Friday, November 12, 2021

107. ఆత్మ రహస్యం (కధ)

 

ఆత్మ రహస్యం (కధ)


అది 1990 కాలం, నిడదవోలు అనే ఊరిలో ఒక పేరు ఉన్న ఇంటర్మీడియట్ ప్రైవేటు కాలేజి. ఆ కాలేజీ ఊరికి దూరంగా , ప్రశాంతమైన పచ్చని పొలాలు మధ్య విశాలంగా ఉంది. ఆ కాలేజీ లో వాసు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. వాసుకి 28 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. వాసు టీచింగ్ బాగా చేస్తాడని, స్టూడెంట్స్, తోటి లెక్చరర్స్ అందరితోనూ కలిసి మెలిసి ఉంటాడని మంచి పేరు. మధ్యాహ్నం సమయంలో స్టాఫ్ అంతా కలిసి, ఒకేచోట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం వారికి నిత్యం అలవాటు.

 సుజాత ఆ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్ గా చేస్తుంది. వీరిద్దరూ రోజు లంచ్ టైమ్ లో కలిసేవారు, కానీ మాట్లాడుకునే వారు కాదు. సుజాతకు వాసు అంటే మనసులో చాలా ఇష్టం, గౌరవం ఉండేది. ఒక విధంగా వాసు మీద ప్రేమ ఉండేది కానీ , ఎవరికీ తెలియదు.....  కానీ, వాసు కి మనసు లో సుజాత మీద ఏ విధమైన వ్యక్తిగత ఫీలింగ్ లేక పోయినా, సుజాత ను చూసినపుడు, సుజాత దగ్గరగా వచ్చి నప్పుడు ఏదో , ఎప్పుడో తనకు తెలిసిన మనిషి గా అనుభూతి పొందేవాడు. ఇలా తనకు ఎందుకు అనిపిస్తుంది అని వాసు ఆలోచించే వాడు , మరలా అంతా మరిచిపోయి యధాలాపంగా తన పని తాను చూసుకునేవాడు.

ఒకరోజు వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉంది, మధ్యాహ్నం 2 గంటలు సమయం లో , స్టాఫ్ రూం లో వాసు, మరో ఇద్దరు లెక్చరర్స్ తో కూర్చోని , సీరియస్ గా ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ గురించి చర్చిస్తున్నాడు. ఆ సమయంలో సుజాత స్టాఫ్ రూం లో ఉన్న వాసు దగ్గరకు వచ్చి, “వాసు సార్ “ ఒకసారి మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి అంది. వాసు ఒక్కసారిగా ఉలిక్కిపడి , చిన్న గా నవ్వుతూ సరే అని లేచి, స్టాఫ్ రూం బయట కారిడార్ లోకి ఇద్దరూ వచ్చారు. బయట పచ్చని మొక్కలు, గార్టెన్, చల్లని వాతావరణం ఆకాశం నీలిమయం తో ఆహ్లాదకరంగా ఉంది. చెప్పండి సుజాత గారు, ఎందుకు పిలిచారు అని అన్నాడు వాసు. వెంటనే సుజాత గొంతు సవరించు కొని సార్ నేను ఈ కాలేజీ లో , జాబ్ రిజైన్ చేసేసాను . ఇక్కడకు 20 కి.మి. దూరం లో వెలివెన్ను లో వేరే కాలేజి కి వెళ్ళి పోతున్నాను. ఆ కాలేజీ హాస్టల్లో నే నాకు అకామడేషన్ ఇస్తున్నారు. నేను మీ డిపార్ట్మెంట్ కాకపోయినా , మీ తో చెప్పి వెళ్ళాలనిపించింది, ఉంటానండి అని సుజాత వాసు తో చెప్పి వెనుతిరిగింది కానీ , సుజాత కు తెలియకుండా కంట నీరు జారుతుంది. వాసుకి కూడా ఏదో తన నుండి బలవంతంగా ఏదో విడిపోయి దూరంగా వెళ్లి పోతున్నట్లు మనసులో అనిపించింది.

ఒక నెల రోజులు గడిచింది, వాసు ఏ పని చేసుకుంటున్నా తరచుగా మధ్యలో సుజాత గుర్తుకు వస్తుండేది. అసలు ఎందుకు నాకు గుర్తు వస్తుంది , ఏంటి తనకు నాకు ఉన్న సంబంధం, నేనేమీ తనను ప్రేమించడం లేదు, ఇష్టపడడం లేదు కదా , ఎందుకు ఇలా అవుతుంది అని ఒక కన్ఫ్యూజన్ తో ఉన్నాడు వాసు.

