అమావాస్య కోకిల.
• అమావాస్య లో …
ఆదమరచి పాడింది ఓ ఆమని.
• ఆ రాగం విని చూసింది జాబిలి.
• నిశి లోని నింగి అంతా
నిగ నిగ లాడుతూ ఉంది.
• శశి లేని శోభ కూడా
మిల మిలా మెరుస్తూ ఉంది.
• అంధకారంలో అమావాస్య
జాబిలి కి చూపెను కొంగొత్త భాష్యం.
• ఆదమరచిన ఆమని
ప్రకృతి కి నేర్పెను సరికొత్త గానం.
• ఇదే సత్య యుగం
కాల చక్రం లో అంతరించిన స్వర్ణ యుగం.
• అమావాస్య లో …
ఆదమరచి పాడింది ఓ ఆమని.
• ఆ రాగం విని చూసింది జాబిలి.
• జాబిలి కి తెలిసింది ...
• అమావాస్య అందం
అంధుల పాలిట దివ్యమని...
• అంధకారంలో ఆనందం
విశ్వ శోభ కి ప్రతీకమని.
• ఆమని కి తెలిసింది …
• అమావాస్య గానం
అంబరం తాకగలదని...
• అంధకారంలో గమకాలు
అవధులు దాటగలనని.
• అమావాస్య లో …
ఆదమరచి పాడింది ఓ ఆమని
• ఆ రాగం విని చూసింది జాబిలి.
☘️☘️☘️☘️☘️
• అమావాస్య రాత్రిలో, మైమరచి ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.
• అమావాస్య చీకటి లో ఆకాశం అంతా నిగ నిగ లాడుతూ ఉంది. చందమామ లేకపోయినా సరే ఆకాశం కళతో మిల మిలా మెరుస్తుంది.
• అమావాస్య చీకటి , చందమామ కి ఓ సరికొత్త రూపం చూపింది.... మైమరచి పాడిన ఆ కోకిల, ప్రకృతి కి సరికొత్త రాగం నేర్పింది.
• కాల చక్రం లో అంతరించి పోయిన సత్య యుగం ఇది. పౌర్ణమి అమావాస్య, చీకటి వెలుగు అనే భేదం ఎరుగని దేవతలు నివసించిన స్వర్ణ యుగం.
• అమావాస్య రాత్రిలో, మైమరచి ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.
• చందమామ కి తెలిసింది ….
• అమావాస్య లోని అందం కనులు లేని వారికి ఒక దివ్యత్వం అని. మరియు చీకటి లో లభించే సంతోషమే విశ్వం లో ఉన్న సమస్త అందాలకు నిదర్శనం అని.
• కోకిలకి తెలిసింది …
• అమావాస్య నాడు తన స్వరం ఆకాశం చేరుగలదని. చీకటి లో తన రాగ విశేషం ఎల్లలు దాటి పోగలదని.
• అమావాస్య రాత్రిలో, మైమరచి ఓ కోయిల పాడింది. ఆ పాట విన్న చందమామ ఉలిక్కిపడి చూసింది.
• చందమామ :
ధనం, అహంకారం ఉన్న వారు.
• అమావాస్య , అంధులు, ఆమని :
దుఃఖం, నిరాశ, నిస్పృహ, మానసిక బాధలు
అనుభవించే వారు.
యడ్ల శ్రీనివాసరావు 25 July 2024, 10:00 PM.
No comments:
Post a Comment