Monday, July 28, 2025

672 . ఆనంద నంద రాగం

 

ఆనంద నంద రాగం


ఆనంద   నంద   రాగం

  ప్రభు  ప్రేమ   సేద   సదనం .

  అదవదము        అంతకరము

  అనునయము    అంబరాంతము .


• ఆనంద     నంద    రాగం

  ప్రభు  ప్రేమ  సేద    సదనం .


• ఏకాంత    స్మృతి న    మౌనం

  శివ    సంధాన     ప్రియం .

  అంతరము న    జీవ   యానం

  దరహస   నిధి    సోపానం .


• ఆత్మ   పరమాత్మ ల   మిలనం

  హోళీ ల    కేళి    మధురం .

  అంతఃకరణ    ఈ   బంధం

  జన్మాంతరాల    సత్యం .


• ఆనంద   నంద    రాగం

  ప్రభు   ప్రేమ   సేద   సదనం .


• సంతోష     సావధానం

  జీవన్ముక్తి     సౌఖ్యం .

  రాజ    యోగాభ్యాసం

  ప్రభు   హృదయాన్వితం .


• ఆస్వాదన ల    శివం

  జ్ఞానామృతా ల   ధారణం .

  సుందరుని   చేరు    ఈ సమయం

  భాగ్య   రేఖల     స్వ గతం .


• ఆనంద    నంద    రాగం

  ప్రభు   ప్రేమ  సేద   సదనం .



  అదవదము = కలత , దుఃఖం

  అంతకరం   = సమూల సమాప్తం .

  అనునయం  = ఉపశమనం , ఓదార్పు 

  అంబరాంతము = ఆకాశం అంచు

  అంతఃకరణ  = మనసు  సాధనం 


యడ్ల శ్రీనివాసరావు 28 July 2025 11:00 AM.


Saturday, July 26, 2025

671. ఆత్మాభిమానం అహంకారం

 

ఆత్మాభిమానం - అహంకారం


• మానవుని కి , సహచరులతో గాని మరెవరి తో నైనా వాగ్వివాదం సంభవించినపుడు మనసు లోపలి నుంచి తెర మీద కి వచ్చే అంశం , ఒకటి ఆత్మాభిమానం . రెండవది అహంకారం .

 కానీ ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం నేటి మానవుడు గ్రహించలేని అంధకారంలో మనో స్థితి ఉండడం వలన మరియు , ఆత్మాభిమానం అనే పదాన్ని  సమాజం లో తరచూ వింటూ ఉండడం వలన , ఆ పదాన్ని మనసు కి అన్వయం చేసుకొని తాను వివాదానికి గురైనప్పుడు నా ఆత్మాభిమానం దెబ్బ తింది అనే మాట ను వ్యక్తపరచడం చాలా మంది వ్యక్తుల తరచూ వినడం చూడడం జరుగుతుంది .


• ఎందుకంటే సాధారణంగా మనిషి కి ఇతరుల తో వివాదం సంభవించినపుడు తాను పూర్తిగా తన శరీరాన్ని అభిమానించే  స్థితి లో ఉంటాడు . . . ఈ దేహభిమాన స్థితి , ఎదుటి వ్యక్తి పై కోపం పెంచుతుంది , లేదా తాను పొందిన అవమానాన్ని సహించుకోలేక  దుఃఖం, అసహనాన్ని బయటకు వ్యక్తం చేసేలా చేస్తుంది .


• ఎవరైనా నిందించినపుడు అవమాన భారంతో ఉద్వేగం పొంది , “నేను” అనే శరీర భావన , ఆలోచన ఉండడం వలన ,  తానొక ఆత్మ అనే స్పృహ కనీసం ఆ మనిషి కి స్పురణలో కి రాదు .

మరి అటువంటప్పుడు నా ఆత్మాభిమానం దెబ్బ తింది అని ఇతరులతో చెప్పడం ఎంత వరకు సమంజసం ? వాస్తవానికి ఇది ఒక అవగాహన లోపం. ఎందుకంటే ఆ మనిషి కి ఆత్మ అంటే ఏమిటో తెలియదు కాబట్టి. “ నేను “ అనబడే తన శరీరాన్నే పొరపాటున ఆత్మ గా భావించడం జరుగుతుంది.


• వాస్తవానికి మనిషికి ఆ దశలో వచ్చేది కోపం మరియు అహంకారం. అహంకారం వచ్చినప్పుడు తన అంతర్గత స్థితి , నన్ను నిందిస్తారా  . . . నన్ను అవమాన పరుస్తారా . . . నన్ను మోసం చేస్తారా అనే ఉద్రేక భరితమైన ఉద్వేగాలు బయటకు వస్తాయి. దురదృష్టం ఏమిటంటే  ఇదే ఆత్మాభిమానం అని అనుకుంటాడు ఆ మనిషి .

• నాకు ఆత్మాభిమానం ఎక్కువ, నేను ఎవరిని మాట అనను, నన్ను మాట అంటే పడను అని కొందరు అంటారు .   ఇది పొరపాటు , ఆత్మాభిమాని  ఎవరినీ ఒక మాట అనడు . . . తనను ఎవరైనా ఒక మాట అనినా  పట్టించుకోడు . 

 అసలు ఆత్మాభిమానానికి అర్దం తెలియక పోవడానికి  కారణం ,  అహంకారం .

• ఆత్మ యొక్క స్వధర్మం శాంతి . అంటే ఆత్మ ఎప్పుడూ కూడా , ఏం జరిగినా సరే శాంతి గా ఉంటుంది, శాంతి నే కోరుకుంటుంది. శాంతి అనేది ఆత్మ ఆచరించ వలసిన ధర్మం . 

• మరి మనిషి తనకు ఆత్మాభిమానం ఎక్కువ, అన్నప్పుడు తనకు ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా చిరునవ్వుతో, శాంతి గా నే  ఉండాలి, ఉంటాడు .   మౌనం తో ఆ శాంతి ని అనుభవం చేసుకొని ,  ఆత్మ అభిమాని గా అవుతాడు. ఆత్మాభిమానం ఉన్న వారు దేనికి వెంటనే స్పందించరు , React అవ్వరు. ఎప్పుడూ proactive గానే ఉంటారు. 

ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరితోనైనా ఏదైనా సమస్య గాని,  వివాదం గాని , పరిస్థితులు చేతులు దాటి మితిమీరుతున్నప్పుడు  వారికి దూరంగా మౌనం గా ఉంటారు. అంతే కానీ తమలో తాము ఏ విధమైన ఉద్రేకాన్ని పొందరు . పైగా ఎదుటి వారి మానసిక దీనావస్థ , స్థితి పట్ల జాలి కలిగి ఉంటారు . ఎదుటి వారు మరిన్ని పొరపాట్లు , చెడు కర్మలు చేయకుండా ఉండేందుకు ,  నిమిత్తమై  వారికి దూరంగా ఉంటారు.

• మనిషి లో అహంకారం ఒక స్థాయి ని మించి ఉన్నప్పుడు, అనేక రకాల భాష పదజాలంతో , మాటలతో , చేతలతో , సభ్య సమాజం హర్షించని  సంస్కారాల తో ప్రతిస్పందిస్తారు , React అవుతారు.

• మనిషి యొక్క స్పృహ ఆత్మాభిమానానికి , అహంకారానికి మధ్య ఉన్న వ్యత్యాసం యధార్థం గా గమనించుకో  గలిగే  స్థితి పొంది ఉంటే , జరిగిన  జరుగుతున్న  జరగబోయే ఎటువంటి విషయాల పట్ల నైనా క్షోభ , ఆందోళన , ఉత్సుకత,  ఉత్సాహం  వంటి   ఏ విధమైన  భావోద్వేగాలకు  గురి కాకుండా  సాక్షి భూతమై నిమిత్తమాత్రమై  ఆనందంగా తన పని తాను చేసుకుంటూ  జీవిస్తాడు .


యడ్ల శ్రీనివాసరావు 27 July 2025 , 9:30 AM.

Thursday, July 24, 2025

670. అసలు శివుడి తో నాకేం పని ?

అసలు శివుడి తో  నాకేం పని ?


• శివుడు అర్థనారీశ్వరుడు .  శివుని లో   స్త్రీ , పురుష శక్తి సమానం గా ఉంది అని అర్దం . అందుకే శివుడిని తల్లి మరియు తండ్రి గా భావిస్తాము .

 ఈ అనంతమైన విశ్వ సృష్టి శివుని ద్వారా జరిగింది. నేటి మానవులందరూ శివుని సంతానం అనే విషయం జగమెరిగిన సత్యం .

శివుడు విశ్వ కళ్యాణ కారి. ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు. దుఃఖ హర్త   సుఖ కర్త , దుఃఖం హరించి సుఖాన్ని పంచేవాడు .  నిరాడంబరుడు. వరములను దానం గా ఇచ్చే వరదాని .  దివ్య గుణాలు, దివ్య శక్తులు ఇవన్నీయు శివుని యొక్క ఆస్తి , సంపదలు .


• ఈ భౌతిక ప్రపంచంలో ఏ తండ్రి అయినా తాను సంపాదించిన ఆస్తిని పిల్లల కి వారసత్వం గా పంచినట్లే  , సృష్టి కర్త శివుడు కూడా తన అపారమైన వారసత్వ సంపదలను , ఆస్తిని తన సంతానం అయిన మనకు ఏనాడో పంచేశాడు .

