Tuesday, July 2, 2024

139. కళాశాల 1980 ఎపిసోడ్ – 19 ... సమాప్తం

 

కళాశాల 1980

ఎపిసోడ్ – 19



సీన్ -  67.


రోజు శైలజ విమల ఇంటి నుంచి తన ఇంటికి వచ్చాక …. కొంత ముభావంగా ఉంది. శైలజ, తాను అడిగిన విషయానికి విమల అంగీకరిస్తుందేమో అనుకుంది.  ఎందుకంటే , తన త్యాగం లో అర్దం ఉంది అనుకుంది.  కానీ తన ఆలోచనలకు అందనంత ఎత్తులో విమల ఉందని గ్రహించింది.  ఇదంతా కేవలం రాము పై ఉన్న ప్రేమ కొద్ది  …. రాము పొందలేక పోయిన దాన్ని , తిరిగి ఇవ్వాలని అనుకుంది. అలా అయితే, జీవించి ఉన్న మిగతా కాలం లో , రాము సహజంగా సంతోషంగా ఉంటాడని భావించింది. ఇది ఎంత పెద్ద త్యాగమో శైలజ కు తెలుసు. కానీ అంత త్యాగం ముందు రాము కి విమల పై గతం లో ఉన్న ప్రేమ గొప్పది గా భావించింది.


అదే  రోజు రాత్రి రాము ఇంటికి వచ్చాడు… శైలజ హుషారుగా లేకపోవడం గమనించాడు.

రాము భోజనం చేసాక…. శైలజ , రాము తో అంది… నేను మధ్యాహ్నం విమల ఇంటికి వెళ్లాను.

రాము :   అవునా … ఏంటి అంత సడెన్ గా…నవ్వుతూ

శైలజ :   ఏం లేదు …. బోర్ గా అనిపించి …. వెళ్లాను.

రాము :  ఓ కే…. విమల ఎలా ఉంది. ఏంటి విషయాలు…

శైలజ :  హ … బాగానే ఉంది. … నవ్వుతూ…

రాము :   శైలు … ఇంకొక ముఖ్యమైన విషయం,  నేను 3 రోజుల పాటు గోవా కి  వెళ్లాలి.  అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సమ్మిట్ గోవా లో జరుగుతుంది. అది ఈ వారం చివరి 3 రోజులు.

శైలజ :   హ… అయితే బాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్న మాట … గోవా లో….

రాము :  అంతేగా …. నవ్వుతూ….

శైలజ :  అయితే … నాకు బోర్ …. ఈ మూడు రోజులు.

రాము :   బోర్ ఎందుకు …. నీకు అభ్యంతరం లేకపోతే,  విమలను  పిల్లలను తీసుకుని ఇక్కడకు వచ్ఛెయ్యమని చెప్పు …. నీకు కంపెనీ గా ఉంటుంది.

శైలజ :  అవును…. మంచి ఆలోచన…. రేపు చెపుతాను.


మరుసటి రోజు ఉదయం రాము, ఆఫీస్ కి వెళ్ళగానే శైలజ విమలకి ఫోన్ చేసి, విషయం చెప్పింది. పిల్లలను తీసుకుని మూడు రోజులు ఉండేలా తన వద్దకు రమ్మని చెప్పింది.  విమల ముందు ఒప్పపుకోక పోయినా,   శైలజ బలవంతం చేసే సరికి విమల సరే అంది.


ఆ వారం చివరిలో రాము గోవా వెళ్లాడు. అదే రోజు సాయంత్రం విమల , శైలజ వద్దకు వచ్చింది.

శైలజ :  విమలా ...  ఏరి ... పిల్లలు.

విమల :   ఈ రోజు శుక్రవారం కదా … ఆఫీస్ లో వీకెండ్ పార్టీ అంట … ఆలస్యం అవుతుందన్నారు. రేపు ఆఫీస్ తరుపున ఛారిటీ కేంపు డ్యూటీ ఇద్దరికీ ఉందట. వెళ్లాలని చెప్పారు.

శైలజ :   అంతేలే …. ఈ రోజుల్లో పిల్లలు పెద్ధ వాళ్లు అయ్యే కొద్ది … వాళ్ల జీవితం వాళ్లది ….. మనకు  నచ్ఛిన విధంగా ఉండడానికి ఆ రోజుల్లో స్వేచ్చ ఉండేది కాదు.  ఇప్పుడు పిల్లలు ఈ విషయం లో అదృష్టవంతులు..... నవ్వుతూ అంది.


