Tuesday, July 30, 2024

524. తలపు – వలపు

 

తలపు – వలపు 


• తర    తరమున    తరించిన

  తరగలేదు  శివుని    తలపు.

• యగ   యుగమున   ఎదురేగిన

  ఎరుగలేదు   శివుని   వలపు.


• అంతరమున

  అమరమై       ఉంది      శివ నామం.

• ఊహనమున 

  ఉపమానమై   ఉంది      శివ రూపం.


• సంగమ    యుగమున 

  మేలుకొలిపాడు  శివుడు...

• ముల్లు  లాంటి   నన్ను

  పూవు గ    చేస్తున్నాడు.

• మన్ను  లాంటి   నన్ను

  మణి    గావిస్తున్నాడు.


• తర    తరమున   తరించిన

  తరగలేదు   శివుని   తలపు.

• యగ  యుగమున   ఎదురేగిన

  ఎరుగలేదు   శివుని   వలపు.


• స్మరిస్తున్న     స్మృతులు

  మనసు లోని     అనుభూతులు.

• లిఖిస్తున్న     భావనలు

  ఆత్మ లోని      అనుభవాలు.


• నా మాటలో   శివుడుంటే   అది   అమృతం.

  నా బాట లో   విభుడుంటే   అది    గమ్యం.



ఎదురేగిన = ఎంత వెతికినా

వలపు = ప్రేమ.

ఉపమానము = పోలిక,  సాదృశ్యము 

సంగమ యుగం = కలికాలం అంత్య దశ నుంచి సత్య యుగం ఆరంభ సమయం.


యడ్ల శ్రీనివాసరావు 30 July 2024, 10:00 pm.


Monday, July 29, 2024

523. మారకం - Transformation

 

మారకం - Transformation 



• సంతోషం   అల యై    పొంగెను.

  ఏకాంతం     నిశి లో     సాగెను.

• విధాత   రాసిన     విధి రాతే    వరము.

  ఫ్రభాత  యోగ     నిధి తోనే     ఫలము.


• అమరమైన    బంధం

  ఏమిటో   ఆత్మ కు   తెలిసెను.

• ఆనందమై     శివుని

  చేరుటకు   పయనించెను.

 

• సంతోషం    అల యై     పొంగెను.

  ఏకాంతం    నిశి లో      సాగెను.

• విధాత  రాసిన     విధి రాతే   వరము.

  ఫ్రభాత యోగ      నిధి తోనే    ఫలము.


• రుద్రాక్ష న    తడిసి న    ఆరుద్ర 

  పావన    మాయెను.

• అభిశస్తి న   తరించి న    రోహిణి

  ధర్మస్థితి   నొందెను.

మారకం లో     మధురం

  మనసు కి    శ్రావ్యం.

• శ్రేష్టమైన     కర్మం 

  మరు  జన్మ కి   భోగం.


• సంతోషం    అల యై     పొంగెను.

  ఏకాంతం    నిశి లో      సాగెను.



నిశి =   చీకటి

ప్రభాత యోగ =   తెల్లవారుజామున ధ్యానం.

రుద్రాక్ష =   శివుని కన్నీటి చుక్క.

ఆరుద్ర =     నక్షత్రం (శివుడు)

అభిశస్తి =   నీలాపనిందలు, ఆరోపణలు 

తరించిన =    దాటిన 

రోహిణి =      నక్షత్రం (శ్రీకృష్ణుడు)

మారకం = మరణం, మార్పు.


యడ్ల శ్రీనివాసరావు 29 July 2024, 4:00 pm.


Thursday, July 25, 2024

522. అమావాస్య ఆమని

 

అమావాస్య  కోకిల.


• అమావాస్య లో   …

  ఆదమరచి   పాడింది    ఓ ఆమని.

• ఆ రాగం   విని   చూసింది    జాబిలి.


• నిశి    లోని    నింగి   అంతా

  నిగ నిగ   లాడుతూ   ఉంది.

• శశి    లేని     శోభ    కూడా 

  మిల మిలా   మెరుస్తూ  ఉంది.


• అంధకారంలో     అమావాస్య

  జాబిలి కి   చూపెను     కొంగొత్త   భాష్యం.

• ఆదమరచిన      ఆమని

  ప్రకృతి కి   నేర్పెను    సరికొత్త   గానం.


• ఇదే    సత్య యుగం

  కాల చక్రం లో   అంతరించిన    స్వర్ణ యుగం.


• అమావాస్య లో   …

  ఆదమరచి    పాడింది    ఓ ఆమని.

• ఆ రాగం   విని  చూసింది   జాబిలి.


• జాబిలి కి     తెలిసింది ...

• అమావాస్య     అందం

 అంధుల పాలిట   దివ్యమని...

• అంధకారంలో    ఆనందం

  విశ్వ శోభ కి       ప్రతీకమని.


• ఆమని కి      తెలిసింది …

• అమావాస్య   గానం

  అంబరం    తాకగలదని...

• అంధకారంలో     గమకాలు 

  అవధులు     దాటగలనని.


• అమావాస్య లో …

  ఆదమరచి   పాడింది   ఓ ఆమని

• ఆ రాగం    విని చూసింది    జాబిలి.


☘️☘️☘️☘️☘️

• అమావాస్య రాత్రిలో, మైమరచి  ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.

• అమావాస్య  చీకటి లో  ఆకాశం అంతా నిగ నిగ లాడుతూ ఉంది.  చందమామ లేకపోయినా సరే ఆకాశం కళతో   మిల మిలా మెరుస్తుంది.

• అమావాస్య చీకటి ,  చందమామ కి   ఓ సరికొత్త రూపం చూపింది....  మైమరచి  పాడిన ఆ కోకిల,  ప్రకృతి కి   సరికొత్త  రాగం  నేర్పింది.

• కాల చక్రం లో అంతరించి పోయిన సత్య యుగం ఇది.  పౌర్ణమి అమావాస్య, చీకటి వెలుగు అనే భేదం ఎరుగని దేవతలు నివసించిన స్వర్ణ యుగం.

• అమావాస్య రాత్రిలో, మైమరచి  ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.

• చందమామ కి తెలిసింది ….

• అమావాస్య లోని   అందం   కనులు లేని వారికి  ఒక దివ్యత్వం అని.   మరియు  చీకటి లో లభించే ‌సంతోషమే     విశ్వం లో   ఉన్న  సమస్త అందాలకు నిదర్శనం అని.

• కోకిలకి తెలిసింది …

• అమావాస్య నాడు  తన  స్వరం  ఆకాశం చేరుగలదని.  చీకటి లో తన రాగ విశేషం  ఎల్లలు  దాటి పోగలదని.

• అమావాస్య రాత్రిలో, మైమరచి  ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.



చందమామ :

  ధనం, అహంకారం ఉన్న వారు.

అమావాస్య , అంధులు, ఆమని :

  దుఃఖం, నిరాశ, నిస్పృహ, మానసిక బాధలు

  అనుభవించే వారు.


యడ్ల శ్రీనివాసరావు 25 July 2024, 10:00 PM.


