Friday, May 23, 2025

639. క్షమాపణ

 

క్షమాపణ



• క్షమాపణ లేదా  క్షమించుట . అసలు ఈ పదానికి అర్థం అంటూ ఏమైనా ఉందా? ఈ పదం వలన ఉపయోగం ఏమైనా ఉందా ? … అంటే నాకు మాత్రం శూన్యం అనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా ఇదేదో తాత్కాలిక ఉపశమనం కోసం  లేదా నేటి కాలంలో , ఎదుటి వారిని  మభ్య పెట్టేందుకు ఉపయోగించే పదం గానే మిగిలి ఉంది అనిపిస్తుంది. 

 ఎందుకంటే మనిషి తాను చేసిన తప్పు వలన పశ్చాతాపం పొందినపుడు మాత్రమే ఉపయోగించ వలసిన పదం “క్షమాపణ” ఇది చాలా విలువైనది .  కానీ నేటి కాలపు మనిషి తన మూలాలను పూర్తిగా మరచి   జీవనయానం చేస్తున్న   సమయంలో   మానవుని  నిఘంటువు లో (డిక్షనరీలో) పశ్చాతాపం అనే పదం ఇంకా మిగిలి ఉందా  అనేది  సందేహమే .


• “క్షమించండి”  అని  అంటే తప్పు చేశాను అని అంగీకరించడం . ఇక్కడ అంగీకరించినా అంగీకరించక పోయినా తప్పు ఎప్పుడూ తప్పే . . . తప్పు చేయడం వలన కలిగేది దుఃఖం, బాధ.  తప్పు చేసిన వారికి ఈ బాధ కొంత సమయం , అనంతరం  దీర్ఘ కాలం గా కలుగుతుంది .  అదే విధంగా ఆ తప్పు వలన భాధించబడిన వారికి ఈ బాధ తాత్కాలికంగా కొంత సమయం మాత్రమే కలుగుతుంది అనేది వాస్తవం .


• అంటే ఒక మనిషి తన స్పృహ కి తెలుసో, తెలియకో ఒక తప్పు చేసినప్పుడు  అది వికర్మ గా అవుతుంది . తిరిగి ఆ మనిషి తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకున్నంతలో ఆ వికర్మ   మాసి పోతుందా అంటే ముమ్మాటికీ మాసి పోదు. ఎందుకంటే అప్పటికే అది తప్పుడు కర్మ గా మనిషి ప్రారబ్ద ఖాతాలో ఒక పాపం గా జమ అయిపోతుంది.

  నేటి కాలంలో, మనుషులు చెయ్య వలసిన పాపాలు, చెడు కర్మలు ఒక అలవాటు గా హక్కు గా, గుప్తం గా చేసెస్తూ , అవి తిరిగి బయట పడిన సందర్బం లో , చాలా Simple గా SORRY అని చెప్పడం, ప్రతీ చోటా అనేక సందర్భాల్లో సహజంగా చూస్తున్నాం. ఈ sorry చెప్పడం వలన ఫలితం ఏదైనా ఉందా అంటే అది శూన్యం. ఇదే సత్యం .

• ఒకవైపు మనిషి చేసే పాపాలు అన్నీ చేసెస్తూ, మరో వైపు భగవంతుని క్షమించమని అడుగుతాడు అందుకు అవసరమైతే , భగవంతుని కి ధనాన్ని వాటా గా ఏదో రూపంలో ఇస్తుంటాడు . అసలు భగవంతుడే  ధర్మ యుక్తం గా జీవించమని  మనిషికి   అన్నీ  ఇచ్చాడు  అనే స్పృహ లేకపోవడం  దురదృష్టకరం.  భగవంతుడు అంటే  అటువంటి వారి కి  చాలా లోకువ  మరియు  చులకన .  

• కానీ భగవంతుడు ఎన్నడూ ఎవరిని క్షమించడు అలాగని శిక్షించడు . భగవంతుడు ఎవరికైనా తన ప్రేమ ను పంచుతాడు.  కానీ , ఈ శిక్షలు అనేవి లెక్క వేసి అమలు పరిచేది కేవలం ధర్మరాజు మాత్రమే . శిక్ష అనేది కర్మ సిద్ధాంతం ప్రకారం , ఏ తప్పు   ఏ రీతిలో మనిషి చేస్తాడో , తిరిగి అదే రీతిలో, అదే విధంగా వడ్డీ తో తిరిగి అనుభవించ వలసిందే.

