Wednesday, May 28, 2025

641. అంతరం


అంతరం


• అంతరం   ఓ   రంగం

  తదనంతరమే    తీరం .

• అంతరం    ఓ   రంగం

  తదనంతరమే    తీరం .

 

• తరంగాల     వలయాలు

  తరతరాలుగా

  తిరుగు లాడే   ఆలోచనలు .

• లోతు   పెరిగితే   . . .

  ఆ   . . .   లోతు పెరిగితే  . . .

‌  అవి    సుడిగుండాలు .


• అంతరం    ఓ   రంగం

  తదనంతరమే   తీరం .

• అంతరం    ఓ   రంగం

  తదనంతరమే   తీరం .


• మనస నే     ఊటబావి లో

  ఊరుతుంటాయి    కోరికలు .

• అవి ఉప్పెనలు    కానివ్వక

‌  అలలు  గ నే    ఆనందించాలి .

• విగతం లో     జీవం

  జీవితమైతే

  సత్య  సాధనం   సహజం .


• అంతరం    ఓ    రంగం

  తదనంతరమే    తీరం.

• అంతరం    ఓ   రంగం

  తదనంతరమే    తీరం .


• అంతమే   లేనిది    ఈ అంతరంగం

  అంతిమమున    తెలుస్తుంది 

  దాని    మూలం .

  మనిషి   మనిషికీ    ఇదే   జీవన వేదం .


• అంతరం    ఓ    రంగం

  తదనంతరమే    తీరం.

• అంతరం    ఓ   రంగం

  తదనంతరమే    తీరం.


పట్టిసీమ వీరభద్రస్వామి  ఆలయం ✍️.


యడ్ల శ్రీనివాసరావు 28 May 2025 2:30 PM.


Tuesday, May 27, 2025

640. తుమ్మెద

 

తుమ్మెద


• బంగారమా    బంగారమా

  పువ్వు పై      సింగారమా 

• బంగారమా    బంగారమా

  పువ్వు పై      సింగారమా


• ప్రకృతి కి      ఆకృతి యై

  రంజింప   చేసే   నయగారమా .

• కొమ్మ ల పై    కిలకిల లతో 

  రెమ్మ ల తో     రెప రెప లాడే 

  ఓ   తుమ్మెదా    పరవశమా . . . 


• బంగారమా    బంగారమా

  పువ్వు పై       సింగారమా

• బంగారమా    బంగారమా

  పువ్వు పై       సింగారమా


• నీ   మేని    అందాలు

  విరిసిన  సప్త   వర్ణాలు .

• నీ   మౌన    రాగాలు

‌  కుసుమ  శృంగ  భంగాలు .


• ఎగిరే    నీ    హోయనం

  ఎంత    హయి  నమ్మా .

• అదిమే   నీ  చుంబనం

  ఎంత  మురిపె  మమ్మా .


• బంగారమా    బంగారమా

  పువ్వు పై      సింగారమా

• బంగారమా   బంగారమా

  పువ్వు పై      సింగారమా


• వనమంత     తిరిగావు 

  పుప్పొడిని     పంచావు .

• బంధాలు       కలిపావు

  జీవ వైవిధ్యాన్ని   పెంచావు .


• పువ్వల       సంపర్కం

  నీ    సహయోగమే  కదా .

• ప్రకృతి      పారవశ్యం

  నీ      చలవే   కదా .


• బంగారమా     బంగారమా

  పువ్వు పై         సింగారమా

• బంగారమా      బంగారమా

  పువ్వు పై         సింగారమా .



యడ్ల శ్రీనివాసరావు 27 May 2025 9:00 PM.



Friday, May 23, 2025

639. క్షమాపణ

 

క్షమాపణ



• క్షమాపణ లేదా  క్షమించుట . అసలు ఈ పదానికి అర్థం అంటూ ఏమైనా ఉందా? ఈ పదం వలన ఉపయోగం ఏమైనా ఉందా ? … అంటే నాకు మాత్రం శూన్యం అనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా ఇదేదో తాత్కాలిక ఉపశమనం కోసం  లేదా నేటి కాలంలో , ఎదుటి వారిని  మభ్య పెట్టేందుకు ఉపయోగించే పదం గానే మిగిలి ఉంది అనిపిస్తుంది. 

 ఎందుకంటే మనిషి తాను చేసిన తప్పు వలన పశ్చాతాపం పొందినపుడు మాత్రమే ఉపయోగించ వలసిన పదం “క్షమాపణ” ఇది చాలా విలువైనది .  కానీ నేటి కాలపు మనిషి తన మూలాలను పూర్తిగా మరచి   జీవనయానం చేస్తున్న   సమయంలో   మానవుని  నిఘంటువు లో (డిక్షనరీలో) పశ్చాతాపం అనే పదం ఇంకా మిగిలి ఉందా  అనేది  సందేహమే .


• “క్షమించండి”  అని  అంటే తప్పు చేశాను అని అంగీకరించడం . ఇక్కడ అంగీకరించినా అంగీకరించక పోయినా తప్పు ఎప్పుడూ తప్పే . . . తప్పు చేయడం వలన కలిగేది దుఃఖం, బాధ.  తప్పు చేసిన వారికి ఈ బాధ కొంత సమయం , అనంతరం  దీర్ఘ కాలం గా కలుగుతుంది .  అదే విధంగా ఆ తప్పు వలన భాధించబడిన వారికి ఈ బాధ తాత్కాలికంగా కొంత సమయం మాత్రమే కలుగుతుంది అనేది వాస్తవం .


• అంటే ఒక మనిషి తన స్పృహ కి తెలుసో, తెలియకో ఒక తప్పు చేసినప్పుడు  అది వికర్మ గా అవుతుంది . తిరిగి ఆ మనిషి తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకున్నంతలో ఆ వికర్మ   మాసి పోతుందా అంటే ముమ్మాటికీ మాసి పోదు. ఎందుకంటే అప్పటికే అది తప్పుడు కర్మ గా మనిషి ప్రారబ్ద ఖాతాలో ఒక పాపం గా జమ అయిపోతుంది.

  నేటి కాలంలో, మనుషులు చెయ్య వలసిన పాపాలు, చెడు కర్మలు ఒక అలవాటు గా హక్కు గా, గుప్తం గా చేసెస్తూ , అవి తిరిగి బయట పడిన సందర్బం లో , చాలా Simple గా SORRY అని చెప్పడం, ప్రతీ చోటా అనేక సందర్భాల్లో సహజంగా చూస్తున్నాం. ఈ sorry చెప్పడం వలన ఫలితం ఏదైనా ఉందా అంటే అది శూన్యం. ఇదే సత్యం .