Sunday, July 21, 2024

521. గుల్మోహర్ పుష్పం

 

గుల్మోహర్ పుష్పం 


• ముసుగు   కమ్మిన    ముసురు లో

  ఓ   చినుకు    జారింది   …  


• జారే   ఆ  చినుకు    

  గుల్మోహర్   ను   తాకింది.

• ఊగే   ఆ  గుల్మోహర్  కి 

  జడి  వలపు   తగిలింది.


• సిగ్గు   పడలేదు   కానీ …

  గ్రీష్మం లో   గంధర్వ మైంది   గుల్మోహర్.

• తగ్గి   ఉండలేదు  కానీ …

  వర్షం లో    విర పూసింది     గుల్మోహర్.


• ముసుగు   కమ్మిన    ముసురు లో

  ఓ చినుకు  జారింది   …   

 

• జారే   ఆ    చినుకు    

  గుల్మోహర్  ను    తాకింది.

• ఊగే   ఆ  గుల్మోహర్  కి 

  జడి   వలపు   తగిలింది.


• ఎరుపెక్కిన   కెంప ల్లే 

  వెదజల్లే   సున్నిత  సుగంధం.

• పెనవేసిన     పందిరై 

  పరిచెను   సుందర  మనోహరం.

• ప్రకృతి      పాటవం లో

  ఇది     ఓ    అద్బుతం.

• మనసు   రంజనం లో

  ఇది   అతి    సహజం.


• వేకువ     బాటలో

  పూలు    వేసెను   పానుపు.

• బాల్యపు    ఆటలో

  జాలు     వీడలే   ఆ  జ్ఞాపకం.


• ముసుగు     కమ్మిన    ముసురు లో

  ఓ చినుకు     జారింది   …   


• జారే    ఆ చినుకు   

  గుల్మోహర్  ని   తాకింది.

• ఊగే    ఆ   గుల్మోహర్ కి

  జడి   వలపు   తగిలింది.


• సిగ్గు  పడలేదు  కానీ ...

  గ్రీష్మం లో    గంధర్వ మైంది    గుల్మోహర్.

• తగ్గి     ఉండలేదు   కానీ ...

  వర్షం లో     విర  పూసింది     గుల్మోహర్.



జడి = వాన

గంధర్వం = వనప్రియం

పాటవం = నైపుణ్యం

వేకువ  =   ఉదయం 

జాలు వీడలే = మరచి పోలే


యడ్ల శ్రీనివాసరావు 21 July 2024, 10:15 pm.





Saturday, July 20, 2024

520. గురు పౌర్ణమి

 

గురు పౌర్ణమి


• మానవుడా    ఓ  మానవుడా

  అంధకారంలో   చిక్కుకున్న   అజ్ఞానుడా.

• గురువు   అంటే   ఎవరు …

  సద్గురువు అంటే  ఎవరు …


• నీ వెవరో    నీకు   తెలియజేసేది   గురువు

  నీ గమ్యానికి   దారి   చూపేది    సద్గురువు.

• గురువు    అంటే   జీవాత్మ

  సద్గురువు అంటే  పరమాత్మ.


• మానవుడా    ఓ   మానవుడా

  అంధకారంలో  చిక్కుకున్న  అజ్ఞానుడా.

• గురువు     అంటే   ఎవరు

  సద్గురువు   అంటే   ఎవరు.


• గురువు  లేని   జీవితం

  చుక్కాని లేని   నావ  లాంటిది.

• సద్గురువును    నోచుకోని   జన్మము

  జన్మాంతరాలు   చేసిన    పాపము.


• నీ జీవితం   ఓ  నాటకం.

  దేహం తో    పోషించేది   పాత్ర  మాత్రమే.

• నీ కర్మలు   బహు  గుహ్యం.

  సద్గతి ని   తెలియజేసేది   గురువు మాత్రమే.

• నీ జన్మము  ఓ  కారకం. 

  జన్మల  రహస్యం  సాక్షాత్కరించేది   సద్గురువు.


• మానవుడా    ఓ   మానవుడా.

  మాయలో   మునిగిన  అజ్ఞానుడా.


గురువుని     తెలుసు కో.

  జ్ఞానమనే   పౌర్ణమి    వెలుగుని  నింపుకో .

• సద్గురువు ని   చేరు కో

  మోక్షమ నే     స్థితిని   సాధించుకో.


🙏 🙏 🙏

• ఓం శ్రీ గురుభ్యోనమః.


గురు బీజ మంత్రం:

• ఓం గ్రాం గ్రీం గ్రౌం  సః  గురువే నమః


• గురు బ్రహ్మ  గురు విష్ణు  గురు దేవో  మహేశ్వరః

  గురు సాక్షాత్  పరబ్రహ్మ  తస్మైశ్రీ  గురువే నమః


ఓం శాంతి ☮️

ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు  20 July 2021. 9:00PM.




Friday, July 19, 2024

519. సద్గురువు

 

సద్గురువు


గురువు  లెందరో  ఉన్నా 

  సద్గురువు   మాత్రం  ఒక్కడే.

• గురువు   లెందరో  ఉన్నా

  సద్గురువు    మాత్రం  ఒక్కడే.


• అతడే తండ్రి    ….    అతడే   తల్లి

  అతడే దైవం     .…     అతడే శివుడు.

                అతడే   సద్గురువు.

• సత్య జ్ఞానము     బోధిస్తూ

  మార్గ దర్శకం     చేస్తాడు.

• జన్మ   కారకం     చూపిస్తూ

  అనుభవాలను      ఇస్తాడు.


• గురువు   లెందరో   ఉన్నా

  సద్గురువు   మాత్రం  ఒక్కడే.

• అతడే     శివుడు 

  అతడే    పరమాత్ముడు.


• నిరాకార  శివుడు    ఈ  సంగమాన 

  బ్రహ్మ తనువు లో    అవతరించెను.

• సృష్టి   ఆదిమధ్యాంతాల 

  నాటకం    చెప్పెను.

• ఆర్తనాదాల   పిల్లలకు   

  ఆత్మ స్వరూపం   చూపెను.

• విశ్వ   కళ్యాణానికై     జ్ఞానబోధను   చేసెను.


• అదియే    నేటి  మౌంట్ అబూ లో మధువనం.

   ప్రజాపిత     బ్రహ్మ కుమారీస్   

   ఈశ్వరీయ  ఆధ్యాత్మిక  విశ్వ విద్యాలయం.


• గురువు   లెందరో  ఉన్నా

  సద్గురువు   మాత్రం  ఒక్కడే.

• అతడే తండ్రి   ….   అతడే  తల్లి

  అతడే   దైవం  .…   అతడే శివుడు.

              అతడే  సద్గురువు.



సంగమం :  

కలియుగం ముగిసి  సత్య యుగం ఆరంభం అయ్యే మధ్య నున్న ఈ ప్రస్తుత కాలం.


ఆదిమధ్యాంతాలు : 

సృష్టి  మొదలు, సృష్టి మధ్యమం, సృష్టి  అంతం.


ఓం శాంతి ☮️

ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు  19 July 2024, 7:00 PM.