ఆ రాత్రి భోజనం చేసిన తరువాత విమల, శైలజ కలిసి పడుకుందామని బెడ్ పై జారబడ్డారు …. ఆ సమయంలో , రాము ఫోన్ చేశాడు.    శైలజ  ఫోన్ స్పీకర్ ఆన్ చేసి  బయటకు  మాట్లాడుతూ ఉంది. పక్కనే ఉన్న విమల అంతా వింటుంది.

శైలజ :   గోవా … చేరిపోయారా.

రాము :   హ…. ఇప్పుడే రిసార్ట్స్ కి వచ్చాను.

శైలజ :   నేను లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

రాము :   హ … నువ్వు, లేకపోయినా  ఉన్నట్లే ఉంది లే  …  గోవా నుంచి వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు.

శైలజ :  మీరు … క్షేమం గా రండి… అదే చాలు … నాకు ఏం అక్కర్లేదు.

రాము :  విమల వచ్చిందా ? …

శైలజ :   హ … వచ్చింది ... పక్కనే ఉంది …మాట్లాడండి.

రాము :  హ… విమలా, భోజనం అయిందా…

విమల : అయింది … రాము… ఇప్పుడే…

రాము :  పిల్లలు ఏం చేస్తున్నారు …

విమల :   రాలేదు  రాము… వాళ్లు బిజీ అంట … నేను మాత్రమే వచ్చాను … అంది నవ్వుతూ.

రాము :   సరే విమల…. నేను ఆదివారం సాయంత్రానికి వచ్చేస్తాను…. నేను వచ్చే వరకు ఉండు…. విమలా …. నీకు గోవా నుంచి ఏం తీసుకు రమ్మంటావు .

విమల :  నీ ఇష్టం …. రాము.

రాము :  సరే విమలా … ఇక్కడ షాపింగ్ లో ఏమైనా వెరైటీ  గా   కనిపిస్తే తీసుకు వస్తాను. … ఉంటాను.


రాము కి తెలియదు ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉండగా విమల మాట్లాడింది అని.  పక్కనే శైలజ  వింటుంది అని. 


ఫోన్ లో   రాము ... "విమలా"  అనే పదం పలుకుతూ ఉంటే,  అది విన్న శైలజ మనసు లో  ఏదో తెలియని అలజడి గా అనిపిస్తుంది.

ఆ రోజు రాత్రి  శైలజ అదే విషయం ఆలోచిస్తూ… విమలను, రాము మాములుగా పిలుస్తున్నా కూడా, తన హృదయం లో అలజడి అనిపిస్తుంది … ఇలా ఎందుకు…. ఏంటి ఇదంతా…. అనే ప్రశ్న వేసుకుంది.

ఆ మరుసటి రోజు  శైలజ,  విమల కలిసి గుడికి, షాపింగ్ కి,  హోటల్ కి వెళ్లి , సరదాగా గడిపారు.

ఆదివారం సాయంత్రం …. రాము గోవా నుంచి వచ్చాడు ….    ఆ రాత్రి భోజనం చేసిన తరువాత, శైలజ ఉండగానే  విమలను పిలిచి , పిల్లలకు టీ షర్ట్స్, డ్రెస్ లు ఇచ్చాడు.    విమలకి ,  పూసలతో ఉన్న డిజైనర్ ఫ్యాషన్ లాకెట్ చైన్ ఇచ్చాడు. అది విమలకి, శైలజకి  ఇద్దరికీ బాగా నచ్చింది.

విమల :  మరి … శైలజ కు ఏం తెచ్చావు ... రాము.

రాము :    నేను క్షేమం గా వస్తే చాలు … అంది కదా … అందుకే ఏం తీసుకో లేదు ... అన్నాడు నవ్వుతూ.

ఆ రాత్రి శైలజకి  …  మనసు లో  చాలా దిగులు గా అనిపించింది.


సీన్  -  68.


ఆ మరుసటి రోజు ఉదయం విమలను ఇంటి వద్ద దించి, రాము ఆఫీస్ కి వెళ్ళాడు.


ఆ రోజు  సాయంత్రం ఇంటికి వస్తూనే, రాము చాలా హుషారుగా ఉన్నాడు.  శైలజ మాత్రం  డల్ గా ఉంది.

రాము ఇంటిలోకి వస్తూనే …

రాము :  శైలు …. త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు….

శైలజ :   తలనొప్పి గా  ఉంది రాము …. విషయం ఏంటో చెప్పు ….