వాసు ఉన్నట్లుండి, అకస్మాత్తుగా ఒక రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో , స్టాఫ్ రూం లో కూర్చున్నవాడు లేచి , సుజాత ను చూడాలనిపించి, తను వర్క్ చేసే కాలేజీ కి బయలు దేరి వెళ్లాడు. కాని చాలా దూరం వెళ్ళాక తెలిసింది , తాను కాలి నడకతో వెళ్తున్నానని, అప్పటికే సాయింత్రం సమయం 6 గంటలు అయింది అని తెలిసింది. పైగా ఒక్కసారిగా వాసుకి‌ ఒళ్లు జలదరించింది తన ఒంటిపై షర్ట్ లేదని గ్రహించాడు. మరలా సుజాత వద్ధకు రేపు వెళ్దాం లే అని వెనుక తిరిగాడు. సాయంత్రం 6 గంటలు దాటింది, రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. అలా వాసు తిరిగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో, దారి మధ్యలో ఒక సంఘటన జరిగింది.

వాసు ఒక్కడే అలా చీకటి పడుతున్నా సరే నడుచుకుంటూ వస్తూ, ఒక నిర్జనమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద పాత పెద్ద పురాతనమైన భవనం, చూడడానికి హాస్పిటల్ భవనం లా ఉంది. ఎత్తైన పెద్ద చెట్లు, అక్కడ నేలనిండా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. వాసు నెమ్మదిగా ఆ చీకటి లో, వెన్నెల వెలుగులో లోపలికి అడుగులు వేశాడు. లోపల చాలా మంది స్త్రీలు జుట్టు విరపూసుకొని, కొంతమంది నేలమీద ఇష్టం వచ్చినట్టు దొర్లుతూ, మరి కొంతమందరు నిద్రలో ఉన్నట్లు ఉన్నారు. వారు దెయ్యాలు గా, ప్రేతాత్మ లు గా మనసులో అనిపిస్తుంది వాసుకి. అదంతా చూస్తూ వాసు నెమ్మదిగా వారి మధ్యలో నుండి నడుస్తున్నాడు. వాసు కి ఏంటి ఇదంతా అని ఒక వైపు భయంగా, చెమటలు పడుతున్నాయి.

వారందరినీ దాటుకుని వెళ్తుండగా వాసుకి ఒకచోట ఒక తల్లి, ఆమెతో పాటు ఒక 12 సంవత్సరాల చిన్నపిల్ల నేలపై పడుకొని ఉండటం గమనించాడు. వారిని దాటుతూ ఉండగా, ఆ చిన్నపిల్ల ఒక్కసారిగా “ వాసు, ఎరుకల గోత్రం” అని అరిచింది. వాసు కి ఒక్కసారి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి, నా పేరు మీకు ఎలా తెలుసు, ఎవరు మీరు అని అడిగాడు. ఆ చిన్నపిల్ల మౌనం గా ఉంది, గాని వాసు కి సమాధానం ఇవ్వలేదు , సరికదా మరలా రెండో సారి, పేరు గోత్రం తో వాసు ని పిలిచింది. వెంటనే వాసు రెండు చేతులు జోడించి , ఎవరు మీరు, నా గురించి ఎలా తెలుసు అని ఏడుస్తూ ఆ పిల్ల ని అడిగాడు. వెంటనే ఆ చిన్నపిల్ల నీ గురించి అంతా తెలుసు, మా అమ్మ అయితే బాగా చెపుతుంది అని, వాళ్లు అమ్మని తట్టి లేపుతూ “అమ్మా అమ్మా వాసు అసలు ఎవరో చెప్పమ్మా” అని అడిగింది. వెంటనే తల్లి లేచి కూర్చుని వాసు తో, నువ్వు ఎవరో తెలుసా, ఎలా చనిపోయావో తెలుసా అని అడిగింది వాసు ని. వాసు వెంటనే భయబ్రాంతుడై , ఆశ్చర్యంగా “ తెలియదు” అని సమాధానం ఇచ్చాడు. ఆ తల్లి వెంటనే నీ పేరు శ్రీనివాసు, నువ్వు గతజన్మలో ఒక జైలర్ గా చిన్న ఉద్యోగం చేసే వాడివి. నీకు నీ భార్య అంటే విపరీతమైన ఇష్టం, ఆమె అంటే పంచ ప్రాణాలు. నీ భార్య కోసం ఏదైనా సరే చేసే వాడివి. ప్రేమ కు ప్రతి రూపం నువ్వు. నువ్వు జైల్లో పని చేస్తూ, నీ భార్య కు కధలు ఇష్టం అని , రోజు కధలు చదివి చెపుతూ ఉండేవాడివి. నీ భార్య కోసం ప్రేమ గా కవితలు రాసి వినిపిస్తూ ఉండేవాడివి. ఇదంతా వింటున్న వాసు కి, కాళ్లు వణకడం మొదలైంది. అసలు ఏంటి ఇదంతా అని మనసు లో అనిపిస్తుంది. వెంటనే వాసు, ఆ తల్లి తో “మరి నా భార్య ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ తల్లి కళ్లు మూసుకుని చిన్నగా నవ్వి , నువ్వు ఒంటి మీద చొక్కా లేకుండా, పది కిలోమీటర్లు కాలి నడకతో , ఎవరిని కలవడానికి వచ్చావో ఆ సుజాత లో నే, నీ భార్య ఆత్మ ఉంది. ఆ సుజాతే నీ భార్య గత జన్మలో అని వాసు తో అన్నది. గత జన్మలో నువ్వు నీ భార్య ను బాగా ప్రేమిస్తూ, ఆకస్మికంగా చనిపోయావు అని చెప్పింది. కొంచెం సేపటి క్రితమే సుజాత ను కలవడానికి వెళ్లి నప్పుడు, రోడ్డు ప్రమాదం లో చనిపోయి నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, మళ్లీ నీ ఆత్మ  జన్మిస్తుంది. నీ భార్య  ఆత్మ సుజాత ను వీడి మరొక శరీరం లో ప్రవేశిస్తుంది. అని ఆ తల్లి వాసుకి చెప్పింది.