• ఒకవైపు మనిషి చేసే పాపాలు అన్నీ చేసెస్తూ, మరో వైపు భగవంతుని క్షమించమని అడుగుతాడు అందుకు అవసరమైతే , భగవంతుని కి ధనాన్ని వాటా గా ఏదో రూపంలో ఇస్తుంటాడు . అసలు భగవంతుడే  ధర్మ యుక్తం గా జీవించమని  మనిషికి   అన్నీ  ఇచ్చాడు  అనే స్పృహ లేకపోవడం  దురదృష్టకరం.  భగవంతుడు అంటే  అటువంటి వారి కి  చాలా లోకువ  మరియు  చులకన .  

• కానీ భగవంతుడు ఎన్నడూ ఎవరిని క్షమించడు అలాగని శిక్షించడు . భగవంతుడు ఎవరికైనా తన ప్రేమ ను పంచుతాడు.  కానీ , ఈ శిక్షలు అనేవి లెక్క వేసి అమలు పరిచేది కేవలం ధర్మరాజు మాత్రమే . శిక్ష అనేది కర్మ సిద్ధాంతం ప్రకారం , ఏ తప్పు   ఏ రీతిలో మనిషి చేస్తాడో , తిరిగి అదే రీతిలో, అదే విధంగా వడ్డీ తో తిరిగి అనుభవించ వలసిందే.

  ఇక క్షమించమని అడగడం . . . క్షమించాను అని ఇతరులు చెప్పడం అనే మాటలు కేవలం నాటకీయ అంశాలు మాత్రమే. అంటే వాటికి విలువ, అర్దం, ఫలితం ,  మూలాల్లోకి  వెళ్లి  చూస్తే  ఏమీ ఉండదు.

• కాకపోతే, క్షమాపణలు కోరడం అనేది ఒక మనిషి తాను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి ఆ తప్పు మరలా చేయకుండా ఉండడం కోసం మాత్రమే .


• అదే విధంగా, తప్పు చేసిన వాడిని నేను క్షమించాను అని అనడం కూడా ఒక మానసిక తృప్తి కోసం మాత్రమే.  అంతే గానీ, ఎదుటి వ్యక్తి క్షమించాను అన్నంతలో  చేసిన తప్పు, ఒప్పు అయిపోతుంది  లేదా  తుడిచివేయ బడుతుంది అని కాదు.  ఈ సృష్టిలో ప్రతీది స్పష్టం.   కాకపోతే మనిషి బుద్ధి ఈ సూక్ష్మ విషయాలను గ్రహించ లేదు.


  భగవంతుడు, గీత లో బోధించిన విధం, పొరపాటు న కూడా ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకు. కలియుగం లో పాపం అనేది నాలుక, చెవి , కళ్లు ద్వారా నే జరుగుతాయి అని చెప్పాడు .


• అజ్ఞాని మరియు అమాయకుడు తప్పు చేస్తే పడే శిక్ష వందకు యాభై శాతం మాత్రమే. ఎందుకంటే వారి బుద్ధి లో తెలివి అనేది ఉండదు కాబట్టి.

• జ్ఞాని మరియు తెలివైనవాడు తప్పు చేస్తే పడే శిక్ష వందకు రెండొందల శాతం ఉంటుంది. ఎందుకంటే వారి బుద్ధి లో స్పృహ బాగానే ఉంటుంది కానీ కొన్ని సార్లు మాయ కు లోనై  అప్పుడప్పుడు తప్పులు చేస్తారు కాబట్టి .

• లోపల తెలివి ఉంటూ బయటకు తెలివితక్కువ తనం తో,  లోపల జ్ఞానం ఉంటూ బయటకు అజ్ఞాని లా  అన్ని వేళలా ప్రవర్తించే వారికి మాత్రం శిక్ష వందకు వెయ్యి శాతం ఉంటుంది. ఎందుకంటే వీరికి సమస్తం అన్ని తెలిసి , తెలియనట్లు జీవిస్తూ నటిస్తారు . ఇటువంటి వారి వలన సమాజానికి , తోటి మానవాళికి చాలా ప్రమాదకరం.  వీరు నిరంతరం అతి తెలివి తనంతో  తప్పల తడక పైనే నడుస్తారు. పైకి  దొరకరు.  అందుకే ఇటువంటి వారికి శిక్ష శాతం చాలా ఎక్కువగా ఉంటుంది . గరుడ పురాణంలో దీని సూక్ష్మం స్పష్టం గా  చెప్పుబడి  ఉంది.


• Sorry  అనే పదం ,  ఒక సమస్యను పెద్దదిగా కాకుండా ఆపవచ్చు లేదా   సమస్య తీవ్రత ను తగ్గించవచ్చు . 

అలాగే ఒక రిలేషన్ (సంబంధం) పూర్తిగా ధ్వంసం కాకుండా ఆపవచ్చు. ఇవన్నీ కూడా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి . కానీ అప్పటికే జరిగి పోయిన నష్టాన్ని ఏ మాత్రం ఈ SORRY  అనే పదం తిరిగి తీసుకు రాలేదు అనేది వాస్తవం .


• అందుకే… ఒకరిని క్షమాపణలు కోరడం, లేదా ఒకరు నిన్ను  క్షమించాను  అనే స్థితి  పొందక  ముందే  , బుద్ధి లోని   స్పృహ ను   హద్ధు లోని  ఆలోచనల తో ,  సతో  ప్రధానంగా ఉంచుకోవడం ఉత్తమం మరియు  మనిషి కి ఆరోగ్యం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు, 23 May 2025, 8:00 pm.



Monday, May 19, 2025

638 . నీ తో వచ్చేది ఏది?

 

నీ తో  వచ్చేది ఏది ?


• ఓ మనిషి . . .

కాటి దాక వచ్చేవి బాగానే సంపాదించావు. మరి కాటి దాటి నీతో వచ్చేవి ఏమైనా వెనకేసావా  ?

  నువ్వు వింటున్న ది నిజమే . . . ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు, విశ్రాంతి లేకుండా వ్యాపారం అని, ఉద్యోగం అని కష్టపడుతూ ధన సంపాదన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నావు.

  అవును . . . నువ్వు ఆలోచించేది కూడా నిజమే , ధనం సంపాదించక  పోతే  దేహాన్ని, కుటుంబాన్ని ఎవరు సంబాళిస్తారు ?

  సరే, ఈ సంపాదన పొందడం లో ఒక తృప్తి పొందుతున్నావు , మంచిదే … ఎందుకంటే అవసరాలు తీరుతున్నాయి కదా . . .