రాము :  శైలు ... నేను ఫ్రెష్ అవుతాను…. ఈ లోగా నువ్వు ప్రెష్ అవ్వు ,  అప్పుడు చెపుతాను .

రాము ముందు గా స్నానం చేసి వచ్చాడు. టవల్ తో ఉన్నాడు. .

ఇంతలో శైలజ స్నానం చేయడానికి అదే రూం లో ఉన్న   బాత్రూం కి వెళ్లింది.

రాము వెంటనే,  సూట్ కేస్ తెరిచి,   గోవా నుంచి శైలజ కోసం తెచ్చిన  డైమండ్స్ చెయిన్  ఒక చేతి తో పట్టుకొని …. బాత్రూం డోర్ పక్కనే సైలెంట్ గా నిలబడ్డాడు.

శైలజ టవల్ చుట్టుకొని … బాత్రూం, డోర్ తెరిచి బయటికి వచ్చే సరికి,  శైలజ  వెనుక నిలబడి  రాము  మరో చేతితో  శైలజ  రెండు కళ్లు  మూసాడు ….  శైలజను గట్టిగా  వెనుక నుంచి  కౌగిలించుకున్నాడు.

శైలజ :  అదంతా ఇష్టం గా అనిపించినా … కొంత అయిష్టం తో   ఏంటి రాము … ఇదంతా వదులు…

రాము :   వదులుతాను కానీ …. వదలడానికి కాదు కదా నిన్ను బంధించింది. అంటూ ... శైలజ  చెవి పై తన పెదాలను తిప్పుతూ నెమ్మదిగా అన్నాడు.

అదంతా శైలజ కు ఏదో అయిపోతున్నట్లు అనిపిస్తుంది.

శైలజ :   సరే … కళ్లు తెరవని ... చేయి తియ్యి…

రాము :   సరే … తీస్తాను ... రా ... అంటూ నెమ్మదిగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు కి తీసుకు వెళ్లి, నిలబెట్టాడు శైలజ ని.

రాము నెమ్మదిగా,  ఒక చేతి గుప్పిట్లో ఉన్న చైన్ ను శైలజ మెడ చుట్టూ పెట్టి …. మరో చేతితో మూసిన  శైలజ కళ్లను  నెమ్మదిగా తీసాడు…

శైలజ,   కళ్లు తెరిచే  సరికి  శంఖం  లాంటి  శైలజ  మెడ కి  డైమండ్  చైన్   ఉండడం చూసి గాలి లో తేలిపోయింది.  వెంటనే రాము వైపు తిరిగి  ముద్దులతో  ముంచెత్తింది.  ఆ సమయంలో వారిద్దరి ఆనందానికి  అవధులు లేవు.

కొంత సమయం తర్వాత  …  శైలజ తన ఆలోచనలకు సిగ్గు పడింది.  ఎందుకంటే, రాము తన కోసం గోవా నుంచి ఏమీ తీసుకురాలేదని అనుకుంది. అందుకే డల్ గా ఉంది.  తనకు, రాము పై   ప్రేమ,  నమ్మకం తగ్గుతున్నాయని భావించడం కంటే,  తనలో స్వార్థం పుడుతుందని … శైలజ అనుకుంది.  ఆ స్వార్థానికి శాశ్వతం గా  పుల్ స్టాప్ పెట్టాలని  అనుకుంది.

ఆ రోజు రాత్రి నిద్ర పోయే సమయం లో …. శైలజ,  రాముతో

శైలజ :    రాము…. నేను ఒకటి అడుగుతాను… స్పష్టం గా సమాధానం చెపుతావా….

రాము :    ఏంటి …. శైలు…

శైలజ :   నీకు … విమల అంటే ఇష్టమే నా…

రాము :   అదేం మాట శైలు …. ఒకప్పుడు ఇష్టం … ఇప్పుడు గౌరవం.

శైలజ  :   నాకు అదంతా కాదు ... నీకు విమల పై ఇంకా ప్రేమ ఉంది కదా….

రాము  :  అవును శైలు ... ఉంది ... ఒకసారి ఒకరిని ప్రేమిస్తే   అది ఎప్పటికీ పోదు.  అది నీకే బాగా తెలుసు.  అలా అని   ప్రతీ ప్రేమ,   కోరికగా అందరికీ మారదు.

శైలజ :   నేను ఒకటి చెపుతాను … చేస్తావా….