Wednesday, July 17, 2024

518. మైత్రి మాధుర్యం

 

మైత్రి  మాధుర్యం 



• కలిగే   భావం లో

  మెదిలే   నీ రూపం   శివ

• చూసే   తారల్లో

  మెరిసే    నీ వదనం   శివ

• నీ వెంట   నేనుంటే 

  రాత రాత లో   ఎన్నో సత్యాలు.


• విలువలు   లేని    స్నేహా బంధాలు

  మోహ ల     దాహ ల     వ్యర్థాలు.

• నీతులు   చెపుతారు   కానీ

  ఆచరించ  లేరు    అల్పులు.

• మిత్ర బృందాల      కాలక్షేపాలు

  కడలి లో   కలిసే   కాలగర్భంలో.


• కలిగే    భావం లో

  మెదిలే   నీ రూపం   శివ

• చూసే     తారల్లో

  మెరిసే   నీ వదనం   శివ

• నా తోడు    నీవుంటే 

  మాట మాట లో   ఎన్నో   సత్యాలు.


• స్నేహ   సాంగత్యాలు 

  అద్భుతమైన   నటనలు.

• ఆత్మ     వంచకులకు 

  అవి   ఆనంద  నిలయాలు.

• కామపిశాచాల    మాటలు

  అర్భకుల కు   వినసొంపు   స్తోత్రాలు.

మైత్రి   అనే    మైకం లో

  వికారాల   బురద    ఓ  మాధుర్యం.


• కలిగే   భావం లో

  మెదిలే   నీ రూపం   శివ

• చూసే     తారల్లో

  మెరిసే   నీ వదనం   శివ

• నీ వెంట    నేనుంటే

  రాత రాత లో    ఎన్నో  సత్యాలు.

• నా తోడు    నీవుంటే

  మాట మాట లో    ఎన్నో   సత్యాలు.



అల్పులు = అస్థిత్వం కలిగిన వారు

అర్భకులు = బుద్ధి హీనత కలిగిన వారు.


యడ్ల శ్రీనివాసరావు 17 July 2024 , 6:00 pm.


Thursday, July 11, 2024

517. అంతరంగికుడు


అంతరంగికుడు



• అంతరంగం లో       సఖుడా 

  ఆనందం  నింపేటి   విభుడా.

• పరవశం  లో        ఘనుడా 

  ప్రేమ    నింపేటి     శివుడా.


• ఏమి     చెప్పగలను

  ఏమి     రాయగలను.


• పొందేటి     నీ శక్తి      దివ్యం

  ఇచ్ఛేటి     నీ యుక్తి    అద్వితీయం.

• శివుడు   అంటే   శిరమున     ఆశీనుడని 

  హరుడు  అంటే    దేహమున  ఆరా యని.


• ఏమి    చెప్పగలను

  ఏమి     రాయగలను.


• అంతరంగం లో      సఖుడా

  ఆనందం   నింపేటి   విభుడా.

• పరవశం లో    ఘనుడా

  ప్రేమ   నింపేటి   శివుడా.


• నిను ఆకళింపు కి    నా మనసు  ఏ పాటిది 

  నీ జ్ఞానస్తుతి కి     నా భాగ్యం     ఏ నాటిది.


• పిలిచిన   పలుకుతావు.

• నా కష్టము    ….  నా కష్టము

  చూడలేక     ….   వెన్నంటి ఉంటావు.


• మాయ తెచ్చే   ముప్పు    తెలియ చేస్తావు

  మాయ రూపు రేఖలను  వర్ణించి చెపుతావు.


• అంతరంగం లో       సఖుడా

  ఆనందం    నింపేటి  విభుడా.

• పరవశం    లో      ఘనుడా

  ప్రేమ      నింపేటి   శివుడా.


• ఎంతని      చెప్పగలను

  ఏన్నేళ్లని      రాయగలను.


యడ్ల శ్రీనివాసరావు  11 July 2024 ,9:00pm



  


Friday, July 5, 2024

516. ఆత్మ తీరం


ఆత్మ  తీరం


భాగ్య మే     వైరా గ్య  మైన   వేళ

  ఆనంద మే   అనంత ము.

  శైవ  మే      మోహ మైన    వేళ

  ప్రేమ యే     ఆరాధనం.


• సరిగమలు     లేని    ఈ జీవన రాగం

  పదనిసల   సెలయేరు లా   సాగుతుంది.

• పరిమితులు   లేని     ఈ జీవన వేదం

  ఆటపాటల   సింధువు లా    సాగుతుంది.


• ఇది    ఒక    దివ్యం

  ఇది    ఒక    నవ్యం.


• భాగ్య మే     వైరా గ్య  మైన    వేళ

  ఆనంద మే     అనంత ము.

  శైవ మే      మోహ మైన   వేళ

  ప్రేమ యే     ఆరాధనం.


• శూన్యం లో    విహరించే    ఈ బిందువు కి

  ఎవరు బంధం  …  ఏది భారం.

  దేహం తో    మురిపించే     ఆ  మాయ కి

  ఏది సత్యం … ఏది అసత్యం


• ఇది    ఒక    భోగం

  ఇది    ఒక    యోగం.


• భాగ్య మే      వైరా గ్య మైన     వేళ

  ఆనంద మే     అనంత ము.

  శైవ మే      మోహ మైన    వేళ

  ప్రేమ యే     ఆరాధనం.


సింధువు  = సాగరం 

బిందువు  =  ఆత్మ.


యడ్ల శ్రీనివాసరావు 5 July 2024, 8:00 pm.


Tuesday, July 2, 2024

139. కళాశాల 1980 ఎపిసోడ్ – 19 ... సమాప్తం

 

కళాశాల 1980

ఎపిసోడ్ – 19



సీన్ -  67.


రోజు శైలజ విమల ఇంటి నుంచి తన ఇంటికి వచ్చాక …. కొంత ముభావంగా ఉంది. శైలజ, తాను అడిగిన విషయానికి విమల అంగీకరిస్తుందేమో అనుకుంది.  ఎందుకంటే , తన త్యాగం లో అర్దం ఉంది అనుకుంది.  కానీ తన ఆలోచనలకు అందనంత ఎత్తులో విమల ఉందని గ్రహించింది.  ఇదంతా కేవలం రాము పై ఉన్న ప్రేమ కొద్ది  …. రాము పొందలేక పోయిన దాన్ని , తిరిగి ఇవ్వాలని అనుకుంది. అలా అయితే, జీవించి ఉన్న మిగతా కాలం లో , రాము సహజంగా సంతోషంగా ఉంటాడని భావించింది. ఇది ఎంత పెద్ద త్యాగమో శైలజ కు తెలుసు. కానీ అంత త్యాగం ముందు రాము కి విమల పై గతం లో ఉన్న ప్రేమ గొప్పది గా భావించింది.


అదే  రోజు రాత్రి రాము ఇంటికి వచ్చాడు… శైలజ హుషారుగా లేకపోవడం గమనించాడు.

రాము భోజనం చేసాక…. శైలజ , రాము తో అంది… నేను మధ్యాహ్నం విమల ఇంటికి వెళ్లాను.

రాము :   అవునా … ఏంటి అంత సడెన్ గా…నవ్వుతూ

శైలజ :   ఏం లేదు …. బోర్ గా అనిపించి …. వెళ్లాను.