  కానీ , ఒకసారి సరిగ్గా ఆలోచించు, నీ అవసరాలు తీరుతున్నాయా లేక నానాటికీ ఇంకా ఇంకా పెరుగుతున్నాయా ? ధనం ఎంత సంపాదించినా  కనీస అవసరాలైన ఆహారం, గృహం, ఆరోగ్యం , కుటుంబ పోషణ, భవిష్య రక్షణార్ధం సరిపోవడం లేదా .

• ఈరోజు ఒక స్థాయి స్థితి కలిగిన మనిషి , తనకున్న సంపాదన తెలివి తో తప్పకుండా ఆహారం, కుటుంబం పోషణ, ఆరోగ్యం విద్య వంటి ప్రాధమిక అవసరాలు తప్పని సరిగా తీర్చుకోగలడు  …. అంతకు మించి భవిష్యత్తు రక్షణ కోసం , తర తరాలు కోసం హద్ధు అదుపు లేని ధన సంపాదన కోసం (సక్రమమా, అక్రమమా అనే స్పృహ లేకుండా) తన జీవితాన్ని అర్పించి , జీవితపు చివరి దశలలో వెనక్కి తిరిగి చూసుకొని లబోదిబో అంటున్నాడు, అనేది వాస్తవం.

• ధనం కోసం పరుగు పెడుతూ ఉంటే, అది ఆగదు సరికదా, … అది నిన్ను , దాని వెనుక పరిగెత్తించి పరిగెత్తించి కొన్నాళ్ల కు పిచ్చివాడిని చేస్తుంది. అనేది నిజం .

• సరే గానీ … ధనం, బంగారం, స్థిర ఆస్తులు అంటూ , ఆదేశం  ఈ దేశం అంటూ తిరుగుతూ, కుటుంబానికి దూరంగా ఉంటూ , గాడిద చాకిరి చేస్తూ  పోగు చేస్తున్నావు  కదా … ఇంతకీ నీ అనుకున్న వారు, నీ సంపాదనను బట్టి నీకు విలువ ఇస్తున్నారా  లేక నీ సంపాదన కు మాత్రమే విలువ ఇస్తున్నారా? …  కాస్త ప్రశాంతంగా ఆలోచించు . . . ఎందుకంటే నువ్వు నీ అనుకున్న   వారి అవసరాలను తీర్చడానికి సంపాదిస్తున్నావు , మంచిదే , అది నీ బాధ్యత కదా …. మరి నీ అవసరాలు తీర్చడానికి నీ కంటూ ఎవరైనా ఉన్నారా, ఆలోచించు. లేకపోతే , నువ్వు సంపాదించిన ధనమే నీకు అన్ని కాలాలలో సర్వం సమకూరుస్తుంది అనుకుంటున్నావా? అలా అనుకుంటే, నీ అంత అమాయకుడు ఈ భూమి మీద ఎవరూ ఉండరు.


• కాటికి పోయే వరకు నీతో వచ్చేవి, బాగానే సంపాదించావు , సరే కానీ ఆ తరువాత నీ పరిస్థితి ఏంటి ?

 అంటే శరీరం వదిలాక (చనిపోయాక) అంతా ముగిసి పోతుంది అనుకుంటున్నావా ? అలా అనుకుంటే పొరపాటే.

చని పోయిన మరుక్షణమే నువ్వు ఏకాకివి .  నీకు ఎవరూ తోడు ఉండరు. అప్పుడు నీతో పాటు కూడా తీసుకెళ్ళడానికి, ఇంత కాలం ఏం వెనకేసుకు న్నావో , కాస్తంత ఆలోచించి చూడు . . . అదే, అదే . . . పాపం, పుణ్యం . . . మంచి, చెడు . . . సత్బుద్ధి దుర్బుద్ధి ఇలాంటివి.    నీ తో పాటు పై వరకు వచ్చేవి ఇవే , నువ్వు మళ్లీ ఎటువంటి జన్మ తీసుకోవాలో నిర్ణయం చేసేవి కూడా నీ ఈ సంస్కారాలే .... 

నువ్వు జీవిస్తున్న  ఈ ప్రస్తుత జన్మ తాలుకా  ఆలోచనలు  సంస్కారాలు ,  గత జన్మల‌ నుంచి కొనసాగింపు గా  పొందినవే  అనే  సత్య మైన విషయం గ్రహించు . 


• స్థూల ధన (డబ్బు) సంపాదన కేవలం ఈ జన్మ కి మాత్రమే . ఈ విషయం లో ఇంత కష్టపడుతూ , స్వార్థం చూపిస్తూ , నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటున్నావు కదా . మరి స్థూల ధనాన్ని మించినది   జ్ఞాన ధనం .    నీ మరణం తర్వాత కూడా , నీ ఆత్మ లోనే ఉండి అనేక జన్మలు వరకు నువ్వు రాజు వలే జీవించడానికి అవసరమైనది జ్ఞాన ధనం .

• ఈ జ్ఞాన ధనం సంపాదించడం కోసం, ఈ జన్మలో నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆలోచించు . ఎందుకంటే ఈ జ్ఞాన ధనం కొరత ఉండడం వలనే కదా అన్నీ ఉన్నా సరే , , సమస్యలకు పరిష్కారం దొరకక పలుమార్లు దుఃఖం పొందుతున్నావు .

• నిత్యం చేసే దైనందిన కార్యక్రమాల తో పాటు, ప్రతి రోజూ ఒక గంట సమయం నీతో నువ్వు ఏకాంతంగా గడపడం నేర్చుకో. ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకో, నువ్వు ఎవరో నీకు ఏదొక రోజు తెలుస్తుంది. అప్పుడు సహజం గానే జ్ఞాన చింతన పై మక్కువ ఆరంభం అవుతుంది. మార్గం తెరవబడుతుంది. 


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 20 May 2025 , 10:00 am .





Friday, May 16, 2025

637. సిం ధూర్

 

సిం ధూర్



సింధూరమా   దూరమా

  సింధూరమా    దూరమా


• సౌభాగ్య        తోరణ మై

  సక్కంగ    మెరిసే    సింధూరమా

  దూరమా .

• లక్ష్మి కి      లక్షణ మై

  నుదుట   విరిసే       బంగారమా 

  దూరమా .


• రాకాసి    మూకలు

  రక్త దాహం తో    రగిలాయి .

• నీ శక్తి     తెలియక

  పైశాచిక   క్రీడలు   ఆడాయి.


సింధూరమా      దూరమా

  సింధూరమా       దూరమా


• రక్తపు   రంగు తో

  మాంగల్య    రక్ష గా   నిలిచావు .

• ఆ రక్షణే     అణగారితే 

  రక్తపు  టేరులను  సృష్టిస్తావు .


సింధూరమంటే 

  ప్రేమ సింధువు    లోని    బిందువు .

