Wednesday, April 29, 2026

739 . ప్రేమలు

 

ప్రేమలు



• ఈ సృష్టి ని నడిపిస్తున్న ఏకైక అంశం ప్రేమ , ప్రేమలు. ప్రేమ లో ఎన్నో రకాలు తల్లి బిడ్డల ప్రేమ , భగవంతుడు భక్తుల ప్రేమ , భార్య భర్తల ప్రేమ, ప్రేయసి ప్రియుల ప్రేమ , ప్రకృతి పై ప్రేమ. 


 ప్రతీ ప్రేమ లో , ఒక  స్త్రీ ఉంటుందో లేదో తెలియదు కానీ స్త్రీ తత్వం మాత్రం తప్పకుండా ఉంటుంది.

  అంటే  ఒక పురుషుడు ఎవరినైనా ప్రేమిస్తే, ఆ ప్రేమ లో స్త్రీ తత్వం దాగి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనే పదానికి, భావానికి నిర్వచనం ,  హక్కు  ఒక   స్తీ కాకపోవచ్చు  , కానీ . . .  స్తీ తత్వం  అనేది పరమ సత్యం.


• శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. ఆయన లో రౌద్రం ఉంటుంది (దుష్ట శిక్షణ కోసం) అని అంటాము . కానీ ఆయన లో ఉన్న  స్త్రీ తత్వం ఈ సృష్టి ని ప్రేమ తో నే  నడిపిస్తుంది.

 అదే విధంగా ఒక స్త్రీ లో నైనా , పురుషుడు లో నైనా ప్రేమ కి కారణం వారిలో ఉన్న స్త్రీ తత్వం. ప్రేమను కలిగి ఉన్న వారు, ప్రేమిస్తూ ఉన్న వారు, తాము ప్రేమించిన వారి కోసం రక్షణ గా ఉంటారు. ఒక తల్లి తన పిల్లలు దూరంగా ఉన్నా  ఇదే చేస్తుంది. భగవంతుడు అయిన శివుడికి మనం అందరం దూరం గా  ఉన్నా ఆయన ఇదే  చేస్తున్నాడు .


• ప్రేమ లో త్యాగం ఉంటుంది అంటారు. ఈ త్యాగం అనేది విరహం, విఫలం , విముక్తి కాదు. త్యాగం అంటే నిట్టూర్పు కాదు  , త్యాగం అంటే  రక్షణ .

• పరిస్థితులు , స్థితిగతుల రీత్యా  ప్రేమించు కున్న మనుషులు అందరూ లేదా ప్రేమను కలిగి ఉన్న మనుషులు అందరూ కలిసి జీవించలేక పోవచ్చు.

 కానీ వారి ప్రేమ సత్య మైనది , సజీవమైనది, స్వార్దం లేనిది అయితే ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా, వారి ప్రేమ లోని  కోరిక  అవతలి వారికి బలమైన రక్షణ కవచం వలే అవుతుంది  , అవతలి వారి శ్రేయస్సు  కోరుకుంటుందే   కానీ , ఎవరినీ దుఖితులు గా  చేయదు . 

• ప్రేమ కఠినమైన హృదయం  కలవారి లో కూడా కరుణను నింపుతుంది. ఎన్నో చెడు లక్షణాలు ఉన్న వారిని కూడా మంచి మనసున్న వారిగా చేస్తుంది. 

 సమస్య అంతా కూడా ప్రేమ అనే పదం యొక్క విలువ ను అర్థం చేసుకోలేక  శరీరం , లింగ బేధం, వ్యామోహం , అహంకారం , అనే దృష్టి కోణాలు   ప్రేమలో విపరీతంగా  ప్రవేశించినపుడు  , ఆ ప్రేమ వికారంగా తయారై  సమస్యలు , దుఃఖం తలెత్తుతాయి.

• బాగా ఆలోచించి చూడండి . . . మనం ప్రేమించిన వారి కోసం మన శక్తి కి ఏదో ఒక మంచి చేసే ఉంటాం.  అలాగే  మనల్ని ప్రేమించిన వారు  కూడా మనకు  ఏదో ఒక  మేలు చేసే ఉంటారు. ఒకవేళ వారు దూరం అయినా సరే ఏదొక మంచి చేస్తూనే ఉంటారు. అది అర్దం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు లేదా అది మన ఊహకు ఆందకపోవచ్చు . ప్రేమ సజీవం , ప్రేమ సంజీవని . 

