Sunday, May 11, 2025

635. ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం

 

ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం


• సాధారణంగా  ఈ భౌతిక ప్రపంచంలో  ఒకరు మరొకరి ని   ప్రేమించాలి అంటే,   ఏదొక  ప్రత్యేకత  ఉంటేనే   ప్రేమిస్తారు  మరియు  ప్రేమించ బడతారు.

• ఉదాహరణకు . . . 

తల్లి తండ్రుల   ప్రేమ కి  కారణం  తన బిడ్డ పై ఉన్న బంధం . 

ప్రేయసి ప్రియుల   ప్రేమ కి కారణం   అందం ఆకర్షణ కోరికలు .

స్నేహితుల  ప్రేమ కి  కారణం  సహకారం అవసరాలు .

వృత్తి   మీద  ప్రేమ కి  కారణం   ధనార్జన .

ఇలా ఇలా  . . .  చెప్పుకుంటూ  పోతే  ప్రతి ఒక్కరూ ప్రేమించడానికి,  ప్రేమింప బడడానికి   అంతర్లీనంగా ఒక అవసరం , కారణం అనేది ప్రత్యేకంగా ఉంటుంది.  ఇదంతా మనుషుల మధ్య  జరిగే ప్రేమ.


• వాస్తవానికి   ఈ ప్రేమ శాశ్వతమా ?   లేక  అవసరం తీరేంత  వరకేనా ?

  ఎందుకంటే . . .

బిడ్డ పెద్దయ్యాక  తల్లి తండ్రుల కు  మరియు బిడ్డ కు కూడా  తమ మధ్య ఉండే ప్రేమ గతం లో వలే ముమ్మాటికీ ఉండదు.

ప్రేయసి ప్రియుల   ఆకర్షణ తగ్గాక,  అందం  వాడి పోయాక   ఆ ప్రేమ  ఉండదు.

స్నేహితుల   మధ్య  సఖ్యత  నశించినపుడు , అభిప్రాయ భేదాలు  తలెత్తినప్పుడు  ఆ ప్రేమ ఉండే అవకాశం  అతి  తక్కువ .

చేసే వృత్తి లో  ధనార్జన  తగ్గి పోయినపుడు  ఆ వృత్తి పై  ప్రేమ   విసుగు , అసహనం గా  మారుతుంది.

నిజానికి   వీటన్నింటి లో   ప్రేమ అనేది  పై పూత అయినప్పటికీ,  లోపల మాత్రం  జీవన అవసరం అనే అంశం   దాగి  ఉంటుంది.

• సాధారణంగా  మనిషి  లోపల జరిగే  ఈ ప్రక్రియలన్నీ   మనిషి   స్పృహ  అంత  తేలికగా గ్రహించదు .  ఎందుకంటే  జన్మాంతరాలుగా  అలవాటు పడి పోయిన   ఆలోచన  సంస్కారం.


🌹🌹🌹🌹


కానీ అదే ,  ఒక మనిషి  భగవంతుని ప్రేమించడం అంటూ  మొదలు  పెడితే  . . . 

అసలు భగవంతుని ప్రేమించడం సాధ్యమే నా?

మనిషి తో మాట్లాడని,  కనిపించని భగవంతుని ఎలా ప్రేమిస్తాం ,  ప్రేమించగలం  ?

• భగవంతుడు  అంటే సృష్టి కర్త ,  ఆది దేవుడు అయిన   ఈశ్వరుడు.

 ఈశ్వరుని  పై ప్రేమ   అంత  సహజంగా సాధారణంగా పుట్టదు.   దాని కి ఏదో  ఒక  బలమైన కారణం , అనుగ్రహం  రెండూ  ఉండాలి .

  ఈశ్వరుని భక్తి చేయగా చేయగా, ఆ భక్తి సంపూర్ణం అయినపుడు  అంటే ఇక భక్తి చేయ వలసిన అవసరం లేదు అనే స్థితి లో ,  ఈశ్వరుని పై   ప్రేమ సాధ్యం అవుతుంది.

  అది ఎలాగో చూద్దాం . . .

• మనిషి భక్తి చేసే సమయంలో కర్మానుసారం సహజమైన కోరికలు  కొన్ని  తీరుస్తాడు ఈశ్వరుడు. కానీ ఈ కోరికలు చాలా అల్పమైనవి , తాత్కాలికమైనవి . మనిషి కి కోరికలు తీరే కొద్ది ఇంకా పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల కు కారణం అవసరం మరియు ఆశ . ఈ భక్తి చేసే దశ లో ఈశ్వరుని పై  ప్రేమ అంటూ ఏమీ ఉండదు, సరికదా  భయం ఉంటుంది . మనిషి కి కోరికలు తీరుతూ ఉన్నా సరే అంతటితో సంతృప్తి పడడు. ఇది మనిషి బుద్ధి నైజం.

• అప్పటి వరకూ మనిషి కోరికలు తీర్చిన ఈశ్వరుడు ఒకానొక దశలో అవన్నీ ఆపెస్తాడు. ఎందుకంటే ఇక , ఈ కోరికల తో నీకు అవసరం లేదు, అంతకు మించి నీకు అవసరమైనది మరొకటుంది , అనే విషయం కేవలం ఈశ్వరుని కి మాత్రమే తెలుసు . . . . ఇక్కడే మనిషి కి తన పరిస్థితి అగమ్య గోచరం గా అంటే అయోమయం గా అవుతుంది. అప్పటి వరకూ భక్తి చేయడం ద్వారా ఎన్నో పొందినా మనిషి, ఇప్పుడు తన కోరికలు తీరక పోతుండడం తో , ఆసహనంతో భక్తి చేయడం ఆపెస్తాడు. కొన్ని సందర్భాల్లో కష్టాలను, ఇబ్బందులు అవమానాలు ఎన్నో ఎదుర్కొంటాడు….. తనలో తాను విపరీతంగా మధన పడతాడు. ప్రశ్నించుకుంటాడు. …. చివరికి ఈశ్వరుని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ప్రశ్నించడమే కాకుండా నిలదీస్తాడు. ఇదంతా మనసు లోపలి నుంచి మాటల రూపంలో బయటకు ఏకాంతం లో వస్తూనే ఉంటుంది. ఇందులో కోపం, దుఃఖం, అసహనం, బలహీనత అన్నీ ఈశ్వరుని పై పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే భక్తి చేసిన ఇంత కాలం తన అవసరాలు తీర్చాడు కాబట్టి .