రాము :  ఓ కే…. విమల ఎలా ఉంది. ఏంటి విషయాలు…

శైలజ :  హ … బాగానే ఉంది. … నవ్వుతూ…

రాము :   శైలు … ఇంకొక ముఖ్యమైన విషయం,  నేను 3 రోజుల పాటు గోవా కి  వెళ్లాలి.  అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సమ్మిట్ గోవా లో జరుగుతుంది. అది ఈ వారం చివరి 3 రోజులు.

శైలజ :   హ… అయితే బాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్న మాట … గోవా లో….

రాము :  అంతేగా …. నవ్వుతూ….

శైలజ :  అయితే … నాకు బోర్ …. ఈ మూడు రోజులు.

రాము :   బోర్ ఎందుకు …. నీకు అభ్యంతరం లేకపోతే,  విమలను  పిల్లలను తీసుకుని ఇక్కడకు వచ్ఛెయ్యమని చెప్పు …. నీకు కంపెనీ గా ఉంటుంది.

శైలజ :  అవును…. మంచి ఆలోచన…. రేపు చెపుతాను.


మరుసటి రోజు ఉదయం రాము, ఆఫీస్ కి వెళ్ళగానే శైలజ విమలకి ఫోన్ చేసి, విషయం చెప్పింది. పిల్లలను తీసుకుని మూడు రోజులు ఉండేలా తన వద్దకు రమ్మని చెప్పింది.  విమల ముందు ఒప్పపుకోక పోయినా,   శైలజ బలవంతం చేసే సరికి విమల సరే అంది.


ఆ వారం చివరిలో రాము గోవా వెళ్లాడు. అదే రోజు సాయంత్రం విమల , శైలజ వద్దకు వచ్చింది.

శైలజ :  విమలా ...  ఏరి ... పిల్లలు.

విమల :   ఈ రోజు శుక్రవారం కదా … ఆఫీస్ లో వీకెండ్ పార్టీ అంట … ఆలస్యం అవుతుందన్నారు. రేపు ఆఫీస్ తరుపున ఛారిటీ కేంపు డ్యూటీ ఇద్దరికీ ఉందట. వెళ్లాలని చెప్పారు.

శైలజ :   అంతేలే …. ఈ రోజుల్లో పిల్లలు పెద్ధ వాళ్లు అయ్యే కొద్ది … వాళ్ల జీవితం వాళ్లది ….. మనకు  నచ్ఛిన విధంగా ఉండడానికి ఆ రోజుల్లో స్వేచ్చ ఉండేది కాదు.  ఇప్పుడు పిల్లలు ఈ విషయం లో అదృష్టవంతులు..... నవ్వుతూ అంది.


ఆ రాత్రి భోజనం చేసిన తరువాత విమల, శైలజ కలిసి పడుకుందామని బెడ్ పై జారబడ్డారు …. ఆ సమయంలో , రాము ఫోన్ చేశాడు.    శైలజ  ఫోన్ స్పీకర్ ఆన్ చేసి  బయటకు  మాట్లాడుతూ ఉంది. పక్కనే ఉన్న విమల అంతా వింటుంది.

శైలజ :   గోవా … చేరిపోయారా.

రాము :   హ…. ఇప్పుడే రిసార్ట్స్ కి వచ్చాను.

శైలజ :   నేను లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

రాము :   హ … నువ్వు, లేకపోయినా  ఉన్నట్లే ఉంది లే  …  గోవా నుంచి వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు.

శైలజ :  మీరు … క్షేమం గా రండి… అదే చాలు … నాకు ఏం అక్కర్లేదు.

రాము :  విమల వచ్చిందా ? …

శైలజ :   హ … వచ్చింది ... పక్కనే ఉంది …మాట్లాడండి.

రాము :  హ… విమలా, భోజనం అయిందా…

విమల : అయింది … రాము… ఇప్పుడే…

రాము :  పిల్లలు ఏం చేస్తున్నారు …

విమల :   రాలేదు  రాము… వాళ్లు బిజీ అంట … నేను మాత్రమే వచ్చాను … అంది నవ్వుతూ.

రాము :   సరే విమల…. నేను ఆదివారం సాయంత్రానికి వచ్చేస్తాను…. నేను వచ్చే వరకు ఉండు…. విమలా …. నీకు గోవా నుంచి ఏం తీసుకు రమ్మంటావు .

విమల :  నీ ఇష్టం …. రాము.

రాము :  సరే విమలా … ఇక్కడ షాపింగ్ లో ఏమైనా వెరైటీ  గా   కనిపిస్తే తీసుకు వస్తాను. … ఉంటాను.


రాము కి తెలియదు ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉండగా విమల మాట్లాడింది అని.  పక్కనే శైలజ  వింటుంది అని. 


ఫోన్ లో   రాము ... "విమలా"  అనే పదం పలుకుతూ ఉంటే,  అది విన్న శైలజ మనసు లో  ఏదో తెలియని అలజడి గా అనిపిస్తుంది.

ఆ రోజు రాత్రి  శైలజ అదే విషయం ఆలోచిస్తూ… విమలను, రాము మాములుగా పిలుస్తున్నా కూడా, తన హృదయం లో అలజడి అనిపిస్తుంది … ఇలా ఎందుకు…. ఏంటి ఇదంతా…. అనే ప్రశ్న వేసుకుంది.

ఆ మరుసటి రోజు  శైలజ,  విమల కలిసి గుడికి, షాపింగ్ కి,  హోటల్ కి వెళ్లి , సరదాగా గడిపారు.

ఆదివారం సాయంత్రం …. రాము గోవా నుంచి వచ్చాడు ….    ఆ రాత్రి భోజనం చేసిన తరువాత, శైలజ ఉండగానే  విమలను పిలిచి , పిల్లలకు టీ షర్ట్స్, డ్రెస్ లు ఇచ్చాడు.    విమలకి ,  పూసలతో ఉన్న డిజైనర్ ఫ్యాషన్ లాకెట్ చైన్ ఇచ్చాడు. అది విమలకి, శైలజకి  ఇద్దరికీ బాగా నచ్చింది.

విమల :  మరి … శైలజ కు ఏం తెచ్చావు ... రాము.

రాము :    నేను క్షేమం గా వస్తే చాలు … అంది కదా … అందుకే ఏం తీసుకో లేదు ... అన్నాడు నవ్వుతూ.

ఆ రాత్రి శైలజకి  …  మనసు లో  చాలా దిగులు గా అనిపించింది.


సీన్  -  68.


ఆ మరుసటి రోజు ఉదయం విమలను ఇంటి వద్ద దించి, రాము ఆఫీస్ కి వెళ్ళాడు.


ఆ రోజు  సాయంత్రం ఇంటికి వస్తూనే, రాము చాలా హుషారుగా ఉన్నాడు.  శైలజ మాత్రం  డల్ గా ఉంది.

రాము ఇంటిలోకి వస్తూనే …

రాము :  శైలు …. త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు….

శైలజ :   తలనొప్పి గా  ఉంది రాము …. విషయం ఏంటో చెప్పు ….

రాము :  శైలు ... నేను ఫ్రెష్ అవుతాను…. ఈ లోగా నువ్వు ప్రెష్ అవ్వు ,  అప్పుడు చెపుతాను .