  ఇక క్షమించమని అడగడం . . . క్షమించాను అని ఇతరులు చెప్పడం అనే మాటలు కేవలం నాటకీయ అంశాలు మాత్రమే. అంటే వాటికి విలువ, అర్దం, ఫలితం ,  మూలాల్లోకి  వెళ్లి  చూస్తే  ఏమీ ఉండదు.

• కాకపోతే, క్షమాపణలు కోరడం అనేది ఒక మనిషి తాను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి ఆ తప్పు మరలా చేయకుండా ఉండడం కోసం మాత్రమే .


• అదే విధంగా, తప్పు చేసిన వాడిని నేను క్షమించాను అని అనడం కూడా ఒక మానసిక తృప్తి కోసం మాత్రమే.  అంతే గానీ, ఎదుటి వ్యక్తి క్షమించాను అన్నంతలో  చేసిన తప్పు, ఒప్పు అయిపోతుంది  లేదా  తుడిచివేయ బడుతుంది అని కాదు.  ఈ సృష్టిలో ప్రతీది స్పష్టం.   కాకపోతే మనిషి బుద్ధి ఈ సూక్ష్మ విషయాలను గ్రహించ లేదు.


  భగవంతుడు, గీత లో బోధించిన విధం, పొరపాటు న కూడా ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకు. కలియుగం లో పాపం అనేది నాలుక, చెవి , కళ్లు ద్వారా నే జరుగుతాయి అని చెప్పాడు .


• అజ్ఞాని మరియు అమాయకుడు తప్పు చేస్తే పడే శిక్ష వందకు యాభై శాతం మాత్రమే. ఎందుకంటే వారి బుద్ధి లో తెలివి అనేది ఉండదు కాబట్టి.

• జ్ఞాని మరియు తెలివైనవాడు తప్పు చేస్తే పడే శిక్ష వందకు రెండొందల శాతం ఉంటుంది. ఎందుకంటే వారి బుద్ధి లో స్పృహ బాగానే ఉంటుంది కానీ కొన్ని సార్లు మాయ కు లోనై  అప్పుడప్పుడు తప్పులు చేస్తారు కాబట్టి .

• లోపల తెలివి ఉంటూ బయటకు తెలివితక్కువ తనం తో,  లోపల జ్ఞానం ఉంటూ బయటకు అజ్ఞాని లా  అన్ని వేళలా ప్రవర్తించే వారికి మాత్రం శిక్ష వందకు వెయ్యి శాతం ఉంటుంది. ఎందుకంటే వీరికి సమస్తం అన్ని తెలిసి , తెలియనట్లు జీవిస్తూ నటిస్తారు . ఇటువంటి వారి వలన సమాజానికి , తోటి మానవాళికి చాలా ప్రమాదకరం.  వీరు నిరంతరం అతి తెలివి తనంతో  తప్పల తడక పైనే నడుస్తారు. పైకి  దొరకరు.  అందుకే ఇటువంటి వారికి శిక్ష శాతం చాలా ఎక్కువగా ఉంటుంది . గరుడ పురాణంలో దీని సూక్ష్మం స్పష్టం గా  చెప్పుబడి  ఉంది.


• Sorry  అనే పదం ,  ఒక సమస్యను పెద్దదిగా కాకుండా ఆపవచ్చు లేదా   సమస్య తీవ్రత ను తగ్గించవచ్చు . 

అలాగే ఒక రిలేషన్ (సంబంధం) పూర్తిగా ధ్వంసం కాకుండా ఆపవచ్చు. ఇవన్నీ కూడా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి . కానీ అప్పటికే జరిగి పోయిన నష్టాన్ని ఏ మాత్రం ఈ SORRY  అనే పదం తిరిగి తీసుకు రాలేదు అనేది వాస్తవం .


• అందుకే… ఒకరిని క్షమాపణలు కోరడం, లేదా ఒకరు నిన్ను  క్షమించాను  అనే స్థితి  పొందక  ముందే  , బుద్ధి లోని   స్పృహ ను   హద్ధు లోని  ఆలోచనల తో ,  సతో  ప్రధానంగా ఉంచుకోవడం ఉత్తమం మరియు  మనిషి కి ఆరోగ్యం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు, 23 May 2025, 8:00 pm.



No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...