రాము :   శైలజ ప్రశ్నలకు విస్తు పోతూ …. ఏంటి చెప్పు.

శైలజ :   విమలను  పెళ్లి చేసుకుంటావా….

రాము :  ఒక్కసారిగా, షాక్ అయ్యాడు .... ఏంటి శైలు,    నీకు పిచ్చి పట్టిందా ? … ఏంటి ? .... ఏం మాట్లాడుతున్నావో  అర్దం అవుతుందా ? …..

అంటూ … సరే విను ….. నా నిర్ణయం చెపుతాను.

నేను   విమల ను   ప్రేమించింది  నిజం.  పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం …. విమలను చాలా రోజులు మరచి పోలేనిది నిజం. ….  ప్రేమ, పెళ్లి అనేవి ఎవరికైనా జీవితంలో ఒక సారే . ఎప్పుడైతే విమలకి మరొకరితో పెళ్లి జరిగిందో …. అదే విధంగా నాకు వివాహం అయిందో … మేము ఒకరికి ఒకరు సొంతం కాదు. నేడు నాకంటూ ఒక కుటుంబం ఉంది. అలాగే విమల కి కూడా కుటుంబం ఉంది.

అయినా శైలు,  నీ ఆలోచన సరి యైనది కాదు.  ఇప్పుడు  విమలను పెళ్లి చేసుకుని నేను చేయగలిగేది ఏముంది. నాకు తనపై  ఏ కోరికలూ లేవు.  ఎవరికైనా   జీవితం పసి ప్రాయం లో , యవ్వనం లో కోరికలు, ఆశలు ఉంటాయి.  కానీ  జీవితం అంటే ఏంటో చవి చూసాక, నిట్టూర్పులే ఉంటాయి.


చూడు శైలు .....   కొంత కాలం క్రితం,  విమల  అనుభవిస్తున్న పరిస్థితిని చూసి, సహకరించడం నా బాధ్యత అనిపించింది. అదే మనం చేశాం.  ఇప్పుడు తనను కేవలం ఒక స్నేహితురాలు గా  భావించగలను. అంతే గాని  ప్రియురాలు గా ,  భార్య గా  అంగీకరించ లేను.

అయినా …. ప్రేమికులు అయినంత మాత్రాన కలిసి జీవించాలని నియమం ఏం లేదు.

మనల్ని అమితంగా  ప్రేమించే  మనిషి  దొరికినప్పుడు, మనం నోచుకోని ప్రేమకు ఊరట లభిస్తుంది. అది నీ ద్వారా , నాకు లభించింది.

ఇకపోతే, విమల కూడా నోచుకోని ప్రేమ, ఊరట మన ద్వారా నేడు లభిస్తుంది అనుకుంటున్నాను. మనం కలిసి ఉంటాం, కష్ట సుఖాల లో సహకరించు కుంటాం. దీని కోసం పెళ్లి అనే ఆలోచన సరియైనది కాదు.

…. అయినా, శైలు … నన్ను పెళ్లి చేసుకోవడానికి విమల  అంగీకరిస్తుందని  నువ్వు  అనుకుంటున్నావా? ….

తన గురించి నీకు తెలియదు. ఆత్మాభిమానం చాలా ఎక్కువ…. ఈ విషయం విమలకి తెలిస్తే, మనకు కనిపించనంత దూరం వెళ్ళిపోతుంది.

నీ మానసిక  సంఘర్షణకు  ఈ రోజు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాను …. శైలు.

అంటూ .....  తన ధోరణి వినిపించాడు రాము

శైలజ :  ఏడుస్తూ…. రాము పాదాలు తాకింది.

రాము :  పైకి లేపుతూ …. ఏమైంది… నా శైలజ కి… ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది …. అన్నాడు.

శైలజ :   కళ్లు తుడుచుకుంటూ …. నీ మీద ఉన్న ఇష్టం రాము …. నీ మీద ఉన్న ప్రేమ…. నువ్వు ఎంత భాద ఉన్న లోపలే ఉంచుకుంటావు …. పైకి ఎవరికీ తెలియనివ్వవు.  ఇలా నిన్ను చిన్నతనం నుంచి,  మా ఇంట్లో చదువుకునే  రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను.  విమలతో  నీ ప్రేమ విషయం తెలిసిన తరువాత  నాకు ఏరోజు  నీ పై  కోపం రాలేదు.  ఎందుకో తెలియదు జాలి వేసింది. ఆ జాలి , నీ పై నాకు ప్రేమ గా మారింది .…. నువ్వు విమల వలన కోల్పోయిన ప్రేమ మరలా నీకు దక్కితే …. కనీసం ఈ జన్మలో నువ్వు సంతోషంగా  మిగిలిన కాలం  అంతా ఉంటావని ... అనుకున్నాను

రాము :   అందుకని .,. ఇంత త్యాగం చేయదలిచావా …. చూడు, శైలు ... విమల మనకు కనిపించింది కాబట్టి ఇవన్నీ అనగలుగుతున్నావు …. అదే తను కనపడక పోతే ... ఇప్పుడు ఇదంతా జరిగేదా ....  చెప్పు ….