రాము ముందు గా స్నానం చేసి వచ్చాడు. టవల్ తో ఉన్నాడు. .

ఇంతలో శైలజ స్నానం చేయడానికి అదే రూం లో ఉన్న   బాత్రూం కి వెళ్లింది.

రాము వెంటనే,  సూట్ కేస్ తెరిచి,   గోవా నుంచి శైలజ కోసం తెచ్చిన  డైమండ్స్ చెయిన్  ఒక చేతి తో పట్టుకొని …. బాత్రూం డోర్ పక్కనే సైలెంట్ గా నిలబడ్డాడు.

శైలజ టవల్ చుట్టుకొని … బాత్రూం, డోర్ తెరిచి బయటికి వచ్చే సరికి,  శైలజ  వెనుక నిలబడి  రాము  మరో చేతితో  శైలజ  రెండు కళ్లు  మూసాడు ….  శైలజను గట్టిగా  వెనుక నుంచి  కౌగిలించుకున్నాడు.

శైలజ :  అదంతా ఇష్టం గా అనిపించినా … కొంత అయిష్టం తో   ఏంటి రాము … ఇదంతా వదులు…

రాము :   వదులుతాను కానీ …. వదలడానికి కాదు కదా నిన్ను బంధించింది. అంటూ ... శైలజ  చెవి పై తన పెదాలను తిప్పుతూ నెమ్మదిగా అన్నాడు.

అదంతా శైలజ కు ఏదో అయిపోతున్నట్లు అనిపిస్తుంది.

శైలజ :   సరే … కళ్లు తెరవని ... చేయి తియ్యి…

రాము :   సరే … తీస్తాను ... రా ... అంటూ నెమ్మదిగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు కి తీసుకు వెళ్లి, నిలబెట్టాడు శైలజ ని.

రాము నెమ్మదిగా,  ఒక చేతి గుప్పిట్లో ఉన్న చైన్ ను శైలజ మెడ చుట్టూ పెట్టి …. మరో చేతితో మూసిన  శైలజ కళ్లను  నెమ్మదిగా తీసాడు…

శైలజ,   కళ్లు తెరిచే  సరికి  శంఖం  లాంటి  శైలజ  మెడ కి  డైమండ్  చైన్   ఉండడం చూసి గాలి లో తేలిపోయింది.  వెంటనే రాము వైపు తిరిగి  ముద్దులతో  ముంచెత్తింది.  ఆ సమయంలో వారిద్దరి ఆనందానికి  అవధులు లేవు.

కొంత సమయం తర్వాత  …  శైలజ తన ఆలోచనలకు సిగ్గు పడింది.  ఎందుకంటే, రాము తన కోసం గోవా నుంచి ఏమీ తీసుకురాలేదని అనుకుంది. అందుకే డల్ గా ఉంది.  తనకు, రాము పై   ప్రేమ,  నమ్మకం తగ్గుతున్నాయని భావించడం కంటే,  తనలో స్వార్థం పుడుతుందని … శైలజ అనుకుంది.  ఆ స్వార్థానికి శాశ్వతం గా  పుల్ స్టాప్ పెట్టాలని  అనుకుంది.

ఆ రోజు రాత్రి నిద్ర పోయే సమయం లో …. శైలజ,  రాముతో

శైలజ :    రాము…. నేను ఒకటి అడుగుతాను… స్పష్టం గా సమాధానం చెపుతావా….

రాము :    ఏంటి …. శైలు…

శైలజ :   నీకు … విమల అంటే ఇష్టమే నా…

రాము :   అదేం మాట శైలు …. ఒకప్పుడు ఇష్టం … ఇప్పుడు గౌరవం.

శైలజ  :   నాకు అదంతా కాదు ... నీకు విమల పై ఇంకా ప్రేమ ఉంది కదా….

రాము  :  అవును శైలు ... ఉంది ... ఒకసారి ఒకరిని ప్రేమిస్తే   అది ఎప్పటికీ పోదు.  అది నీకే బాగా తెలుసు.  అలా అని   ప్రతీ ప్రేమ,   కోరికగా అందరికీ మారదు.

శైలజ :   నేను ఒకటి చెపుతాను … చేస్తావా….

రాము :   శైలజ ప్రశ్నలకు విస్తు పోతూ …. ఏంటి చెప్పు.

శైలజ :   విమలను  పెళ్లి చేసుకుంటావా….

రాము :  ఒక్కసారిగా, షాక్ అయ్యాడు .... ఏంటి శైలు,    నీకు పిచ్చి పట్టిందా ? … ఏంటి ? .... ఏం మాట్లాడుతున్నావో  అర్దం అవుతుందా ? …..

అంటూ … సరే విను ….. నా నిర్ణయం చెపుతాను.

నేను   విమల ను   ప్రేమించింది  నిజం.  పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం …. విమలను చాలా రోజులు మరచి పోలేనిది నిజం. ….  ప్రేమ, పెళ్లి అనేవి ఎవరికైనా జీవితంలో ఒక సారే . ఎప్పుడైతే విమలకి మరొకరితో పెళ్లి జరిగిందో …. అదే విధంగా నాకు వివాహం అయిందో … మేము ఒకరికి ఒకరు సొంతం కాదు. నేడు నాకంటూ ఒక కుటుంబం ఉంది. అలాగే విమల కి కూడా కుటుంబం ఉంది.

అయినా శైలు,  నీ ఆలోచన సరి యైనది కాదు.  ఇప్పుడు  విమలను పెళ్లి చేసుకుని నేను చేయగలిగేది ఏముంది. నాకు తనపై  ఏ కోరికలూ లేవు.  ఎవరికైనా   జీవితం పసి ప్రాయం లో , యవ్వనం లో కోరికలు, ఆశలు ఉంటాయి.  కానీ  జీవితం అంటే ఏంటో చవి చూసాక, నిట్టూర్పులే ఉంటాయి.


చూడు శైలు .....   కొంత కాలం క్రితం,  విమల  అనుభవిస్తున్న పరిస్థితిని చూసి, సహకరించడం నా బాధ్యత అనిపించింది. అదే మనం చేశాం.  ఇప్పుడు తనను కేవలం ఒక స్నేహితురాలు గా  భావించగలను. అంతే గాని  ప్రియురాలు గా ,  భార్య గా  అంగీకరించ లేను.

అయినా …. ప్రేమికులు అయినంత మాత్రాన కలిసి జీవించాలని నియమం ఏం లేదు.

మనల్ని అమితంగా  ప్రేమించే  మనిషి  దొరికినప్పుడు, మనం నోచుకోని ప్రేమకు ఊరట లభిస్తుంది. అది నీ ద్వారా , నాకు లభించింది.

ఇకపోతే, విమల కూడా నోచుకోని ప్రేమ, ఊరట మన ద్వారా నేడు లభిస్తుంది అనుకుంటున్నాను. మనం కలిసి ఉంటాం, కష్ట సుఖాల లో సహకరించు కుంటాం. దీని కోసం పెళ్లి అనే ఆలోచన సరియైనది కాదు.