మనుషుల మైన మనం ధరించిన ఈ శరీరాలు అశాశ్వతం. కానీ మనలో (ఆత్మ) నుంచి పుట్టిన ప్రేమ ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ప్రేమ సంపూర్ణం అయ్యేంత వరకు మన ఆత్మ లో  నిలిచి పోయి ఉంటుంది . సంపూర్ణం అంటే ఆ ప్రేమ ను  పూర్తిగా ఆకళింపు చేసుకోవడం .

ఏదో ఒక జన్మ లో , మనలోని  ప్రేమ పూర్తిగా సంపూర్ణం అయింది అని తృప్తి  పొందిన తదుపరి క్షణం లో మనం ప్రత్యక్షం గా చూడగలిగేది  భగవంతుడైన శివుడి ని మాత్రమే .

• ప్రేమించడం అంటే ఇవ్వడం . ఇస్తేనే పొందగలం .

• ప్రేమించడం అంటే రక్షణగా ఉండడం. రక్షిస్తే నే రక్షించబడగలం .

• సృష్టి ధర్మం రీత్యా , స్త్రీ పురుషుల ప్రేమ భావం లో శరీరం, స్పర్శ దాంపత్యం , ఆకర్షణ ఇలాంటివి ఉండడం అతి సహజం. కానీ శరీరాలు స్పర్శ , దాంపత్యం  ఉన్నంత మాత్రాన స్త్రీ పురుషుల మధ్య ప్రేమ  ఉంటుంది , ఉంది  అనేది  వాస్తవం కాదు .

• ప్రేమ అన్నింటికీ ,  ఎన్నింటికో  అతీతమైనది. దివ్యమైనది .

• ప్రేమించి కలిసి ఉన్న వారు , మీ ప్రేమ ను కుటుంబంలో అందరికీ పంచండి . 

• ప్రేమించి విడి పోయిన వారు , మీ ప్రేమను విశ్వం లో  అందరికీ  ఏదొక రూపం లో  పంచండి . ఎందుకంటే మీ లోని  ప్రేమ , మీ లో దాగి ఉన్న విశాల హృదయానికి  నిదర్శనం  , ఆదర్శం .

• మీ లో ఉన్నది సత్యమైన ప్రేమ అయితే , మీరు ఏ స్థితిలో , ఎలా ఉన్నా అది మీకు సంతోషమే కలుగచేస్తుంది. ఎందుకంటే ప్రేమ కు దుఃఖం కలుగ చేయడం తెలియదు . ప్రేమ జీవితాన్ని మారుస్తుంది, దశను దిశను నిర్దేశిస్తుంది. 

సత్యమైన   ప్రేమ యొక్క వాణి ని వర్ణించడానికి బహుశా మనిషి కి  కొన్ని జన్మల అనుభవాలు కావాలేమో .


ప్రపంచ దేశాల అన్నింటిలో కన్నా , భారత దేశం మాత్రమే  భరత మాత ను పూజిస్తుంది .  మాత అంటే భౌతికంగా ఉన్న ఒక  స్త్రీ రూపం  అనే కంటే , స్త్రీ తత్వం అనేది సత్యం.  అనగా పురుషుడు లో నైనా ,  స్తీ లో నైనా దాగి  ఉన్న  స్తీ తత్వాన్ని  మనం అర్థం చేసుకొని ,  గ్రహించి  నాడు   ప్రేమ అనే విత్తనం  మనలో దైవాన్ని మేలుకొలుపుతుంది . అప్పుడు ప్రతి మనిషి ని  ప్రేమించ గలుగుతాం . అదే  మనకు రక్ష. 

అందుకే భారతదేశం నేడు ప్రపంచం లో ఎన్నో దేశాలకు రక్షణ గా , ఆదర్శం గా ఉంది . భారతీయులకు  ప్రేమించడం  తెలుసు. 


ఈ రోజు ప్రయాణం లో   అకస్మాత్తుగా , కొన్ని  నిమిషాల  వ్యవధిలో   ఈ రచన రాయగలగడం, బహుశా , నా లో ఉన్న  స్త్రీ  తత్వం అని , రాసిన తరువాత అర్దం అయింది .


  ఓం శాంతి .

  ఓం నమః శివాయ 🙏

 On the way to Pune ✍️

 యడ్ల శ్రీనివాసరావు 29 Apr 2026 . 5:00 PM.


No comments:

Post a Comment

739 . ప్రేమలు

  ప్రేమలు • ఈ సృష్టి ని నడిపిస్తున్న ఏకైక అంశం ప్రేమ , ప్రేమలు. ప్రేమ లో ఎన్నో రకాలు తల్లి బిడ్డల ప్రేమ , భగవంతుడు భక్తుల ప్రేమ , భార్య ...