Thursday, April 23, 2026

738. శివ పదము శివ పాదము

 


శివ పదము   శివ పాదము


”శివ పదము  శివ పాదము”  ఏదో ఒకటి పట్టుకొని వ్రేలాడు,  నీ జీవితం చరితార్థం అవుతుంది.  నాకు తెలిసినది  నీకు తెలిసినది  ఒక్కటే  కానక్కరలేదు , కానీ మన గతులన్నీ  పదగతులుగా  , ఆచరణలు చరణాగతులుగా  శివుణ్ణి చేరితే చాలు , నువ్వు నేను మనందరం శివ తత్వంలో ఇమిడి పోయినట్టే.

వ్యాకరణము చేత వ్యాకులత  కొంతమందికి . . .  వేపకము లేక వెర్రితలలు మరి కొందరికి , ఇలా అందరిని ఆదుకొనే శివుడికి వాడు వీడు అను భేదము లేదు.


పలుకు  నేర్చిన  వాడికి  పద్యాలు గద్యాలు , పలకలేని  వాడికి ఢమరుక శబ్దాలు . . .  కనులున్న వాడికి శిలలు రూపాలు  , కనులు లేని వాడికి దివ్యమైన వెలుగు గాను ఏదైతేనేమి  భవుని నిండుగా కొలుచుటకు .

రోజులో కొన్ని లక్షల పదములు పలుకగ  నా నాలుక శివ అను రెండక్షరములకై  వెఱయునా !  

నేను ఇదివరలో చెప్పినట్లుగా  “ కైవల్యపు కడ చూపులు కనుపాపలు దాట లేవు ” ఈ ఆఖరి స్థితి లో  నీ చూపు కూడా నిన్ను  , అంటే నీ కనుపాపను  దాటి  “పోదు”.  అలాంటి చివరి క్షణంలో నువ్వు భగవంతుడు నీ ముందు అవతరించినా చూడలేవు కదా !  . . . మరి జీవించినంత కాలమూ కాలక్షేపం తో గడిపేయడం దేనికి ?

నీకు సమయం ఉన్నప్పుడల్లా  లేదా  సమయం చేసుకొని  నీ శివుడిని  యధార్థ  రూపంలో చూడు , గుర్తు పెట్టుకో మనసున నిలుపుకో , పనికి వస్తాడు.

జ్ఞానం అనే జ్యోతి  నీ లో  వెలగాలంటే  చుట్టూ ప్రాణవాయువు  నిండి ఉండాలి , అదే విధంగా నీ చుట్టూ భగవంతుడు లేదా భక్తి , పారవశ్యంతో కమ్మెయ్యాలి . ముక్తి మోక్షం అనేవి చాలా పెద్ద మాటలు కావచ్చు కానీ మంచి మార్గము ప్రేరణ అనే మాటలు చాలు కదా  సామాన్య జీవునకు భగవంతుని  సేవించడానికి .

గుర్తుంచుకో . . . దేహమున అవయవములన్నీ సక్రమముగా పనిచేసిన నాడు చేయలేని శివ స్మృతి , మూలన చేరిన నాడు మూలిగినా ఫలితమేమి కాలాతీతం తప్పా .

సమస్త ఆలోచనలలో శివం నిండినపుడు కడ లో శవం చేరేది శివుని చెంతకే .

ఈ స్వరం . . . ఈ శ్వరం.


ఓం శాంతి 

ఓం నమః శివాయః 🙏

యడ్ల శ్రీనివాసరావు 24 Apr 2026 5:00 AM.


No comments:

Post a Comment

738. శివ పదము శివ పాదము

  శివ పదము   శివ పాదము ”శివ పదము  శివ పాదము”  ఏదో ఒకటి పట్టుకొని వ్రేలాడు,  నీ జీవితం చరితార్థం అవుతుంది.  నాకు తెలిసినది  నీకు తెలిసినది  ఒ...