• కాలరాసిన    నాడు    కాళిక యై

  ఎగసి పడే    రక్త  సింధువు .


సింధూరమే     సౌందర్యము

  భరతనారి     భవిత కి

  సింధూరమే    సౌందర్యము .

సింధూరమే     సంహారము

  రావణాసుర     సంతతి కి

  సింధూరమే     సంహారము .


*సింధువు = సాగరం , సముద్రం.


పెహల్గాం లో జరిగిన దుర్ఘటన లో ఒక ఆరంభం మాత్రమే. ముష్కరులు ఎవరి సింధూరాలను నిర్దాక్షిణ్యంగా తీసివేశారో , ఆ సింధూరమే యావత్తు ప్రపంచాన్ని, జూన్ జూలై 2025 మాసాలలో అల్లకల్లోలం చేస్తుంది. ఊహించని మరణాలు, దహనకాండలు  జరుగుతాయి. ఇది కలియుగ వినాశనానికి ఆరంభం .

భగవంతుడైన పరమపిత శివ పరమాత్మ ఒక వృద్ధ మానవ శరీరంలో శక్తి  స్వరూపమై  అవతరించి,  జ్ఞాన రచన ద్వారా 1936 సంవత్సరం లో  ,  చెప్పిన  విధమే   ఈ ప్రస్తుత కాలం.  2020 నుంచి అంతా సంగమ యుగం. అనగా ఒకవైపు కలియుగం పూర్తిగా అంతం అవుతుంది, మరో వైపు సత్య యుగం ఆరంభం అవుతుంది.

వైరస్ లు,  యుద్ధాలు, అణుబాంబులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అధిక వర్షాలు, కరువు అన్నీ కలిసి ఒకేసారి రాబోయే సమయం మొదలైపోయింది. దీనిని ఆపడం ఎవరి సాధ్యం కాదు. ఎందుకంటే ఇది సృష్టి రచన. ఈ సమయంలో విశ్వ శాంతి కోసం ఎవరైతే నిత్యం ధ్యాన యోగం చేస్తారో, వారు మాత్రమే కొంత సురక్షితంగా ఉంటారు.

కల్పం క్రితం  అఖండ భారతం నుంచే  సృష్టి ఆది మొదలైంది. అదే విధంగా విశ్వ పరివర్తన నిమిత్తం వినాశనం  కూడా భారతదేశం నుంచే ఆరంభం అవుతుంది. తిరిగి సత్య యుగం భారత దేశంలో నే స్థాపన జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు అవతరించిన భూమి ఇది. 

రాబోయే జూన్ జూలై నెలల్లో కుజుడు కేతువు ఒకే రాశిలో సంచారం చేయడం వలన ప్రపంచములో ఊహించని మారణకాండ జరగబోతోంది అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 17 May 2025 , 2:00 am .



Monday, May 12, 2025

636. శశి - కళ

 

శశి - కళ



• నగుమోము    చంద్రుడా 

  నగవు   నేడ     దాచావు 

  నీ  నగవు  నేడ   దాచావు .


• సిగము తోన   సిగ పాటు లే  కాని

  సిగపూలు     కాన  లేదు

  నీ సిగపూలు  కాన లేదు .


• పౌర్ణమి      కౌగిలింత   పరిమళాలు

  నెలవంక      నెలవు     నీయ లేదు

  గుబాళింపు   నిలువ    నీయ లేదు .


• నగుమోము    చంద్రుడా 

  నగవు     నేడ   దాచావు

  నీ నగవు  నేడ   దాచావు .


• నీ   వెన్నెల  నీడలో   ఆదమరచి  ఉన్నాను 

  నా   కన్నుల  జాడలో   జాలువారుతున్నావు .

• రోహిణి    చెంతకు   ఆరోహణ  ఎలాగని 

  ఈ   పెదవులు   అడుగుతున్నాయి .


• పక్షానికి     నీ   పలకరింపు   దిగులు 

  అనుక్షణం   నీ   శోభ కే   నా ఎదురు .


• నగుమోము       చంద్రుడా

  నగవు    నేడ       దాచావు

  నీ  నగవు  నేడ     దాచావు .



నగుమోము = నవ్వుతూ ఉండే ముఖం

నగవు = చిరునవ్వు

సిగము = దేవతా ఆవేశము

సిగ పాటు = కలహం

సిగపూలు = శిఖ లోని పుష్పాలు


యడ్ల శ్రీనివాసరావు 12 May 2025 10:00 pm


Sunday, May 11, 2025

635. ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం

 

ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం


• సాధారణంగా  ఈ భౌతిక ప్రపంచంలో  ఒకరు మరొకరి ని   ప్రేమించాలి అంటే,   ఏదొక  ప్రత్యేకత  ఉంటేనే   ప్రేమిస్తారు  మరియు  ప్రేమించ బడతారు.

• ఉదాహరణకు . . . 

తల్లి తండ్రుల   ప్రేమ కి  కారణం  తన బిడ్డ పై ఉన్న బంధం . 

ప్రేయసి ప్రియుల   ప్రేమ కి కారణం   అందం ఆకర్షణ కోరికలు .

స్నేహితుల  ప్రేమ కి  కారణం  సహకారం అవసరాలు .

వృత్తి   మీద  ప్రేమ కి  కారణం   ధనార్జన .

ఇలా ఇలా  . . .  చెప్పుకుంటూ  పోతే  ప్రతి ఒక్కరూ ప్రేమించడానికి,  ప్రేమింప బడడానికి   అంతర్లీనంగా ఒక అవసరం , కారణం అనేది ప్రత్యేకంగా ఉంటుంది.  ఇదంతా మనుషుల మధ్య  జరిగే ప్రేమ.


• వాస్తవానికి   ఈ ప్రేమ శాశ్వతమా ?   లేక  అవసరం తీరేంత  వరకేనా ?

  ఎందుకంటే . . .

బిడ్డ పెద్దయ్యాక  తల్లి తండ్రుల కు  మరియు బిడ్డ కు కూడా  తమ మధ్య ఉండే ప్రేమ గతం లో వలే ముమ్మాటికీ ఉండదు.

ప్రేయసి ప్రియుల   ఆకర్షణ తగ్గాక,  అందం  వాడి పోయాక   ఆ ప్రేమ  ఉండదు.

స్నేహితుల   మధ్య  సఖ్యత  నశించినపుడు , అభిప్రాయ భేదాలు  తలెత్తినప్పుడు  ఆ ప్రేమ ఉండే అవకాశం  అతి  తక్కువ .

చేసే వృత్తి లో  ధనార్జన  తగ్గి పోయినపుడు  ఆ వృత్తి పై  ప్రేమ   విసుగు , అసహనం గా  మారుతుంది.