• ఈశ్వరుని ప్రశ్నించడం, ఈశ్వరుని పై కోపం , దుఃఖం తో మాట్లాడడం అనేది ఆపకుండా, ఈ స్థితిలో ఒక తారా స్థాయికి వెళుతుంది. పిదప ఈ స్థితిలో ఏదొక రోజు సొమ్మసిల్లి న నాడు అసలైన విషయం ఉంటుంది ….. అదే ఈశ్వరుని సాక్షాత్కారం. ఇది అనంత మైన వెలుగు తో కనిపిస్తుంది. శరీరం అంతా తేలికగా అయిపోతుంది. ఈ ప్రపంచానికి సంబంధం లేని మరో లోకం కాంతి పుంజం తో, అనంతమైన సంతోషం తో మనో నేత్రానికి కనిపిస్తుంది. ఇదే మానవుని లో మూడో నేత్రం తెరుచుకోవడం …. ఈ దశలోనే ఈశ్వరుని పై ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ లో ఏ భౌతిక కోరికలు ఉండవు.

• సంతోషం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే నువ్వు ఈశ్వరుని తో అనుసంధానం కాబడతావు. ఈశ్వరుడు అంటే నీ అసలు సిసలైన తండ్రి అని గ్రహిస్తావు. …. అప్పటి వరకూ రాతి విగ్రహానికి చేసిన పూజ నీ నోరు, శరీరం మాత్రమే చేసింది అని భావిస్తావు. ఇప్పుడు నీ మనసు ఈశ్వరుని తో అనుసంధానం అయిపోయిందని గ్రహిస్తావు. ఇక నిత్యం కనులు మూసినా తెరిచినా , ఏ పని చేసినా ఈశ్వరుని తలంపే , ఈశ్వరుని ప్రేమించడం మొదలు పెడితే శక్తి సహజ సిద్ధంగా అందుతూనే ఉంటుంది. ఇక అనుక్షణం శివ స్మరణ స్మృతి లో నిత్య భౌతిక కార్యక్రమాలు, బాధ్యతలు యధావిధిగా , ఏ ఒత్తిడి లేకుండా సహజంగా జరుగుతాయి. ఇక కోరిక అనే ప్రస్తావన, ప్రసక్తి నీ మనసు లో ఉండదు ఎందుకంటే అవి కోరుకుండానే తీరిపోతూ ఉంటాయి.

• ఈశ్వరుని ప్రేమ అనంతం. ఇందులో ఈశ్వరుని కి కావలసింది ఒకటే నీ లోని మానసిక వికారాలు అయిన, కామం క్రోధం లోభం మోహం స్వార్థం వంటివి ఈశ్వరుని కి దానం గా ఇవ్వాలి. వాస్తవానికి ఇవన్నీ ఎప్పటినుంచో , నీ లో ఉన్నా సరే ఈశ్వరుడు నిన్ను ప్రేమిస్తునే ఉంటాడు కానీ ఈశ్వరుని ప్రేమ ను నువ్వు అనుభూతి తో పొందడానికి నీ లోని కోరికలు దుర్గుణాలు అడ్డు తగులుతూ ఉంటాయి.

ఎందుకూ పనికి రాని తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది. అదే విధంగా ఎన్నొ తుప్పు పట్టిన అవ లక్షణాలతో ఉన్న నిన్ను కూడా ఈశ్వరుడు అయస్కాంతం వలే తన ప్రేమతో అనుసంధానం చేసుకుంటాడు . ప్రేమిస్తాడు ఎందుకంటే నీ లోని అమాయకత్వం మాత్రమే ఈశ్వరుని కి ఇష్టం… ఈశ్వరుడే నీ తల్లి మరియు తండ్రి , అదే అర్థనారీశ్వరం. జన్మ నిచ్చిన తల్లి తండ్రులతో ప్రయాణం ఈ జన్మలో కొంత వరకే, కానీ ఈశ్వరుని తో ప్రయాణం జన్మ జన్మల వరకు .

అందుకే ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం….

• నువ్వు ఈశ్వరుని భక్తి తో చూస్తే ఈశ్వరుడు కేవలం నిన్ను చూస్తాడు. ఈశ్వరుడు నిన్ను ప్రేమించినా సరే ఆ ప్రేమ అనుభూతి నువ్వు పొందలేవు

• నువ్వు ధ్యాన యోగాల తో ఈశ్వరుని స్మృతి చేస్తే ఈశ్వరుని ప్రేమానుభూతి పొందుతూ , ఊహించని స్థితి పొంది అనేక దివ్య శక్తులతో విశ్వ రాజ్యాధికారిగా అవుతావు.

అందుకే ఈశ్వరుని ప్రేమ అయస్కాంతం.    ఎన్నటికీ తరగని ది.

ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 11 May 2025 , 11:50 PM.




No comments:

Post a Comment

650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?

జాలి  దయ  కరుణ  • జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . ...