Wednesday, April 8, 2026

736. నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?

 

నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?



• ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కి ఒక తోడు అవసరం. ఆ ప్రాణి మనిషి  , పక్షి , పశువు , జంతువు ఇలా ఏ రకమైన జీవి అయినా కావచ్చు.

 ఈ తోడు . . . అవసరం . . . అనేవి ప్రతి ప్రాణి యొక్క జీవన స్థితి  మరియు  తమ ధర్మాన్ని అనుసరించి ఉంటాయి .


• మనుషులమైన మనం ఏకాంతం గా జీవించగలం కానీ ఒంటరితనం తో జీవించలేము . ఈ ఒంటరితనం అధిగమించడానికే  మనిషి తనకు సరిపడా తోడు ను  కోరుకొని ఆశ్రయిస్తాడు . ఆ తోడు లోనే ఎన్నో రకాల బంధాలు ,  వివాహం, ‌స్నేహం , సహచర్యం , కుటుంబం , పిల్లలు ఇలా ఎన్నో ఎన్నెన్నో  అనుబంధాలు  .  వీటన్నింటిలో  అడుగడుగునా మనిషి ప్రాథమికంగా ఆలోచించేది తనకు కావలసిన తోడు . . .  తన ఆలోచనలకు సరిపడే తోడు .  ఎందుకంటే , ఔనన్నా కాదన్నా మనిషి స్వార్థజీవి . . . ఇందులో తప్పు లేదు.


• అసలు ఈ తోడు అవసరం ఎందుకు ? 

 ఈ మాయా ప్రాపంచిక లోకంలో మనిషి పుట్టిన దగ్గర్నుంచి జీవన పోరాటం లో  ఎన్నో సమస్యలను , సవాళ్ళను (ఛాలెంజెస్) నిరంతరం ఎదుర్కోవలసి వస్తుంది . అందుకు తనకు ఉన్న మానసిక శక్తి అన్ని వేళలా సరిపోదు. ఆ సమయంలో తప్పక ఒక తోడు పై ఆధారపడ వలసిన అవసరం పూర్తిగా ఉంటుంది .

  శరీర ధర్మం ప్రకారం అవసరమయ్యే తోడు కోసం ఇక్కడ ప్రస్తావించడం లేదు . ఎందుకంటే ఏ మనిషి కైనా మానసిక మైన తోడు లభిస్తే నే   తన  జీవితాన్ని తీరం దాటించుకోగలడు  మరియు జన్మను  సార్థకం చేసుకోగలడు . అంతకంటే మోక్షం మరొకటి లేదు .


• కానీ . . .  ఈ తోడు భాగస్వామ్యం అనేది నేటి కాలం మనిషి తనకు  ఉన్న  స్నేహల ద్వారా గాని. . .  వివాహం ద్వారా గాని . . .  బంధాల ద్వారా  గాని పొందగలుగుతున్నాడా ?  తోడు ను అనుభవించ గలుగుతున్నాడా ? . . .  లేక  మనిషి ఈ బంధాలన్నింటిలో    జీవిస్తూ నే    నటిస్తూ నే ఒంటరితనం అనుభవిస్తున్నాడా ?


ఎందుకంటే  , నిజం గా  ఒక మనిషి కి సరియైన తోడు భాగస్వామ్యం  ఉంటే అసంతృప్తి , కొరత  అనే  అంశాలు మచ్చుకైనా  తన  జీవితంలో ఉండవు . నిత్యం సంతోషంగా , ఆనందంగా , ఏ లోటూ లేకుండా ఉంటాడు . ఈ స్థితి కి కారణం తనకున్న  తోడు ఎప్పటికప్పుడు  అర్దం చేసుకుని కావలసిన శక్తిని ఇస్తూ  బాలెన్స్ చేస్తుంది .

అందుకే . . . ప్రతి మనిషి తనను అర్దం చేసుకోవడం కోసం తోడు ఉండాలి అనుకుంటాడు . కానీ ఈ తోడు  అనే భాగస్వామ్యం లో ఉన్న వారు అదే ఫ్రీక్వెన్సీ కలిగి ఉండక పోవడం తోనే సమస్య ఆరంభం అవుతుంది . ఉన్న తోడు కాస్త శత్రుత్వం, సమస్య గా తయారవుతుంది. నేటి అధిక శాతం మానవుల జీవన సరళి లో  ఇదే జరుగుతుంది .


• భాగస్వామ్య తోడు అనేది మనిషి కి ఒక ధైర్యం , భరోసా , నమ్మకం . కానీ నేటి కలియుగంలో ఈ తోడు లో మాయ, మోసం , ద్వేషం, అసహనం, కామం , క్రోధం , కపట ప్రేమలు  వంటివి అణువణువునా ఎన్నో చొప్పించబడి మనుషుల జీవితాలు  అల్లకల్లోలంగా తయారవుతున్నాయి  అనడం లో    ఏ మాత్రం సందేహం లేదు . 


• ఒక మనిషి తన జీవితంలో తాను సరియైన తోడు కలిగి ఉన్నాను అనే భావన కలిగి ఉంటే . . . , ఆ తోడు ఉన్న వ్యక్తి భౌతికంగా అనుక్షణం తన ప్రక్కన ఉన్న లేకపోయినా సరే . . . నీడ లా తనతో నే ఉంది అనే భరోసా తో  కూడిన నమ్మకం ఒక మంచి భాగస్వామ్య  తోడు  మనసు కి  ఇవ్వగలదు .

  మరి మనిషి తనకు సరిపడా తోడు ను కలిగి ఉంటున్నాడా లేక రాజీపడుతున్నాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .


• సున్నితమైన వారు కలిగి ఉన్న తోడు తో రాజీ పడతారు . కఠోరమైన వారు సరియైన తోడు దొరికేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు .


🌹 🌹 🌹 🌹 🌹


• ఇక  అసలు వాస్తవమైన  జ్ఞానం సత్యం లోని కి వస్తే  . . . ప్రతి  మనిషి ఎకైకం  , ఏకత్వం . అనగా ఏకైక తత్వాన్ని  కలిగి ఉండడం . 

అంటే  Every Human being  is Unique. 

ఏ ఇద్దరి మనుషుల రూపు రేఖలు, ఆలోచనలు , స్వభావాలు  ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతి మనిషి తనకు తాను విలక్షణం. 

మరి , ఏ ఇద్దరు మనుషుల స్వభావం ఒకేలా ఉండనపుడు,  ఒకరి  ఆలోచనలను పోలి సహకరించే విధంగా ఈ సృష్టిలో మరొకరు  ముమ్మాటికీ తయారయి ఉండరు . అటువంటప్పుడు ఒక మనిషి కి సరియైన తోడు లేదా ఒక మనిషి ని  యధార్థ రీతిలో  అర్దం చేసుకోవడానికి మరో మనిషి తోడు గా , భాగస్వామ్యం గా  ఎలా ఉండగలడు ? ఎలా సాధ్యం ? 


• అందుకోసమే  . . . దీనికి పరిష్కారం గా  భగవంతుడే   ప్రతి మనిషి కి  సరియైన విధంగా , ప్రతి మనిషి ని అర్దం  చేసుకునే  విధంతో   తోడుగా అవుతుంటాడు .  భగవంతుడైన  శివుడు ఒక తండ్రి గా, తల్లి గా,  సద్గురువు గా , భార్య గా, భర్త గా , ప్రియుడు గా , ప్రియురాలు గా,  టీచరు గా , స్నేహితుడు గా, ఎన్నో రూపాలలో అనుక్షణం మనిషి కి తోడు ఉండి  స్వచ్చత తో , సత్యత తో  ధైర్యంతో నమ్మకం తో  మనిషికి  అనుక్షణం  సేవ చేస్తూ మనిషి ని నడిపిస్తాడు .

కానీ , దురదృష్టం ఏమిటంటే , మనిషే భగవంతుడైన  శివుని  ని సరియైన తోడు గా భావించడం లేదు. కారణం  మనిషి లో ని మాయ. మాయ అంటే మనిషి లోని బలహీనతలు .


• మనిషి  , భగవంతుడు ని  ఎక్కడో దూరంగా గుడిలో ఉంచుతాడు , ఇంటిలో పూజ చేస్తాడు , మొక్కుతాడు , కోరికలు కోరుతాడు . . .  కానీ  అదే భగవంతుడు ని   తన గుండె లో , మనసు లో , తనకున్న  ప్రతీ ఆలోచనలో  తోడు గా ఉంచుకున్న నాడు  అద్బుతాలు జరుగుతాయి. మనిషి జీవితాన్ని  అతి సహజంగా  తీరం దాటించి గమ్యం చేరుస్తాడు శివుడు . కానీ ఈ విషయం మనిషి గ్రహించలేడు నమ్మడు విశ్వసించడు .  నోటితో పైకి మాటలు మాట్లాడుతాడు కానీ, మనసు లో భగవంతునికి చోటు ఇవ్వలేక పోతాడు . 


 ఓ మనిషి . . . నీతో , నీ చుట్టూ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ ఆలోచనలు శుభ్రమైనవి అయితే , వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే  నీవు వ్యక్తిగా ఉన్నతి సాధించినట్లే . నీవు ఏకాంతం లో ఉండొచ్చు కానీ ఒంటరివి కానే కావు , ఎందుకంటే శివుడు నీకు తోడు గా నీతోనే ఉన్నాడు . . . ఎప్పటికీ ఉంటాడు . కానీ నీవు మాత్రం ఆ పరమ శివుని మరువకు , విడువకు .


• ఈ రచన యొక్క సారాంశం, మనకు తోడుగా ఉన్నవారిని ,  మనుషులందరినీ   విస్మరించమని కాదు …. ప్రతీ ఒక్కరితో అన్ని భవబంధాలలో ఉంటూనే   మనసు లో  శివుని ని మాత్రమే  తోడు గా  చేసుకోమని భావం . 

ఎందుకంటే భాగస్వామ్యం గా , తోడు గా  ఉన్న మనుషులు , ఏ రోజైనా మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవచ్చు లేదా వారి వలన కోలుకోలేని విధంగా వంచింప బడవచ్చు  . కానీ శివుడు నిన్ను ఎన్నడూ విడవడు, వంచించడు. శివుడు మాత్రమే నీ మేలు కోరే వాడు, అది నువ్వు శరీరం తో ఉన్నాసరే   లేదా  శరీరం విడిచి పెట్టినా సరే  అంటే మరణించినా సరే.


ప్రతి మనిషి కి , ప్రతీ ప్రాణి కి శివుడు పూల బాట ఎప్పడో వేశాడు. కానీ మనిషే  స్వయంకృతాపరాధం తో  ఆ బాట ను చెదర కొట్టుకుంటున్నాడు .

మూలం గమనిస్తే , అసాధ్యం లోనే  సాధ్యం ఉంది . . . విరక్తి  లోనే  రక్తి  దాగి  ఉంది .


మానవమాత్రులైన   తల్లి , తండ్రి , గురువు , పుత్రిక , పుత్రుడు , సామాజిక బంధాలు  ఇలా . . . ఏ మనిషి కూడా  ఇంకొక  మనిషి కి  ముక్తి ని , సద్గతి ని ప్రసాదించలేడు . నిన్ను నన్ను సృష్టించిన వాడే ఆ పని చేయగలడు.  ముక్తి అంటే మరణం పొందడం, తిరిగి జన్మ పొందక పోవడం అని అనుకుంటారు. అది  పొరపాటు.  ముక్తి అంటే ప్రస్తుతం ఉంటున్న లేదా ఉన్న స్థితి నుంచి మనకు  మనం విడుదల అయి ఉన్నతమైన స్థితి కి మన ఆత్మ పయనించడం. ఇది కేవలం శివుని కి మాత్రమే సాధ్యం. అందుకే శివుని తోడు గా చేసుకుంటే నీకు నీడ గా ఉంటాడు. 

ఈశ్వరుని తోడు గా  చేసుకొని బంధాలలో ఉన్న అందరినీ  ప్రేమించండి, అందరినీ గౌరవించండి . . . కానీ బంధీలుగా  కాకండి . 🙏


జీవితం లో   వదిలి  వెళ్ళిన వారి  గురించి ఆలోచించకు .  జీవితం లో ఉన్నవారందరూ శాశ్వతం అని భావించకు. 

ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నీవే తోడు గా కావాలి.


గమనిక  : ఇవి  ఆలోచనలు, అభిప్రాయాలు అనుభవాలు అనడం కంటే , రచన లో సత్యా సత్యాలను సూక్ష్మ  విశ్లేషణ చేయగలగడం అభినందనీయం .


 ఓం శాంతి

 ఓం నమఃశివాయ 🙏

 యడ్ల శ్రీనివాసరావు 8 Apr 2026 . 11:00 PM.


No comments:

Post a Comment

736. నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?

  నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ? • ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కి ఒక తోడు అవసరం. ఆ ప్రాణి మనిషి  , పక్షి , పశువు , జంతువు ఇలా ఏ రకమైన జ...