శివానుభవాలు
• శివుని గురించి ఆలోచించాలన్నా , శివుని గురించి మాట్లాడాలన్నా , శివుని గురించి రాయాలన్నా శివుని గురించి పాడాలన్నా కేవలం శివుని అనుమతి ద్వారా శరీరం లోపల ఉన్న ఆత్మ పొందే అనుభవం తోనే సాధ్యం.
శివుడు పరమాత్మ , మన శరీరం ద్వారా చూసే రెండు కళ్ళకు (Two Dimensional Eyes) కానరాడు , తాకడానికి స్పర్శ కి అందడు . అందుకే శివుడు అనుభవం అవుతాడు .
ఈ అనుభవం లేనిదే , అనుభవం పొందనిదే శివుని గురించి పెదవులు పలకలేవు , మెదడు ఆలోచించ లేదు , చేతులు రాయలేవు , గొంతు ఎలుగెత్త లేదు. . . ఎందుకంటే , విశ్వ సృష్టి నిర్మాణం లో భాగంగా మానవ దేహాన్ని సృష్టించింది తండ్రి శివుడు .
• అందుకే శివుడు అంటే అనుభవం. శివుడు అంటే సంతోషం, శివుడు అంటే అనంతం, శివుడు అంటే సత్యం. శివుడు అంటే మనసు రమించే శోభనం. శివుడు అంటే జ్ఞాన ధ్యాన యోగాల బీజం, అన్నింటినీ మించి శివుడు అంటే విశ్వ శక్తి .
• శివుని అనుభవం మనం చవిచూస్తే ఎలా ఉంటుంది ? ఎన్ని విధాలుగా ఉంటుంది? . . . . అంటే అది వర్ణనాతీతం. ప్రధానంగా మానసిక శక్తి లో అనంతమైన నూతన ఉత్తేజం నిండుతుంది . మాట్లాడే మాటల కు, ఆలోచించే శుద్ద సంకల్పాల కు కార్య సిద్ధి సఫలం అవుతుంది. భూత వర్తమాన భవిష్య త్రికాలాల దర్శనం ప్రాప్తిస్తుంది . అసాధారణం అనుకునే ధర్మ యుక్త కార్య వ్యవహారాలు సాధారణంగా జరుగుతాయి . విఘ్నాలే విజయాలను వరింపచేస్తాయి . దుష్ట తత్వాలు గల రహస్య శత్రువులు దూరం అవుతారు తిరిగి సమీపంలోకి కూడా రాలేరు . ఏ బంధం లేని సజ్జనులు అత్యంత ఆప్తులు గా సహకరిస్తారు . మంచి చెడుల సూక్ష్మ విచక్షణ తెలియవస్తుంది. ఎంతటి విపత్కర పరిస్థితిలైనా సునాయాసంగా అధిగమించడం జరుగుతుంది.
• భూత దయ కలుగుతుంది. అసంపూర్ణ కర్మలు సంపూర్ణం అవుతాయి . శరీరం మనసు నిత్యం తేలుతూ భార రహిత స్థితి లో ఉంటుంది . రహస్యంగా ఆత్మ లో దాగి ఉన్న అనేక జన్మల ప్రతిభలు ( hidden talents ) సహజంగా పైకి వస్తాయి. ఇతరుల మాటలలో సత్య అసత్యాలు గ్రహించే పరీశీలనా శక్తి ప్రాప్తిస్తుంది . మనో నేత్రం (Third Dimension of Eye) తెరుచుకుంటుంది. అమృత వేళలో (తెల్లవారుజామున 3 గంటలకు) నిత్యం మెలకువ వస్తుంది . మౌనం , ఏకాంతం లో ఇమిడి ఉన్న శాంతి సాగరపు అలల తో మమేకం జరుగుతుంది . నిష్కామ (ఫలితం ఆశించని) కర్మలు అలవడతాయి. మనసు లోని భావోద్వేగాలు శూన్య స్థితికి చేరుకోవడం వంటి ఎన్నో విశేషమైన అనుభవాలు అన్నింటినీ శివుడే , మనిషి కి చేయిస్తూ తన అక్కురకు చేర్చుకుంటాడు .
• పంచభూతాల లో ఇమిడి ఉన్న శివుని శక్తి ని పొంది , పంచేంద్రియాల ద్వారా అందరికీ అనుభూతి పొందేలా చేసేవారే శివుని ప్రతినిధులు. వారినే Messengers or Servents of God అంటారు. మనకు చాలా అరుదుగా కనిపించే నాగ సాధువులు , ముని పుంగవులు , అఘోరాలు , కర్మ యోగులు , రాజయోగులు ఈ కోవ లోని వారే .
• జ్ఞాన సముపార్జనకు సాధనాలు పంచేంద్రియాలు అయితే వాటిని ప్రభావితం చేయువారు , సుష్కర్మలను ఆపాదన చేయువారు , మంచి చెడు విచక్షణ ను బోధించు వారు మహిమాన్వితులే కానక్కరలేదు! . మంచి మనసు తో చెప్పే శుద్ధమైన మాటలు చాలు , మనసు తేజోన్మయమై శివుని పై దృష్టి దగ్గర అవడానికి .
తెలిసో తెలియకో మనిషి వేసుకున్న , బంధాల చిక్కు ముడులు నుంచి సంతోషంగా విడిపించేది కేవలం . . . కేవలం శివుడు మాత్రమే.
శివ అంటే శుభం . శివం లోనే శవం ఉంది. అందుకే శివలింగాన్ని స్మశానంలో ఉంచుతారు . దీని అర్థం జననం మరణం రెండూ మనిషి కి మంగళం కళ్యాణం .
• శివుడు అంటే నాట్యం (నటరాజు) . మన మనసు లో శూన్యం నింపి , ఆ శూన్యం లో ఆయన నాట్యం చేస్తూ మన చేత నాట్యం చేయించే వాడు శివుడు . ఇంతకు మించిన శివానుభం ఉందా అంటే తెలియదు . ఒకవేళ ఉంటే , అది శివుడే ఈ చేతులతో రాయించాలి . . . ఎప్పుడైనా .
• సర్వం . . . ఈ శ్వరం . . . ఈ స్వరం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 14 April 2026 , 10:00 PM

No comments:
Post a Comment