నిజానికి   వీటన్నింటి లో   ప్రేమ అనేది  పై పూత అయినప్పటికీ,  లోపల మాత్రం  జీవన అవసరం అనే అంశం   దాగి  ఉంటుంది.

• సాధారణంగా  మనిషి  లోపల జరిగే  ఈ ప్రక్రియలన్నీ   మనిషి   స్పృహ  అంత  తేలికగా గ్రహించదు .  ఎందుకంటే  జన్మాంతరాలుగా  అలవాటు పడి పోయిన   ఆలోచన  సంస్కారం.


🌹🌹🌹🌹


కానీ అదే ,  ఒక మనిషి  భగవంతుని ప్రేమించడం అంటూ  మొదలు  పెడితే  . . . 

అసలు భగవంతుని ప్రేమించడం సాధ్యమే నా?

మనిషి తో మాట్లాడని,  కనిపించని భగవంతుని ఎలా ప్రేమిస్తాం ,  ప్రేమించగలం  ?

• భగవంతుడు  అంటే సృష్టి కర్త ,  ఆది దేవుడు అయిన   ఈశ్వరుడు.

 ఈశ్వరుని  పై ప్రేమ   అంత  సహజంగా సాధారణంగా పుట్టదు.   దాని కి ఏదో  ఒక  బలమైన కారణం , అనుగ్రహం  రెండూ  ఉండాలి .

  ఈశ్వరుని భక్తి చేయగా చేయగా, ఆ భక్తి సంపూర్ణం అయినపుడు  అంటే ఇక భక్తి చేయ వలసిన అవసరం లేదు అనే స్థితి లో ,  ఈశ్వరుని పై   ప్రేమ సాధ్యం అవుతుంది.

  అది ఎలాగో చూద్దాం . . .

• మనిషి భక్తి చేసే సమయంలో కర్మానుసారం సహజమైన కోరికలు  కొన్ని  తీరుస్తాడు ఈశ్వరుడు. కానీ ఈ కోరికలు చాలా అల్పమైనవి , తాత్కాలికమైనవి . మనిషి కి కోరికలు తీరే కొద్ది ఇంకా పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల కు కారణం అవసరం మరియు ఆశ . ఈ భక్తి చేసే దశ లో ఈశ్వరుని పై  ప్రేమ అంటూ ఏమీ ఉండదు, సరికదా  భయం ఉంటుంది . మనిషి కి కోరికలు తీరుతూ ఉన్నా సరే అంతటితో సంతృప్తి పడడు. ఇది మనిషి బుద్ధి నైజం.

• అప్పటి వరకూ మనిషి కోరికలు తీర్చిన ఈశ్వరుడు ఒకానొక దశలో అవన్నీ ఆపెస్తాడు. ఎందుకంటే ఇక , ఈ కోరికల తో నీకు అవసరం లేదు, అంతకు మించి నీకు అవసరమైనది మరొకటుంది , అనే విషయం కేవలం ఈశ్వరుని కి మాత్రమే తెలుసు . . . . ఇక్కడే మనిషి కి తన పరిస్థితి అగమ్య గోచరం గా అంటే అయోమయం గా అవుతుంది. అప్పటి వరకూ భక్తి చేయడం ద్వారా ఎన్నో పొందినా మనిషి, ఇప్పుడు తన కోరికలు తీరక పోతుండడం తో , ఆసహనంతో భక్తి చేయడం ఆపెస్తాడు. కొన్ని సందర్భాల్లో కష్టాలను, ఇబ్బందులు అవమానాలు ఎన్నో ఎదుర్కొంటాడు….. తనలో తాను విపరీతంగా మధన పడతాడు. ప్రశ్నించుకుంటాడు. …. చివరికి ఈశ్వరుని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ప్రశ్నించడమే కాకుండా నిలదీస్తాడు. ఇదంతా మనసు లోపలి నుంచి మాటల రూపంలో బయటకు ఏకాంతం లో వస్తూనే ఉంటుంది. ఇందులో కోపం, దుఃఖం, అసహనం, బలహీనత అన్నీ ఈశ్వరుని పై పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే భక్తి చేసిన ఇంత కాలం తన అవసరాలు తీర్చాడు కాబట్టి .


• ఈశ్వరుని ప్రశ్నించడం, ఈశ్వరుని పై కోపం , దుఃఖం తో మాట్లాడడం అనేది ఆపకుండా, ఈ స్థితిలో ఒక తారా స్థాయికి వెళుతుంది. పిదప ఈ స్థితిలో ఏదొక రోజు సొమ్మసిల్లి న నాడు అసలైన విషయం ఉంటుంది ….. అదే ఈశ్వరుని సాక్షాత్కారం. ఇది అనంత మైన వెలుగు తో కనిపిస్తుంది. శరీరం అంతా తేలికగా అయిపోతుంది. ఈ ప్రపంచానికి సంబంధం లేని మరో లోకం కాంతి పుంజం తో, అనంతమైన సంతోషం తో మనో నేత్రానికి కనిపిస్తుంది. ఇదే మానవుని లో మూడో నేత్రం తెరుచుకోవడం …. ఈ దశలోనే ఈశ్వరుని పై ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ లో ఏ భౌతిక కోరికలు ఉండవు.

• సంతోషం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే నువ్వు ఈశ్వరుని తో అనుసంధానం కాబడతావు. ఈశ్వరుడు అంటే నీ అసలు సిసలైన తండ్రి అని గ్రహిస్తావు. …. అప్పటి వరకూ రాతి విగ్రహానికి చేసిన పూజ నీ నోరు, శరీరం మాత్రమే చేసింది అని భావిస్తావు. ఇప్పుడు నీ మనసు ఈశ్వరుని తో అనుసంధానం అయిపోయిందని గ్రహిస్తావు. ఇక నిత్యం కనులు మూసినా తెరిచినా , ఏ పని చేసినా ఈశ్వరుని తలంపే , ఈశ్వరుని ప్రేమించడం మొదలు పెడితే శక్తి సహజ సిద్ధంగా అందుతూనే ఉంటుంది. ఇక అనుక్షణం శివ స్మరణ స్మృతి లో నిత్య భౌతిక కార్యక్రమాలు, బాధ్యతలు యధావిధిగా , ఏ ఒత్తిడి లేకుండా సహజంగా జరుగుతాయి. ఇక కోరిక అనే ప్రస్తావన, ప్రసక్తి నీ మనసు లో ఉండదు ఎందుకంటే అవి కోరుకుండానే తీరిపోతూ ఉంటాయి.