…. అయినా, శైలు … నన్ను పెళ్లి చేసుకోవడానికి విమల  అంగీకరిస్తుందని  నువ్వు  అనుకుంటున్నావా? ….

తన గురించి నీకు తెలియదు. ఆత్మాభిమానం చాలా ఎక్కువ…. ఈ విషయం విమలకి తెలిస్తే, మనకు కనిపించనంత దూరం వెళ్ళిపోతుంది.

నీ మానసిక  సంఘర్షణకు  ఈ రోజు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాను …. శైలు.

అంటూ .....  తన ధోరణి వినిపించాడు రాము

శైలజ :  ఏడుస్తూ…. రాము పాదాలు తాకింది.

రాము :  పైకి లేపుతూ …. ఏమైంది… నా శైలజ కి… ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది …. అన్నాడు.

శైలజ :   కళ్లు తుడుచుకుంటూ …. నీ మీద ఉన్న ఇష్టం రాము …. నీ మీద ఉన్న ప్రేమ…. నువ్వు ఎంత భాద ఉన్న లోపలే ఉంచుకుంటావు …. పైకి ఎవరికీ తెలియనివ్వవు.  ఇలా నిన్ను చిన్నతనం నుంచి,  మా ఇంట్లో చదువుకునే  రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను.  విమలతో  నీ ప్రేమ విషయం తెలిసిన తరువాత  నాకు ఏరోజు  నీ పై  కోపం రాలేదు.  ఎందుకో తెలియదు జాలి వేసింది. ఆ జాలి , నీ పై నాకు ప్రేమ గా మారింది .…. నువ్వు విమల వలన కోల్పోయిన ప్రేమ మరలా నీకు దక్కితే …. కనీసం ఈ జన్మలో నువ్వు సంతోషంగా  మిగిలిన కాలం  అంతా ఉంటావని ... అనుకున్నాను

రాము :   అందుకని .,. ఇంత త్యాగం చేయదలిచావా …. చూడు, శైలు ... విమల మనకు కనిపించింది కాబట్టి ఇవన్నీ అనగలుగుతున్నావు …. అదే తను కనపడక పోతే ... ఇప్పుడు ఇదంతా జరిగేదా ....  చెప్పు ….

విమల కనిపించని అన్నాళ్లు,  నాకు పెళ్లి అయిన తరువాత కూడా ….  విమల ఎక్కడ ఎలా ఉందో… ఒక్కసారైనా చూస్తే చాలు అనుకునే వాడిని.

చూడు శైలు … గడిచి పోయిన కాలం లో   ప్రేమ స్మృతులు , అందంగా  ఆనందంగా  అనిపిస్తాయి. అది సహజం.   అలా అని, ఆ కాలాన్ని తిరిగి తీసుకు రావాలను కోవడం అవివేకం.  ఊహలు మనసు కి ఊరట గా ఉండాలి , అంతే కానీ    ఆ ఊహలు మనసుకి  ఉరి  వేయకూడదు.

శైలు, ఇంకా అదృష్టం ఏమిటంటే ….. విమల, నేను ఈ రోజు కి కలిసి ఉన్నాం.  ఈ కలయిక లో  దృష్టి మాత్రమే ఉంటుంది.    అందులోనే  ప్రేమ, వాత్సల్యం ఉంటాయి. ఇది శరీరాలకి సంబంధించిన విషయం కాదు.

శైలజ :  రాము మాటలు విని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మంచితనం తో  మనుషుల ను హింసించడం అంటే ఇదే ... రాము 


రాము శైలజ ని ఓదారుస్తూ, ఒళ్లోకి తీసుకుని ….. నా జీవితానికి నువ్వే భార్య వి.

రాము :   శైలజ. …. నీకు ఒక మాట చెప్పనా…. ఇప్పటి వరకు ఏనాడూ  నీతో  చెప్పనిది …..

శైలజ :  హ …

రాము :  శైలజా …. నువ్వు,......  నన్ను నేను మరచి పోయేలా చేశావు.   విమల లేకపోతే   ఒకప్పుడు నేను లేను అనేది వాస్తవం. ….. నువ్వు లేకపోతే  ఇప్పుడు, నేను లేను అనేది  వాస్తవం. …. నేను పైకి కనిపించక పోయినా, నీ మీద పూర్తిగా డిపెండెంట్ ని.

రాము కళ్లల్లో నీళ్లు …. శైలజ చెంప పై నెమ్మదిగా జారుతున్నాయి.


విమల ఆలోచనలు, రాము ఆలోచనలు ఒకేలా ఉండడం తో   శైలజ తన మనసు లో …. రాము, విమల ఒకరికొకరు   మేడ్ ఫర్ ఈచ్ అదర్ … అని అనుకుంటూ శైలజ నిద్ర లోకి జారుకుంది …..


***********

ఏ మనిషి కి జీవితం అంటే ఊహించిన విధంగా ఉండదు. ప్రేమించిన వ్యక్తి తో వివాహం కానంతలో , ఆ ప్రేమ విఫలం అయినట్లు కాదు.  ప్రేమ ఒకసారి పుడితే అది మనిషి మరణించిన తరువాత కూడా ఉంటుంది.  

ఒక  ప్రేయసి పై   ఉన్న  నిజమైన ప్రేమ,   ఒక ప్రియుడు కి   తన  ఆయుష్షు తో సమానం.  ఈ  ప్రేమ కొందరికి  జన్మాంతరాలుగా  ఉండి  పోతుంది.  ప్రేమకు  పరిణితి ఉంటే చాలు.  హద్దులు, ఎల్లలు, పరిమితులు అవసరం లేదు .  ఎందుకంటే  ప్రేమ మనసు కి సంబంధించినది. 

 అందులో భాగంగానే రాము, విమల, శైలజ తమ ప్రేమ ద్వారా తమ జీవితాలను నిర్వచించుకున్నారు.

సమాప్తం…..


యడ్ల శ్రీనివాసరావు 

1 July 2024 , 6:00 PM.




Monday, July 1, 2024

139. కళాశాల 1980. ఎపిసోడ్ – 18

 

కళాశాల 1980

ఎపిసోడ్ – 18


సీన్  –  64


5 సంవత్సరాల పాటు కాలం గడిచింది.  రాము కి 56 సంవత్సరాలు వచ్చాయి.

రాము పిల్లలు పెద్ద వారయ్యారు. అమెరికా లో చదువు పూర్తి చేసి , ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. పిల్లలు కోరిక మేరకు అమెరికాలో పూర్తిగా స్థిరపడడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ రాము పూర్తి చేశాడు.


మరో వైపు , విమల ఇద్దరు పిల్లలు కూడా పెద్దవారై   ప్రయోజకులయ్యారు. హైదరాబాద్ లో రాము కంపెనీ ఆఫీసు లో ఉద్యోగం చేస్తున్నారు.


విమల జీవితం, తన పిల్లల జీవనం డబ్బు కి   ఏ లోటు లేకపోవడం వలన , పూర్తి సౌకర్య వంతంగా, విలాసవంతం గా మారిపోయింది.


ఇంతలో ఒక రోజు , రాము శైలజ ల పెళ్లి రోజు వచ్చింది. అమెరికా నుంచి పిల్లలు ఇద్దరూ కలిసి అమ్మా నాన్నలకు విషెస్ చెప్పారు.

ఆ రోజు ,   శైలజ గుడికి వెళదాం అంటే …. ఇద్దరూ కలిసి బయలు దేరారు.

దేవుని దర్శనం అయిన తరువాత, గుడి ఆవరణలో ఇద్దరూ కూర్చున్నారు. వారికి పెళ్లి అయి, ఆ రోజు తో 25 సంవత్సరాలు పూర్తి అయింది . కానీ వాళ్లు చూడడానికి ఇంకా 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, అలాగే ఉన్నారు.   శైలజ కు  రాము పై  ప్రేమ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే తను రాము ని అంతగా ఇష్టపడింది. రాము ఏనాడూ శైలజ మాటకు అభ్యంతరం చెప్పేవాడు కాదు.

ఇంతలో శైలజ నెమ్మదిగా రాము చేతిని తన చేతిలోకి తీసుకుని, రాము కళ్లలోకి  చూస్తూ ....

శైలజ :  రాము ... నీకు గుర్తుందా…. 25 సంవత్సరాల క్రితం,. కావాలని నేను నీ వెంటపడి, వెంటపడి విసిగించే దానిని. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఏమీ అనకుండా, ఓపిక గా ఉండేవాడివి. అదే నీ లో నాకు బాగా నచ్చేది.

రాము :  ఇప్పుడు, ఆ విషయాలు ఎందుకు…. చెప్పు.

శైలజ :   నేనే … నీ అమాయకత్వం చూసి ప్రేమించాను. ఆ ప్రేమ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది రాము…. అంటూ రాము భుజం పై వాలింది.

రాము :   ఇప్పుడు ఏమైంది…. మనం సంతోషంగా నే ఉన్నాం కదా…

శైలజ :   మనం సంతోషంగా ఉన్నామా…. నిజం చెప్పు…. నువ్వు ఉన్నావా…

రాము :   శైలు…. నువ్వు అనవసరం ఏదో మాట్లాడుతున్నావు … నేను సంతోషంగా ఉండడం వల్లనే కదా , ఇంత హోదా, ఆస్తి, బిజినెస్ మేన్ గా పేరు అన్నీ సంపాందించాను. నా సంతోషం లో నువ్వు ఉండ బట్టే కదా, ఇదంతా మన జీవితంలో జరిగింది.

శైలజ :   రాము … అప్పుడప్పుడు, కొన్ని సార్లు నీ ముఖం చూసినప్పుడు, నీలో ఏదో లోటు  ఉన్నట్టు, నువ్వు ఇంతగా ఇవన్నీ సంపాదించినా సరే, వీటన్నింటికి నువ్వు , ఏ రోజు ఎటాచ్  అయి  లేనట్టు అనిపిస్తుంది.

రాము కి శైలజ, ఏదో భావోద్వేగం తో, మాట్లాడుతుందనే  విషయం అర్దం అయింది.

వెంటనే

రాము :  నవ్వుతూ… శైలు … . అనవసరం గా ఏదో ఆలోచిస్తున్నావు … లే… టైం అవుతుంది … నిన్ను ఇంటి దగ్గర దింపి…. ఆఫీస్ కి వెళతాను…. లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. స్పెషల్స్ చెయ్యి.


రాము ఆఫీస్ కి వెళ్ళగానే, విషయం తెలిసిన ఆఫీస్ స్టాఫ్ …. రాము 25 సంవత్సరాల సంధర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే ఆఫీసులో జాబ్ చేయడం వలన విమల పిల్లలకు కూడా విషయం తెలిసింది.


మధ్యాహ్నం రాము ఇంటికి వచ్చాడు. శైలజ రాము కలిసి లంచ్ చేసిన తర్వాత …. ఇద్దరూ ప్రేమ సాగరం లో ఆనందించారు.


సీన్ – 65.


విమల పిల్లలు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక… రాము 25 సంవత్సరాల పెళ్లి రోజు విషయం,   తల్లి తో చెప్పారు.


శైలజ కోరిక మేరకు ఆ రోజు, సాయంత్రం రాము శైలజ కలిసి సినిమా కి వెళ్లారు.

రాము, శైలజా సినిమా చూస్తున్న సమయంలో విమల , శుభాకాంక్షలు తెలియజేయడానికి రాము కి ఫోన్ చేసింది. సినిమా శబ్దం లో విమల మాటలు సరిగా వినపడకపోయినా అర్దం చేసుకొని ధాంక్స్ చెప్పి,. శైలజ కు ఫోన్ ఇచ్చాడు. శైలజ కూడా ధాంక్స్ చెప్పింది. విమల గొంతు వినే సరికి, రాము మనసు లో ఏదో అలజడి గా అనిపించింది. సినిమా పై ఏకాగ్రత చూపలేక పోతున్నాడు.


సినిమా అయిపోయాక రెస్టారెంట్ కి వెళ్లి…. ఇంటికి వెళ్ళారు.

ఆ రోజు రాత్రి శైలజా, రాము ఇద్దరూ ప్రేమ పక్షుల్లా కలిసి ఒకరి కౌగిట్లో మరొకరు  వాలి మాట్లాడుకుంటున్నారు. 

శైలజ :   రాము…. ఈ రోజు చాలా బాగా గడిచింది కదా…. పిల్లలు కూడా మనతో ఉంటే బాగుండేది.

రాము :  అవును …. వాళ్లను చాలా మిస్ అయ్యాం.

శైలజ :  ఇందాక, సినిమాలో విమల కాల్ చేసింది…. సరిగా వినపడలేదు…. ఒకసారి ఫోన్ చెయ్యండి.

రాము :  ఈ సమయంలో అంత అవసరమా…. రేపు మాట్లాడదాం లే.

శైలజ :  నేను… ఈ రోజు ఉదయం గుడిలో అడిగిన ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పలేదు…అంటూ రాము గుండెను నిమురుతూ అంది.

రాము :   ఒక్కసారిగా, అసహనానికి గురై …. శైలు నువ్వు, ఏం అడగాలి అనుకుంటున్నావో , అది సూటిగా అడుగు. సమాధానం చెపుతాను… అంటూ…. కొంత కోపం గా…. కొంత భాధగా…. అవును, నేను సంతోషాన్ని అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. చెప్పాలంటే నాకు అర్దం కాదు. చిన్న తనం నుంచి సమస్యలు, కష్టాలు, ఆకలి బాధలు,  ధీన పరిస్థితులు,   ప్రేమ వెక్కిరింపు   ఇవే మనసు లో నాటుకు పోయి ఉండడం వలన నేను భావోద్వేగాలకు చలనం లేని మనిషి గా అయిపోయాను. ఈ స్థితి కి ఎవరూ కారణం కాదు. నాతో ఉన్న వారు సంతోషంగా ఉంటే, వారిని చూసి నాకు సంతోషం ఆ క్షణంలో అనిపిస్తుంది. అలా అని నేను ఏ విధంగా ను భాధతో, వెలితి తో   జీవితం  గడపడం లేదు. ఇది నిజం.