అందుకు నిదర్శనం,  నేటి మానవులు కొన్ని యుగాల క్రితం అనగా సత్య త్రేతా యుగాలలో  శివుని వారసత్వ సంపదగా లభించిన  దైవీ లక్షణాలు, గుణాలు కలిగి ఉండడం వలన దేవతలు గా ఉండే వారు .

 అప్పుడు వారు ఆచరించిన ధర్మమే  . . . 

“ ఆది సనాతన దేవి దేవతా ధర్మం. ”


మరి ఆ పరంపర లోని మనిషి ,  నేడు తన తండ్రి శివుని వలే , తనకు తాను శుభకరం గా ఉంటూ , తన కుటుంబానికి మరియు ఇతరులకు శుభం కలిగిస్తూ , అందరికీ సహాయకారిగా ఉంటూ జీవిస్తున్నాడా ?

• శివుని వలే అనంతమైన ప్రేమ ను మనసు యందు కలిగి , కుటుంబం లో , సమాజం లో ప్రతి ఒక్కరినీ సంబాళన చేయగలుగుతున్నాడా ?

• శివుని యొక్క విశిష్ట జ్ఞానం ఆచరిస్తూ , మాయ ద్వారా సృష్టించబడిన తన సమస్యలు తానే పరిష్కరించు కుంటూ నేడు ఆనందం గా జీవిస్తున్నాడా ?

• శివుని వలే . . . దుఃఖం లో ఉన్న సాటి వారిని అక్కున చేర్చుకుని మనసు తో , మాటతో దివ్య అనుభూతి నిచ్చి నీకు నేనున్నాను అనే మనోధైర్యాన్ని అభయహస్తాన్ని , వరదానం ఎవరికైనా ఇవ్వ గలుగుతున్నాడా ?

• శివుని వలే , నిరాడంబర జీవనం నేడు మానవులు  సాగిస్తున్నారా ?

• శివుని వలే , దివ్య శక్తి గుణాల తో సుసంపన్నం గా ఉంటున్నారా ? 


ఒకప్పుడు శివుని నుండి పొందిన , ఈ వారసత్వ సంపదలను ద్వాపర యుగం నుంచి క్రమేపీ కోల్పోయి , రావణుని తో సహవాసం చేస్తూ , వికారాలు కి బానిస అయి, దైవీ గుణాలు, శక్తులు పూర్తిగా కోల్పోయి కలియుగం లో దుఃఖం తో జీవిస్తూ ఉన్నారు నేడు మానవులు. అందుకే నేటి మానవుని జీవితం దుఃఖ సాగరం. ఏదైనా భౌతిక సుఖాలు పొందినా, అది అల్పకాలికం అని గ్రహించ లేక పోతున్నారు.


 దీనంతటికీ కారణం , తండ్రి అయిన శివుని యొక్క యధార్థం మర్చిపోవడం. శివుని తో అనుబంధం లేక పోవడం.


• నేడు మనిషి అనుకుంటాడు శివుని ని నిత్యం పూజిస్తున్నాను అని . 

ఆలోచించి చూడు …. శివుని ని ఒక లింగ విగ్రహం గా పూజిస్తున్నావా ? లేక  నీ తండ్రి గా భావిస్తూ పూజిస్తున్నావా ?.

• ఒకవేళ నీవు లింగ విగ్రహం గా భావిస్తూ పూజిస్తే , నీ మనసు కి, శివుని కి మధ్య అనంతమైన దూరం ఉన్నట్లే . ఏ విధమైన బంధం లేనట్లే . నీ కోరికలు, దుఃఖం అవసరాలు తీరడం కోసం స్వార్దం తో  నీవు శివుని ని   దీనత్వం తో వేడుకుంటున్నట్లే  .


• ఒకవేళ నీవు శివుని ని తండ్రి గా భావిస్తే … ఏ తండ్రి కూడా తనను పూజించిమని  అడగడు . తండ్రి పిల్లల నుండి గౌరవం ఆశిస్తాడు , మరియు తాను నేర్పించిన  విధంగా ధర్మ యుక్తం గా నడచుకోమని ఆదేశిస్తాడు  ,  తన కంటే గొప్ప వారిగా కీర్తించ బడాలని కోరుకుంటాడు . . . అదే విధంగా  తండ్రి కి పిల్లల కు ఉన్న అనుబంధం చిర స్థాయి గా ఉండాలని,  ఏనాడూ పిల్లలు అది మరచి పోకూడదని అనుకుంటాడు. తండ్రి తాను  ప్రేమను పంచుతూ  ఆశిస్తూ , తన  సంపదలను  పిల్లల హక్కు గా  అనుభవించాలని , తన వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు .


• మరి నేడు మానవుడు తన మనసు యందు శివుని పట్ల తండ్రి అనే భావన బంధం తో ఉంటున్నాడా ? ఆలోచించండి.


• నేడు మనిషి తలపై అనేక జన్మలు గా చేసిన పాప భారం ఉంది. అందు వలన శివుడు తండ్రి అనే వాస్తవికత , శివుని తత్వం , శివుని జ్ఞానం మనిషి తెలుసు కో లేక , తోచిన విధంగా అజ్ఞాన అంధత్వం తో పూజలు చేస్తున్నాడు . ఈ పూజలు వలన ధనం ఖర్చు చేస్తూ , సుఖం శాంతి లభించక , దుఃఖం తీరక ఎదురు చూపులు చూస్తూ జన్మ జన్మలు గా ఎదురు చూస్తున్నాడు .

 భక్తిలో  చేసే ఆడంబర  పూజ  విధానం వలన లభించిన ఫలితం సంతోషం కేవలం బాహ్యం  మరియు  అల్పకాలికం అని గ్రహించ లేక పోతున్నాడు నేటి మనిషి .  అందుకే ఎన్ని పూజలు చేసినా మనిషి కి అంతరంగం లో అలజడులు పోవడం లేదు. 

దీనికి పరిష్కారం శివ ధ్యానం, శివ జ్ఞానం, శివ యోగం.  

ధ్యానం ద్వారా మనసు నిశ్చలం నిర్మలం అవుతుంది.  

జ్ఞానం ద్వారా  బుద్ధి మనో నేత్రం వికసిస్తుంది.

యోగం ద్వారా శివుని తో అనుసంధానం ఏర్పడుతుంది. 

దీనినే  రాజయోగం ... రాజయోగ అభ్యాసం అంటారు.


శివుని కి   కావాల్సింది  నీ మనసు.  అది నిజాయితీతో ,పవిత్రత తో అర్పించిన నాడు  , నీ పయనం శివుని జతలో ఉంటుంది . అదే నీ  నా  గమ్యం.


• శివుని కి భక్తి పూజలో సమర్పించేది . . . పుష్పం , పత్రం , ఫలం.  దాని అర్దం.

  పుష్పం అంటే   నీ  మనసు.

  పత్రం   అంటే    నీ  దేహం

  ఫలం    అంటే   నీ   ఆత్మ 

• ఇదంతా మనసు తో జరగాల్సిన శుద్ధమైన పూజా ప్రక్రియ .


చేయవలసిన   అన్ని కర్మలు చేస్తూ, నిత్యం మనసు లో  శివ స్మృతి  ఉండడమే అసలైన పూజ . 

ఉదాహరణకు ఎవరినైనా ప్రేమిస్తే మనం ఏ పని చేస్తున్నా దృష్టి ప్రేమించిన వారి పై ఉంటుంది కదా ! అలా . . . .

ఇదే నాకు శివుని తో ఉన్న పని.

ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి 🙏

యడ్ల శ్రీనివాసరావు 24 July 2025 10:00 pm.



Wednesday, July 16, 2025

659 . శివం

 

శివం



• శివమే   సుందరము 

  శివమే    సత్యము .


• శివమనిన   నా లో   చలనం

‌  చేరును

  శివుని    చెంత కు.

ఆ  చలనమే   నా     ఆత్మ

  అచలమే         నా    దేహం .


• శివమే     సుందరము

  శివమే     సత్యము .

• శివము తో   సంబంధ    మెరిగాక 

  మనసు కు    బంధాల    మెలి    ఏమి .

  కాల    యాపన ల     కలిమి    ఏమి .


• శివమనే    రాగం

  సప్త  లోకాల     సంబంధము .

• శివమనే     స్వరం

  సప్త మాతృకల   సహయోగం .


• శివమే     సుందరము

  శివమే     సత్యము .


• శివమనిన    నా లో    ఆర్ద్రం

  పాయసం  మయ్యే

  శివుని    నైవేద్యాని కి .

ఆ  మననమే    నా   మౌనం

  అమనమే    నా    జీవం .


• శివమే     సుందరము

  శివమే     సత్యము .

• శివము తో     సంధాన మైన కా

  తనువు కు   మోహ దాహల   మాయ  ఏమి .

  ఆశ   నిరాశల    ఊయల   ఏమి .


• శివమనే     స్మరణం

  ముల్లోకాల   సందర్శనం .

• శివమనే     సంకల్పం

  మూడు కాలాల    అనుబంధం .


 • శివమే    సుందరము

   శివమే    సత్యము .



చలనం = కదిలేది

అచలం = కదలనిది 

ఆర్ద్రం = మనసు తడి

అమనం = శాంతి, సౌఖ్యం, క్షేమం.


యడ్ల శ్రీనివాసరావు 16 July 2025 11:00 AM.



Monday, July 14, 2025

658. మనో శతకం - 10

 

మనో శతకం - 10


సమసిన  సమయమ్  స్వర్ణంబైన  ఆభరణమ్.

ధారణ నొంద  నీ కాలంబు   ధీనత  నొందున్.

క్షరము న జారెడు  పుష్పంబు  ఫలమగునా .

