నీ తో వచ్చేది ఏది ?
• ఓ మనిషి . . .
కాటి దాక వచ్చేవి బాగానే సంపాదించావు. మరి కాటి దాటి నీతో వచ్చేవి ఏమైనా వెనకేసావా ?
నువ్వు వింటున్న ది నిజమే . . . ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు, విశ్రాంతి లేకుండా వ్యాపారం అని, ఉద్యోగం అని కష్టపడుతూ ధన సంపాదన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నావు.
అవును . . . నువ్వు ఆలోచించేది కూడా నిజమే , ధనం సంపాదించక పోతే దేహాన్ని, కుటుంబాన్ని ఎవరు సంబాళిస్తారు ?
సరే, ఈ సంపాదన పొందడం లో ఒక తృప్తి పొందుతున్నావు , మంచిదే … ఎందుకంటే అవసరాలు తీరుతున్నాయి కదా . . .
కానీ , ఒకసారి సరిగ్గా ఆలోచించు, నీ అవసరాలు తీరుతున్నాయా లేక నానాటికీ ఇంకా ఇంకా పెరుగుతున్నాయా ? ధనం ఎంత సంపాదించినా కనీస అవసరాలైన ఆహారం, గృహం, ఆరోగ్యం , కుటుంబ పోషణ, భవిష్య రక్షణార్ధం సరిపోవడం లేదా .
• ఈరోజు ఒక స్థాయి స్థితి కలిగిన మనిషి , తనకున్న సంపాదన తెలివి తో తప్పకుండా ఆహారం, కుటుంబం పోషణ, ఆరోగ్యం విద్య వంటి ప్రాధమిక అవసరాలు తప్పని సరిగా తీర్చుకోగలడు …. అంతకు మించి భవిష్యత్తు రక్షణ కోసం , తర తరాలు కోసం హద్ధు అదుపు లేని ధన సంపాదన కోసం (సక్రమమా, అక్రమమా అనే స్పృహ లేకుండా) తన జీవితాన్ని అర్పించి , జీవితపు చివరి దశలలో వెనక్కి తిరిగి చూసుకొని లబోదిబో అంటున్నాడు, అనేది వాస్తవం.
• ధనం కోసం పరుగు పెడుతూ ఉంటే, అది ఆగదు సరికదా, … అది నిన్ను , దాని వెనుక పరిగెత్తించి పరిగెత్తించి కొన్నాళ్ల కు పిచ్చివాడిని చేస్తుంది. అనేది నిజం .
• సరే గానీ … ధనం, బంగారం, స్థిర ఆస్తులు అంటూ , ఆదేశం ఈ దేశం అంటూ తిరుగుతూ, కుటుంబానికి దూరంగా ఉంటూ , గాడిద చాకిరి చేస్తూ పోగు చేస్తున్నావు కదా … ఇంతకీ నీ అనుకున్న వారు, నీ సంపాదనను బట్టి నీకు విలువ ఇస్తున్నారా లేక నీ సంపాదన కు మాత్రమే విలువ ఇస్తున్నారా? … కాస్త ప్రశాంతంగా ఆలోచించు . . . ఎందుకంటే నువ్వు నీ అనుకున్న వారి అవసరాలను తీర్చడానికి సంపాదిస్తున్నావు , మంచిదే , అది నీ బాధ్యత కదా …. మరి నీ అవసరాలు తీర్చడానికి నీ కంటూ ఎవరైనా ఉన్నారా, ఆలోచించు. లేకపోతే , నువ్వు సంపాదించిన ధనమే నీకు అన్ని కాలాలలో సర్వం సమకూరుస్తుంది అనుకుంటున్నావా? అలా అనుకుంటే, నీ అంత అమాయకుడు ఈ భూమి మీద ఎవరూ ఉండరు.
• కాటికి పోయే వరకు నీతో వచ్చేవి, బాగానే సంపాదించావు , సరే కానీ ఆ తరువాత నీ పరిస్థితి ఏంటి ?
అంటే శరీరం వదిలాక (చనిపోయాక) అంతా ముగిసి పోతుంది అనుకుంటున్నావా ? అలా అనుకుంటే పొరపాటే.
చని పోయిన మరుక్షణమే నువ్వు ఏకాకివి . నీకు ఎవరూ తోడు ఉండరు. అప్పుడు నీతో పాటు కూడా తీసుకెళ్ళడానికి, ఇంత కాలం ఏం వెనకేసుకు న్నావో , కాస్తంత ఆలోచించి చూడు . . . అదే, అదే . . . పాపం, పుణ్యం . . . మంచి, చెడు . . . సత్బుద్ధి దుర్బుద్ధి ఇలాంటివి. నీ తో పాటు పై వరకు వచ్చేవి ఇవే , నువ్వు మళ్లీ ఎటువంటి జన్మ తీసుకోవాలో నిర్ణయం చేసేవి కూడా నీ ఈ సంస్కారాలే ....
నువ్వు జీవిస్తున్న ఈ ప్రస్తుత జన్మ తాలుకా ఆలోచనలు సంస్కారాలు , గత జన్మల నుంచి కొనసాగింపు గా పొందినవే అనే సత్య మైన విషయం గ్రహించు .
• స్థూల ధన (డబ్బు) సంపాదన కేవలం ఈ జన్మ కి మాత్రమే . ఈ విషయం లో ఇంత కష్టపడుతూ , స్వార్థం చూపిస్తూ , నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటున్నావు కదా . మరి స్థూల ధనాన్ని మించినది జ్ఞాన ధనం . నీ మరణం తర్వాత కూడా , నీ ఆత్మ లోనే ఉండి అనేక జన్మలు వరకు నువ్వు రాజు వలే జీవించడానికి అవసరమైనది జ్ఞాన ధనం .
• ఈ జ్ఞాన ధనం సంపాదించడం కోసం, ఈ జన్మలో నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆలోచించు . ఎందుకంటే ఈ జ్ఞాన ధనం కొరత ఉండడం వలనే కదా అన్నీ ఉన్నా సరే , , సమస్యలకు పరిష్కారం దొరకక పలుమార్లు దుఃఖం పొందుతున్నావు .
• నిత్యం చేసే దైనందిన కార్యక్రమాల తో పాటు, ప్రతి రోజూ ఒక గంట సమయం నీతో నువ్వు ఏకాంతంగా గడపడం నేర్చుకో. ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకో, నువ్వు ఎవరో నీకు ఏదొక రోజు తెలుస్తుంది. అప్పుడు సహజం గానే జ్ఞాన చింతన పై మక్కువ ఆరంభం అవుతుంది. మార్గం తెరవబడుతుంది.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 20 May 2025 , 10:00 am .
No comments:
Post a Comment