శైలజ :  వెంటనే …. సారీ… సారీ … రాము…. నిన్ను భాధ పెట్టాను…. సారీ….. నీ కోసం నేను ఎప్పుడూ ఏం చేసింది లేదు…. నా కోసం నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. సంతోషం, ప్రేమ , పంచావు. అడిగిన వన్నీ ఇచ్చావు.

రాము :  ఇప్పుడు… మనకు ఇదంతా అవసరమా…. నువ్వు అనవసరంగా ఎక్కువ గా, ఏదీ ఆలోచించకు.

కానీ రాము కి అర్దం అవుతుంది. విమల పై తనకున్న ప్రేమ విఫలం కావడంతో తాను సంతోషంగా లేననుకొని  … శైలు భావిస్తుంది అని అనుకున్నాడు.

నిజానికి శైలజ ఉద్దేశం కూడా అదే … ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఆ మనిషి తో జీవితం గడపని పక్షంలో మనసు పడే బాధ ఎలా ఉంటుందో …. శైలు కి రాము ను ప్రేమించే సమయం లో బాగా అర్దం అయింది. రాము కనుక తనను పెళ్లి చేసుకోక పోతే, జీవితాంతం అలాగే ఉండి పోవాలని శైలజ అనుకుంది. …. మరి రాము కి కూడా తన లాగే విమల విషయం లో ఉంటుంది కదా, అనే ఆలోచన రాను, రాను రోజులు గడిచే కొద్దీ శైలజకి తెలిసొచ్చింది. ముఖ్యం గా విమలను చూసాకా,   శైలజ లో ఆ భావం మరీ ఎక్కువగా అయింది. …. అందు కోసం త్యాగానికి సిద్ధపడాలని అనుకుంది. కానీ అది తప్పా ఒప్పా అనేది శైలజ కు తెలియదు.


సీన్ –  66


ఒక వారం తరువాత శైలజ ఫోన్ చేసి , విమల ఇంటికి వెళ్ళింది. శైలజ రావడం తోనే విమల సంతోషంగా ఆహ్వానించింది…. మీతో పాటు రాము వస్తే బాగుండును అంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటున్నారు.


కొంత సమయం తర్వాత…


శైలజ :   విమల … నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా భావించవు కదా….

విమల :  అయ్యా … ఎంత మాట…. పర్వాలేదు… నాకు మీరు తప్పితే ఎవరున్నారు … నా మంచి కోరేవారు …. అడగండి.

శైలజ :   కొంచెం తడబడుతూ, విమలా …. నువ్వు మరలా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది …. ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దు …. ఎందుకంటే , నీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుందని అన్నాను.

శైలజ మనసు లో కొంత భయం తోనే అడిగింది.. విమల ఏమనుకుంటుందో అని.

విమల :  ఒక్కసారిగా నవ్వింది…. పెళ్లా … నేనా…. ఈ వయసు లో…. ఎవరు చేసుకుంటారు చెప్పు …. నా లో ఏం ఉందని చెప్పు…. నేను ఇద్దరు పిల్లల తల్లి ని …. అని నవ్వుతూ అంది. …..

శైలజ అడిగిన ప్రశ్నకు విమలకి కోపం రాలేదు… కానీ ఆశ్చర్యం అనిపించింది.

శైలజ :   అదేంటి… విమలా, నీకు చక్కటి వర్చస్సు ఉంది, మంచి మనసు ఉంది.

విమల :   అవును …. ఇవన్నీ ఉండడం వల్లనేమో , భగవంతుడు ఈ రాత రాసాడు నాకు ….. అయినా జీవితం లో ప్రేమ, పెళ్లి అనేవి రెండు కూడా ఒక్కసారే ఉండాలి … ఈ రెండింటి లోనూ ఇప్పటికే, చిన్న వయసు లోనే ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి.

ఒకరితో  ప్రేమ పొందినా , పెళ్లి జరగని నరకం ఎలా ఉంటుందో చూసాను … మరొకరి తో   పెళ్లి జరిగినా ప్రేమ పొందని జీవితం చూసాను. … ఇప్పుడు మరలా వీటన్నింటికి అతీతం గా పెళ్లి చేసుకుని ఏం సాధించాలి …. చెప్పు శైలజ. అయినా నాకు నువ్వు, రాము ఉన్నారు కదా చూసుకోవడానికి.

శైలజ :    వెంటనే …. అదే…. అదే…. నేను అనేది…. నీకు రాము అంటే ఇష్టం కదా…. రా...ము…ని…. పెళ్లి చేసుకో గలవా అని ….

నిశ్శబ్దం గా ఉంది… ఆ సమయం.

శైలజ అన్న మాటకు విమల విస్తు పోయింది. ఊహించ లేదు సరికదా…. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.

కొంత సమయం తర్వాత …

విమల :  చూడు శైలజ …. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇంత త్యాగం తో మాట్లాడతావని ఊహించ లేదు. బహుశా ఇది, నీకు రాము పై ఉన్న అతి ప్రేమ ఇలా మాట్లాడిస్తుంది. ….. నాకు రాము అంటే ప్రేమ ఉంది. కానీ అది ఒకప్పటిలా ఉన్న ప్రేమ మాత్రం కాదు. ఇప్పుడు ఉన్న ప్రేమలో రాము ఎంతో , నువ్వు అంతే నాకు …. అప్పట్లో రాము మనసు మాత్రమే కావాలనుకునే దానిని. కానీ ఇప్పుడు రాము మనసు తో ముడిపడి ఉన్న మనసులు కూడా కావాలని ఆశిస్తున్నాను. అది నాకు ఇప్పటికే లభించింది. నా వలన రాము కి ఏ సమస్యా, ఎప్పుడూ ఉండదు.

ఇక రెండవ విషయం , రాము నుంచి ఆశించేది ఒకటే …. జీవం వెళ్లే వరకు మానసిక సహాయం మాత్రమే. రాము ఎప్పుడూ కూడా కడిగిన ముత్యం. ఆ విషయం నాకు చదువుకునే రోజుల్లోనే తెలుసు.

దయచేసి ఈ విషయం ఎప్పుడూ మన మధ్య వద్ధు… అంది విమల.

విమల విశాలమైన మనసు కి గర్వపడింది శైలజ.

మనసు లో ఇలా అనుకుంది …. నువ్వు  కడిగిన ముత్యం.

కొంత సమయం తర్వాత…

శైలజ :   విమల … ఈ విషయం రాము తో అనకు.

విమల  :  వెంటనే శైలజ చేయి తీసుకుని చిన్నగా ముద్దాడుతూ…. నా పిల్లలు తో పాటు, మీరు ఇద్దరూ చాలు నాకు ఈ జీవితానికి. అంది

శైలజ ఇంటికి బయలు దేరింది.


మిగిలినది

ఎపిసోడ్ – 19 లో


యడ్ల శ్రీనివాసరావు 

30 June 2024 , 10:00 PM



532. దేహము కాదిది … వేదన కాదిది

  దేహము కాదిది … వేదన కాదిది  • దేహము  కాదిది  ….  దేహము కాదిది   దహనము తో     ఎగిసే    చితి    ఇది. • వేదన   కాదిది    ....   వేదన కాదిది...