నోచని యత్నంబున  నిర్వేదం నివసమగున్ .

సుందర గుణేశ్వరా ! సంపన్నేశ్వరా !      |24|


భావం :

గడచి పోయిన కాలమంతా  బంగారం అయిన యెడల ఆభరణము అగును .

అది ధరించని చో   నేటి కాలం   వృధా అగును .

సెలయేటి లో  జారి పోతూ ఉన్న  పువ్వు  ఫలము  అగునా .

చేయని  ప్రయత్నము , నిరాశకు  ఇల్లు అగును .

సుందరమైన గుణములు గల ఈశ్వరా ! సంపన్నుడైన ఈశ్వరా !


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


రాలిన పత్రమ్  రవళించగ  నాడే మయూరి .

వీచిన  మారుతమ్  వినువీధున  వీక్షించేన్ .

అంబర వాణి   బలికే   ఆలంబన రాగం .

తన్మయబొందె   తళుకుల్   తారల్ .

సుందర గుణేశ్వరా  ! సంపన్నేశ్వరా  !      |25|


భావం :

రాలిన ఆకులు  రెప రెపల  శబ్దానికి  నెమలి ఆడెను .

వీచే గాలి  ఆకాశ వీధి   నుంచి  చూచెను .

ఆకాశము నుండి  వాణి  పలికింది  శబ్దానికి ఊతమైన రాగము .

మైమరచి  పోయాయి   మెరిసే  నక్షత్రాలు అన్నీ .

సుందరమైన  గుణములు  గల  ఈశ్వరా ! సంపన్నుడైన  ఈశ్వరా !


యడ్ల శ్రీనివాసరావు 14 July 2025 , 7:30 PM


Sunday, July 13, 2025

657. నీ నిజాయితీ - నీ శత్రువు

 

నీ నిజాయితీ . . .  నీ శత్రువు


“ నీ నిజాయితీ నీ శత్రువు”.  ఇది   ప్రతి ఒక్కరం  ఆమోదించ  వలసిన  విషయం . నిజాయితీ గా ఉండడం వలన అనేక సమస్యలు , నిజాయితీ ని ఆచరించడం వలన   చుట్టూ ఉన్న వారితో పాటు ,  మనకు  మనమే శత్రువుగా  పరిగణించుకో వలసిన  స్థితి పొందుతాము .

ఎందుకంటే  నిజాయితీ అంటేనే  నిప్పు . ఆ నిప్పు  మన  చుట్టూ ఉన్న   అసత్యాన్ని , అధర్మాన్ని  తగలబెడుతుంది ‌, చివరికి  అవసరమైతే  మనల్ని  కూడా . ఇది మనందరి  స్పృహ కి తెలిసిన యదార్థం .

• అందుకే ఎందుకొచ్చిన  నిజాయితీ లే , అని మనం అనేక విషయాలలో  మన బంధువులు , మిత్ర సంబంధీకులు  తమ ప్రవర్తన తో  చేసింది తప్పు అని తెలిసిన సరే నోరు తెరిచి వారికి చెప్పం , వారిని ఖండించం,  వారిని సరిదిద్ధం .  సరికదా మనల్ని మనం సరిదిద్దు కొనే ప్రయత్నం చేయము .  

దురదృష్టవశాత్తు , ఇటువంటి పరిస్థితి  రేపు మన ఇంటి  పిల్లల  ప్రవర్తన లో  నిజాయితీ యొక్క లోపం  కనిపిస్తే ,  మనకేందుకు లే  అని వారిని  ఖండించ కుండా  ఉంటామేమో  కదా .  ఎందుకంటే  మనం నిజాయితీగా వారిని ఖండిస్తే సమస్యలు పెరుగుతాయి కదా .  మనకు సమాజం లోని  వారి పట్ల ఇదే అలవాటు ఉన్నప్పుడు, మన  ఇంటికి కూడా అదే వర్తిస్తుంది కదా .


• మనం సత్యం ఇతరులకు చెప్పడం వలన , లేదా సత్యం ఆచరించడం వలన ఇంటా బయటా మనకు అనేక సమస్యలే సమస్యలు. అందుకే కదా గుంపులో గోవిందా అనుకుంటూ, తందాన తాన అంటూ గుడ్డి  ఎద్దు లా   ఆనందం గా జీవిస్తూ  ఉంటాం.  చెప్పాలంటే  అలా జీవించడానికి   మనం   పూర్తిగా అలవాటు పడిపోయాం. దీనికి అతీతంగా నిజాయితీ తో ఉండడం లేదా మాట్లాడడం అంటే ముందుగా మనలో భయం అనే భూతం పుడుతుంది కదా .


• చిన్నతనం నుంచి బడి పుస్తకాల లో , ఉపాధ్యాయుల  దగ్గర  అమాయకంగా  నేర్చుకున్న , చదివిన , ఈ నీతి వాక్యాలు  , కధలు , విలువలు , ఆదర్శాలు , మనల్ని చాలా చాలా  మోసం చేశాయి  అని  నేడు మనకు  అనిపిస్తుంది  కదా . 

ఎందుకంటే గురువులు చెప్పిన  విలువలు , నీతి , న్యాయం  ప్రకారం నేడు మనుగడ సాగిస్తే , దొంగ లా అందరికీ భయపడుతూ ఉండవలసి వస్తుంది .   కానీ ,  దొర లాగ ధైర్యం గా బ్రతకాలి అంటే , మనసులో  నీతి నిజాయితీ లను తుంగ లో తొక్కితే ,  ప్రతీ క్షణం సంతొషం గా , నాటకీయంగా అద్బుతం గా  జీవించవచ్చు . ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఆనందం గా ఉండొచ్చు .  నేడు అవునన్నా కాదన్నా మనందరం ,  జీవితం లో ఎన్నో అనుభవాల ద్వారా తెలుసుకున్న ఏకైక సత్యం ఇదే ... కదా .


• అందుకే కాబోలు,  మహానుభావులు అంటుంటారు , నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేవి  చెప్పడానికే  కానీ ఆచరించడానికి కాదు అని .


• నేటి కాలంలో మనిషి లో అసలు సిసలైన ధైర్యం చచ్చిపోయింది. ప్రస్తుతం మనిషి కి ఉన్న ధైర్యం , తన పిరికితనానికి కొనసాగింపు . ఈ విషయం గ్రహించలేక  దురదృష్టం కొద్దీ , ఆ పిరికితనమే  అసలైన ధైర్యం అనుకుంటూ మాయా మత్తు లో హాయిగా బ్రతికెస్తూ ఉన్నాం . ఎందుకంటే మన పొట్ట చల్లగా ఉంది అది చాలు కదా మనకి .


• అందరిలాగే  నేను,  నా  జీవిత అనుభవాల ద్వారా , తెలుసుకున్న పాఠం ఏమిటంటే . . .

  " నీ  నిజాయితీ  నీ శత్రువు  . .  . 

    నీ శత్రువే , నీ అసలైన మిత్రుడు " .


• నువ్వు ఎప్పుడైతే నిజాయితీ తో, నీతి తో, ధర్మం తో ఉంటావో తప్పని సరిగా సమాజం లోని వ్యక్తులు ,  మిత్రులు  , కుటుంబ సంబంధీకు ల తో  తప్పకుండా  మొదట్లో  వ్యతిరేకత వస్తుంది.  ఎందుకంటే నువ్వు ముమ్మాటికీ  వారిలా, లేవు మరియు వారిలా ఉండడం లేదు కాబట్టి .  ఇక వారిలో లో నిజాయితీ లేదు కాబట్టి , నీ నిజాయితీ ని   వారు  అంగీకరించరు .


• ఈ సమయంలో  నువ్వు  ముక్కు సూటిగా నిజాయితీగా  వ్యవహరిస్తే ,  వారు నిన్ను తప్పకుండా  నిందిస్తారు, అవమానాలకు గురి చేస్తారు, మోసం చేస్తారు , తడిగుడ్డతో గొంతు కోస్తారు,  ఎంతకైనా తెగిస్తారు  ఇలా నీ జీవితంలో  నువ్వు  ఎన్నడూ   చూడని ఊహించని  వ్యతిరేకతలను నీ పై చూపిస్తారు .

ఈ దశ లో   అప్పటి  వరకూ నీ లో  ఉన్న , నీ నిజాయితీ  నీకు పూర్తిగా శత్రువు అవుతుంది . ఇదంతా  నీకు మరియు బాహ్య  ప్రపంచ సంబంధీకుల మధ్య  జరిగే వ్యవహారం .


• సరిగా ఇలాంటి వ్యతిరేకమైన సందర్బం సమయంలో  . . .   అంతర్గతంగా   నీ లో మరుగున పడి   ఉన్న   కొన్ని   లక్షణాలు అయిన  కోపం , అసహనం , నిస్సహాయత , అహంకారం , కుంగుబాటు , పట్టుదల  వంటివి  కూడా   నీ లో లో  ప్రేరేపితం అవుతూ,  నీ లోని నీతి  నిజాయితీ లను   నీకు   శత్రువు గా చూపిస్తాయి అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

సరిగా ఇదే  సమయంలో  నీ  బుద్ధి   చిత్త శుద్ధి తో సమర్దవంతంగా పనిచేస్తే , నీ లోని నీతి నిజాయితీ తో పాటు   వివేకం , ఓర్పు , సహనం , సమయస్ఫూర్తి ,  ధైర్యం , నిరీక్షణ వంటి వి  ప్రస్ఫుటంగా ఉంటే , మొదట నీ లోపల ఉన్న   అవగుణాల పై పోరాటం  జరిగి ,  నీ పై నువ్వు విజయం సాధించగలవు . ఈ దశలో  నువ్వు ఒంటరి గానే ఉంటావు . చెప్పాలంటే , ఇది నిన్ను . . . ఉన్న స్థితి నుంచి  ఉన్నత స్థితికి  చేర్చే  బృహత్తరమైన అంతర్యుద్ధం .