• ఈశ్వరుని ప్రేమ అనంతం. ఇందులో ఈశ్వరుని కి కావలసింది ఒకటే నీ లోని మానసిక వికారాలు అయిన, కామం క్రోధం లోభం మోహం స్వార్థం వంటివి ఈశ్వరుని కి దానం గా ఇవ్వాలి. వాస్తవానికి ఇవన్నీ ఎప్పటినుంచో , నీ లో ఉన్నా సరే ఈశ్వరుడు నిన్ను ప్రేమిస్తునే ఉంటాడు కానీ ఈశ్వరుని ప్రేమ ను నువ్వు అనుభూతి తో పొందడానికి నీ లోని కోరికలు దుర్గుణాలు అడ్డు తగులుతూ ఉంటాయి.

ఎందుకూ పనికి రాని తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది. అదే విధంగా ఎన్నొ తుప్పు పట్టిన అవ లక్షణాలతో ఉన్న నిన్ను కూడా ఈశ్వరుడు అయస్కాంతం వలే తన ప్రేమతో అనుసంధానం చేసుకుంటాడు . ప్రేమిస్తాడు ఎందుకంటే నీ లోని అమాయకత్వం మాత్రమే ఈశ్వరుని కి ఇష్టం… ఈశ్వరుడే నీ తల్లి మరియు తండ్రి , అదే అర్థనారీశ్వరం. జన్మ నిచ్చిన తల్లి తండ్రులతో ప్రయాణం ఈ జన్మలో కొంత వరకే, కానీ ఈశ్వరుని తో ప్రయాణం జన్మ జన్మల వరకు .

అందుకే ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం….

• నువ్వు ఈశ్వరుని భక్తి తో చూస్తే ఈశ్వరుడు కేవలం నిన్ను చూస్తాడు. ఈశ్వరుడు నిన్ను ప్రేమించినా సరే ఆ ప్రేమ అనుభూతి నువ్వు పొందలేవు

• నువ్వు ధ్యాన యోగాల తో ఈశ్వరుని స్మృతి చేస్తే ఈశ్వరుని ప్రేమానుభూతి పొందుతూ , ఊహించని స్థితి పొంది అనేక దివ్య శక్తులతో విశ్వ రాజ్యాధికారిగా అవుతావు.

అందుకే ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం.    ఎన్నటికీ తరగని ది.

ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 11 May 2025 , 11:50 PM.




Monday, May 5, 2025

634. Self - Respect


Self  -  Respect


•. Self Respect అనేది  పూర్తిగా మనో భావానికి సంబంధించినది . అసలు  దీని  అంతరార్థం  ఒకింత అర్దం చేసుకోవడం అంత సాధారణ విషయం కాదు .


• అసలు Self Respect అంటే ఏమిటి ? 

  Self  అంటే   “ నేను “ అని అర్దం. 

  ఈ “ నేను “  లో  . . . 

  ఆత్మ ( Soul )  , 

  శరీరం ( Body ) , 

  అహం ( Igo )  . . .  ఈ మూడు ఉంటాయి .


• Self  Respect అంటే . . . 

  1. ఆత్మ  గౌరవం .

  2. దేహ(శరీర)  గౌరవం .

  3. అహనికి   భరోసా .


• ముందుగా గ్రహించ వలసిన  విషయం ఏమంటే

  ఆత్మ వేరు  . . .  దేహం వేరు. 

  ఆత్మ నశించదు . . .  దేహం నశిస్తుంది. 

ఈ రెండు కూడా ఒకే నాణెం లో బొమ్మ బొరుసు వలే ఒకే మనిషి లో పైన శరీరం , లోన  ఆత్మ  ఉంటాయి

( ఆత్మ కి పేరు ఉండదు . . . దేహానికి పేరు ఉంటుంది. ఉదాహరణకు ఒక మనిషి పేరు "రాము" ,  జీవిస్తూ ఉన్నంత వరకు "రాము" అని పిలుస్తాం. రాము లో నుంచి ఆత్మ వెళిపోయిన తరువాత, అంటే  చనిపోయిన తరువాత, వాకిట్లో రాము నిర్జీవం గా ఉన్నా సరే అందరూ  శవం , Dead Body ,  Body  ఎప్పుడు తీసుకెళతారు, ఇలా   సంబోధిస్తారు కానీ,  రాము అని పిలవరు. పేరు అనేది శరీరానికి మాత్రమే.  ఆత్మ కి ఉండదు. ఆత్మ అంటే చైతన్య శక్తి. )


అహం  అనేది  ఆత్మ కి   దేహానికి  మధ్య వారధి . 

ఆత్మ , అహాన్ని  Neutralize చేయాలని . . . 

దేహం ,అహాన్ని Accept చేయాలని అనుకుంటాయి.


🌹🌹🌹🌹


Self Respect :   దేహ గౌరవం . . .

 సాధారణ భౌతిక జీవనం సాగించే మనిషి ,  తనను  తాను ఉత్తమం గా  భావించు కునే దృష్ట్యా , గౌరవాన్ని స్వతహాగా  అన్వయించు కుంటాడు .  తనకు  ఏదైనా అంశం లో    గౌరవానికి  భంగం  కలిగినప్పుడు  కొంత మేరకు Igo hurt అవుతుంది   . . .    ఈ సందర్భంలో  బాధ , అవమాన భారంగా అనిపిస్తుంది.  తనను  తాను  మానసికంగా   ధృఢ చిత్తం గా  ఉంచు కోవాలి  అనుకునే సందర్భంలో  . . . ఈ Self Respect అనే పదం నోటి నుండి  బయటకు వస్తుంది. 


 సామాన్య భౌతిక జీవనం లో ఉన్న వారు నేను ఫలానా   “ ABC  “  అనే పేరు  గుర్తింపు తో  శారీరక స్పృహ తో   జీవిస్తారు .

ఇక్కడ  సహజంగానే   "ABC "  కి  తన దేహం పై  మోహం, అభిమానం ఎక్కువ గా ఉంటాయి.  "ABC"  కి ఏదైనా  లోటు కలిగితే  అప్పుడు,  నా  Self Respect కి   భంగం కలిగిందని . . .   లేదా  నేను  ఎవరితో  మాట పడను  అనే అహం తో  కూడిన బలమైన  ఆలోచన మనసులో  ఉన్నప్పుడు కూడా ఈ Self Respect  అనే నినాదం  వినిపిస్తుంది .

చెప్పాలంటే ఇది శరీరానికి , అహనికి సంబంధించిన విషయం.  ఒక మనిషి తాను దేహ భావం లో మునిగి ఉన్నప్పుడు , " నేను "  అనే  identity   కోరుకునే  సందర్బం లో   . . . గౌరవాన్ని ఆశిస్తాడు ,  అది  జీవనం లో ఒక భాగం గా  భావిస్తాడు .  బయటకు  కనిపించని  అహమే ,  తన శక్తి అని భావించినప్పుడు . . . ఈ Self Respect అనే అంశం  మనసు లో  మెదులుతుంది . 

విచిత్రం ఏమిటంటే ఈ మోహం , అభిమానం, అహం అనేవి    " ABC "  కి  తనపై తనకు విపరీతంగా ఉంటాయని  తన  స్పృహ  గమనించదు   , ఒకవేళ గమనించినా అంగీకరించదు , ఒకవేళ అంగీకరించినా  తప్పు ఏముంది? అనుకుంటుంది . . . అదే విచిత్రం. . . . 

దేహభిమానము,  మోహం, అహం అనేవే  మనిషి తన దుఃఖానికి కారణం  అని అంత సులభంగా గ్రహించలేడు.


🌹🌹🌹


• Self Respect :   ఆత్మ గౌరవం . . .

   ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి మాత్రమే  తన  ఆత్మ యొక్క  స్థితిని గుర్తించ గలరు.

  ఇక ఆత్మగౌరవం అంటే  నా దేహం , నా పేరు  అనే ప్రసక్తి లేకుండా  వాటిని మించి  తమను తాము  ఉన్నతం గా  ,   అతీతంగా  తయారు చేసుకోవడం . 

  ఆత్మ గౌరవం (Self Respect) తో  జీవించాలి, లేదా పొందాలి  అనుకునే వారు  చాలా విశాలమైన దృక్పథంతో , దూరదృష్టితో ఉంటారు.  బాధలు , అవమానాలు , కష్టాలు  సంభవించినా సరే  వాటిని మనసు లోకి  తీసుకుని  అనుభవించరు ,  అంటే  ఫీల్ అవరు . పైగా  వాటిలో  మంచి  వెతకుతారు.  అదే విధంగా ఇతరులకు  ఎటువంటి  బాధను కలుగ చేయరు.   వారి మాటల  స్పష్టతతో   ఇతరులకు  భావాన్ని   ప్రస్ఫుటం చేయ గలరు .  ఎందుకంటే , తాము చేసే   ప్రతీ పని పై  సూక్ష్మ దృష్టి  మరియు పొందే  ఫలితం పై  అవగాహన కలిగి ఉన్నాము అని వారికి తెలుసు  . 

 అసలు నేను ఒక ఆత్మ ను అని స్పృహ ఉన్నవారు , వారి ఆత్మకు కావాల్సిన గౌరవం ఎలా  పొందాలో, ఎలా కాపాడు కోవాలో వారికి ముందే పూర్తిగా తెలుస్తుంది .  అటువంటి వారు  Self Respect అనే మాటను తమ మనసు తో  లోలో నే పంచుకుంటారు.  ఎందుకంటే  ఆత్మ గౌరవం అనేది అంతరంగానికి సంబంధించినది అని వారికి ముందే  తెలుసు.

  

అసలు గౌరవం  పొందాలన్నా,  కాపాడుకోవాలన్నా , ఫీల్ అవ్వాలి అన్నా  . . . ఇతరులకు ఇస్తూ ఉండాలి మరియు   తమపై తమకు  స్వీయ నియంత్రణ , వాస్తవిక దృష్టి   కలిగి ఉండాలి.


ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం వంటి పదాలు వాడుతూ ఉంటారు కానీ,  వాస్తవానికి  ఆత్మ కి  ఇవేమీ అవసరం లేదు. 

ఎందుకంటే . . .  ఆత్మ యొక్క  స్వధర్మం  శాంతి . 

ఆది సనాతన  దేవి దేవతా  ధర్మం ప్రకారం  ఆత్మ శాంతి నే   కోరుకుంటుంది.  ఈ ధర్మాన్నే నేడు సనాతన ధర్మం అంటున్నారు. 

 

 గౌరవం,  విశ్వాసం , అభిమానం  వంటివి   ఇవన్నీ   శరీరం  పై మమకారం  ఉన్న వారికి  అవసరం . ఎందుకంటే  ఇంకా  ఉన్నతమైన  గుణాలను  రూపు దిద్దు  కోవడం  కోసం. 


🌹🌹


• Self Respect : అహనికి  భరోసా  . . .

  

Self Respect ని  అహం యొక్క భరోసా అని కూడా  చెప్పవచ్చు.  

అహం (నేను )  అనేది  మనిషి జీవనానికి ఇంధనం. 

 ఈ అహం అనే  ఇంధనం లో  , సేవ, నిజాయితీ, నిస్వార్థం  వంటివి  చేరితే  మనిషి కి  జీవనం అనే  ఇంజను (యంత్రం)  సమర్ధంగా  పని చేస్తుంది. అలా కాకుంటే ,  అహం అనే ఇంధనం మండి మనిషి జీవనం  తగలబడి పోతుంది. 

అహం  అనే   ఇంధనానికి , గర్వం, కోపం , కామం , స్వార్థం  వంటివి  తోడైతే   కాలుష్యం  పెరిగి  మానవ జీవనం అనే ఇంజను (యంత్రం) పాడై పోతుంది .

అహం (నేను ) తప్పని సరిగా గౌరవం ఆశిస్తుంది . సత్యత , సేవ అనే లక్షణాలు ఉన్నప్పుడు అహనికి భరోసా పుష్కలంగా ఉంటుంది. అంటే Self Respect స్వతహాగా  సమృద్ధిగా  లభిస్తుంది.


నడవడిక కు  దర్పణం గౌరవం.

మనిషి నడవడిక లో వినయం, విధేయత,  నిజాయితీ ఉన్నప్పుడు గౌరవం సహజంగా నే ప్రకృతి , తదితరులు ద్వారా లభిస్తుంది.  ఇక  స్వీయ గౌరవం Self Respect  అనే ప్రస్తావన ఏ మనిషి కి ఉండదు . 


• అర్దం చేసుకో గలిగితే . . . మనిషి తాను పొందిన, పొందుతూ ఉన్న ప్రతీ  భావనకి  పూర్తిగా తానే బాధ్యుడు . . . కాకపోతే తనను తాను అన్ని కోణాలలో ను విశ్లేషించు కుంటే నే ,  తన యధార్థ స్థితి అంగీకరించ గలుగు తాడు  . . .  

ఇది  రాసిన వ్యక్తి తో  సహా . . .  


యడ్ల శ్రీనివాసరావు 5 May 2025 , 11:00 AM.






Sunday, May 4, 2025

633 . నవ్వు ఏది బిడ్డా

 

నవ్వు ఏది బిడ్డా



• నవ్వు   ఏది   బిడ్డా

  నీ   నవ్వు   ఏది . . .