విమల కనిపించని అన్నాళ్లు,  నాకు పెళ్లి అయిన తరువాత కూడా ….  విమల ఎక్కడ ఎలా ఉందో… ఒక్కసారైనా చూస్తే చాలు అనుకునే వాడిని.

చూడు శైలు … గడిచి పోయిన కాలం లో   ప్రేమ స్మృతులు , అందంగా  ఆనందంగా  అనిపిస్తాయి. అది సహజం.   అలా అని, ఆ కాలాన్ని తిరిగి తీసుకు రావాలను కోవడం అవివేకం.  ఊహలు మనసు కి ఊరట గా ఉండాలి , అంతే కానీ    ఆ ఊహలు మనసుకి  ఉరి  వేయకూడదు.

శైలు, ఇంకా అదృష్టం ఏమిటంటే ….. విమల, నేను ఈ రోజు కి కలిసి ఉన్నాం.  ఈ కలయిక లో  దృష్టి మాత్రమే ఉంటుంది.    అందులోనే  ప్రేమ, వాత్సల్యం ఉంటాయి. ఇది శరీరాలకి సంబంధించిన విషయం కాదు.

శైలజ :  రాము మాటలు విని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మంచితనం తో  మనుషుల ను హింసించడం అంటే ఇదే ... రాము 


రాము శైలజ ని ఓదారుస్తూ, ఒళ్లోకి తీసుకుని ….. నా జీవితానికి నువ్వే భార్య వి.

రాము :   శైలజ. …. నీకు ఒక మాట చెప్పనా…. ఇప్పటి వరకు ఏనాడూ  నీతో  చెప్పనిది …..

శైలజ :  హ …

రాము :  శైలజా …. నువ్వు,......  నన్ను నేను మరచి పోయేలా చేశావు.   విమల లేకపోతే   ఒకప్పుడు నేను లేను అనేది వాస్తవం. ….. నువ్వు లేకపోతే  ఇప్పుడు, నేను లేను అనేది  వాస్తవం. …. నేను పైకి కనిపించక పోయినా, నీ మీద పూర్తిగా డిపెండెంట్ ని.

రాము కళ్లల్లో నీళ్లు …. శైలజ చెంప పై నెమ్మదిగా జారుతున్నాయి.


విమల ఆలోచనలు, రాము ఆలోచనలు ఒకేలా ఉండడం తో   శైలజ తన మనసు లో …. రాము, విమల ఒకరికొకరు   మేడ్ ఫర్ ఈచ్ అదర్ … అని అనుకుంటూ శైలజ నిద్ర లోకి జారుకుంది …..


***********

ఏ మనిషి కి జీవితం అంటే ఊహించిన విధంగా ఉండదు. ప్రేమించిన వ్యక్తి తో వివాహం కానంతలో , ఆ ప్రేమ విఫలం అయినట్లు కాదు.  ప్రేమ ఒకసారి పుడితే అది మనిషి మరణించిన తరువాత కూడా ఉంటుంది.  

ఒక  ప్రేయసి పై   ఉన్న  నిజమైన ప్రేమ,   ఒక ప్రియుడు కి   తన  ఆయుష్షు తో సమానం.  ఈ  ప్రేమ కొందరికి  జన్మాంతరాలుగా  ఉండి  పోతుంది.  ప్రేమకు  పరిణితి ఉంటే చాలు.  హద్దులు, ఎల్లలు, పరిమితులు అవసరం లేదు .  ఎందుకంటే  ప్రేమ మనసు కి సంబంధించినది. 

 అందులో భాగంగానే రాము, విమల, శైలజ తమ ప్రేమ ద్వారా తమ జీవితాలను నిర్వచించుకున్నారు.

సమాప్తం…..


యడ్ల శ్రీనివాసరావు 

1 July 2024 , 6:00 PM.




No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...