• ఏనాడైతే  నీ లోని  శత్రు గుణాలకు నీవు లొంగకుండా ఉంటావో , నీ పై  నీ  విజయం తథ్యం. ఒకసారి విజయం సాధించిన తరువాత , ఆ శత్రు గుణాలు పూర్తిగా నశించి , అవే నీ లోని నీతి నిజాయితీ లకు దాసోహం అవుతాయి, ఇదే నీ లోన ఉన్న శత్రువులు మిత్రులుగా మారడం అనవచ్చు .


• అదే విధంగా బాహ్య ప్రపంచ సంబంధాలు అన్నింటిలో   ఎవరైతే  నీ నిజాయితీ ని వ్యతిరేకిస్తూ వస్తారో . . . కొంత కాలం , సమయం తరువాత వారి దగ్గర లేనిది, నీ దగ్గర ఏముందో తప్పక తెలుసుకుంటారు, వారు తమ జీవిత కాలం ద్వారా పొందలేనిది నువ్వు ఏం పోందావో తెలుసు కుంటారు . . . చివరికి తమలో తాము, తమ అజ్ఞానానికి చింతిస్తారు . 

• నీ నిజాయితీ నీ శత్రువు అయింది  కదా అనుకొని అక్కడే ఆగిపోతే  నీవు ఒక ఫెయిల్యూర్ . అలాకాకుండా శత్రువే  నీ మిత్రుడు అని ముందుకు సాగిపోతే   అదే నీ సక్సెస్ .


• మనిషి కి ప్రాణం అంటే తీపి. ప్రాణం అంటే భయం. ప్రాణాన్ని కాపాడుకోసమే మనం జన్మ ఎత్తి నట్లు భావిస్తూ ఉంటాం . మరి ఎందుకని ప్రాణాన్ని శాశ్వతం గా, అమరం గా ఉంచుకోలేక పోతున్నాం . … సరే ప్రాణం ఏదో రోజు పోతుందని తెలిసి నా కూడా , నీతి నిజాయితీ లను ఎందుకని ధైర్యం గా ఆచరించ లేకపోతున్నాం ‌ . ఆచరించే లేకపోయినా గాని ఇతరులు ఆచరించినపుడు  ఎందుకని అంగీకరించ లేకపోతున్నాం .  ప్రాణం పోయినా సరే , నీ  నీతి నిజాయితీ  మార్గ దర్శకం తో కొందరికైనా  ప్రేరణ అయి , ఈ భూమి మీద అమరం గా ఉంటాయి . 

దీనిని బట్టి మనమే  ఆలోచించు కోవాలి మనిషి గా పుట్టినందులకు మన కోసం మనం ఏ విధమైన   సంపాదన  వృద్ధి  చేసుకుంటూ  కాలం లో  నిరంతరం  పయనిస్తూ  ఉన్నాం అనేది .


గమనిక : ఈ రచన లో    నీ , మనం అనే పదాలు పాఠకులకు అర్దం అయ్యే విధంగా సహజత్వం కోసం రాయడం జరిగింది . అంతేకానీ   నీ ,  మన అనే పదాలు ఎవరినీ ఉద్దేశించి కాదు . ఎందుకంటే ఇది రాసిన వాడు కూడా  అంత ఉత్తముడు, ఉన్నతుడు, యోగ్యుడు  కానే  కాదు .


ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 13 July 2025 11:00 am.

Friday, July 11, 2025

656. పరమాత్ముని మిణుగురులు

 

పరమాత్ముని  మిణుగురులు


• దేవుడే     అయ్యాడు 

  వెలుగై న   దీపమై .

• ఆ  వెలుగు కి   చేరాయి

  మిణుగురు లు .


• దేవుడే    అయ్యాడు 

  వెలుగై న    దీపమై

• ఆ వెలుగు కి   చేరాయి

  మిణుగురు లు .


• వెలుగు లో   పారవశ్య మై

  కొన్ని    బలిహర మయ్యాయి .

• వెలుగు  వేడిమి     తాళలేక

  కొన్ని   దూరం గా   నిలిచాయి .

• వెలుగు ను    చూడలేని వన్నీ

  ఎటో  ఎటో    పారి పోయాయి .


• దేవుడే   అయ్యాడు 

   వెలుగై న   దీపమై .

• ఆ వెలుగు కి   చేరాయి 

   మిణుగురు లు .


• బలిహరమైన  మిణుగురులన్నీ 

  ఆడాయి

  వెలుగు తో   ఆలంబనమై .


• దరిచేర   లేని  వన్నీ    

  చింతించాయి 

  తమకు    అదృష్టం లేదని .


• ఇక   గల్లంతైన న  మిణుగురులు 

  నక్కి నక్కి     బిక్కి   బిక్కి

  లబో దిబో మంటూ 

  రోదిస్తున్నాయి .


• దేవుడే   అయ్యాడు 

  వెలుగై న    దీపమై .

• ఆ వెలుగు కి   చేరాయి 

  మిణుగురు లు .


• ఆ వెలుగు   పరంజ్యోతి 

  పరమాత్మ    శివుడు .

• ఆ  మిణుగురులు 

  ఆత్మ లైన    మానవులు .


మిణుగురులు = దీపపు పురుగులు .

ఆలంబనము = ఆధారము .


యడ్ల శ్రీనివాసరావు 12 July 2025

 5:00 AM 

Thursday, July 10, 2025

655.రాధే రాధే - రాదే రాదే

 రాధే  రాధే  . . . రాదే  రాదే


• రాధే రాధే    రాదే రాదే

  విరిసిన   విరజాజి   ఊగుతూ 

  చూస్తుంది   నీకై  .

• రాధే రాధే    రాదే  రాదే .

  తీగ న  మల్లి    నీ కురుల కై 

  వేచాను     అంటుంది 

  మల్లి  మల్లి .


• రాధే  రాధే     రాదే  రాదే 

  రాధే  రాధే     రాదే  రాదే .


• ఈ  సాయం   కోరింది    నీ సాయం .

  పౌర్ణమి  వెన్నెల న

  తొణికాడు    చంద్రుడు   

  పాల లో  .

• ఈ సమయం   వెలుగైంది   నీ కోసం .

  నందన   వనం లో

  తిరిగాడు   కృష్ణుడు  

  మురిపాల కై .


• రాధే రాధే     రాదే రాదే


• రాధే రాధే      రాదే రాదే .

  సంపెంగ    సొగసు తో

  సొమ్మసిల్లింది    నీకై .

• రాధే రాధే    రాదే రాదే .

  లాలన తో   లిల్లీ    నీ  ప్రేమ కై

  నోచాను  అంటుంది   

  మళ్లీ   మళ్లీ .


• రాధే రాధే     రాదే రాదే 

  రాధే రాధే     రాదే రాదే .


• ఈ ప్రాయం   కోరింది   నీ పరువం .

  గోపాల  రాగం లో

  మైమరిచాడు   మురారి   

  మాయ లో  .

• ఈ ప్రణయం   కలిసింది   నీ కోసం .

  గోకుల   తీరం లో

  పాడాడు  శ్యాముడు  

  మురిపెం గా .

• రాధే రాధే     రాదే రాదే

  రాధే రాధే     రాదే రాదే .


సాయం = సాయంత్రం , సహాయం.

ప్రణయం = పరిచయం.


యడ్ల శ్రీనివాసరావు 10 July 2025 8:00 PM.

Wednesday, July 9, 2025

654. గురు(వు) పౌర్ణమి


గురు(వు) పౌర్ణమి


• మనిషి ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు ఏదోక అంశం లోనో, విషయం పైనో ఆలోచిస్తూ నే ఉంటాడు. అసలు ఈ ఆలోచనలు ఎందుకు అంటే కర్మలు (పనులు) చేయడానికి.

మరి ఈ కర్మలు సరిగా ఉంటున్నాయా ? అని ప్రశ్నిస్తే , వాటికి కారణభూతమైన, ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా సరైనవే నా ? కాదా ? అనే నిర్ణయ శక్తి కూడా బుద్ధి కి  ఉండాలి …. ఇదంతా స్వయం గా  మనకు మనం  ఎలా తెలుసు కో గలం ?

ఎందుకంటే మనిషి తనకు తోచిన ఆలోచన తో కర్మ చేస్తే , దాని ఫలితం సంతోషమా? దుఃఖమా? ఏది లభిస్తుంది…. పాపమా? పుణ్యమా? ఏది లభిస్తుంది  ,  అనేదానికి సమాధానం , కర్మ చేసేముందు తెలియాలి. అంటే మనం ఆలోచించే ఆలోచన సరైనదా కాదా అని మనకే ముందు గా తెలియాలి. ఇది తెలియాలి అంటే మనకు జ్ఞానం అవసరం.


• ఈ జ్ఞానం ఇచ్చేది , చెప్పేది కేవలం సద్గురువు మాత్రమే. సద్గురువు మనిషి లోని అజ్ఞానం అనే చీకటి పారద్రోలి ,   పౌర్ణమి వెన్నెల వంటి చంద్ర ప్రకాశాన్ని  జ్ఞానం తో నింపుతాడు. అదే గురుపౌర్ణమి విశిష్ఠత .  అందుకే  శివుని సిగ పై చంద్రుడు ని  చూపిస్తారు .