****************

అప్పుడు సమయం తెల్లవారుజామున 3:15 నిమిషాలు, 28 ఆగష్టు 2021. ఇదంతా నిద్రలో జరిగింది. ఒళ్లంతా అచేతనం, చెమటలు, గుండెల్లో భారం, స్పృహ లో కి వచ్చిన పది నిమిషాల వరకు శరీరం ఆధీనం లోకి రాలేదు.

అప్పుడు తెలిసింది నా ఆత్మ వెళ్లి, చూసింది, అనుభవించింది అంతా ఆత్మలో లోకానికి. ఆ తల్లి, పిల్ల గా కనపడి మాట్లాడిన వారు కూడా ఆత్మలే అని అర్థం అయింది. ఈ శరీరం , భూలోకం అనేది ఎంత నిజమో ఆత్మ అత్మలోకం అనేది కూడా అంతే నిజం. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. కాని చాలా మంది ఇదంతా ఒక మానసిక రోగం అనో లేదా Psychic Disorder అనో చెపుతుంటారు. అందరికి బాహ్య దృష్టి ఉంటుంది, బాహ్య ప్రపంచం కనిపిస్తుంది.   కానీ కొంతమంది కి మాత్రమే బాహ్య దృష్టి తో పాటు,  అంతర్గత దృష్టి ఉంటుంది వారికి మాత్రమే ఊర్ధ్వ లోకాం,  అధోః లోకం కూడా చూడగలరు. ఇది కేవలం శివుని భిక్ష ద్వారా సాధ్యం అవుతుంది.

*************

వెను వెంటనే అదే సమయంలో కలలో జరిగిన చూసిన ఈ విషయం అంతా పుస్తకం లో రాసుకున్నాను.

ఈశ్వర సాక్షి గా ఇదంతా నా స్వీయ అనుభవం.

ఇదంతా నిజమే నా, అని ఆలోచిస్తే చాలా సంవత్సరాలు టీచర్ గా పనిచేయడం,  అసలు సాహిత్యం గాని , రాయడం గాని తెలియని వ్యక్తి ని , గత రెండు సంవత్సరాలుగా కధలు, ప్రేమ, ఆధ్యాత్మిక , సామాజిక అంశాలు,  కవితలు, రచనలు కలిపి వంద పైగా  సునాయాసంగా రాయడం లో మర్మం ఆ ఈశ్వరుని కే తెలియాలి.



యడ్ల శ్రీనివాసరావు 13 Nov 2021 5:00 am.


No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...