• నవ్వడమే    పరమావధి

  నవ్వు   ఇవ్వడమే  యోగనిధి .


• జననం    తో     ఏడుపు

  మరణం   తో     ఏడుపు

• మరి    నడి  మధ్య  నంతా

  నవ్వే నా   . . . 

  జీవితం   . . .   నవ్వుల  పువ్వే  నా .


• నవ్వు    ఏది    బిడ్డా

  నీ    నవ్వు    ఏది  . . . 

• నవ్వడమే     పరమావధి

  నవ్వు   ఇవ్వడమే   యోగనిధి .


• ఉరుకుల   పరుగుల   లోకం లో

  బ్రతుకు   భారాల   యాతనలు .

• ఆలోచనల    వేగం లో 

  మనసు  నిండా   రోదనలు .

• వెలసి   . . .   కలసి

  ఆవిరి   అయ్యే  నా     నవ్వులు 

  ఎండి    పోయే  నా     పువ్వులు  .


• కపట   కవ్వింపుల   తాళాల తో

  కొందరి    నవ్వులు  .

• వికట   నవ్వుల     మేళాలు గా

  కొందరి    చేష్టలు  .

• కాలమే     నవ్వుతోంది . . .

  నవ్వు    కై      నువ్వు

  పడే   యాతన   చూసి .


• నవ్వు     ఏది    బిడ్డా

  నీ     నవ్వు    ఏది  . . . 

• నవ్వడమే    పరమావధి

  నవ్వు   ఇవ్వడమే   యోగనిధి .


• కొందామంటే    నవ్వు   ఎక్కడ

  దొరుకుతుందో   తెలియుట   లేదు .

• కందామంటే     కకల   వికల

  మనసుల  కి    సాధ్యం   కావట్లే దు.

• నవ్వుల    క్లబ్    కెళితే

  వికారాల     కితకితలు .

• సహజమైన     నవ్వు

  ప్రకృతి   ఇస్తుంది   కదా . . .


• నవ్వు    ఏది   బిడ్డా

  నీ     నవ్వు    ఏది  . . . 

• నవ్వ    లేని    బిడ్డా

  నీ   నవ్వు    ఏది.

• నవ్వడమే     పరమావధి

  నవ్వు   ఇవ్వడమే    యోగనిధి .


యడ్ల శ్రీనివాసరావు 4 May 2025 10:00 pm



Saturday, May 3, 2025

632. సంతోషం ఒక ప్రయాణం మాత్రమే గమ్యం కాదు

 

సంతోషం ఒక ప్రయాణం మాత్రమే 

గమ్యం కాదు


• మనమందరం, ఏదో ఒక సమయంలో, వాస్తవానికి దాదాపు మన జీవితమంతా, వివిధ రకాల దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక లక్ష్యాలను కలిగి ఉంటాము – వ్యక్తిగత లక్ష్యాలు, వృత్తిపరమైన, ఆర్థిక, సామాజిక, సంబంధాల లక్ష్యాలు; శారీరక శ్రేయస్సు మరియు ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు మొదలైనవి.

‌  కొన్నిసార్లు మనకు మనం గుర్తించక పోయినా మనం ఎల్లప్పుడూ ఏదో ఒక లక్ష్యంతో జీవిత ప్రయాణంలో ప్రయాణిస్తుంటాము . ఆ లక్ష్యం ఉన్నతమైన ప్రయోజనం లేదా ఏదైనా మన రోజువారీ జీవనానికి చెందినదైనా ఉండవచ్చు.

  అప్పుడు మనం చేసే అన్ని చర్యలు కూడా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించబడినవే . అలాగే, ఈ చర్యలు చాలా అంచనాలతో నిండి ఉంటాయి, కొన్ని ఫలితాలను సాధించేవిగా  ఉంటాయి. మనం ఆశించే ఈ ఫలితాలు ఒక్కోసారి వస్తాయి మరియు కొన్నిసార్లు రావు. మనం ఆశించే ఫలితాలు రాకుంటే, అవి మనలో ఆందోళన కలిగిస్తాయి. ఫలితాలు సాధించినప్పటికీ, ఆ ఫలితాలకు ముందు ప్రయాణం యొక్క స్వభావం, ఉద్దేశ్యంతో నిండినా కానీ నిరీక్షణ లేని ప్రయాణంతో  పోలిస్తే ఒత్తిడితో కూడుకున్నది, ఒత్తిడి లేకుండా లక్ష్యం సాధ్యం కాదని కొందరు వాదించవచ్చు .

  ఆందోళన మరియు ఒత్తిడి కేవలం ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ రూపంలో మాత్రమే కాకుండా మన భౌతిక శరీరాన్ని మరియు సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి,  ప్రయాణాన్ని కష్టతరం మరియు అలసిపోయేలా చేస్తాయి. కార్యాచరణ ఆధారితంగా ఉండటం మరియు మన లక్ష్యం వైపు ముందుకు సాగడంలో  కొన్ని స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పు లేదు,  కానీ  మన కలలను డేట్ కాన్షియస్ గా చేయకుండా  మరియు అవి ఇప్పుడు నెరవేరుతుందనే అంచనా నుండి విముక్తి పొందగల సామర్థ్యం కలిగి ఉండాలి. అలా ఉండకపోతే, మనం రేపటి కోసం జీవిస్తాము మరియు సులభంగా కలత చెంది నిరుత్సాహపడుతూ  ఈరోజును మనం ఆనందించలేము.  

మనం ఏదైనా సాధించినప్పుడు సంతోషించడం తప్పు కాదు, కానీ మన ఆనందం మన విజయాలపై ఆధారపడి ఉంటే, మనం సంతోషించడం ఎల్లప్పుడూ వాయిదా వేస్తాము. సంతోషం తర్వాత కోసం కాదు, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఆనందం ఒక ప్రయాణం, గమ్యం కాదు అని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది.


• ఇక్కడ సంతోషం అనేది మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని చేరుకోవడంలోనే కాదు, లక్ష్యం యొక్క ప్రయాణంలో కూడా ఉంటుంది. అలాగే, ఆందోళన చెందిన బుద్ధితో పోలిస్తే తేలికైన మరియు నిర్లిప్తమైన బుద్ధి ఎల్లప్పుడూ పాజిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తుంది, అది ఒకరి లక్ష్యాన్ని చేరుకోవడంలో వారధిగా ఉపయోగపడుతుంది.


యడ్ల శ్రీనివాసరావు 4 May 2025 10:00 AM.

659 . శివం

  శివం • శివమే   సుందరము    శివమే    సత్యము . • శివమనిన   నా లో   చలనం ‌  చేరును   శివుని    చెంత కు. • ఆ  చలనమే   నా     ఆత్మ   అచ...