ఈ కలియుగంలో, మనిషి ఎంత ధనం కీర్తి హోదా సంపాదించినా సరే జ్ఞానానికి నోచుకో లేక దుఃఖం తో విలవిలలాడుతూ  ఉంటాడు .  ఈ దుఃఖం శారీరకంగా  నైనా లేదా  మానసికంగా నైనా ఉంటుంది . ఇది అంగీకరించ వలసిన పరమ సత్యం . 


• అసలు జ్ఞానం అంటే ఏమిటి ?

జ్ఞానం అంటే  మనిషి బుద్ధి కి వెలుగు , వికాసం .  జ్ఞానం సముద్రం వలే అనంతమైనది .  జ్ఞానాన్ని  కొలవడం అసాధ్యం .  జ్ఞానం శివుని యొక్క సంపద . అందుకే శివుడిని  సద్గురువు మరియు జ్ఞాన సాగరుడు అని అంటారు.

సృష్టి కర్త అయిన పరమాత్మ శివుడు తన జ్ఞానాన్ని  బ్రహ్మ కి ఇస్తాడు . బ్రహ్మ ఆ జ్ఞానాన్ని తన రచన ద్వారా  లోకానికి అందిస్తాడు. యుగాల అనుసారం అది  సద్గురువు ల చే అది మానవులకు చేరుతుంది. 

సత్య యుగం, త్రేతాయుగాలలో  ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఆచరించడం వలన , సహజంగా దేవతలందరూ  జ్ఞాన వంతులై ఉంటారు . దీనినే బ్రహ్మ పగలు అంటారు. 

ద్వాపర, కలియుగాలు పూర్తిగా అజ్ఞానం నిండి ఉండడం వలన  బ్రహ్మ రాత్రి అంటారు .  ఈ యుగాలలో  భగవంతుని కోసం భక్తి చేస్తూ ఉంటారు కానీ , జ్ఞానం లభించని కారణంగా భగవంతుని యధార్థం తెలుసుకోలేరు. 


త్రేతాయుగం చివరి సమయం వచ్చేసరికి  ఆత్మ లలో ని  శక్తి  తగ్గి ,  వికారాలు ఆరంభం అవుతాయి . ఇదే  రావణాసురుని ఆగమనం. ఈ సమయం నుంచి  అజ్ఞానం మొదలై  వికారీ కర్మలు చేయడం ద్వారా దుఃఖం ఆరంభమవుతుంది.  అప్పుడు  జ్ఞానం కొంత అవసరం కలుగుతుంది.  

తదుపరి ద్వాపర యుగంలో దుఃఖం మరింతగా పెరుగుతుంది.  కలహాలు యుద్ధాలు మొదలై జ్ఞానం ఆవశ్యకత మరింత పెరుగుతుంది. 

ఇక కలికాలం వచ్చేసరికి  అజ్ఞానం పూర్తిగా రాజ్యమేలుతుంది. మానవుడు దుఃఖ సాగరంలో  మునిగి పోయి ఉంటాడు. మంచి చెడు లు, పాప పుణ్యాల   వ్యత్యాసం  పూర్తిగా మరచి  అయోమయం గా  జీవించడం మొదలెడతాడు .

ఈ కలియుగ అంత్య  సమయంలో  స్వయం గా శివుడే  శక్తి స్వరూపమై , సద్గురువు అయి  ఒక వృద్ధ తనువు లో ప్రవేశించి , సృష్టి ఆది మధ్య రహస్యాలు , ఆత్మ పరమాత్మ  యొక్క జ్ఞానం తెలియజేస్తాడు .  

 

ఈ బ్రహ్మ జ్ఞానం  ఎవరైతే తెలుసు కొని పూర్తిగా  ఆచరిస్తారో వారు మాత్రమే బ్రాహ్మణులు గా  పిలువ బడడానికి అర్హత కలిగి ఉంటారు  .


• బ్రహ్మ జ్ఞానం లో అనేక గుప్త విషయాలు , కర్మల రహస్యాలు వాటి గతి ఉంటాయి. సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలు స్పష్టం గా ఉంటాయి. త్రికాల  పయనం , జన్మల రహస్యం తెలుస్తాయి. ధర్మం  విధి విధానం ఆచరణ స్పష్టం గా తెలుస్తుంది .

 సమస్య అనేది ఉండడం నిజం అయితే దానికి పరిష్కారం కూడా ఉంటుంది అనేది నిజం . ఈ పరిష్కారం జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. 

గీతా సారం పరమ జ్ఞానం . 

రెండవది . . .   వేదాలు పురాణాలు ఉపనిషత్తులు శాస్త్రాలు , అర్దం కాని శ్లోకాలతో  ఢాంభికం  ప్రదర్శించే  ప్రతీ ఒక్కరూ కూడా జ్ఞానులు అనేది కేవలం అపోహ మాత్రమే .  జ్ఞానం తెలిసిన వాడు ఎన్నడూ తన జ్ఞానాన్ని ఢాంభికం గా  ప్రదర్శన  చేయడు.  పదిమందికి  నిస్వార్థం గా  ఏదో రూపంలో  పంచుతాడు .  జ్ఞాని  నిరాడంబరుడు .


•  ఎంతో  తపన  సాధన తో  భగవత్ ధ్యాన సాధన  చేసిన మానవ రూపంలో ఉన్న కొందరు గురువు లకు , కొంత వరకు మాత్రమే  జ్ఞానం  లభించింది .  ఒకానొక కాలాలలో  సత్యమైన గురువులు అనేకులు ఉండేవారు.  


మరి ఇటువంటి సత్యమైన గురువులు 

నేటి మాయా లోకం లో , కలియుగం లో  ఉన్నారా  ?  

ఉంటే  . . .  

నిస్వార్థం గా  మనకు లభిస్తారా ?  

అంటే . . . కొంత సందేహమే ?   

ఎందుకంటే నేడు గురువులు అని చెప్పుకునే వారి అనేకుల  తీరు . . . " పైసా  మే పరమాత్మ హై ‌"  అనే స్థితిలో ఉన్నారు .  ఎందుకంటే ఇది పూర్తిగా  కలి మాయా ప్రభావంతో  నడిచే కాలం. 

• అందుకు ప్రత్యామ్నాయంగా చేయవలసినది ఏమంటే  . . .

 పరమాత్మ , జ్ఞాన సాగరుడు అయిన శివుని తో అనుసంధానం అయి ప్రతి రోజూ కొంత సమయం తెల్లవారుజామున   శివ స్మృతి మరియు స్మరణ చేస్తూ ఉంటే , సాక్షాత్తు శివుడే తప్పకుండా మానవ రూపంలో ఉన్న సద్గురువు చెంతకు, ఏదొక విధంగా చేరుస్తాడు . ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇదంతా రాస్తున్న వాడు.

• సద్గురువు చెప్పిన జ్ఞానం  విని ఆచరించడం వలన  దుఃఖం , జన్మాంతరాల  పాప కర్మల భారం తొలగుతుంది .  ఆలోచనల లో పవిత్రత , పరిపక్వత వస్తుంది.  తద్వారా శ్రేష్ట కర్మలు చేయడం సాధ్యం అవుతుంది, పిదప అనంతమైన సంతోషం లభిస్తుంది.

• మానవ శరీర పోషణ కోసం ఆహారం ఎంత అవసరమో, అదే విధంగా మానవుని లో ఉన్న ఆత్మ  ఉన్నతి సాధించడం కోసం ,  ముక్తి కోసం జ్ఞానం అంతే అవసరం . ఎందుకంటే ఒకసారి ఆత్మ లో సత్య  జ్ఞానం నిక్షిప్తమై ఉంది అంటే , శరీరం వదిలేసి (చనిపోయాక) మరో జన్మ లో శరీరం తీసుకున్న (పుట్టిన) తరువాత కూడా జ్ఞానం  బుద్ధి లో  , తరువాతి  21 జన్మల‌ వరకు ఒక సంస్కారం గా  కొనసాగుతూనే ఉంటుంది  .


• గురుపౌర్ణమి విశిష్టత తెలుసుకుని, శివుడిని నిత్యం ఒక గంట ఉదయం కానీ, సాయంత్రం కానీ  ఏకాంతం గా  45 రోజులు  మనసు తో స్మరిస్తే  సద్గురువు తప్పకుండా లభిస్తాడు . మంచి మార్గం చూపిస్తాడు.

• ఆడంబరంగా చేసే పూజ కంటే . . . . మౌనం తో మనసు లో  చేసే శివ స్మరణ వంద రెట్లు ఉన్నతి నిస్తుంది .


భగవంతుని పై భక్తి ఉండడం అవసరం. కానీ ఈ భక్తి చేసే విధి విధానాలలో మూలం , సూక్ష్మం అర్దం , తెలుసు కోవడం చాలా అవసరం .  

  ఎవరు మంచి చెప్పినా ముందు వినడం అలవాటు చేసుకోవడం  ఉత్తముని  లక్షణం. వింటూ ఉంటే , ఏదో నాడు మంచిని అర్దం చేసుకోవడం , మంచిని మాట్లాడడం, మంచి మార్గం లో పయనించడం సహజంగా అలవాటు అవుతుంది . మంచి వలన కలిగేది మిగిలేది ఆనందం .


ఈశ్వరుని ఆదేశానుసారం . . .


  అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏

  ఓం నమఃశివాయ 🙏

  ఓం శాంతి 🙏 .

 సర్వేజనా సుఖినోభవంతు 


 యడ్ల శ్రీనివాసరావు 9 July 2025 11:00 PM .


Sunday, July 6, 2025

653. సంకల్పాలు – నిదర్శనాలు

 

సంకల్పాలు – నిదర్శనాలు




• మనిషి కి  తన జీవితంలో  ఆశించిన వి , కోరుకున్నవి   తీరుతూ ఉంటే  మనసు లో సంతోషాన్ని  అనుభవించే తీరు  పెరుగుతూ ఉంటుంది. 

 కొన్ని సార్లు  ఉన్న స్థితి కి  అతీతమైనవి గా అనిపించినా సరే ,  ఊహించిన ఆలోచనలు ప్రయత్నం చేయకుండానే నిజం అయితే ఆనందం ఉరకలు వేస్తుంది.  అవి చిన్నవి అయినా, పెద్దవి అయినా సరే ఆశ్చర్యం లో మునిగి తేలుతూ ఉంటాం.  ఇది ఆత్మ విశ్వాసం పెరగడానికి దోహదం అవుతుంది. దీనినే సంకల్ప బలం అని కూడా అంటారు.

• పవన్ కళ్యాణ్  అనే వ్యక్తి సినిమా నటుడు గా కంటే కూడా, పది సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ లో ఉన్నప్పటి నుంచి ఆయన ఆలోచన సరళి, నిజాయితీ కోసం ఎవరినైనా ధైర్యం గా ఎదిరించి  ఒంటరిగా పోరాటం చేయడం , ఆయన తన ధనాన్ని సహయత కి ఉపయోగించడం వంటివి నాకు ఆసక్తి  కలిగించేవి . నటుడి గా ఆయన మీద అభిమానం అనే దాని కంటే , ఆయనకు సమాజం పట్ల ఉన్న సరళి నన్ను  ప్రభావితం  చేసేది  . బహుశా ఇదే ప్రభావం తో , గత సంవత్సరం  ఎన్నికల  సమయంలో “జన గళం “ అనే పాట స్వతహాగా ప్రేరణ తో రాయడం జరిగింది .

  రాజకీయాల పై అంతగా ఆసక్తి లేని నాకు, ఇటీవల కొన్ని సభ లలో , ప్రతీ అంశం పట్ల లోతైన అవగాహన తో పాటు జ్ఞాన యుక్తం గా మూలాల్లోకి వెళ్లి మాట్లాడి, ప్రజలకు అర్దం చేస్తున్న తీరు నాకు చాలా బాగా అనిపించింది . ఒక నాయకుడు ఆధ్యాత్మిక చింతన , భావాలు కలిగి ఉండి రాజకీయంగా ప్రజలకు సామాజిక సేవ చేయడం , నైతికత ను పాటించడం అంటే అంత సాధారణ విషయం కాదు . అది అందరికీ సాధ్యం కాదు .


• సుమారు, నాలుగైదు నెలల క్రితం ఒక టి.వి. ఛానెల్ లో ఒక సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ని చూస్తున్నప్పుడు , మనసు లో అనిపించింది ఈయనను నేను అసలు డైరెక్ట్ గా చూడగలనా, కలవగలనా అని మనసులో బలంగా అనిపించింది. నా ఆలోచన కి నాలో నేను నవ్వు కున్నాను . ఎందుకంటే అది సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ ఎందుకో ఒకసారి ఆయనను చూస్తే బాగుండు అని అప్పుడప్పుడు మూడు నాలుగు నెలల క్రితం అనిపించేది .


• ఒకరోజు . . . మే నెల 23 వ తేదీ రాత్రి 9:00 గంటలకు మా ఆశ్రమం నుంచి గురువుగారు అకస్మాత్తుగా ఫోన్ చేసారు .

 గురువు గారు : శ్రీనివాస్, … రేపు తెల్లవారు జామున 5 గంటలకు, మనం విజయవాడ వెళ్ళాలి . . . ఉదయం 9:00 గంటలకు ఒక ఫంక్షన్ కి హాజరు కావాలి , నువ్వు తప్పని సరిగా రావాలి, తిరిగి మధ్యాహ్నానికి వచ్చేద్దాం . . . నీకు రేపు వీలవుతుంది కదా .

 నేను : (ఏమీ ఆలోచించకుండా) సరే నండి.


  ఏ ఫంక్షన్ , ఏమిటి అని ఆయనను నేను అడగలేదు. ఏదో వివాహ కార్యక్రమానికి, గురువు గారు ఆశీర్వాదం ఇవ్వడానికి, వెళుతున్నా రేమో అని మనసు లో అనుకున్నాను.

• మరుసటి రోజు శనివారం , నాకు సెంటిమెంట్ గా Black Blue (Saturn colours) dress వేసుకుని 5:00 గంటలకు గురువు గారి తో విజయవాడ  బయలు దేరాము.

 విజయవాడ సమీపం లో కి వెళుతుండగా. . . 

 

నేను :   గురువు గారు . . . మనం హాజరు అయ్యేది పెళ్లికా ? . . . ఫంక్షన్ హాలు విజయవాడ లో ఎక్కడండి ?

  గురువు గారు : పెళ్లి కాదు . పవన్ కళ్యాణ్ ని కలవడానికి  తుమ్మల పల్లి కళాక్షేత్రం లో . ఈ రోజు ప్రకృతి జీవ వైవిధ్య సదస్సు (BIO DIVERSITY DAY) అక్కడ జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి ముగ్గురు ఉత్తమ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి, ఈ రోజు అవార్డు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు. ఇందులో మన కడియం గ్రామం నుంచి , బాగా తెలిసిన ఒకరికి అవార్డు వచ్చింది. ఆయన నిన్న నన్ను కలిసి గురువు గారు మీరు తప్పకుండా రావాలి , మీరు చూస్తుండగా నేను అవార్డు తీసుకోవాలి అని చెప్పి, VIP పాస్ లు ఇచ్చారు .

  నేను :  నాకు ఒక నిమిషం . . . ఏం అర్దం కాలేదు . ఇది కలా ? నిజమా ?  అనిపించింది .

• ఇంతలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకున్నాం .  విపరీతంగా పోలీసులు , సెక్యూరిటీ ఉంది . బయట విపరీతమైన పబ్లిక్ , వారిని లోనికి పంపించడం లేదు .

  అవార్డు గ్రహీత అయిన రైతు ద్వారా వచ్చిన పాస్ అవడం వలన స్టేజ్ ఎదురు గా మొదటి వరుసలో కూర్చునే అవకాశం లభించింది.

• సుమారు 11:30 గంటలు సమయం లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా 15 మంది Black commando protection  చుట్టూ వలయం ఉంది.

  ప్రోగ్రాం సుమారు రెండున్నర గంటల పాటు జరిగింది.   స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం 50 నిమిషాలు జరిగింది. ఆయనకు ఎదురుగా డైరెక్ట్ గా 15 అడుగుల దూరంలో మొదటి వరుసలో కూర్చోని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది .

• ఆయన ప్రసంగం తరువాత, అవార్డు గ్రహీతల ను మాత్రమే స్టేజ్ పైకి  అవార్డు ప్రెజెంటేషన్ కోసం పిలుస్తున్నారు. 

ఆ సమయంలో  స్టేజ్ మొత్తం సెక్యూరిటీ కంట్రోల్ లో ఉంది .


• ఆ సమయంలో మా గురువు గారు మనసు లో సంకల్పం చేశారంట, పవన్ కళ్యాణ్ గారి ని స్వయం గా కలిసి ఆయనకు , తన తో తీసుకు వచ్చిన లక్ష్మీనారాయణల ఫోటో బహుకరించాలి అని . 

• ఇంతలో  మా కడియం రైతు గారిని స్టేజ్ మీద కి పిలిచారు . ఆయన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి కి ఏదో చెప్పారు. . . వెను వెంటనే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ కి  సిగ్నల్ ఇవ్వడం, మా గురువు గారి ని , ఆశ్రమం లో సిస్టర్స్ ని స్టేజ్ మీద కి  వెళ్లడానికి  పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారి కి ఫోటో బహుకరించారు. 

గురువు గారితో కలిసి నేను స్టేజ్ ఎక్కుతుండగా , నేను white dress లో లేనని , సెక్యూరిటీ నన్ను stage steps వద్ధ ఆపేశారు . అప్పటికీ మా గురువు గారు , నన్ను పంపించమని సెక్యూరిటీ తో చెప్పినా , వారు నా డ్రెస్ కారణంగా నన్ను ఆపేశారు. . . అయితే నేమి దాదాపు మూడు గంటల సమయం , ప్రశాంతంగా అతి సమీపంలో ఎదురుగా కూర్చుని చూశాను. ఆయన హావభావాలు గమనించాను.


• గత కొన్నాళ్లుగా ఎన్నో ఎన్నెన్నో అనిపించిన ఊహించిన , సంకల్పాలు ఊహించని విధంగా నెరవేరడం ఆశ్చర్యం అనిపిస్తుంది .

ప్రయత్నం చేయకుండానే, మంచి సంకల్పం తో నెరవేరే  కోరికలలో  భగవంతుని  శక్తి, సహాయం దాగి ఉంటుంది. 


చెప్పడానికి  ఇది  అంత  విశేషమైన విషయం కానప్పటికీ  . . . 

సంకల్ప శక్తి కి  నిదర్శనం ఉంటుంది  అని వ్యక్తం చేయడానికి  మాత్రమే .


యడ్ల శ్రీనివాసరావు 7 July 2025 11:00 AM




652. భగవంతుని కి నీ అవసరం ఉందా?


