ద బలం.

ప్రాముఖ్యత : ఇది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ, ఇతరుల తప్పులను మన్నిస్తూ  మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, సానుకూల దృక్పథంతో వ్యవహరించే మానసిక సామర్థ్యం.


  3. సర్దుబాటు శక్తి (Power to Adjust) :


కష్టతరమైన పరిస్థితులు, భిన్నమైన వ్యక్తులు మరియు కొత్త వాతావరణాలకు  అనుగుణంగా మనస్సును, ప్రవర్తనను మార్చుకునే సామర్థ్యం.

ప్రాముఖ్యత: ఇది సంబంధాలను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మరియు శాంతియుతమైన, సమతుల్యమైన జీవనశైలిని పెంపొందించడంలో సహాయపడుతుంది.


  4. ఎదుర్కొనే శక్తి (Power to Face) :


కష్టాలు, సవాళ్లు మరియు నిరాశలను అధిగమించడానికి సహాయపడుతుంది.

ప్రాముఖ్యత: నిశ్శబ్దాన్ని, ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను ఎదుర్కొని అంతర్గత స్థిరత్వాన్ని(self control ) పెంచుతుంది. ఆత్మ విశ్వాసం పెంచుతుంది.


  5. పరిశీలనా శక్తి (Power to Observation) : 



 మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు మనుషుల గుణదోషాలను , కంసాలి బంగారం నాణ్యతను పరీక్షించినట్లుగా వెంటనే గ్రహించగల శక్తి. ఇది సత్యాసత్యాలను తెలుసుకోవడానికి, అంతర్గత స్థితులను గమనించడానికి మరియు ఆందోళన లేని జీవితానికి తోడ్పడుతుంది.

ప్రాముఖ్యత : దీని ద్వారా మనిషి ఇతరుల గుణదోషాలను పరిశీలించి, అవగుణాలను చూడకుండా సుగుణాలను మాత్రమే స్వీకరించగలుగుతాం.


  6. సహయోగ శక్తి (Power to Cooperative) :


 ఒక గొప్ప కార్యం కోసం ఇతరులతో కలిసి పనిచేయడం మరియు అవసరమైనప్పుడు నిస్వార్థంగా  సహాయం  అందించడమే "సహయోగం"ఈ శక్తి ద్వారా మనస్సులోని వ్యర్థ సంకల్పాలు తగ్గి, శాంతి లభిస్తుంది. ఇది ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది.

ప్రాముఖ్యత : సమిష్టి తత్వాన్ని వృద్ధి అయి , ఉదారత మరియు నిస్వార్థ స్వభావం పెరుగుతుంది.


  7. నిర్ణయ శక్తి   (Decision Making Power) :

 


సాధన ద్వారా మనస్సును నియంత్రించి, అంతర్గత శక్తులను పెంపొందించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తుంది

ప్రాముఖ్యత : మానసిక స్పష్టత, ధైర్యం మరియు దూరదృష్టిని పెంచి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరమైన, తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.


‌  8. యిముడ్చకొనే శక్తి (Accommodate) :



 యిముడ్చుకునే శక్తి ఎనిమిది ప్రధాన శక్తులలో ముఖ్యమైనది. ఎన్ని నదులనైనా సముద్రం కలుపుకున్నట్లు ,  వివిధ రకాల వ్యక్తులను, భిన్న పరిస్థితులను  మరియు  అనేక భావాలను తనలో ఇముడ్చుకుని, ఏకాగ్రతను మరియు అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ శక్తి ద్వారా యోగి, ఎలాంటి కఠిన పరిస్థితులలో నైనా సర్దుబాటు చేసుకుంటూ, స్థితప్రజ్ఞతతో తొణకని కుండ వలే  వ్యవహరిస్తాడు .

ప్రాముఖ్యత : సర్దుబాటు తత్వం విశాల హృదయం , ఇతరుల ఆలోచనలు మరియు అభిప్రాయాలను స్వీకరించడం.

ఈ శక్తి వల్ల మనశ్శాంతి, సహనం పెరుగుతాయి మరియు సంబంధాలలో ఘర్షణలు తగ్గుతాయి.


💐💐💐💐💐💐

• నిత్యం ధ్యానం యోగం చేయడం , రోజూ కొంత సమయం భగవంతుని స్మృతి చేయడం వలన ఈ శక్తులు మనిషి లో సహజంగా , క్రమేపీ వృద్ధి అవుతాయి. వీటినే రాజయోగ శక్తులు అంటారు.

  హనుమాన్ చాలీసా లో “అష్ట సిద్ధి కే నవనిధి ధాత” , హనుమంతుడు ధ్యానం ద్వారా ఈ అష్ట శక్తులు , తొమ్మిది నిధులు పొందినట్లు చెప్పబడింది .


  ఓ మనిషి తెలుసుకో . . .  నీవు వ్యక్తి కాదు శక్తి.

  నీ శక్తి  , నీ చేతుల్లో . . . చేతల్లో .



ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏


On the way to Mount Abu ✍️

యడ్ల శ్రీనివాసరావు 7 Feb 2026 11:30 PM.



735 .మూసిన కనులు మసకబారవు

  మూసిన కనులు మసకబారవు • కనులు మూయడం అంటే ఒకటి నిద్ర పోవడం, రెండవది మరణించడం . ఈ రెండింటిలో జరిగే సూక్ష్మం ఒక్కటే . నిద్ర పోయినప్పుడు , ...