 భగవంతుని కి  నీ  అవసరం ఉందా? 


ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా . . . 

  భగవంతుని కి   నీ  అవసరం ఉందా ? 

  అవును  . . . ముమ్మాటికీ ఉంది .


• సాధారణంగా మనిషి తన కోరికలు తీరడానికి, తన దుఃఖం , సమస్యలు తొలగి పోవడానికి , సుఖం కోసం, అవసరాల కోసం భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటాడు.

 ఇక్కడ , మనిషి తనకు మాత్రమే భగవంతుని యొక్క అవసరం ఉందని భావిస్తాడు. అందుకే పూజలు , భక్తి  చేస్తున్నాను  అంటాడు .

‌ కొన్ని సార్లు అయితే , నేను ఎన్ని పూజలు  వ్రతాలు చేసినా , నైవేద్యాలు సమర్పించినా దేవుడు  నా పై  ఇంకా కరుణ చూపించడం లేదు అంటాడు . నా సమస్యలు లేదా నా కోరికలు తీర్చలేదు  అంటుంటాడు . 

మరికొందరు అయితే , తమకు లేదా తమ వారికి ఏదైనా మరణం గాని , విషాద సంఘటనలు గాని సంభవిస్తే ,  ఆ భగవంతుడు ఓర్చుకో లేక పోయాడు ,  మా సంతోషాన్ని చూడ లేక పైకి తీసుకు పోయాడు  అని దూషణలు చేస్తూ నిందిస్తారు ‌.

 అంతే కానీ . . . భగవంతుడు వలనే మేము సంతోషంగా ఉన్నాము , భగవంతుడు మా అవసరాలు తీర్చాడు అని మనస్ఫూర్తిగా వ్యక్తం చేసే వారు చాలా చాలా అరుదుగా ఉంటారు . 

 మనిషి కి , భగవంతుడు కేవలం కష్టాల్లో మాత్రమే అత్యంత అవసరం అవుతాడు . ఎందుకంటే ఈ సమయంలో మనిషి నిస్సహాయడు గా ఉంటాడు కాబట్టి . మిగిలిన సమయం సందర్భాలలో  మనసు తో మాత్రం భగవంతుని  స్మరించడు .  


ఇంతకీ భగవంతుని కి నీ అవసరం ఉందా అంటే ? . . . సమాధానం తప్పకుండా ఉంది.

• ఒక కుటుంబం లో . . . జన్మ నిచ్చిన తల్లి తండ్రలు  ఎన్ని కష్టాలు భరించి అయినా సరే తమ పిల్లల  పోషణ పాలన చేస్తారు. ఇది వారి బాధ్యత.  

పిల్లలు పెద్ద వారు అయిపోయినా  సరే , పెళ్లిళ్లు అయినా సరే, వారి పద్ధతులు సంస్కారాలు అలవాట్లు ఎలాంటివైన సరే తల్లి తండ్రులు జీవించి ఉన్నంత వరకు తమ పిల్లల మరియు మనుమల  సంరక్షణ , ప్రేమ కోసం విలవిలాడుతుంటారు . పొరపాటున కూడా తమ పిల్లలకు అపకారం తలపెట్టరు .


అదే విధంగా  . . . 

ఈ సృష్టి లోని మానవులు అందరూ భగవంతుని సంతానం. ఇది జగమెరిగిన సత్యం. భగవంతుడే సృష్టి కర్త . అందరికీ తల్లి మరియు తండ్రి . మరి భగవంతుడు అయిన తండ్రి తన పిల్లలు అయిన మానవులందరి ని నిరంతరం సంరక్షిస్తూ ప్రేమ తో ఆలనా పాలనా చూస్తాడు. ఇది ఆయన భాధ్యత.


• అందుకే భగవంతుని కి  నీ అవసరం ఉంది. ఆయన నిన్ను ఏనాడూ విడిచి ఉండడు, ఉండలేడు . అలాగే ఆయన నిన్ను విడిచి పెట్టడు , నేటికీ విడిచి పెట్టలేదు కూడా .

 ఎందుకంటే  భగవంతుడు కూడా కర్మ సిద్ధాంతానికి   లోబడి   తన కర్తవ్యం , ధర్మం నిర్వర్తిస్తాడు .  ఈ సృష్టి లోని తన సంతానం అయిన మానవులందరి సంరక్షణ చేస్తాడు. ఇది ఆయనకి అవసరం. భగవంతుడు కర్మ సిద్ధాంతానికి అతీతం కాదు.


• కానీ . . . కానీ . . .

 సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో  , ఏ కుటుంబం లో  నైనా   పిల్లలు  తమకు జన్మ నిచ్చిన   తండ్రి  చెప్పిన విధంగా  నడచుకోక , తండ్రి ని  విలువ గౌరవం తో  గుర్తించక కాదని విడిచి తమ  ఇష్టానుసారం  దూరంగా వెళ్లి పోతే , అదే విధంగా  తల్లి తండ్రుల ను   మనసు లో నుంచి  చెరిపి వేసి , మరచి పోతే  ఆ  తండ్రి మాత్రం  ఏం  చేయగలడు .

  అదే విధంగా సృష్టి కర్త , తండ్రి , పరమాత్మ , భగవంతుడు అయిన శివుని యొక్క యధార్థం తెలుసుకోక , శివుని తో అనుసంధానం కాకుండా మానవులు ఉన్నప్పుడు తండ్రి శివుడు మాత్రం ఏం చేయగలడు .

• నేటి కాలంలో మానవుడు పూర్తిగా మాయ కి వశం అయి వికారాలతో అనేక వికర్మలు చేస్తూ శివుడు అయిన తండ్రి ని పూర్తిగా మరచి పోయి , నేను అనే అహం తో విర్రవీగుతూ ఉంటాడు .

శివుడు అంటే కేవలం గుడిలో ఉండే జడ లింగం అనుకుంటాడు. 

కానీ శివుడు అంటే ఈ విశ్వశక్తి అని ,  ఆ శక్తి నే ఆధార భూతం చేసుకొని మనిషి తాను ప్రాణం పోసుకొని, నేడు జీవనం సాగిస్తున్నాడని విషయం పూర్తిగా మరచి పోయి ఉంటాడు. 

ఆ విశ్వ శక్తి లోని పంచభూతాల మిళితం వలనే తన జన్మ ఆవిర్భావం జరిగింది అని మనిషి తెలుసుకోడు . తాను శివుని సంతానం అని అనుకోడు . తనలో నిండి ఉన్నది శివశక్తి అని స్పృహతో  గ్రహించక , లేనిపోని వికారాలకు , వ్యసనాలకు తన శక్తి ని ఉపయోగిస్తాడు మానవుడు .

• శివుడు ఇదంతా చూస్తూ, అయ్యొ నా పిల్లలు అమాయకులు మాయ లో పడి నన్ను మరిచారు. మాయ వీరిని పూర్తిగా తినేస్తుంది , నేను ఎలాగైనా సం రక్షించాలి అనే తపనతో నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు శివుడు . ఇదే భగవంతుని కి నీ పట్ల ఉన్న ఏకైక అవసరం . 

భగవంతుడు విశ్వ సృష్టి కర్త , అయినా సరే విశ్వాధికారి గా   ఉండజాలడు .  విశ్వ పరిరక్షణార్ధం  సేవకునిగా ఉంటాడు.  అవసరమయినపుడు  పునరతి కోసం ప్రక్షాళనం చేస్తాడు . 


• కానీ , మాయకు వికర్మల కి బానిస అయిపోయి న మానవుడు తన తండ్రి శివుని యధార్థం తెలుసుకోడు . శివుని తో అనుసంధానం అవడు , అవలేక పోతాడు . ఎందుకంటే , ఎన్నో జన్మలు గా తెలిసి తెలియక చేసిన పాప కర్మల మిగిలి ఉన్నందున .

 మనిషి శివుని తో అనుసంధానం కావాలంటే  భౌతిక ప్రపంచం లో   కర్మ శేషం , బుణాలు తీరి పోవాలి . అంత వరకు , శివుని యధార్థం తెలియక ఒక విగ్రహం, లింగ రూపం  మాత్రమే అనుకొని   భక్తి  చేస్తూ  ఉంటాడు .  

• ఈ సృష్టి లో   మనిషి ది  ఎన్నో  జనన మరణాలు కలిగిన జన్మ  జన్మల నిరంతర ప్రయాణం .  తలపై  ఉన్న  వికర్మల భారం తీరాలంటే శివుని స్మృతి నిత్యం ఉండాలి . తిరిగి ఎటువంటి వికర్మలు చేయ కూడదు.


*వికర్మలు అనగా  చెడు కర్మలు, పాపాలు. ఇతరులకు దుఃఖం ఇచ్చుట వంటివి .

ఓం నమఃశివాయ 🙏


On the way to PUNE ✍️

యడ్ల శ్రీనివాసరావు 5 July 2025 ,11:00 PM.



Saturday, July 5, 2025

651. శివోన్నతి

 

శివోన్నతి


• తనువు న    నీ  వే

  తపన లో     నీ   వే

  అణువణువు న   స్మృతి లో   నీ   వే

  బాబా   . . .   ఓ  శివ బాబా .


• నీ   తోడు   లేని    దారి    ఎడారి

  నీ   నీడ     ఉన్న   గూడు  సవారి .


• తల్లి వై    చేర    దీశావు 

  తండ్రి వై   రక్ష   నిచ్చావు  .

• నీవు   లేని   జీవితం    అగమ్యం 

  నిన్ను  నోచుకోని  జన్మం   వ్యర్దం ‌.


• తనువు  న    నీ  వే

  తపన   లో    నీ  వే

  అణువణువు న    స్మృతి  లో   నీ   వే

  బాబా   . . .   ఓ శివ బాబా


• చేతి     రేఖ లోని    త్రిశూలం తో

  తల   రాత నే      తిరగ   రాసావు .

• నుదుటి    రేఖ లోని    త్రి కాలాన్ని

  చేతి   రాత తో     తిరిగి  చూపావు .


• సంకల్ప   శక్తి తో

  అసాధ్యాల   సు సాధన   తెలిసింది .

• సత్యమైన   స్నేహం తో

  నీ  ప్రీతి   ప్రేమ  పాత్ర     దొరికింది .


• తనువు  న    నీ  వే

  తపన    లో   నీ  వే

  అణువణువు  న   స్మృతి లో    నీ వే

  బాబా   . . .   ఓ శివ బాబా ‌.


• నీ   తోడు లేని   దారి   ఎడారి

  నీ   నీడ  ఉన్న  గూడు  సవారి .



బాబా = తండ్రి.

సవారి = పల్లకి 


యడ్ల శ్రీనివాసరావు 5 July 2025 5:30 PM.

On the way to PUNE ✍️.



Tuesday, July 1, 2025

650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?


జాలి  దయ  కరుణ 




• జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . .  మానవుని  ఆత్మ  ఉన్నతి  చెందడానికి  జాలి దయ అనే  గుణాలు  మార్గదర్శకాలు .


జాలి అంటే  ఒకరి పరిస్థితి ని చూసి బాధపడడం ,  ఉదాసీనత  చూపించడం  కానే  కాదు .   మన మనసు యొక్క భావోద్వేగాన్ని , సంకల్ప  స్థితి తో   ఎదుటి వారి  పరిస్థితిని  చక్కదిద్దేందుకు  ఉపయోగపడే  శక్తి శాలి  దైవ గుణం  జాలి .

దయ అంటే అంటే ,  మనిషి  లోని  హింసను ప్రేరేపించే   కోపం, అహం  వంటి లక్షణాలను  రూపుమాపేందుకు  ఉపయోగపడే  శక్తి  శాలి  దైవ గుణం . 


• నవరసాలలో  ఒకటైన కరుణ రసం యొక్క ప్రతి  రూపాలు జాలి దయ . ఈ సృష్టిలో ఒక మనిషి తో పాటుగా  తోటి జీవులు  మరెన్నో ఎన్నో ప్రాణులు , జీవించాలంటే జాలి దయ కరుణ అనేవి అవసరం.  లేదంటే హింస రాజ్యం ఏలుతుంది .   నేటి కలి రావణాసురుని కాలం లో  ఈ హింస ఎంత గా ఉందో నిత్యం ప్రత్యక్షం గా  చూస్తునే ఉన్నాం.


నారాయణుడే   నరుడు . . . .  నరుడే నారాయణుడు అని నానుడి ఉంది . కరుణ అనే గుణం  దేవతల   నుంచి  మనిషి కి  వారసత్వ పరంపరగా ఆపాదన   కావించబడినది .


• ఈ గుణాలు సత్యమైన ప్రేమ చిగురించడానికి ఆధారం అవుతాయి . కరుణ జాలి దయ ఉన్న మనిషి సహజంగా  ఇతరుల యొక్క కష్టాలు , ఆపదలు, సమస్యలు,  వైకల్యాలు , వైఫల్యాలు , బలహీన జీవన స్థితి  గతులను చూసిన వెంటనే ప్రభావితం అవుతాడు .  భావోద్వేగంతో    సహాయం చేస్తాడు . ఎటువంటి పరిస్థితుల్లోనూ హింసను ప్రేరేపించడు .


• ఒక మనిషి కి  ఇతరులు  నోరు తెరిచి   సహాయం ఆర్జించక పోయినా ,  మనసు లో  జాలి అనే భావన కలగడం నిజంగా చాలా గొప్ప స్వభావం . . . 


కానీ  ఈ గొప్ప లక్షణాలు అయిన జాలి దయ . . .

నేటి కాలంలో మనిషి కి బలమా ? లేక బలహీనతా ? 

లేక  ఈ బలమే బలహీనత అవుతుందా ?  

లేక ఈ బలహీనత లోనే బలం దాగి ఉందా ? 

 

• జాలి అనే భావన వలన  ఇతరుల యొక్క సమస్యల పట్ల స్పందించడం, సహయ సహకారాలు అందజేయడం తద్వారా ఆత్మ సంతృప్తి పొందడం జరుగుతుంది.

• ఈ స్థితి ని సమర్ధవంతంగా ఆచరించాలి అంటే, మొదట స్వయం పై జాలి చూపించు కోవాలి . అంటే  మనిషి  తనపై తాను  జాలి చూపించు కోగలగాలి.  దీనిని స్వీయ కరుణ అంటారు.

మనిషి కి తనపై తనకు జాలి కలిగిన నాడు తన యధార్థ స్థితిని తెలుసు కొని , ముందుగా తనకు తాను సహాయం చేసుకోవడం తో  ఉన్నతి చెంది బలోపేతం కావడం లో  సఫలత  సాధిస్తాడు .

ఈ విధానం లో  జాలి , దయ అనేవి మనిషి కి మానసిక బలం అయి , ఆత్మ బలం  పెరుగుతుంది.


• అలా కాకుండా  . . . .   స్వయం పై (తనపై తాను) జాలి చూపించుకోకుండా  , ఇతరులు సహాయం కోరినపుడు   జాలి  చూపించడం వలన ,  ఒక  ఉదాసీనత ఆవహించి , బలహీనత నొంది ఇది  క్రమేపీ repeat అయినపుడు slow poison అయి ,  చివరికి  మనిషి తనను తాను కోల్పోవడం అవుతుంది .  ఇది మంచికి పోతే చెడు అయింది అనే నానుడి వంటిది. 

 ఈ విధం లో   తాను ఇతరుల పై చూపిన జాలి ని , తిరిగి తానే ఏదో నాడు ఇతరుల నుంచి పొందవలసిన స్థితి వస్తుంది. 

• ఈ విధానం లో జాలి,  దయ  అనేవి   బలం నుంచి బలహీనత గా మారి , ఆత్మ బలహీనత  అవుతుంది  . 


• కొందరు, తమను ఇతరులు సహాయం అడగకపోయినా సరే పదే పదే జాలి చూపిస్తూ , సహాయం చేస్తారు. పైకి చూడడానికి ఇది మంచి తనం లా అనిపిస్తుంది , కానీ ఇది వారి బలహీనత  అని గమనించలేరు .  వీరు , ప్రతీ విషయానికీ అతిగా జాలి చూపించడం అనేది బలహీనతగా అనుకోకుండా , అదే  తమ బలంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు. అంతకు మించి వీరి  స్పృహ కి ఏమీ తెలియదు . . . పైగా ఇటువంటి వారిని చూసిన వారంతా కూడా  పాపం జాలి గుండె కలవారు  అని జాలి చూపిస్తారు. ఇది అత్యంత విచారకరం.

ఈ విధానం లో  అతి జాలి దయ అనేవి బలహీనతగా మారి  అదే బలంగా గా  వారు భావించడం జరుగుతుంది. 


జాలి ని తమపై తాము చూపడం ఆత్మ బలం . 

జాలి ని ఇతరుల పై చూపడం ఆత్మ విశ్వాసం.

జాలిని అతిగా చూపడం ఆత్మ బలహీనత . 

జాలి ని ఆశించడం ఆత్మ విశ్వాస లోపం .


• తనను మాలిన ధర్మం ఎప్పుడూ చెడుతుంది . జాలి దయ గుణాలు ఉండాలి. కానీ ,ఒకరు నోరు తెరిచి అడగని నాడు జాలి చూపిస్తూ సహాయం చేయడం అనేది నేటి కాలంలో ముమ్మాటికీ చేటు.

• మొదట తనపై తాను జాలి చూపించు కో లేక ఇతరులపై చూపించిన వాడు బలహీనుడు. ఎందుకంటే తనపై తాను చూపించుకునే జాలి , తన లోని వాస్తవ స్థితి ని తనకు చూపిస్తుంది.

• తనను తాను ప్రేమించుకో లేని వాడు  ఇతరులకు ప్రేమ ఎలా ప్రేమించగలడు . అదే విధంగా ఇతరుల నుంచి ప్రేమ ను ఆశించి ఏం చేయగలడు .

• ఏ మనిషి కైనా   తన లోని మంచి గుణాలు , తనకు ఒక ఆస్తిగా , దైర్యం లా అనిపించాలి . అంతే కానీ  అవి ప్రతిబంధకాలు గా,  బలహీనతలు గా  , లేని పోని సమస్యలు తెచ్చి పెట్టుకునేవిగా కాకూడదు . . . ఆ మంచి గుణాలను మనలో స్థిరీకరించడం  రక్షణ  అవుతుంది.  ఆ తరువాత  ఇతరులకు  ధారణ చేయడం ద్వారా  లోక కల్యాణం జరుగుతుంది. 


ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి 🙏

యడ్ల శ్రీనివాసరావు 1 July 2025 10:00 PM .




678. స్వీయ ప్రేమ

స్వీయ ప్రేమ • క్షణకాలం ఆగి,   మన వైఖరిని మనం గమనించుకుంటే, స్వయాన్ని  ప్రేమించడం కన్నా సులభంగా ఇతరులను ప్రేమిస్తామని తెలుస్తుంది.  ఈ స్వీయ-ప...